విశ్వమహిళానవల 25: తొరూ దత్

‘Novels are true, and histories are false’ అనడానికి ఎంత ధీమా కావాలి? నవలలో చిత్రించే వాస్తవికత, చరిత్ర లోని వాస్తవాల కంటే సత్యమైంది, ప్రయోజనకరమైందీ అని ఈ మాటలకు వ్యాఖ్యానంగా చెప్పుకోవచ్చు. హిందువుగా పుట్టి, కుటుంబంతో సహా క్రైస్తవం పుచ్చుకుని, ఇంగ్లిష్‌వారి పాలనలో వారితో సమానంగా ఇంగ్లిష్‌లో కవిత్వం రాస్తూ, ఫ్రెంచ్ భాషని ఆపోశన పట్టి, ఆ భాషలో కూడా అప్పటి ఫ్రెంచ్‌ నవలాకారులతో సమానంగా కవిత్వం, నవల రాస్తూ, ఫ్రెంచ్‌ నుంచి ఇంగ్లిష్‌కు అద్భుతమైన అనువాదాలు చేస్తూ… ఇన్ని పనులూ కేవలం 21 ఏళ్ళలోనే చేసి చూపించిన అమ్మాయిని గురించి తలచుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది.

ఆమె పేరు భారతదేశంలో సుపరిచితమే. తొరూ దత్ భారతీయాంగ్ల కవిత్వానికి ఊపిరులూదిన కవయిత్రి. దత్ కుటుంబం 19వ శతాబ్దిలో మేధావులుగా, సాహితీవేత్తలుగా, భారతీయాంగ్ల రచయితలుగా సుప్రసిద్ధులు. రొమేశ్ చంద్ర దత్ వంటి కవులు ఆమె సమీపబంధువులు కానీ కవయిత్రిగా అందరికీ తెలిసిన ఆమె, రెండు నవలలు కూడ రాసిన విషయం ఎక్కువమంది దృష్టికి రాలేదు. తొలి నవల ఇంగ్లిష్‌లో, రెండో నవల ఫ్రెంచ్‌లో రాసింది.

జీవితం

తొరూ దత్ (తరులతా దత్) మార్చి 4, 1856లో కలకత్తాలో జన్మించింది. తొరూకు ఒక అక్క, ఒక అన్న. తండ్రి కలకత్తాలో మేజిస్ట్రేట్. చిన్నప్పుడే తండ్రి ప్రోత్సాహంతో, ఇంగ్లిష్‌తో పాటు ఫ్రెంచ్ కూడా నేర్చుకుంది. ఆ తర్వాత సంస్కృతం కూడ అభ్యసించింది. ఎక్కువగా ఆమెకు గురువు తండ్రే. తొరూ ఇంగ్లిష్ సాహిత్యాన్ని చాలా లోతుగా అధ్యయనం చేసింది. మిల్టన్ పారడైజ్ లాస్ట్ ఆమెకు అభిమానగ్రంథం. అన్న అభిజే 11వ ఏట క్షయతో మరణించాడు. ఆ తర్వాత కొన్నేళ్ళకు, తొరూకు 13 ఏళ్ళు వచ్చాక, కూతుళ్ళకు ఉన్నతవిద్యను అందించాలనే ఉద్దేశంతో తండ్రి లండన్‌కి తమ నివాసాన్ని మార్చాడు. ఇంగ్లండులో మూడేళ్ళు, ఫ్రాన్స్‌లో ఒక సంవత్సరం వాళ్ళు నివసించారు. ఇంగ్లండ్‌లో ఉన్నప్పుడు కొంతకాలం సంగీతం కూడ అభ్యసించింది. అప్పుడే ఫ్రెంచ్, ఇంగ్లిష్ భాషల్లోనూ తొరూ ప్రావీణ్యం సంపాదించింది. రెండిటిలోకీ ఆమెకు బాగా నచ్చిన దేశం ఫ్రాన్స్. 1871లో వారి కుటుంబం కేంబ్రిడ్జ్‌కి తరలింది. ఆ మరుసటి సంవత్సరం కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో ఒక ఉపన్యాస పరంపరను (Higher Lectures for Women) తన అక్కతో పాటు ఆమె వినడం తటస్థించింది. ఆ రోజుల్లో కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో మహిళలకు ప్రవేశం లేదు. ఎపుడైనా కొన్ని ఉపన్యాసాలు వినడానికి కొందరు పరపతి ఉన్న కుటుంబాల స్త్రీలకు మాత్రం అనుమతి లభించేది. అలాంటి ప్రసంగాల్లోనే ఫ్రెంచ్‌ సాహిత్యంపై కూడా కొన్ని వినడంతో ఆ భాషాసాహిత్యాల పట్ల అభిమానం తొరూలో పెరిగింది.

1871 నాటికి ప్రష్యాతో యుద్ధం అనంతరం, ఫ్రాన్స్ రక్తసిక్తమై, దయనీయస్థితిలో ఉంది. ఫ్రాన్స్ దేశాన్ని చూసి మనసు వికలమైపోయిన ఆమె ఆ దేశాన్ని గాయపడిన యువతితో పోలుస్తూ కవిత కూడ రాసింది.

Not dead; oh, no, she cannot die!
Only a swoon from loss of blood. Levite England passes her by; Help, Samaritan! None is nigh
Who shall staunch me this sanguine flood.
Range the brown hair, it blinds her eyen;
Dash cold water over her face! Drowned in her blood, she makes no sign. Give her a draught of generous wine!
None heed; none hear to do this grace.

అలా ఫ్రెంచ్‌లో తను రాసిన 165 కవితలను తనే ఇంగ్లిష్ లోకి (A Sheaf Gleaned in French Fields) అనువదించింది. ఆమె ఇతర కవితలలో కొన్నింటిని అక్క అనువాదం చేసింది. ఇది కాక, భారతీయ పురాణాలు వస్తువుగా (Ancient Ballads and Legends of Hindustan) కవితలు రాసింది. ఈ సంకలనం ప్రత్యేకంగా విదేశీయులకు భారతీయ సంస్కృతి, వారసత్వాల విలువ చెప్పడానికే రాసింది. ఆ రోజుల్లో భారతీయ సాహిత్యం ఎందుకూ పనికిరాదని ప్రచారమవుతున్న విషయం తెలిసిందే (లార్డ్ మెకాలే పుణ్యఫలితంగా). అందుకేనేమో, పనిగట్టుకుని సావిత్రి, సీత, లక్ష్మణుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు వంటి పాత్రలను గురించి, వేదకాలం నాటి సంస్కృతి గురించి శక్తివంతమైన కవితలు ఇంగ్లిష్‌లో రాసి, వలసపాలకుల దృష్టికి తీసుకువచ్చింది. అందులోని కవిత్వానికి ఇంగ్లిష్‌ పాఠకులు కూడ ముగ్ధులయ్యారు.

అయితే తన కవితలు పత్రికల్లో ప్రచురింపబడ్డమే తప్ప అది పుస్తకంగా రావడం, ఆ కవిత్వానికి వచ్చిన చక్కని సమీక్షలు చూడకుండానే ఆమె మరణించింది. ఆమె రాసిన నవలలు మరణానంతరమే ప్రచురింపబడ్డాయి. ఇవి కాక 1874-77 వరకు బెంగాల్ పత్రికలో సంస్కృత సాహిత్యానువాదాలు, ఫ్రెంచ్‌ సాహిత్య అనువాదాలు ప్రకటించింది. బెంగాల్ మేగజైన్‌లో, కలకత్తా రివ్యూలో ఎన్నో వ్యాసాలు కూడ ఆ మూడేళ్ళలో రాసింది. ఇది కాక, ఆమె ఉత్తరాల రచనలో కూడ నిపుణురాలు. ఎన్నో ఉత్తరాలనూ ప్రచురించింది. ఇన్ని పనులూ ఆమె కేవలం 21 ఏళ్ళలోనే చేసింది. 1874లో అక్క అరూ మరణానంతరం, వారి కుటుంబం తిరిగి భారతదేశానికి వచ్చేసింది. 1877 ఆగస్టులో ఆమె కూడ, అన్న, అక్కల లాగే క్షయవ్యాధితో మరణించింది. ఆమెకు ఇంగ్లండులో కేంబ్రిడ్జ్‌లో ఉన్నపుడు మేరీ మార్టిన్‌తో పరిచయమైంది. వీరిద్దరి స్నేహం చివరిదాకా కొనసాగింది.

తొరూ దత్ జీవితాన్ని గురించిన వివరాలు. ఆమె వ్యక్తిత్వం, ఆమె మేరీకి రాసిన లేఖల వల్లే ఎక్కువ తెలుస్తాయి. ఆమె రాసిన రెండు నవలలనూ తండ్రి ఆమె మరణానంతరమే చూశాడు. వెంటనే ఆయన ఆమె ఇంగ్లిష్ నవలను ప్రచురించాడు. అయితే ఫ్రెంచ్‌ నవలను 1878లో తొరూ దత్‌కు కలం స్నేహితురాలైన ఫ్రెంచ్‌ రచయిత్రి క్లారిస్సా బేదర్‌కి పంపాడు. ఆమె, తన ముందుమాటతో ఆ నవలను ప్రచురించింది. ఈ నవలకు ఫ్రెంచ్‌ విమర్శకుల నుంచి మంచి సమీక్షలు వచ్చాయి. బ్రిటిష్ నవలారచయిత, అనువాదకుడు, విమర్శకుడు, టాగోర్ మిత్రుడు థాంప్సన్ (E. J. Thompson) ఆమె గురించి రాస్తూ, ‘Toru Dutt remains one of the most astonishing women that ever lived, a woman whose place is with Sappho and Emily Bronte, fiery and unconquerable of soul as they’ అన్నాడు. ఆమె అతి చిన్నవయస్సులో మరణించడం వల్ల విశ్వసాహిత్యం ఒక ధృవతారను కోల్పోయిందని కూడ అతను అభిప్రాయపడ్డాడు.

తొరూ దత్ రాసిన కవితల్లో అవర్ కాసువరైనా ట్రీ (Our Casuarina Tree) అన్న కవిత కలకత్తా స్కూలు పాఠ్యాంశాల్లో ఉండేది. ఆమె తక్కిన రచనలు ఇప్పుడు మరుగున పడిపోయాయి.

ఆమె ఇంగ్లిష్ కవితాశైలి మధురంగా, ఒక పాటలా సాగిపోతుంది. నాటకీయంగా చదవడానికి కూడ అనుకూలంగా ఉండే విలక్షణమైన శైలి ఆమెది. సావిత్రి అన్న పెద్ద కవితలో సత్యవంతుడిని ప్రేమిస్తున్న సావిత్రికి మరో సంబంధం చూడాలన్న తండ్రి ప్రయత్నం విని, సావిత్రి ఇలా అంటుంది.

Once, and once only, all submit
To Destiny,—’tis God’s command;
Once, and once only, so ’tis writ,
Shall woman pledge her faith and hand;
Once, and once only, can a sire
Unto his well-loved daughter say,
In presence of the witness fire,
I give thee to this man away.
Once, and once only, have I given
My heart and faith—’tis past recall;

సావిత్రి కథను ఇంగ్లిష్‌లో చెప్పిన మొదటి కవయిత్రి ఈమే. తొరూ దత్ రచనలో సావిత్రి కథ ప్రణయభావనలతో అందమైన కావ్యమైంది. అయితే అరవిందుడి సావిత్రికి వచ్చిన పేరు దీనికి రాలేదు. అరవింద ఘోష్ ఈ కథకు తాత్వికరూపమిచ్చిన విషయం తెలిసిందే. దాన్ని మోడర్న్ క్లాసిక్స్‌లో ఒకటిగా పరిగణిస్తారు. తొరూ దత్ సావిత్రి మన హృదయాలను కదిలించే ముగ్ధమూర్తి.

ఆమె రచనల్లో అతి ప్రఖ్యాతి పొందింది అవర్ కాసువరైనా ట్రీ అన్న కవిత అని చెప్పుకున్నాం. అది కూడ పురాణకావ్యమాలికలోనే (Ancient Ballads and Legends of Hindustan) ఉంది. ఇది ఒకరకంగా స్మృతిగీతం. తన బాల్యంలో భారతదేశంలో సోదరులతో గడిపిన ఘడియల స్మృతిమాల ఈ కవిత.

డైరీ ఆఫ్ మదమజెల్ దర్వేర్

ఇది తొరూ దత్ రాసిన ఫ్రెంచి నవలకు (Le Journal de Mademoiselle d’Arvers) ఎన్. కమల చేసిన ఇంగ్లీషు అనువాదం. దీనికంటే ముందు బియాంకా ఆర్ ది ఫస్ట్ స్పానిష్ మెయిడెన్ అనే ఆంగ్ల నవల కూడ తొరూ రాసింది. ఆంగ్లంలోనూ, ఫ్రెంచిలోనూ నవలలు రాసిన తొలి భారతీయ రచయిత్రి ఆమె. అయితే తండ్రితో నిత్యం సాహిత్య చర్చలు చేస్తూ, ఆయన ప్రోత్సాహాన్ని నిరంతరం అందుకున్న తొరూ దత్ తన రెండు నవలల గురించి తండ్రికి ఎందుకు చెప్పలేదన్న అనుమానం వస్తుంది. ఆ నవలలు ప్రచురించే ఉద్దేశం ఆమెకు లేదేమో, కేవలం తన మనసును క్షాళనం చేసుకోడానికి రాసిందేమో అన్న అనుమానం కూడ కొందరు విమర్శకులకు వచ్చింది. రెండు నవలల్లోనూ పాత్రలు, కథ, జీవితాలు అన్నీ యూరప్‌కి చెందినవే. భారతీయుల ప్రసక్తి లేదు. ఎందుకలా రాసిందని కూడ పాఠకులకు, విమర్శకులకు అనుమానం వచ్చింది. ఆమె మరణానంతరం లభించిన ఈ రెండు నవలలనూ తండ్రి చదివి, ఆంగ్ల నవలను ప్రచురిస్తూ, దానికంటే ఫ్రెంచ్ నవలే బాగుందనీ, అందువల్ల అది యూరప్ పాఠకులకు కూడ అందుబాటులో ఉండేందుకు ఫ్రాన్స్‌లో ప్రచురణకు పంపుతున్నాననీ చెప్పాడు.

తొరూ దత్ యూరప్ నించి తిరిగి భారతదేశానికి వచ్చాక, ఇక్కడి జీవితం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసేది. ఇక్కడ బ్రిటిష్‌వాళ్ళు భారతీయులను చాలా చులకనగా చూస్తారని, తనకు వెళ్ళడానికి ఒక్క పార్టీ కూడ లేదని, ఎవరూ ఆడవాళ్ళను సమావేశాలకు, పార్టీలకూ పిలవరనీ ఆవేదన వ్యక్తం చేసింది: The Bengali reunions are always for men. Wives and daughters and all women—kind are confined to the house, under lock and key, a la lettre, and Europeans are generally supercilious and look down on Bengalis.

ఆమె నవలలు రాసిన కాలం ఇదే. బహుశా భారతదేశంలో తన జీవితం మీద ఎలాంటి ఆసక్తి, అందులో ఎలాంటి ఆనందం లభించకపోవడం వల్లే ఆమె తన నవలలను యూరోపియన్ జీవితంతో సరిపెట్టిందని అనుకోవచ్చు. మరో కారణం – ఆమె రాసినవి రెండూ ప్రేమకథలే. 1870లో భారతదేశంలో ఏ ఆడపిల్లకు సమాజంలోకి వెళ్ళి ఒక అబ్బాయిని కలుసుకుని, ప్రేమలో పడే అవకాశం ఉండేది? తను రాయాలనుకుంటున్న ఉద్వేగభరితమైన ప్రణయగాథకు భారతదేశంలో ఆస్కారమే లేదు. అది కూడ కథంతా యూరప్ పాత్రలతో నింపడానికి కారణమై ఉంటుంది. తన మనసులో ఉన్న ప్రణయభావనలు నవలలో కుప్పించడమే తండ్రికి ఆ నవలలను చూపకపోవడానికి కారణం కూడ అయివుంటుందని ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఆమె తండ్రి మాత్రం ఆ నవలలను మెచ్చుకున్నాడు, ఫ్రెంచ్ నవలను క్లారిస్సా చేత పరిష్కరింపజేసి, అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ లిట్టన్‌కి అంకితమిచ్చాడు.

కథ

ఈ నవల పదహారేళ్ళ అమ్మాయి మాగ్రీట్ (Marguerite) డైరీ కథనం. ఎంతో సంతోషకరమైన జీవితం ఆమెది. తల్లిదండ్రుల ప్రేమ పుష్కలంగా ఉంది. సంపద మరీ ఎక్కువ లేకున్నా, కనీసావసరాలకి కొరతలేదు. ఆమెకు తారసపడిన ప్రతివారూ ఆమె సౌందర్యానికీ సౌశీల్యానికీ దాసులైపోతారు. వీరి ఇంటికి దగ్గర్లోనే ఉన్న రాజభవనంలో ఉండే కౌంట్, అతని తల్లి, తమ్ముడు చాలా సంపన్నులు. ఆ కుటుంబం వీరికి మంచి స్నేహితులు. తొలి భాగంలో అంతా ఒక్కొక్క రోజు కౌంట్ తన ఇంటికి రావడం, తన పట్ల అతని తల్లి ప్రేమ, కౌంట్ పట్ల తన ఆకర్షణ… తల్లిదండ్రులు కూడ తమ స్నేహాన్ని ప్రోత్సహించడం – ఈ సంఘటనల చిత్రణే. ఈ క్రమంలోనే వారి ఇంటికి లుయీ లఫర్వ్ (Louis leferve) వస్తాడు. అతని మిలటరీలో చేరడానికి వెళ్తూంటాడు. అతని సరళస్వభావం, తమతో సరితూగే సామాజిక హోదాల వల్ల, మాగ్రీట్ తల్లిదండ్రులు అతను తమ అల్లుడైతే బాగుండునని అనుకుంటారు. అతను కూడ మాగ్రీట్ స్నేహాన్ని ప్రేమగా భావించుకుని తన ప్రేమను ప్రకటిస్తాడు. మాగ్రీట్ అతని పట్ల స్నేహం తప్ప మరోభావన లేదని చెప్పి, తన మనసులో మరొకరు ఉన్నారని కూడ సూచిస్తుంది. అతనికి అర్ధమవుతుంది ఆ వ్యక్తి కౌంట్ అని. వెంటనే వెళ్ళిపోయిన లుయీ తర్వాత చాలాకాలం వరకూ రాడు.

ఈలోగా కౌంట్ డున్వాఁ (Dunois) తరచు అనారోగ్యంగా ఉండడం, పార్శ్వపు నొప్పితో బాధపడడం, మాగ్రీట్ అతని గురించి ఆందోళన చెందడం, అతనితో, అతని కుటుంబంతో ఎక్కువ కాలం గడపడం కొనసాగుతాయి. కౌంట్‌కీ అతని సోదరుడు గాస్తాన్‌కీ మధ్య తరచు వాగ్వివాదాలు జరగడం మార్గరెట్ గమనిస్తుంది. ఈ అన్నదమ్ములకు ఎందుకు పడదో అని ఆశ్చర్యపోతుంది. తనకు కౌంట్‌పై ఉన్న ప్రేమను ప్రకటిస్తుంది. అతనితో తన పెళ్ళి స్థిరపరచాలని అప్పటికే ప్రయత్నిస్తున్న కౌంట్ తల్లి, మేనమామ చాలా సంతోషిస్తారు. ఈ విషయం కౌంట్‌కి చెప్పిందీ లేనిదీ మనకు స్పష్టంగా తెలీదు గానీ, కౌంట్ ప్రత్యేకించి ఆమె పట్ల తనకు ఏ భావం ఉన్నదీ చెప్పడు. ఈలోగా అన్నదమ్ములిద్దరి మధ్య మళ్ళీ ఏదో గొడవ జరగడం మాగ్రీట్‌కి ఆశ్చర్యం కలిగిస్తుంది. వారింట్లో ఒకవారం గడిపిన తర్వాత మాగ్రీట్ తన ఇంటికి తిరిగి వెళ్ళాలి.

ఆమె ఆశించినట్టుగానే కౌంట్ తల్లి కొడుకుతో వీళ్ళిద్దరి పెళ్ళి ప్రస్తావన తెచ్చినట్లు ఆమెకు చాటుగా విన్న ఒక సంభాషణ వల్ల తెలుస్తుంది. ‘I cannot mother, I cannot, don’t force me’ అన్న అతని మాటలు వింటుంది కానీ, అప్పటికి అర్థం కాదు దేని గురించో. (డైరీ కథనం వల్ల, మాగ్రీట్‌కి తెలిసినవే పాఠకుడికీ తెలుస్తాయి. మరో దృష్టికోణం నుంచి కథ మనకు అందదు). ఈలోగా ఇంటికి వచ్చిన తమ్ముడి ముఖం వెలిగిపోతూండడం, అన్నగారి ముఖం వాడిపోవడం ఆమె గమనిస్తుంది. ఆ రాత్రి మంచి నిద్రలో ఉన్న మాగ్రీట్‌ తుపాకీ శబ్దానికి ఉలిక్కిపడి లేస్తుంది. ఇంట్లో కల్లోలం. కౌంట్ డున్వాఁ తన తమ్ముడు గాస్తాన్‌ని తుపాకీతో కాల్చి చంపుతాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. అతను పోలీసులతో వెళ్ళేముందు తన కుటుంబ సభ్యులకు తను ఏం చేసిందీ చెప్తాడు. నిజానికి కౌంట్‌కి తనంటే ఇష్టమనే భ్రమలో మాగ్రీట్‌ ఉంది కానీ అతని మనసులో ఉన్న అమ్మాయి ఆ ఇంట్లో సహాయకురాలిగా ఉన్న జనెట్ (Jeannette). ముందురోజు జనెట్ తనకు గాస్తాన్ అంటే ఇష్టమనీ, అతన్ని వివాహం చేసుకుంటాననీ చెపుతుంది. అందుకే ఆ రోజు తమ్ముడు హుషారుగా, అన్న కోపంగా ఉంటారు. మరుసటిరోజు డున్వాఁ నిద్ర లేచేసరికి గాస్తాన్, జనెట్ చెట్టాపట్టాలేసుకుని విహరిస్తూ కనిపిస్తారు. ఈర్ష్యతో ఒళ్ళు మరచిన డున్వాఁ తుపాకీ తీసుకుని తమ్ముణ్ణి కాల్చేస్తాడు. ఇదంతా అతనే స్వయంగా తల్లిని, మేనమామని, మాగ్రీట్‌నీ కూర్చోబెట్టుకుని చెప్తాడు. అతని మాటల ధోరణి, హావభావాలు అప్పటికి గానీ కథానాయికకు అర్థం కావు. అతని అనారోగ్యం నిజానికి శారీరకం కాదు. అతనికి మతి స్థిమితం లేదు. ఇంట్లో అందరూ తెలిసో, తెలియకో, అతని అనారోగ్యం శారీరకమైనది అన్నట్టే ప్రవర్తిస్తూంటారు. అతనికి మానసిక రుగ్మత ఉందని తెలిసి, మాగ్రీట్ హృదయం బద్దలవుతుంది. తను అతన్ని శాశ్వతంగా కోల్పోయానని అర్థమై ఆమె మానసికంగా, శారీరకంగా కృంగిపోతుంది. డున్వాఁకి 15 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష పడుతుంది. కొన్ని రోజులకు డున్వాఁ ఖైదులో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక మాగ్రీట్ వేదనకు అంతు ఉండదు.

ఇదిలా ఉండగా కొంతకాలానికి లుయీ తిరిగి వస్తాడు. అతని స్నేహంలో ప్రేమలో కోలుకున్న మాగ్రీట్ అతన్ని క్రమంగా ప్రేమించడం మొదలుపెడతుంది. ఆమె తల్లిదండ్రులకు ఆనందం కలుగుతుంది. వీళ్ళిద్దరి వివాహం, సంతోషకరమైన జీవితం చాలా పుటలు, ఆమె డైరీల రూపంలో ఆక్రమిస్తాయి. చివరికి మాగ్రీట్ గర్భం దాల్చి, ఆడపిల్లకు జన్మనిస్తుంది. అంతా సుఖాంతమైందని అనుకునే సమయానికి బాలింతరాలిగా వచ్చిన అనారోగ్యంతో మాగ్రీట్ మరణిస్తుంది.

స్థూలంగా ఇదీ కథ. ఈ నవలలో ముఖ్యమైన అంశాలు రెండు. తరుణ ప్రాయంలో ప్రేమ, దైవభక్తి అతిగా ఉంటే, ఎలా ఒక యువతి మనసును కళవళపరుస్తాయో చూపించడం. నవలంతటా ఇవి రెండూ కనిపిస్తూంటాయి. నాయిక 15 ఏళ్ళ ప్రాయంలో అందమైన, సంపన్నుడైన యువకుడిని ప్రేమించి, అతని కోసం తపించడం, అతనికి ఇష్టం ఉందా లేదా అన్న ఆలోచన కూడ లేకుండా అతన్ని అనుక్షణం కోరుకోవడం, అతనికీ తనపట్ల ప్రేమ ఉందని నమ్మడం. ఆ చిన్న వయసులో ఉధృతంగా ముంచెత్తిన ప్రేమకు, తట్టుకోలేని షాక్ తగులుతుంది. అతనికి తన మీద ప్రేమ లేకపోవడం, అతనికి మనోరుగ్మత ఉండడం, స్వంత తమ్ముడిని కాల్చి చంపేసేంత ఉన్మాదంతో ప్రవర్తించడం – ఇవన్నీ కొన్ని గంటల వ్యవధిలో అనుభవంలోకి రావడంతో ఆ 15 ఏళ్ళ పిల్ల మనస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. అప్పుడు మొదలైన శారీరక మానసిక బలహీనత ఆమెను చివరిదాకా వేధించి, తనకు ఎంతో ఆనందకరమైన జీవితం ప్రాప్తించినా దాన్ని అనుభవించలేక, అకాలమృతికి గురవుతుంది.

అన్ని సన్నివేశాల్లోనూ, అన్ని అనుభవాల్లోనూ ఆమెకు వెంట ఉండేది భగవంతుడిపై (క్రీస్తు) ఆమెకున్న విశ్వాసం. తనకు ఏది జరిగినా ‘భగవంతుడి దయ వల్ల’, ‘అతను చూసుకుంటాడు’ వంటి ఆలోచనలు ఆ పిల్లలో కనిపిస్తాయి. ఈ నవలలో మాగ్రీట్, రచయిత్రి ఆల్టర్ ఈగో అన్న అనుమానం పాఠకుడికి వస్తుంది. తొరూ దత్ కుటుంబం క్రైస్తవాన్ని పుచ్చుకున్న తర్వాత, అందరికంటే ఎక్కువ ఏసుక్రీస్తు ప్రభావానికి గురైంది తొరూనే. ఆ కుటుంబంలో ఉన్న మతభావనలు నవలలో స్పష్టంగా రూపుదాల్చాయి. నవల రాసేటప్పటికి తొరూ దత్ కి 20-21 ఏళ్ళే. ఆమె నాయిక ఆమె కంటే మహా అయితే మూడునాలుగేళ్ళు చిన్నది. అంటే ఇటు రచయిత్రీ, అటు నాయికా కూడ భావోద్వేగాలు అధికంగా ఉన్నవారే. తొరూదత్ ఎవర్నయినా జీవితంలో ప్రేమించిందీ లేనిదీ తెలీదు గానీ, ఆమెలోని రొమాంటిక్ ప్రేమోద్వేగం సావిత్రి, సీత పాత్రల చిత్రణ దగ్గర్నుంచీ, బియాంకా (తొలినవల), మాగ్రీట్‌ల వరకూ స్పష్టంగా కనిపిస్తుంది.

మాగ్రీట్ సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని చూసినపుడు కూడ భగవంతుడి సృష్టిని చూసి అబ్బురపడుతూంటుంది: The whole earth was dark and gloomy, and the wind rustled against the windows. Only the sky was scattered with stars. What a magnificent spectacle! ‘The heavens declare the works of God, and the universe shows the work of his hands.’

కౌంట్ హత్య చేసినట్టు అంగీకరించిన తర్వాత కూడ అతన్ని గురించి చెడ్డగా అనుకోలేదు ఆమె. The Lord is merciful. Surely he will forgive his iniquity. Who amongst us has not sinned? We all have strayed like sheep…. It is me, it is me that erases all your sins for your love of me, and I will no longer remember your sins. Lord, forgive him his trespasses, make your goodness towards him admirable, and may his soul rest in you!

తను గర్భవతి అని తెలియగానే ఆమెలో కలిగిన మొట్టమొదటి ఆలోచన: My son will be as handsome as little Jesus. I knelt down to pray to Him, I thanked Him for all the kindness He had for me. Then I prayed to Saint Virgin: Kind Mary, the mother of our Saviour, give me the force and the wisdom to bring up my child as an upright man, as a man after your son’s heart, our Lord!

ప్రేమ, దైవం తర్వాత మార్గరెట్‌ని నీడలా అంటిపెట్టుకున్న మరోభావన మృత్యువు. లుయీని పెళ్ళి చేసుకుని ఆనందంగ ఉండే ఘడియలోనూ ఆమెకు తను చనిపోతాననే ఆలోచనే. ‘దేవుడు ఏం తలిస్తే అదే జరుగుతుంది కనక తను ఏక్షణమైనా చనిపోవచ్చు అనుకుంటుంది.

All the paths would flower,
For the beautiful bride is going to come out;
Would flower, would sprout,
For the beautiful bride will pass by!

అని మొదట అనుకుంటుంది. వెంటనే ఇదే కవిత మరో రకంగా ఆమె స్మృతిపథంలో మెదులుతుంది.

All the paths would moan
For the beautiful dead lady is going to come out,
Would wail, would wail
For the beautiful dead lady will pass by!

వివాహమై భర్తతో కలిసి తల్లిదండ్రుల వద్దకు నడుస్తున్నపుడు ఆమెకు పైన చెప్పిన రెండు కవితాపంక్తులూ స్ఫురిస్తాయి. తనని తాను అందరికీ ఆనందాన్నిచ్చే అందమైన వధువుగా, మరుక్షణమే దుఃఖంలో ముంచెత్తే మృతదేహంగా ఊహించుకుంటుంది. ఈ fatalistic thought అన్న లక్షణం మాగ్రీట్‌దే కాదు; తొరూ దత్‌ది కూడా. ఎందుకంటే తొరూ ఆరోగ్యం ఎప్పుడూ అంతంత మాత్రమే. అప్పటికే ఆమె అన్న, అక్క క్షయవ్యాధితో మరణించారు. తనకు కూడ ఆ అనారోగ్య లక్షణాలు ఉన్నాయి. మరణానికి కొద్దికాలం ముందే ఈ నవల రాసింది. తననే ఈ పాత్రలో చూసుకుందని అనిపిస్తుంది.

నవలంతటా ప్రణయభావన, ఒక పురుషుడి పట్ల స్త్రీకి కలిగే అంకితభావం పదేపదే అనేక చోట్ల, అనేకవిధాలుగా ప్రకటిస్తుంది రచయిత్రి. బహుశా ఆ ఉద్వేగం చూసి, తనను ఒక మేధావిగా పరిగణించే తండ్రి ఏమంటాడో అన్న సంకోచంతోనే నవలను ఎవరికీ చూపించి ఉండదు. కవిత్వాన్ని ఉత్సాహంగా అందరికీ చూపించిన ఆమె, పత్రికల్లో ప్రచురించిన ఆమె, తన నవలలను రహస్యంగానే ఉంచింది.

ఈ నవలా వస్తువు గొప్పదేమీ కాదు. 19వ శతాబ్ది రచయిత్రులలో ఎక్కువమంది రాసిన ప్రేమకథే. అలాగే గాథిక్ నవలల లక్షణమైన ఉన్మాదం కూడా ఈ నవలలో ఒక ముఖ్యమైన అంశం. కానీ కథని అతి నిర్మలమైన, అమాయకమైన, దైవభక్తి కలిగిన అమ్మాయి కోణం నుంచి చెప్పించడం, అది కూడ డైరీ రూపంలో ఆమె తన జీవితాన్ని ఆవిష్కరించుకోవడం ఈ నవలకు ఒక ప్రత్యేకతని ఇచ్చాయి. కథనం చాలా సాఫీగా సాగుతుంది. శైలి (కమల అనువాదంలోనూ) చాలా అందమైనదని తెలుస్తూనే ఉంటుంది. డైరీ రచనను సమర్థంగా నిర్వహించడం తొరూ ప్రతిభకు నిదర్శనం.

తొలిప్రేమను ఆస్వాదించే అమాయక హృదయాన్ని గొప్పగా ఆవిష్కరించింది ఈ నవల. అలాగే, తొలి ప్రేమ విఫలం కాగానే, తనను మనఃస్ఫూర్తిగా ప్రేమించే మరో యువకుడిని త్వరలోనే ఆమోదించి, అనతికాలంలోనే ప్రేమించడాన్ని చిత్రించడం ద్వారా ఆ వయసుకు సహజమైన చిత్రణతో వాస్తవికదృక్పథాన్నీ ప్రకటించింది తొరూ దత్. అదే సమయంలో విధిని, భగవంతుడిని బలీయంగా నమ్మే ఆ అమ్మాయి అనుక్షణం తన జీవితం ముగుస్తుందనే భావనను వదిలిపెట్టలేకపోవడంతో నవలంతటా ఒక విషాదభావన పరచుకునివుంటుంది. ప్రేమ, భక్తి, విషాదం కలగాపులగమై మనసును కలతపరిచే ఒక చక్కని విషాద నాయిక మనకు మాగ్రీట్‌లో కనిపిస్తుంది.

ఫ్రాన్స్‌లో జరిగిన కథ; పాత్రలు కూడ ఫ్రెంచ్‌వే. కనక తొరూ దత్‌లో అసలు భారతీయ భావన లేదా? అన్న అనుమానం వస్తుంది. ఎంతైనా భారతదేశంలో పుట్టింది. కొంతకాలం పెరిగిందికూడా. ఫ్రాన్స్‌నూ, ఇంగ్లండునూ ఎంత అభిమానించినా, ఆమెలోని భారతీయత కొన్ని వర్ణనల్లో బయటపడుతుంది.

లుయీని వివాహం చేసుకున్న తర్వాత రాసిన వాక్యం భారతీయ సంస్కృతిలో పుట్టిల్లు వదిలి వెళ్ళే అమ్మాయి మనఃస్థితిని చక్కగా చూపిస్తుంది… weak. I turned my eyes to my husband. I had just left everything for him, my parents, my country, my past. His clear eyes, full of tenderness, met mine and gave me a vague hope, of a glimpse of future happiness to come. I rested my head against his shoulder; I put my hand in his, and I sobbed noiselessly. అప్పగింతలప్పుడు తల్లీ, తండ్రీ, వధువు దుఃఖించే సన్నివేశం అచ్చంగా భారతీయమే.

తొరూ దత్‌ని ఇంగ్లిష్‌ సాహిత్యం అభ్యసించేవాళ్ళలో కొద్దిమంది తప్ప ఇతర భారతీయులు ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. తొలి భారతీయాంగ్ల రచయిత్రి, ఫ్రెంచ్‌లో, ఇంగ్లిష్‌లో నవలలు రాసిన తొలి భారతీయ రచయితగా గుర్తించినవాళ్ళు తక్కువే. ఆమె గురించి 2009లో ఒక డాక్యుమెంటరీని (Reviving Toru Dutt) ఆమెపై పిఎచ్. డి. చేసిన గీతా సేఠ్ రూపొందించడం మినహా ఎక్కడా ఆమె గురించి పెద్దగా చర్చ లేదు.


సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...