అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: కొత్త తరం

ఏమిటీ… అక్కడున్నంత సేపు మౌనానంద స్వామిలా కూర్చుని ఇప్పుడు కారు ఎక్కగానే మీలో మీరే అంతలా నవ్వుకుంటున్నారూ?!

పార్టీలో ఆ అమ్మాయిలూ అబ్బాయిల భాషా ఆ మాట్లాడే తీరు తలుచుకుంటే నవ్వొచ్చేస్తోందా? వాళ్ళ మాటలు వింటుంటే వీళ్ళు అసలు తెలుగు దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళేనా అని అనుమానం వచ్చిందా?

మా బాగా అన్నారు! అక్కడున్న వున్న వాళ్ళందరూ చిన్నవాళ్ళే, ఇండియా నుంచి నిన్నా మొన్నా దిగిన కుర్రకారు! వాళ్ళందరి మధ్యా దిష్టిబొమ్మల్లా మనిద్దరమే ముసలివాళ్ళం! మా మేనత్త మనవరాలిని నేను ఎప్పుడూ చూడలేదు కానీ, వాళ్ళ అమ్మ వసంత, నేను చిన్నప్పుడు కలిసి పెరిగాం. దాని కూతురు ఇక్కడకొచ్చి, వాళ్ళ అబ్బాయి పుట్టినరోజని పిలిస్తే వెళ్ళకుండా ఎలా అని, అలాగే వస్తామని అన్నాను. ఎవరో ఒకళ్ళు మనకు తెలిసిన వాళ్ళు, మన వయసువాళ్ళు వుండక పోతారా అనుకున్నా. మీరన్నట్టు ఆ అమ్మాయల కట్టు, బొట్టు, మాట పద్ధతులు అన్నీ తమాషాగా అనిపించాయి. అక్కడున్నంత సేపు కాస్త ఇబ్బందిగా అనిపించినా మళ్ళీ వాళ్ళ కబుర్లు, మాటలు వింటుంటే చాలా సరదాగానూ ఆశ్చర్యం గానూ అనిపించింది, నిజం!

ఈ వూరికి ఆ వూరు ఎంత దూరమో ఆ వూరికి ఈ వూరూ అంతే దూరం అన్నట్టు… మన తెలుగు దేశం నడిబొడ్డులో పుట్టి పెరిగిన ఈ అమ్మాయిలు ఇంత వెస్ట్రనైజ్‌డ్‌గా వున్నారేమిటీ అని నేను ఆశ్చర్య పోయానా, మరీ వాళ్ళేమో నా గద్వాల్ చీర, నా జుట్టుముడి చూసి ఈ దేశంలో నలబై ఏళ్ళుగా వుంటున్నానని, నేను డాక్టర్ నని విని నోళ్ళు తెరిచారు! ఒక అమ్మాయైతే నేను ఖచ్చితంగా సామర్లకోట సరుకే అనుకొని, ‘డెలివరీ వీసా మీద ఇక్కడికి వచ్చారా మామ్మా?’ అని మొహానే అడిగేసింది!

మరీ అంతలా నవ్వకండి! అమెరికాలో ఓ పెద్ద కంపెనీకి సి.ఈ.ఓ గా వుంటున్న మిమ్మల్ని పట్టుకుని, ‘మనవళ్ళకు బేబీ సిట్టింగ్ చెయ్యడానికి, టైం పాస్ కోసం ఇక్కడికి వచ్చారా తాతగారూ?’ అని ఆ కుర్రాళ్ళు అడగటం నేను విన్నాను లేండి!

అక్కడ తుర్రుమంటూ స్కూటీలమీద తిరిగే ఈ అమ్మాయిలకు ఒక్కళ్ళకు చీర కట్టుకోవడం కూడా రాదట! అలా అయితే ఎలాగర్రా అంటే, ‘నాకు చూపుల్ ఎరేంజ్ చేసినప్పుడు మమ్మీ హెల్ప్ చేసింది.మారేజ్ టైంలో మేకప్ వుమన్ వుంది కాబట్టి నో ప్రాబ్లమ్,’ అంటూ రెండు వారాల కిందటే పెళ్ళి చేసుకుని వారం కిందటే ఫ్లైట్ దిగిన ఓ పిల్ల ముద్దు ముద్దుగా చెపుతోంది!

ఆ పిల్లల మాటలు వింటుంటే వాళ్ళ లైఫ్ స్టయిల్ చూస్తుంటే అందరూ బాగా వున్నవాళ్ళ లాగే వున్నారు. వాళ్ళ వ్యవహారం చూస్తుంటే మనలాగా బతుకుతెరువు కోసం అమెరికాకు వచ్చినట్టు లేదు, సరదాగా గడపటానికి ఏ పిక్నిక్కుకో వచ్చినట్టుంది.

రోజు ఎవళ్ళు వంటలు చెయ్యరుట. బయటే తినేస్తారుట. దటీజ్ సో… ఈజీ నో! అంటూ చాలా ఈజీగా చెప్పేశారు. అదేదో గొప్ప విషయం అన్నట్టు ఏమాత్రం సంకోచం లేకుండా, ‘అయాం సో నాట్ ఇంట్రస్టేడ్ ఇన్ కుకింగ్ ఆంటీ! కుకింగ్ ఈజ్ బోరింగ్! డైలీ కుకింగ్ ఈజ్ వేస్ట్ ఆఫ్ టైం,’ అని ఆ అమ్మాయిలు రాగాలు తీస్తుంటే నమ్మలేకపోయాను. ఇలా అంటూనే, నేను పట్టికెళ్ళినవన్నీ మళ్ళీ అందరూ ఇంటరెస్టింగ్ గానే తిన్నారు. ఒకళ్ళిద్దరు మాత్రం ఎప్పుడైనా వంట చెయ్యాలనిపిస్తే ఏ స్కైప్ లోనో, ఫేస్ టైం లోనో వాళ్ళ అమ్మల్ని పిలిచి అప్పుడు స్టవ్ వెలిగిస్తారుట!

వంట గురించి వాళ్ళకున్న అవగాహనా వాళ్ళు వాడే మాటలు తమాషాగా కొత్తగా వున్నాయి, నామటుకు నాకు నిజం చెప్పొద్దూ! బొబ్బట్టుని స్వీట్ పూరీ అంటూ ఈ డిష్ ప్రొసీజర్ ఏంటీ అంటూ ఓ అమ్మాయి స్టైల్‌గా అడిగింది. పచ్చి శెనగపప్పుకు వేయించిన శెనగపప్పుకు తేడా తెలీదు. పిండి తడుపుకోవాలమ్మా అంటే టైట్ గానా లూజ్ గానా అని అడిగింది ఇంకో అమ్మాయి. పెళ్ళై రెండేళ్ళయిందిట. భార్యాభర్తలిద్దరూ ఒకే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లట. క్యాబేజ్ కొబ్బరి కూర చూసి, ‘ఈ కర్రీ నేను చేస్తే వెట్‌గా వస్తుంది ఇంత డ్రైగా ఎలా ప్రిపేర్ చేశారు?’ అని ఒక పిల్ల అడిగితే, గోంగూర చట్నీ స్మూత్‌గా రావాలంటే లీవ్స్‌ని వాటర్‌లో కుక్ చెయ్యాలా అంటూ అడిగిందో ఇంకో అమ్మాయి. ఎవ్వరూ ఈ దేశానికొచ్చి మూడేళ్ళు కాలేదంటే నమ్మబుద్ధి కాలేదు, మీకేమనిపించిందో ఆ అబ్బాయిలని చూసి, కానీ.

పేరుకు తెలుగు మాట్లాడుతున్నారే కానీ అందులో తెలుగే లేదు. అక్కడున్న వాళ్ళలో ఒక అబ్బాయికి మా వాళ్ళు బాగా తెలుసుట. మా ఆఖరి తమ్ముడి కొడుకు కార్తీక్ ఇతను మంచి ఫ్రెండ్స్ అట. అతని తెలుగు విని తీరాలి! “ఈ మధ్య మా కజిన్ పెల్లికి వెల్లినప్పుడు మీ బ్రదర్ వాల్లని కూడా మీట్ అయ్యా. అందరం కల్సి మీల్స్ చేసాం. మస్తుగ ఫన్నుండే. మా సిస్టర్ కి మాచ్ లుక్ చేస్తున్నాం. ఇంతకు ముందు ఒకల్లతో ఎంగేజ్మెంట్ అయి తర్వాత బ్రేక్ అయింది ఆంటీ,’ అంటూ ఏవేవో కబుర్లు చెప్పాడు! నాకు నవ్వు రాలేదు కానీ, వింతగా అయితే అనిపించింది. ఇదేమీ నా చాదస్తం కాదు, మీరూరుకోండి! అప్పటికీ మీకలా అనిపించనట్టు నన్నేమీ నమ్మించక్కర్లేదు.

హై టెక్ యుగంట! అందులో పెరిగిన ఈ పిల్లల్ని చూస్తుంటే ఇక్కడ పుట్టి పెరిగిన మన పిల్లలే నయం అనిపిస్తోంది, ఇప్పుడు. మన పిల్లలు పెరుగుతున్నప్పుడు అక్కడ పిల్లల్ని చూసి ముచ్చటపడే వాళ్ళం. ఆ రోజుల్లో ఇండియాలో పిల్లలు అందర్నీ చక్కగా వరస పెట్టి పిలిచేవారు. మన పిల్లలేమో బంధువులైనా స్నేహితులైనా అందర్నీ అంకుల్, ఆంటీ, అని పిలిచేవాళ్ళు. ఎన్ని కష్టాలు పడ్డామో గుర్తు లేదూ? మన పిల్లలకు వావీ వరసలు నేర్పించడానికి. ఇప్పుడు ఇండియాలో పిల్లలు మన పిల్లల్ని మించిపోయారు. వాళ్ళకు కనిపించే ప్రతివాళ్ళు అంకుల్, ఆంటీ లే. పాలు పోసే అతన్ని పాల్ అంకుల్ అనీ, కూరలబ్బిని వెజిటబుల్ అంకుల్ అనీ, రోడ్లు ఊడ్చే ఆమెను స్వీపింగ్ ఆంటీ అని పిలిచేస్తున్నారు! ఇండియాలో పిల్లల్ని పెంచే తీరు బాగా మారిపోయింది. దానికి తగ్గట్టే వాళ్ళ ప్రవర్తనలో మాటలో బాగా మార్పు వచ్చేసింది. దూరంగా ఉండబట్టి మనకే ఇంత తేడాగా అనిపిస్తోందో, లేదూ అక్కడివాళ్ళకీ తెలుస్తోందో లేదో అర్థం కాకుండా ఉంది సుమండీ.

వెనక రోజుల్లో అమెరికాలో మన పిల్లలు మరీ అయోమయంగా పెరుగుతున్నారని శెలవుల్లో ఇండియా పంపించేవాళ్ళం. ఇప్పుడు అక్కడ కూడా ముఖ్యంగా సిటీల్లో పెరుగుతున్న పిల్లలకి బొత్తిగా ప్రపంచ జ్ఞానం లేకుండా పోతోందిట! పుడుతూనే ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ, కార్లల్లో ఇంటర్నేషనల్ స్కూళ్ళకు వెళ్తూ, రోజూ పిజ్జాలు, పాస్తాలు, బర్గర్లు తినే ఈ పిల్లలకి ఓ మొక్క పేరుగాని, అది ఎలా పెరుగుతుంది అనిగాని, ఫలానా పండగ ఎందుకు చేసుకుంటామని గాని, అలాంటివి ఏమీ తెలియకుండా పెరుగుతున్నారు. ఈ అమ్మానాన్నలకి ఏం చెయ్యాలో తెలీక అప్పట్లో మనం, మన పిల్లల్ని దేశం పంపించినట్లు ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని వూళ్ళకు పంపిస్తున్నారు. ఇలా పల్లెటూళ్ళకు తీసికెళ్ళటం ఇప్పుడో పెద్ద ఫాషన్ అయిపోయిందిట! అందుకే కాబోలు విలేజ్ పీపుల్మ్ విలేజ్ మేనర్స్ అంటూ ఇన్నాళ్ళూ వెటకారంగా మాట్లాడిన మా వదిన ఇప్పడు పనిగట్టుకుని మనవడ్ని మా వూరు తీసికెళ్తోంది!

ఏమిటో మనిషి మనస్తత్వం! ఎప్పుడూ ఏదో కొత్తదనం కోసం వెంపర్లాడుతూ వున్నదాన్ని పోగొట్టుకుంటూ వుంటాడు.

ఏమిటీ? ఏమైనా ఆ కుర్రకారు భాషాజ్ఞానం ముందు మీరో కాళిదాసూ, వాళ్ళ తెలుగుతనం ముందు మన పిల్లలు ఆణిముత్యాలూ అంటారా?! మన పిల్లల పెంపకం అదంతా మీ గొప్పే అనుకుంటున్నారూ?!