1
దేనినీ నమ్మకు
అర్థం అనుమానించమని కాదు,
నమ్మటంలానే అనుమానించటం ఒక బలహీనత
ఊరికే ఉండు ఏమీ తెలియనట్టు
నిజంగా తెలియదు నీకైనా, నాకైనా
2
ఊరికే ఉండడం కన్నా
క్షేమమైన దారేదీ లేదనుకుంటా ఇక్కడ.
క్షేమం అంత అవసరమా అని ప్రశ్న
జవాబు తెలిస్తే
వెయ్యి లోకాలకి ఒకేసారి తెరుచుకుంటావు
3
స్వేచ్ఛ లోకి వెళ్ళటం ఉన్మాదమా
అంటావు భయం భయంగా
దయా, స్వేచ్ఛా ఏకమైన లోతుల్లో
ఆరోగ్యముంది నిజంగా అని వింటావు
4
ఎలా వెళ్ళాలి అంటావు జాగ్రత్తగా
దూకెయ్యి అని వినవస్తుంది
వెనుదిరుగుతావు
నీపై జాలి పడుతూ
5
ఈ అద్భుతమైన రాత్రిలానే
రేపటి అద్భుతమైన ఉదయం
నీ కోసం ఎదురుచూస్తుంది
ఎప్పటిలానే నమ్మకంతో, దయగా