ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా (TANA) తమ 18వ ద్వైవార్షిక సమావేశోత్సవాన్ని జులై 1-3న శాంటా క్లారా, కాలిఫోర్నియాలో జరుపుకుంటున్నది. వారికి మా శుభాకాంక్షలు. ఈ సమావేశాలకు తెలుగు దేశం నుంచి ఎందరో రాజకీయ కళా సాంస్కృతిక రంగాల ప్రముఖులు అతిథులుగా వస్తున్నారు. తానా సాహిత్య సమావేశంలో మేడసాని మోహన్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, కాత్యాయనీ విద్మహే, మృణాలిని, వాసిరెడ్డి నవీన్ తదితరులు పాల్గొంటున్నారు. బాపూ బొమ్మల కొలువు ఈ సమావేశంలో ఒక ప్రత్యేక ఆకర్షణ.
ఈ సందర్భంగా కె.వి. గిరిధరరావు సంపాదకత్వంలో ప్రచురింపబడిన జ్ఞాపిక తెలుగు పలుకు లోని సాహిత్యాన్ని ఈమాట గ్రంథాలయంలో పొందు పరిచాము. ఇలా సావనీరులో ప్రచురించబడిన రచనలను మరెందరో పాఠకులు చదవగలిగే ఈ ప్రతిపాదనకు సాదరంగా అంగీకరించి సహకారం అందించిన తానా వారికి మా కృతజ్ఞతలు.
ఈ సంచికలో మీకోసం – ఆర్. దమయంతి వానజల్లుల జ్ఞాపకాలు; వేలూరి చెప్పిన కథ నచ్చిన కారణం; భైరవి రాగంపై రోహిణీప్రసాద్ సంగీత వ్యాసం; ఇంద్రాణి, ఉదయకళ, కృష్ణదేశికాచార్యుల కవితలు; మరి కొన్ని అపురూపమైన గొంతుకల ఆడియోలు; కనకప్రసాద్ శబ్ద సాహిత్యం; పాత సినిమా పత్రిక కినిమా నుంచి సేన్ గుప్తా వ్యాసం; తదితర రచనలు.