అదృశ్యం

నువ్వొక అసంపూర్ణ వాక్యమై వస్తావు
నేనొక అలంకారాన్నై
నిన్ను అందంగా పూరిస్తాను

నువ్వొక చీకటి రాత్రివై వస్తావు
నేనొక మిణుగురునై
నీకు వెన్నెల కాంతిని బహూకరిస్తాను

నువ్వొక పల్చని కాగితమై వస్తావు
నేను కుంచెనై
నీకు వేవేల రంగులద్దుతాను

నువ్వొక మట్టి ప్రమిదై వస్తావు
నేను చమురై
నిన్ను దేదీప్యమానంగా వెలిగిస్తాను

నువ్వొక ఖాళీ దేహమై వస్తావు
నేను మంత్రాన్నై
నీలో మోహన రాగాలు పలికిస్తాను

మన ప్రయాణంలో
నువ్వొక సముద్రానివై
నన్ను నదిని చేసి
నీలో అమాంతం కలిపేసుకుంటావు

అంతే
మన కథలో హఠాత్తుగా
నువ్వు నేను
అనే పదాలు అదృశ్యమైపోతాయి