వసనాలంపటాలెందుకు!


ఎందుకలా
విడిచేసిన
బట్టలకోసం
ప్రార్థిస్తారు?

బట్టలా అవి?

ఆవుల పాడి వాసన
వెన్న జిడ్డు
లేగ దూడలు
ఒరుసుకొని
ఒంటికంటించిన
జేగురు మట్టి
పేడకంపు

జలకాలాడి
యమునానది
ఒడ్డునున్న స్ఫటికరాళ్ళతో
ఒళ్ళురుద్దుకొని
మెరిసిపోతూ
ఇంకా
వసనాలంపటాలెందుకు
రండి ఆడుకొందాం
మధుక్రీడలు
పుప్పొడి పరాగల
పరిమళాల
మేని జలదరింపు
గాలి పడగల
వల్లెవాటు

(అతనంటాడు కదా – ఇంద్రప్రసాద్. కాలం సైకత తీరం కవితాసంపుటి నుంచి)


‘ఇంకా వసనాలంపటాలెందుకు’ అని చదవగానే ఝల్లుమన్నాయి నా తలపులు. యమున సైకత తీరంలో బృందావనిగా మారింది మనసు!

తతో జలాశయాత్సర్వా దారికాః శీతవేపితాః
పాణిభ్యాం యోనిమాచ్ఛాద్య ప్రోత్తేరుః శీతకర్శితాః
(శ్రీమద్భాగవతం – దశమ స్కంధం 22:17) స్ఫూర్తితో కావొచ్చు…

పిరుదులు దాటిన పించెపుటలకల
తురుములు వీడగఁ దొయ్యలులు
అరిది నితంబములందునె దాచుక
మురిపెపుఁ గరముల మొక్కిరి నీకు

నిద్దపు మానము నెలతలు లోగుచు
గద్దరి తొడలనె కట్టచును
ముద్దుటుంగరంబుల కరములతో
ముద్దులు గునియుచు మొక్కిరి నీకు… అని సంకీర్తించిన అన్నమయ్య (కొలనిలోన మును గోపికలు రేకు: 67-4, టీటీడీ సంపుటము: 5-214) స్ఫురించాడు.

అయితే,

యూయం వివస్త్రా యదపో ధృతవ్రతా
వ్యగాహతైతత్తదు దేవహేలనమ్
బద్ధ్వాఞ్జలిం మూర్ధ్న్యపనుత్తయేऽహసః
కృత్వా నమోऽధోవసనం ప్రగృహ్యతామ్ (వ్యాసభాగవతం- దశమ స్కంధము) అని, అదే విధంగా…

…వ్రతనిష్ఠలై యుండి వలువలు గట్టక-
నీరు జొత్తురె మీరు నియతిఁ దప్పి?
కాత్యాయనీదేవిఁ గల్ల చేయుట గాక-
నీ రీతి నోమువా రెందుఁ గలరు? (పోతన భాగవతం- దశమ స్కంధము) అనీ

అతడు అన్నాడే గాని, ఇంద్రప్రసాద్ ‘అతడు’ అన్నట్టు ‘ఇంకా వసనాలంపటాలెందుకు’ అని అన్నాడా?


భాగవత కృష్ణలీలల్లోనే కాదు, వస్త్రాపహరణం మన భారతీయ ప్రాచీన, అర్వాచీన సకల కళారూపాల్లో చాలా ముఖ్యమైన కావ్యాంశం. కథాసరిత్సాగరంలో కూడా ఆమె దిసమొల మీద అతడి వ్యామోహానికి సంబంధించిన ఉదంతాలు ఉన్నాయంటారు మర్రీ ఎమెనో (Murray Barnson Emeneau).

కెనడా దేశస్థుడైన భాషావేత్త ఎమెనో ఇంగ్లాండూ అమెరికాలలో చదువుకుని, ద్రవిడ భాషల ప్రొఫెసర్‌గా మన భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తికి ఆయన విద్యార్థి దశలో అమెరికాలో పాఠాలు చెప్పారు, ఆ తర్వాత ఆయనకి ఆజన్మ స్నేహితుడయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలో పనిచేస్తూ, భాషా పరిశోధన కోసం భారతదేశం వచ్చి ఇక్కడి సంస్కృతితో మమేకమయ్యి, దక్షిణ భారతీయ భాషలు, శబ్దాలూ, శబ్ద వ్యుత్పత్తులపై (Linguistics, phonetics and Etymology) పరిశోధన చేసి, వాటిని వెలుగు లోకి తెచ్చారు ఎమెనో. తమిళసాహిత్యం మీద విశేషమైన పరిశోధన చేశారు. ఎమెనో రాసిన ఒక వ్యాసంలో (Krsna steals the gopi’s clothes: A folktale motif) గోపికావస్త్రాపహరణం గురించి లోతైన చర్చ చేశారు:

Peripheral to this is the hero’s climbing a tree and observing the gopis thence. The ensuing discussion leads to the conclusion that the ciraharana is a floating motif of sexual fantasy, of ancient date, as attested by its wide dispersion throughout India and by its occurrence in the Kathasaritsägara.

వ్యాస భాగవతం కంటే అనాది తమిళ సంగం భక్తి కవుల కావ్యగానాల్లో, శిలప్పదికారం వంటి తమిళ ప్రాచీన సాహిత్యం, ఆళ్వారుల హరిగానం, కథాసరిత్సాగరం, బ్రహ్మ వైవర్త పురాణం, జయదేవుడి అష్టపది, లీలాశుకుడి శ్రీకృష్ణ కర్ణామృతం, చైతన్య ప్రభుపాదుల భక్తి సాహిత్యం, గుజరాత్, రాజపుట్ చిత్రలేఖన శాసనాలు.. ఇంకా అనేకానేక జానపద సాహిత్య మూలాలు ఎమెనో పరిశోధించారు:

It was seized first by the Krsna bhakti movement of south India as early as the 5th century A.D. and then by the composer of the Sanskrit Bhāgavatapurāna in the 9th or 10th century. The motif, including the detail of the climbing of the tree, then became a firmly fixed part of the Krsna cycle first in Tamilian and then Caitanya bhaktism.

తన బట్టలు కాజేసి, తనని వివస్త్రగా చూసినవాడిని పెళ్ళాడటం అనే అంశం కథాసరిత్సాగరంలో ఉన్న ఉదంతాలను ప్రస్తావిస్తారు ఎమెనో ఆ వ్యాసంలో:

The use of the motif seems to be merely a mechanism, one of a number that occur in the great body of folktales, to get the hero married.

కానీ, అన్ని సాంస్కృతిక వైరుధ్యాల మధ్య ఎదిగిన ఏ ఒక్క ‘అతడు’ కూడా ‘ఇంకా వసనాలంపటాలెందుకు’ అని మాత్రం అనలేదు ఎక్కడా.


‘వసనాలంపటాలెందుకు’ అనడం చిన్నాచితకా మాట కాదు. నేచరిజమ్ (Naturism) లేదా న్యూడిజమ్ (Nudism) సంబంధించిన సాంస్కృతిక, తాత్వికాంశాలకి అతీతమైన మాట! దుస్తుల కాపట్యాన్ని నిరసిస్తూ, భౌతిక సౌఖ్యానికి, మానసిక వికాసానికీ నగ్నత్వాన్ని కోరుకోవడం, తద్వారా ప్రకృతితో తిరిగి మమేకం కావడానికి సంబంధించిన నిన్న మొన్నటి భావాన్ని అధిగమించిన మాట. సామాజిక సమానత్వం, ఆరోగ్య ప్రయోజనం… వంటి ఆధునిక ప్రయోజనకారక సిద్ధాంతాల ప్రతిపాదనకి సంబంధించిన నడమంత్రపు యోచనలకి అందని మాట.

అపొలోనియన్-డియొనీసియన్ భావనల వైరుధ్యాల్ని వివరిస్తూ, సాంప్రదాయిక నియమాల అధిగమింపులో భాగంగా ఏ నగ్నతనైతే దైహికానుభవ సంబరంగా నీచ (Friedrich Nietzsche) ఎత్తిచూపాడో, దానికి వంతపాడే మాట కాదు. శరీరం-లైంగికత చరిత్రని తరచి చూసిన తాత్వికుడు మిషెల్ ఫూకో (Michel Foucault) వేసిన ఆధునికోత్తర వేలంవెర్రి కేకకి ప్రతిధ్వని కాదు.

విలియమ్ బ్లేక్ (William Blake) వంటి కవులు నేచరిజమ్ పేరిట అనుకరించిన దిగంబరత, పోర్నాగ్రఫీలో పొంగిపొర్లుతూ మనిషిని విషయలంపటుడ్ని చేసే ప్రదర్శనాత్మక విశృంఖలత, వాయురిజమ్ (voyeurism) వంటి పటాటోప, రోగగ్రస్త నగ్నత్వాలకి ‘వసనాలంపటాలెందుకు’ వాక్యం నప్పదు.

‘వసనాలంపటాలెందుకు’ అనడం ఈడెన్ గార్డెన్‌లో నిషిద్ధఫలాన్ని కొరికి, సిగ్గుతో సీమ అత్తి ఆకులు చుట్టుకోవడానికి పూర్వం ఆదాము-అవ్వ జీవించిన స్వచ్ఛత్వపు నమూనాకు సంబంధించిన మాట.

Your unblemished radiance rose from the foam, white and naked as a jasmine… (The fugitive) అని ఏ ఊర్వశి నగ్నతని గురించి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలుగెత్తి పాడాడో, దానికి సంబంధించిన మాట!

‘వికసిత నవ కింశుకాతామ్ర దివ్యాంశుకచ్ఛన్న చారూరుశోభా పరాభూత సిందూర శోణాయమానేంద్ర మాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే’ అని మహాకవి కాళిదాసు కీర్తించిన,

ముఖం బిన్దుం కృత్వా కుచయుగ మధస్తస్యతదధో
హరార్థం ధ్యాయేద్యో హరమహిషితేమన్మథ కలామ్
నసద్యస్సఙ్క్షో భం నయతి వనితా ఇత్యతి లఘు
త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీన్దు స్తనయుగామ్

అని ఆది శంకరులు దర్శించిన దివ్య నగ్నత్వానికి చెందినది ‘అతడి’ వాక్యం: ‘వసనాలంపటాలెందుకు.’

అలాగని అది కేవలం దైవిక నగ్నత్వానికి (Divine nudity) సంబంధించింది మాత్రమే కాదు. మహాచిత్రకారులు సాంద్రో బోత్తిచెల్లి (Sandro Botticelli: The Birth of Venus), మికెలాంజెలో (Michelangelo: David), గుస్తావ్ కూర్బే (Gustave Courbet: The Origin of the World), ఎద్వా మనే (Edouard Manet: Olympia), పాబ్లో పికాసో (Pablo Picasso: Les Demoiselles d’Avignon), గుస్తావ్ క్లింట్ (Gustav Klimt) కుంచెలకి, ప్రాక్సితెలెస్ (Praxiteles), అగస్త్ రొదాఁ (Auguste Rodin) ఉలికీ కూడా అందని….

మన అజంతా ఎల్లోరాలు, ఖజురహో, మొధేరా సూర్య దేవాలయం, ఛత్తీస్‌గఢ్ భోరామ్‌దేవ్ ఆలయం, హంపీ విరూపాక్షాలయాల్లో సాక్షాత్కరించే కళాత్మక నగ్నత్వపు (Artistic Nudity), పసిబిడ్డల నిష్కపట నగ్నత్వపు (Innocent Nudity) భావనల్ని కూడా కలబోసుకున్న పదబంధం.

ఇంద్రప్రసాద్ వాక్యమ్ రసాత్మకం కావ్యమ్!


సంపుటి: కాలం సైకత తీరం (2023)
రచన: ఇంద్ర ప్రసాద్
ప్రచురణ: ఛాయ రిసోర్సెస్ సెంటర్
పే: 156 వెల: 200రూ
ప్రతులకు: అమెజాన్, ఛాయ, అన్ని ప్రముఖ పుస్తకదుకాణాలు.