ఒకానొక నిస్పృహ

పరిగెత్తే కాలంలో
తప్పటడుగు నడక

నిన్న నడిచిన దూరంలో
సగమే ఇవాళ్టి నడక
గమ్యమే లేని ప్రయాణం
గమ్యం చేరేదెలా?

కూలిన సమయాన్ని
కొలవడం ఎలా?

వాటా పంచుకున్నాక
ఆకాశమే సగమిప్పుడు

వెలుతురు లేని ఆకాశం
కాంతి సంవత్సరాలు
తరించడం ఎలా?

రహస్యాలకి రంగులద్ది
హీలియమ్ బెలూన్లలో
ఎగరేయాలింక!

క్షణాల దండ కట్టి
ఎవరి మెడలో వేయాలి?
నిరీక్షణకి అర్థం లేదు

పొడుగు అంగీ తొడిగి
జోలె తగిలించుకుని
శిరోముండనంతో
ఏ వీధుల్లో తిరగాలి?
అన్నీ గొప్పులు తవ్విన గుంతలే!

గోడల్లేవు
అన్నీ హద్దులే
అంతా దూరమే
పొలిమేరల్లేవు
నిర్జన స్థలాలన్నీ
దుర్జన స్థలాలే

తోవ తప్పినప్పుడు
ఎవరో ఒకరు
ఏదో ఒక కాలంలో
సాయం చెయ్యరా?

ఇప్పుడు
కాలమే తోవ తప్పింది
అయినా ఏది తోవ?
ఎవరు దీని విధాత?
ఎక్కడుంది దీని పాలపుంత?