నాకు నచ్చిన పద్యం: పొలయలుక

సీ.
పనిపాటలను దీఱమి నటించి, క్రీగంటఁ జూచి, తన్ జూచినఁ జూడ్కి మలపి
సాకునన్ బిలిచి, ముచ్చటలాడ, వెలిఁబాఱు చిఱునవ్వుతెరల వాతెఱ నడంచి
తళుకుఁ జెక్కిలికిఁ జక్కిలిగింత నిడ, నింక “నొట్టుసుమీ” యంచు నోసరించి
అడుగులం బడి, బాస లిడఁబోవ, “నీ వెంతకేనిఁ జాలు” దని, సిగ్గూని తొలగి

అట్టె చని, కౌఁగిటం జేర్చినంతఁ గన్ను గొలుకులన్ నీరు నించి, కాంతులఁ గరంచు
చెలుల పొలయల్కలే ప్రేమజీవకళలు పానకమునకు మిరియంపుఁ బసలు వోలె.

రసము సామాజికనిష్ఠమని విజ్ఞుల మాట. ఏదేని ఒక నాటకంలోని ఒక సన్నివేశాన్ని మన ఎదురుగా అందులోని పాత్రలు విలీనమనస్సుతో అభినయిస్తున్నపుడు ప్రేక్షకుడిలో తజ్జన్యమైన అనుభూతి ఎంత గొప్పగా కలుగుతుంది అనేది అతనిలోని రసజ్ఞతపై ఆధారపడుతుంది. రసజ్ఞుడికి సాహిత్యానుభూతి లోనికి చొచ్చుకొని వెళుతుంది. ఆనందమై వెలుగుతుంది. వాసనగా శమిస్తుంది. తరువాత మరెపుడైనా నిజజీవితంలో ఒక సంఘటన ద్వారానో, లేదా స్మృతిపథంలో ఆ సన్నివేశం కదలాడినపుడో ఒక సాత్త్వికవిద్యుత్తు ఆ లోని వాసనను తాకినపుడు అది పునఃప్రజ్వరిల్లి, హృదయాన్ని ఆనందనిలయంగా మారుస్తుంది. ఇందుకోసమే ఎవరైనా ఒక నాటకాన్ని వీక్షించేది. ఒక కథను చదివేది. ఒక కవితను తమలో జీర్ణం చేసుకునేది. ఒక గొప్ప అనుభూతిగా రసం మనలో చేరుతున్నకొద్దీ జీవితాన్ని మనం చవిచూసే కొలతలు మారిపోతాయి.

శృంగారం రసరాజం. కారణం, దానిని అర్థం చేసుకునే శక్తి ప్రతీజీవికీ ప్రాకృతికం కనుక. అధర్మయుక్తంగా శరీరాలు బొమ్మలుగా మెదడులోకి చేరి దాన్ని చెరచనంతవరకూ, అది శుద్ధంగా ఉంటుంది.

శృంగారరసపూరితహృదయులైన స్త్రీపురుషులు జీవితాన్ని పంచుకున్నపుడు అనురాగాంకమైన మనస్సే వారి మధ్యలో లావాదేవీ సలుపుతుంటుంది. అపుడు శరీరసంబంధమైన సౌందర్యం అంత ప్రాముఖ్యతను సంతరించుకోదు. ఒక మనిషిని చూడడమంటే మనిషి మనసునే చూడడం కనుక, రసంగా శృంగారాన్ని అవతరింపజేసుకున్న దంపతికి అన్యోన్యత గురించి వివరించి చెప్పవలసిన అవసరం లేదు. శరీరమూ, హృదయమూ – ఈ రెంటిలో ఏది కలకాలం నిలిచేదో దానిని పట్టుకోగలిగే పట్టున్న యువతీయువకులు నేడు మృగ్యం. మనసున్న యువతీయువకులు తయారు కావాలంటే, ఇటువంటి మనసున్న కవి వ్రాసిన శృంగారకవిత్వం చదవాలి.

ఈ సీసపద్యం ఏ కవితలోనో అంతర్భాగమైంది కాదు. కవి ఒక పద్యాన్ని మాత్రమే వ్రాశాడు. దీనికి కవి ఉంచిన పేరు పొలయలుక. ప్రణయకోపానికి అచ్చతెనుగు పదం. ఈ పద్యకారుడు సత్యహరిశ్చంద్ర ఇత్యాది ప్రసిద్ధనాటక రచయిత, అవధాని, రంగస్థల సినిమా నటులుగా కూడా పేరెన్నికగన్న బలిజేపల్లి లక్ష్మీకాంతకవి.

అస్మిన్నసారే సంసారే సారం సారంగలోచనాః అన్నాడు ఒక కవి. అసారమైన ఈ ప్రపంచంలో సారభూతవస్తువేదైనా ఉందంటే అది లేడికళ్ళు కలిగిన స్త్రీయే నట. ఈ మాట అనడం వెనుక కవి ఉద్దేశం నీచమైన శారీరక కామవాంఛ కాదు. అలా అయితే ఏవేవో శరీరభాగాలను వర్ణిస్తూ చెప్పేవాడు. అట్లు కాక, సారంగలోచనాః అని కళ్ళను వర్ణించాడంటే, ఆ కవి ఉద్దేశం వేరు. స్త్రీలో ప్రాకృతికంగా వచ్చిన దేహం వెనుక విలాసమయ శరీరం ఒకటుంటుంది. ఇది భౌతికమైనదే గానీ శరీరసౌష్ఠవాన్నీ, అశ్లీల ప్రదర్శననూ అపేక్షించేది కాదు. ఆ విలాసానికి ప్రేమే హేతువు. వేరేది ఉండే ఆస్కారం లేదు. అటువంటి ప్రేమమయ స్త్రీవిలాసం చాలా గొప్పది. అందుకే అది కావ్యాలలో ఎంతో గొప్పగా వర్ణింపబడింది.

తాను మనసులో అనుకున్న భావాలను విలాసంగా భౌతికంగా వ్యక్తీకరిస్తూ చూస్తున్న ప్రియుడిని పట్టి ఉంచగలడం ప్రకృతిమాత స్త్రీ జాతికిచ్చిన శక్తి. ఆ హావభావాలను దర్శిస్తూ, అర్థం చేసుకుంటూ అనుభూతి చెందే సాక్షిగుణం పురుషుడిది. శబ్దాలకు అతీతమైన ఈ భాషలో కొన్ని కోట్ల సంవత్సరాలుగా దంపతుల మధ్యలో అనురాగకావ్యాలు వ్రాయబడుతూనే ఉన్నాయి.

ప్రణయకోపంలో ఒక స్త్రీ ప్రవర్తన ఏవిధంగా ఉంటుందో చెప్పే పద్యమిది. ఈ పద్యంలోని నాయిక తన నాయకుడిపై కినుక వహించింది. అది చెప్పకనే కొన్ని చేష్టలతో చెబుతోంది. ఈ పద్యం వ్రాసేటపుడు కవి ఏ కళనున్నాడో గాని, ఆయననుండి అనేక ఔచిత్యాలతో రసావతరణం చేస్తూ ఈ పద్యం వెలువడింది. ఒకసారి ఈ సీసపద్యపు నిర్మాణాన్ని చూడండి. పెను ప్రభావం గల శ్రీనాథుడి సీసపద్యం నమూనానుండి విడివడి, చాలా సొగసైన నమూనాలో వ్రాశాడు కవి దీనిని. ప్రధానభాగంలో ఉన్న నాలుగు పాదాలలో మధ్యలో నిర్దుష్టమైన విరుపు లేదు. చాలా సొగసుగా అసమాపకక్రియలతో ఒకే పాదంగా ప్రతీపాదమూ అల్లుకుపోయింది.

ఒక్కో పాదంలోనూ నాయిక కినుక యొక్క బహుముఖీనత్వాన్ని గమనించవచ్చు. ఆమె ప్రణయకోపనయై ఏదో తనకు పని ఉన్నట్లుగా నటిస్తోంది. తీరమి అంటే ఆవశ్యకత. నటిస్తోంది అనడానికి ఋజువేమిటి అంటే, చేసే పనిలో నిమగ్నమవకుండా నాయకుడి కేసి క్రీగంట చూస్తోందట. అలా క్రీగంట చూస్తున్న ఆమె కేసి నాయకుడు చూడగానే వెంటనే తన చూపు త్రిప్పుకుంటున్నదట. మలపడమంటే మరలించడమని.

ఏదో సాకుతో దగ్గరకు రమ్మని, ప్రియుడు మాట కలుపుతూ ఉంటే, ఉబికి వచ్చే చిరునవ్వును పెదవి క్రిందే అణిచివేస్తోందట. లోపల ఇష్టమున్నా చెప్పలేనితనం. వాతెర అంటే పెదవి. ఇక మూడవపాదంలో ప్రియుడు ఆమె చెక్కిలిపై చక్కిలిగింతలు పెట్టాడు. దానికి ఆమె ‘దగ్గరికొచ్చావో, ఇంక ఒట్టే’ అంటూ పక్కకు తొలగుతున్నదట.

ఇక లాభం లేదని ప్రియుడు ఆమెను వెంబడించి, ఏవేవో బాసలు చేయడం మొదలుపెట్టాడు. దానికి ఆమె ‘నీవెంతకైనా సమర్థుడవే’నంటూ సిగ్గుతో పక్కకు తొలగుతున్నదట. అలాగే కాస్త ముందుకు వెళ్ళగానే ప్రియుడు ఆమెను కౌగిలించుకున్నాడు. వెంటనే ఆమె కళ్ళలో తిరిగిన నీళ్ళు, నాటుకున్న కాంతి. స్త్రీత్వపు పొరనూ, పుంస్త్వపు పొరనూ వొలుచుకుని అవశేషించిన ఒకే ఒక ప్రేమమనస్సు.

పానకంలో మిరియపు పసలాంటి ఇటువంటి ప్రణయకోపాలే ప్రేమజీవకళలని కవి చేసిన సిద్ధాంతం. నిజమే. నాయికకు కలిగిన కినుకలో ప్రియుడ్ని ధిక్కరిస్తున్నట్లే ధిక్కరించి తరువాత కొద్దికొద్దిగా ఇష్టాన్ని చూపవలసి రావడంలోను, బ్రతిమాలుతున్న ప్రియుడికి చివరికి వశమైపోవడంలోనూ నాయిక మనస్సు పడిన మల్లగుల్లాలలో ప్రేమ జీవించి ఉంది. అలానే నాయికలోని ప్రేమను పసిగట్టి, ఆమె పైపై చేష్టలలోని వ్యతిరేకతను పట్టించుకోకుండా ఆమె వెంటపడిన పురుషప్రయత్నంలో ప్రేమ జీవించి ఉంది.

పొలయలుకలు స్త్రీలకు పెట్టని ఆభరణాలు. పురుషులకు కొండంత బలాలు. ధర్మానురాగప్రాణప్రతిష్ఠాపనమంత్రాలు.