శర్మిష్ఠ, వేణుకుంజం నాటికల నుంచి పాటలు

“కవిత్వం కూడు పెట్టదు”, “తెలుగులో సృజనాత్మక (creative) రచయితలు కేవలం తమ రచనా నైపుణ్యంతో ఆర్ధికంగా మనగలిగే పరిస్థితి లేదు, ఒకప్పటి రాజులు, జమిందారులు చేసిన తీరులో పోషక వ్యవస్థ అవసరం”, అన్న మాటలు మనం తరచుగా వినేవే. ఈ వ్యాఖ్యలకి వెనకున్న కారణాలేమయినా ఈ ‘పోషక’ పాత్రని స్వాతంత్ర్యానంతరకాలంలో సినిమాలు, పత్రికలు, కొంతవరకు ఆకాశవాణి నిర్వహించాయి. 1938లో తొలిసారిగా మద్రాసు కేంద్రం నుండి తెలుగు ప్రసారాలు ప్రారంభం అయినప్పటినుంచి సుమారు ఒక పాతిక ముప్ఫయ్యేళ్ళపాటు ఆకాశవాణి కేంద్రాలలో – ముఖ్యంగా మద్రాసు, విజయవాడ, హైదరాబాదు – చెప్పుకోదగ్గ సంఖ్యలోనే పేరొందిన రచయితలు పనిచేశారు. (1938 నాటికి ముందే మద్రాసు నగరంలో రేడియో ప్రసారాలు జరిగినా ప్రత్యేకించి తెలుగు కార్యక్రమాలు తయారు చేయబడ్డ దాఖలాలు లేవు. 1924-27 మధ్య మార్కోని కంపెనీ ప్రోత్సాహంతో సాగిన The Madras Presidency Radio Club వారు గ్రామఫోను రికార్డులనే వినిపించేవారు. అది ఆర్ధిక సమస్యలతో మూతబడిన తరువాత 1929-38 కాలంలో మద్రాసు నగరపాలక సంస్థ రేడియో ప్రసారాలను నిర్వహించింది.)

తెలుగు కార్యక్రమాల ప్రారంభం గురించి బాలాంత్రపు రజనీకాంతరావు (రజని), అవసరాల (వింజమూరి) అనసూయ, బుజ్జాయి (కృష్ణశాస్త్రిగారి కుమారుడు), ఆచంట జానకిరాంగార్లు వేర్వేరు రచనల్లో క్లుప్తంగా ప్రస్తావించడమే కాని వివరంగా రాసిన వారెవరూ లేరు. మొదటి తెలుగు ప్రసంగం చేసినది, అలాగే తొలి శ్రవ్య రూపకం రాసినది కృష్ణశాస్త్రిగారే అని బుజ్జాయిగారన్నారు. ఈ తొలినాళ్ళలోనే శ్రీశ్రీ (మోహినీ రుక్మాంగద, సంగీతం: సాలూరి); ముద్దుకృష్ణ, జానకిరాం, (అనార్కలి, సంగీతం: రజని); చలం మొదలయిన ప్రముఖులు కూడా రేడియో కోసం శ్రవ్యరూపకాలు రాసేవారు. ఏదేమయినా రేడియోలో ప్రసారమైన శ్రవ్యరూపకాల విషయంలో సంఖ్యాపరంగా కానీ, శ్రోతల ఆదరణ విషయంలో కానీ కృష్ణశాస్త్రిగారిదే అగ్రస్థానం. విద్యాపతి, ఆండాళ్ళు, ధనుర్దాసు, మాళవికాగ్నిమిత్రం, శివక్షేత్రయాత్ర, అరుణరథం, శర్మిష్ఠ, కృష్ణాష్టమి, వేణుకుంజం, మేఘసందేశం, అతిధిశాల – ఇలా ఎన్నో రూపకాలు ఆయన రాశారు. మద్రాసు కేంద్రం తొలినాళ్ళలో ప్రత్యక్ష ప్రసారాలు కావడంతో భద్రపరచుకునే అవకాశం లేకపోయిందనుకున్నా, ఆయన హైదరాబాదులో ఉద్యోగిగా పనిచేసిన కాలంలో రికార్డయినవి కూడా చాలావరకు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. వీటి పూర్తి పాఠాలు మాత్రమే మనకు లభ్యమవుతున్నాయి.

ఇక్కడ మీకు వినిపించబోయేవి ‘శర్మిష్ఠ‘ (హైదరాబాదు కేంద్రంలో 1960 ప్రాంతంలో మరల రికార్డు కాబడినది. 1942 ప్రాంతంలో ప్రసారితమైన శ్రవ్య రూపకం మనకి ఈనాడు లభ్యం కాదు), ‘వేణుకుంజం‘ రూపకాలలోని పాటలు మాత్రమే. రెంటికీ సంగీత దర్శకత్వం పాలగుమ్మి విశ్వనాథంగారే. వేణుకుంజం రూపకంలో రామలక్ష్మి రంగాచారిగారు పాడిన పుట్టకాడ ఎవరో అన్న పాట తరువాత బంగారుపంజరం సినిమాలో అదే బాణీలో వాడబడింది. ఈ రెండు రూపకాల్లోని పాటలు నేను చాలా సంవత్సరాల క్రితం విశ్వనాథంగారి వద్ద కాపీ చేసుకున్నవి. వారికి నా కృతజ్ఞతలు! ఈ రెండు రూపకాల పూర్తి పాఠాన్ని ఆసక్తి గలవారి కోసం అందిస్తున్నాను.


1. వేణుకుంజం

నాటకం రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి.
సంగీతం: పాలగుమ్మి విశ్వనాధం.

  1. పుట్టకాడ ఎవరో – రామలక్ష్మి.
  2. వస్తున్నాడు కొండయ్య – బృందగానం.
  3. తెలుసా నా గుట్టు – వింజమూరి లక్ష్మి.
  4. ఊరెల్లి పోతావా తుమ్మెదా – బృందగానం.
  5. ఎద్దులైతే – బృందగానం.
  6. అయ్యో యని – బృందగానం.

2. శర్మిష్ఠ

నాటకం రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి.
సంగీతం: పాలగుమ్మి విశ్వనాధం.

  1. ఏల ఇంత జాలి – పాలగుమ్మి విశ్వనాధం.
  2. ఈలాగైనానే చెలీ – శారదా శ్రీనివాసన్.
  3. మూసిన తలుపెవరే – వక్కలంక సరళ.
  4. ఎంత బాధ చెలీ – వక్కలంక సరళ.
  5. చెప్పుకో నేనెవరినో – ఎ. వి. సావిత్రి.
  6. కొండ కోనల, కొలను కొలనుల – బృందగానం; గుండె ఎగసెను – వసంత.
  7. జాగ్రత్తండీ – నూకల చిన సత్యనారాయణ.
  8. ఏ చోట దాచితివో – వక్కలంక సరళ, చిత్తరంజన్.