స్వప్నవాసవదత్తం -7

ఆరవ అంకం

కంచుకి ఇదిగో! ఈ కాంచనతోరణ ద్వారం దగ్గర. ఎవరైనా ఉన్నారా?

ప్రతీహారి అయ్య! నేను విజయను ఉన్నాను. (ఒక అమ్మాయి ప్రవేశిస్తుంది).

కంచుకి అమ్మాయీ! నేను ఉజ్జయినీ మహారాజు మహాసేనుడి కంచుకిని. పేరు రైభ్యుడు. వత్సరాజు ఉదయనుడికోసం మహారాణి అంగారవతీదేవి పంపిన దాది ద్వారం దగ్గర వేచియున్నారని చెప్పు.

ప్రతీహ్జారి చెప్పడానికి సమయం కాదయ్యా!

కంచుకి ఎందుకు?

ప్రతీహారి ఈరోజు ప్రభువు తూర్పుప్రాసారంలో ఏదో వీణానాదం వినిపిస్తోంటే, “ఇది ఘోషవతి శబ్దంలా ఉందే” అంటూ అక్కడకి వెళ్ళారు. అక్కడా వీణని చూసి “ఇది ఇక్కడికెలా వచ్చింది?” అని అడిగారు. అక్కడివాడు “నర్మదానది ఒడ్డున ఒక దర్భపొదలో పడి ఉంటే పట్టుకొచ్చా. కావాలంటే ప్రభువులు తీసుకోవచ్చు” నన్నాడు. ఆ వీణని తీసుకునివెళ్ళి ఒళ్ళో పెట్టుకుని కళ్ళుతిరిగి పడిపోయారు. మళ్ళీ తేరుకుని “ఘోషవతీ! నువ్వు కనబడ్డావు కాని ఆమె కనిపించలేదే” అంటూ వాపోవడం మొదలెట్టారు. అందువల్ల, ఇప్పుడు మీ విషయం చెప్పినా ఉపయోగం లేదు.

కంచుకి ఈ విషయం కూడా దానికి సంబంధించినదే. అందువల్ల, వెళ్ళి చెప్పు.

ప్రతీహారి అదిగో! ప్రభువులు తూర్పుప్రాసాదం దిగివస్తున్నారు. చెబుతాను.

( విదూషకుడు, రాజు ప్రవేశిస్తారు)

రాజు (వీణతో మాట్లాడుతున్నట్లుగా) చెవులకింపుగా పలికేదానివి. సుఖంగా వాసవదత్త ఒంపుల ఒళ్ళో పడుకునేదానివి. ఇప్పుడో! ఈ పక్షిరెట్టల్తో వికారంగా ఉన్నావు. భయంకరంగా  అడవితుప్పల్లో ఆలనాపాలనా లేకుండా పడున్నావిన్నాళ్ళూ. ఆమె నిన్ను ఒడిలో మోసినప్పుడు ఆమె ఒత్తిడికి సుఖపడేదానివి. ఆమె అలిసిపోయినప్పుడు ఆమె స్తనాలపై పడి సుఖించేదానివి. ఆమె నాపైన విరహం పడ్డప్పుడల్లా, ఆ దుఃఖాలూ, కౌగిలింతలూ నీకే. ఇప్పుడు నీకా తియ్యని నవ్వులూ, మాటలూ గుర్తుకు రావటల్లేదూ?

విదూషకుడు రాజ్యం తిరిగిసంపాదించుకున్న సందర్భంలో, నువ్విలా బాధపడుతూ కూర్చోవడం  ఏం బాగాలేదు మిత్రమా!

రాజు నాలో కోర్కెల్ని నిద్ర లేపిందీ వీణ. ఇదంటే వాసవదత్తకి చాలా ఇష్టం. మంచి పనివాణ్ణి చూసి దీనికి తీగలు వేయించు.

విదూషకుడు సరే (వీణ తీసుకుని వెళ్ళిపోతాడు).

ప్రతీహారి (వచ్చి) జయము! జయము! ప్రభూ! కంచుకి రైభ్యుడు, దాది వసుంధర గుమ్మం దగ్గర వేచి ఉన్నారు.

రాజు పద్మావతిని పిలు. (ప్రతీహారి వెళ్ళిపోతుంది) నేను పెళ్ళి చేసుకున్న విషయం మహాసేనుడికి తెలిసిందా ఏమిటి?

(పద్మావతి ప్రవేశిస్తుంది).

పద్మావతి ఆర్యపుత్రా! జయము!

రాజు మహాసేనుడు పంపిన దాది వచ్చిందని నీకు తెలిసిందా?

పద్మావతి (నవ్వుతూ) ఙ్ఞాతుల క్షేమం తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం.

రాజు అహఁ! మంచిది. రా! కూర్చో! (పద్మావతి కూర్చోదు.) కూర్చోవేమిటి?

పద్మావతి నాతో కూర్చుని వాళ్ళని రమ్మని కబురు పంపిస్తారా ఏమిటి?

రాజు తప్పేముంది?

పద్మావతి మరో భార్య పక్కన ఉందిగదా అని వాళ్ళు తటస్థంగా ఉంటారేమో?

రాజు “మేము మంచివాళ్ళమే గదా! ఈయనెందుకు ఆవిణ్ణి దాస్తున్నాడు?” అని వాళ్ళు నామీద నిందవేస్తే? అందువల్ల కూర్చో.

పద్మావతి సరే (కూర్చుంటుంది).

రాజు వాళ్ళమ్మాయిని నాతో పంపించారు. నేనామెను రక్షించలేకపోయాను. వాళ్ళకి నా మీద కోపం వచ్చివుంటుంది. ఏమంటారో? ఏమో? భయంగా ఉంది.

ప్రతీహారి వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభూ!

రాజు రమ్మన్నామని చెప్పు.

(ప్రతీహారి వెళ్ళి, కంచుకి, దాదిలతో తిరిగివస్తుంది.)

కంచుకి అత్మీయుడైన ఉదయనుడి రాజ్యం కౌశాంబీకి వచ్చి మనసుకు మహానందంగా ఉంది. కాని రాజకుమార్తె వాసవదత్త మరణంవల్ల మనస్సుకి విపరీతంగా బాధకలుగుతోందికూడా. భగవంతుడా! నువ్వేమైనా చెయ్యగల సమర్ధుడివి. రాజ్యం శత్రువులకిచ్చి వాసవదత్తని బ్రతికించి ఉండినా బాగుండేది కదా! (రాజుని చూసి) ప్రభూ! జయము.

దాది   ప్రభూ! జయము.

రాజు రాజ వంశాలకి సహాయపడే మహాసేనుడు క్షేమమేనా?

కంచుకి అహాఁ! క్షేమమే. మీక్షేమం కూడా అడగమన్నారు.

రాజు (లేచి) మహాసేనుడి ఆఙ్ఞ ఏమిటి?

కంచుకి మీరు ఆసనం దిగి గౌరవించడం బాగుంది. కూర్చునే సందేశాన్ని వినాలని నా ప్రార్ధన.

రాజు మహాసేనుడి ఆఙ్ఞ. (కూర్చుంటాడు).

కంచుకి శత్రువులు అపహరించిన రాజ్యం గెలిచాం. అసమర్ధులూ, భయపడేవాళ్ళూ అయిన రాజులైతే ఉత్సాహం ఉండదు. రాజ్యవైభవం ఉత్సాహవంతులకే గదా!

రాజు ఇదంతా మహాసేనుడి గొప్పదనం. ఇదివరకు ఆయన సేనల చేతిలో ఓడిపోయినా తన పిల్లల్లో ఒకడిలా నన్ను చూసుకున్నారు. వాళ్ళమ్మాయికి వీణ నేర్పుతానని చెప్పి ఎత్తుకునిపోయి పెళ్ళిచేసుకుని రక్షించలేక పోయాను. అయినా నామీద కోపపడకుండా నారాజ్యాన్ని నాకు సంపాదించి పెట్టారు.

కంచుకి ప్రభూ! నేను విన్నవించింది మహాసేనుని సందేశం. దాది మహారాణి సందేశాన్ని వినిపిస్తుంది.

రాజు అమ్మలాంటి అత్తగారు క్షేమమేనా?

దాది ఆరోగ్యవంతురాలైన మహారాణి, ప్రభువుని కుశలమడిగింది.

రాజు ఆఁ! అంతా క్షేమమే! ఇదిగో ఇలావుంది నాక్షేమం (విచారంగా ముఖం పెడతాడు.)

దాది బాధపడకు ప్రభూ!

కంచుకి రాజకుమార్తె వాసవదత్త చనిపోయినా, మీ మనస్సులో ఇలా మెదుల్తూ జీవించి ఉన్నట్టేగదా! చనిపోవలసినవాణ్ణి ఎంతటి ఆప్తుడైనా ఎలా రక్షించగలడు? త్రాడు తెగిపోతే కుండని ఎవరు పట్టుకోగలరు? చెట్లతో సమానమైన ధర్మానికి లోబడ్డ మానవుడు రావలసిన సమయమొస్తే పుడుతున్నాడు, గిడుతున్నాడు. అంతే!

రాజు కాదు! కాదు! మహాసేనుని కూతురు వాసవదత్త నాశిష్యురాలు, ప్రియురాలు, అంతేకాదు నాపట్టమహిషి కూడా. మిగతా జన్మల్లో కూడా ఆమెని తల్చుకుంటూనే ఉంటాను.

దాది మహరాణి ఇలా చెప్పమంది. “వాసవదత్త చనిపోయింది. నాకు, మహాసేనుడికీ మా పిల్లలు గోపాలకపుత్రులు ఎలాంటివాళ్ళో, నువ్వూ అలాంటివాడివే. అందుకే నిన్ను ఉజ్జయినికి తీసుకువచ్చాం. అగ్నిసాక్షిగా పెళ్ళికాకపోయినా వీణనేర్పుతానంటే పిల్లని నీ దగ్గరకి పంపించాం. నువ్వు తెలివితక్కువగా ఆపెళ్ళేదో అవకుండానే అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయావు. తర్వాత నీపటం, వాసవదత్తపటం పెట్టి పెళ్ళిచేసాం. ఆ పటాల్ని నీకు పంపిస్తున్నాం. వాటిని చూసి ఊరట పొందు.”

రాజు ఆహా! ఎంత ప్రేమగా చెప్పింది మహారాణి అంగారవతి. దోషినైనా నాపట్ల పుత్రవాత్సల్యం చూపిస్తోందే. ఈ మాట రాజ్యాల్ని జయించినప్పటికంటే ఎక్కువ ఆనందం ఇస్తోంది.

పద్మావతి ప్రభూ! ఈ చిత్రంలోని పెద్దలకు నమస్కరించాలని ఉంది.  (దాదితో) ఇలా ఇవ్వండి.

దాది ఇదిగో. (ఇస్తుంది)

పద్మావతి (చూసి, తనలో) అవంతికలా ఉందే. (బయటకు) వాసవదత్తలాగా ఉందే.

రాజు “లాగ” కాదు. వాసవదత్తే.

పద్మావతి (తనలో) ఇప్పుడు రాజు చిత్రం చూస్తా. దాన్నిబట్టి చిత్రం వేసినవాడు ఎంత నేర్పరో అర్ధమవుతుంది. అప్పుడు వాసవదత్త చిత్రం గురించి కూడా తెలుస్తుంది.

దాది ఇదిగో ప్రభువుల చిత్రం.

పద్మావతి (చూసి) రాజుకీ, రాజుచిత్రానికీ తేడాలేదు. అంటే వాసవదత్తకి, ఆమె చిత్రానికీ తేడా ఉండిఉండదన్నమాట.

రాజు ఈ చిత్రాలు చూసినప్పటినుంచీ నీ ముఖంలో మార్పులు గమనిస్తున్నా. కారణం?

పద్మావతి ఈ చిత్రంలోవున్న అమ్మాయి ఇక్కడే ఉంటోంది.

రాజు ఏమిటీ? వాసవదత్తా?

పద్మావతి అవును.

రాజు వెంటనే పిలిపించు.

పద్మావతి ప్రభూ! నాకు పెళ్ళికాకమునుపు ఒక బ్రాహ్మణుడు తన చెల్లెలంటూ ఈ అమ్మాయిని నాదగ్గరుంచి వెళ్ళాడు. భర్త దూరదేశాల్లో ఉన్నాడట. పరపురుషుణ్ణి చూడదు. దాది వెళ్ళి, ఆమె వాసవదత్తో కాదో తేలుస్తుంది.

రాజు బ్రాహ్మణుని చెల్లెలంటే మరెవరో అయివుంటుంది. మనుషుల్ని పోలిన మనుషులుంటారు.

ప్రతీహారి (వచ్చి) ప్రభూ! జయము! ఉజ్జయినిలో ఉండే బ్రాహ్మడట. పద్మావతీదేవి దగ్గర తనచెల్లెల్ని వదిలాడట. ఆ అమ్మాయిని తీసుకువెడతాడట.

రాజు పద్మావతీ! ఆ బ్రాహ్మణుడేనా?

పద్మావతి కావచ్చు.  (ప్రతీహారితో ) వెంటనే రమ్మన్నామని చెప్పు.

రాజు పద్మావతీ! నువ్వా అమ్మాయిని తీసుకురా!
(సరేనని పద్మావతి వెళ్ళిపోతుంది. యౌగంధరాయణుడు ప్రవేశిస్తాడు.)

యౌగంధరాయణుడు ఉదయనమహారాజు శ్రేయస్సుకోసం ఇదంతా చేసాను. కాని ఆయన ఏమంటాడో. ఏమో. (పైకి) మహారాజా! జయము!

రాజు ఓ బ్రాహ్మణుడా! నీకంఠం ఎక్కడో విన్నట్టుగావుంది. చెల్లెల్ని పద్మావతి దగ్గర ఉంచిన బ్రాహ్మణుడివి నువ్వేనా?

యౌగంధరాయణుడు ఔను.

రాజు (ప్రతీహారితో) అయితే ఆ అమ్మాయిని త్వరగా రమ్మనండి.

(పద్మావతి, అవంతిక ప్రవేశిస్తారు).

పద్మావతి నీకిష్టమైంది చెప్పబోతున్నా.

వాసవదత్త ఏమిటది?

పద్మావతి మీఅన్నయ్య వచ్చాడు.

వాసవదత్త అమ్మయ్య! ఇప్పటికైనా గుర్తుంచుకుని వచ్చాడు.

పద్మావతి (బ్రాహ్మణునివంక చూస్తూ) ఇదిగో మీసొమ్ము.

రాజు పద్మావతీ! ఆ అమ్మాయిని పంపు. రైభ్యుడు, దాది నువ్వు అతనికి ఆమెను తిరిగి అప్పజెప్పావనడానికి సాక్షులు.

పద్మావతి (యౌగంధరాయణుడితో) అవంతికని మీరు తీసుకుని వెళ్ళచ్చు.

దాది రాజకుమార్తె వాసవదత్తలా ఉందే?

రాజు (ఆశ్చర్యంగా) ఏమిటి? వాసవదత్తా. అయితే పద్మావతితో అంతఃపురానికి వెళ్ళిపో.

యౌగంధరాయణుడు అదెలా? ఆమె నాచెల్లెలు.

రాజు ఏమిటలా అంటున్నావు? ఈమె వాసవదత్త కాదా.

యౌగంధరాయణుడు ప్రభూ! భరతవంశంలో పుట్టి, ఒద్దికగా, బుద్ధిమంతులుగా పెరిగి, కల్మషంలేని ధర్మపరిపాలన చేస్తున్న మీరు ఇలా బలవంతంగా ఒక అమ్మాయిని తీసుకుపోవడం బాగా లేదు.

రాజు సరే. నేను ముఖంచూసి నిర్ధారిస్తాను. యవనికా! ఆ మేలిముసుగు తొలగించు.

యౌగంధరాయణుడు ప్రభూ! జయము.

వాసవదత్త ఆర్యపుత్రా! జయము.

రాజు అరే! ఇతను యౌగంధరాయణుడు! ఈమె వాసవదత్త!ఇది కలా? నిజమా? ఈమెని మళ్ళీ చూస్తున్నానా? ఆరోజు సముద్రగృహంలోకూడా ఇలాగే భ్రమపడ్డాను.

యౌగంధరాయణుడు ప్రభూ! వాసవదత్తని మీకు దూరం చేసిన తప్పుకు నన్ను క్షమించండి.

రాజు (లేచి) అవాస్తవమైన, ఉన్మాదచేష్టలతో కూడిన యుద్ధాల్తోను, నీతిశాస్త్రం, మంత్రిత్వంలాంటి వాటిల్లోనూ ములిగిపోతున్న మమ్మల్ని ఉద్ధరించావు యౌగంధరాయణా!

యౌగంధరాయణుడు మీ అదృష్టమే మా అదృష్టం ప్రభూ!

పద్మావతి అయ్యో! ఈ వాసవదత్తని చెలికత్తెలా చూసి సరైన మర్యాద చెయ్యలేదు. తలవంచి నమస్కరించి ప్రసన్నురాల్ని చేసుకుంటా. (నమస్కరిస్తుంది).

వాసవదత్త లే అమ్మా! నన్ను యాచకురాలిగా పరిచయం చేసుకోవడం నాతప్పు.

పద్మావతి అయితే నువ్వు నన్ననుగ్రహించినట్లే.

రాజు యౌగంధరాయణా! వాసవదత్తను నానుంచి ఎందుకు దాచిపెట్టావు? ఈ పద్మావతి చేతిలో ఎందుకు పెట్టావు?

యౌగంధరాయణుడు మన పుష్పకభద్రుడి జ్యోతిష్కులు మీకూ పద్మావతీదేవికీ పెళ్ళవుతుందని జోస్యం చెప్పారు.

రాజు ఇది రుమణ్వంతుడికి తెలుసా?

యౌగంధరాయణుడు ఔను! అతనుకూడా ఈ విషయంలో రహస్యంగా పనిచేసినవాడే. వాసవదత్త క్షేమంగా ఉందని మహాసేనుల వారికి చెప్పడానికి మీరు రైభ్యుణ్ణీ, దాదినీ పంపించండి ప్రభూ!

రాజు కాదు! కాదు! మనమందరమూ పద్మావతితో సహా స్వయంగా వెడదాం.

యౌగంధరాయణుడు ఆఙ్ఞ!

(అందరూ వెళ్ళిపోతారు).

రచయిత భాస్కర్ కొంపెల్ల గురించి: భాస్కర్‌ కొంపెల్ల జననం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో. నివాసంన్యూజెర్సీలో. ఈమాట సంస్థాపక సంపాదకులలో ఒకరు. యూరప్‌, మెక్సికోలలో కొంతకాలం ఉన్నారు. సంస్కృత, ఆంగ్ల సాహిత్యాల్లో అభిరుచి. కవితలు, కథలు , వ్యాసాలు రాసారు. ...