ఇతర కళలన్నిటి కన్నా వయస్సులో చిన్నదైన చలనచిత్ర కళ భారత దేశంలో ఆవిర్భవించి ఇప్పటికి సరిగ్గా నూరేళ్ళే అవుతున్నా, దాని ప్రభావం మాత్రం అంతకు కొన్ని వందల రెట్లు ఎక్కువ. తెరమీది బొమ్మలు కథాకథన రూపాన్ని సంతరించుకున్న తొలి నాళ్ళ సినీ రూపకర్తల్లో వ్యాపారదృష్టి కన్నా కళాతృష్ణే అధికం. అప్పటి మూగసినిమాల రోజుల్లో, దేశంలో స్వాతంత్య్ర ఉద్యమం ముమ్మరంగా సాగుతోంది. కానీ, జనానికి తెలిసిన కథలనే తెరపై బొమ్మలుగా చూపి, ఆకట్టుకోవాలన్న ఆలోచనతో పౌరాణిక, చారిత్రక కథలకే మన సినీ రూపకర్తలు ఓటేశారు.
పైపెచ్చు, బ్రిటీషు ప్రభుత్వపు కఠినమైన సెన్సార్షిప్ సైతం మన దర్శక, నిర్మాతలను సమకాలీన రాజకీయ అంశాల వైపు వెళ్ళనివ్వలేదని చెప్పాలి. అయితే, పౌరాణిక, జానపద కథలే సినీ ఇతివృత్తాలైన ఆ రోజు ల్లోనూ ఆ చిత్రాల్లో కూడా మన దర్శక, నిర్మాతలు ప్రజలను చైతన్య వంతులను చేయడానికీ, జాతీయాభిమానాన్ని రేకెత్తించడానికీ, మనదైన వారసత్వంపట్ల జాగృతులను చేయడానికీ వీలైన చోటల్లా ప్రయత్నించారు.
తెరపై మూగబొమ్మలకు మాటొచ్చాక తెలుగు సినీ పరిణామాన్ని గమనిస్తే, తెరపై తెలుగు మాట, పాట మొదటిసారిగా వినిపించిన సినిమా ‘కాళిదాస్’ (విడుదలైంది- 1931 అక్టోబర్ 31) కాగా, తొలి పూర్తి తెలుగుటాకీ భక్త ప్రహ్లాద (తొలిసారిగా రిలీజైంది 1932 ఫిబ్రవరి 6న బొంబాయిలో). ఈ భక్త ప్రహ్లాద కథాంశం పౌరాణికమే అయినా, అది కూడా ప్రతీకాత్మకంగా బ్రిటీషువారిపై ఆనాటి భారతీయుల పోరాటాన్ని ప్రతిబింబించిన కథేనని కొందరి భావన. బ్రిటీషు వారికి హిరణ్యకశిపుడు పాత్ర, గాంధీజీకి ప్రహ్లాదుడి పాత్ర ప్రతీకలు కావచ్చని విశ్లేషించిన వారూ ఉన్నారు.
తొలి తెలుగు సామాజిక చిత్రం
అప్పటి నుంచి గడచిన 81 ఏళ్ళ తెలుగు సినీచరిత్రలో సుమారు 4,500 వేల దాకా నేరు చిత్రాలు వచ్చాయని ఓ అంచనా. అందులో ఎన్ని శాతం చిత్రాలు అభ్యుదయ వాదంతో, సమాజాన్ని పురోగమింపజేశాయి, సామాజిక వాస్తవికతను ఏ మేరకు ప్రతిఫలించాయన్నది ఆసక్తికరమైన అంశమే.
నిజానికి, టాకీ చిత్రయుగంలోనూ తొలి నాలుగేళ్ళూ తెలుగులో వచ్చినవన్నీ పౌరాణికాలు, కాకుంటే భక్తిగాథలు. అవన్నీ ప్రసిద్ధ ఇతివృత్తాలే! అయితే, ఆ కాలపు సమాజాన్ని ప్రతి ఫలిస్తూ, అభ్యుదయ దృక్పథాన్ని చూపెట్టడం రికార్డుగా చూస్తే, 1936 నాటి ప్రేమ విజయము తొలి తెలుగు సాంఘిక చిత్రం. ‘సామాజిక అంశాలను ప్రతిఫలించే చిత్రం’గా చెప్పుకొంటూ మొదలైన ఈ సినిమాతో తెలుగు తెరపైకి సమకాలీన సాంఘిక అంశాలు నేరుగా ప్రవేశించాయి.
అప్పటికే ప్రసిద్ధమైన ‘కాలేజ్ గర్ల్’ అనే నాటకాన్ని ఆధారం గా చేసుకొని రూపొందించిన ఈ చిత్రంలో కళాశాల జీవితం, విద్యార్థినీ విద్యార్థుల మధ్య వికసించే ప్రేమ, స్థానిక ఎన్నికల లాంటి అనేక సమకాలీన పరిస్థితులు ప్రస్తావనకు వచ్చాయి. ఆనాటి సమాజంలో ఎక్కువగా చర్చనీయాంశమైన వితంతు వివాహాల అంశం కూడా కథలో ప్రధానాంశమైంది. సాంకేతిక నిపుణుడైన ద్వారకానాథ్ ప్రజ్ఞ అండగా, అప్పటి రంగస్థల ప్రముఖుడు కృత్తివెంటి నాగేశ్వరరావు నిర్దేశకత్వంలో ‘ఇండియన్ ఆర్ట్ సినీటోన్’ పతాకంపై ఈ చిత్రం తెర మీదకు వచ్చింది. అటు ఇతివృత్తంలోనూ, ఇటు పాత్రలు ఎదుర్కొనే సమస్యల్లోనూ ఈ తొలి తెలుగు సాంఘిక చిత్రం అలా సమకాలీనతను చూపడం విశేషమే. అంటే మన సినిమా ఇప్పటికి 77 ఏళ్ళ క్రితం సామాజిక కథాంశాలు, అభ్యుదయ భావాల బాటలో ప్రవేశించిందన్న మాట. అప్పటి నుంచి కులం, ఆర్థిక హోదా, ప్రేమ, పెళ్ళి, వర కట్నం, పితృస్వామ్య భావజాలం, గృహహింస, స్త్రీ స్వాతంత్య్రం లాంటి సామాజిక వాస్తవాలు సినిమా పట్టకం ద్వారా కొన్నిసార్లు ప్రతిఫలించాయి. పరావర్తనం చెందాయి. మరికొన్ని సందర్భాల్లో ఈ వెలుగు రేఖలు వక్రీభవనమూ చెందాయి.
కులాలు, ఆర్థిక అంతరాల రణక్షేత్రం
స్వాతంత్య్ర ఉద్యమానికి సరిజోడుగా సంస్కరణ ఉద్యమాలూ ఊపందుకున్న రోజులను గమనిస్తే, మన రెండో సాంఘిక చిత్రమూ పురోగామి దృక్పథంతో కూడుకున్నదే! తమిళుడైన కె. సుబ్రహ్మణ్యం (నేటి సుప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి పద్మాసుబ్రహ్మణ్యం తండ్రి) జాతీయవాద ఉద్యమానికి ఊతంగా సినీ మాధ్యమాన్ని ఉపయోగించుకున్నారు. కులతత్త్వాన్ని నిరసిస్తూ, కులం పేరిట సాగుతున్న దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఆయన తమిళంలో బాలయోగిని (1937) చిత్రాన్ని రూపొందించారు. గూడవల్లి రామబ్రహ్మం సహాయకుడిగా పనిచేయగా, అదే కథను, అదే పేరుతో తెలుగులోనూ తీశారు.
ఇక, ప్రముఖ రచయిత చలం రచన ఆధారంగా గూడవల్లి రామబ్రహ్మం తీసిన మాలపిల్ల (1938) తెలుగులో నాలుగో సాంఘిక చిత్రం. అది ఆనాటి అస్పృశ్యతా నివారణ పోరాటానికీ, హరిజనుల దేవాలయ ప్రవేశ ఉద్యమానికీ వెండి తెరరూపం. కేరళలో ఓ సంస్థానంలో జరిగిన హరిజనుల ఆలయ ప్రవేశ ఉదంతం స్ఫూర్తిగా ఈ చిత్రం తీశారు. కులతత్త్వం పై పోరాటానికి అప్పటి నుంచి తెలుగు తెర వేదికే. మాలపిల్ల వచ్చిన నాలుగున్నర దశాబ్దాల తరువాత కూడా అస్పృశ్యత, అంటరాని తనం తెరపై చూపెట్టాల్సిన పరిస్థితి సమాజంలో ఉందనడానికి వేజెళ్ళ సత్యనారాయణ మరోమలుపు (1982) లాంటివి ఉదా హరణ. కాలం మారినా, తరాలు మారినా సమాజంలో మార్పు ఆశించినంత వేగంగా రాలేదనడానికి ఆనాటికి అది వెండితెర సాక్ష్యం.
అగ్రకులస్థుడు, నిమ్న కులస్థురాలిని పెళ్ళి చేసుకోవడం- మాలపిల్ల నాటికి భావ విప్లవమైతే, బలిపీఠం నాటికి అది భావాలలో ఆదర్శం. ఆ ఆదర్శానికి తగ్గట్లు అవసరమైన కొత్త వాతావరణంలో ఇమడకపోతే చోటు చేసుకునే అపార్థాలకు ఆ రెండో సినిమా తెరరూపం. అయితే, కాలగతిలో సమాజంలో మరింత మార్పు వచ్చి, కులాంతర, మతాంతర వివాహాలు గణనీయమైన సంఖ్యలో జరుగుతుండేసరికి, ఇవాళ్టికి అది ఓ సాధారణ సామాజిక వాస్తవం. అందుకే, నాయికా నాయకుల మధ్య వివాహానికి కులమే అడ్డుగోడ అవుతున్న సందర్భాలు తాజా సినిమాల్లో అరుదు.
అయితే, ఆర్థికపరమైన అంతస్థుల తేడా మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ప్రధాన సమస్యే. సమాజంలోనూ, సినిమాల్లోనూ ప్రధానాంశమే. పెద్దింటి అమ్మాయి, పేదింటి అబ్బాయిల ప్రేమకూ, పెళ్ళికీ అవరోధాలతో వచ్చిన, వస్తున్న సినిమాల జాబితా కొండవీటి చాంతాడే! పాతాళభైరవి (1951) రోజుల నుంచి తేజ దర్శకత్వంలో నితిన్ నటించిన నిన్నటి జయం (2002) దాకా ఈ సామాజిక వాస్తవం ఓ తరగని ముడిసరుకు.
ఎలాంటి మొగుడు కావాలి?
భర్త తాగుబోతైనా, తిరుగుబోతైనా పవిత్ర భారతనారి తన భర్త పాదాలనే ఆశ్రయించాలన్న పాతకాలపు పాతివ్రత్య ధర్మాలను మన సినిమాలు యథాశక్తి ప్రబోధిస్తూ వచ్చాయి. తెలుగులో మూడో సాంఘిక చిత్రమైన రోహిణీ పిక్చర్స్ వారి గృహలక్ష్మి (1938, దర్శకుడు హెచ్.ఎం. రెడ్డి) పరకాంతా వ్యామోహంలో పడి, ఇంటికి దీపమైన ఇల్లాలిని నిర్లక్ష్యం చేసిన ఓ భర్త, అతనిలో పరివర్తన తెచ్చిన భార్య కథ. ఈ సాధారణ కథా ఇతివృత్తంలోనూ మద్యపాన వ్యతిరేకతను ప్రబోధించడం, కల్లు మానండోయ్ బాబూ కళ్ళు తెరవండోయ్… గీతం వగైరా పురోగామి దృక్పథ చిహ్నాలే.
కథానాయకుడు ఎన్ని చెడు తిరుగుళ్ళు తిరిగినా, చివరకు మంచివాడిగా పరివర్తన చెందడమనే వెండితెర సంస్కరణ ఫార్ములాకు ఈ సినిమా నాంది పలికింది. దాదాపు అర్ధశతాబ్దం తరువాత ప్రభాకరరెడ్డి నిర్మించిన మోహన్‌బాబు-జయసుధల గృహప్రవేశం (1982) నాటికి కూడా పతియే ప్రత్యక్షదైవమనే హీరోయిన్లు, చెడ్డవాడైన హీరో ఆఖరికి పశ్చాత్తాపపడడమనే ధోరణి కొనసాగింది.
ఒకప్పుడు కుటుంబం కోసమే జీవితాన్ని హారతి కర్పూరం చేసుకున్న స్త్రీల జీవితాలు తెరపై అంతులేని కథ (1976)లుగా సంధ్య (1980) వెలుగులు చిమ్మేవి. కాలగతిలో భర్త ఏం చేసినా సహించి, క్షమించి, భరించాల్సిన అవసరం జీవితంలో తగ్గింది. స్త్రీలు ఆర్థికస్వేచ్ఛతో స్వతంత్ర జీవనులయ్యే సావకాశం సమాజంలో వచ్చింది. అందుకే, ‘సహనశీలివమ్మా… మహిళా… అనురాగ మూర్తివమ్మా…’ అని ప్రశంసలందుకున్న ఒకప్పటి సినీనాయిక రూపే కాదు, చూపూ మారింది. దృఢమైన అభిప్రాయాలతో, పెళ్ళికి ముందు నుంచి తమ భావాలను స్పష్టంగా వ్యక్తం చేస్తున్న స్త్రీ పాత్రలు (ఆనంద్, గోదావరి, బొమ్మరిల్లు) ఇటీవల తెర మీదకు నడిచొచ్చాయి.
అయితే, స్త్రీ స్వేచ్ఛ, సమానత్వ అంశాలను మన సినిమాలు వక్రీకరిస్తున్న సందర్భాలూ చాలానే ఉంటున్నాయి. అందుకే, కొన్ని సినీ నాయికా పాత్రలు సింపుల్‌గా… ఏకపత్నీ వ్రతుడైన శ్రీరాముడు మాకక్కర్లేదు, బుగ్గ గిల్లేసి, చీర లాగేసే …చిలిపి కృష్ణుడే కావాలీ… ఉయ్ లవ్ బ్యాడ్‌బాయ్స్! అని కొత్త పాట పాడుతున్నాయి. వాస్తవికతను వక్రీకరించి, అదే అనుసరించాల్సిన ధోరణి అని భ్రమింపజేస్తున్నాయి.
మనిషికి పెళ్ళి! మనసుకు హళ్ళి?
నిజానికి, వివాహబంధం, మాంగల్యం, పసుపు కుంకుమ లకు మన సమాజంలోని ప్రాధాన్యం కూడా సినిమాలకు మహత్తరమైన ముడిసరుకులే. వై.వి. రావు మళ్ళీ పెళ్ళి (1939), ఆ తరువాత వచ్చిన బి.ఎన్. రెడ్డి సుమంగళి (’39) వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించాయి. కానీ, మెడలో తాళి ఉంది కాబట్టి, మనసులో ఇష్టాన్ని చంపుకొని అయినా కట్టుకొన్న వాడి తోనే కలిసి ఉండాలన్న సూత్రీకరణకే చాలా ఏళ్ళు మన సినిమాలు వోటేశాయి. మాంగల్య బలం (1959) అందుకు ఓ ఉదాహరణ. మనసు కన్నా మాంగల్యానికే పెద్ద పీట వేసే ధోరణి చంద్రమోహన్-రాధికలతో బాపు తీసిన రాధా కల్యాణం (1981) నాటికీ కనిపిస్తుంది. తాళిబొట్టు తీసేసి రమ్మన్నప్పుడు, వివాహ బంధాన్ని తెంచుకొని ప్రేమబరిలోకి రాలేని సగటు మధ్యతరగతి మహిళ మనస్తత్త్వమే జన నీరాజనం అందుకుంది.
అందుకు భిన్నంగా మనసు లేని చోట మాంగల్యానికి పని లేదంటూ ముందే కూసిన కోయిల- ప్రత్యగాత్మ దర్శకత్వంలోని మనసు-మాంగల్యం (1971). ఆ చిత్రంలో హీరో తాను కట్టు కున్నా కాపురం చేయని యువతి మెడ లోని తాళిని తీసేసి, ఆమె ఇష్టపడుతున్న వాడికిచ్చి పెళ్ళి చేస్తాడు. పెళ్ళనేది జరగా ల్సింది రెండు మనసుల మధ్యే కానీ, మనుషుల మధ్య కాదనే ప్రతిపాదన అందులో ఉంది. అది ఒక రకంగా అప్ప టికి సమాజం ఆలోచనాధోరణిలో రావాల్సిన మార్పుకు నిదర్శనం. కానీ, కాలాన్ని దాటి ముందుకెళ్ళి తీసిన ఈ చిత్రాన్ని అప్పటి జనం హర్షించలేదు.
ఓ దశాబ్దకాలం తరువాత ఆ అంశానికే అగ్ర, నిమ్న వర్ణాల కోణాన్నీ, సంప్రదాయాన్నీ జోడిరచిన చిత్రం- కె. విశ్వనాథ్ సప్తపది (1981). దానికి కొనసాగింపు జంధ్యాల ఆనంద భైరవి (1984). ఈ రెండు చిత్రాలకూ ఇతివృత్తాల మీద తలెత్తిన నిర సనలు తక్కువేమీకాదు. అయితే, వినసొంపైన సంగీత, సాహిత్య, నృత్యాల మధ్య ఆ విమర్శలు మరుగయ్యాయి.
ఆ తరువాత దశాబ్దిన్నర గడిచి, కొత్త సహస్రాబ్ది వచ్చేసరికి సమాజమూ మారింది. ప్రేక్షకులూ మారారు. మనసుల మధ్య పెళ్ళినే హర్షించారు. ప్రేమ లేని పెళ్ళి కంటే, ప్రేమించిన వాడి తోనే అమ్మాయి పెళ్ళికి ఓటేస్తూ, నువ్వే కావాలి (2000), నువ్వు నాకు నచ్చావ్! (2001) లాంటి చిత్రాలు వచ్చి, ఘన విజయం అందుకున్నాయి.
దుష్టులకు దూరంగా…
మనసు లేనప్పటి సంగతి అలా ఉంచండి! మనిషే దుర్మార్గుడైతేనో!! అయినా సరే, అతడితోనే భార్య కలి సుండాలన్నదే సమాజం రుద్దిన కట్టు బాటు. ఆ బంధనాలను తెంచుకోవడం లో తెర మీద కథానాయిక అంత తేలిగ్గా ఆమోదం పొందలేకపోయింది. నిజానికి, దీనికి బీజం తెలుగులో టాకీలు మొదలైన రెండు దశాబ్దాల కల్లా పడిరది. ఆదర్శ భావాలతో ‘ప్రజానాట్య మండలి’ ద్వారా రంగస్థలంపై ప్రత్యేక ముద్ర వేసిన గరికపాటి రాజారావు సినీరంగ ప్రవేశం చేసి, రూపొందించిన పుట్టిల్లు (1953) లో భర్త పరమ దుర్మార్గుడైనప్పుడు, భార్య అతణ్ణి వదిలేయవచ్చంటూ ప్రబో ధించారు. కఠినమైన జీవన వాస్తవికతను గ్రహించి, అవసరాన్ని బట్టి ఆచరించా ల్సిన విప్లవాత్మక పంథాను పుట్టిల్లు చిత్రం చూపెట్టింది.
క్రాంతదర్శిగా కవి చూపిన ఆ మార్గం అప్పట్లో ప్రేక్షకజనానికి రుచించ లేదు. అలాగే, చిలకమ్మ చెప్పింది (1977)లో భర్తను భరించలేక భార్య తన దారి తాను చూసుకుంటే, దాన్నీ జనం హర్షించలేదు. కానీ, కాపురం పొస గనప్పుడు కలిసుండడం కన్నా వేరుపడ డమే ఉత్తమమన్న వైఖరి ఆ తరువాత క్రమంగా అందరూ ఆమోదిస్తున్న పరిష్కారమైంది! అందుకు వెండి వెలుగుల సాక్ష్యం- ‘యువచిత్ర’ అధినేత కాట్రగడ్డ మురారి నిర్మించిన గోరింటాకు (1979). పుట్టిల్లు నుంచి గోరింటాకుకు వచ్చేనాటికి సమాజం ఆలోచనాధోరణి మారింది. మోసగాడైన యువకుడు కట్టిన తాళిని తెంపి, ఒక యువతి వాడి ముఖాన కొడితే ప్రేక్షకులు జేజేలు పలికారు.
అలాగే దర్శక, నిర్మాత క్రాంతికుమార్ లాంటివారు 1980ల ద్వితీయార్ధంలో, 1990లలో న్యాయంకావాలి! (1981), స్వాతి (1984), 9 నెలలు (2000) లాంటి చిత్రాల ద్వారా మహిళా జీవిత ప్రధానాం శాల్ని ప్రస్తావించారు. ఈ పితృస్వామ్య వ్యవస్థలో శీలమంటే ఏమిటి, మనస్సుల మధ్య అనుబంధానికి వయస్సుతో పని ఏమిటి, గర్భాన్ని అద్దెకిచ్చి, మరొకరి బిడ్డను తాను కనే మాతృమూర్తుల ‘సర్రొగసీ’ అంశం లాంటివి చర్చించారు.
నిరుద్యోగ భారతం
కాలం మారుతూ వచ్చినా, సమా జంలోని మౌలిక సమస్యలు మారలేదు. ఇవాళ్టికీ సమాజాన్ని పీడిస్తున్న నిరుద్యోగ సమస్యలాంటి కళ్ళెదుటి వాస్తవాన్ని బి.ఎన్. రెడ్డి వందేమాతరం (1939) చిత్రం ఆనాడే ప్రస్తావించింది. అయితే, ఆ అంశాన్ని కుటుంబ నేపథ్యంలో చెబుతూ, చివరకు వందేమాతరం లాటరీలో తగిలిన అదృష్టమే సమస్యకు పరిష్కారంగా చూపారు. అయితే, స్వరాజ్యం వస్తే, సమస్యలు పరిష్కార మవుతాయన్నది దర్శక-నిర్మాతల పరోక్ష సూచన అనుకోవచ్చు.
తీరా, స్వరాజ్యం వచ్చినా సమస్య తీర లేదన్న నిష్ఠుర సత్యానికి సినీరూపం ఆ తరు వాత నలభయ్యేళ్ళకు కమలహాసన్ -శ్రీదేవితో కె. బాలచందర్ తీసిన ఆకలి రాజ్యం (1980). అదే నిరుద్యోగ సమస్యను ప్రతిభావంతుల మీద పడిన రిజర్వేషన్ విధానపు విషపరిణా మంగా చిత్రించిన వేజెళ్ళ సత్యనారాయణ ఈ చదువులు మాకొద్దు! (1984) అప్పట్లో వాదవివాదాలు రేపిన వెండితెర సంచలనం.
పెరిగిన జనాభా, విద్యావకాశాల నేపథ్యంలో గతంతో పోలిస్తే, ఇవాళ దేశంలో నిరుద్యోగం ఇంకా పెరిగింది. సమస్య పెరిగినా, ఆ సామాజిక వాస్తవ నేపథ్యంలో వస్తున్న, సత్య దర్శనం చేయిస్తున్న సినిమాలు దాదాపు మృగ్యం.
వరకట్న పీడితులు, బాధితులు
సమాజంలో ఉన్న వరకట్న దురాచారాన్ని తెలుగు సినిమా కెమేరా కన్ను చిత్రిస్తూనే వచ్చింది. సినీ ఆగ్రహం. కొన సాగుతున్న ఈ దుస్సంప్రదాయాన్ని నిరసిస్తూ కాళ్ళకూరు నారాయణరావు ప్రసిద్ధ నాటకం ఆధారంగా చిత్తజల్లు పుల్లయ్య తీసిన వర విక్రయం (1940) నుంచి ఇప్పటి దాకా తెలుగులో వందల సంఖ్యలోనే సినిమాలు వచ్చాయి.
ఎన్టీయార్ వరకట్నం (1969) అయినా, కె. విశ్వనాథ్ తీసిన శుభలేఖ (1982) అయినా, వేజెళ్ళ తీసిన ఈ పిల్లకు పెళ్ళవుతుందా? (1983) అయినా వరకట్న సమస్యపై వచ్చినవే. వరకట్నపు చావులు, గ్యాస్ సిలిండర్ ప్రమాదంగా చూపించి కోడల్ని హతమార్చడాలలాంటివీ సమాజంలో నుంచి సినిమాల్లోకి (ఏయన్నార్ జస్టిస్ చక్రవర్తి -1984) నడిచొచ్చాయి. కాకపోతే, కాస్తంత నాటకీయతనూ, అసహజత్వాన్నీ అద్దుకొని మరీ వచ్చాయి.
సామాజిక చైతన్యానికి ప్రాతిపదికలు
దున్నే వాడిదే భూమి, భూమికి రైతే యజమాని అన్న భావాలు 1960, ’70ల నాటి చిత్రాల్లో కనిపించినా, రానున్న సమాజంలో కానున్న వాస్తవం అదేనన్న సంగతిని దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం రైతుబిడ్డ (1939)లోనే చూపెట్టారు. దేశానికి స్వాతంత్య్రమైనా రాని రోజుల్లోనే జాగృతులైన రైతు సంఘాల వారికీ, జమీందారులకూ మధ్య సంఘర్షణ సాగుతుండగా, రైతు రక్షణయాత్ర జరిగిన సమయంలో తీసిన సినిమా అది.
భూమికి యజమాని రైతే అనీ, జమీందారు శిస్తు వసూలు చేసే ఏజెంటు మాత్రమేననీ, అడవులు-పోరంబోకులు ప్రజలవేననీ ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ అప్పట్లో ప్రకటించింది. ఆ చారిత్రక నేపథ్యంలో రామబ్రహ్మం రూపొందించిన ఈ కథాచిత్రం జమీందార్లను వాస్తవికంగా చూపించి, నిర్దాక్షిణ్యంగా అపహాస్యం చేసింది. జమీలు పోయి, దున్నే వాడిదే భూమి అవుతుందన్న ఆగామి స్పృహను ఆ సినిమా అందించింది. రైతుల కుటుంబాలు, జీవితాలు, గ్రామీణవ్యవస్థ నేపథ్యంతో ఆ తరువాత వచ్చిన హీరో కృష్ణ ప్రజారాజ్యం (1983), రైతుభారతం (1994) చిత్రాల లాంటి వన్నీ ఆ తానులోని గుడ్డకు, సినీరూపకల్పన నాటి సామాజిక స్థితిని అతుకులు వేసుకున్న కథలే!
స్వాతంత్య్రం ఓ మేడిపండు
స్వాతంత్య్రంతో సమాజం భూతల స్వర్గమవుతుందన్న స్వప్నం కొద్దిరోజుల్లోనే కరిగిపోయిన వైనాన్ని మన సినిమాలూ ప్రతిఫలించాయి. నటి-నిర్మాత సి. కృష్ణవేణి ఎం.ఆర్.ఏ. పతాకంపై ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన మనదేశం (1949) చిత్రం ఆనాటి స్వాతంత్య్ర పోరాట కాలఘట్టాన్ని తెరపై చూపింది. అదే సమయంలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక వచ్చిన కొత్త ప్రభుత్వంలో దేశం కోసం త్యాగం చేసిన దేశభక్తులకు సరైన స్థానం లేదనే విషయాన్ని ప్రస్తావించింది. ద్రోహి (1948) చిత్రం మనకొచ్చిన స్వరాజ్య లక్షణాన్ని ప్రశ్నించింది. ఇవన్నీ సమకాలీనతను చూపుతూనే, ప్రేక్షకుల్ని ఆలోచింపజేసిన ప్రయత్నాలు.
ఆ తరువాత కూడా స్వాతంత్య్రం అందించిన ఫలాలు ఏమిటన్నది ప్రశ్నిస్తూ, పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి.
స్వాతంత్య్రం వచ్చి మూడు దశాబ్దాలు దాటినా, పరాయి ప్రభువుల నుంచి దేశానికి స్వాతంత్య్రం కోసం శ్రమించిన యోధుడైనా (దాసరి-ఎన్టీయార్ల సర్దార్ పాపారాయుడు- 1980), పరాయి దేశాల ముష్కరుల నుంచి దేశాన్ని కాపాడిన సైనిక వీరుడైనా (బొబ్బిలిపులి- 1982) చివరకు ఇంటిదొంగలతోనే పోరాడి, మన ప్రజాస్వామ్యంలోని దొంగ రాజకీయనేతలపై తుపాకీ ఎక్కుపెట్టాల్సిన దుర్గతి పట్టినట్లు సామాజిక వాస్తవాన్ని మెలోడ్రామాతో చెప్పారు.
అవన్నీ అప్పట్లో జనం మెచ్చిన కథలు, చిత్రాలు. కానీ, స్వాతంత్య్రోద్యమ తరం మారి, సరళీకరణ, సంస్కరణల శకపు కొత్తతరం వచ్చాక, అదే హీరో వారసుడైన బాలకృష్ణ నటించి నప్పటికీ, గత పదేళ్ళలో వచ్చిన ఆ తరహా కథలు (విజయేంద్ర వర్మ- 2004, పరమ వీరచక్ర, తాజాగా శ్రీమన్నారాయణ- 2012) ప్రేక్షకులకు పట్టని విషయాలయ్యాయి. మారిన తరాన్నీ, మారు తున్న వారి స్వరాన్నీ, సమాజంలో మారిపోతున్న విలువలనూ తులనాత్మకంగా చూడకపోతే, ఎదురయ్యేది పరాజయమేనని బాక్సాఫీస్ పాఠం నేర్పాయి.
జనస్వామ్యమా? ధనస్వామ్యమా?
అలాగే, మనకు స్వాతంత్య్రం వచ్చినా ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి బదులు గ్రామీణ పాలనావ్యవస్థలో ధనస్వామ్యం పెరిగిపోయింది. అలా పేరుకుపోతున్న అనేక రుగ్మతలకు ఆనాటి కె.వి. రెడ్డి పెద్ద మనుషులు (1954) నుంచి నిన్నటి టి. కృష్ణ వందేమాతరం (1985) దాకా అన్నీ సినీ ప్రతిబింబాలు. ఇక, అయిదున్నర దశాబ్దాల పై చిలుకు క్రితమే గ్రామీణ నేపథ్యంలో, భూ సమస్యను ఇతివృత్తంగా చేసుకొని తాపీ చాణక్య దర్శకత్వం లో రోజులు మారాయి (1955) ఓ క్రాంతిదర్శక చిత్రం. అందులో బంజరు భూముల పంపిణీని పతాక సన్నివేశాల సాక్షిగా తెరపైకి తెచ్చారు. ఇవాళ పాలకవర్గాలు గొప్పగా చెప్పుకుంటూ, ఎప్పటికీ పూర్తి చేయలేకపోతున్న భూపంపిణీ వ్యవహారాన్ని అప్పట్లోనే వెండితెరపై చూపెట్టడం సమాజంలో రావాల్సిన, రానున్న మార్పు లకు ముందస్తు సంకేతం.
ఆ రోజుల్లోనే మొదలైన క్షీణత
అలాంటివి వస్తున్న సమయంలోనే 1950ల ప్రథమార్ధం నుంచే తెలుగు సాంఘికచిత్రాలు మరోపక్క క్రమంగా కొంత నాటకీయ పంథాకు మళ్ళినట్లు భావించ వచ్చు. అది సాదాసీదా కుటుంబకథ అయినా, లేక సమాజంలోని అన్యాయా లపై సామాన్యుల ఆవేదన, ఆగ్రహమైనా -మంచీచెడుల మధ్య సంఘర్షణే అప్పటి సినిమాల ప్రధాన భూమిక. ఆఖరుకు మంచిదే పైచేయి కావడంతో, ‘అంతా సుభిక్షం, సుఖాంతం’ అన్నట్లుగానే సినిమా ముగుస్తుంది. ఈ రకమైన విలువల అజెండా నిర్ణయం, అపరిమిత ఆశావాదం తెలుగు సినీకథలో అంతర్భాగమయ్యాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తెలుగు సినిమాకు స్వర్ణయుగంగా చెప్పుకొనే 1950, 1960లలో కూడా సోషల్ పిక్చర్స్‌లో కుటుంబ ఇతివృత్తాలే ఎక్కువగా వచ్చాయి. అంతే తప్ప, వాస్తవిక చిత్రాలో, కళాత్మక చిత్రాలో కాదు. చెడు మీద మంచి విజయం, చెడ్డవాళ్ళు ఆఖరికి తప్పు తెలుసుకొని మారడం, పొరపొచ్చాలతో ఛిన్నాభిన్నమైన ఉమ్మడి కుటుంబం చివరకు కలుసుకోవడంలాంటి కథాంశాలే తెర నిండా పరుచు కున్నాయి.
1960ల ద్వితీయార్ధానికే మొదలైన క్షీణత, 1970లలో ప్రస్ఫుటంగా కనపడిరది. ఇంద్రియాలను ఉత్తేజపరిచి, విస్మయంలో వాస్తవ ప్రపంచాన్ని కాసేపు విస్మరింపజేసే యాక్షన్, కౌబాయ్, జేమ్స్‌బాండ్ చిత్రాలు హోరెత్తించాయి. సాంఘిక చిత్రాల్లోనూ వెగటు హాస్యం, మోటు సరసంతో మాటలు, పాటలు రాసాగాయి. వాటి వాణిజ్య విజయం ముందు వాస్తవికత చిన్నబోయింది. అభ్యుదయ ఛాయలు, ఆ ఛాయలకు క్రీనీడలే సినిమాల్లో అక్కడక్కడ మెరిశాయి.
మెలోడ్రమాటిక్ అభ్యుదయం
స్టార్డమ్ విషబీజాలు పడిన 1970లలోనే నవ్య చిత్రాలు తీసి, వాస్తవికతను ప్రతిబింబించాలనే ఆలోచన కొందరిలో రేకెత్తింది. ఆ ప్రయత్నాల వరుసలో మృణాల్‌సేన్ శిష్యుడు గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో నటుడు-నిర్మాత బి. నరసింగరావు రూపొందించిన మా భూమి (1980) తెలుగునాట వాస్తవిక చిత్ర ఉద్యమంలో ఓ మైలురాయి.
ఆ వాస్తవిక చిత్ర విజయం తెలుగు తెరపై అరుణారుణ చిత్రోదయానికి ఆలంబన అయింది. యువతరం కదిలింది (1980) అంటూ మొదలై ఎర్రమల్లెలు (1981) మీదుగా విప్లవ శంఖం (1982) పూరించేదాకా సిల్వర్‌స్క్రీన్ ఎర్రబడింది. అయితే, ఈ చిత్రాలు కూడా ప్రధానంగా చెడుపై మంచి పోరాటం ఫక్కీకీ, గ్రామప్రాంతాల్లో భూస్వాముల చేతుల్లో సాగుతున్న లైంగిక దోపిడీకీ, శ్రమదోపిడీకే పరిమితమయ్యాయి. ‘భూమికోసం… భుక్తి కోసం… విముక్తి కోసం…’ అన్న సిద్ధాంతాన్నే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చెప్పాయని విమర్శించినవారూ లేక పోలేదు.
వామపక్ష భావజాలంపట్ల సైద్ధాంతిక సహానుభూతి వున్న ధవళ సత్యం, మాదాల రంగారావు లాంటి దర్శకులు, నిర్మాతలు ఆ కృషిని పతాకస్థాయికి తీసుకువెళ్ళారు. అభ్యుదయం వైపు జనాన్ని ఆలోచింపజేసేందుకు ప్రయత్నించారు. కాస్త అటూ ఇటూగా ఆ సమయం లోనే, అదే రకమైన సైద్ధాంతిక నేపథ్యంతో వచ్చిన దర్శకులు వేజెళ్ళ సత్యనారాయణ, టి. కృష్ణ లాంటివారు తెలుగు తెరను ఓ ఊపు ఊపారు.
మరో మలుపు, ఈ పిల్లకు పెళ్ళవుతుందా?, ఈ చదువులు మాకొద్దు! లాంటి వేజెళ్ళ చిత్రాలన్నీ సమాజంలోని వర్ణవ్యవస్థ, వరకట్నం, రిజర్వేషన్ విధానం లాంటి వాటిపై సెల్యులాయిడ్ అస్త్రాలే! ఇక, సమకాలీన వ్యవస్థపై సంధించిన వ్యంగ్య బాణాలుగా నేటిభారతం, దేశంలో దొంగలు పడ్డారు, రేపటిపౌరులు, వందేమాతరం, ప్రతిఘటన లాంటి టి. కృష్ణ చిత్రాలు సూటిగా తాకాయి. ఇవన్నీ దిగువ, మధ్యతరగతి మెచ్చే పుష్కలమైన మెలోడ్రమాటిక్ అభ్యుదయ భావాల కలబోతలుగా నిలిచాయి. ఆ కృషికి కొనసాగింపుగా, విషయాన్ని శ్రామికవర్గం దాకా తీసుకువెళ్ళి ఆర్. నారాయణమూర్తి పాతికేళ్ళుగా సినిమాలు తీస్తూ వస్తున్నారు.
>h4>రౌడీలు, రాజకీయాల రంగుల ప్రపంచం
వీటికి కాస్తంత ముందుగానే, ‘కలియుగ మహాభారతం’ (1979) లాంటి పొలిటికల్ సెటైర్లూ వచ్చాయి. ప్రధానంగా ఈ చిత్రాలకు గ్రామీణ పాలనావ్యవస్థ, పంచాయతీలు, స్థానిక స్వపరిపాలన లాంటి అంశాలే ఆధారం.
దాదాపు ఆ సమయంలోనే రాజకీయ నేపథ్య కథలూ పెరిగాయి. ముఖ్యంగా, 1970ల తరువాత, ముఖ్యంగా దేశంలో ఎమర్జెన్సీ విధింపు, ఎత్తివేత తరువాత ఈ రాజకీయ నేపథ్య కథలు వెండి తెరపైకి విరివిగా వచ్చాయి. కలియుగ మహా భారతం లాంటివి ఆ కోవలోవే! ఆ పైన ఆ సమకాలీన రాజకీయాలకూ, వ్యక్తులకూ, రౌడీయిజానికీ అద్దం పడుతూ ప్రతిఘటన (1985), చైతన్యరథం (1987) లాంటి చిత్రాలు వచ్చాయి.
ఎన్ని వాస్తవ అంశాలను తీసుకున్నప్పటికీ, వాణిజ్య విజయమే పరమావధిగా సహజత్వానికి దూరంగా, సినిమాటిక్‌గా సాగడం ఈ చిత్రాల మౌలిక లక్షణం. వీటన్నిటినీ పూర్తిగా పురోగామి దృక్పథ చిత్రాలుగా వర్గీకరించలేం కానీ, సమకాలీన పరిస్థి తుల పట్ల ప్రజలను చైతన్యవంతుల్ని చేసే అంశాల ఛాయలు వీటిలో వున్నందుకు సంతోషించవచ్చు. ఇలాంటి చిత్రాల్లోని పాత్రలు, సంఘ టనలు, మాటలు ఆ తరం ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారాయి. వెండి తెరకు ఓ విజయ సూత్రాన్ని అందిం చాయి.
అందుకే, అప్పటి ప్రతిఘటన (1985), ప్రతిధ్వని (1986), అలజడి (1990) లాంటి చిత్రాల మొదలు ఇటీవలి పోసాని కృష్ణమురళి ఆపరేషన్ దుర్యోధన, రవి చావలి శ్రీమన్నారాయణ (2012) దాకా రాజకీయ ఇతి వృత్తాలు, రౌడీయిజానికి ప్రతిబింబాలైన కథలు హింసను వాడుకొని వస్తూనే ఉన్నాయి. ఒంటిచేతితో అందరినీ అడ్డుకోగల మానవాతీత లక్షణాలతో 1960ల చివరి నాటికే స్థిరపడ్డ కథా నాయక పాత్రలను చూపెడుతూనే ఉన్నాయి. జనం చూస్తూనే ఉన్నారు. ఫలితంగా, సమకాలీన సమాజంలో రాజకీయాలు కానీ, రాజకీయనేతలు కానీ కుంభకోణాలు, హత్యల చుట్టూరా నడుస్తున్నవేనన్న అభిప్రాయాన్ని తెలుగు సినిమా బలంగా కలిగించింది. ఇవాళ ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థపై అపనమ్మకం ప్రబలిపోవడానికి వెండితెర తన వంతుగా అగ్నికి ఆజ్యం పోసింది.
ఇప్పుడు హీరోలు వీళ్ళు!
ఒకప్పుడు కథానాయకుడంటే సకల సద్గుణ సంపన్నుడు. అందుకే, మాలపిల్ల, మళ్ళీపెళ్ళి చిత్రాల్లోని కథానాయకులు విద్యావంతులుగా, సంఘ సంస్కరణాభిలాషులుగా కనిపిస్తారు. స్వాతంత్య్ర పోరాటంలోని అప్పటి కాంగ్రెస్ పార్టీ నీతికీ, మహాత్మాగాంధీ రీతికీ ఆ నాయక పాత్రలు అనుసరణలు. పరిస్థితుల ప్రభావానికి లోబడి కథా నాయకుడు ఏదైనా తప్పు చేసినా, దానికి అతను పశ్చాత్తాపపడడం, ప్రాయశ్చిత్తం చేసుకోవడం లాంటివి నాగయ్య నటించిన దేవత (1941) నాటి నుంచి ఉన్న ధోరణి.
కానీ, రాను రానూ సమాజంలోని అష్టావక్రతలకు తగ్గట్లే సినిమా హీరో కూడా మూర్తీభవించిన అవలక్షణాల కుప్పగా మారాడు. అందుకే, ఒకప్పుడు హీరో బుద్ధిమంతుడు (1969). ఆ తరువాత ప్రేమనగర్ (1971)లో విహరించిన దసరా బుల్లోడు (1971). అటుపైన స్టేట్ రౌడీ (1989), అసెంబ్లీ రౌడీ (1991). ఇప్పుడు వట్టి పోకిరి. ఇంకా చెప్పాలంటే, కంత్రి, తాజాగా జులాయి (2012). ఒకప్పుడు దొంగను పట్టుకొనే పోలీసు… నేర సామ్రాజ్య నేతలను ఏరిపారేసే వేటగాడు అయిన తెలుగు సినిమా హీరో ఇప్పుడు నేల విడిచి సాము చేస్తున్నాడు. మాఫియా నేతగా మారడమే లక్ష్యమైన బిజినెస్‌మేన్‌గా అవతరించాడు. తానున్న సమాజానికీ, వాస్తవానికీ దూరంగా తానే డాన్, బాద్షా అయ్యాడు.
ఏ వెలుగులకీ ప్రస్థానం?
మాలపిల్ల నాటికి జీవితానికీ, సినిమాకూ ఉన్న ప్రత్యక్ష అనుబంధం కాస్తా ఇప్పుడు క్షీణించి, వట్టి ప్లాస్టిక్ సంబంధంగా పరిణమించింది. వాణిజ్య చట్రంలోనే తెలుగు చిత్రసీమ గుడు గుడు గుంజాలు ఆడుతూ, జీవితాన్ని మించిన ఇమేజ్‌లో చిక్కుకున్న తారల చుట్టూ పరిభ్రమిస్తోంది. ఆ సంకుచిత పరిధిలోనే హీరోతో చెప్పించిన డైలాగ్‌లోనో, చేయించిన చేష్టలోనో సహజత్వాన్ని జొప్పించామనీ, సమాజాన్ని ప్రతిఫలించామనీ, ఉపయోగపడే విషయం బోధించామనీ దర్శక, రచయితలు జబ్బలు చరుచుకోవాల్సి వస్తోంది.
సినిమా అంటే యూత్‌కే అంటూ వినోదం కాస్తా వల్గారిటీ స్థాయికి దిగిపోయింది. కాలేజీ టీనేజీ ప్రేమలు, కత్తులతో చాలక కంటి చూపుతో చంపుకోవడాలు, బరిసెలు, బాంబులు, గాలిలో లేచే సుమోలు, ఒంటరిగా వందమందిని చిత్తు చేసే హీరోలు, కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకై పోవడాల దగ్గరే మన సినిమా మస్తిష్కం చిక్కుబడిపోయింది.
కొంత నిరాశగా ధ్వనించినా, ప్రముఖ సినీ రచయిత కీర్తిశేషులు త్రిపురనేని మహారథి ఓ సందర్భంలో చెప్పినట్లు, ఇవాళ ‘తెలుగు చలనచిత్ర రూపం వెలుగు లేని దీపం.’ అది ‘అప్పుడప్పుడూ మినుకు మినుకుమని, తనకూ వెలుగుందని ప్రకటిస్తుంది తప్ప, పూర్తిగా వెలుగు నివ్వగల శక్తిని పోగొట్టు కుంది.’ ప్రస్తుతం సామాజిక స్పృహ అంటే వట్టి నినాద చిత్రాలుగా తయారైంది. కుటుంబగాథలంటే, అల్లరిచిల్లర హాస్యంగా మారింది. వినోదాత్మక చిత్రాలంటే వెకిలి మాటలు, చేష్టల వంటకమైంది.
వెరసి చుట్టుపక్కల చూడడం తగ్గించి, చుక్కల్లో (తారల్లో) చూపు చిక్కుకొన్న విచిత్రసీమగా తెలుగు పరిశ్రమ ప్రస్తుతం పైకి చూస్తూ, కింద నడుస్తోంది. నేల విడిచి సాము చేస్తోంది. గాలిలో తేలినట్లు, గుండె పేలినట్లు చేయడమే పరమా వధిగా సమకాలీన సమాజంలోని సమస్యలకూ, వాస్తవికతకూ, సామాజిక చైతన్యానికీ దూరమవుతోంది.
రెండున్నర గంటల పాటు చీకటిలో ఊహావిహారం చేయించి, ప్రేక్షకుణ్ణి జోకొడుతోంది. మేలుకొలపాల్సిన కళ మనిషిని నిద్రపుచ్చితే ఆ తప్పెవరిది? కళదా? కళాకారులదా? కళా వ్యాపారులదా? కళ్ళప్పగించిన మీది, మాది, మనందరి దీనా?