దొంగ! దొంగ!!

కోకా ప్రభాకరరావు (టూకీగా ప్రభా కోకా) తన బి.ఎమ్‌.డబ్ల్యూ.745 కార్లో వెనకసీట్లో బోర్లా పడుకుని తల కొద్దిగా పైకెత్తి కిటికీలోంచి తొంగి చూస్తున్నాడు.

వెనక కిటికీల అద్దాలు బాగా నల్లగా వున్నందువల్ల బయటి వాళ్ళకు అతను లోపల వున్నట్టు తెలిసే అవకాశం చాలా తక్కువ.

ఐనా అతను ఏ మాత్రం రిస్క్‌ తీసుకోదల్చలేదు.

దాదాపు రెండు గంటల నుంచి ఇలా చూస్తున్నాడు. వీధంతా నిర్మానుష్యంగా వుంది.

ఈ రెండు గంటల్లోనూ ఒక్క కారు రాలేదు.

రెండు కార్లు వెళ్ళాయి.

అది చిన్న వీధి. మొత్తం కలిసి రోడ్డుకి రెండు వైపులా కేవలం పద్ధెనిమిది ఇళ్ళున్నాయి.

వాటిలో ఇండియన్స్‌ వుండేవి ఐదు.

ఇప్పుడు తనున్న చోటు నుంచి ఆ ఐదు ఇళ్ళ ముందు భాగాలు కన్పిస్తున్నాయి.

ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఒకే క్రమంలో ఆ ఐదు ఇళ్ళ వంకా చూస్తున్నాడు.

ఎక్కడైనా ఏమైనా కదలిక కన్పిస్తుందేమో నని జాగ్రత్తగా గమనిస్తున్నాడు.

సమయం మధ్యాహ్నం మూడు గంటలు.

ఈరోజు కూడా వేస్ట్‌ అయిందేమో అన్న అనుమానం వచ్చింది. ఐనా, ఎంతో క్రమశిక్షణ ఉన్నవాడు కనుక కదలకుండా అలాగే వున్నాడు.

వీధి మొదట్లో ఓ పికప్‌ ట్రక్‌ కనిపించింది.

జాగ్రత్తగా దాన్ని గమనించసాగాడు.

అది ఒకసారి ఆ వీధంతా తిరిగింది.

ఒకమాదిరి వేగంతో వెళ్తున్నా ఆ ట్రక్‌లో వాళ్ళు అక్కడ పార్క్‌ చోసి వున్న కార్లనన్నిటినీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని అర్ధమైందతనికి. ఇంకా నక్కి కూర్చున్నాడు.

గుండె విపరీతమైన వేగంతో కొట్టుకోవటం మొదలెట్టింది. ముప్ఫై రోజులుగా తను పడుతున్న శ్రమకు ఫలితం దొరికే సమయం వచ్చిందని అనిపిస్తోందతనికి. ఇలాటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు.

తను కదిల్తే కారులో కూడ కదలిక కనపడొచ్చు. ఆ ట్రక్‌ లో వాళ్ళు తమ ప్రయత్నం విరమించుకుని పారిపోవచ్చు.

ఊపిరి బిగపట్టి పడుకున్నాడు.

ఆ ట్రక్‌ తన కారు పక్కగా వచ్చి ఆగింది.

ఎవరో కిందికి దూకిన చప్పుడు.

తను చూస్తున్న కిటికీకి అవతలి వైపు ఒక ముఖం.

స్పష్టంగా కనిపించటం లేదు కాని ఎవరో అద్దంలో తన మొహమే పరావర్తనం చెంది కనిపించకుండా మొహానికి రెండు పక్కలా చేతులు అడ్డు పెట్టి అద్దానికి ముక్కుని ఆనించి మరీ లోపలికి తొంగి చూస్తున్నారు. వాళ్ళ ఊపిరి ఆవిరి అద్దానికి పట్టింది.

వాళ్ళు తనకి స్పష్టంగా కనపడనట్టే తనూ వాళ్ళకు కనపడడు(అని కనీసం తన ఆశ).

అలా ఓ నిమిషం చూశాక ఒక అడుగు వెనక్కు వేశాడా వ్యక్తి.

ఇప్పుడేం జరుగుతుంది?

వాళ్ళు ఉంటారా వెళ్ళిపోతారా?

అతను వెళ్ళి ట్రక్‌లో ఎక్కాడు. అది వెంటనే కదిలింది.

మళ్ళీ వీధంతా ఒక చుట్టు తిరిగింది.

ఉత్కంఠ భరించలేక పోతున్నాడు ప్రభా.

తగుదునమ్మా అని బి.ఎమ్‌.డబ్ల్యూ. తెచ్చినందుకు తనని తను తిట్టుకున్నాడు. అది చూసి వాళ్ళకు అనుమానం వచ్చిందో ఏమిటో!

ఈ సారి ఆ ట్రక్‌ ఏ కారు దగ్గరా ఆగలేదు.

తనకారుని దాటి మూడు ఇళ్ళ ముందుకి వెళ్ళింది. అక్కడ డ్రైవ్‌ వేలో ఆగింది.

ఇద్దరు దిగారు.

లాన్‌ పని చేసే వాళ్ళలాగా వున్నారు.

కంచె గొళ్ళెం తీసుకుని గబగబా దొడ్డి వైపుకు వెళ్ళారు.

ఏం చెయ్యాలి ఇప్పుడు?

ప్రభాకరరావు ఈ నెల రోజులుగా ఎదురు చూస్తున్న ఘట్టం ఎదురుగా జరగబోతోంది. అతని మనసులో ఎలాటి అనుమానం లేదు.

వీళ్ళు ఖచ్చితంగా దొంగతనానికి వచ్చిన వాళ్ళే.

ఆ ఇంట్లో ఎవరూ లేరని తనకు తెలుసు.

రోజూ లాగే ఠంచనుగా ఉదయం ఏడు గంటలకు ఇంటావిడ బయటకు వెళ్ళింది. ఆ తర్వాత ఇరవై నిమిషాలకు ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఆమె భర్త వెళ్ళిపోయాడు.

సరిగా నాలుగు గంటలకు పిల్లలు ఇద్దరూ బస్సులో వీధి చివర దిగి నడుచుకుంటూ ఇంటికి వస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఆ తర్వాత ఎప్పుడో వస్తారు. అప్పటిదాకా తనెప్పుడూ ఇక్కడ వుండలేదు గనక వాళ్ళు ఎన్నింటికి తిరిగొస్తారో ప్రభా కి తెలియదు.

గత నెల రోజుల్లోను వీక్‌ డేస్‌లో ఇదే దినచర్య.

పొద్దునే ఆరూ యాభైకి వచ్చి వీధి చివర్లో మెయిన్‌ రోడ్డు మీదకారు పార్క్‌ చేసి ఇవన్నీ గమనిస్తుంటాడు ప్రభా.

ఏ ఇళ్ళలో వాళ్ళు ఏయే వేళల్లో బయటికి వెళ్తారో ఎప్పుడు తిరిగి వస్తారో ఇపుపడతనికి కరతలామలకం.

ముఖ్యంగా అక్కడున్న ఐదు ఇండియన్‌ కుటుంబాల గురించి అతనికి క్షుణ్ణంగా తెలుసు.

మూడుగంటల పది నిమిషాలు.

వాళ్ళు ఆ ఇంటి దొడ్డిలోకి వెళ్ళి మూడు నిమిషాలు.

ఈ పాటికి ఇంట్లోకి వెళ్ళుంటారా?

ఇంకో ఐదు నిమిషాలు ఆగాడు.

తను అనుకున్న పథకం ప్రకారం చకచక ఆ ట్రక్‌ దగ్గరకు నడిచి వెళ్ళాడు.

నాలుగు వైపుల్నుంచి గబగబ తన జేబులో వున్న డిజిటల్‌ కెమేరాతో ఫొటోలు తీశాడు.

ఆ తర్వాత ఏం చెయ్యాలో తోచలేదు.

ఎంత రిహార్సల్స్‌ చేసినా తీరా అసలు సమయానికి కాళ్ళు వణుకుతున్నాయి.

లోపలకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలని చెప్పలేని కుతూహలం.

ఆ ఉద్వేగంతో గుండె విపరీతంగా కొట్టుకుంటోంది. ధారాపాతంగా చెమట కారుతోంది.

మొండి ధైర్యంతో తనూ కంచె గడి తీసి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ దొడ్డిలోకి నడిచాడు. ఇంటికి కుడివైపుగా

వెళ్తుందాదారి. గోడకు ఆనుకుని నడుస్తూ గోడ చివర చేరాక వాళ్ళింకా అక్కడే వున్నారేమోనని ఒక్కసారి తలమాత్రం బయటపెట్టి కుడి వైపుకు చూశాడు.

ఎవరూ కనిపించలేదు.

ఈసారి ఇంకొంచెం ముందుకు జరిగి చుట్టూ జాగ్రత్తగా చూశాడు. ఎవరూ లేరు.

గోడ పక్కనే కుడి వైపుకు తిరిగాడు. ఇప్పుడు ఇంటి వెనక గోడకు ఆనుకుని నడుస్తున్నాడు. కొద్ది అడుగులు వేశాక పెద్ద కిటికీలు వున్నాయి. రెండు కిటికీలు దాటాక దొడ్డిగుమ్మం. అది కొద్దిగా తెరిచి వుంది.

ఒకవేళ హఠాత్తుగా పారిపోవలసి వస్తే సిద్ధంగా వుండటానికి దొంగలు అలా తెరిచి వుంచుతారని ఏక్కడో చదివాడు.

పిల్లిలా నడుస్తూ దొడ్డిగుమ్మం వరకు వెళ్ళాడు. అక్కడ గొంతుకూర్చున్నాడు. గభాల్న తలను ముందుకు వంచి లోపలికి తొంగి చూశాడు. ఎవరూ కనిపించలేదు గాని పై అంతస్తులో చప్పుళ్ళు వినిపిస్తున్నాయి.

ఇంతలో కిందనే వున్న ఓ గదిలోంచి ఒకడు బయటకు వచ్చాడు. వాడి చేతిలో కొన్ని ఆభరణాలున్నాయి.

తలుపుకు దగ్గర్లోనే కింద ఒక సూట్‌కేస్‌ తెరిచివుంది. వాళ్ళు అది తీసుకుని లోపలికి రావటం తను చూడలేదు. అంటే అది కూడ ఈ ఇంటివాళ్ళదేనన్నమాట.

దాన్లో వాడి చేతిలో వున్న ఆభరణాలు పడేశాడు. మళ్ళీ ఆ గదిలోకే వెళ్ళాడు. కింద ఒకడూ, పైన ఒకడూ వున్నారు!

మూడు గంటల ముప్ఫైమూడు.

ఇక వీళ్ళు ఎక్కువసేపు ఇక్కడ వుండరు. ఇప్పుడు ఏం చెయ్యాలి తను?

పోలీసుల్ని పిలవటమా? తన దగ్గరున్న కెమేరాతో ఆ సూట్‌కేసుని ఫొటో తీశాడు. మెల్లగా వెనక్కి నడుస్తూ ఆ గోడ పక్కనే కదిలాడు. ఒకసారి మలుపు తిరిగాక లేచి నిలబడి చకచకా అక్కడినుంచి బయటకు వచ్చాడు.

ఇక్కడ వాళ్ళ ఎదుట పడటం చాలా ప్రమాదం. కొంపదీసి వాళ్ళ దగ్గర కత్తులో తుపాకులో వుంటే? తుపాకి కాల్చక పోవచ్చు గాని కత్తితో పొడవటానికి సందేహించకపోవచ్చు. త్రిల్‌ అనుకున్నది కాస్తా చావుగా పరిణమించొచ్చు.

కెమేరాని అసంకల్పితంగానే ఒకసారి తడుముకున్నాడు. తనకారు దగ్గరకు గబగబ నడిచి దాన్లోకి ‘డైవ్‌’ చేసి మళ్ళీ వెనక సీట్లో కదలకుండా పడుకుని కిటికీలోంచి దొంగల ట్రక్‌ వైపు రెప్పలార్పకుండా చూస్తున్నాడు.

మళ్ళీ మనసులో అదే ప్రశ్న- పోలీసులకు ఫోన్‌ చేస్తే?

తన సెల్‌ ఫోన్‌ నంబర్‌ బట్టి తనెవరో వాళ్ళకు తెలిసిపోతుంది. దాన్నుంచి ఈ సమయంలో తను ఇక్కడ ఏంచేస్తున్నట్టూ అన్న ప్రశ్న వచ్చే అవకాశం వుంది. తనేదో కథ చెప్పొచ్చు కాని క్రిమినల్‌ సైకాలజీలో ఆరితేరిన ఆ పోలీసులకు తన అబద్ధం వెంటనే తెలిసిపోవచ్చు. తీగ లాగితే డొంకంతా కదిల్నట్టు తన వ్యవహారం అంతా బయటకు రావచ్చు. దొంగలు దొరుకుతారో లేదో దేవుడికి ఎరుక, ముందు తను పోలీసుల చేతిలో చిక్కుతాడు!

మూడూ నలభై ఆరు.

ఇంక రెండు మూడు నిమిషాల్లో వీధిలో కొంత సందడి మొదలౌతుంది. తన కారుకి ఎదురుగా వున్న ఇంట్లోని ఒకావిడ అప్పుడప్పుడు తనే స్కూల్‌కి వెళ్ళి పిల్లల్ని తీసుకు వస్తుంటుంది. ఇవాళా అలా చేస్తుందా?

మెయిల్‌ మేన్‌ ఇవాళ ఇంకా వచ్చినట్టు లేడు. ఒకవేళ తనిక్కడికి రాకముందే వచ్చి వెళ్ళిపోయాడా?

ఆలోచిస్తూండగానే రెండు సూట్‌కేసుల్తో దొంగలిద్దరూ దొడ్డిదారినే బయటకు వచ్చి ట్రక్‌లో ఎక్కారు. ఏ మాత్రం కంగారు లోకుండా తాపీగా డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్తూ మళ్ళీ తనకారు వైపు కొంచెం గుచ్చి గుచ్చి చూసున్నట్టనిపించింది ప్రభాకరరావుకి. ఇంకా ముడుచుకున్నాడు తనకు తెలియకుండానే.

వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక నిమిషం ఆగి తనూ కారు స్టార్ట్‌ చేసుకుని వేగంగా అక్కడి నుంచి బయల్దేరాడు. వీధి దాటి మెయిన్‌ రోడ్డు మీద కొద్ది దూరం ప్రయాణించాడు. మెయిన్‌రోడ్డు మీద ఆ ట్రక్‌ ఎక్కడా కనిపించలేదు.

దగ్గర్లో ఒక పార్కింగ్‌ లాట్‌ లోకి తిరిగి ఆగాడు. ఎవరూ తనని గమనించటం లేదని నిర్ధారణ చేసుకుని దిగి చకచకా తన కారు లైసెన్స్‌ ప్లేట్లు మార్చాడు.

ఇప్పుడు దాని ఒరిజినల్‌ ప్లేట్లు దానికి వున్నాయి. దొంగ ప్లేట్లని ట్రంక్‌లో పడేసి ఇంటికి దారి తీశాడు.

నిజంగా ఇదో అద్భుతమైన అనుభవం!

తను దొంగతనం చెయ్యకపోయినా చేసేవాళ్ళని వాళ్ళకు తెలియకుండా అంత దగ్గర్లో చూడటం, ప్రమాదానికి వెంట్రుక వాసి లోకి వెళ్ళి బయటకు రావటం ఎంతో ఆనందాన్నిచ్చాయి. కొండల మీంచి దూకేవారు, సుడుల్లో తెప్పలు నడిపేవాళ్ళు, ఇంకా అనేక ప్రమాదకరమైన పన్లు చేసేవాళ్ళు ఎందుకలా చేస్తారో ఇప్పుడు అర్ధమైందతనికి.

***

ఆరువారాల క్రితం మెయిల్‌ బాక్స్‌లో ఓ కాగితం చూశాడతను. దాన్లో ఇలా వుంది -‘‘డియర్‌ నైబర్‌! ఇది మీకు ఆందోళన కలిగించటానికి రాయటం లేదు. అప్రమత్తంగా ఉండమని చెప్పటానికే. ఈ మధ్య కొందరు దొంగలు కేవలం ఇండియన్ల ఇళ్ళ మీద నిఘా వేసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి విలువైన వస్తువుల్ని తీసుకుపోతున్న సంఘటనలు చాలా జరిగాయి. ఉదాహరణకి దగ్గర్లోనే వున్న లివింగ్‌వుడ్స్‌ వీధిలో పదిమంది ఇండియన్లు వుంటే ఒకే వారంలో వాళ్ళలో ముగ్గురి ఇళ్ళలో ఇలాటి దొంగతనాలు జరిగాయి. ఇలాటి వాటిలో పోలీసులు చెయ్యగలిగింది ఏమీ లేదు. కనుక మన జాగ్రత్తలో మనం వుండటం ముఖ్యం. ఇట్లు – మీ శ్రేయోభిలాషి, గురుచరణ్‌ సింగ్‌,’’

ఆరు నెలల క్రితమే ప్రభాకరరావు తన సాఫ్ట్‌వేర్‌ కంపెనీని అమ్మి ఓ పది మిలియన్లు సంపాయించాడు. మళ్ళీ వెంటనే మరో కంపెనీ మొదలు పెట్టటం ఇష్టం లేక కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుందామని సరదాగా కాలక్షేపం చేస్తున్నాడు.

ఇంకా ఓ ఆఫీసు వుంది కనుక ఎప్పుడన్నా ఏమీ తోచనప్పుడు అక్కడకు వెళ్ళి కొత్త ఐడియాల కోసం ఆలోచిస్తున్నాడు తప్ప పెద్దగా చేస్తున్న పనేమీ లేదు.

ఇంతలో ఆ కాగితం ఇలా వచ్చేసరికి ఈ దొంగలెవరో ఎలా దొంగతనాలు చేస్తారో చూడాలనే కుతూహలం కలిగిందతనికి. ఐతే అదీ ఒక ప్రాజక్ట్‌లా తీసుకుని జాగ్రత్తగా దాన్ని గురించి రిసెర్చ్‌ చేసి చాలా విషయాలు తెలుసుకున్నాడు.

దొంగలు దొంగతనానికి ముందు కొన్ని రోజుల పాటు ఇంటిని మాటు వేసి ఆ ఇంటి వారి రాకపోకలన్నీ జాగ్రత్తగా గమనిస్తారనీ, సామాన్యంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగ్గంటలలోపే తొంభైశాతం పైగా దొంగతనాలు జరుగుతాయినీ తెలుసుకున్నాడు.

ఐతే ఏ వీధిలో దొంగలు పడతారో ఎలా తెలుస్తుంది?

ఇంటర్‌నెట్‌ మీద మేప్స్‌ చూసి లివింగ్‌వుడ్స్‌ వీధికి చుట్టూ వున్న వీధులన్నీ కనుక్కున్నాడు. వాటిలో, రెండు మూడు ఇండియన్‌ కుటుంబాలున్న వాటిని పక్కన తీసి పెట్టాడు. వాటిలో జనసంచారం చాలా తక్కువగా వుండేవాటిని ఎంచుకున్నాడు. అలాటివి పది వీధులు తేలాయి. ఆ పదింటికి వెళ్ళి చూశాడు. తనే గనక దొంగ ఐతే వాటిలో ఏఏ వీధులు బాగా అనుకూలంగా వుంటాయా అని ఆలోచించాడు. అలాటి వీధి పెద్ద ఇళ్ళు వున్నదై వుండాలి. ఇళ్ళు మరీ పక్కపక్కన లేకుండా వుండాలి. కంచెలకు తాళాలు లేకుండా వుండాలి. ఇళ్ళలో పగలు ఎవరూ వుండకుండా వుండాలి. ఇవన్నీ సరిపోయేవి రెండే వీధులు మిగిలాయి. ఒక దాన్లో మొత్తం యాభై ఇళ్ళున్నాయి. వాటిలో ఇండియన్ల ఇళ్ళు కూడ తలా ఓ చోట వున్నాయి. కనుక తనొక్కడే వాటన్నిటినీ గమనించటం అయ్యేపని కాదు. రెండోది పద్ధెనిమిది ఇళ్ళ వీధి. కావలసిన ఐదు ఇళ్ళను గమనించటం కూడా తేలికే. కాబట్టి ఆ వీధితో మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నాడు. ఓ రెండు నెలల తర్వాత ఏమీ జరక్కపోతే అప్పుడు మొదటి వీధి వైపు దృష్టి పెట్టొచ్చు.

అలా వేసిన ప్లాను ఈ రోజుకు ఇలా సక్సెస్‌ ఐంది.

ఆనందంతో ఈల వేసుకుంటూ మాంఛి హుషారుగా దార్లో వున్న స్టార్‌బక్స్‌కి వెళ్ళాడు. అక్కడ కాసేపు కూర్చుని కేపుచీనో తాగి ఐదింటికి ఇంటికి చేరాడు.

డిజిటల్‌ కెమేరాలోని ఫొటోలు తన లేప్‌టాప్‌లోకి లోడ్‌ చేశాడు. బాగా జూమ్‌ చేసి చూస్తే దొంగల ట్రక్‌ లైసెన్స్‌ ప్లేట్‌ నంబర్‌ చక్కగా కనిపించింది. దాన్ని ఓ ఫైల్‌లో సేవ్‌ చేశాడు.

ముందుగా ఆ లైసెన్స్‌ నంబర్‌ సరైందో లేక తనలాగా వాళ్ళుకూడా తప్పుడు ప్లేట్‌ పెట్టుకు తిరుగుతున్నారో చూడాలి. వెబ్‌ మీద అలాటి సమాచారం తెలియజేసే సైట్‌ కి వెళ్ళి చెక్‌ చేశాడు. తన అనుమానం నిజమే! ఆ ప్లేట్‌ నంబర్‌ డేటాబేస్‌లో లేనే లేదు!! ఈ ఆధారం ఇలా ఎందుకూ కాకుండా పోయింది.

ఐతే, అసలు తనేం చెయ్యదల్చుకున్నాడో ప్రభాకర్‌కే స్పష్టంగా లేదు. దొంగలెవరో కనుక్కుంటే కలిగే త్రిల్‌ కోసం ఇంత హడావుడీ చేస్తున్నాడు తప్ప తీరా వాళ్ళెవరో తేలేక ఏం చేయ్యాలో అసలతను ఆలోచించనే లేదు

***

మర్నాడు జీవితం అంతా వెలితిగా అనిపించింది. ఉదయమే నిద్ర లేవబుద్ధి కాలేదు. ఐనా లేవకపోతే లలితకు అనుమానం వస్తుందేమోనని అతికష్టం మీద లేచి అలవాటు ప్రకారం బయటకు వెళ్ళాడు. ఐతే ఇన్నాళ్ళు వెళ్ళిన వీధి వైపే మళ్ళీ వెళ్ళదల్చుకోలేదు. ఆ వీధిలో వాళ్ళెవరైనా తనకారు గురించి పోలీసులకు చెప్పి వుండే అవకాశం వుంది.

ఇక అసలు ఆ వీధి వైపుకే వెళ్ళే ప్రసక్తి లేదు. ఊరికే రోడ్లమీద డ్రైవ్‌ చేసుకుంటూ తిరిగాడు. ఆఫీసుకు వెళ్ళి కాసేపు కూర్చున్నాడు. బాగా బోర్‌ కొట్టింది. ఎలాగో పది దాకా కాలక్షేపం చేసి ఇంటికి తిరిగొచ్చాడు. అప్పటికి లలిత వర్క్‌కి వెళ్ళిపోయింది. పిల్లలిద్దరూ స్కూల్‌కి వెళ్ళారు.

ఇంట్లో తనొక్కడే.

ఏదో చేసెయ్యాలని వుందిగాని ఏం చెయ్యాలో ఏం చెయ్యగలడో తోచటం లేదు. ఇంతలో ఫేమిలీ రూమ్‌లో ఫోన్‌ మోగింది. వెళ్ళి ఎవరు ఫోన్‌ చేస్తున్నదీ చూశాడు. తెలిసిన నంబర్‌ కాదు. తియ్యటమా మానటమా అని క్షణకాలం తటపటాయించాడు. చివరికి తియ్యకూడదనే నిర్ణయించుకున్నాడు. అంత అవసరమైన వాళ్ళైతే మెసేజ్‌ పెడతార్లే అనుకున్నాడు.

ఫోన్‌ నాలుగు సార్లు మోగాక వాయిస్‌మెయిల్‌కి వెళ్ళింది.

‘‘మిస్టర్‌ కోకా! మీరు ఫోన్‌ దగ్గరే వున్నారని నాకు తెలుసు. దయచేసి ఫోన్‌ తియ్యండి, మీకే మంచిది’’ అని వినిపించింది.

ఆశ్చర్యపడుతూ ఫోన్‌ తీశాడతను.

‘‘థేంక్యూ. మీరు వెంటనే బయల్దేరి స్టోన్‌ రిడ్జ్‌ మాల్‌కి రండి. అక్కడ సియర్స్‌ స్టోర్‌ ఎదురుగా వున్న గరాజ్‌లో రెండో లెవెల్లో పార్క్‌ చెయ్యండి. పదిహేను నిమిషాల లోపు మీరు అక్కడ వుండాలి.’’

తనేమీ మాట్లాడకుండానే అవతలి వాళ్ళు ఫోన్‌ పెట్టేశారు.

పట్టపగలు కనుకా వాళ్ళు రమ్మన్నది నిర్మానుష్యమైన చోటికి కాదు గనుకా వెళ్ళటానికే నిశ్చయించుకున్నాడు. చక చక తయారై వాళ్ళు చెప్పిన చోటికి వెళ్ళి కారు ఆపాడు.తను దిగేలోపుగానే ఎవరో తన పక్కగా వచ్చి నిలబడ్డారు. ‘‘మిస్టర్‌ కోకా! థేంక్‌ యూ ఫర్‌ కమింగ్‌. అలా రండి మాట్లాడుకుందాం’’ అన్నాడతను.

తెల్లవాడు. ముప్ఫై ఐదేళ్ళ వయసు. తనకన్నా నాలుగైదు అంగుళాలు పొడవు. సూట్‌ వేసుకున్నాడు. కాని ఓపెన్‌ కాలర్‌.

అతన్తో పాటు నడిచాడు. రెండుకార్ల అవతల వున్న ఓ వేన్‌ వైపు నడిచాడతను. వేన్‌ పక్క తలుపు తెరిచి వుంది. ‘‘ఎక్కండి’’ అన్నాడు.

కొంపదీసి వీళ్ళెవరో తనని కిడ్నేప్‌ చేస్తున్నారేమోనని అనుమానం వచ్చింది ప్రభాకర్‌కి. చుట్టూ చూశాడు. కొద్ది దూరంలోనే ఓ ఫేమిలీ అప్పుడే కార్లోంచి దిగుతున్నారు. తను అరిస్తే వాళ్ళకి తప్పకుండా వినిపిస్తుంది. అతని ఆలోచన చదివినట్టు, ‘.మీకు కంగారేం అక్కర్లేదు. మేం మీకు ఎలాటి హానీ చెయ్యబోవటం లేదు’’ అన్నాడతను.

‘‘మీరెవరు? నాతో మీకేమిటి పని?’’ అన్నాడతను చివరకు, తడారిన గొంతు పెకల్చుకుంటూ.

‘‘ఇప్పుడే తెలుస్తుంది, లోపలకి పదండి.’’

అనుమానంగానే లోపలికి ఎక్కాడు. అక్కడ ఇంకో ఇద్దరున్నారు. వాళ్ళూ తెల్ల వాళ్ళే. ఎవరూ రౌడీల్లా అనిపించలేదు. కొంత ధైర్య కలిగింది. తనతో వున్నతను కూడ ఎక్కి తలుపు మూశాడు. తనపక్కనే కూర్చున్నాడు. ‘‘నాపేరు పీటర్‌. వాళ్ళు నా పార్ట్‌నర్స్‌ జాన్‌, ఎరిక్‌’’ అని అందర్నీ పరిచయం చేశాడు. ఎవరి ఇంటి పేర్లూ చెప్పకపోవటం అసంకల్పితంగానే గ్రహించాడు ప్రభా.

పైన చిన్న టీవీ. దాన్లో ఏదో నిశ్శబ్దంగా సాగుతోంది. అప్రయత్నంగా అటువైపు చూశాడు. పరిచయం వున్న చోటులా అనిపించింది. చూస్తూండగానే ఎవరో వచ్చి కంచె గడితీసి లోపల ప్రవేశించారు. ముందు దూరంగా వున్న ఆ వ్యక్తి కొద్ది సెకన్లలో కెమేరాకి ఎదురుగా వున్నాడు.

అది దొంగతనం జరిగిన ఇల్లు. ఆ వ్యక్తి ఎవరో కాదు తనేనని గుర్తించడానికి ప్రభాకి కొద్దిక్షణాలే పట్టింది. ఆ వెంటనే తెలియకుండానే ఒంటినిండా చెమట కూడా పట్టింది.. వెంటనే విడియో ఆగిపోయింది.

పీటర్‌ మెల్లగా మాట్లాడ సాగాడు.- ‘‘మిస్టర్‌ కోకాది యుసీ, వుయ్‌ హేవ్‌ ఎ సిట్యువేషన్‌ హియర్‌. మీరు ఉండకూడని చోట

ఉండకూడని సమయంలో వున్నారు, చూడకూడనివి చూశారు…’ ఎఫెక్ట్‌ కోసం ఓ క్షణం ఆగాడతను.

‘‘ఎవరు మీరు? మీకూ ఆ ఇంటికీ ఏమిటి సంబంధం?’’

‘‘ఆ విషయాలన్నీ మీకు అనవసరం. ఇప్పుడు మీ ముందున్నది ఒకే నిర్ణయం. ఇదివరకు ఇలా మా కార్యకలాపాల్లో వేలు పెట్టిన వాళ్ళు ఎవరూ ఆ తర్వాత బతికి బట్ట కట్టలేదు. మీకు బతకాలని వుందా లేదా?’’ సూటిగా అడిగాడతను.

అప్పటి వరకు ఎంతో నాగరీకుల్లా కనిపించిన వాళ్ళు ముగ్గురూ ఇప్పుడు హఠాత్తుగా నరహంతకుల్లా కనిపించసాగారతనికి. ఏం చెయ్యాలో తోచలేదు. గట్టిగా అరిస్తేనో?

తప్పకుండా! అరిచిచూడండి మీకే తెలుస్తుంది. ఇది పూర్తిగా సౌండ్‌ప్రూఫ్‌ వేన్‌. మీరు ఎంత అరిచినా బయట ఎవరికీ వినిపించదు.’’ వీడికి మైండ్‌ రీడింగ్‌ తెలుసులా వుంది! గుటకలు మింగుతూ భయంగా వాళ్ళ వంక చూశాడు.

‘‘గుడ్‌. మీకు ఇప్పుడిప్పుడే చావాలని లేదని నాకు తెలుసు. కాకపోతే అది జరగాలంటే మీకు కొంత ఖర్చవుతుంది.’’

‘‘ఎంత?’’ నీరసంగా అడిగాడు.

‘‘చాలా కొంచెం. ఒక మిలియన్‌ డాలర్లు మాత్రమే!’’

‘‘అంత డబ్బు నాకెక్కడ్నుంచి వస్తుంది? అందులో నాకిప్పుడు జాబ్‌ కూడ లేదు!’’

వాళ్ళు ముగ్గురూ ఒక్కసారి ఫక్కుమని నవ్వారు.

సిగ్గుతో తలదించుకున్నాడు.

‘‘ఇప్పుడు మనకున్నవి రెండే మార్గాలు. ఒకటి, మీరా మిలియన్‌ డాలర్లనీ ఇప్పుడే బేంక్‌కి వెళ్ళి మేం ఇచ్చే నంబర్‌కి వైర్‌ చెయ్యటం. రెండోది…’’ మాటల్లో చెప్పకుండా అలా వదిలేశాడు. ఎరిక్‌ అనేవాడు తాపీగా పేంట్‌ వెనక దోపుకున్న గన్‌ బయటకు తీసి దానికి సైలెన్సర్‌ని అమర్చసాగేడు.

ప్రభా గుండెలు పీచుమంటున్నాయి.

ఊ సంకట పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలి? ఎలా?

ముందు వాళ్ళకి డబ్బివ్వటానికి ఒప్పుకుని ఎలాగోలా కొంత సమయం సంపాయించాలి.

‘‘మీరు బ్లఫ్‌ చేస్తున్నారు. ఇంత బహిరంగంగా ఓ మాల్లో ఓ మనిషిని హత్య చేసి మీరు ఎప్పటికీ తప్పించుకోలేరు!’’బింకంగా అన్నాడు.

చిరునవ్వు నవ్వాడు పీటర్‌.

‘‘అది నిజమే. కాని మేం నిన్ను ఇక్కడే చంపుతామని ఎవరు చెప్పారు? ఊరు బయట ఒక నిర్మానుష్యమైన చోటు చూసి సిద్ధం చేసే వచ్చాం. అక్కడికి తీసుకువెళ్ళి చంపి శవాన్ని తగలబెట్టేస్తాం. పోలీసులు దానిగురించి ఆరా తీసినా ఆ శవం ఎవరిదో తెలుసుకోవటం కూడా సాధ్యపడదు.’’ చాలా తాపీగా ఏ మాత్రం తడబాటు లేకుండా అతనలా చెప్పేసరికి ప్రభాకర్‌ గుండెలు జారిపోయాయి. ‘‘అసలు నువ్విప్పుడు ఆలోచించాల్సింది నీ బతుకు విలువ గురించి. అది మిలియన్‌ డాలర్లు కూడా కాదా? నువ్వే నిర్ణయించుకో!’’ అన్నాడతనే మళ్ళీ.

‘‘ఓకే, మిలియన్‌ ఇవ్వలేను కాని హండ్రెడ్‌ తౌజండ్‌ ఇస్తాను.’’

‘‘ఇది బేరసారాలకి సమయం కాదు. నీకు రెండే దారులున్నాయని చెప్పాను. వాటిలో ఒకదాన్ని ఎన్నుకోవాల్సిందే.‘‘

‘‘సరే ఐతే. మిలియన్‌ ఇస్తాను. నాకు నాలుగు రోజులు టైమ్‌ కావాలి.’’

‘‘నాలుగు నిమిషాలు కూడ ఇవ్వను… జాన్‌!‘‘

వెంటనే వేన్‌ కదిలింది.

పదినిమిషాల్లో తన బేంక్‌ ముందుకు వచ్చి ఆగింది.

‘‘ఎరిక్‌ నీతో పాటు లోపలికి వస్తాడు. నీకు కావలసిన ఫారాలు, ఎకౌంట్‌ నంబర్లు అన్నీ సిద్ధంగా వున్నాయి. నీ పని వాటి మీద సంతకం చెయ్యటం, వాళ్ళకు ఏ మాత్రం అనుమానం కలక్కుండా వైర్‌ ట్రాన్స్‌ఫర్‌ జరిగేట్టు చూడటం. ఏమైనా వెర్రివేషాలు వేశావా, ఎన్నో అనర్ధాలు జరుగుతాయి. ఒకటి, ఇప్పుడు మావాడొకడు మీ ఇంటి దగ్గర వున్నాడు. మేం సిగ్నల్‌ ఇవ్వగానే వాడు ఆ ఇంటికి నిప్పు పెట్టేస్తాడు. అలాగే నువ్వు ప్రేమగా కొనుక్కున్న కార్లన్నీ కాలిపోతాయి. రెండు, నిన్నూ, నీ కుటుంబాన్నీ వెదికి చంపుతాం. ఈ దేశంలోనే కాదు, ఇండియాలో నైనా నువ్వెక్కడున్నా సరే మా నుంచి తప్పించుకోలేవు. గుర్తుంచుకో. గుర్తుంచుకుని నీ ఆరోగ్యానికి ఏది మంచిదో అది చెయ్యి’’.

‘‘ఇప్పుడు ఇచ్చాక మీరు మళ్ళీ నన్ను బ్లేక్‌మెయిల్‌ చెయ్యరని నమ్మకం ఏమిటి?’’

‘‘నేను మాటమీద నిలబడేవాణ్ణి. నిన్ను తీసుకెళ్ళి నీ కారు దగ్గర దించాక మేం మళ్ళీ నీకు కనిపించం.‘‘

నమ్మొచ్చా? ఏడుపూ నవ్వూ ఒకే సారి వచ్చాయతనికి.

పేపర్లు చేత బట్టుకుని లోపలికి నడిచాడు. ఎరిక్‌ కూడ అతని వెనకో లైన్లో నిలబడ్డాడు. బుద్ధిగా వాళ్ళు చెప్పినట్టు చేసి వైర్‌ ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. బయటకు వచ్చి వేన్‌లో కూర్చున్నాడు. వేన్‌ వెంటనే కదిలింది.

‘‘ఇప్పుడు చెప్పండైతే. ఆ ఇంట్లో ఏం జరిగింది? నేను చూడకూడనిది ఏం చూశాను?’’ ఇప్పటికి కొంచెం ధైర్యం వచ్చిందతనికి.

‘‘మిస్టర్‌ కోకా! దయచేసి ఈ విషయం ఇక మర్చిపోండి. మళ్ళీ ఎప్పుడూ ఆ ఇంటి ఛాయలకు వెళ్ళటంగాని, చివరకు దాన్ని గురించి ఆలోచించటం కాని చెయ్యొద్దు. అది మీకే ప్రమాదం. మీరు ఏం చూశారో మీకే తెలియదు. దాన్నలాగే వుండనివ్వండి.’’

మళ్ళీ తన కారు దగ్గరకు తీసుకువచ్చి దించారతన్ని.

‘‘హేవ్‌ ఎ నైస్‌ డై!’’అన్నాడు పీటర్‌ తలుపు మూస్తూ.

‘‘యూటూ’’అప్రయత్నంగానే అని అంతలోనే నాలిక్కరుచుకున్నాడు.

నీరసంగా తన కారువైపు అడుగులేశాడు.

***

‘‘బ్రిలియంట్‌ పీటర్‌! అంతా నువ్వు చెప్పిన విధంగానే జరిగింది. యు ఆర్‌ గ్రేట్‌!!’’ అన్నాడు జాన్‌ అతన్ని అభినందిస్తూ.

‘‘అన్నీ అలా కలిసొచ్చాయి. మనం అనుకున్న ప్రొఫైల్‌కి సరిగ్గా సరిపోయిన వ్యక్తులు దొరకటం, వాళ్ళలో కొందరు మనం వాళ్ళ మెయిల్‌ బాక్సుల్లో వేసిన పేపర్లు చూసి మనం ఆశించిన వీధుల్లోనే నిఘా వెయ్యటం, మన వాళ్ళని ఫాలో కావటం… ఇవన్నీ కలిసి జరగటం అంత తేలిక కాదు. కాకపోతే వాళ్ళకి ఈ దొంగతనాల గురించి కుతూహలం కలుగుతుందని, వాటి గురించి ఆరా తీసి రెడ్‌ హేండెడ్‌గా చూడటానికి ప్రయత్నిస్తారని వేసిన నా అంచనా నిజమైంది. ఐతే, మనం గురి పెట్టిన యాభైమందిలోనూ కేవలం ముగ్గురే ఇంతదూరం వచ్చారని గుర్తుంచుకో. అలా చూస్తే, ఇదేం అంత గొప్పగా చెప్పుకోవలసిన విషయం కాదు.’’ అన్నాడు పీటర్‌ సాలోచనగా.

‘‘ఏమైనా, మన మొదటి కష్టమర్‌ దగ్గర్నుంచి మొదటి మిలియన్‌ వసూలు చేశాం. అది చాలదా!’’

‘‘ఔను. ఐతే ఇప్పుడా డబ్బుని జాగ్రత్తగా మన సొంతం చేసుకుని ఎవరికీ ఎలాటి అనుమానమూ రాకుండా మనం అనుకున్నచోటికి దాన్ని చేర్చాలి. అదీఅంత తేలిక విషయం కాదు. అందులోనూ 9/11 తర్వాత పెద్దమొత్తాల్లో జరిగే ఫైనాన్షియల్‌ ట్రాన్శాక్షన్‌లని ఎన్నో ఏజన్సీలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి.’’

దానికీ ఏదో ఆలోచించివుంటావని నాకు తెలుసు గాని, ఒకమాట చెప్పు – అతన్ని చంపుతామన్న మన బ్లఫ్‌కి అతను లొంగకపోతే ఏం చేసేవాడివి?’’

‘‘బుద్ధిగా అతన్నొదిలేసి మిగిలిన ఇద్దరి మీదా ట్రై చేసేవాళ్ళం. ముగ్గుర్లో ఒక్కడైనా నమ్మటానికి బాగా అవకాశం వుంది కదా!’’

‘‘అంతేకాని నిజంగా అతన్ని చంపే ఆలోచనే లేదంటావ్‌!’’

‘‘ఔను మరి. ఇలా ఐతే ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళకపోయే అవకాశం చాలా ఎక్కువ. అదే హత్య చేస్తే మనం ఎక్కడున్నా ప్రశాంతంగా వుండలేం ఎప్పటికీని. అలాటి జీవితం మనకెందుకు?’’

వేన్‌ బేంక్‌ వైపుకు సాగిపోయింది. *