నేనొక చిత్రమైన చిక్కుముడి: 3. తార్కికంగా తర్కాన్ని తోసిరాజన్న తర్కం

ఇదం శ్రేష్ఠం జ్యోతిషాం జ్యోతిరుత్తమం విశ్వజిద్ ధనజిద్ ఉచ్యతే బృహత్।
విశ్వభ్రాడ్ భ్రాజో మహి సూర్యో దృశ ఉరు పప్రథే సహ ఓజో అచ్యుతమ్ ॥

-ఋగ్వేదం 10-170-03

పొద్దు పొడిచింది. తూర్పు దిక్కున సూర్యకిరణాలు ప్రసరించాయి. శ్రేష్ఠుడు, జ్యోతులన్నింటిలో గొప్ప జ్యోతి, విశ్వాన్నీ సంపదనూ జయించినవాడు, తాను వెలుగుతూ విశ్వాన్ని వెలిగించే మహిమాన్వితుడూ అయిన సూర్యుని బ్రహ్మాండమైన కాంతి ప్రపంచమంతటా వ్యాపించి, అందరికీ దృష్టిని ప్రసాదించింది.

నేను తిరిగి ప్రయాణం ప్రారంభించాను. ఆత్మసూచన గురించీ, అది సృష్టించే పేరడాక్సుల గురించీ నా ‘ఎడమ నేను’ చెప్పిన విశేషాలను రాత్రి చాలా సేపు ఆలోచించాను. ఒక పదం కాని వాక్యం కాని తన గురించి తాను సూచించుకోగలదా? ఒక ప్రతిపాదన కచ్చితంగా నిజమో అబద్ధమో అయి తీరాలా? ఆ పల్లెటూరి ఆసామి గడ్డం సంగతి ఏమై ఉంటుంది? లాజిక్కుకీ గణితానికీ ఉన్న సంబంధం ఏమిటి? రసెల్ తన ప్రయాసలో విజయాన్ని పొందాడా? మాటలకీ ఆలోచనలకీ మధ్యనున్న సంబంధం ఎలాంటిది? ఆలోచన గురించి నా ఆలోచనలు యిలా సాగిపోయాయి.

తర్కాన్ని గురించి పాశ్చాత్యుల ఆలోచనలు సమంజసంగానే అనిపించాయి నాకు. కానీ ఎందుకో అవి పూర్తి సత్యాన్ని ఆవిష్కరించగలవనే నమ్మకం మాత్రం కలగటం లేదు. ఆ తర్కంలో ఆలోచన ముక్కుసూటిగా ఒక మార్గంలో మునుముందుకి సాగిపోతుంది. అదే ఒక వంపు తిరిగి, తన వైపుకు, తన లోపలకు తిరుగు ప్రయాణం మొదలుపెడితే, మెలిక పడ్డట్టే! అలాంటి మెలికలే తిరకాసులకు కారణమని అనిపించింది.

“ఏదో దీర్ధంగా ఆలోచిస్తున్నావ్?”

సాగిపోతున్న నా ఆలోచనకు అడ్డుకట్టూ వేస్తూ ఎడమ వైపునుంచి ప్రశ్న. ఆ గొంతు ఇప్పటికి బాగానే పరిచయమయింది కాబట్టి యీసారి నేను ఉలికిపడలేదు.

నేను: నిన్న నువ్వు చెప్పిన సంగతుల గురించే.

ఎడమ నేను: ఏంటి?

నేను: లాజిక్కు విషయమై పాశ్చాత్య దృక్పథంలో ఒక సూటిదనం ఉంది. అది నిక్కచ్చిదనాన్నీ, నిర్దిష్టతనీ కోరుకుంటుంది.

ఎడమ నేను: అవును. లాజిక్కు ఎప్పుడైనా నిక్కచ్చిగానే ఉండాలి కదా. లేకపోతే దాని వల్ల ఉపయోగం ఏముంది చెప్పు?

నేను: కానీ ప్రపంచ వ్యవహారంలో అలాంటి కచ్చితత్వం ఉంటుందా? మచ్చుకి, ఆ క్షురకుని ఉదంతమే తీసుకుందాం. తమకి తాము గడ్డం గీసుకోని వాళ్ళకు తను గీస్తాను అనే నియమం అతని ఉద్దేశంలో యితరులకు మాత్రమే వర్తిస్తుంది. అలా అనుకున్నప్పుడు అందులో తిరకాసు ఉండదు కదా!

ఎడమ నేను: అవును. అది చూసే దృక్పథం బట్టి ఉంటుంది. సందర్భాన్ని అనుసరించి, చెప్పిన వారి ఉద్దేశాన్ని ఊహించి, దాని బట్టి వాక్యానికి అర్థం చెప్పుకోవచ్చు అనడం ఒక రకమైన పరిష్కారం. కానీ గణితం, తర్కం లాంటి శాస్త్రాలలో సమయానికి తగు మాటలాడెనే అన్నట్టుగా–ప్రతిపాదనలను కానీ నియమాలను కానీ సందర్భానుసారంగా మార్చుకోవడం అంతగా కుదరని పని. క్షురకుని నియమం ఆ ఊళ్ళో అందరికీ వర్తిస్తుందన్నప్పుడు, ప్రత్యేకంగా తనకు వర్తించదని చెపితే తప్ప అతనిక్కూడా స్వయంగా వర్తింపజేయాల్సి వస్తుంది. అలాంటి స్వయంసూచన తిరకాసుకే దారి తీస్తుంది.

నేను: అలా అంటావా. సరే, ఇంతకీ దృక్పథం అంటే గుర్తుకొచ్చింది. ఈ ఆత్మసూచన గురించీ, తిరకాసుల గురించీ మన భారతీయుల దృక్పథం ఏమిటన్నది మాట్లాడుకుందామన్నావు కదా. దాని విషయమై చెప్పు.

ఆత్మసూచన, తిరకాసులు: భారతీయుల చింతన

ఎడమ నేను: ఆఁ, అవును కదా! భారతీయ తత్త్వవేత్తలు కూడా ఈ విషయాల గురించి శాస్త్రీయంగా ఆలోచించారు.

నేను: భారతీయ తత్త్వమంతా చాలా మార్మికతతో నిండిపోయి ఉంటుందనుకున్నాను, అందులో శాస్త్రీయతకూ, తర్కానికీ చోటుందా?

ఎడమ నేను: నీకు ప్రాచీన భారతంలో అభివృద్ధి చెందిన శాస్త్రాల గురించి బొత్తిగా తెలిసినట్టు లేదు.

నేను: నువ్వు కూడా ‘అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయిష’ అనే వాళ్ళతో గొంతు కలుపుతున్నావా ఏమిటి!

ఎడమ నేను: లేదు. కానీ మన గురించి మనం కాస్తయినా తెలుసుకోడం అవసరం అంటున్నాను. భారతదేశంలో తత్త్వ చింతనతో పెనవేసుకుని జ్ఞానమీమాంస (Epistemology), సత్త్వమీమాంస (Ontology), తర్కం (Logic); ఈ మూడు శాస్త్రాలూ అభివృద్ధి చెందాయి. వాటితో పాటు కలిసిమెలిసి ఎదిగిన మరొక ముఖ్యమైన శాస్త్రం భాషాశాస్త్రం. సరే, నీకు అరిస్టాటిల్, ప్లాటో పేర్లు తెలుసన్నావు కానీ మేధాతిథి గౌతముడు, కణాదుడు, నాగార్జునుడు; వీరి పేర్లు విన్నావా?

తల అడ్డంగా ఊపాను.

నేను: ఎవరు వాళ్ళు? తత్త్వవేత్తలా?

ఎడమ నేను: అవును. ‘ఆన్వీక్షికి’ అనే పేర తర్కాన్ని మొట్టమొదట ఒక శాస్త్రంగా, విద్యగా రూపొందించినది మేధాతిథి గౌతముడని అంటారు. మేధాతిథి ప్రస్తావన భాసుని ప్రతిమా నాటకంలో వస్తుంది.

నేను: ఓ! భాసుడు కాళిదాసు కన్నా ముందరివాడు కదా!

ఎడమ నేను: అవును. అంతేకాదు నాలుగు విద్యలలో ఆన్వీక్షికిని ఒక విద్యగా కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో పేర్కొన్నాడు. ఆన్వీక్షికికే హేతువిద్య, హేతుశాస్త్రం, తర్కవిద్య, వాదవిద్య అనే పేర్లు కూడా ఉన్నాయి. చరకసంహిత, పాణిని అష్టాధ్యాయి లాంటి గ్రంధాలలో ఆన్వీక్షికి ప్రతిపాదించిన హేతువాద పద్ధతుల ఉపయోగాన్ని గమనించవచ్చు.[1] ఆ పద్ధతులు మన దర్శనాలలో కూడా కనిపిస్తాయి

నేను: దర్శనాలంటే?

ఎడమ నేను: భారతదేశంలో రకరకాల తత్త్వ సిద్ధాంతాలు దర్శనాలుగా అభివృద్ధి చెందాయి. ఒక్కో దర్శనం మన గురించీ, మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించీ ఒకొక్క విలక్షణమైన దృక్పథాన్ని ప్రతిపాదించింది, సిద్ధాంతం చేసింది.

నేను: ఓహో!

ఎడమ నేను: ఇందులో వేదోపనిషత్తులను ప్రమాణంగా తీసుకున్న దర్శనాలు కొన్ని, వీటిని ఆస్తిక దర్శనాలంటారు. వేదాన్ని ప్రమాణంగా తీసుకోని దర్శనాలు మరికొన్ని, వీటిని నాస్తిక దర్శనాలంటారు. సాంఖ్యం, యోగం, న్యాయం, వైశేషికం, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అనే ఆరూ ముఖ్యమైన ఆస్తిక దర్శనాలు. చార్వాకం లేదా లోకాయతం, బౌద్ధం, జైనం మొదలైనవి నాస్తిక దర్శనాలు.

నేను: బౌద్ధం, జైనం మతాలు కదా, అవి దర్శనాలా?

ఎడమ నేను: ఆ రెండూ ప్రత్యేకమైన మతాలుగా కూడా అభివృద్ధి చెందాయి. వాటి వెనకనున్న తాత్త్విక సిద్ధాంతాలు దర్శనాలుగా రూపొందాయి. సాంఖ్య దర్శనాన్ని కపిలుడు స్థాపించాడు. యోగాన్ని పతంజలి, న్యాయాన్ని అక్షపాద గౌతముడు, వైశేషికాన్ని కణాదుడు, పూర్వమీమాంసను జైమిని, ఉత్తరమీమాంసను బాదరాయణుడు స్థాపించారు. లోకాయతాన్ని బృహస్పతి, బౌద్ధాన్ని బుద్ధుడు స్థాపించారు. జైన మతానికి మొదలు ఋషభనాథుడని అంటారు. కాని దాన్ని దర్శనంగా తీర్చిదిద్ది ప్రచారం చేసినది మహావీరుడు.

నేను: ఓహో! ఇందాక మేధాతిథి గౌతముడన్నావు. ఇప్పుడు అక్షపాద గౌతముడా!

ఎడమ నేను: అవును. కచ్చితంగా చెప్పలేం కానీ ఈ యిద్దరూ ఒకరే కావచ్చు.[2] వీళ్ళ పేర్లన్నీ చిత్రంగానే ఉంటాయి! కపిలుడంటే గోరోజనం రంగులో ఉండేవాడని అర్థం. అక్షపాదుడు అంటే కాళ్ళలో కన్నులున్నవాడు. కణాదుడు అంటే కణాలను తినేవాడు. పతంజలి అంటే అంజలిలో పడ్డవాడు, లేదా అంజలిస్తూ పడ్డవాడు!

నేను: భలే!

ఎడమ నేను: గౌతముడు అనే పేరు చాలా చోట్ల వస్తుంది. అహల్య భర్త గౌతముడు, మేధాతిథి గౌతముడు, అక్షపాద గౌతముడు, గౌతమ బుద్ధుడు, మహావీరుని ముఖ్యశిష్యుడు మళ్ళీ గౌతమ స్వామి, ఇలా. పేర్ల సంగతి అలా ఉంచితే, యీ దర్శనాలన్నీ తత్త్వ విచారణలో తర్కాన్ని అంతో ఇంతో వాడినవే.

నేను: మరి నాగార్జునుడి సంగతి ఏమిటి?

ఎడమ నేను: నాగార్జునుడు బౌద్ధ దర్శనకారులలో ముఖ్యుడు, గొప్ప తార్కికుడు కూడా. దర్శనాలలో చార్వాకం, బౌద్ధం తర్కానికి ప్రముఖ స్థానాన్ని కల్పించి, అందులో చాలా కృషి చేసాయి. భారతీయ తర్కాన్ని ఒక పూర్తి శాస్త్ర స్థాయికి అభివృద్ధి చేసినది మాత్రం న్యాయ దర్శనం అని చెప్పాలి. ఈ దర్శనాన్ని అనుసరించేవారిని నైయాయికులంటారు. న్యాయ దర్శనాన్ని న్యాయశాస్త్రమనీ, తర్కశాస్త్రమనీ కూడా కొందరు వ్యవహరిస్తారు. వైశేషికులు, జైనులు కూడా తర్కానికి తమ దర్శనాలలో ప్రముఖ స్థానాన్ని యిచ్చారు.

నేను: అదేమిటి! తర్కానికి న్యాయాన్యాయాలతో పనిలేదన్నావు నిన్న. ఇప్పుడేమో న్యాయ దర్శనమే తర్కశాస్త్రం అంటున్నావు!

ఎడమ నేను: బాగా గుర్తుపెట్టుకున్నావే! ఈ ప్రశ్న నువ్వు వేస్తావా లేదా అని అనుకున్నాను. ఈ కాలంలో మనకి ‘న్యాయం’ అనే పదానికి Morals/Ethics అనే అర్థాలు వాడుకలోకి వచ్చేసాయి. నిన్న నేనన్న మాట ఆ అర్థంలోనే. ప్రాచీనకాలంలో దానికా అర్థం లేదు. Morals/Ethics అనే పదాలకు కచ్చితమైన పదాలు సంస్కృతంలో లేవనే చెప్పవచ్చు. అన్నిటికన్నా దగ్గరగా వచ్చేది ‘నీతి’.

నేను: ఊఁ, మరి న్యాయమంటే?

ఎడమ నేను: న్యాయం అంటే ప్రతిపాదితమైన ఒక విషయాన్ని సిద్ధింపజేయడానికి ఉపయోగించే విద్య అని అర్థం.[3] అంటే ప్రతిపాదనలను సిద్ధాంతంగా నిరూపించే శాస్త్రం. అందుకే అది తర్కానికీ హేతువుకూ చాలా సన్నిహితం. ఇది ప్రధానంగా హేతుబద్ధమైన వాద పద్ధతిని నిర్వచిస్తుంది. ఈ పద్ధతిని అనుసరించే పూర్వం వాద ప్రతివాదాలన్నీ జరిగేవి.

నేను: ఓహో! అయితే గ్రీకు తత్త్వవేత్తల్లాగానే యీ నైయాయికులు కూడా తర్కానికి చాలా గొప్ప స్థానాన్ని యిచ్చారన్నమాట.

ఎడమ నేను: ముఖ్యస్థానమే యిచ్చారు. కానీ పాశ్చాత్య తత్త్వవేత్తలు కొందరు భావించినట్టు, తర్కమే పరమార్థం అని భావించలేదు. అక్కడే పాశ్చాత్య భారతీయ చింతనలలో ఒక ముఖ్యమైన తేడా కనిపిస్తుంది., మనవాళ్ళు తర్కాన్ని ప్రధానంగా వాదానికి ఉపయోగపడే శాస్త్రంగానే వినియోగించారు తప్ప, తర్కమే పరమ సత్యమనే భావన కనిపించదు. న్యాయ వైశేషికులు కూడా తర్కాన్ని తమ తత్త్వచింతనకు ఆలంబనగా, ఉపకరణంగా వినియోగించారు తప్పించి, అదే పరమ సత్యమని భావించలేదు.

నేను: ఓహో!

ఎడమ నేను: తర్కం,హేతువు కూడా మానవ బుద్ధినుంచి పుట్టేవేననీ, మానవ బుద్ధి పరిమితమైనదనీ భావించడం వల్ల కాబోలు, తర్కాన్నీ హేతువునూ అధిగమించిన పరమ సత్యం కోసం భారతీయ తత్త్వవేత్తలు తమ అన్వేషణ సాగించారు. అంత మాత్రాన భారతీయులు తర్కానికి తక్కువ స్థానం యిచ్చారని అనుకోవడం పెద్ద తప్పే అవుతుంది. తత్త్వసిద్ధాంతాల ప్రతిపాదనలో, తప్పొప్పుల విచారణలో, వాద ప్రతివాదాలలో తర్కానికి తిరుగులేని ప్రాధాన్యం ఉంది. మనకు లభిస్తున్న తత్త్వ వాఙ్మయమంతటా ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

నేను: ప్రాచీనకాలంలో జ్యోతిషం, గణితం, వైద్యం కూడా శాస్త్రాలుగా అభివృద్ధి చెందాయి కదా భారతదేశంలో?

ఎడమ నేను: అవును. అవికూడా ప్రాచీన భారతంలో అభివృద్ధి చెందిన శాస్త్రాలే. అయితే వాటిలో తత్త్వచింతన తక్కువ. అవి వేదాలలో ఉన్న యజ్ఞయాగాదులను సరిగా ఆచరించడానికి ఏర్పడ్డ శాస్త్రాలు. వేదాన్ని అర్థం చేసుకోడానికి పుట్టిన మరొక శాస్త్రం భాషాశాస్త్రం. అయితే అనంతరం అది తాత్త్విక భూమికతో స్వతంత్రమైన గొప్ప శాస్త్రంగా ఎదిగింది.

నేను: అలాగా.

ఎడమ నేను: ఒకరకంగా, తత్త్వ విచారంలో పాశ్చాత్యులు తర్కానికీ ఆలోచనకూ యిచ్చిన స్థానాన్ని భారతీయులు వాక్కుకు, శబ్దానికి యిచ్చారని చెప్పవచ్చు. ఆరు వేదాంగాలలో నాలుగు అంగాలయిన శిక్ష, నిరుక్తం, ఛందస్సు, వ్యాకరణం–భాషకు సంబంధించినవే కావడం ఇందువల్లనే. అరిస్టాటిల్ ఆలోచనే దేవుడని అన్నట్టుగా, భారతీయులు వాక్కును పరబ్రహ్మగా భావించారు. వేదంలో కూడా దీనికి మూలాలు కనిపిస్తాయి.

నేను: వేదాలలో అగ్ని, సూర్యుడు, వరుణుడు మొదలైన ప్రకృతి శక్తులే కదా ప్రధాన దేవతలు?

ఎడమ నేను: అవును, ఆ వేదాలలోనే అభౌతికమైన వాక్కును కూడా ఒక దేవతగా భావించడం, మన ప్రాచీనులు వాక్కుకిచ్చిన అత్యున్నత స్థానాన్ని ప్రతిఫలిస్తుంది.[4] యాస్కుని నిరుక్తం, పాణిని అష్టాధ్యాయి, దానికి పతంజలి మహాభాష్యం, భర్తృహరి వాక్యపదీయం, వీటికి అనేకులు రచించిన వ్యాఖ్యానాలు; యిలా ప్రాచీన భారతంలో భాషాశాస్త్రం సర్వోత్కృష్టమైన అభ్యున్నతిని సాధించింది. వ్యాకరణం శబ్దబ్రహ్మాన్ని చేరుకొనే ఒక స్వతంత్ర తాత్విక దర్శనంగా కూడా పరిగణించబడింది.

నేను: ఓహో! మొత్తానికి భారతీయ తత్త్వచింతన గురించి కనీసం కొన్ని పేర్లయినా ఇవాళ తెలుసుకోగలిగాను. ఇంతకీ అసలు తిరకాసుల సంగతి ఏమయింది? ముఖ్యంగా ఆత్మసూచనకి సంబంధించిన తప్పొప్పుల తిరకాసుల్లాంటివి మరి మన శాస్త్రాలలో కాని, దర్శనాలలో కాని ఎక్కడయినా కనిపిస్తాయా?