ఈమాట నవంబర్ 2011 సంచికకు స్వాగతం!

Ramayana of Indonesia
ఇండొనీసియా రామాయణ దృశ్యం
(
నీల బ్లాగ్‌స్పాట్ సౌజన్యంతో)

అత్తిపట్ కృష్ణస్వామి రామానుజన్ (A. K. Ramanujan, 1929-93) మనం గర్వించదగ్గ ఒక మేధావి, రచయిత, కవి, లాక్షణికుడు, జానపద సాహిత్య పరిశోధకుడు, బహు భాషావేత్త. షికాగో విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉంటూ దక్షిణ భారత భాషల సాహిత్య స్వరూప పరిణామాలని నిశితంగా పరిశీలించిన విద్యాధికుడు. “భారతీయ చింతన అంటూ ఒకటున్నదా?” అనే ఒక ప్రముఖ వ్యాసం ద్వారా భారతీయ చింతనలో సందర్భ గ్రాహ్యత (Context sensitivity) గురించి విశ్లేషించాడు. భారతీయ సాహిత్యంలో మౌఖిక, లిఖిత పార్శ్వాల అనుబంధంపై విశేషమైన పరిశోధనలు చేశాడు.

చర్చ, విమర్శ, తర్క మీమాంసలకు దోహదం చేస్తూ విద్యార్థుల వివేచనకు పదును పెట్టవలసిన విశ్వవిద్యాలయాలే అతివాదశక్తుల ఒత్తిడికి లోనై తమ గురుతర బాధ్యతను, భావ స్వతంత్రతను విస్మరించి పుస్తకాలని, వ్యాసాలని నిషేధించడం గర్హనీయం. ఈమధ్యనే ముంబయి విశ్వవిద్యాలయం రోహింటన్ మిస్త్రీ వ్రాసిన Such a Long Journey అన్న పుస్తకాన్ని పాఠ్యక్రమం నుండి తొలగించడం కొంత దుమారాన్ని లేపింది. ఇప్పుడు రామాయణాన్ని దూషిస్తున్నదన్న అకారణంతో ఢిల్లీ విశ్వవిద్యాలయం ఎ. కె. రామానుజన్ వ్రాసిన మూడువందల రామాయణాలు అన్న వ్యాసాన్ని చరిత్ర విద్యార్థుల పాఠ్యక్రమం నుంచి తొలగించి ఆ కుహనా సాంప్రదాయాన్ని కొనసాగించింది. నిజానిజాలు మనం తెలుసుకోవడం కోసం ఆ తొలగించిన వ్యాసాన్ని సురేశ్ కొలిచాల తెలుగులోకి అనువాదం చేసి మూలంతో సహా ఈ సంచికలో అందిస్తున్నాడు.


ఈ సంచికలో: దేవులపల్లి కృష్ణశాస్త్రి నాటికలనుంచి ఆనాటి పాటలు; మెలికముగ్గుల పై మోహనరావు శాస్త్రవ్యాసం; పహాడీ రాగంపై రోహిణీప్రసాద్ సంగీత వ్యాసం; మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంకలనం సూర్యకాంతి పై సాయి బ్రహ్మానందం గొర్తి వ్యాసం; కొత్త రచయిత చంద్రశేఖర్ కథ అనుభవంతొ పాటు గౌరి, శర్మల కథలు; దేశికాచార్యులు, ఇంద్రాణి, సుబ్రహ్మణ్యం, భగవంతం, నారాయణ, శ్రీవల్లీ రాధిక, రత్నమాంబ, రవిశంకర్, వైదేహి శశిధర్, ముకుందరామారావు, మోహనరావుల కవితలు, నాకు నచ్చిన పద్యం, పలుకుబడి, కనకప్రసాద్ మూడు లాంతర్లు, శబ్ద రచన, కథ నచ్చిన కారణం శీర్షికలు.