క్రీడాభిరామము:2 వ భాగం

నేపథ్యమున

గతిరసికుండ షట్చరణ గానకళాకమనీయ యో మరు
వ్రత వికచారవింద వనవాటిక నేమిటికిం బరిత్యజిం
చితి వటవీప్రదేశమున జెట్టులు సేమలు నేమి గల్గినన్‌
బతిచెడి సంచరించెదవు ప్రాబడిపోయెనె నీ వివేకమున్‌

చేర వచ్చి వచ్చి దూరంబుగా బోదు
డాయవత్తు దవ్వు పోయిపోయి
మాటలింక నేల మా పాలిటికి నీవు
మాయలేడి వైతి మంచిరాజ

ఆకర్ణించి సూత్రధారుడు హా యేనెరింగితి నేకశిలానగరంబునం దార్యవాటంబునం గామమంజరి యను పునర్భువు నందు బద్ధానురాగుండై కార్యాంతర వ్యాసంగంబునం దేశాంతరగతుండైన కాసల్నాటి గోవింద మంచన శర్మ నుద్దేశించి యమ్ముద్దియ పుత్తెంచిన యసంబంధీభూత ప్రేమసంధుక్షణాగర్భంబైన మదనలేఖ సందేశపద్ధతి యది పఠియించుచున్నవాడతని కట్టనుంగు జెలికాడు టిట్టిభసెట్టి గావలయు నయ్యిరువురు నాబాల్యమిత్రంబులు వీరి యోగక్షేమంబు లనుసంధించెదం గాక యని నిష్క్రాంతుడయ్యె నిది ప్రస్తావన

కర్పూర బూచాయ కరమొప్ప నీర్కావి
మడుగుదోవతి పింజె విడిచి కట్టి
గొజ్జంగి పూనీరు గులికి మేదించిన
గంగమట్టి లలాటకమున దీర్చి
వలచేత బంగారు జల పోసనముతోడ
ప్రన్నని పట్టు తోరము ధరించి
జరిగొన్న వెలి పట్టు జన్నిదంబుల లుంగ
యంటులు వాయంగ నరుత వైచి

తళుకు చెంగావి కోకయు వలుదశిఖయు
చిగురు బొమ్మంచు పెదవులు చిన్నినగవు
నంద మొందంగ వచ్చె గోవిందశర్మ
మాధవునిపట్టి యొసపరి మన్మథుండు

కాసల్నాటి శ్రేష్టుడు
మీసాలప్పయ్య గారి మేనల్లుడు ధా
త్రీసురతిలకుడు కుసుమశ
రాసన సము డంధ్రనగర యాత్రోన్ముఖుడై

తూర్పు గనుంగొని టిట్టిభునిం జూచి వయస్య! సుప్రభాతంబు, సుఖనిద్ర యయ్యెనే? శీతం బుపద్రవంబు వాయదు గదా యీ పుష్యమాఘంబులందు?

చలి

ప్రక్కలు వంచివంచి మునిపండ్లును పండ్లును రాచిరాచి రొ
మ్మక్కిల జేసిచేసి తల యల్లన కాళ్ళకు నందియంది లో
చక్కికి నొక్కినొక్కి యిరుచంబడ గుమ్మడిమూట గట్టి వీ
పెక్కి దువాళి చేసి చలి యిక్కడ నక్కడ బెట్టు వేకువన్‌

కుమ్ములు హవ్యవాహములు గుత్తపు సుగ్గడితంపు దోపు రెం
టమ్ములు దట్టుపున్గు మృగనాభియు జాదును నోడె నద్దిరా
యమ్మకచెల్ల యింక నవయౌవన దర్ప నఖంపచంబులౌ
కొమ్మల చన్నులన్‌ సరకుగో నటులున్నవివో తుషారముల్‌

స్థూలద్వి త్రి పటావకుంఠనము గస్తూరీరజః పాలికా
కాలాగుర్వనులేపనంబులను నుద్ఘాటించి ధాటీగతిన్‌
బ్రాలేయంబు దువాళి సేసిన భయభ్రాంతంబులై యూష్మముల్‌
వాలాయంబుగ బ్రాకె నంధ్రవనితా వక్షోజశైలాగ్రముల్‌

స్థూలద్వి త్రి పటావకుంఠనములున్‌ ధూపోపచారంబులుం
గాలాగుర్వనులేపనంబులు వధూగాఢోపగూహంబులుం
గేలీగర్భనికేతనంబులును గల్గెంగాక లేకున్న నీ
ప్రాలేయాగమ మెవ్విధంబున భరింపన్‌ వచ్చురా టిట్టిభా

శీతోపద్రవంబు లేక సుఖనిద్ర యయ్యెనే యని యడిగి వేకువ యగుచున్నయది గావున నిదియ మనకు బ్రస్థానకాలంబని నిమిత్తం బనుసంధించి

శకునములు

చుక్క యొకింత నిక్కి బలసూదను దిక్కున రాయుచుండుటన్‌
జక్కగ వేగదిప్పుడు నిశాసమయంబిది ప్రస్ఫుటంబుగా
ఘుక్కని మాటిమాటికిని గోటడు వల్కెడు వామదిక్కునం
జొక్కటమై ఫలించు మన శోభనకార్యములెల్ల టిట్టిభా

మాగిలి మాగిలి వృక్షము
పూగొమ్మున నుండి షడ్జము ప్రకాశింపన్‌
లేగొదమ నెమలి వల్కెడు
గేగో యని వైశ్య మనకు గెలుపగు జుమ్మీ

కొనకొనం గోడి యేట్రింత కొంకనక్క
నమలి యీ నాలుగిటి దర్శనంబు లెస్స
వీని వలతీరుబలుకు నుర్వీ జనులకు
కొంగుబంగారమండ్రు శాకునిక వరులు

అనిన నాకర్ణించి టిట్టిభుండు

మంచన వింటివో వినవొ మన్మథు డేకశిలాపురంబులో
జంచలనేత్రలం బతుల శయ్యలపై రతికేళి రాత్రి పో
రించి ప్రభాతకాలము పరిస్ఫుటమైనను ధర్మదార వ
ట్టించుచునున్నవాడదె కుటీగత కుక్కుట కంఠనాళముల్‌

అని యట వోయి ముందట

శీతకాలంబు కడి మాడ సేయ గుడుచు
భాగ్యవంతుండు రేపాడి పల్లెపట్ల
గ్రొత్త యోరెంబు నిగురావ కూర తోడ
బిఛ్ఛిలంబైన నేతితో పెరుగు తోడ

ఒక ముచ్చట

టిట్టిభ! తలంపునం బారె నొక్క నాడేనునుం గామమంజరియును బ్రేమంబెలర్ప కలసిమెలసి కూడిమాడి పొందిపొసగి యనగిపెనగి చొక్కితక్కి యుండ దైవవశంబున గోత్రస్ఖలనంబు కారణంబుగా నక్కాంతారత్నం బలిగిన

ఎట్టకేలకు నలుక రేయెల్ల దీర్చి
యువిద యధరామృతము గ్రోలుచున్న నాకు
పానవిఘ్నంబుగా మ్రోసె పాపజాతి
జాతిచండాలమైన వేసడపు కోడి

టిట్టిభ! యమ్మదన పట్టాభిషేక మత్తేభరాజగమన నట్టనడుమ సురతకాలంబున వసంతసమయంబునం బాసి మల్లికా ధవళాట్టహాస మహాకాళమూర్తి యగు తపర్తు సమయంబు లంఘించి లాంగలీ కుసుమ కేసర పరాగ రేణు విసర పిశంగిత దశదిశాహట్టం బగు వర్షాసమయం బెట్టకేలకుం గడిపితి ప్రావృట్కాల ప్రవాసంబును మరణంబును రమణీరమణులకు నొక్కసమంబ యది యెట్టిదనిన

పటు ఝంఝా పవనోత్తృణాలయములో భద్రంబునం బట్టె కం
కటిపై ముచ్చముడింగి నిర్భర వియోగ గ్లాని శోషించి యె
క్కటి నిద్రించుచు నున్న పాంథవనితన్‌ గర్జావచః ప్రౌఢిమన్‌
దటిదుద్య్దోతము చూపు నట్టనడురే ధారాధరశ్రేణికిన్‌

అని మంచన మరియును ప్రాగ్దిశాంచలము వీక్షించి

అరుణోదయము

దానసపు బువ్వు చాయతో ద్రస్తరించు
చుదయ మయ్యెడు నదె చూడు మొదలిసంజ
సొబగు వీడిన కట్టెర్రసోకినట్టి
కామమంజరి నెమ్మోము కాంతి వోలె.

సూర్యోదయము

అదె మాణిక్యపు పూర్ణకుంభము వయస్యా కార్య సంసిద్ధికై
మొదలం దోచిన యట్టి మంచి శకునంబుంగా విచారింపరా
యుదయం బయ్యెడు భానుబింబము దిశావ్యోమావకాశంబులం
బదియార్వన్నె పసిండి తీగల గతిన్‌ బ్రాకెం బ్రభాజాలముల్‌

ఓరుంగంటి పురంబు సౌధములపై నొప్పారెడిన్‌ జూచితే
యీరెండల్‌ మణిహేమకుంభములతో నేకాంతముల్‌ సేయుచున్‌
స్వారాజ ప్రమదా ఘన స్తనభర స్థానంబులం బాసి కా
శ్మీర క్షోదము ప్రాణవల్లభ దృఢాశ్లేషంబులన్‌ రాలెనాన్‌

అనుదిత నియమ వ్రతంబు గావున నిటక్రితంబ సంధ్యాగ్నిహోత్ర క్రియాకలాపంబులు నిర్వర్తింపంబడియె నీవు ముఖమజ్జనంబు సేసి యిష్టదేవతాభివందనంబు గావించితివి గదా గోధూళి లగ్నంబునం బురంబు ప్రవేశింప వలయు విశేషించి యుషఃకాలంబు సర్వప్రయోజనారంభంబులకు ప్రశస్తంబు

గార్య్గ సిద్ధాంత మత ముషఃకాల కలన
శకున మూనుట యది బృహస్పతి మతంబు
వ్యాసమతము మనఃప్రసాదాతిశయము
విప్రజన వాక్య మరయంగ విష్ణుమతము

అని పరిక్రమించి వెలిపాళెంబు కట్టకడపట కటకార కుటీర వాటిక ప్రవేశించి

మేదరవాడ

ఎకసెక్కెముగ నాడు నేదైన నొకమాట
పాడు నొయ్యన పాట పాటపాట
యలతి యద్దపు బిళ్ళ యలవోక వీక్షించు
కొనగోర పదనిచ్చి కురులు దీర్చు
పయ్యెద దిగజార్చి పాలిండ్లు పచరించు
దిస్సువారగ నవ్వు తీగనవ్వు
ధవళ తాళ పలాశ తాటకంబులు త్రిప్పు
కలికిచూపుల చూపు గర్వరేఖ

కటకుటీద్వార వేణుకా కాష్టపీఠ
మధ్యభాగ విషణ్ణయై మదము మిగిలి
వీటి పామరవిటుల తంగేటి జున్ను
కాము బరిగోల మేదర కరణ వేశ్య

పుటభేదన బహిరంగణ
కటకశ్రీకార కూట కటకంబగు నీ
కటకారకుల వధూటీ
కుటికాగారంబు గరడి కుసుమాస్త్రునకున్‌

కీసిన వెదురు సలాకల
నేసిన యిరుదల శిఖండి నిడుమంచమునం
దోసరిలి కట కుటీర వి
లాసిని రమియించు మిండల సహస్రములన్‌

పల్లవతస్కరుం డొకడు ప్రాక్సముపార్జిత తారపంక్తితో
వల్లువ మెత్తికొంచు పెడవాకిట వెళ్ళిన నాటినుండి పా
టిల్లిన శంక నీ కటకుటీర విలాసిని యహ్హహా పటీ
పల్లవ కోణముల్‌ బిగియబట్టి రమించును మిండగీలతోన్‌

ఆ చేడియం జూచి యట పోవంబోవ ముందట

చండాలాంగన

గండాబోగము పజ్జ లేనగవు శృంగారింప గ్రేకన్నులన్‌
మెండై మించు మెరుంగు చూపుగమి క్రొమ్మించుల్‌ పిసాళింపగా
చండాలాంగన వచ్చె నొక్కతె ఋతుస్నానార్థమై యిక్షుకో
దండుం డేర్చిన బాణమో యనగ సౌందర్యంబు నిండారగన్‌

అట్లు పోవంబోవ ముందట