అనుబంధం 2: కందగర్భిత చతుశ్చతుర్మాత్రాగణ వృత్తములు

కందపద్య లక్షణములతో చతుశ్చతుర్మాత్రాగణ వృత్తములు

అర్చిస్సు — — త/ర/మ — — 9-బృహతి-21 UU IUI – UU UU
ఉషస్ — — భ/జ/మ/గ — — 10-పంక్తి-47 UII IUI – UU UU
కూలం — — త/న/మ/గ — — 10-పంక్తి-61 UU IIII – UU UU
నంద — త/భ/య/గ — — 10-పంక్తి-117 UU IUI – IIU UU
ఆనందతార — త/ర/స/గ — 10-పంక్తి-213 UU IUI – UII UU

చిత్రచ్ఛాయ — భ/న/య/గగ — 11-త్రిష్టుప్-127 UII IIII – UU UU
కోవెల — భ/జ/స/గగ — 11-త్రిష్టుప్-239 UII IUI – IIU UU
సోమ — త/న/స/గగ — 11-త్రిష్టుప్-253 UU IIII – IIU UU
మంద్ర — భ/జ/భ/గగ — 11-త్రిష్టుప్-431 UII IUI – UII UU
జార — త/న/భ/గగ — 11-త్రిష్టుప్-445 UU IIII – UII UU
అలరు — త/భ/న/గగ — 11-త్రిష్టుప్-581 UU IUI – IIII UU
సుజాత — స/జ/త/లగ — 11-త్రిష్టుప్-812 IIU IUI – UU IIU

సన్యాసి స/న/య/స 12-జగతి-124 IIU IIII – UU IIU
భాను భ/న/న/మ 12-జగతి-511 UII IIII – IIU UU
రజని భ/న/జ/య 12-జగతి-895 UII IIII – UII UU
భజన భ/జ/న/య 12-జగతి-1007 UII IUI – IIII UU
హరవిజయ, విరతిమహతీ త/న/న/య 12-జగతి-1021 UU IIII – IIII UU
వరరుచి న/స/య/స 12-జగతి-1632 IIII IUI – UU IIU
ప్రమితాక్షర స/జ/స/స 12-జగతి-1732 IIU IUI – IIU IIU
అరుణ స/జ/భ/స 12-జగతి-1964 IIU IUI – UII IIU

పులక భ/న/న/స/గ 13-అతిజగతి-2047 UII IIII – IIII UU
నాస న/న/స/భ/గ 13-అతిజగతి-3328 IIII IIII – UU IIU
సరోజవదనా న/స/న/భ/గ 13-అతిజగతి-3552 IIII IUI – IIU IIU
కుసుమస్రజ స/న/న/భ/గ 13-అతిజగతి-3580 IIU IIII – IIU IIU
కామిని న/స/జ/న/గ 13-అతిజగతి-3936 IIII IUI – UII IIU
ఉపసరసీ స/న/జ/న/గ 13-అతిజగతి-3964 IIU IIII – UII IIU
శిశిర స/జ/న/న/గ 13-అతిజగతి-4076 IIU IUI – IIII IIU

సిరివీణ న/న/న/జ/లగ 14-శక్వరి-7168 IIII IIII – IIU IIU
చెలువము న/న/స/న/లగ 14-శక్వరి-7936 IIII IIII – UII IIU
ప్రముదితవదనా న/స/న/న/లగ 14-శక్వరి-8160 IIII IUI – IIII IIU
సలిలనాగ స/న/న/న/లగ 14-శక్వరి-8188 IIU IIII – IIII IIU

మణిగణనికర, శశికళ న/న/న/న/స 15-అతిశక్వరి-16384 IIII IIII – IIII IIU

1) అర్చిస్సు, త/ర/మ, యతి (1, 6) UU IUI – UU UU
9 బృహతి 25

ఈ విశ్వమందు – నెందున్నావో
భావించలేను – భావాంభోధీ
నా వైపుఁ జూడు – నవ్వించంగన్
జీవాబ్జ మిందుఁ – జిందన్ దేనెన్.

రాత్రిన్ నభస్సు – రాజిల్లంగా
ధాత్రిన్ దమస్సు – ధారల్ నిండెన్
యాత్రీ యుషోద-యమ్మౌ వేగన్
గాత్రమ్ము విప్పు-గా నర్చిస్సుల్.

ప్రేమస్వరూప! – ప్రీతిన్, గామీ ప్రేమస్వరూప! ప్రీతిన్,
కామాంతరంగ – కందర్పా! రా గామీ కామాంతరంగ – కందర్పా! రా
నా మానసమ్ము – నాదగ్రామా నా మానసమ్ము నాద
రామమ్మువోలె – రమ్యం బయ్యెన్. గ్రామారామమ్మువోలె – రమ్యం బయ్యెన్.

మాపాలి దైవ-మై మా పాపం మాపాలి దైవమై మా
బాపంగ గోరి – ప్రార్థింతున్ రా పాపం బాపంగ గోరి – ప్రార్థింతున్ రా
కాపాడు నిర్వి-కారీ, రూపా కాపాడు నిర్వికారీ
రూపాధిదేవ – రోచిష్కారీ. రూపారూపాధిదేవ – రోచిష్కారీ.

2) ఉషస్ – భ/జ/మ/గ, యతి (1, 7) UII IUI – UU UU
10 పంక్తి 47

రాముడు కనంగ – రాలేదంచున్
భామకు మనస్సు – భారమ్మాయెన్
ప్రేమకు నుషస్సు – రేపౌనంచున్
లేమయు దలంచె – లేమిన్ గుండెన్

రాస మొక చిందు – రమ్యమ్మేగా
రాస మొక విందు – రాగమ్మేగా
రాస మొక మాయ – రాకన్ రేయిన్
రాస మొక హాయి – రంజిల్లంగన్

ధీరు డతివేగ – దీవిన్ పారా- ధీరు డతివేగ దీవిన్
వారమును దాటి – వచ్చెన్ జూడన్ పారావారమును దాటి – వచ్చెన్ జూడన్
సారసదళాక్షి – సాధ్విన్ సారా- సారసదళాక్షి సాధ్విన్
చారను ధరిత్రి – జాతన్ సీతన్ సారాచారను ధరిత్రి – జాతన్ సీతన్

శ్రీరఘుకుమార – శిష్టాచారా శ్రీరఘుకుమార శిష్టా-
శారద నభంపు – జాజ్జ్వల్యమ్మా చారా, శారద నభంపు – జాజ్జ్వల్యమ్మా
చారు నవ రూప – స్వచ్ఛాకారా చారు నవ రూప స్వచ్ఛా-
గారుడతురంగ – గమ్యాగమ్యా కారా, గారుడతురంగ – గమ్యాగమ్యా

3) కూలం – త/న/మ/గ, యతి (1, 7) UU IIII – UU UU
10 పంక్తి 61

కూలంకషమున – క్షోభల్ గల్గెన్
తేలెన్ బడవయు – తెడ్డే లేకన్
తేలున్ మునుగును – దిక్కేమో యా
లీలామయు డట – లేడా రాడా

నేలన్ సతతము – నీకై నేనే
నాలో హృదయము – నమ్మెన్ నిన్నే
పూలన్ గొలుతును – ఫుల్లాబ్జాస్యా
కేలన్ గలుపుము – కేళీలోలా

నేరమ్ములకయి – నేనీ కారా- నేరమ్ములకయి నేనీ
గారమ్మున కడ-గండ్లన్ వాడన్ కారాగారమ్మున కడ-గండ్లన్ వాడన్
రారా నను గన – రంగా కారా- రారా నను గన రంగా
గారమ్మును విడు – కాల మ్మెప్డో కారాగారమ్మును విడు – కాల మ్మెప్డో

చూతమ్మిక నిల – సొంపుల్, చేతుల్ చూతమ్మిక నిల సొంపుల్,
చేతుల్ కలియగ – చిత్తంబెల్లన్ చేతుల్ జేతుల్ కలియగ – చిత్తంబెల్లన్
పూతంబయెనుగ – పూలై, ప్రీతుల్ పూతంబయెనుగ పూలై,
బ్రీతుల్ గలియగ – ప్రేమౌ గాదా ప్రీతుల్ బ్రీతుల్ గలియగ – ప్రేమౌ గాదా

4) నంద – త/భ/య/గ, యతి (1, 6) UU IUI – IIU UU
10 పంక్తి 245

ఆనందసూను – డగుపించంగా
ఆనందవీథి – యదియే గాదా
వేణూరవమ్ము – వినిపించంగా
నా నాక మిందు – నవనిన్ డిగ్గెన్

రంగా యనంగ – రసముల్ జిమ్మెన్
రంగా యనంగ – రజనుల్ వెల్గెన్
రంగ యనంగ – స్రజముల్ బూచెన్
రంగా యనంగ – రవళుల్ మ్రోగెన్

పాడంగ రమ్ము – పదముల్ నాకై
జాడైన లేదు – సఖి నీవెందో
చూడంగ రమ్ము – సుదతీ నన్నున్
బీడైన మన్కి – విరియున్ గాదా

హారమ్ము వేతు – సరసా రారా హారమ్ము వేతు సరసా
రారాజు వంచు – రహితో గొల్తున్ రారా రారాజు వంచు – రహితో గొల్తున్
సారమ్ము నీవె – సరసా మారా సారమ్ము నీవె సరసా
మారాము లేల – మదనాకారా మారా మారాము లేల – మదనాకారా

సౌందర్యరూప – సరసానందా సౌందర్యరూప సరసా-
నందాబ్ధిచంద్ర – నవచైతన్యా నందా నందాబ్ధిచంద్ర – నవచైతన్యా
ఇందీవరాస్య – హృదయంబందున్ ఇందీవరాస్య హృదయం
వందింతు నిన్ను – బ్రణయోత్కర్షన్ బందున్ వందింతు నిన్ను – బ్రణయోత్కర్షన్

5) ఆనందతార – త/ర/స/గ, యతి (1,6) UU IUI – UII UU
10 పంక్తి 213

ఆనందతార – యాకసమందా?
కానంగ భూమిఁ – గన్పడలేదా?
తేనెల్ స్రవించు – తీయని మార్గం
బీ నేలఁ జూప – నిప్పుడు రాదా?

పూలన్ గొనండి – ముచ్చట దీరన్
మాలల్ గొనండి – మక్కువ దీరన్
శ్రీలక్ష్మి యంచుఁ – జెప్పగ భార్యల్
లీలన్ హసింతు – రీ భువి మీకై

పూవై సుగంధి – మోదము నీవా పూవై సుగంధి మోదము
యీవేళ నాకు – నిచ్ఛల కూటై నీవా, యీవేళ నాకు – నిచ్ఛల కూటై
భావమ్ము చిందు – పద్యము తేవా భావమ్ము చిందు పద్యము
తేవారమందుఁ – దీయని పాటై తేవా, తేవారమందుఁ – దీయని పాటై

నా వీణ సేయు – నాదము నీవే నా వీణ సేయు నాదము
నీ వేణుగాన – నిస్వనమైతిన్ నీవే, నీ వేణుగాన – నిస్వనమైతిన్
జీవమ్ములోని – జిందులు నీవే జీవమ్ములోని జిందులు
నీ విశ్వమందు – నే సగమైతిన్ నీవే, నీ విశ్వమందు – నే సగమైతిన్

6) చిత్రచ్ఛాయ – భ/న/య/గగ, యతి (1, 8) UII IIII – UU UU
11 త్రిష్టుభ్ 127

ఆకసమునఁ గడు – యంద మ్మెందున్
బ్రాకట మయెగద – వర్ణాంబోధుల్
చీకటిఁ గనఁబడు – చిత్రచ్ఛాయల్
నా కనులనుఁ బలు – నక్షత్రమ్ముల్

ఆశ లిడు మదికి – నానందమ్ముల్
పాశ మిడు హృదికి – భావాశ్లేషన్
దేశ మగు మనికి – దివ్యత్వమ్మై
లేశ మగు నునికి – లేమిన్ గల్మిన్

మారుని జనకుఁడ – మాన్యశ్రీ రా మారుని జనకుఁడ మాన్య-
చేరుమ చెలియనుఁ – జిత్తోద్ధారా శ్రీ రా చేరుమ చెలియనుఁ – జిత్తోద్ధారా
చీరలను నగలను – శ్రీలన్ దేరా చీరలను నగలను శ్రీలన్
తేరున దొరవలె – ధీరా రారా దేరా, తేరున దొరవలె – ధీరా రారా

సాదరముగఁ గని – సారాంబోధీ సాదరముగఁ గని సారాం-
పూదియల నలరు – మోహాంబోధీ బోధీ, పూదియల నలరు – మోహాంబోధీ
నాదముల వఱలు – నాదాంబోధీ నాదముల వఱలు నాదాం-
మోదముల మురళి – మ్రోఁగన్ రావా బోధీ, మోదముల మురళి – మ్రోఁగన్ రావా

7) కోవెల – భ/జ/స/గగ, యతి (1, 7) UII IUI – IIU UU
11 త్రిష్టుభ్ 239

అందముల కోవె – లయె నీ సంధ్యన్
సుందరత నింపె – సొబగౌ రంగుల్
విందు లరుణాభ్ర – వితతుల్ నింగిన్
జందముల నేను – జలితమ్మైతిన్

రాగమయ గీతి – రజనీవేళన్
వేగముగఁ బాడు – ప్రియ నీ వీణన్
సాగు నిక సంత-సముతో గాలం
బాగ దిక రా న – నలరించంగా

నా తలయు నేడు – నరసెన్ దాతా నా తలయు నేడు నరసెన్
తాతయని బిల్వఁ – దరుణంబయ్యెన్ దాతా తాతయని బిల్వఁ – దరుణంబయ్యెన్
రీతి యిది కాని – ద్రిజగద్ద్రాతా రీతి యిది కాని ద్రిజగ-
వ్రాత యది లేదు – బ్రదుకం దేలా? ద్ద్రాతా వ్రాత యది లేదు – బ్రదుకం దేలా?

మమ్ములను జూడు – మహిపై నమ్మా మమ్ములను జూడు మహిపై
యమ్మయని బిల్వ – నలలా రమ్మా నమ్మా యమ్మయని బిల్వ – నలలా రమ్మా
చిమ్ము దయ నిందు – చిఱు దీపమ్ముల్ చిమ్ము దయ నిందు చిఱు దీ-
బమ్మరిల నిమ్ము – పలు హర్షమ్ముల్ పమ్ముల్ బమ్మరిల నిమ్ము – పలు హర్షమ్ముల్

8) సోమ – త/న/స/గగ, యతి (1, 7) UU IIII – IIU UU
11 త్రిష్టుభ్ 253

ఏమివ్వవలయు – నెఱుఁగను నేనున్
నీ మానసమున – నెలవై యుండన్
బ్రేమాంబుజమును – బ్రియ యందింతున్
సోమోద్భవమగు – సుధఁ ద్రాగింతున్

మాలీ ఖలజన – మదసంహారా
లీలాంబుజకర – లిఖితాహ్లాదా
నాలో విరిసిన – నవ రాజీవా
కాలాంబుదసమ – కమలాస్యా రా

తేజమ్ము లలరు – దిన మా రాజున్ తేజమ్ము లలరు దిన మా
రాజీవనయన – రమణున్ గన్నన్ రాజున్ రాజీవనయన – రమణున్ గన్నన్
బూజింతు నతని – భువిపై రోజున్ బూజింతు నతని భువిపై
రోజాల సరము – లొగి రాణించన్ రోజున్ రోజాల సరము – లొగి రాణించన్

కత్తుల్ వదలుము – కదనోన్మత్తా కత్తుల్ వదలుము కదనో-
మత్తిల్లి ధరణి – మసిఁ జేసేవా న్మత్తా, మత్తిల్లి ధరణి – మసిఁ జేసేవా
వత్తున్ దునుమఁగ – వల దా జిత్తుల్ వత్తున్ దునుమఁగ వల దా
చిత్తమ్ము లలర – శివమున్ దెత్తున్ జిత్తుల్, చిత్తమ్ము లలర – శివమున్ దెత్తున్

9) మంద్ర – భ/జ/భ/గగ, యతి (1, 7) UII IUI – UII UU
11 త్రిష్టుభ్ 431

రామునిఁ గనంగ – రామయు వేచెన్
స్వామినిఁ గనంగ – సాధ్వియుఁ జూచెన్
శ్యామునిఁ గనంగ – జానకి గాచెన్
భీమునిఁ గనంగఁ – బేలయు నేడ్చెన్.
(హనుమంతుడు లంకలో సీతను జూచి ఆ విషయాన్ని రామునికి చెప్పు సందర్భము)

చంద్రునిఁ గనంగఁ – జల్లని వేళన్
మంద్రపు స్వరమ్ము – మానసమందున్
సంద్రపు తరంగ – జాలిక వోలెన్
చంద్రిక యనంగఁ – జక్కగ లేచెన్.
(జాలిక అంటే సన్నని వస్త్రము, సముద్రపుటలల తుంపరలు సన్నగా వెన్నెలవలె నున్నదని అర్థము).

నేరమది యేమొ – నేనిట కారా- నేరమది యేమొ నేనిట
గారమున నుంటిఁ – గష్టముతోడన్ కారా గారమున నుంటిఁ – గష్టముతోడన్
చేరుమని యంచుఁ – జిత్తము గోరెన్ చేరుమని యంచుఁ జిత్తము
గోరిక సుమించఁ – గూడఁగ రావా. గోరెన్ గోరిక సుమించఁ – గూడఁగ రావా.

క్షేమముగ నుండె – సీతయు రామా క్షేమముగ నుండె సీతయు
రామ యని నిన్ను – రామయుఁ దల్చెన్ రామా రామ యని నిన్ను – రామయుఁ దల్చెన్
నామ మది నీదె – నారికి మోమున్ నామ మది నీదె నారికి
భూమిజ యెడంద – మ్రోఁగెను నీకై. మోమున్ భూమిజ యెడంద – మ్రోఁగెను నీకై.

10) జార – త/న/భ/గగ, యతి (1, 7) UU IIII – UII UU
11 త్రిష్టుభ్ 445

ఆనందసుతుఁడ – నౌదునుఁగా నే
నా నందసుతుని – నర్చన జేయన్
నే నమ్మితి నిను – నిండగు భక్తిన్
నే నమ్మితి నిను – నేర్పుల ముక్తిన్

హారిన్ హృదయ వి-హారినిఁ దల్తున్
చోరున్ ప్రణయ కి-శోరునిఁ గొల్తున్
జారున్ నిగమ వి-చారునిఁ దల్తున్
మారున్ విజయ కు-మారునిఁ గొల్తున్

కొమ్మా నిజముగఁ – గోపమె, పొమ్మా కొమ్మా నిజముగఁ గోపమె,
ముమ్మాటికి యది – ముక్కునఁ గాచెన్ పొమ్మా ముమ్మాటికి యది – ముక్కునఁ గాచెన్
గుమ్మా బ్రదు కిది – ఘోరమె, యమ్మో గుమ్మా బ్రదు కిది ఘోరమె,
యమ్మాయికిఁ గడు – యాగ్రహ మాయెన్ యమ్మో యమ్మాయికిఁ గడు – యాగ్రహ మాయెన్

ఈ రంగుల నిశి – హృద్యము, చీరన్ ఈ రంగుల నిశి హృద్యము,
శ్రీరంజనివలెఁ – జెల్వముతో సిం- చీరన్ శ్రీరంజనివలెఁ – జెల్వముతో సిం-
గార మ్మలరఁగఁ – గట్టితివా, రా గార మ్మలరఁగఁ గట్టితి-
వారించను నిను – వంచన జేయన్ వా, రా వారించను నిను – వంచన జేయన్

11) అలరు – త/భ/న/గగ, యతి (1, 6) UU IUI – IIII UU
11 త్రిష్టుభ్ 581

అంద మ్మనంగ – నది కరువేమో
బంధ మ్మనంగ – బరువగు నేమో
నందాత్మజుండు – ననుఁ గనఁ డేమో
యిందుంటి నిట్టు – లిఁక మునుపేమో.

అమ్మా యనంగ – నమృతము గారెన్
అమ్మా యనంగ – నలరులు బూచెన్
అమ్మా యనంగ – నట నెల వెల్గెన్
అమ్మా యనంగ – నరుసము గల్గెన్.

చిత్తమ్ము పైనఁ – జెఱఁగని స్ఫూర్తీ
చిత్తారమందుఁ – జెలువపు మూర్తీ
మత్తిల్లు చూపు – మదిర యవంగన్
మత్తిల్లినాను – మదిరను గ్రోలన్.

నాలోన నీవే – నవవనమాలీ నాలోన నీవే నవవనమాలీ
మాలల్ రచింతు – మఱిమఱి నీకై మాలీ, మాలల్ రచింతు – మఱిమఱి నీకై
నీలోన నేనె – నిరతసుశీలా నీలోన నేనె నిరతసుశీలా
శ్రీలన్ని నీదు – చిఱునగవేగా. శీలా, శ్రీలన్ని నీదు – చిఱునగవేగా.

హల్లీసకమ్ము – లగపడె గళ్ళన్ హల్లీసకమ్ము లగపడె
గల్లంచు మ్రోఁగెఁ – గదలుచు గజ్జెల్ గళ్ళన్, గల్లంచు మ్రోఁగెఁ – గదలుచు గజ్జెల్
చల్లంగ రేయి – సగమయె, మొల్లల్ చల్లంగ రేయి సగమయె,
ఫుల్లంబు లయ్యె – ముదముల కిల్లై. మొల్లల్ ఫుల్లంబు లయ్యె – ముదముల కిల్లై.

12) సుజాత – స/జ/త/లగ, యతి (1, 7) IIU IUI – UU IIU
11 త్రిష్టుప్ 812

జగతిన్ సుజాత – జన్మాగ్రణియో
సుగుణాలయాత్మ – శోభాస్పదయో
జగదేకకీర్తి – సంపాదితయో
ప్రగతిన్ జరించు – ప్రాగ్దేశికయో

ఎవరా సుజాత – యేమా కథయో
జవరాలి కెందు – జన్మస్థలమో
భువనాప్తుడైన – బుద్ధుం గరుణన్
జవరాలు బొందె – జన్మం బలరన్

సరి నీకు లేరు – శర్వా చరణ సరి నీకు లేరు శర్వా
స్మరణంబు నాకు – సర్వంబుగదా చరణ స్మరణంబు నాకు – సర్వంబుగదా
మఱి రోగమందు – మందై కరుణా మఱి రోగమందు మందై
కర యుండుమయ్య – గంగాభరణా కరుణాకర యుండుమయ్య – గంగాభరణా

ఇల నాకు వచ్చె – నింపై కలయున్ ఇల నాకు వచ్చె నింపై
గలలోన నీవు – కౌగిళ్ళివగన్ కలయున్ గలలోన నీవు – కౌగిళ్ళివగన్
కల బాసె నెప్డు – గాంతున్ లలనా కల బాసె నెప్డు గాంతున్
లలితాస్య నిన్ను – లాస్యమ్ములతో లలనా, లలితాస్య నిన్ను – లాస్యమ్ములతో

13) సన్యాసి – స/న/య/స, యతి (1, 8) IIU IIII – UU IIU
12 జగతి 124

జగమే గృహమగు – సన్యాసిని నేన్
పగ లే నెఱుఁగను – పాపమ్మగుఁగా
సుగముల్ వ్యధలును – జూడన్నొకటే
నగలున్ దులసియు – నా కొక్కటియే.

నడతున్ బథమున – నవ్వించుచు నేన్
విడుతున్ వెతలను – బ్రేమించుచు నేన్
గడతున్ దినముల – గానమ్ముల నేన్
చెడు నే నెఱుఁగను – స్నేహింతును నేన్.

దినముల్ గడచెను – దేవా గనవా దినముల్ గడచెను దేవా
కనులన్ గరుణను – గానంగ ననున్ గనవా కనులన్ గరుణను – గానంగ ననున్
ప్రణతుల్ గొనఁగను – రావా నిను నే ప్రణతుల్ గొనఁగను రావా
నెనరున్ దలచితి – నిత్యం బిలపై. నిను నే నెనరున్ దలచితి – నిత్యం బిలపై.

మలపైఁ గురిసిన – మంచుల్ దెలిపెన్ మలపైఁ గురిసిన మంచుల్
తెలుపౌ ఋతువును – దివ్యాంబరమున్ దెలిపెన్ తెలుపౌ ఋతువును – దివ్యాంబరమున్
ఇలపై ధవళిమ – లెందున్ జలిలోఁ ఇలపై ధవళిమ లెందున్
జలబిందువు లయె – సాంద్రాంబరమై. జలిలో జలబిందువు లయె – సాంద్రాంబరమై

14) భాను – భ/న/న/మ, యతి (1, 8) UII IIII IIU UU
12 జగతి 511

మాధవ యన మది – మణియై వెల్గెన్
శ్రీధర యన హృది – శివమై వెల్గెన్
భూధర యనఁ బలు – ముదముల్ గల్గెన్
నీదరి నిలువగ – నిధి నాకబ్బెన్

భానుసమముగద – వదనాభ్రమ్ముల్
వేణువు పదముల – విన మోదమ్ముల్
త్రాణయుఁ బెఱుగును – దనువున్ గానన్
మానిని బిలిచెను – మదనా యంచున్

రాజిత సితసుమ – రదనా రాజా రాజిత సితసుమ రదనా
రాజిత మృదుపద – రసికా తేజా రాజా, రాజిత మృదుపద – రసికా తేజా
భ్రాజిత రుచిమయ – వదనాంభోజా భ్రాజిత రుచిమయ వదనాం-
పూజిత సురవర – భువనాధారా భోజా, పూజిత సురవర – భువనాధారా

అక్కజ మొసగుచు – నట నా జుక్కల్ అక్కజ మొసగుచు నట నా
జొక్కిలె మది యిట – సొబగులఁ గనఁగా జుక్కల్ జొక్కిలె మది యిట – సొబగులఁ గనఁగా
మక్కువ హితు లిట – మనఁగాఁ బ్రక్కన్ మక్కువ హితు లిట మనఁగాఁ
బక్కుమని నగవు – పడి లేచెన్గా బ్రక్కన్ బక్కుమని నగవు – పడి లేచెన్గా

15) రజని – భ/న/జ/య, యతి (1, 8) UII IIII – UII UU
12 జగతి 895

దీపము వెలిగెను – దివ్య విభాతిన్
చాపము లలరెను – జక్కని కాంతిన్
చూపుకు సొబగిడె – జుక్కల దండల్
బాపురె రజనియు – భాసుర మాయెన్

చందన పవనము – జల్లగ వీచెన్
నందన సుమములు – నవ్వుల దోచెన్
ఇందుకిరణములు – హృద్యము లాయెన్
సుందర పౌర్ణమి – సొంపుల నిండెన్

రాధను నిజ మప-రాధినిగాదే రాధను నిజ మపరాధిని
కైదున బ్రదుకయెఁ – గామిని కిప్డున్ గాదే, కైదున బ్రదుకయెఁ – గామిని కిప్డున్
మాధవ నిజముగ – మానిని నీదే మాధవ నిజముగ మానిని
నీదరి పరుగిడ – నేరమె యౌనా నీదే, నీదరి పరుగిడ – నేరమె యౌనా

గాజిది హృదయము – గాంచుమ రాజా గాజిది హృదయము గాంచుమ
రాజసము వలదు – రంజిల రావా రాజా, రాజసము వలదు – రంజిల రావా
మోజయె మనసున – మోహన, తేజిన్ మోజయె మనసున మోహన,
తేజిలు ముఖమున – దీటుగ రావా తేజిన్ దేజిలు ముఖమున – దీటుగ రావా

16) భజన – భ/జ/న/య, యతి (1, 7) UII IUI – IIII UU
12 జగతి 1007

పామరుఁడ నేను – భజనలఁ జేతున్
స్వామినిఁ దలంచి – స్వరములఁ గూర్తున్
శ్యామలశరీర – శర ణిక నీవే
నామము జపింతు – ననుఁ గన రావా

సుందర పదమ్ము – సుదతియు పాడెన్
చిందిడ ముదమ్ము – చెలువము నాడెన్
కుందిడు మనమ్ము – కుతుకముతోడన్
వందల యుషస్సు-వలె వెలుగొందెన్

కేలను ధరించె – గిరిఁ దను లీలన్ కేలను ధరించె గిరిఁ దను
లీలల నటించు – లిపిఁ దను వ్రాసెన్ లీలన్, లీలల నటించు – లిపిఁ దను వ్రాసెన్
చేలము హరించెఁ – జెరువున, వ్రీడన్ చేలము హరించెఁ జెరువున
బేలలు తపించి – బిరబిర నేడ్వన్ వ్రీడన్ బేలలు తపించి – బిరబిర నేడ్వన్

రాసములఁ జిందు – రసగృహవాసా రాసములఁ జిందు రసగృహ-
భాసురము నీదు – పలు నటనమ్ముల్ వాసా భాసురము నీదు – పలు నటనమ్ముల్
హాసములఁ జిందు – హరి సువికాసా హాసములఁ జిందు హరి సువి-
కాసులకుఁ బేరు-గల సిరివాసా కాసా, కాసులకుఁ బేరు-గల సిరివాసా

17) హరవిజయ – త/న/న/య, యతి (1, 7) UU IIII – IIII UU
12 జగతి 1021

చిత్తమ్మునఁ గల – చెలువపుఁ గోర్కెల్
మత్తిల్లిన తరి – మదనునిఁ జంపెన్
హృత్తాపపు సెగ – హిమమయెఁ గాదా
వృత్త మ్మది హర-విజయము గాదా.

నింగిన్ గల సిరి – నెఱ నెలఱేఁడే
భృంగమ్ముల సిరి – పృథు సుమరాశుల్
శృంగమ్ముల సిరి – సిత హిమరాశుల్
శృంగారపు సిరి – చిఱుచిఱు ముద్దుల్.

దేవా యనఁగను – దెరలుగఁ బూవుల్ దేవా యనఁగను దెరలుగఁ
ప్రోవై మనసున – ముదముగ నెన్నో బూవుల్ ప్రోవై మనసున – ముదముగ నెన్నో
రావా ననుఁ గన – రసమయ ప్రోవన్ రావా ననుఁ గన రసమయ
ద్రోవన్ గనపడి – రుచిరపు రూపై. ప్రోవన్ ద్రోవన్ గనపడి – రుచిరపు రూపై.

నిన్నే యెపుడును – నిజముగ కన్నా నిన్నే యెపుడును నిజముగ
గన్నుల్ మనసున – గని ముదమందెన్ కన్నా గన్నుల్ మనసున – గని ముదమందెన్
పన్నీరయె గద – పదముల విన్నన్ పన్నీరయె గద పదముల
వెన్నై కరుగుచు – వెలుఁగుచునుంటిన్. విన్నన్, వెన్నై కరుగుచు – వెలుఁగుచునుంటిన్.

18) వరరుచి – న/స/య/స, యతి (1,8) IIII IUI – UU IIU
12 జగతి 1632

అలలుగఁ బులుంగు – లాకాశములో
మిలమిల వెలుంగు – మేఘమ్ములపై
నలరెను సరస్సు – యబ్జమ్ములతో
జెలఁగెను మనస్సు – శృంగారముతో.

విరహము తమస్సు – వేధించెనుగా
దరిసెన ముషస్సు – ధావళ్యముగా
చిరమగు తపస్సు – శ్రీ లిచ్చునుగా
హరి యని నమస్సు – లర్పింతునుగా.

హృదయము కలంగె – నెంతో వ్యధలన్ హృదయము కలంగె నెంతో
పదములు వడంకె – భార మ్మవఁగాఁ వ్యధలన్, పదములు వడంకె – భార మ్మవఁగాఁ
గదలక దృశించు – కన్నుల్ మెదలన్ గదలక దృశించు – కన్నుల్
మృదువుగ హసించె – మీనాక్షియుఁ దాన్. మెదలన్, మృదువుగ హసించె – మీనాక్షియుఁ దాన్.

వరదను విరించి-పత్నిన్ హరుస వరదను విరించి-పత్నిన్
మ్మరవిరి యవంగ – యాచింతు హృదిన్ హరుస మ్మరవిరి యవంగ – యాచింతు హృదిన్
కరుణను గనంగఁ – గావ్యాంబరమున్ కరుణను గనంగఁ – గావ్యాం-
వరరుచి నొసంగఁ – బ్రార్థింతుఁ దమిన్. బరమున్ వరరుచి నొసంగఁ – బ్రార్థింతుఁ దమిన్.

19) ప్రమితాక్షర – స/జ/స/స, యతి (1, 7) IIU IUI – IIU IIU
12 జగతి 1732

ప్రమితాక్షరమ్ము – రమణీయముగా
నమితాక్షరమ్ము – లతిదీర్ఘముగా
క్షమితాక్షరమ్ము – సహన మ్మగుఁగా
నమితాక్షరమ్ము – నయమున్ గనుఁగా.

రమణీరవమ్ము – రసబంధురమై
గమకమ్ము తోడి – కవితాస్వరమై
ప్రమితాక్షరంపు – వరగీతికలన్
భ్రమియింపజేసె – రసికాగ్రణులన్.

హరిగీతిఁ బాడ – నది సుస్వరమే హరిగీతిఁ బాడ నది సు-
వరమౌను గాదె – పరమాద్భుతమై స్వరమే, వరమౌను గాదె – పరమాద్భుతమై
విరిదండ వేతుఁ – బ్రియమై చిరమై విరిదండ వేతుఁ బ్రియమై
స్థిరమైన ప్రేమ – సిరులన్ గొన రా. చిరమై స్థిరమైన ప్రేమ – సిరులన్ గొన రా.

కమలాకరమ్ముఁ – గనుమా రమణా కమలాకరమ్ముఁ గనుమా
రమణమ్ము వింత – భ్రమరాకరమా రమణా, రమణమ్ము వింత – భ్రమరాకరమా
విమలాకరమ్ము – ప్రియ హృత్కమలా విమలాకరమ్ము ప్రియ హృ-
కమనీయమైన – కలయా నిజమా. త్కమలా, కమనీయమైన – కలయా నిజమా.

20) అరుణ – స/జ/భ/స. యతి (1, 7) IIU IUI – UII IIU
12 జగతి 1964

అరుణార్ణవంపు – యందపు తరగల్
స్వరరాగపూర్ణ – సంధ్యల నురగల్
చెఱుపంగరాని చెల్వపు స్మృతులై
చిరకాల మిందు – జెన్నుగ నిలుచున్

అరుణోదయంపు – యందపు కిరణా
లరుదెంచె దూర్పు – నందున సిరులై
స్వరమంగళమ్ము – బాడెను బులుగుల్
విరిబాల లూగె – వెచ్చగ వనిలో

వని నృత్యమాడ – వచ్చిరి కను మం- వని నృత్యమాడ వచ్చిరి
గన లాడి పాడ – గజ్జెల సడులన్ కను మం గన లాడి పాడ – గజ్జెల సడులన్
వన మెల్ల మ్రోఁగెఁ – బాయక జనరం- వన మెల్ల మ్రోఁగెఁ బాయక
జనమై చెలంగె – జాజర పదముల్ జనరం జనమై చెలంగె – జాజర పదముల్

కను మాకురాలు – కాలము, దినమం కను మాకురాలు కాలము,
దిన కాంతి తగ్గె – దీర్ఘము రజనుల్ దినమం దిన కాంతి తగ్గె – దీర్ఘము రజనుల్
విను గాలి వీచు – వేగము, తనువో విను గాలి వీచు వేగము,
ధనువాయె వంగి – ధారుణిఁ జలిలో తనువో ధనువాయె వంగి – ధారుణిఁ జలిలో

21) పులక – భ/న/న/స/గ, యతి (1, 8) UII IIII IIII UU
13 అతిజగతి 2047

నవ్వుల విరులను – నయముగ నీవా
దివ్వెల వెలుగులఁ – దెసలకు తేవా
పువ్వుల పడవకు – ముదముల రేవా
మువ్వల సడులకుఁ – బులకల రావా

నాకము ధరపయి – నభమున కాదోయ్
శోకము వదలుము – సుఖములు నిండున్
నీకయి కల దొక – నిఖిలము గానన్
జీకటి తొలఁగును – చిఱు వెలుఁగున్నన్

దూరము మెఱిసెడు – ధ్రువమగు తారా దూరము మెఱిసెడు ధ్రువమగు
దారికి వెలుగుల – తరగల తేవా తారా, దారికి వెలుగుల – తరగల తేవా
చేరెద గృహమును – శిశువును, దారన్ చేరెద గృహమును శిశువును,
ద్వారముకడఁ గనఁ – ద్వర త్వరఁగా నేన్ దారన్ ద్వారముకడఁ గనఁ – ద్వర త్వరఁగా నేన్

వెన్నెల మిలమిల – వెలుఁగుల కన్నా వెన్నెల మిలమిల వెలుఁగుల
కన్నెకు మనసునఁ – గలుగు సుఖమ్మా కన్నా, కన్నెకు మనసునఁ – గలుగు సుఖమ్మా
చెన్నుగ నడువఁగఁ – జెలువపు తెన్నై చెన్నుగ నడువఁగఁ జెలువపు
దిన్నగ నిక నగుఁ – దియనగు పల్కుల్ తెన్నై దిన్నగ నిక నగుఁ – దియనగు పల్కుల్

22) నాస – న/న/స/భ/గ, యతి (1, 9) IIII IIII UU IIU
13 అతిజగతి 3328

నగధరు ముగమున – నాసమ్ముపయిన్
మొగవలె నగపడు – ముత్తెమ్ము సదా
జగతికి వెలుగిడు – జాజ్జ్వల్యముగా
ముగుదల మొగమున – మోహోత్సవమై

నెల బడె వెలుగుల – నీరమ్ములపై
నల లవి తళతళ – యంచున్ మెఱిసెన్
మిలమిల గగనము-మీదన్ గుమిగా
సుడివలెఁ గనబడెఁ – జుక్కల్ దివెలై

జననము మరణము – చక్రమ్ములగున్
తనువుల దహనము – తథ్యమ్ముగదా
ధనమున కిలపయి – తాపత్రయముల్
విన నొక విధమగు – వింతే యగుగా

కనుగవ వెలిగెను – గాంతిన్, గన నా కనుగవ వెలిగెను గాంతిన్,
ఘనుని ఘనమణిని – గాలాంబుదునిన్ గన నా ఘనుని ఘనమణిని – గాలాంబుదునిన్
క్షణములు నెఱయయె – శాంతిన్ విన నా క్షణములు నెఱయయె శాంతిన్
పిన యువకు ననఘు – బృందావనిలో విన నా పిన యువకు ననఘు – బృందావనిలో

మనసున మమతల – మాలల్ మనె నా- మనసున మమతల మాలల్
మని విరుల విధము – మత్తిల్లగ నేన్ మనె నామని విరుల విధము – మత్తిల్లగ నేన్
దను విటఁ గరమునఁ – దాకన్ దనివిన్ దను విటఁ గరమునఁ దాకన్
దనరుచును నిలిచె – ధావళ్యమునన్ దనివిన్ దనరుచును నిలిచె – ధావళ్యమునన్

23) సరోజవదనా – న/స/న/భ/గురు, యతి (1, 8) IIII IUI – IIU IIU
13 అతిజగతి 3552

వరముల సరోజ-వదనా యియవే
స్వరములఁ గవిత్వ – సరమై యియవే
చిరమగు సువిద్య – చెలువ మ్మియవే
దరిసెనము నాకు – దయతో నియవే

చిఱునగవు నీకు – సిరి నిచ్చుగదా
విరిసరము నీకు – వెలు గిచ్చుగదా
హరుసములు నీకు – హరు విచ్చుగదా
మురిపెములు నీకు – ముద మిచ్చుగదా

మురహరుని నోటఁ – బొగడన్ దరమా మురహరుని నోటఁ బొగడన్
ధరపయిన శైల-ధరుడే తరిగా దరమా, ధరపయిన శైల-ధరుడే తరిగా
మురళి సడులందు – మోహనకరమౌ మురళి సడులందు మోహన-
కరడములు లేచు-గదె యీ మదిలో కరమౌ కరడములు లేచు-గదె యీ మదిలో

వరముల నొసంగు – వరదున్ గరుణా- వరముల నొసంగు వరదున్
కరునిఁ దలచంగఁ – గలదా క్షణముల్ గరుణాకరునిఁ దలచంగఁ – గలదా క్షణముల్
శరణు శరణంచు – సరిగా ధరణీ- శరణు శరణంచు సరిగా
ధరుని దలచంగఁ – దరుణమ్ముగదా ధరణీధరుని దలచంగఁ – దరుణమ్ముగదా

24) కుసుమస్రజ – స/న/న/భ/గురు, యతి (1, 8)
13 అతిజగతి 3580

గగనమ్మునఁ గను – ఖగ మొండెగిరెన్
సిగరమ్మును గను – సితమై యుండెన్
నగరమ్మును గను – నరనారులతో
నగధారిని గను – నయ రూపముతో

హరి యంచన నతి – హరుసమ్ము గదా
పురి విప్పును మది – మురవైరి యనన్
పురుషోత్తముఁ డనఁ – బులకించుఁ గదా
సరసమ్మగు హృది – సరసా యనఁగన్

కుజ మత్యరుణము – కుసుమస్రజముల్ కుజ మత్యరుణము కుసుమ-
రజనిన్ జలితము – రస మాధురులన్ స్రజముల్ రజనిన్ జలితము – రస మాధురులన్
త్రిజగప్రియు నటఁ – దెరలుచుఁ బ్రజ లా త్రిజగప్రియు నటఁ దెరలుచుఁ
వ్రజమందుఁ గనిరి – వరదునిఁ గృష్ణున్ బ్రజ లా వ్రజమందుఁ గనిరి – వరదునిఁ గృష్ణున్

వ్రణ మయ్యెను హృది – రణమునఁ బ్రణయా- వ్రణ మయ్యెను హృది రణమునఁ
గ్రణి చేసిన దిది – బ్రదుకున సరియా బ్రణయాగ్రణి చేసిన దిది – బ్రదుకున సరియా
వినవేలకొ నిట – విరహపు స్వన ని- వినవేలకొ నిట విరహపు
స్వనముల్ వలపుల – ధ్వనులయె నుఱుముల్ స్వన నిస్వనముల్ వలపుల – ధ్వనులయె నుఱుముల్

25) కామిని – న/స/జ/న/గ, యతి (1, 8) IIII IUI – UII IIU
13 అతిజగతి 3396

వలపుల పదమ్ము – బాడిన దెవరో
తలుపులను మెల్ల – తట్టిన దెవరో
చెలువపు తేనె – జిందిన దెవరో
కలలను స్పృశించు – కామిని యెవరో

తెలుగున బదమ్ము – దేవుని వరమా
తెలుగున బదమ్ము – తీయని గుడమా
తెలుగున బదమ్ము – తెల్లని విరియా
తెలుగున బదమ్ము – తేనెల నదియా

చెలి విడెను నన్ను – జేదగు కలలోఁ చెలి విడెను నన్ను జేదగు
గలయయితి గాంచ – గాదిక నిలపై కలలోఁ గలయయితి గాంచ – గాదిక నిలపై
తళతళ మనంగ – తారల వెలుగుల్ తళతళ మనంగ – తారల
వెలయఁగ మనస్సు – వేదన గలగెన్ వెలుగుల్ వెలయఁగ మనస్సు – వేదన గలగెన్

నవతను నొసంగు – నా పని, కవితా, నవతను నొసంగు నా పని,
కవనములయందు – గల్పన లగుగా కవితా, కవనములయందు – గల్పన లగుగా
నవతను నొసంగు – నా పని, భవితా, నవతను నొసంగు నా పని,
భవములకు గొప్ప – భావన లగుగా భవితా, భవములకు గొప్ప – భావన లగుగా

26) ఉపసరసి లేక సంజన – స/న/జ/న/గ, యతి (1, 8) IIU IIII – UII IIU
13 అతిజగతి 3964

ముఱియంగను గడు – మోదము గురియన్
సరస మ్మయె నిట – సంజను గనుమా
హరుసమ్ముగ సఖ – హాయిగ నగుచున్
సరసా యనుచును – సంజన మవనా

చిలుకా హరిఁ గని – జెప్పవె వడిగా
నలుకన్ వలదని – యాతని కిపుడే
చిలుకన్ సుధలను – జెల్వము లలరన్
బలుకన్ బదముల – భారము దొలగన్

మనసా భగభగ – మాడితి గదవే
తనువా భుగభుగ – తాపము వలదే
విను మీ వెతలను – వేగము మఱువన్
దినమున్ రవి యరు-దెంచెను గనవే

చలిలో వణకితిఁ – జల్లగఁ జిలుకా చలిలో వణకితిఁ జల్లగఁ
చెలికాఁడెట జనెఁ – జేరఁడు నను దాఁ జిలుకా చెలికాఁడెట జనెఁ – జేరఁడు నను దాఁ
బలుకే యయెగద – బంగరు, వలపన్ బలుకే యయెగద బంగరు,
వలలోఁ బడితిని – వానికి ఝషమై వలపన్ వలలోఁ బడితిని – వానికి ఝషమై

అల నొక్క నెలఁత – యాకృతి శిలపైఁ అల నొక్క నెలఁత యాకృతి శ
జెలువమ్ము విరియఁ – జెక్కితివి కదా శిలపైఁ జెలువమ్ము విరియఁ – జెక్కితివి కదా
శిలయో నెలఁతయొ – చిందెడు వెలుగో శిలయో నెలఁతయొ చిందెడు
విలసిల్లె మనసు – విస్మయమయమై వెలుగో, విలసిల్లె మనసు – విస్మయమయమై

27) శిశిర – స/జ/న/న/గ, యతి (1, 7) IIU IUI – IIII IIU
13 అతిజగతి 4076

గగనమ్మునందుఁ – గడు వెలుఁగులతో
సొగసీను దార – సొబగుల వెలిగెన్
సిగరమ్ము వెల్గె – శిశిరఋతువులో
రగిలేను నేను – బ్రణయపు చితిలో

స్వరదా స్వరాల – వఱదను మునుఁగన్
విరులన్ విరించి – ప్రియ కొసఁగెద నేన్
వరదా వరాల – వరమణి నియవే
పరమా పదాలఁ – బరవశమవవే

తరుఛాయలోనఁ – దరళతఁ జెరు వ- తరుఛాయలోనఁ దరళతఁ
చ్చెరువుగ నయ్యెఁ – జెలియరొ నిజమై జెరు వచ్చెరువుగ నయ్యెఁ – జెలియరొ నిజమై
మురియంగ నందు – ముదముగఁ గరినిన్ మురియంగ నందు ముదముగఁ
గరిణిన్ గనంగఁ – గనులకు వరమే గరినిన్ గరిణిన్ గనంగఁ – గనులకు వరమే

తెరువున్ జనంగ – దినమున ఖరమౌ తెరువున్ జనంగ దినమున
కరముల్ దహించెఁ – గడు నిశితముగా ఖరమౌ కరముల్ దహించెఁ – గడు నిశితముగా
నరయన్ నిశీథి – నతి హితకరమౌ నరయన్ నిశీథి నతి హిత-
కరముల్ బ్రశాంత-కరమగు సుఖమై కరమౌ కరముల్ బ్రశాంత-కరమగు సుఖమై

28) సిరివీణ – న/న/న/జ/లగ, యతి (1, 9) IIII IIII IIU IIU
14 శక్వరి 7168

ప్రతినలు బలికిన – బతితో సతిగా
బ్రతుకుట యొక యను-భవమే యయెగా
సతమత మగుచును – సతిగా నిలపై
బ్రతికితిగద శశి – బ్రదుకే కథగా

స్వరముల గురువగు – వరరాణివిగా
చిర రవముల కొక – సిరివీణవుగా
సరసపు పదముల – సరసాబ్ధివిగా
నిరతము గొలిచెద – నిఖిలేశ్వరి నిన్

అట తిరుమలపై – హరి వేంకటు స- అట తిరుమలపై హరి వేం-
ద్ఘటనల కిరవగు – కరముల్ దయతో కటు సద్ఘటనల కిరవగు – కరముల్ దయతో
ద్రుటి నిడు వరముల – దురితోత్కటముల్ ద్రుటి నిడు వరముల దురితో-
ఘటికఁ దొలగుగద – కలిలో నిలపై త్కటముల్ ఘటికఁ దొలగుగద – కలిలో నిలపై

సుపథముల నడతు – శుభ మంగపతీ సుపథముల నడతు శుభ మం-
కపటముల విడితిఁ – గపిలేశ సఖా గపతీ కపటముల విడితిఁ – గపిలేశ సఖా
యెపుడు హరిజపము – లికపై నపరా యెపుడు హరిజపము లికపై
యపరిమిత కరుణ – లగుపించు గదా నపరా యపరిమిత కరుణ – లగుపించు గదా

29) చెలువము – న/న/స/న/లగ, యతి (1, 9) IIII IIII – UII IIU
14 శక్వరి 7936

మధురము మధురము – మాధవ యనఁగా
మధురము మధుముర – మర్దనుఁ డనఁగా
మధురము యదుకుల – మానిక మనఁగా
మధురము మధురము – మాలినిఁ గనఁగా

చెలువము చెలువము – చిన్మయుఁ డనఁగా
చెలువము చెలువము – శ్రీకరుఁ డనఁగా
చెలువము చెలువము – శ్రీపదుఁ డనఁగా
చెలువము చెలువము – చెలువునిఁ గనఁగా

విలసిత మయెనుగ – వింతల యలలై విలసిత మయెనుగ వింతల
యలలనఁగ గదలు – నా చికురములై యలలై యలలనఁగ గదలు – నా చికురములై
కళలను గనబడుఁ – గాటుక వలయా? కళలను గనబడుఁ గాటుక
వలయము లనగను – భ్రాంతుల కలయా? వలయా? వలయము లనగను – భ్రాంతుల కలయా?

చెలువముల సుధను – జిందెడు చెలియా చెలువముల సుధను జిందెడు
శిలవలెఁ గనఁబడు – చిత్రపు నెలయా చెలియా, శిలవలెఁ గనఁబడు – చిత్రపు నెలయా
చెలువపు సరసునఁ – జిత్తకమలమా చెలువపు సరసునఁ జిత్తక-
మలహరి స్వరముల – మాలల పదమా మలమా, మలహరి స్వరముల – మాలల పదమా

30) ప్రముదితవదనా – న/స/న/న/లగ, యతి (1, 8) IIII IUI – IIII IIU
14 శక్వరి 8160

బధిరుఁడను నేను – ప్రముదితవదనా
పదములను బాడి – పరవశమగు నా
యధరములు మెల్ల – నటునిటుఁ గదలన్
గదలికలఁ గాంచఁ – గథ లవి తెలియున్

నిధి యగును వాఁడు – నిరతము మనకున్
సుధ యగును వాఁడు – సుమధుర రుచులన్
ముద మిడును వాఁడు – పువువలె మురియున్
సదమలుఁడు వాఁడు – శరణని గొలుతున్

వ్యధల మయమైన – బ్రదు కిది విధియా వ్యధల మయమైన బ్రదు కిది
విధవిధములైన – వెతలకు నిధియా విధియా , విధవిధములైన – వెతలకు నిధియా
మధుర మయమైన – మనికియు మధువా మధుర మయమైన మనికియు
మదనుని బ్రసూన – మధువుల సుధయా మధువా, మదనుని బ్రసూన – మధువుల సుధయా

విరహమున నాకు – వెతలకు కొరవా విరహమున నాకు వెతలకు
కుఱుపులకు నేను – కుములను ధరపై కొరవా, కుఱుపులకు నేను – కుములను ధరపై
చెరువులయె కళ్ళు – చెలువుని నరయన్ చెరువులయె కళ్ళు చెలువుని
హరుసముల వాన – హరి యెపు డొసఁగున్ నరయన్ హరుసముల వాన – హరి యెపు డొసఁగున్

31) సలిలనాగ – స/న/న/న/లగ, యతి (1, 8) IIU IIII – IIII IIU
14 శక్వరి 8188

వినుమా బ్రదుకున – వెతలను దయతోఁ
గనుమా బ్రదుకునఁ – గతలను గరుణన్
దినమందున బలు – దెసలకుఁ జను నా
మన మీ రజనిని – మధురతఁ గనునా

రతనమ్ములవలె – రవికిరణము ల-
ద్భుతమై జగతిని – ముదమునఁ దడిపెన్
జతగా బులుగులు – స్వరములఁ బలుకన్
శ్రుతిగా నళినులు – సొబగులఁ గులికెన్

అరుణోదయమున – హరుసపు సరసిన్ అరుణోదయమున హరుసపు
సరసీరుహముల – చలనము సొబగుల్ సరసిన్ సరసీరుహముల – చలనము సొబగుల్
విరు లా వనమున – వికచము సరసా విరు లా వనమున వికచము
సరసన్ బరుగిడి – చకచక కనరా సరసా, సరసన్ బరుగిడి – చకచక కనరా

హరుసమ్మునఁ జను – యమలిన సరితా హరుసమ్మునఁ జను – యమలిన సరితా
చరితమ్ములఁ బలు – చదివిన గవితా సరితా, చరితమ్ములఁ బలు – చదివిన గవితా
నరమానసముల – నవరసభరితా నరమానసముల – నవరస
భరతావని సుఖ-భరిత సుచరితా భరితా, భరతావని సుఖ-భరిత సుచరితా

32) మణిగణనికరము లేక శశికళ – న/న/న/న/స, యతి (1, 9) IIII IIII – IIII IIU
15 అతిశక్వరి 16384

మణిగణనికరము – మహిపయి దళముల్
మణిగణనికరము – మలపయి హిమముల్
మణిగణనికరము – మఱి యుడుగణముల్
కనకపు శశికళ – గగనముపయినన్.

నభమున శశికళ – నయముగ విరిసెన్
శుభమగు ఘడియలు – సొబఁగిడి మురిసెన్
విభుడిట నగపడు – విలసిలు మొగమున్
విభవము నెఱయఁగఁ బ్రి-యమగు గతులన్.

వరదుని దలఁపఁగ – వరములు కరువా వరదుని దలఁపఁగ వరములు
కరుణకు నిరవుగఁ – గనఁబడు నెపుడున్ కరువా, కరుణకు నిరవుగఁ – గనఁబడు నెపుడున్
స్వరముల సరముల – సరసుని ద్వర నా- స్వరముల సరముల సరసుని
దరముగఁ బొగడఁగఁ – దరుణము లివియే. ద్వర నా దరముగఁ బొగడఁగఁ – దరుణము లివియే.

సరసిజనయనుని – సరసిజకరముల్ సరసిజనయనుని సరసిజ
గరగరగ ననుఁగుఁ – గవుఁగిలి నిడునా కరముల్ గరగరగ ననుఁగుఁ – గవుఁగిలి నిడునా
సరసిజపదముల – సరసను విరియై సరసిజపదముల సరసను
విరిసెద మురిసెద – ప్రియముగ మనికిన్. విరియై విరిసెద మురిసెద – ప్రియముగ మనికిన్.