అసంపూర్ణంగా

[విభిన్నమైన, ఆధునికమైన కథా వస్తువులతో తనదైన ఓ ప్రత్యేకమైన గొంతుతో చలిమంటలు కథా సృష్టికర్త కె. సదాశివరావు నడిపిన కథల పొది, వారి ‘క్రాస్‌రోడ్స్’. 1995లో ఈ కథాసంపుటి కోసం వడ్డెర చండీదాస్ రాసిన ముందుమాటను తాను పోగొట్టుకున్నానని, ఆ చేతిరాతప్రతి తిరిగి ఈమధ్యే దొరికిందనీ చెబుతూ సదాశివరావు ఇటీవల ఆ ప్రతిని, ఆయనే తీసిన చండీదాస్ ఫోటోని, మాతో మరికొందరు మిత్రులతో పంచుకున్నారు. ఇద్దరు రచయితల మధ్య రచనను గురించిన సంభాషణగా గుర్తిస్తూ, ఆర్కయివల్ వేల్యూ దృష్ట్యా చండీదాస్ ముందుమాటను ఈమాట పాఠకుల కోసం ప్రచురిస్తున్నాం. – సం.]

అసంపూర్ణంగా

కథ, సూక్ష్మజీవనదర్శిని, మినియేచర్ పెయింటింగ్ లాంటిది.


చండీదాస్ (ఫొటో: కె. సదాశివరావు)

ఈ కథల్లో కొన్ని, పత్రికల్లో అచ్చయినప్పుడు చదివి, మెచ్చుకుంటూ పత్రికల్లో రాశాను. చిత్రంగా అదే కథల పుస్తకం నా పీఠిక కోసం వొచ్చింది. వొక రకంగా ఇబ్బందే, మరొకసారి మెచ్చుకోవాలి కనుక.

సదాశివరావుగారు అపారంగా చదివిన వ్యక్తి. యెంతో యెన్నో తెలుసు. కథ రాసే వొడుపు తెలుసు. శిల్పం తెలుసు. తనకు తెలిసిందంతా అసందర్భంగా గుప్పించని సంయమనం ఉంది. మానవ స్వభావాన్ని విశ్లేషించే లోతు ఉంది. గొప్ప రచన.

సదాశివరావుగారి రచన ప్రౌఢం. ఉదాహరణకి ఆమె చిరునవ్వు నా గుండెను నిలువునా చీర్చింది. అది చల్లటి మంచు కత్తిలా నా గుండెల్లోకి దిగి ఆ చల్లదనాన్ని నా నరనరాల్లోకి ఎక్కించింది. భరించరాని ఆ శీతల తీక్షణతతో నేను నిలువునా వొణికిపోయాను. నాలోని అజ్ఞానపు చీకటి ఆ క్షణంలో ఎక్స్‌ప్లోడ్ అయింది. మనసంతా వెలుగు నిండింది.

క్రాస్‌రోడ్స్ వో న్యూయార్క్ మనిషి గురించి. కానీ నిజానికీ కథ ప్రత్యేకించి భారతీయుల కోసం. తన సంస్కృతిని తిరస్కరించిన వ్యక్తికి శూన్యం మిగులుతుందని తెలుపుతుందీ కథ.

తుషార బిందువులు–చదువుకునే రోజుల ఎడాల్సెంట్ డ్రీమింగ్‌కు ప్రతిబింబం. కథ మహిమ చుట్టూ తిరుగుతుంది. మనిషి స్థితి కేవలం తన గురించే కాక అంతుపట్టని ఏవో శక్తుల మీద ఆధారపడి ఉంటుంది.

లాస్ట్ పెరేడ్–భారత స్వాతంత్రదినం. యిందులో భారతీయుని గురించి కాక బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ గురించి రాయడం విశేషం. లాస్ట్ పెరేడ్ అంతా విషాదం. నౌకర్లూ చాకర్లూ పరిచయస్థులూ లగ్జరీలు హోదాలూ అహంకారాలూ అధికారాలూ వొదులుకుని యెవరూ తెలియని వాళ్ళలోకి సామాన్యపౌరులుగా వెళ్ళిపోవాలి. వో పెద్ద జమీందార్ తన ఆస్తినంతటినీ వేలం వేయాల్సొచ్చిన ఫీలింగ్. అప్పుడు వుత్తరభారతంలో జరుగుతున్న మతకలహాల అలజడి లాంటి స్థితి. చదువుతుంటే ఆ క్షణంలో అయ్యో పాపం అనిపిస్తుంది. మానవతా దృష్టితో చేసిన విశిష్ట రచన.

లాయిడ్ సాబ్–పగకీ ప్రతీకారానికీ వివేచనుండదు. లాయిడ్ సాబ్‌లోని దైన్యం సార్వజనీనం. అతను గౌరవించదగిన వ్యక్తే, మన్నించదగిన వ్యక్తే, అలాంటి శిక్షకి తగడు. జనరల్ డైయర్ చర్య లాంటిది (ఇది అతని సొంత నిర్ణయం). అమాయకుల్ని అమానుషంగా శిక్షించడం. ఆంగ్లేయ అధికారులు ప్రభుత్వోద్యోగులు మాత్రమే.

నేకెడ్ ఫకీర్–గాంధి ఔన్నత్యాన్ని అసాధారణచిత్రణతో చూపిన కథ. వొంటిన బట్ట లేకుండా మొలకింత బట్ట చుట్టుకుని సామాన్యుల్లో అతి సామాన్యుడిగా కనిపించే గాంధి కోట్లాది భారతీయులకు ఆరాధ్యుడు. ఎంత వైరి వర్గమైనా బ్రిటిష్‌వారికి అడ్మిరేషన్. గాంధిని గురించిన గొప్ప కథ.

లాస్ట్ ట్రిప్–చితికిన విలువల్లో అపార సంపద ఎలాంటి దుష్పరిణామాలకి దారితీసేదో చూపుతుంది.

నిజానికి ఇంకా చాలానే రాయాలీ పుస్తకం గురించి. కానీ రాయడం మానేసినవాణ్ణి కదా, అసంపూర్ణంగా తయారైంది.