కొనసాగింపు

ఈ నడిచే ఇనప్పెట్టె తాళాలు
తన చేతికి రాగానే
గర్వంగా నావైపు చూసి
కారెక్కింది మా అమ్మాయి.

ఇప్పటిదాకా అన్నీ నేనై నడిపించినవాణ్ణి
చేతిలో ఉన్న యాంత్రిక వలయంతో
ప్రతి అడుగుని నిర్దేశించినవాణ్ణి
ప్రాధాన్యతలేని సహ ప్రయాణికుడి స్థానానికి
నెమ్మదిగా అలవాటుపడతాను.
(కుడికాలు మాత్రం అపుడపుడు
తనది కాని పాత్రను పోషించబోయి
భంగపడుతూ ఉంటుంది.)

చిన్నప్పట్నించి చూస్తున్న రోడ్డునే
కొత్తగా తెలుసుకోవటానికి
తను మాత్రం త్వరగానే అలవాటుపడుతుంది.
గజిబిజిగా కనిపించి, బెదిరించిన వాహనాలు
క్రమంగా ఒక సరళరేఖలోకి సర్దుకుంటాయి.
వెనక చూపుల అద్దంలోకి
భయంభయంగా చూసినదే, తరువాత
భయాన్ని అద్దానికే వదిలి
ముందుకు దృష్టి సారిస్తుంది.

తరం మారిన కొత్త చేతులకి
కారు కూడా అలవాటుపడుతుంది
భుజాలపై మోసిన పసితనం ఇప్పుడు
అజమాయిషీ చేస్తుంటే
ముసిముసిగా నవ్వుకుంటూనే
నమ్మకంగా సాగిపోతుంది.