చింతచెట్టు కింది మేజాబల్లకేసి చూసి కోపం పట్టలేక అంజిగాడి కోసం దిక్కులు చూసేడు సకల.
‘‘అంజిగా, ఓ రంజిగా’’
ఉదయం ఏడు గంటలవేళ. చిరుచలిగా ఉంది. సంత ఇంకా ప్రారంభం కాలేదు. దుకాణాలవాళ్ళు కందరు బస్తీలనుంచి మెటాడోర్లలో వచ్చి దిగుతున్నారు. చింతచెట్ల కింద ఎవరికి కేటాయించిన స్థలంలో వాళ్ళు చాపలు పరుచుకుని, వాటిమీద తమ సరుకుల మూటలు పెట్టి, అక్కడికి కాస్త ఎడంగా ఉన్న రంగూనోడి టీకొట్టుకి వెళ్ళి వేడివేడి టీ నీళ్ళతో గొంతు తడుపుకని వస్తున్నారు.
మేజాబల్ల మీది పక్షుల రెట్టలు చూసి చిర్రెత్తుకచ్చింది సకలకి.
‘‘అంజిగా’’ అని మరింత గట్టిగా అరిచేడు.
హటేలు పాకలోంచి రెండు గెంతుల్లో ఉరికి వచ్చేడు అంజిగాడు.
‘‘ఏటబ్బాయా, నీకెన్నిసార్లు సెప్పాల నాది అనుమంతులోరి పేరని? అలాగ అంజిగా అంజిగా అనకబ్బాయా’’ అన్నాడు.
‘‘ఏడిసేవులేగాని నీకెన్నిసార్లు సెప్పాల్రా సంతరోజుకి మేజాబల్లని శుభ్రంగా కడిగి నీటుగా పెట్టమని. బల్లనిండా పచ్చుల రెట్టలు సూసేవా ఎంతసయ్యింగా ఉన్నాయో! ఆటిమీదిలాగే తొంగుంటున్నావా? ఈ బల్ల ఇలాగుంటే మనకాడ రింకులెవడు తాగుతాడ్రా?’’
‘‘ఎంతసేపు, ఛెణంలో బల్లని అద్దంలాగ కడిగెయ్యనూ! నువ్వెల్లి టీ తాగేసిరా’’ అంటూనే అంజిగాడు నూతి దగ్గరికి పరుగెత్తేడు. ఒక బకెట్టు నీళ్ళుతెచ్చి బల్లమీద వంపి చింతచెట్టు మొదల్లో దాచిపెట్టిన జానాబెత్తెడు కొబ్బరీనెల చీపురు తీసుకుని బరాబరా పామడం మొదలుపెట్టేడు.
అది ఎప్పుడో ఇక్ష్వాకుల కాలంనాటి పాత చెక్కబల్ల.
ఉత్తరోజుల్లో ఆ బల్లని ఎవరూ ఎత్తుకు పోకుండా బల్లకోళ్ళని నేలలోకి పాతిపెట్టేసి ఉంచేడు సకల తండ్రి రాంబిల్లి తన హయాంలో.
అంజిగాడికి ఇల్లూ వాకిలీ అన్నీ ఆ బల్లే. ఎవరైనా పెట్టిందేదో ఆ బల్ల కింద కూచుని తినేసి, ఆ బల్లమీద పడి నిద్రపోవడం వాడి దినచర్య.
పక్కనే చాపమీద ఉల్లిపాయలు, బంగాళా దుంపలు సర్దుకుంటున్న పాపారావు ‘‘నెమ్మది నెమ్మదొరే అంజిగా’’ అనరిచేడు.
ఆ పక్కనే చాపమీద రంగురంగుల పల్చని టెర్లిన్ బట్టలు సర్దిపెడుతున్న జోగాలు మళ్ళీ గెంతుతూ పోతున్న అంజిగాణ్ణి చూస్తూ ‘‘ఉంకో బాల్చీ నీళ్ళుతెచ్చి పంపేసే లాగున్నాడీ నా కొడుకు’’ అని సణుక్కుంటూ అడ్డం నిలబడ్డాడు.
అంజిగాడికి నలభైయ్యేళ్ళు నెత్తి మీదికొచ్చినా నేలనించి మూడడుగులైనా లేని వాడి శరీరంలాగే బుద్ధీ పెరగలేదు. ఇంకో బకెట్టు నీళ్ళు వంపేసి బల్లమీద చీపురుతో మళ్ళీ పామడం మొదలుపెట్టేడు.
సకల వచ్చి అడ్డుకోకపోతే ఆ కార్యక్రమం అలా సాగుతూ ఉండేదే.
‘‘ఏటండి సకల గారో, సీపిరికీ కరువేనేటండి? నేనీ సంత కొస్తన్న కాణ్ణుంచి సూస్తన్నాను. అంజిగాడు ఆ జానెడు సీపురు ముక్కతోనే కనపడతన్నాడు’’ అన్నాడు నవ్వుతూ జోగాలు.
‘‘సీపిరి కన్రా అని ఎన్ని రెళ్ళిచ్చేనో అడగండి, బీడీలు కొనుక్కుని కాల్చేత్తాడెదవ.’’
తన గురించి వాళ్ళలా మాట్లాడుకోవడం చూసి అంజిగాడు బల్లకీవైపు నుంచి ఆ వైపుకి హుషారుగా గెంతేడు.
‘‘ఈడు ముందుజెలమలో తప్పకుండా కోతై ఉంటాడు’’ అన్నాడు పాపారావు.
సకల రంగునీళ్ళ సీసాలు, నానబెట్టిన సబ్జాగింజల సీసాలు తీసి బల్లమీద సర్దుతున్నాడు.
‘‘ఏటల్లుడూ, తెల్లారి కాణ్ణుంచి నీ రంగునీల్ల రింకులు జెనానికి తాగించేద్దారనేనేటి అప్పుడే సరంజామా అంతా సర్దేత్తన్నావు. ఎండెక్కేదాకా మా టీ నీల్లు తాగనియ్ బాబూ’’ అనరిచేడు టీ పాకలోంచి రంగూనోడు.
సకల నవ్వేడు.
పక్కనే సేమ్యాకావిడి తెచ్చి దించుకుంటున్న మస్తాను తాత సకల నవ్వు చూసి ముచ్చటపడ్డాడు. ‘‘ఆళ్ళ బాబులాగే ఈడూ మంచి కళైనోడు’’ అనుకున్నాడు మనసులో.
బల్లమీద సీసాలు సర్దుతున్నా సకల చూపులు మాత్రం అడివిలోంచి జనం సంతలోకచ్చే కాలిబాటమీదే ఉన్నాయి.
అన్నీ సర్దేక బల్లని అన్ని వైపుల్నించీ పరిశీలించి చూసేడు. ఏదో తోచినట్టై ఆ చివర ప్లాస్టిక్ పూలమ్మే మరియమ్మ దగ్గరకెళ్ళి ఓ పూల గుత్తి కనుక్కచ్చి బల్లమీద పెట్టేడు. ‘ఎన్నెల ఈ బల్లని సూసి సేనా బాగుందనుకోవాల.’
‘ఆ పిల్ల, ఎన్నెల తలపులో కస్తే చాలు మనసు గోదారై పోతుంది. మనువు నికరవయ్యేక ఎన్నెల నిజంగా ఎన్నెల్లాగే కనపడతుంది. ఎప్పుడు సూసినా అప్పుడప్పుడే ఇచ్చుకోబోతున్న కండ సంపింగ పువ్వులాగ పసిమించిపోతా కనపడతాది’ అనుకున్నాడు సకల. క్రితం వారం సంతకచ్చినప్పుడు ఆ పిల్ల రూపం ఎలాగుందో కళ్ళల్లో కచ్చింది. ‘పచ్చని పూల పరికిణీ మీద ఎర్రవోణీ ఏసుకుని, పక్కకి అల్లిన జడలో ఎర్రని మందారపుప్వకటి చెంపమీదికి వాలేలాగ తురుముకుని పచ్చింది. సంతలో తిరుగుతా తనని దొంగ సూపులు సూస్తా సూడనట్టు నటించింది.
తనకి తెలీకుండానే తన చూపులు ఆ పిల్ల ఎంటే తిరిగేయి.
మంచి ఎండవేళ బుర్రలో బలుబు ఎలిగినట్టయి పెద్ద గలాసుడు సబ్జాగింజల సర్బత్తు అంజిగాడి చేత పంపించేడు. ముందు పద్దు పద్దని కాసేపు బెట్టుసేసింది. ఆనక గలాసందుకుని గటగటా తాగేసింది. తాగేసి, ఎనక్కి తిరిగి తనకేసి సూసి సందమామ నవ్వినట్టు నవ్వింది! సకల పెదవులు నవ్వుతో, ఆనందంతో విచ్చుకున్నాయి.
మెల్లగా పొద్దుపైకి ఎలబారింది.
అడవి నుంచి జనం కమలా ఫలాల గంపల్తో, చింతపండు కావిళ్ళతో, కుంకుడు కాయల మూటల్తో రావడం ఆరంభమైంది. యువతరం గిరిజనుల కట్టుబట్టుల మీద టీవీల, సినిమాల ప్రభావం కట్టచ్చినట్టు కన్పిస్తా ఉంది. పాతతరం వాళ్ళు కప్పుల్లో తురుముకున్న అడవి పూల సుగంధం వాళ్ళకన్నా ముందే సంతలోకి వచ్చి వ్యాపిస్తా ఉంది.
జనాన్ని చూసి మస్తాను తాత కుంపటి పొయ్యిలో కాసిని బగ్గులేసి, పాత గుడ్డమీద నాలుగు చుక్కల కిరసనాయిలు పోసి అంటించేడు. ఇంటి దగ్గర నీళ్ళల్లో ఉడికించి, బెల్లంగుండ కలిపి తెచ్చిన సేమ్యా బిందెని కుంపటి మీదికెక్కించేడు. మెల్లగా వేడెక్కుతున్న సేమ్యా నీళ్ళని పెద్ద కర్ర తెడ్డుతో కలపడం మొదలెట్టేడు.
సకలకి తియతియ్యని ఆ సేమ్యా వాసనంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు తండ్రినడిగి అయిదు పైసలూ, పది పైసలూ పట్టుకెళ్ళి మస్తాను గాజు గ్లాసులో పోసి ఇచ్చే సేమ్యాని వేడివేడిగా ఊదుకుంటా తాగడం ఇంకా గుర్తుంది. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని గాని, లేకపోతే ఇప్పటికీ మస్తాను ముందు గొంతుక్కూచుని సేమ్యా తాగాలన్పిస్తుంది.
అప్పట్లో మస్తానుని అందరూ కలకత్తా సాయెబు అనేవోళ్ళు. మస్తానుకి ఒక కాలు కయ్యకాలు. మిలట్రీలో ఉండగా యుద్ధంలో కాలుపోయిందని గర్వంగా చెప్తాడిప్పటికీ. గంపెడు సంసారం, పిల్లాజెల్లాతో ఈ అడివిలోకచ్చి ఎందుకు కాపురం పెట్టేడో ఎవరికీ తెలీదు.
‘‘సకలబ్బాయా, ఎవలచ్చేరో సూడు’’ అంటున్నాడు అంజి.
అంజి భుజంమీద చెయ్యేసి, మరో చేత్తో కర్ర ఊతం పట్టుకుని మెల్లిగా నడిచొస్తున్నాడు గండిపోశయ్య.
‘‘పెద్దయ్యా, బాగున్నావా?’’ అంటూ సకల ముందుకెళ్ళి ముసలాయన్ని నడిపించుకచ్చి తను కూర్చునే స్టూలు వేసేడు.
‘‘ఏటి పెద్దయ్యా ఇలాగైపోయేవు?’’ అన్నాడు సకల మళ్ళీ.
పోశయ్య సకలకేసి తేరిపారజూసేడు.
‘‘ఇలాగైపోక ఇంకెలాగుంటాన్రా, ఏటిది పొయ్యేకాలమా పచ్చే కాలమా’’ పటపటమంటున్న మోకాళ్ళని అతికష్టంమీద పంచి బల్లమీద కూర్చుంటూ ‘అబ్బా’ అని మూలిగేడు పోశయ్య.
‘‘అంజీ, పెద్దయ్యకి రెండిడ్లీ ఒక టీ అట్టుకురా’’ అన్నాడు సకల అతిథి మర్యాదకోసం.
‘‘పద్దబ్బీ సకిలియ్యా, ఉప్పుడే ఇంటికాడ అంబలి తాగి బయలచ్చేను’’ అన్నాడు.
‘‘సలాం పోసియ్య బాబా, సేన్నాళ్ళకి కనపడ్డావు’’ అన్నాడు పక్కనించి మస్తాను.
పోశయ్య కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకుని చూసి ‘‘ఏటి, మత్తానయ్యేనా, బాగున్నావా సాయెబా? పిల్లాజెల్లా అందరూ బాగున్నారా?’’ అనడిగేడు.
‘‘ఏం బాగయ్యా, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు జేసి పంపించీతలికి దేముడు కనిపించేడు. ఇంక మొగ కుర్రోళ్ళు రెక్కలచ్చి ఎవడి దారిని ఆడెగిరెల్లిపోయేడు. నాకు మాత్రం ఈ సేమియా కుండ ఎవ్వారం తప్పలేదు. నేనూ, మా బూబమ్మా కలోగెంజో తాగాలి కదా మరి’’ అన్నాడు మస్తాను.
ఈ లోపల సకల ఎప్పుడెళ్ళేడో సత్తు గ్లాసుతో టీ తెచ్చి ముసలాయనకిచ్చేడు. ఆయనది తాగడం ముగించగానే గ్లాసందుకుని పక్కన పెట్టి, ఆయన కోసం కనుక్కచ్చిన చుట్టని నోట్లోపెట్టి, అగ్గిపుల్ల గీసి వెలిగించేడు.
సకల చేసిన మర్యాదకి పోశయ్య మొహం ఆనందంతో వెలిగిపోయింది. ఆపైన కడుకు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళూరేయి. అది చూసిన సకలకి గతం గుర్తొచ్చి కళ్ళు చెమరించేయి.
పోశయ్య చుట్టపొగని రెండు మూడు దమ్ములు గుండెల్నిండా పీల్చి తృప్తిగా తలాడించి, చుట్టని బల్లకేసి సర్ది ఆర్పి, ముక్కు దగ్గర పెట్టుకుని అపురూపంగా వాసన పీల్చుకుని, మొలగుడ్డలో చుట్టి భద్రంగా దాచుకున్నాడు.
‘‘మీయయ్య ఎలాగున్నాడ్రా సకిలియ్యా’’ అనడిగేడు సకల వైపు చూసి.
‘‘ఏవుంటం, అలాగే మంచంలో … మా యమ్మకి సేతులెత్తి దణ్ణవెట్టాల ఆడితో అలాగ సాగులాడతన్నందుకు.’’
‘‘అవునవును, మీయమ్మ సేనా మంచిబట్టి. అది రాంబిల్లి సేసుకున్న పున్నెం. అసుమంటి బారియా దొరకటం, నీలాటి కడుకు పుట్టటం కూడా అదురుట్టవేరా. అద్దంతరంగా ఆడు మంచాన పణ్ణందుకు సదువు మానేసి ఏదో మీ అయ్య ఏపారం అందుకుని సేసుకుంటన్నావు కదా! బతకటానికేదో ఒకటి, అదీ దైర్నంవంటే’’ అని మెచ్చుకోలుగా చూసేడు.
‘‘ఇన్నావా పోసియ్య బాబా, పాపికండలకాడ అడ్డకట్ట కడతన్నారంట, మనకేసి ఊళ్ళన్నీ ములిగిపోతాయంట’’ అన్నాడు మస్తాను.
పోశయ్య భారంగా తల ఊపేడు. ‘‘మన బతుకుల మీద అడ్డకట్టలు లేందెప్పుడు? పోతే పోనియ్ మస్తానా, మనిసికేది శాసితం? ఇయాల్రేపు కండలు కండలే మాయవై పోతన్నాయి. నా సిన్నప్పుడు ఎక్కడదాకా ఉండీ అడివి ఎక్కడికచ్చిందో సూడు. కాకపోయినా ఎవడ్రా లోకువంటే అందరికీ మనవే అంపడతాం. మన పచ్చాన్ని నిలబడ్డానికి మీసవున్న మొగోడేడి ఉప్పుడు? ఆరెక్కడికి పొమ్మంటే అక్కడికే పోవాలి. పోనీలే, కాలవలత్తే తొండలు గుడ్లెట్టే నేలలన్నీ పచ్చబడతాయేమో సూద్దారి. ఎవడికో ఒకడికి మేలు జరగనియ్‌లే’’ అని ఎటూ పొందకుండా మాట్లాడేడు.
‘‘ఈ ముసలాయిన్లో రోసం పూర్తిగా సచ్చిపోయింది’’ అని సణుక్కున్నాడు మస్తాను.
‘‘అవునొరే సకిలియ్యా, నువ్వింకా మనువాడవేట్రా? నీతోటోల్లందరూ ఇద్దరు ముగ్గురు బిడ్డల తండ్రులయ్యేరు కనుకుంటన్నావా?
మన తెగలో మీసం మొలవగానే ఒకింటోళ్ళై పోటం రివాజు. అలాకాకపోతే తలగొట్టేసినట్టు అనుకునేవోళ్ళు మా కాలంలో. ఏటో, అంతా మారిపోయింది. పాతికేళ్ళచ్చినా మనువులాడరు. మరింక ముసలి కాలానికి బిడ్డల్ని కంటారో ఏటో’’ సణుక్కుంటా లేచి నిలబడ్డాడు పోశయ్య. అతని మోకాళ్ళు పటపట మన్నాయి మళ్ళీ.
‘‘తొరలోనే పప్పన్నం పెట్టబోతన్నాడు సకల. మీకింకా తెల్దేటి?’’ అన్నాడు మస్తాను.
‘‘ఓరి ఓరి ఓరి అవునంట్రా, మా బాబే మా నాయినే’’ అని సకల తలమీద చెయ్యేసి నిమిరేడు పోశయ్య.
‘‘ఏవనుకోకు పెద్దయ్యా, ఎండనబడి రాలేవని పెద్దల బోయినాల నాడు మీ గూడేనికేసి రాలేదు’’ అని చేతులు నలుపుకన్నాడు సకల.
‘‘పర్లేదు పర్లేదులే నాయినా’’ అన్నాడు పోశయ్య.
‘‘జేగర్త పెద్దయ్యా, ఎండనబడి తిరక్కు, సల్లనేళలోనే ఇంటికెల్లిపో’’ అన్నాడు సకల.
సరేనని తలవూగిస్తూ సకలని చూసి ఆప్యాయంగా నవ్వేడు పోశయ్య.
ముసలాయన్ని కంతదూరం వెళ్ళనిచ్చి ‘‘ఎవరండీయన, అంత మరియాద సేస్తన్నారు?’’ అన్నాడు జోగులు. అతనీమధ్యనే ఈ సంతకస్తున్నాడు.
‘‘ఏటీ, ఆయన్నే ఎరగవా?’’ అన్నాడు మస్తాను. ‘‘అతనెవరనుకుంటన్నావు, ఒకప్పుడీ సీతారం అడివికి పులి. ఈ సుట్టుపక్కల గూడేల తండాలన్నింటికీ ఆయనే పెద్ద. ఏ కండ వాలులో ఎవరెంత పోడెగసాయం సేసుకోవాలో ఆయనే సెప్పాల. ఏ ఇంట ఏ తగుపచ్చినా ఆయనే ఇప్పాల. ఈ ఏరియాలో కండ పాదాల బూముల్ని సదునుసేసి మాగాణి ఎగసాయం ఎలాగ సేసుకోవాలో గిరిజన్లుకి నేర్పిందాయనే. పక్కనే పారుతున్న గోదారి నీళ్ళతో బంగారం పండించి గిరిజన బూముల్ని మాగాణి బూములుగా మార్చిందాయనే’’. మస్తాను తెడ్డును బిందెమీద పెట్టి గుంజుతున్న కుడిచేతిని ఎడంచేత్తో నొక్కుకున్నాడు.
ఇద్దరు పిల్లలు రెండు అర్ధ రూపాయి బిళ్ళలు పట్టుకుని వచ్చేరు. వాళ్ళకి బుల్లి బుల్లి ప్లాస్టిక్కు గ్లాసుల్లో సేమ్యా పోసి అందించేడు. కుర్రాళ్ళిద్దరూ సేమ్యా ఒలికి పోతుందేమోనని గ్లాసుల్ని జాగ్రత్తగా పట్టుకునెల్లి చింతచెట్టు కింద మట్టిలో చతికిల బడ్డారు.
మొదటి బోణీ డబ్బుల్ని బిందెమీద టకటకా కట్టి పక్కనే ఉన్న నీళ్ళ తొట్టిలో పడేసుకున్నాడు. కాలు కంచెం కూడదీసుకుని స్టూలుమీద సర్దుకు కూచుని మళ్ళీ మొదలెట్టేడు.
‘‘అలాంటి పులిలాంటోడు కడుకు సేసిన యెవ్వారానికి పిల్లిలాగై పోయేడు. ఉప్పుడింక పయిసూ లేదు, పంట్లో సత్తువా లేదు’’.
‘‘అంత కానెవ్వారం ఏం జేసేడేటండి కడుకు?’’ అన్నాడు శ్రద్ధగా వింటున్న జోగులు.
‘‘ఈ పోసియ్యకి సింతాలు గాడని ఒక్కడే కడుకు. ఆడు కూడా కడుపున పుట్టినోడు కాడు. పయసై పోతన్నా పిల్లలు కలగలేదీయనకి. ఒకపాలి ఈయనా, బార్యా సింగరమ్మ సింతకాడికి మొక్కు సెల్లించుకోటానికి ఎల్లేరు. ఏయమ్మొదిలేసిందో బడ్డూడని బట్టిగాణ్ణి అక్కడొదిలేసింది. ఆడీళ్ళకి దొరికేడు. ఆణ్ణి తెచ్చి సింతాలని పేరెట్టి అత్తారబతంగా పెంచేరు. ఆడాడిందాట పాడింది పాట. ఆడు, ఇడుగో మన సకల కన్నా పెద్దోడే. ఆడు రంపసోడారంలో పదకండు సదువుతున్నప్పుడు ఎవడో రాజిమండ్రి నించి రిక్సాలో పచ్చి పేపర్లు పంచిపెట్టి పోయేడంట. దాంట్లో ఏటున్నాదీ .. పది పేసైనోడికల్లా నెలకి మూడు వేల జీతంతో ఉన్న ఊళ్ళోనే ఉజ్జోగాలిత్తామని ఉందంట. ఇంకేవుంది, సింతాలు ఆ పేపరట్టుకుని ఎగురుకుంటా పచ్చి ఆళ్ళయ్య పీకిల మీద కూకున్నాడు. నేనింక సదూకోను ఉజ్జోగం సేస్తానని. ఆ పేపర్లో ఉన్న ఎడ్రసట్టుకుని ఈ తండ్రి ఆ కడుకు రాజిమండ్రి ఎల్లేరు. అక్కడాడి ఆపీసులో మెరిసిపోయా కుర్చీలు, టేబుళ్ళు, సోపాలు ఉన్నాయంట. ఆ కుర్చీల్లో ఉజ్జోగస్తులు సేనా దర్జాగా కూకున్నారంట. ఇసయం తెల్సి ఎల్లిన జెనం తీర్తం లాగున్నారంట. సాయిత్రందాకా పడిగాపులు పడి ఈళ్ళు కనుక్కునొచ్చిందేటంటే ముందాడికి పదివేలు కట్టాల. పేర్రాసుకుంటాడు. నెలాగి సర్టిపికెట్లతో బాటు మరో పది వేలు కట్టాల. ఆ మూడో నెల్లో ఈడి ఊళ్ళో ఆడు పెట్టిన కోళ్ళపారంలో ఈడికుజ్జోగం, నెలకి మూడు వేలు జీతం. మరి ఇరవై వేలు కట్టినందుకు ఈడూ యెజిమానుల్లో ఒకడన్న మాట. దానికి ఏడాదికోపాలి లాబాల్లో వాటా.
అలాగ ఓపికున్నోళ్ళు ఎన్నిరవైలైనా కట్టుకోపచ్చు, అంత లాబం అందుకోపచ్చు. ఆడు కాయితమ్మీద సొర్గం సూపించేసేడీళ్ళకి. పదో క్లాసునే ఉజ్జోగం పచ్చేత్తుంటే ఇంకా సదువెందుకు దండగని పాట మొదలెట్టేడు సింతాలు. పోసియ్య కూడా ఈ పెద్దొయిసులో కడుకు తమనీ ఊరినీ పదిలిపోకుండా ఉంటాడని ఆశిపడ్డాడు. ఉన్నకాడికి అమ్మి డబ్బులన్నీ పట్టుకెల్లి ఆడిసేతుల్లో పోసేరు. ఈళ్ళని జూసి దైర్నంతో ఊళ్ళో సదువుకున్న కుర్రోళ్ళందరూ అదే బాట పట్టేరు. అదిగప్పుడే లచ్చనవైన బూవులన్నీ గిరిజనుల సేతుల్లోంచి జారిపోయేయి. పదలుకుంటే అవకాశం మల్లీ రాదన్నట్టు ఎవరికి వాళ్ళు తొందరపడిపోయి బూవీపుట్రా అయిన కాడికమ్ముకుని డబ్బులట్టుకెల్లి కట్టేసేరు. ఈళ్ళేనేటి, అన్ని ప్రాంతాలోళ్ళు వేల మంది జాయనై పోయేరంట. మూణ్ణెల్లన్నది ఆర్నెల్లూ పది నెల్లూ గడిసిపోయినై. ఎక్కడా కోళ్ళపారమూ లేదు, ఆడి మన్నూ లేదు. సరిగ్గా ఏడాది నాటికి పచ్చిన కాడికి దండుకుని ఆడు జెండా ఎత్తేసేడు. కనీసం సర్టిపికెట్లయినా తెచ్చుకుందామంటే ఆడి అజా పజా లేదు.
నీ మూలాన్నే మేవిలాగ నష్టపోయేమని ఇటుకేసి జెనవందరూ పోసియ్య పెద్దని పట్టుకున్నారు. ఈ పెద్దాయిన పంచిన తలెత్తితే ఒట్టు.
అటు సదువుకీ సెడిపోయి, ఉన్న కాడికి బూమీ పోయి, ఇటు తండ్రి పరువూ పోయిందని ఏవాలోసించుకున్నాడో సింతాలు, పైవోడికి తెలవాల. ఊరి సివర సింతసెట్టుకి ఉరేసుకున్నాడు. కవురు తెలిసీ తెలవగానే ఈయన బార్య కుప్పకూలిపోయి ప్రేణాలదిలేసింది. పెంచిన ప్రేణం గదా! అప్పుణ్ణుంచీ నవనాడులూ కుంగిపోయి ఇదిగో ఈ పెద్దాయన ఇలాగైపోయేడు’’ అని ముగించి, పక్కన కుండలోంచి గ్లాసుడు నీళ్ళు ముంచుకుని తాగేడు మస్తాను.
‘‘అయ్యో, ఎంత పన్జరిగిందీ’’ అన్నాడు జోగులు.
‘‘నాకు తెలకడుగుతాను, ఈ సంత కూడా ములిగిపోద్దంటున్నారు నిజవేనేటండే?’’
ఏమో ఆపై వాడికెరుక అన్నట్టు రెండు చేతులు పైకి చూపించేడు మస్తాను. అతని మొహంలో సన్నని విషాద వీచిక పారాడింది. మెల్లమెల్లగా సంతలోకి జనం రాక ఎక్కువైంది. చుట్టుపక్కల గిరిజన గ్రామాలన్నిటికీ వారానికోరోజు జరిగే సంత అది. కండల కోనల వెనక నించి కాలి బాటల్లో, రంగురంగుల కోకల్ని మీగాళ్ళ మీదికి కట్టి, చంకన బుట్టల్లో అడవి దినుసులో, కోళ్ళో వేసుకుని వస్తున్నారు ఆడంగులు. రావడం రావడమే తెచ్చిన సరుకులు మారు బేరగాళ్ళకి అమ్మేసి వాళ్ళిచ్చిన పదో పరకో తీసుకుని నచ్చినవి కనుక్కోడానికి దుకాణాల మధ్య తిరుగుతున్నారు.
సకల డ్రింకుల అమ్మకం జోరందుకుంది. అంజి సాయంతో ఆరెంజి, ద్రాక్ష, నిమ్మ, సబ్జా డ్రింకుల్ని గాజు గ్లాసుల్లో పోసి, కంచెం పంచదార పాకం, ఓ గోలీ సోడా పోసి చెమ్చాతో కలిపి, ఎవరేది అడిగితే వాళ్ళకది చకచకా అందిస్తున్నాడు.
కత్తమావాస ముందు ఎండ చుర్రుమని కాల్తోంది. శివరాత్రి వెళ్ళిన కాణ్ణుంచీ కత్తమావాస సందడి ముందుగా సంతలోనే ప్రారంభమవుతుంది. ముఖ్యంగా బట్టల దుకాణాలకి గిరాకీ బావుంటుంది.
జోగులుకి ఈరోజు బేరం బాగుంది. అక్కడి కుర్రకారు అభిరుచి మేరకి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ పేంట్లు, టీషర్టులు తెచ్చేడీసారి. గుట్టగా పోసిన బట్టల్లోంచి తమకి కావాల్సిన రంగుల్ని ఏరుకుంటూ కుర్రాళ్ళంతా జోగులు దుకాణం చుట్టూ మూగి ఉన్నారు.
పక్కనే ఉన్న సకలకీ ఈ రోజు బేరం బాగా ఉంది.
ఎంత పని తొందర్లో ఉన్నా సకల మనసంతా ఎన్నెల ఊహల్తో నిండిపోతా ఉంది. ఏదో గుర్తుకచ్చి పెదవుల మీద నవ్వు విరుస్తా ఉంది. కళ్ళు అరమూతలు పడుతున్నాయి.
మొదటిసారి ఎన్నెల్ని ఎక్కడ చూసేడు …
తల్లి ఏదో కబురు చెప్పిరమ్మంటే సైకిలు మీద మేనత్త ఊరికెళ్ళి తిరిగొస్తున్నాడు. సాయంకాలం సూరీడు కండల వెనక్కి పరుగులు తీస్తున్న వేళ. బాటకిరువైపులా పచ్చని పొగాకు చేలు. పొగాకు పూల పరిమళం చల్లని గాలితో కలిసి దోగాడతాంది. ఉన్నట్టుండి పొగాకు చేను గట్టుమీంచి నారింజరంగు మెరుపులాగ ఎన్నెల బాట మీదికి దుమికింది.
సకల సైకిలు తొక్కడం మరచిపోయి నిలబడిపోయేడు.
ఆ వెనక చెరుకు తోటలోంచి విరిచి తెచ్చుకున్నట్టుంది, చెరుకు ముక్కని నముల్తూ బాటలో నిర్లక్ష్యంగా నడుస్తోంది. పిచ్చుకల కోసం కాబోలు భుజానికి వరికంకుల గుత్తొకటి గడ్డి తాడుతో వేళ్ళాడేసుకుంది.
అటు చూస్తే కండ మొదల్లో వరిచేను, పక్కనే జన్నచేను, అక్కడి పంచె మీంచి దిగి వస్తున్నట్టుంది.
పలకరించాలని మనసు కట్టుకులాడినా గొంతు పెగలక చూస్తా ఉండిపోయేడు.
ఆ రాత్రి కంటి మీదికి నిద్ర రాలేదు. ఆ పిల్ల తన కోసమే పుట్టినట్టన్పించింది.
పని గట్టుకుని అటువైపు పదే పదే వెళ్ళసాగేడు.
అలాగ నాలుగైదు సార్లు ఎదురుపడ్డాక అతను తనకోసమే వస్తున్నాడని ఎన్నెలకి అర్థమైంది.
అతను ఎదురుపడినప్పుడు చిరునవ్వు నవ్వింది.
సకల ధైర్యంచేసి పలకరించేడు. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు. అతనంటే తనకిష్టమేననీ, పెద్దల్తో మాట్లాడమని చెప్పింది ఎన్నెల. అతనింక ఆలస్యం చెయ్యలేదు. తల్లిని, పెద్దల్ని వాళ్ళ గూడేనికి పంపించి పెళ్ళి మాటలు జరిపించేడు. పెద్దల భోజనాలు జరిగిపోయేయి.
‘‘రాములోరి పెళ్ళయ్యేక లగ్గాలు’’ అన్నారు పెద్దలు.
సకల ఎన్నెల వేలికి వెండి ఉంగరం తొడిగేడు.
సకల కళ్ళు సంతంతా వెతుకుతున్నాయి.
క్రమంగా మధ్యాహ్నమైంది.
‘‘ఈయేల్టికింక రాదేమో’ – సకల యాంత్రికంగా పని చేస్తున్నాడు.
సాయంత్రమైంది, పొద్దు వాటారింది. ఎన్నెల జాడలేదు.
ఎన్నెలకి పంట్లో బాగోలేదేమో! – రకరకాల ఊహల భయాలు.
సకల మొహం కళ తప్పిపోయింది.
వెంటనే వెళ్ళి ఏమైందో కనుక్కోవాలన్పించింది.
కాని, ఇప్పుడిక ఇట్నుంచి కండల మీదుగా ఆళ్ళ గూడేనికి చేరుకోవడం కష్టం.
దిగులు మొహం వేసుకుని, సామాన్లన్నీ గూడు రిక్షాలో సర్దుకుని ఇంటిదారి పట్టేడు సకల. రాత్రంతా నిద్రపట్టక అటూ ఇటూ మసల్తూనే ఉన్నాడు.
మర్నాడు వేకువనే లేచి చప్పుడు కాకుండా సైకిలు పైకి తీసేడు. పొద్దు నడినెత్తికి చేరేసరికి సకల ఎన్నెల గూడేనికి చేరుకున్నాడు. ఊళ్ళో గంగానమ్మ సంబరం జరుగతా ఉంది. కాబోయే అల్లుడిగా తనకి కబురందనే లేదు. సకల మనసేదో కీడు శంకించింది.
తప్పిటగుళ్ళ హోరునీ, డప్పుల మోతనీ తప్పించుకుని ఎన్నెల ఇంటిని చేరుకున్నాడు.
ఇంటి ముందు చెట్టుకింద నులకమంచం మీద కూచుని ఏదో ఆలోచన్లో ఉన్న ఎన్నెల అతన్ని చూసి దిగ్గున లేచింది.
జాలిగా దిగులుగా అతన్ని చూసి గుడిసెలో కెళ్ళిపోయింది.
సైకిలు స్టేండు వేసి ఆశ్చర్యపోతూ అతను నులకమంచంలో కూలబడ్డాడు.
ఎన్నెల తమ్ముడు బైటికి పోబోతూంటే చెయ్యి పట్టుకున్నాడు సకల.
‘‘మీ అమ్మ అయ్య ఏర్రా?’’ వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అడిగేడు.
‘‘గంగానమ్మ సంబరానికెల్లేరు. నేనూ అక్కడికే.’’
‘‘మీ యక్కకేటైంది?’’
‘‘ఏమో, నాకేటెరిక. సంబరానికి రానంటుంది. మాయందరికీ తిళ్ళక్కడే’’ చెయ్యి విడిపించుకుని పరుగెత్తేడు వాడు.
ఎండనపడి వచ్చిన కాక మీదున్నాడేమో సకల దూకుడుగా గుడిసెలో కెళ్ళేడు.
ఒక మూల మోకాళ్ళలో తలపెట్టుకుని కూచుని ఏడుస్తోంది ఎన్నెల.
ఆమెనలా చూడగానే మనసు కరిగిపోయింది. వెళ్ళి పక్కన చతికిలపడ్డాడు. ఎన్నెల ఎక్కిళ్ళు పెడతానే ఉంది.
‘‘ఏటైంది, నిన్నెవరింత బాదించినోళ్ళు. ఎందుకేడుస్తున్నావు?’’ చనువుగా ఆమె చెయ్యందుకున్నాడు. మూసిన గుప్పిట్లోంచి తనిచ్చిన ఉంగరం అతని చేతిలో కచ్చింది. అతను నివ్వెరపోతూ ‘‘ఏటిది?’’ అన్నాడు.
‘మన మనువుజరగదంట.’’
‘‘ఎవడు సెప్పేడు? పెద్దల బోజనాలైన మనువునాపడం ఎవడితరం?’’
‘‘అయినా సరే.’’
‘‘అయినా సరేనా, ఏవంట? అంత కంపలేం ములిగేయంట?’’
‘‘అవును, కంపలు ములగడమే. మీ ఇల్ల వాకిళ్ళు, బూమిపుట్రలు పోలారం అడ్డకట్ట నీటి నిలవ కింద ములిగిపోతాయంట. మీరు తండాల నించి దూరంగా ఎక్కడికో ఎల్లిపోతారంట. అందుకే మా అయ్య నన్ను నీకియ్యడంట’’ భోరుమంది ఎన్నెల. *