ఉన్నపళంగా…

ఉన్న పళంగా అంటే
మనసు కొక్కదానికే తెలుసు
ఉపమానాల్లోకి, వాక్యాల్లోకి… ఊహు!
కిటికీలు, వాహనాలు… అడ్డేకావు!
చలివేళల్లో బిరుసెక్కిన చెట్టుమోళ్ళు
కోరుకునే సూర్యకాంతి కోసం
పరుగల్లేవుందీ తపన!
ఆగినచోటల్లా ఉబికిపడే భావమేదో
కన్నీరులా మాధ్యమమైపోతుందేమోనని దిగులు
లిప్తపాటులో లేతచిగురు రంగులో
అనుకున్నచోట లీనమవడమా?
తేలికపడటమా? దూరంగా జరగడమా?
ప్చ్‌… ఏదీ ఒప్పుకోని స్థితి!

అదేదో… కొలతకి రాని సంగతి
ఒక స్వేచ్ఛాపూరిత సత్తువలాంటిది
నిజంలా ద్రవిస్తున్న ఊహలాంటిది
అచ్చం పొలిమేరల్లో
పొగమంచల్లుకున్న పైరులాంటిది…!
ఏదో… అదేదో గుండెకి ఆయువు పెంచే క్షణం
చిన్నారి చెక్కిళ్ళు మీటినట్టో
అదాటుగా నిన్ను అక్కున చేర్చుకున్నట్టో
ఒక అలొచ్చి అలసిన కాళ్ళని తడిపినట్టో…!
ఉన్నపళంగా అనిపించడంలోని సాంద్రత
అక్షర సంభాషణతో సమానమే కాదు
ఉన్నపళంగా అంటే
మనసుకొక్కదానికే తెలుసు
ఉపమానాల్లోకి, వాక్యాల్లోకి… ఊహు…!