తుపాకులు కాల్చవు
కాల్చేది మనుషులు
మనుషులే కాల్చుతారు
మాటల్తో కాల్చుతారు చూపుల్తో కాల్చుతారు
మౌనంతో కాల్చుతారు మమతల్తో కాల్చుతారు
రంగుల్తో కాల్చుతారు సిరాతో కాల్చుతారు
తుపాకీతోనూ కాల్చుతారు
కాల్చేమనుషులకి తెలుసు
ఎప్పుడు దేంతో కాల్చాల్సిందీ
ఇల్లు కాలినా ఒళ్ళు కాలినా కడుపు కాలినా
మనసు కాలనిదే
ఎవరూ ఏదీ కాల్చరు
అందుకే
ఈ దేశంలో
ఇల్లు కాలీ ఒళ్ళు కాలీ కడుపు కాలీ
మందుగుండు
దీపావళి మందుగుండు
కాల్చుతున్నారు
అందుకని ముందుగా
మనసుల్ని కాల్చితే
ఆ మనుషులు
తుపాకులు కాల్చుతారు
మాటల తుపాకులు
చూపుల తుపాకులు
మందుగుండు తుపాకులు
తుపాకుల తుపాకులు కాల్చుతారు