వారణాసి

దాదాపుగా ఒకే రకమైన చిన్న చిన్న జంట వసారాలు, వసారా పైనుండి ఏటవాలుగా జారే మండువాను మోస్తూ రెండు చెక్క స్తంభాలు, బంకమట్టి పెంకుల పైకప్పుల ఇళ్ళతో నిండిన ఆ పాత వీధిలోకి ఆ ఆంబులెన్స్ ప్రవేశించింది.

అన్ని ఇళ్ళ గుమ్మాల ముందు తెల్లని మెలిక ముగ్గులు ఉన్నాయి. బాలామణి ఎడమవైపు చెయ్యి చూపించి ముగ్గు వెయ్యని ఒక ఇంటి ఆవరణలో బండి ఆపమన్నాడు. ఆరుబయట నలుగురైదుగురు వయసు పైబడిన మగవాళ్ళు నిలబడి ఉన్నారు. దిగి బండిని వీధి ముఖంగా తిప్పి పెట్టమని డ్రైవర్‌తో చెప్పాడు. బాలామణి చేతిలో ఒక నల్లకోడి, ఇంకో చేతిలో ప్రభుత్వం సీల్ వేసిన ఒకట్రెండు కాగితాలు ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళబోతున్నవాడిని ఆపి ఒక పెద్దాయన అన్నాడు.

“ఏరా, బాలామణీ నువ్వయినా అతనికి చెప్పొద్దూ? అసలే ఐదారేళ్ళు మంచాన పడ్డ శరీరం… అంత దూరం తట్టుకోలేదురా. పూరణికైనా చెప్పు. చకచకా ఇక్కడే కర్మకాండలన్నీ చేసేద్దాం.”

“మీరు కాస్త ఊరుకుంటారా మావయ్యా!” అంటూ ఇంట్లోకి వెళ్ళాడు. మాధవన్ పార్థివదేహం తల దగ్గర దీపమొకటి సన్నటి వత్తితో వెలుగుతోంది. పురాతనమైన మండువా ఇల్లు. మంచం మండువా మధ్యన ఉంచారు.

చుట్టుపక్కల ఇళ్ళ నుండి ముగ్గురో, నలుగురో వయసు మళ్ళిన స్త్రీలు, బాలామణి భార్య, అతడి ఇద్దరి ఆడపిల్లలు, ఇంటి గుమ్మం ముందు వసారాలో నలుగురైదుగురు మగవాళ్ళు… అంతే జనం.

పూరణి, బాలామణి కనిపించగానే ప్రశ్నార్థకమైన ముఖంతో అతడివైపు చూసింది. అతడు వంటగదికి రమ్మని ఆమెకు సైగ చేసి ముందుకు నడిచాడు. మొలలో దోపుకున్న ఒక రంగు వెలిసిన పసుపురంగు సంచి నుంచి డబ్బు తీసి ఆమెకు ఇచ్చాడు.

“నాలుగైదు చోట్ల తిరిగాను. శవాన్ని మోసుకుని వారణాసి వరకు వచ్చేందుకు ఏ ఆంబులెన్స్ కూడా సిద్ధంగా లేదు. వచ్చేందుకు ఒప్పుకున్నవాడు కూడా వాడి ఇష్టమొచ్చినట్టు కిరాయి అడుగుతున్నాడు. ఈ బండివాడు మాత్రమే ఒప్పుకున్నాడు. కిరాయి తక్కువే. అయితే బండి కాస్త పాతది. వెనుక ఐస్ బాక్స్ బాగానే పనిచేస్తోంది. మూడు, నాలుగు రోజులు అయినా శరీరం తట్టుకుంటుంది, చెడిపోదు. అతన్ని అడిగాను, ‘మూడో రోజు సాయంత్రం లోపు వెళ్ళిపోవచ్చు’ అని చెప్పాడు.”

పూరణి ఏమీ అనకుండా అతడినే చూసింది.

“ఇదిగో” చేతిలో ఉన్న ప్రభుత్వకాగితాన్ని ఆమె చేతికిచ్చాడు. “అంత దూరం తీసుకుని వెళ్ళేటపుడు దారిలో పోలీసులు బండి ఆపి అడగడానికి అవకాశం ఉంది. అందుకే గవర్నమెంట్ డాక్టరును పట్టుకుని డెత్ సర్టిఫికెట్ తీసుకుని వచ్చాను. జాగ్రత్తగా పెట్టుకో.”

పూరణి మౌనంగా అందుకుంది. తల తిప్పుకుని కాశీకి తీసుకెళ్ళవలసిన అస్థికల కుండను చూస్తూ చెప్పాడు. “క్షమించు పూరణీ, నేను రాలేకున్నాను.”

తడి ఆరి అంటుకునిపోయి ఉన్న ఆమె పెదవులు విడివడలేక విడిపోయాయి. “పర్వాలేదు…” అంతే మాట్లాడింది.

బాలామణి పూరణి పెద్దమ్మ కొడుకు. తమ్ముడి వరుస అవుతాడు. ఆమె కంటే ఒకటీ రెండేళ్ళే చిన్న. పూరణిది నలభైకి చేరువ అవుతున్న వయసు. పైగా పిల్లలు లేరు. బంధువులతో ఆమెకు పెద్దగా సంబంధాలు లేవు. పూరణి కనబడ్డ వారినల్లా డబ్బులు అడుగుతుంది అని వాళ్ళ ఆరోపణ. అందులో ఒకింత నిజం కూడా లేకపోలేదు. ఇపుడు కూడా మాధవన్ చావుకు ఎక్కువమంది హాజరు కాకపోవడానికి కారణం బహుశా అదే అయ్యుంటుంది.

ఆరేళ్ళ క్రితం మంచాన పడకముందు మాధవన్ కుంభకోణం విశాలం చిట్స్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేసేవాడు. బొటాబొటీ జీతం. పని భారం సాకుతో మెల్లగా మందు, పేకాట మొదలుపెట్టాడు. వారాంతాలు మీనాక్షి కాలేజీలోని ఒక క్లాస్‌రూమ్‌లో రాత్రంతా మద్యం, పేకాట కొనసాగేవి. శనివారం సాయంత్రం మొదలయ్యే ఆట, ఆదివారం మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. కొంతమంది ఇంటికి వెళ్ళి ముఖం చూపించేసి, మళ్ళీ వచ్చి ఆటను కొనసాగిస్తారు. మాధవన్ రాత్రి డ్యూటీలు, లెక్కలు చూసేందుకు లేటయ్యిందని సాకులు చెప్పేవాడు.

పూరణి కాస్త కటువుగా ఉండటం మొదలుపెట్టాక మందు వాసన తగ్గేదాకా ఆగి వేకువ జామున బయలుదేరి వచ్చి నిద్ర ముఖంతో ఇంటి తలుపును కొడుతూ నిలబడేవాడు. ఒక రోజు ఉదయం మందు ప్రభావమో, నిద్రలేమో లేదా రెండూనో, తెలియలేదు కాని ఇంటికి వెళ్ళే దారిలో ఆక్సిడెంట్ అయ్యి రక్తపు గాయాలతో పడి కనిపించాడు. దేనికయినా గుద్దుకున్నాడో లేదా ఏదైనా గుద్దిందో తెలియదు, ప్రమాదంలో వెన్నెముక విరిగిపోయింది. ప్రాణాన్ని దక్కించుకునేందుకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అయ్యింది. మాధవన్ కంపెనీవాళ్ళు చిన్న మొత్తాన్ని చేతికిచ్చారు. ఇంట్లో పొదుపు చేసిన డబ్బంటూ పెద్దగా ఏమీ లేదు. చేతిలో ఉన్న ఆఖరి నగ వరకు అమ్మినా సరే వైద్యానికి డబ్బులు చాలలేదు. అలా మొదలైంది పూరణి బంధువుల దగ్గర డబ్బు అడగడం.

ఎంత ఖర్చు చేసినా మాధవన్‌ను పూర్తిగా కాపాడలేకపోయారు. మెడ కింద శరీరభాగం ఇక శాశ్వతంగా పని చెయ్యదు, మిగిలిన జీవితకాలమంతా మంచం మీదే పొద్దు పుచ్చాలి, మరో అవకాశం లేదు అనేయడంతో అతనిని ఇంటికి తీసుకు వచ్చేసింది. వయసు పైబడిన మాధవన్ తల్లిదండ్రులు కూడా ఆమెనే నిందించారు. తాగుతున్నాడని తెలియగానే కరాఖండిగా వ్యవహరించి ఉంటే ఇలా జరిగుండేది కాదని చెప్పి ఆమెను ఉన్నపళంగా వదిలేసి వారెటో వెళ్ళిపోయారు. దాదాపు బంధువులందరూ అలాగే వ్యవహరించారు. దీని తరువాత ఇంతవరకు ఎవరు ఈ ఇంటికి వచ్చింది లేదు. బాలామణి మాత్రం తరుచూ వస్తూ ఆర్థిక సాయం చేసేవాడు.

మంచం పట్టిన కొత్తల్లో మాధవన్ పూరణిని చూసి కన్నీరు కార్చేవాడు. తన వల్లనే పూరణి జీవితం ఇంత దుర్భరమైన స్థితికి చేరుకుందని గొణిగేవాడు. చాలాసార్లు ఆమెను క్షమాపణ అడిగేవాడు. అది కూడా కొద్ది రోజులవరకే. ఆ తరువాత నుండి నువ్వు మొదట్లో నన్ను పట్టించుకోకుండా ఉండటంవల్లే నాకీ గతి పట్టింది అని ఫిర్యాదులు మొదలుపెట్టాడు. పూరణి ఎప్పటిలానే సమాధానం చెప్పేది కాదు. మౌనంగా ఒకటి రెండు కన్నీటిబొట్లు కార్చి అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోయేది.

ఏది ఏమైనా మాధవన్‌కు వేకువజామునే స్నానం చేయించాలి. ఆపై బాగా తెల్లని పంచెను కట్టి, తూర్పు దిక్కున అతడిని కూర్చోబెట్టి నుదుట నామం పెట్టాలి. పని చేయకుండా చచ్చుబడ్డ చేతులను ఆమె చాచి, మడిచి ఒకటిగా పెట్టించి దేవుళ్ళ పటాలకు ఒక మొక్కు, విష్ణు సహస్రనామం, మంత్రోచ్చారణ అయినాక, ఆపైనే ఆహారం తినిపించాలి.

పూరణి మౌనంగా అన్నీ చేసేది. చివరిగా మందులు వేసి అతడిని పడుకోబెట్టేది. మధ్యలో మల, మూత్ర విసర్జన కోసం కేకలు పెట్టి పిలిచేవాడు. వాటిని ఎత్తి పక్కన పడేసి, అతనిని శుభ్రం చేసేది. పూరణి తన బాధ్యతగా అన్నిటినీ సవ్యంగా ఎటువంటి మూతి విరుపులు లేకుండా, చికాకు పడకుండా చేస్తూ వచ్చింది. మాధవనే అన్నిటికీ ఏదో ఒక పేచీ పెట్టేవాడు.

ఉప్పు సరిపోకుంటే అన్నాన్ని ఆమె ముఖం మీద ఊసేవాడు. పూరణిని ఇంటి గుమ్మం దాటనిచ్చేవాడు కాదు. కిరాణా, కాయగూరలు, దేని కోసమూ ఆమె దుకాణం వీధి వరకు వెళ్ళకూడదు. వెళ్ళింది తిరిగి ఇంటికి రాకుండా, తనను ఇలా వదిలేసి ఇంకెవరితోనో బస్సు ఎక్కేస్తుందేమోనని భయం. ఏ వస్తువయినా సరే కిరాణా కొట్లో చెప్పి, ఇంటికి తీసుకొచ్చి ఇవ్వమని చెప్పమనేవాడు. కిరాణా కొట్టు నుండి సామాన్లు తీసుకువచ్చేవాడు వయసులో ఉన్నవాడు అయితే ఇక అంతే సంగతులు. నిముషానికి ఒకసారి ఆమె తన కంటి ముందే ఉందా లేదా అని పరీక్షగా చూసేవాడు. అతడి దృష్టి నుండి ఒక ఐదు నిముషాలు ఆమె కనుమరుగైతే చాలు, ఎవరితో పడుకున్నావు? నాకు కుదరదనే కదా ఇలా చేస్తున్నావని, అరిచి దుమారం రేపేవాడు.

ఊర్లో ఉన్న దేవుళ్ళందరికీ మొర పెట్టుకుని నన్ను ఎందుకు ఇలా చేశావు భగవంతుడా, త్వరగా నన్ను నీలో ఐక్యం చేసుకో అని ఏడ్చి గీపెట్టేవాడు. పూరణి మంచి రంగు, యవ్వనం అతని నిస్సహాయతను, అసమర్థతను ఎత్తిచూపి అతని మనసును తూట్లు పొడిచేవి. బాలామణి ఆమెకు తమ్ముడు వరుస. బంధువులలో అతనొక్కడే ఎన్నో రకాలుగా సహాయం చేసేవాడు. తమ్ముడి వరస అని తెలిసి కూడా మాధవన్ ఎన్నోసార్లు బాలామణిని, ఆమెను కలిపి మాట్లాడేవాడు. నువ్వు ఇంత అందంగా ఉండటంవలనే వాడు నీకు డబ్బులు ఇస్తున్నాడు అని ఆమె తట్టుకోలేనంతగా అవమానించేవాడు. బాలామణికి విషయం తెలిసి, ఈ మనిషిని వదిలేసి నా ఇంటికి వచ్చెయ్ అని కోపంగా చీవాట్లు పెట్టాడు. పూరణి ఏడుస్తూ అన్నింటినీ వద్దని వారించింది. ఏడుపు, ఏడుపు మాత్రమే ఆమెకు తోడుగా నిలిచింది.

ఆమెకు కొన్ని సందర్భాల్లో మాటలతో అనుదినం తనను మానసికంగా ఇలా చంపుతున్న ఇతడిని గొంతు నులిమి చంపేయాలనిపించేది. ఏం చేయాలో తోచక ఒక చీకటి గదిలో ముడుచుకుపోయి కూర్చుని తన పరిస్థితిని తలుచుకొని శబ్దం బయటకు రాకుండా వెక్కి వెక్కి ఏడ్చేది. రానురానూ పూరణి శరీరం శుష్కించిపోయింది, కానీ మనసు మాత్రం గట్టిపడింది. నిందలను, తిట్లనూ వినీ వినీ ఆమె మొద్దుబారిపోయింది. కాని, చెవి మాత్రం వినడం మానలేదు. అది మాత్రం రాయి కాలేదు. అది కూడా అలా మారిపోతే కానీ ఏ మాటా తనని గాయపరచదని ఆమె నమ్మింది. ఇక మాధవన్ వైద్యం కోసమని చుట్టుపక్కలవాళ్ళ అందరి దగ్గర అప్పు తీసుకుంది. బాలామణి దగ్గర అయితే అసలు లెక్కే లేదు. ఈ మధ్య అతడు ఇంట్లోకి కూడా రావడం లేదు. గుమ్మం దగ్గరే డబ్బులు ఇచ్చేసి నిమిషంలో బయలుదేరుతున్నాడు.

ఐదారేళ్ళుగా అలా మంచాన పడిన మాధవన్ శరీరం ఎంతగానో క్షీణించిపోయింది. కాళ్ళు చేతులు కుంచించుకుపోయి, తల మాత్రం పెద్దదిగా కనిపించేది. చివరిగా డాక్టర్ శేషాద్రి చెప్పారు, ఇంకా కొన్ని రోజులు మాత్రమేనని. మూడు నెలల కాలమే ఎక్కువ. ఎటువంటి దాపరికాలు లేకుండా మాధవన్‌కు ముందే చెప్పేశారు. మాధవన్ వెక్కి వెక్కి ఏడ్చాడు. బ్రతుకు మీద వాంఛ ఉన్నవాడిలా ధారాపాతంగా కన్నీరు కార్చాడు. ఆమెకు ఎటువంటి అసంతృప్తి లేదు. అలాగని తృప్తి కూడా లేదు. పూరణి చెవి కాస్త రాయిలా మారినట్టు ఉంది. ఆరేడేళ్ళుగా కన్నీరు మాత్రం వట్టిపోకుండా వీలు కుదిరినప్పుడల్లా, కారుతూ వచ్చింది.

ఒక వేకువ జామున స్నానం, దేవతారాధన పూర్తవ్వగానే పూరణిని అడిగాడు. “పూరణీ, ఏ జన్మ ఋణమో నువ్వు నా కోసం ఎంతగానో చేశావు. తెలిసిన చోటల్లా అప్పు చేసి వైద్యం చేయించావు. చివరిగా నా కోసం ఈ ఒక్క పని మాత్రం చెయ్యి.”

పూరణి ఏమైయుంటుంది అన్నట్టు తలెత్తి చూసింది.

“నాకు ఇంకో జన్మ వద్దు. వేదాలను, శాస్త్రాలను నమ్మేవాడిగా చెబుతున్నాను. శాస్త్రబద్ధంగా నా పార్థివదేహాన్ని వారణాసికి తీసుకెళ్ళి కాల్చి, అస్థికలను గంగలో కలిపితే నాకు జన్మబంధనం తెగిపోయి, పునర్జన్మ లేకుండా పోతుంది. నా కోసం ఈ ఒక్క కార్యాన్ని మాత్రం మర్చిపోకుండా చెయ్యగలవా?”

ఒక విధమైనటువంటి పూజ్యభావం తోను, కృతజ్ఞతాభావం తోనూ ఆమెవైపు చూశాడు. పూరణి చిన్నగా తలాడించింది.

ఇద్దరూ చావు దగ్గరపడే సమయం కోసం, ఆ రోజు కోసం ఎదురుచూశారు. మాధవన్ బ్రతికున్న రోజులన్నిటిని పూర్తిగా చూసేయాలన్న వాంఛతో రేయింబవళ్ళు పడుకోలేదు. తరచూ పూరణిని దగ్గరకు పిలిచి కూర్చోబెట్టుకుని ఆమె ముఖాన్నే చూస్తూ ఉండిపోయేవాడు. ఒక్కసారిగా గుండెలు పగిలి ఏడ్చేవాడు. పూరణి ఎప్పటిలానే కరకుగానే ఉండేది.

మాధవన్ తరుచూ అడుగుతూ ఉండేవాడు. “నేను చనిపోగానే నువ్వు ఇంకో పెళ్ళి చేసుకుంటావు కదూ! నువ్వు పాపం! పూరణీ చేసుకో. నన్ను చేసుకుని చాలా బాధలు అనుభవించేశావు.” అతడి ముఖాన్ని రెప్ప వాల్చకుండా చూసేది. కాస్త సమయం గడిచాక “నువ్వు ఇంకో పెళ్ళి చేసుకోకు పూరణీ. నిన్ను ఇంకెవరూ ముట్టుకోకూడదు. ఇలాగే ఉండిపో. ఏం ఉండలేవా? అలాగే ఉండిపోవాలి” అని చెప్పి, పళ్ళు కొరుక్కుంటూ ఏడ్చేవాడు. పూరణి అతడి ముఖాన్ని రెప్పవాల్చకుండా చూస్తూనే ఉండేది. చెవి నిండా పేరుకుపోయిన ఈ మాటలన్నిటిని జీర్ణించుకోలేకపోయేది పూరణి.

ఈ రోజు వేకువ జామునే జీవం విడిచిపోయింది. ఈ రోజు దుఃఖం లేదు. ఇప్పుడు కూడా కరకుగా కాస్తంత చలనం కూడా లేకుండా అతడి ముఖాన్ని చూస్తూ ఇంటిలో నిలబడే ఉంది పూరణి. ఒక వ్యక్తి, మాధవన్ దేహాన్ని ముఖం మాత్రం కనిపించే విధంగా తెల్లని గుడ్డతో చుట్టాడు. ఒక చిన్న చేతిసంచిలో మార్చుకునేందుకు రెండు జతల బట్టలు తీసుంచి బాలామణి భార్య తెచ్చిచ్చింది.

బండిని బాలామణి చూపించిన దిక్కుకు తిప్పేసి ఆంబులెన్స్ నుండి నటరాజ్ కిందకు దిగాడు. ఏదో ఒక ఇంటి నుండి నిప్పురవ్వలు రాజేసి తెల్ల సాంబ్రాణి ధూపం దట్టించి వేసినట్టున్నారు, ఆ వాసన ఇంటి నుండి వీధికి దిగి వచ్చింది. మరో ఇంటి నుండి కృష్ణుడి బృందావన గీతాల గానం, తంబురా నేపథ్యంతో వదిలి వదిలి, గొంతును సవరించుకునే హ్మ్, హ్మ్, అనే శబ్దం మధ్యలో వినిపిస్తోంది. ఎవరో సంగీతం నేర్చుకుంటోంది కాబోలు. కాస్త ఆవుపేడ, తడిగడ్డి కలగలిసిన పశువుల పాక వాసన కొడుతోంది అప్పుడప్పుడూ.

నటరాజ్‌కు నలభై ఒక్క ఏళ్ళ వయసు. భార్య ఇతన్ని వదిలేసి ఇంకో పెళ్ళి చేసుకుంది. ఏ మనిషి మీదా అతడికి బలమైన నమ్మకం లేదు. చిన్నప్పటి నుండి మోటార్ మెకానిక్కుగా ఉన్నాడు. నాలుగేళ్ళుగా సెకండ్‌హాండ్ ఆంబులెన్స్ ఒకదానిని కొనుక్కొని సొంతంగా నడుపుతున్నాడు. ఒక సిగరెట్టును తీసి ఎక్కడి నుండో అగ్గిపుల్లను వెదికి వెలిగించుకుని వచ్చి ఇంటి ముందు నిలబడ్డాడు.

బాలామణి బయలుదేరుదామా అని అడిగాడు. నటరాజ్ తలాడించగానే బాలామణి ఒక చెయ్యి వెయ్యగలరా అని అడిగాడు. నటరాజ్ మొదట నిరాకరించాడు. తరువాత మనసొప్పక బాలామణి వెనుకే నడిచాడు. ఇంట్లోకి వెళ్ళగానే ముందుగా పూరణినే చూశాడు. ఈ చావు కోసం అని కాకుండా ఎన్నో ఏళ్ళుగా వేళ్ళూనుకున్న శోకంతో నిండిన ముఖం. బాలామణి తల వైపు పట్టుకొమ్మని చెప్పాడు. బాలామణి, ఇంకొకరు శరీరాన్ని పట్టుకోగా నటరాజ్ వెనకకు, వీధి వైపుకు నడిచాడు. వాహనపు రెండు తలుపులు గుండెను తెరుచుకుని నిలబడినట్టు ఉన్నాయి. నటరాజ్ పైకెక్కి ముందుగా శవం తల వైపును బండిలోకి ఎక్కించాడు. శరీరాన్ని పూర్తిగా ఎక్కించాక పూరణి ఇంటి నుంచి బయటకు వచ్చింది.

ఆమె కాళ్ళు ఆ వీధిలో నడిచి ఎన్నో ఏళ్ళు గడిచాయి. బండిలో ఎక్కి కూర్చుంది. కొన్ని ఇళ్ళ నుండి ఆడవాళ్ళు తొంగి చూస్తూ ఏదో ఊసులాడుకున్నారు. బాలామణి మారుబట్టలు ఉంచిన చేతి సంచిని ఆమె కాళ్ళ దగ్గర పెట్టాడు. ఇంకొకరు రెండు కాళ్ళూ కట్టేసివున్న నల్లకోడిని మాధవన్ శరీరం ఉన్న స్ట్రెచర్ కింద కట్టి పెట్టాడు.

ఇది ఎందుకన్నట్టు బాలామణి వైపు చూశాడు నటరాజ్. “ఇది శాస్త్రం. శని వదిలి పోవాలి కదా” అని చెప్పి ఇంటి తలుపులు వేశాడు బాలామణి. ఆ కోడి కూడా ఆమెలానే ఎటువంటి శబ్ధం చేయకుండా బిగుసుకుపోయి ఉంది. కాసేపట్లో బండి బయలుదేరింది. వెనక తలుపు మీద ఉన్న అద్దం లోంచి చూసింది పూరణి. ఇళ్ళన్నీ వెనక్కి జరుగుతున్నాయి. బాలామణి మూసిన తలుపు దగ్గర నిలబడి ఏదో మాట్లాడుతున్నాడు. గుమ్మం దగ్గర, అరుగు దగ్గర నిలబడ్డ మహిళలు ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఆమెకు ఏదీ చెవిన పడలేదు. ఒక నిముషం చెవులు పూర్తిగా బిగుసుకుపోయి, రాయిలా మారినట్టు అనిపించింది.

ఆ అద్దం లోంచి వెనకకు పరిగెడుతున్న కుంభకోణం వీధులను చూస్తూ ఉండిపోయింది. ఎటువంటి జ్ఞాపకాలు, దృశ్యాలూ లోలోపల నిలవకుండా చెదరిపోతున్నాయి. ఆంబులెన్స్ కుంభకోణం పొలిమేరలు దాటి విశాలమైన నల్లటి రోడ్డుపైకి ఎక్కింది. శరీరాన్ని చటుక్కున చలి తాకింది. తను ఉన్న చోటును గుర్తించింది. తప్పించుకోలేని, ఉండలేని ఒక చిన్న గదిలో ఉన్నట్టు ఆమెకు దిక్కు తోచలేదు.

ఎదురుగా ఉన్న మాధవన్ శరీరపు నోటిని చూసింది. ఆ నోరు ఏ సమయంలోనైనా తెరుచుకుని తనని అసభ్యంగా తిట్టొచ్చునన్న భయం మొదలయింది. తనకి ఈ శవంతో అంత దూరం ప్రయాణించడం సాధ్యం కాదు. ఇంటికి తిరిగి తీసుకెళ్ళి అక్కడే దహన సంస్కారాలు ముగించేద్దాం అనుకుంది. చటుక్కున ఊపిరాడనట్టు అనిపించింది. చూపును ఎటో తిప్పబోయి కోడి మీదకు మళ్ళించింది. కోడి కూడా ఆమెనే చూస్తూ ఉంది.

ఒక క్షణం తను మాట్లాడగలదా? నా నాలిక రాయి అయిపోలేదు కదా అని అనుమానపడింది. ఆంబులెన్స్ ముందువైపు, డ్రైవరు కాబిన్ వెనకాల ఉన్న చిన్న అద్దపు కిటికీ తీసి, నటరాజ్‌ను బండి ఆపమని చెప్పింది. అతడికి మొదట వినబడలేదు. బండి ఆపి తలుపు తెరవమని బిగ్గరగా అతడితో చెప్పింది. బండిని ఒక పక్కకు లాగి ఆపాడు. తలుపు తెరిచే శబ్ధం కోసం ఎదురుచూసింది. తెరవగానే వేగంగా కిందకు దిగి గట్టిగా శ్వాస పీల్చుకుంది. నిట్టూర్పు విడిచింది. నిర్మానుష్యమైన రోడ్డును చూసింది. రోడ్డు పక్కన అటూ ఇటూ వరుస తప్పకుండా చెట్లు ఉన్నాయి. ఈ ఏడేళ్ళలో తన కళ్ళు వీటిని కూడా చూడలేదే అని తనను తానే తిట్టుకుంది.

“ఆ కోడికి కట్టు విప్పి, దాన్ని వదిలేయగలరా?” అడిగింది. నటరాజ్ కోడిని ఒక చేతిలో పట్టుకుని, ఇంకో చేతితో దాని కట్టు విప్పి కిందకి వదిలాడు. అది చింతచెట్టు పక్కగా కొక్కొరొకో అని కూత పెడుతూ, రెక్కలల్లార్చుకుంటూ పరిగెత్తి పోయింది.

మళ్ళీ మాధవన్ దగ్గరకెళ్ళి కూర్చోవడం తన వల్ల కాదని, ఆ శరీరాన్ని తాను చూడకుండా తలుపు మూసేయమంది. నటరాజ్ తలుపు మూశాడు, అతనికేమీ అర్థం కాకపోయినా. ఆమె బండి ముందువైపుకు నడిచింది. తను తరచూ సిగరెట్ కాలుస్తానని నటరాజ్ చెప్పాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా వెళ్ళి ముందు సీట్లో కూర్చుంది. అతడు కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చుని, ‘వెనుకైతే ఐస్ బాక్స్ ఉంది, ముందు వైపు ఉక్కగా ఉంటుంది’ అని చెప్పాడు. ఆమె చలనం లేకుండా రోడ్డు వైపు రెప్పలార్పని కళ్ళతో చూస్తుండిపోయింది. బండి బయలుదేరింది.

మధ్యాహ్న భోజనం కోసం నటరాజ్ బండి ఆపాడు. ఆమె ఇష్టం లేదని, వద్దని చెప్పి తలాడించింది. నటరాజ్ వేగంగా వెళ్ళి ఒక టీ మాత్రం తాగేసి మళ్ళీ వచ్చేశాడు. అతడికి సిగరెట్ కాల్చక ఏదోలా ఉంది. తినేందుకు ఏమైనా కావాలా అని మళ్ళీ ఒకసారి ఆమెను అడిగాడు. ఆమె ఒద్దన్నట్లు చిన్నగా తలాడించింది. బండిని స్టార్ట్ చేసి మళ్ళీ బయలుదేరాడు.

కొత్త కొత్త ఊళ్ళను, మనుష్యులను, చెట్లను, పక్షులను, కొండలను, రోడ్లను, పంటచేలను బిగుసుకున్న ముఖంతో, రెప్పలార్పని కళ్ళతో చూస్తూ వచ్చింది. ఆమె ముఖంలో మెల్ల మెల్లగా కఠినత్వం తగ్గుముఖం పడుతూ వస్తున్నట్టుగా ఉంది. పొద్దు వాలి ఆమె ముఖాన సాయంకాలపు చల్లగాలి వీచింది, అలసటతో కళ్ళు మూతలు పడి తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది.

పాపం! ఎన్ని రోజులయిందో పడుకొని! నటరాజ్ ఆమెను లేపలేదు. బాగా రాత్రయ్యాక ఆమే నిద్ర లేచింది. తెలుగు పాటలు వినబడుతున్న ఏదో ఒక హోటల్ ముందు ఆంబులెన్స్ నిలబడి ఉంది. చటుక్కున కళ్ళు తెరిచి చూసింది. రంగు రంగు సీరియల్ లైట్లు వెలుగుతున్నాయి. పెద్ద రాతి పొయ్యి మీద తెల్లని పొగ పైకి ఎగబాకుతోంది. అక్కడ పెనం మీద దోసెలు వేస్తున్నారు. వందల కొద్దీ లారీలు నిలబడి ఉన్నాయి. బండి దిగి నటరాజ్ కోసం చుట్టూ వెతికింది. అక్కడంతా మగవాళ్ళే ఉన్నట్టు అనిపించింది. అందరూ తననే చూస్తున్నట్టు ఉంది.

నాలుగడుగులు అటూ ఇటూ వేసింది. ఎదురుగా ఆమె వైపు వస్తూ కనిపించాడు నటరాజ్. బాత్‌రూమ్ వెళ్ళి వస్తారా అని అడిగాడు. ఇంతసేపు మర్చిపోయింది కాని అతను అడగగానే ఇపుడు చటుక్కున మూత్రాశయం నిండి బరువెక్కి నొప్పి తెలిసివచ్చింది. అవునన్నట్టు తలాడించింది. అతడు ముందుకు నడిచాడు. ఆమె వెనుకనే అనుసరించింది. కాస్త దూరంలో చీకటిలో అక్కడక్కడా నిలబడి మగవాళ్ళు మూత్ర విసర్జన చేస్తున్నారు. ఒక నిముషం ఆమె తనను కూడా ఇటువంటి చీకటిలో నిలబడి పాస్‌కు వెళ్ళిరమ్మని చెబుతాడేమో అనుకుంది. అతడు కొట్టులోకి వెళ్ళాడు. ఎవరో ఒకామెతో మాట్లాడటం చూసింది. ఆమెను కొట్టు లోపలికి పిలిచాడు. కొట్టు లోపలినుండి వెనుకకు ఒక దారి ఉంది. అక్కడ ఆ కొట్టులో ఆడవాళ్ళు వాడే ఒక మరుగు దొడ్డి ఉంది.

ఆమె తలుపు తెరుచుకుని బయటకు రాగానే అతడు ఒక మూలన నిలబడి పొగ తాగుతూ కనిపించాడు. చిన్న పసుపు బల్బు వెలుతురులో అతడిని తొలిసారిగా చూసింది. ఒకింత ఎరుపు రంగు, ముఖం నిండా దట్టంగా పేరుకుపోయిన గడ్డం, కాస్త మొరటు వ్యక్తిగా అనిపించాడు. చాలా మలయాళీ పోలికలున్నాయి. అతడు ఆమెను చూడగానే సిగరెట్ ఆర్పలేదు. పక్కకు విసరనూ లేదు. “రెండు నిముషాలు” అన్నాడు, “తరచూ కాల్చేవాడిని. మధ్యాహ్నం నుండి కాల్చలేదు.”

సిగరెట్ పూర్తయ్యేంత వరకు ఆమె అక్కడే నిలబడి ఉంది. ఆ రెండు నిమిషాల్లో ఒక కొత్త మగాడితో ఎటువంటి ఇబ్బంది లేకుండా సహజంగా అలా ఉండటం ఎలా వీలైందో ఆమెకు తెలియలేదు. అతడు సిగరెట్ ఆర్పేసి వచ్చాడు. చేతులు కడుక్కుని తినేసి రమ్మన్నాడు. ఆమె ఒద్దని అంబులెన్స్ వైపు వెళ్ళింది. వెనుకనే అతడు వచ్చాడు. తినలేదా అన్నట్టు, అతడిని చూసింది. అతడు సమాధానమివ్వకుండా తాళంచెవిని లోపలకి దూర్చాడు. తన వలన ఒకరు ఎందుకు తినకుండా ఉండటం అనుకుని “మీరు తినేయొచ్చు కదా!” అంది.

“నాకు తెలిసి మీరు మధ్యాహ్నం నుండి ఏమీ తినలేదు. ఎప్పట్నుండి మీరు తినకుండా ఉన్నారో నాకు తెలియదు. అయితే మన పక్కనున్నవాళ్ళు తినకుండా మనం తినడానికి ఎలా మనసొప్పుతుంది?” అని అడిగాడు.

“తినేందుకు వెళదాం” అని చెప్పి కిందకు దిగింది.

ఉదయం నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. నీళ్ళు చూడగానే గడగడమని తీసి తాగింది. తన ఎదురుగా ఉన్న ఆహారంలో రుచి తెలియలేదు. ఏదో తినేసింది. తరువాత బండి వైపు నడిచింది. చటుక్కున ఏదో జ్ఞాపకం వచ్చినదానిలా తిన్నది శాకాహారమా, మాంసాహారమా అని అడిగింది. “నాకు తెలుసు మీరు శాకాహారులేనని” అన్నాడు. కాస్త ఊరడింపుగా అనిపించింది. బండిని స్టార్ట్ చేశాడు. అతడి మణికట్టు మీద వాచిలో సమయం ఎంతయిందని చూసింది. రెండు గంటలు దాటింది. చీకటిలో రోడ్డు వారగా ఉన్న పంటచేలు నల్ల రంగులో కనిపించాయి. మైలురాళ్ళ మీద తెలుగులోను, ఆంగ్లంలోనూ ఊరి పేర్లు రాయబడి ఉన్నాయి.

ఎలాగూ ఇంకా వెయ్యికి పైగా కిలోమీటర్ల దూరం ఉందని మనసుకు తోచగానే ఆమెకు అలసట అనిపించింది. మళ్ళీ నిద్రలోకి జారిపోయింది. లేచేసరికి ఉదయం అయింది. ఒక చిన్న టీ కొట్టు దగ్గర బండి ఆగి ఉంది. చదువుకునే రోజుల నుండీ ఆమె ఎన్నోసార్లు అనుకునేది, స్త్రీకి నిజమైన స్వాతంత్ర్యం అంటే ఒక టీ కొట్టుకు వెళ్ళి ఒక టీ చెప్పి అక్కడే చెక్క బెంచ్ మీద కూర్చుని పేపర్ చదువుకుంటూ, టీ తాగడమని. ఎవరో ఒక వ్యక్తి బెంచ్ మీద కూర్చొని టీ తాగుతూ తెలుగు న్యూస్‌పేపర్ చదువుతున్నాడు.

ఆమె తనంతట తానే రెండు టీలు అని చెప్పేందుకు నోరు తెరిచేలోపే నటరాజ్ పిలిచాడు. పళ్ళు తోముకునేందుకు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెనుక వైపు స్థలముందని చెప్పాడు. కాసేపు తరువాత ఆమె వచ్చి టీ తాగింది. టీ కొట్టువాడు ఏదో అడిగాడు. నటరాజ్ అంబులెన్స్ వెనుక వైపును, ఆమెనూ చూపించి తెలుగులో ఏదో చెప్పాడు. అప్పుడే ఆమెకు మళ్ళీ మాధవన్ జ్ఞాపకం వచ్చాడు. చటుక్కున ఒక నిమిషం ఆమెకు చుట్టూ చీకటి కమ్ముకుంది. పూర్తిగా తాగలేక మళ్ళీ ఆంబులెన్స్ ఎక్కి కూర్చుంది. ప్రయాణంలో అక్కడక్కడ బండి ఆపి నటరాజ్ కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. మధ్యాహ్నం అతడు ఎంతగా బలవంతం చేసినా ఆమె తినేందుకు నిరాకరించింది. నటరాజ్ ఒకటి రెండు మాటలు మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టాడు. మాధవన్ ఇక్కడే నా వెనుకనే ఉన్నాడు అన్న తలపే ఆమెను మళ్ళీ బిగుసుకుపోయేలా చేసింది. అతనితో మాట్లాడేందుకు నిరాకరించింది. నటరాజ్ ఆమెతో ఎంతో దయగా మర్యాదగా వ్యవహరించాడు. మధ్యమధ్యలో ఆమెతో బలవంతంగా మంచినీళ్ళు తాగించాడు.

సాయంత్రం నాలుగు గంటలు అయ్యుంటుంది. కాని, రోడ్డంతా చీకటి కమ్ముకుంది. దూరాన ఎక్కడో వాన కురుస్తున్నట్టు చల్లగాలి వీయడం మొదలైంది.

పూరణి కారు అద్దం కిందకు దించి కిటికీపై చేతిని మోపి కూర్చుంది. ఒకటి రెండు కిలోమీటర్లు ముందుకు వెళ్ళగానే వానచినుకులు మోచేతి మీద పడ్డాయి. ఒక వానచినుకు తన మీద పడి ఎన్నేళ్ళయ్యిందో కదా అనుకుంది. మోచేతిని ఇంకా బయటకు పెట్టింది. బయట వాన పెద్దదయింది. దట్టంగా వానచినుకులు. నటరాజ్ తనవైపు తలుపు అద్దాన్ని పైకి ఎత్తి మూశాడు. ఆమె తన శరీరాన్ని మెల్లగా తిప్పి, తలను కూడా వానలోకి వంచింది. బండి లోపలకు పడుతున్న చినుకులతో ఆమె శరీరం అంతా తడుస్తోంది. నటరాజ్ ఆంబులెన్సుని పొడవైన ఒక చెరువు వంతెన మీద ఆపి ఆమెను దిగమన్నాడు.

“దిగావంటే అంతే, చూసుకో…” చటుక్కున మాధవన్ గొంతు ఎక్కడి నుండో వినబడగానే లోనికి ముడుచుకుపోయి కూర్చుని వానలోకి దిగేందుకు ఆమె మొరాయించింది. ఉన్నపళంగా ఆమె తనను తాను మూసేసుకుంటున్నట్టు, దేనికో భయపడ్డ దానిలా తలుపు అద్దాన్ని గబగబా పైకి ఎత్తి చినుకులు తనపై కురవకుండా అడ్డుకుంది. నటరాజ్ వేగంగా దిగి ఆమె వైపు తలుపు తెరిచి ఆమెను చెయ్యి పట్టుకుని, చటుక్కున బయటకు లాగాడు. ఆమె ఇక ఆగలేదు. చటుక్కున వానలోకి వచ్చేసింది. జడివాన ఆమెపై తనివితీరా కురిసింది.

వర్షంలో నిలబడి వర్షపు శబ్దంలోకి నిలబడి హో… హో… అంటూ, వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. తన రాతిబరువు నీటితో పాటు కరిగిపోయేదాకా అలా ఎంతోసేపు ఏడ్చింది. వాన చప్పుడు ఆగాక కూడా ఆమె ఏడుపు వినిపిస్తూనే ఉందక్కడ. ఇక ఏడ్చేందుకు ఏం మిగలకూడదు అన్నట్టు ఏడ్చింది. నటరాజ్ ఆమె దగ్గరకు కూడా రాలేదు. ఆమెను అలానే వదిలేశాడు. ఏడ్చి ఏడ్చి అలసిపోయి పూర్తిగా తడిసిపోయి నీళ్ళు కారుతూ ఆమె నిలబడిపోయింది. నటరాజ్ ఒక తుండుగుడ్డను తీసి ఆమె తలపై కప్పాడు. ఆమె అలానే నిలబడిపోయింది. ముఖం మీద, శరీరమంతానూ రాయిలా బిగుసుకుపోయిన తత్వం కడగబడి కరిగిపోయి ఆమె ముఖం ఇప్పుడు ఒక పసిబిడ్డ ముఖంలా తేటగా అయింది.

నటరాజ్ ఇంకొక తుండుగుడ్డను తీసి ఆమె భుజాన వేశాడు. ఆమె తల కాస్త దులుపుకుంది. బండిలో ఎక్కి కూర్చుంది. తేమ నిండిన రోడ్డు, తేమ నిండిన పంటచేలు, పొడవైన చెరువులు – అన్నీ అన్నివైపులా తేమతో నిండి ఆమెను విభ్రాంతికి గురిచేశాయి. ఒకచోట టీ తాగేందుకు ఆపమంది. ఆమెనే రెండు టీలు చెప్పింది.

ఆపైన పదే పదే టీ చెప్పి, ఏడెనిమిదిసార్లు తాగింది. నటరాజ్‌కు ఇది వినోదంగా అనిపించింది. మళ్ళీ ప్రయాణం మొదలయింది. మైలురాళ్ళ మీద తెలుగు అక్షరాలు కనుమరుగై హిందీ అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి. నటరాజ్‌కు వర్షానికి ముందు ఒక స్త్రీ తోను, వర్షం తరువాత ఇంకెవరో స్త్రీ తోనూ ప్రయాణిస్తున్నట్టు అనిపించింది. తడిబట్టలు విప్పేసి వేరొక చీర కట్టుకోమన్నాడు. ఆమె ఈ తడి నా దేహాన్ని అంటుకొని ఉండనివ్వమని చెబుదాం అనుకుని, “నన్నిలా ఉండనివ్వండి” అని మాత్రం చెప్పింది. కాస్త తొడల సందులో జిడ్డు జిడ్డుగా ఉన్నట్టు, ఏదో తేడాగా ఉన్నట్టు అనిపించి, వంగి బట్టలను సరి చూసుకుంది. ఋతుస్రావం. నీలంరంగు చీర నిండా ముందువైపు ఎరుపు రంగు అంటుకుని ఉంది. నటరాజ్ దానిని చూశాడు. వెళ్ళే దారి పొడవునా ఎక్కడైనా నాప్‌కిన్‌లు దొరుకుతాయేమోనని చూశాడు. కాస్త పెద్ద గ్రామంలో ఒక కొట్టులో దొరికింది. వాహనాన్ని ఆపి వెనుకవైపు ఎక్కి మార్చుకోమని చెప్పాడు.

మాధవన్ ఎదుట ఇంకెన్నటికీ నగ్నంగా నిలబడను అనుకొంది. “కుదరదు” అని మాత్రం నటరాజ్‌తో చెప్పి చీకటిలో పంటచేల నడుమ విశాలమైన ఒక చెట్టు వెనుక నిలబడి నాప్‌కిన్ వేసుకొని బట్టలను మార్చుకుంది.

ఆ రాత్రి భోజనం తర్వాత అలసిపోయి పడుకుంది. చలెక్కువైంది. నటరాజ్ బండిని పక్కకు లాగి తన రెండు దుప్పట్లతో ఆమెను కప్పి తలుపు అద్దాన్ని చలి దూరలేనంతగా పైకి ఎత్తాడు.

అర్ధరాత్రి దాటి అడవి గుండా వెళుతూ ఒక చోట పూరణిని నిద్ర లేపాడు. లేపి చూస్తే చిమ్మచీకటిగా ఉంది. బెంబేలెత్తిన పూరణిని ప్రశాంతంగా ఉండమని చెప్పి బండి హెడ్‌లైట్స్‌ ఆర్పాడు. మసక వెలుతురులో పరిశీలనగా చూస్తే కనిపించాయి – దూరాన పొగమంచు మధ్య నుండి, రోడ్డు ఒక కొన నుండి ఇంకో కొనకు, అడవి ఏనుగులు గుంపుగా వెళుతున్నాయి. జీవితంలో మొట్టమొదటిసారిగా అన్ని ఏనుగులను గుంపుగా చూడటం. ఇదేవిధంగా దారిలో మరేదైనా కనబడితే లేపమని చెప్పి మళ్ళీ పడుకుండిపోయింది.

దట్టమైన పొగమంచు అలముకున్న వేకువజామున వారణాసికి అంబులెన్స్ చేరుకుంది. నటరాజ్ పూరణిని నిద్ర లేపాడు. ఆ వేకువ జాము చలిలోనూ గంగానది ఒడ్డున రాళ్ళమెట్ల మీద ఎంతోమంది స్మారక కర్మలు చేస్తున్నారు. ఎందరో స్త్రీ పురుషుల తలలు గంగలో మునకలు వేసి లేస్తున్నాయి. పురోహితులు, సాధువులు, పశువులు, శవాలు, అటు ఇటు తిరగాడుతున్నారు. నటరాజ్ బండి ఆపి హరిశ్చంద్ర ఘాట్ ఎటువైపో ఒకరి దగ్గర కనుక్కున్నాడు.

కట్టెల పైన మాధవన్‌ను పడుకోబెట్టి నిప్పంటించారు. సరసరమని శరీరం కాలింది.

అగ్ని స్వచ్ఛతకు గుర్తు! అది అన్నిటినీ నాశనం చేసి, ఇంకో కొత్త అర్థాన్ని మనకు అందిస్తుందని పురోహితుడు చెబుతున్నారు.

కాసేపట్లో దహన సంస్కారాల తరువాతి క్రియలు చేసేందుకు గంగలో మునకలేసి రాళ్ళ మెట్లకు వద్దకు వస్తుండగా పూరణిని రమ్మని పిలుస్తున్నారని నటరాజ్ చెప్పాడు.

“నెలసరి వల్ల మైలలో ఉన్నాను. నేను చేయకూడదు” అంది.

“ఆ దైవం కూడా అక్కడి నుండే వచ్చివుంటుంది. అదేం మైల కాదు” అన్నాడు.

పూరణి అడుగు ముందుకు వేసి అతన్ని హత్తుకుంది. స్వచ్ఛంగా.

[తమిళ మూలం: వారణాసి. రచయిత: నరన్ శరీరం (2019) కథా సంకలనం నుంచి.]


రచయిత గురించి: నరన్ అనే కలం పేరుతో రాసే ఆరోగ్య సెల్వరాజ్ ఒక ప్రముఖ టీవీ చానల్‌లో పని చేస్తున్నారు. నరన్ నూతన తమిళ సాహిత్యంలో ఒక కొత్త ఒరవడి. తమిళ సాహిత్యంలో కథలు, కవిత్వం, నవలలు విరివిగా రాస్తున్న అతికొద్దిమంది వర్ధమాన రచయితలలో అతను కూడా ఒకరు. సర్రియలిజం, మాజికల్ రియలిజం, ఫాంటసీ, జెన్ తత్వం వంటి అంశాలతో నిండిన కవిత్వం అతనిది. ఇక కథల విషయానికి వస్తే సన్నివేశాలలో గాఢత, కవితాత్మకత రెండూ సమపాళ్ళలో మేళవించి ముందుకు సాగుతాయి. కేశం, వారణాసి అతడికి గుర్తింపు తెచ్చిన కథలు. వీటితో పాటు 360 డిగ్రీ అనే ఒక పత్రికకు సంపాదకుడిగాను, సాల్ట్ అనే పబ్లికేషన్ వ్యవస్థాపకుడిగాను ఉన్నారు. కేవలం సాహిత్యాన్ని చదవడంతో మాత్రమే సరిపెట్టుకోకుండా, వేర్వేరు కాలాల్లోని కళాకారులతో ప్రయాణం కొనసాగించడం ఇష్టం. ఇంతవరకు సాహిత్య రంగంలో తన రచనలకై 11 అవార్డులు అందుకున్నారు. కేశం అనే ఈ కథా సంకలనానికి 4 అవార్డులు లభించాయి. అందులో సుజాత స్మారక అవార్డు, వికటన్ అవార్డు, బాల కుమరన్ స్మారక అవార్డు, 2 వాసగ శాలై అవార్డులు ముఖ్యమైనవి.