అలజడే జీవితమై
సాహచర్యమే రణరంగమైనపుడు
ఓ కొత్త మలుపును ఊహించవలసిందే
నిజానికీ అబద్ధానికీ మధ్య
సరిహద్దును గమనించలేనపుడు
నిజంగానే ఓ గట్టి ఆలోచన చేయవలసిందే
తల్లడిల్లే హృదయానికి
ఏ ఆలంబనా లేనపుడు
నిను బ్రతికించే నిర్ణయమూ తీసికోవలసిందే
రెపరెపలాడే బ్రతుకు దీపానికి
మరో చేయి తోడై కాపు కాయలేనపుడు
ఎనిమిదో అడుగూ బయటకు వేయవలసిందే
నీతోనే పెరిగిన బంధం
నీలో ఏ పాశలేశాన్నీ మిగల్చలేనపుడు
నీవింకో బంధమై చిగురు తొడగవలసిందే