రంగులు విరజిమ్ముతూ
మెరిసే సంధ్య గురించి
బెంగెట్టుకో కూడదు
అదెలాగూ రాత్రిలోకి ఒలికిపోతుంది
మరి, కరెంటు, కేబుల్ వైర్ల చిక్కుల్లో
కనిపించని నక్షత్రాల సంగతి?
మేఘాలదేముంది,
వస్తూంటాయి, కమ్ముకుంటాయి
ఏమీ ఎరగనట్టు జారుకుంటాయి
నంగనాచులవి.
ఎవరూ, కిటికీలకి ఇంకా కర్టెన్స్ వేయలేదు
నాకేమీ ఉత్సుకత లేదు
అలాని నిర్వేదమూనూ.
వాకిలిలో ఒక పూలగుత్తి వుంచారు
వెళ్ళి చూసేలోగానే
పరిమళం నాసికాగ్రంపై కొలువైంది
గుమ్మంలో నడుంపై చేతులేసుకుని ఆమె
గుప్పెడు తోకచుక్కలను రువ్వుతూ కళ్ళెగరేసింది
ఎవరి కోసం అంత ఆత్రం అన్నట్టు.
గదిలోని చీకటితో వెన్నెల బింకాలు పోతోంది
పూలు వాడిపోతున్నా
సువాసన సజీవం గదూ!