తారకల చిరువెల్గుల హారతితో
శుక పిక గీతావళితో
నా జీవన కుటీర ప్రాంగణం లోకి
ఈ చెట్ల చుట్టూ అల్లుకున్న
వేకువ నును చీకటి కొసన్నుంచుని
నిన్నాహ్వానిస్తున్నాను రసమయీ!
దరహాస చంద్రికా ధవళ రోచిర్మయీ!
ఇంతవరకూ ఉన్న
నిర్నిమేష నిరీక్షణా
ద్రాహిష్ఠ శిశిరమ్ము గడిచి
భవదాగమనా విష్కృత
సుహృల్లతా
వనాంతానిల పరీమళ వ్యాపృత
వసంతం వస్తున్న ఈ క్షణాల…
తారకల చిరువెల్గుల హారతితో
శుక పిక గీతావళితో
నా జీవన కుటీర ప్రాంగణం లోకి
ఈ చెట్ల చుట్టూ అల్లుకున్న
వేకువ నును చీకటి కొసన్నుంచుని
నిన్నాహ్వానిస్తున్నాను రసమయీ!
దరహాస చంద్రికా ధవళ రోచిర్మయీ!
నువ్వు
చైతన్య దీప శిఖవై
దీక్షా లాక్షా రాగ రేఖవై రావాలి
మనచుట్టూ నలిగి
ముడతలు పడిపోయిన బతుకులతో
మనమిక ముందు తరాలనైనా
ఉద్దరిస్తామన్న నమ్మకాలతో
ఎదురు చూస్తున్న
అశేషా శేష పాండుర నయనాంచలాల
నూతనాశాసృగ్ద్యుతులు
ప్రతిఫలించాలి!
మనిద్దరం కలిసి
సంధ్యా సమీర ప్రసారాల షడ్జమాన్నీ
ప్రత్యూష పవన వీచికల పంచమాన్నీ
పోగు చేసి రచించిన
భవిష్యద్గీతాలాపనలో
తూర్పున మందారాలు పూయాలి
పడమర పారిజాతాలు విరియాలి
ఉత్తర దక్షిణ ధృవాల
ఉదంతికా నీహారం కురవాలి!
మహర్వాటీ మహాద్వార తోరణంలో
పక్క పక్క ఆకులమై పలకరించుకొనే వరకూ
నింగీ నీరధీ కలుసుకుంటున్న
క్షితిజ నిశాంత నీలిమల మీద
చెలీ!
అవిశ్రాంతంగా మనం
నవ నవాలైన
ఉషః ఉదయాలు పరవాలి!