వెంటాడే పద్యం

కడుపున పడ్డ వాక్యాలు నిన్ను
కుదురుగా ఉండనీయవు
లోపలొక జాతర
డప్పుకొట్టి పిలుస్తుంటారెవరో
చుట్టూ ఎంత ప్రపంచం వున్నా
నీతో మాత్రమే ఎవరో
రహస్యంగా సాగించే అత్యవసర సంభాషణ

యథావిధిగా
నీ చెట్టు రూపం నీకు వచ్చేస్తుంది
కొమ్మల మీదంతా
రెండుముక్కుల పిట్టల సందడి

గీయాల్సిన బొమ్మ కళ్ళ ముందు ఎగురుతున్నపుడు
వేయాల్సిన రంగులు చేతుల్లో ఆడుతున్నప్పుడు
పద్యం కాకుండా
ఎన్నాళ్ళో తప్పించుకోలేవు

నీళ్ళ కావడితో
చేను గట్టు మీద నడుస్తున్నట్టుంటుంది
పద్యం నిన్ను లొంగదీసుకున్నాక
నిలకడగా నిలబడలేవు

రోజువారీ జీవితం
నీ ఊహల్ని చెదరగొట్టకముందే
ఆ రాత్రికో తర్వాతరోజు ఉదయానికో
వేళ్ళు ప్రసవించనీ

అప్పుడిక మళ్ళీ నువ్వు
నీ చెట్టురూపంతో సహా అదృశ్యమైపోవచ్చు


సాంబమూర్తి లండ

రచయిత సాంబమూర్తి లండ గురించి: ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2020లో గాజురెక్కల తూనీగ అనే కవితాసంపుటిని ప్రచురించారు. ...