అలా నచ్చుతుంది

“నిన్ను అబ్యూజ్ చేస్తున్నానా? నా ఇష్టం వచ్చినట్టు నిన్ను నా అవసరానికి వాడుకుంటున్నానా?” అతని చెంప నిమురుతూ అంది.

“నువ్వు నాపై ఎంతో ప్రేమ చూపిస్తావు! నాతో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. నీ ఆనందానికే నా జీవితం.” అరచేతిలో ఆమె మెడను ఇముడ్చుకుంటూ అన్నాడు. ఆమెకు అలా నచ్చుతుంది.

“అతని కంటే నువ్వు వేయి రెట్లు బెటర్. నిన్నెప్పుడన్నా మెచ్చుకున్నానా? నాకెంత సంతోషంగా ఉందో చెప్పానా?”

“నువ్వెంత సంతోషంగా ఎప్పుడు ఉందీ, ఎప్పుడు లేనిదీ నీ మొహం చూసి చెప్పగలను.”

“నువు నాకేమవుతావు?”

“నువ్వేం కావాలంటే అది.”

“నాకోసం ఏమయినా చేస్తావా?”

“నీకేం కావాలంటే అది.”

“ఇప్పుడు ఆ కిటికీలోంచి…”

“అది తప్ప. నీకూ నాకూ రూల్స్ తెలుసు.” ఆమె నోటిపై వేలు ఉంచి నవ్వుతూ చెప్పాడు. ఆమెకు అలా నచ్చుతుంది.


“ఈ రోజు చాలా బావున్నావు. ఈ కలర్ నీకు బాగా నప్పింది.” చెప్పాడు అతను నవ్వుమొహంతో.

“నిన్నా ఇదే చెప్పావు.”

“లేదు. నిన్న ‘ఈ డ్రస్ లో బాగున్నావు’ అన్నాను.”

“అది మొన్న!”

“కాదు. మొన్న ‘ఈ రోజు నీ మొహం వెలిగిపోతుంది ‘ అన్నాను. ‘ఈ కలర్ నప్పింది’ అని చెప్పి పది రోజులయింది.”

“అయినా ఎప్పుడూ ఆ స్టాక్ వాక్యాలే కదా నువ్వు చెప్పేది! రొటీన్ అయిపోతూంది! అప్పుడప్పుడూ చెప్పకపోయినా పర్లేదు.”

“అర్థమయింది మేడమ్!” అలా ఆమెకు నచ్చదు. అయినా అప్పుడప్పుడూ అలా అనమని ఆమె చెప్పింది ముందెప్పుడో.


“నీకేమన్నా బుద్ధుందా? రాత్రి ఆకలితో పడుకున్నాను.”

“ఆకలి లేదన్నావు.”

“నేను అప్‌సెట్ అయి ఉన్నాను కాబట్టి అన్నాను. బుజ్జగించో, బ్రతిమలాడో తినిపించి ఉండొచ్చు కదా!”

“తెలియలేదు.”

“నీకన్నీ చెప్పాలి! చెప్తే కానీ చేయవా?”

“ఒకసారి చెప్తే చాలు.”


“ఈ డ్రస్ బాలేదా? ఇవాళ బాలేనా?” పొద్దున్నే బయల్దేరి షూస్ వేసుకోబోతూ అడిగింది.

“లేదు, బావున్నావు.”

“మరి చెప్పలేదే?”

‘అప్పుడప్పుడు చెప్పకపోయినా పర్లేదు అన్నావు కదా’కీ, వేరే జవాబుల్లో ఒకటయిన ‘అనబోయేంతలోనే నువ్వడిగావు’కీ మధ్య బేరీజు వేసుకుని రెండోది చెప్పాడు. “ఇదెప్పుడూ వేసుకోలేదు నువ్వు!” అని జోడించాడు.


ఆమె వచ్చేసరికి అతను పకోడీ, టీలతో సిద్ధంగా ఉన్నాడు. ఆమెకి నచ్చినట్టు.

“మొహం కడుక్కుని రా! ఆరిపోతాయి.”

“నాకు తెలుసు నువు ఈ పూట పకోడీ చేస్తావని.”

“నాకు తెలుసు నీకు పకోడీ తినాలని ఉంటుందని.”

“లేదు. ఇవాళ బజ్జీ తినాలనిపించింది!”

“కానీ ఈ రోజులాంటి వాతావరణానికి ఎప్పుడూ పకోడీ తినాలని ఉందనేదానివి.”

“ఎప్పుడూ ఒకేలాగా ఎందుకు ఉంటుంది?”

“ఎందుకని ఉండదు?”

“ఏం చెప్తాం! తెలిస్తే కదా!”


“ఈ షర్ట్ బావుంది. ఫిట్ సరిగ్గా కుదిరింది.” సరిగ్గానే ఉన్న కాలర్‌ను సరిచేస్తూ అన్నాడు. ఆమెకు అలా నచ్చుతుంది. అని తనే చెప్పింది. చెప్తూ తిట్టింది కూడా. ‘వొట్టి మాటలు కాదు, ఫిజికల్ టచ్ ఉండాలి. నీకన్నీ చెప్పాలి.’ జుట్టు సర్దడం, మెడపై పల్చగా చేత్తో రాయడం, ఎప్పుడన్నా ఓ ముద్దు. బై చెప్పేప్పుడు ముద్దు వేరు.

“నీవన్నీ అబద్ధాలు. నిన్నటి డ్రస్ బావుందని పొగిడావు. ఎవరికీ నచ్చలేదు.”

“అభిప్రాయాల్లో నిజానిజాలు ఏం ఉంటాయి? బావుండడం సబ్జెక్టివ్ కదా! అసలు మనకు నచ్చిందే నిజం!”

“పోయినసారీ ఇలాగే చెప్పి తప్పించుకున్నావు.”

“లేదు. అప్పుడు ‘నాకళ్ళకు బావున్నావు, అది చాలదా’ అన్నాను.”

“మాటలు బాగా నేర్చావు!’

“మరి టీచర్ నువ్వు కదా!”

“అదో పురాతనమైన పొగడ్త! కొత్తవి కనిపెట్టు.” అంది కానీ ఆమె అదే మాట పదే పదే తల్చుకుని నవ్వుకుందా రోజు.


“మన కథ ఎలా ముగుస్తుంది?” అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది.

“ఒప్పుకోవు గానీ నీకు తెలుసు. చాలా మామూలుగా. ఏ మలుపు తోటీ కాదు. అయినా ఎలా ముగిస్తేనేం ఇలా సాగితే!”

“నేను పోయాక నన్ను గుర్తుంచుకుంటావా?”

“మర్చిపోయే వీలే లేదు. అయినా ఆ తర్వాత గుర్తుంచుకుంటే ఏం తేడా పడుతుంది? గుర్తుంచుకుంటానని చెప్పీ మర్చిపోయాననుకో, ఏమవుతుంది?”

“అలా అయినా బతికి ఉందామని!”

“అయితే నీ బొమ్మ వేస్తాను. నీ మీద కవిత్వం. ఒక పుస్తకం. నీ పేరు మీద ఒక స్కాలర్‌షిప్!”

“చాలు చాలు. I just want to be special to somebody. అంతే.”

“నీకోసమే నేనుంది.” నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పాడు. ఆమెకు అలా నచ్చుతుంది.


“నా భయాలు, బలహీనతలు, ఇష్టాలు, కోరికలు, నా ఇన్‌సెక్యూరిటీస్ అన్నీ నీతో పంచుకున్నాను. నా రహస్యాలన్నీ నీకు చెప్పేశాను. నువ్వేం చెప్పవు!” బుంగమూతి పెట్టింది.

ఆమెకి నచ్చినట్టు ఒక బుగ్గ మీద ముద్దు పెట్టుకుని అడిగాడు. “ఏం చెప్పను?”

“ఏదయినా నీ చిన్నప్పటి జ్ఞాపకం.”

“ఫొటోగ్రఫీ కోర్స్ చేయాలని ఆశ. ఫ్రెండ్స్ అంతా చేరారు. ఇంట్లో గొడవ. డబ్బుల్లేవని నాన్న. ఆయనకి తాగుడు అలవాటు. బార్లో బాకీ కట్టి రమ్మని ఆరోజు డబ్బులిచ్చి పంపాడు. నేనెక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాను. చీకటవుతుంటే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఇంటికి రానని మొండికేశాను. చివరికి ఫీజు కట్టడానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఆయనెప్పుడూ తాగలేదు.”

“ఎప్పటి కథ ఇది? కథలు బాగా అల్లుతావు!”

“ఆ అవసరం పడలేదు.” నవ్వాడు.

“నీ రహస్యమేదీ తెలియదు నాకు. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం కలగాలంటే రహస్యాలు పంచుకోవాలి కదా!”

“ADX10L23”

“అదేమిటి?”

“నా మెయిన్ చిప్ సీరియల్ నంబర్!”

అతని ఒడిలోంచి లేచి కూచుని పడీ పడీ నవ్వింది.

“ఈ బోడి రహస్యమెవడిక్కావాలి? ఇంకేదయినా చెప్పు కాస్త జ్యూసీగా!”


“నీకు ఇదంతా బానే ఉందా? నీకు ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండవని తెలుసు కానీ…”

“లేవని ఎందుకు అనుకుంటావు” అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మొహం పక్కకి తిప్పుకున్నాదు.

“సారీ! నిన్ను బాధ పెట్టాలని కాదు.”

ఆమె వంక చూస్తూ నవ్వాడు. “బాగా అనుకరించగలను కదా! ఎంత తేలికో చూడు నమ్మించడం. నేను చేయాల్సిందల్లా కళ్ళలో కాసిని నీరు తెప్పించడం.”

అతని నెత్తి మీద మొట్టి అంది. “నువ్వో ఫేక్ గాడివి! అన్నీ ఫేక్ ఎమోషన్స్!”

“నిజం ఎమోషన్స్ ఉండడమంటే ఏమిటి? నీ మొహంలో కనపడేవే కదా నా మొహంలో కనపడుతూంది? చూడు…” మొహంలో అన్ని భావాలూ ఒకదాని వెంక మరొకటి చూపించాడు.

“నువ్వూరికే నటిస్తున్నావు.”

“నువ్వూ అంతే చేస్తావు కదా! వచ్చిన కోపాన్ని దాచుకోవడం. ఎవరయినా వచ్చినప్పుడు నవ్వు రాకపోయినా నవ్వడం.”

“నీకెలా తెలుసు?”

“నీ కనుపాపలూ, మొహంలో కండరాల కదలికా నేను కొలవగలను.”

“నీతో జాగ్రత్తగా ఉండాలి!”

“టీవీలో సినిమా చూస్తూ ఏడుస్తావు కదా, అది నిజంగా నీ సొంత ఎమోషనా, థర్డ్ హాండ్ ఎమోషనా!”

“ఊఁ… That is so deep!”

“ఫేక్ డీప్! నిన్ను బోల్తా కొట్టించడం తేలిక!” ఆమె చెంప మీద తడుతూ చెప్పాడు. ఆమెకు అలా నచ్చుతుంది.


“నువ్వెప్పుడూ ఎందుకు అప్‌సెట్ కావు? నేను కోప్పడ్డప్పుడూ నవ్వుతూ ఉంటావు. చాలా అబ్‌నార్మల్‌గా ఉంటుంది తెలుసా!”

“నేను అప్‌సెట్ అయితే నీకు బావుంటుందా? కోప్పడితే నీకు నచ్చుతుందా?”

“నువ్వేం ఎప్పుడూ పర్‌ఫెక్ట్‌గా ఉండక్కర్లేదు. కొన్ని పొరపాట్లు చేయి. ఎప్పుడూ నన్ను సంతోషపెట్టక్కర్లేదు. నామీద కోప్పడు. నాకు కోపం తెప్పించు.”

“అదెలా?”

“నీ బుర్రకు అర్థం కాదు. కనీసం రాండమ్‌గా ఏదయినా చేయి. నేను అసలు ఊహించనిది.”


“ఆకల్లేదు. మూడ్ బాలేదు. వదిలెయ్.”

“ఒక ముద్ద తిను. కొత్త సీరీస్ వచ్చింది. పూర్తి కామెడీ. చూస్తే నీ మూడ్ బాగయిపోతుంది!”

“ఇందాకణ్ణుంచి చెప్తున్నాను. సీరియస్‌గా.”

“మళ్ళీ నువు రేపు ఉదయం అప్‌సెట్ అవుతావు నామీద.”

“అరె, ఎప్పుడు వదిలేయాలో తెలియదా నీకు! నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వు!”

“పోనీ, ఒక పాట ఏదయినా…”

“గెటవుట్!” అరిచింది. “బుర్ర లేదా? ఇంకెప్పుడు నేర్చుకుంటావు?”

“ఎప్పటికయినా. నా వద్ద చాలా సమయముంది.” బయటకు వెళుతూ చెప్పాడు.


రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...