నాకు నచ్చిన పద్యం: ఒక వెచ్చని హెచ్చరిక

ఉ. “ఒక్కొకరోజు తక్కువగుచున్నది మీ బ్రతుకంచెరుంగలే
      రొక్కొరొకో! యిదేటి కునుకో!” యని వెచ్చని హెచ్చరింపుగా
      కొక్కొరొకో యటం చదిగొ కూయుచునున్నది కోడి పాకపై
      కెక్కి, లతాంగి మేలుకొనవే! కొనవే మధుపూర్ణపాత్రమున్

ఏడాదికి మనకి రెండు కొత్త సంవత్సరాలు! ఒకటి ఉగాదికి మొదలయ్యే తెలుగు సంవత్సరమయితే, మరొకటి యీ జనవరి ఒకటిన మొదలయ్యే న్యూ ఇయర్. ఒకో రోజూ ఒకో రకమైన ఆలోచనలూ అనుభూతులూ మోసుకు వస్తుంది! ఉగాది అనగానే లేత మావిడి చిగురులూ, వేపపూతలూ, కోకిల పాటలూ, కవిసమ్మేళనాలూ, తెలుగు లోగిళ్ళలో తొలి పండగ సంబరాలు. కాలచక్రం మరో ఆవృత్తిని పూర్తి చేసిన భావన. అదే జనవరి ఒకటైతే, గడచిన ఏడాది విశేషాల తలపోతలూ, కొత్త సంవత్సరపు సంకల్పాలూ, స్నేహితులకి యిచ్చిపుచ్చుకొనే శుభాకాంక్షలూను. కాలప్రయాణంలో ఒక మైలురాయి దాటి మరొక దాని దిశగా ముందుకు సాగుతున్న భావన. జనవరి ఒకటి అనగానే కాలప్రవాహాన్ని గురించిన ఆలోచనలే నా మనసులో ఎప్పుడూ సుడులు తిరుగుతాయి. ఉమర్ ఖయామ్ గుర్తుకు వస్తాడు. అతని రుబాయీలు గుర్తుకు వస్తాయి.

ఖయామ్ రుబాయీలకు తెలుగులో దాదాపు పాతిక పైగా అనువాదాలున్నాయి. ఆదిభట్ల నారాయణదాసు, ఉమర్ ఆలీషా, దువ్వూరి రామిరెడ్డి, కరుణశ్రీ, బుచ్చి సుందరరామశాస్త్రి – వీరి అనువాదాలను మాత్రం నేను చదివాను. ఇందులో మొదటి ముగ్గురూ నేరుగా పారసీ రుబాయీల ఆధారంగా అనువాదాలు చేశారు. మిగతా అందరికీ Fitzgerald చేసిన ఇంగ్లీషు అనువాదమే ఆధారం. వీటన్నిటిలో ఏది గొప్పదని చెప్పడం సాధ్యం కాదు, దాని అవసరమూ లేదు. ప్రతి అనువాదంలోనూ కొన్ని ఆణిముత్యాలున్నాయి. కరుణశ్రీ గారంటే కాస్తంత ఎక్కువ అభిమానం కాబట్టి ఆయన పద్యాన్ని ఇవాళ ఎంచుకున్నాను.

ఈ పద్యానికి అర్థాన్ని విడమరచి చెప్పాల్సిన అవసరం లేదు. కరుణశ్రీ పద్యాలు ఒలిచిపెట్టిన పనసతొనల్లా ఉంటాయి. నోటికానుతూనే కమ్మగా కరిగిపోతాయి. భావం కూడా సుగమమే. కోడి కూత నెపంతో, కరిగిపోయే కాలాన్ని గురించి హెచ్చరిస్తున్నాడు కవి. కాలం క్షణక్షణం గడచిపోతోందనీ, అలా గడచిన కాలం తిరిగి రాదనీ మనందరికీ తెలుసు. అయినా చాలాసార్లు ఆ సంగతి మరిచిపోతూ ఉంటాం. అనవసరమైన ఝంఝాటాలలో యిరుక్కుపోయి, మనం బాధపడుతూ పక్కవాళ్ళని బాధపెడుతూ ఉంటాం. ఇది తెలివిమాలినతనం కాక మరేమిటి! అందులోంచి బయటపడి, తెలివి తెచ్చుకొని, జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని పిలుపునిస్తున్నాడు కవి. అయితే ఆ ఆనందమయపాత్రని ఎవరికి వాళ్ళు వెతుక్కోవలసిందే!

కోడి కూతకి భాష్యాన్ని మాత్రమే చెప్పాడు ఖయామ్. కరుణశ్రీ తన పద్యంలో ఆ కూతని వినిపించారు కూడా! తెలుగు పద్యంలో కోడి కదా, అంచేత అది ‘కొక్కొరోకో’ అని కూసింది. పైగా ఒక్కసారి కాదు మూడుసార్లు! పద్యం మొదలుపెడుతూనే ఒక్కొకరోజు అన్న పదబంధంలోని కకార రకారాలు మనకా కూతని వినిపిస్తాయి. అలాగే రెండో పాదంలో లేరు + ఒక్కరు + ఒకో అన్న పదాల కలయికలో రెండో సారి, మూడో పాదంలో నేరుగా కొక్కొరొకో అని మూడోసారి వినిపిస్తుంది. ఇలా, చెపుతున్న భావాన్ని శబ్దాలతో పలికించడాన్ని ఇంగ్లీషులో onomatopoeia అంటారు. సంస్కృతాలంకారికులు దీనినే వికటత్వము అనే గుణంగా గుర్తించారని ‘కవిత్వము – వికటకవిత్వము’ వ్యాసంలో శ్రీ ఉపాధ్యాయుల అప్పలనరసింహంగారు వివరిస్తారు. ‘శబ్దం అర్థానికి ఊడిగం చెయ్యాలి,’ లాంటి మాటలు వట్టి వైపరీత్యపు మాటలు. ‘శబ్దార్థౌ సహితౌ కావ్యం’ అని లక్షణ పద్ధతిలో భామహుడు చెప్పినా, ‘వాగర్థావివ సంపృక్తౌ’ అని కవితాత్మకంగా కాళిదాసు చెప్పినా, మన కవిత్వ సంప్రదాయంలో శబ్దార్థాలకి సమప్రాధాన్యం ఉంది. వికటకవిత్వం అన్న పదానికి కాలక్రమంలో నిందార్థం వచ్చింది కానీ ప్రాచీన ఆలంకారికుల దృష్టిలో వికటాక్షరబంధం ఒక కవిత్వ గుణం. భావాన్ని మింగేయనంత వరకూ శబ్ద చమత్కారం కవిత్వానికి సౌందర్యాన్ని అందిస్తుంది. ఈ పద్యంలో అది అనువాదానికి ఒక కొత్త అందాన్ని తీసుకువచ్చింది. ‘మేలుకొనవే, కొనవే’ అనడంలోని యమకం కూడా పద్యానికి సొగసునిచ్చింది. ‘వెచ్చని హెచ్చరింపు’ అన్న పదబంధంలోని శబ్దార్థాల సంయోగం మనసుని పట్టేస్తుంది.

ఇక్కడ కవిత్వానువాదం గురించి కొంచెం ముచ్చటించుకోవాలి. ఒక అనువాదం మంచి అనువాదం కావాలంటే ముందుగా అది అనువదింపబడిన భాషలో మంచి కవిత్వం అయి ఉండాలి. అనువదింపబడిన భాషలో అది మంచి కవిత్వమా కాదా అని నిర్ణయించడానికి మూలంతో పనిలేదు. అసలలాంటి విచారం చేసేటప్పుడు మూల ప్రసక్తి తీసుకురాడం సమంజసం కాదని నా అభిప్రాయం. అనువాదం మంచి కవిత్వమని నిర్ధారించుకున్నాక, అది మంచి అనువాదమా కాదా అన్న విశ్లేషణ మొదలవుతుంది. మూలంలోని భావం స్పష్టంగా ఉన్నప్పుడు, అది అనువాదంలో కూడా పూర్తిగా ప్రతిబింబించాలి. ఒకవేళ మూలంలో అస్పష్టతకి అవకాశం ఉన్నట్లయితే, అనువాదం మరికాస్త మెళకువగా చేయాల్సి ఉంటుంది. దాని గురించి ప్రస్తుతం వివరాల్లోకి పోదల్చుకోలేదు. మంచి అనువాదంలో ముఖ్యంగా ఉండాల్సిన మరో గుణం – మూల కవిత్వంలో ఉండే ధ్వనిని అనువాదంలో కూడా పొందుపరచగలగడం. అలా పూర్తిగా పొందుపరచ లేకపోయినా, దాన్ని వాచ్యం చేయకుండా ఉండాలి. నా దృష్టిలో మంచి అనువాదానికి ఉండాల్సిన లక్షణాలివి. మూలంలో లేని అంశాలు అనువాదంలో అదనంగా ఏమైనా వస్తే, అవి మూల భావాన్ని చెడగొట్టకుండా మరికాస్త కాంతివంతం చేసేలా ఉండడం ముఖ్యం. అంతేకాని మూలభావాన్ని మక్కీకి మక్కీగానే అనువదించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి – ఈ పద్యంలో కనిపించే ‘మేలుకొనవే, కొనవే మధుపూర్ణపాత్రమున్’ అనే భావం మూల పారసీ రుబాయీలో కాని, Fitzgerald ఆంగ్లీకరణలో కానీ లేదు. ఇది కరుణశ్రీ చేసిన కొనసాగింపు. ఇతర ఖయాము రుబాయీలలో ఈ భావం కనిపిస్తుంది కాబట్టి ఇందులో కూడా దాన్ని చేర్చడంలో అనౌచిత్యం లేదు. అలాగే ‘హెచ్చరింపు’కి వాడిన వెచ్చదనపు విశేషణం కూడా కరుణశ్రీ చేర్చినదే. ఇది కూడా అనువాదానికి అందాన్ని తెచ్చిన చేర్పే. కరుణశ్రీ చేసిన అనువాదాలన్నీ మేలైనవని నేను అనను కాని యీ పద్యం మాత్రం నా దృష్టిలో చక్కని అనువాదమే.

ఖయామ్ కవిగా కన్నా తన కాలంలో ఖగోళ జ్యోతిష్య శాస్త్రవేత్తగానే చాలా ప్రసిద్ధుడు. అల్‌జబర్ (మనకిప్పుడు తెలిసిన ఆల్‌జీబ్రాకి మూలం ఇదే!) అనే గణితగ్రంథాన్ని రచించిన గొప్ప గణితశాస్త్రజ్ఞుడు కూడా. ఖయామ్‌ది వైవిధ్యభరిత వ్యక్తిత్వం. అతడొక శాస్త్రవేత్త, తత్త్వవేత్త, కవి. అందుకే తార్కికత, తాత్వికత, మార్మికతల విశిష్ట సంగమం అతని రుబాయీలు. అతని రుబాయీలలో కాలాన్ని గురించిన ప్రస్తావన ఎక్కువగానే కనిపిస్తుంది. కాలం, పగలు రాత్రి అనే కత్తెరతో మనిషి ఆయువు అనే వస్త్రాన్ని నిరంతరం కత్తిరించేస్తుందని అంటాడు ఒక చోట. ‘గతము గతంబె యెన్నటికి కన్నుల గట్టదు, సంశయాంధ సంవృతము భవిష్యదర్థము’ – కాబట్టి వర్తమానం ఒక్కటే నిజమైనదీ, అనుభవించ దగినదీ అంటాడు. ‘అయయో! యెందఱి మానవోత్తముల కంఠారావుముల్ ద్రుంచె నిర్దయమౌ కాలము,’ అన్న ఖయాము మాటలకు, ‘కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ బొంగరే! వారేరీ సిరి మూటగట్టుకొని పోవన్ జాలిరే,’ అన్న పోతన పలుకులు ప్రతిధ్వనుల్లా వినిపిస్తాయి. కొన్నిచోట్ల కాలంపై తన నిరసన ఘాటుగా వ్యక్తపరుస్తాడు. ‘కాలమ! నీవు నీ కపట కారణమున్ బ్రకటించి యీ జగజ్జాలము మ్రింగుచుంటివి,’ అంటాడు. మరికొన్ని చోట్ల, ‘ఆది మధ్యాంత రహితమై అలరుచుండు కాలయవనిక భేదింపగలమె మనము!’, ‘సమయపుపాత్ర లోతు గన శక్యముగాదు’ – అంటూ కాల మహత్వాన్ని గురించి తలచి ఆశ్చర్యపడతాడు. మొత్తమ్మీద చూస్తే, కాలగతిని ఖయాము సరళరేఖగానే దర్శించినట్టుగా నాకు అనిపిస్తుంది.

గతించే కాలాన్ని గురించి ఖయాము చేసిన హెచ్చరిక, వ్యక్తిగా ప్రతి మనిషికే కాకుండా, మొత్తంగా మానవజాతికి కూడా అన్వయించుకోవచ్చు. మొత్తం సృష్టిలో ఒకానొక జీవిగా మన మానవజాతి ఆయుఃప్రమాణమెంత? దాన్ని మనం ఎంతవరకూ సద్వినియోగం చేసుకుంటున్నాం? బుద్ధిజీవులమైన మనం ఆ బుద్ధిని దేనికోసం ఉపయోగిస్తున్నాం? జారిపోయే కాలం విలువని తెలుసుకోనీయకుండా ఏయే ఉన్మాదాలు మన బుద్ధిని ఆక్రమించేస్తున్నాయి? మతోన్మాదం, మదోన్మాదం, ధనోన్మాదం, అధికారోన్మాదం – ఎన్నెన్నో ఉన్మాదాలు! క్యాన్సరు కణాలు ఒక జీవిలోని మిగతా కణాలను మాత్రమే నశింపజేస్తాయి. మనిషి తన సాటి మనుషులనే కాకుండా ప్రకృతిని కూడా నాశనం చేస్తున్నాడే, తన మితిమీరిన స్వార్థానికి. గతించిపోతున్న ఒక్కొక్క సంవత్సరంలో కాలశరీరం మీద ఎన్నెన్ని దురాగతాల మచ్చలని వదలివెడుతున్నాడు మనిషి! మనసుపెడితే, ఈ విషయాలన్నీ ఆలోచించమనే వెచ్చని హెచ్చరిక, ప్రతి కోడికూతలోనూ వినిపిస్తుంది. కనీసం కొత్త ఏటి మొదటిరోజైనా మనం దాన్ని విందాం. వ్యక్తులుగా మన మన ఆనందం కోసం చేసే వెదుకులాట వ్యష్టిగా సాగినా, ఒక జాతిగా, మానవమనుగడలోని ఆనందం కోసం, దాన్ని అందిచ్చే మధుపాత్ర కోసం, మనమందరం సమష్టిగా అన్వేషించాల్సిన అవసరం ఉందేమో అని నాకనిపిస్తుంది. ఆ అన్వేషణలో ఒక అడుగైనా ముందుకు వేస్తామన్న శుభాకాంక్షతో యీ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం!