క్రిక్కిరిసిన వీథిలో
పక్కనుండి
ప్రశాంతంగా
పారుతున్న
కాలువ నీటి చర్మంపై కూడా
ప్రతిబింబిస్తోన్న
ఆకాశపు నీలిరంగు అర్థాన్ని
అన్వేషిస్తుండగానే –
కళ్ళవెనకనున్న తలలోంచి
నీ తెలుపురంగు గోడల ఇల్లు
గుర్తుకొచ్చిందన్నావు…
ఇక వెంటనే
ఇంటినుండి బయలుదేరిన పనిలోనో
తిరిగి ఇంటికి వెళ్ళాల్సిన పనిలోనో
పాదాలు నిమగ్నమైనందున
ఆ నీలిరంగు క్ర…మం…గా… పల్చబడి
తెలుపురంగులోకి మారిపోయింది –
అని కూడా అన్నావు.
ఐతే –
భార్యా పిల్లలు ఊరికెళ్ళిన వేసవి సెలవుల్లో
ఒక లేత తీరిక ఉదయాన
నీ తెలుపురంగు గోడల ఇంట్లో నిద్ర లేచి
కిటికీలోంచి బయటకు చూసినప్పుడు
ఆకాశంలో కనిపించిన నీలిరంగులో
మరి నీకు
ఏ అర్థమైనా గోచరించిందా…?