ఈమాట సెప్టెంబర్ 2011 సంచికకు స్వాగతం!

వేగుంట మోహన ప్రసాద్ (05జనవరి 1942 – 03ఆగస్ట్ 2011): మో’ గా సుప్రసిద్ధుడైన అపరిచితుడు కవి వేగుంట మోహనప్రసాద్. ఆంగ్ల సాహిత్యంలో ఎం. ఏ. విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా పని చేశారు. మొట్టమొదట ప్రచురించబడ్డ కవిత హిమానీహృది, 1960 మే నెల భారతిలో. మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పుడు తన ఊరి తన వారి జ్ఞాపకానుభవాల కాక్‌టెయిల్‌ ‘చితి-చింత’ (1969) మో’కి తెలుగు కవుల్లో ఒక ప్రత్యేకమైన ఉనికిని తెచ్చింది. ‘రహస్తంత్రి’, ‘సాంధ్యభాష’, ‘పునరపి’, ‘నిషాదం’, ఇలా ఎన్నో ‘నీడలూ జాడ’ల్లో ఆయన ‘బతికిన క్షణా’ల్లో ఆయన ‘కరచాలనాల’ నుంచి వెలువడినై. తెలుగు కవిత్వపు కాన్వాసు మీద అరాచకంగా ఒలికి అద్భుతమైన ప్రశ్నగా పరిణమించిన రంగు పదం మో’.

ఈ సంచికలో మీకోసం:

మన సంస్థలు- మన సంస్కృతిపై వేలూరి వేంకటేశ్వర రావు సంపాదకీయం; కొత్త రచయిత బులుసు సుబ్రహ్మణ్యం కథ సోది సుబ్బయ్యగారి సొంతగోడు, లైలా యెర్నేని, సాయి బ్రహ్మానందం గొర్తి, శర్మ దంతుర్తి, కె.వి. గిరిధరరావుల కథలు; గౌరి కృపానందన్ అనువాద కథ; తిరుమల కృష్ణదేశికాచార్యులు, పాలపర్తి ఇంద్రాణిల కవితలు; భీమ్‌సేన్‌జోషీ, రావు బాలసరస్వతీదేవి గురించి కొడవటిగంటి రోహిణీప్రసాద్ సంగీత వ్యాసాలు; కనకప్రసాద్ సాహిత్య చింతన మూడు లాంతర్లు, పరి పరి తెరగుల శబ్ద రచన; జెజ్జాల కృష్ణ మోహనరావు, వేలూరి వేంకటేశ్వరరావు, భద్రిరాజు కృష్ణమూర్తుల వ్యాసాలు; తానా 2011 సమావేశపు సాహిత్య ప్రసంగాల చిత్రతరంగాలు; కొ.కు – భానుమతిపై కినిమా వ్యాసం, చీమలమర్రి బృందావనరావు – నాకు నచ్చిన పద్యం, గౌరి కృపానందన్ – కథ నచ్చిన కారణం, మో గుర్తుగా ఒక మో కవిత, త్రిపురకు కనకప్రసాద్ శుభాకాంక్షలు.