విశ్వమహిళానవల 18: ఎమీలియా పార్దో-బసాన్

‘పిరికివారెవరూకూడా మంచివారు కాజాలరు; మంచికి నిలబడలేరు… మంచిగా ఉండాలంటే గుండె నిబ్బరం చాలా ఉండాలి,’ అన్న రావిశాస్త్రి ఉటంకింపుకు గొప్ప ఉదాహరణ ది హౌస్ ఆఫ్ ఉయోఆ (The house of Ulloa) నవలలో హూలియాన్ అల్బారెస్ (Julián Alvarez) అన్న మతబోధకుడు. 1886లో స్పానిష్ రచయిత్రి ఎమీలియా పార్దో-బసాన్ (Emilia Pardo-Bazán) రాసిన నవలలో కథకుడు హూలియాన్. ఎక్కువగా స్త్రీ ప్రాధాన్యంతోనే యూరోపియన్ రచయిత్రులు రాస్తున్న యుగంలో, ఒక బలహీనుడైన మతబోధకుడి అనుభవాన్ని ప్రధానవస్తువు చేసి అపురూపమైన నవల రాసిన రచయిత్రి ఎమీలియా పార్దో-బాసాన్. ఈ నవలలో స్త్రీల జీవితాల్లోని అణచివేత ముఖ్యమైన విషయమే కానీ ఆ స్త్రీ పాత్రల కంటే వారి జీవితాలకు నిస్సహాయ సాక్షిగా నిలుచుండిపోయిన మతబోధకుడే పాఠకులకు గుర్తుండిపోతాడు. ఇది హీరోలు, హీరోయిన్లు లేని నవల. ఒక అసమర్థుడు చెప్పిన ఇతరుల కథ. అత్యంత వాస్తవిక చిత్రణతో కట్టిపడేసే రచన. ఫ్రెంచ్ రచయిత ఎమీల్ జోలా (Émile Zola) ప్రభావంతో సహజవాదం, వాస్తవికవాదం (Naturalism, Realism) రంగరించి రాసిన నవల ఇది.

ఎమీలియా జీవితం

ఎమీలియా పార్దో-బసాన్ 1851లో జన్మించి 1921లో మరణించింది. సంపన్నులు, విద్యావంతులు అయిన కుటుంబంలో కౌంటెస్ హోదాలో జన్మించిన ఎమీలియా మూడేళ్ళ వయసు నుంచే అపారమైన తెలివితేటలు ప్రదర్శించింది. తల్లిదండ్రులు కూతురిని ప్రోత్సహించడంతో, బాల్యం నుంచే విస్తృతమైన అధ్యయనం ప్రారంభించింది. చరిత్ర, ఆర్థికశాస్త్రం, రాజనీతి, మతసాహిత్యం అన్నీ చదివింది. 1868లో రెండవ ఇసబేల్లా రాణిని గద్దెదించి ప్రజాస్వామ్యానికి పునాది వేసిన తిరుగుబాటు అనంతరం, ఎమీలియా తండ్రి హొసే మరీయా పార్దో బసాన్ (José María Pardo-Bazán), ప్రోగ్రెసివ్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గాడు. దానితో దేశరాజధాని మాద్రిద్‌కు కుటుంబం తరలివెళ్ళింది. తన 16వ యేటే ఎమీలియా, హొసే ఆన్తోనియో దె కిరోగా (José Antonio de Quiroga) అనే న్యాయశాస్త్ర విద్యార్థిని వివాహం చేసుకుంది. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు పుట్టారు. కానీ సాహిత్యవ్యాసంగం విస్తరించే కొద్దీ, ఆమె పేరు సామాజిక సాహిత్య రంగాల్లో మార్మోగే కొద్దీ, భార్యాభర్తల మధ్య గొడవలు మొదలై, ఆమె భర్త నుంచి విడిపోయింది.

మొదట్లో ఆమెకు నవలల మీద ఆసక్తి లేదు. వ్యాసాలు రచించేది. ఫ్రాన్స్‌లో ఎమీల్ జోలా ప్రచారంలోకి తెచ్చిన యథార్థవాదం (నేచురలిజమ్) వాస్తవవాదం (రియలిజమ్) ఆమెను ఆకర్షించాయి. అయితే ఫ్రెంచి నేచురలిజమ్ కంటే స్పానిష్ నేచురలిజమ్ భిన్నమైందని వాదిస్తూ 1883లో ది క్రిటికల్ ఇష్యూ అనే ఒక పుస్తకం రాసింది. అది తరచు చర్చింపబడేది. దానితోనే ఆమెకు ఒక ఆలోచనాపరురాలిగా గుర్తింపు వచ్చింది. ఆమెకు ఎంతో ఇష్టమైన ఫ్రెంచి రచయిత విక్టర్ హ్యూగో, స్పెయిన్‌ని తన రెండో పుట్టిల్లుగా వర్ణిస్తూనే, సాహిత్యంలో స్పెయిన్ వెనకబడివుందని అన్నందుకు ఎమీలియా బాధపడింది. స్పానిష్ సాహిత్య స్థాయిని గురించి వ్యాసాలు రాసింది. ఇలా నవలారచనకంటే ముందు సాహిత్య విమర్శ, సాహిత్య సిద్ధాంతాల రంగంలో ఆమె తనని తాను నిరూపించుకుంది.

చివరకు, ఆ యుగపు పురుష రచయితలు పెద్రో దె అలర్కోన్ (Pedro de Alarcón), హ్వాన్ బలేరా గల్దోస్ (Juan Valera Benito Pérez Galdós) వంటివారి నవలలు చదివి, తను కూడ నవలలు రాయాలని అనుకుంది. ఆమె కంటే ముందు స్పెయిన్‌లో నవలా రచయిత్రులు లేక కాదు. 17వ శతాబ్దిలోనే మరీయా దె సయాస్ (María de Zayas) స్పానిష్‌లో నవలికలు రాయడమే కాదు; బ్రిటిష్, ఫ్రెంచ్ రచయిత్రుల్లా మగపేర్లతో కాక, తన సొంత పేరుతో రాసి, తనే ప్రచురించుకుని డబ్బులు కూడ సంపాదించింది. ఆమె రచనల్లో స్త్రీల తిరుగుబాటు వంటివి లేకున్నా, స్త్రీల తెలివితేటల గురించి రాసినందుకు అవి ‘అనైతికమైనవి’ అనే ముద్ర వేసి స్పానిష్ ఇన్‌క్విజిషన్ కాలంలో జరిపిన అనేక దుర్మార్గాలలో భాగంగా ఈమె నవలలను నిషేధించారు. తిరిగి 19వ శతాబ్దిలో నిషేధం ఎత్తివేశారు. కానీ ఆమె రచనలకు అనువాదాలు లేవు. కనక ప్రపంచవ్యాప్తంగా ప్రచారం పొందలేకపోయాయి. 19వ శతాబ్దిలో కూడ ఎమీలియా కంటే ముందే నవలలు రాసిన స్త్రీలు ఒకరిద్దరున్నారు. కానీ క్లాసిక్స్ స్థాయిని పొందిన నవలలు మాత్రం ఎమీలియావే.

మొత్తం మీద 19 నవలలు, 21 నవలికలు, 500 వరకూ కథలు, అనేక సాహిత్య విమర్శ రచనలు, యాత్రాచరిత్రలు, రెండు వంట పుస్తకాలు కూడ ఆమె రచించింది. ఆమె వ్యాసాలు, నవలల్లో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాల గురించి నిర్మొహమాటంగా, నిర్భీతిగా రాయడం ఆమెకు చాలా కష్టాలనే తీసుకువచ్చింది. నేచురలిజమ్ ప్రభావంతో, సమాజంలో, రాజకీయాల్లో జరుగుతున్న అవినీతిని యథాతథంగా చిత్రించడం, తనని తాను ఫెమినిస్టుగా ప్రకటించుకోవడం, వ్యక్తిగత జీవితంలో ఎందరో పురుషులతో సంబంధాలు పెట్టుకోవడం – ఇవన్నీ ఎమీలియా పార్దో-బసాన్ సమాజం నుంచి తీర్పులు, విమర్శలు ఎదుర్కోడానికి కారణమయ్యాయి. అయితే, పుట్టుకతో వచ్చిన సామాజిక హోదా, సంపద, ఎవరినీ లెక్కచెయ్యని ధీరత్వం కలిగిన ఆమె ప్రగతిని మాత్రం ఈ విమర్శలు ఆపలేకపోయాయి. తోటి మహిళా రచయితలకంటే ఆమెకు ఉన్న అనుకూలత, ఉన్నత వంశానికీ హోదాకూ వారసురాలు కావడం. అందుకే ఎంతో అరుదుగా స్త్రీలకు లభించే గౌరవం, మాద్రిద్ విశ్వవిద్యాలయంలో ఆమె పేరిట ఒక పీఠం ఏర్పడడం అన్నది కూడా సాధించగలిగింది. అయితే, మేధావులకోసం స్థాపించిన స్పానిష్ రాయల్ అకాడెమీలో తనకు స్థానం లభించాలన్న ఆమె ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. ఆ అకాడెమీ కేవలం మగవాళ్ళకేనని తేల్చి చెప్పారు పండితులు!

హౌస్ ఆఫ్ ఉయోఆ

ఎమీలియా పార్దో-బసాన్ నవలల్లో అత్యంత ప్రజాదరణ పొందింది, విమర్శకుల మెప్పును కూడ పొందిందీ ది హౌస్ ఆఫ్ ఉయోఆ.

19వ శతాబ్ది స్పెయిన్ సమాజంలో స్త్రీల ప్రతిపత్తిని గురించి, వారు ఎదుర్కొనే అనేక రకాల అణచివేతల గురించి చర్చించే ఈ నవలలో, నాయిక అనదగ్గ పాత్ర లేదు. ఆ మాటకొస్తే నాయకుడూ లేడు. అయితే ఈ నవలలో కథకుడు మాత్రం ఎవరికీ పనికిరాని మంచితనం మూర్తీభవించిన మతబోధకుడు. మతం, వర్గం, సంస్కృతి ఎలా మనిషిని నియంత్రిస్తాయో, అందులోనూ స్త్రీలను ఎంత నిస్సహాయులను చేస్తాయో ఎంతో వాస్తవికంగా చిత్రించిన నవల ఇది. ప్రసవానంతరం స్త్రీలకు కలిగే మానసిక రుగ్మత, భయాలను (పోస్ట్ పార్టమ్ డిప్రెషన్) చిత్రించిన తొలి నవల ఇదే అయివుండొచ్చు. ఏ విషయాన్ని గురించి రాసినా, వివరాలు తెలుసుకుని, యథాతథంగా దాన్ని చిత్రించడం ఆమెకు అలవాటు. తన మూడో నవలలో పొగాకు కర్మాగారం నేపథ్యంగా రాయాలనుకున్నపుడు, స్వయంగా ఫాక్టరీకి వెళ్ళి, కొన్ని రోజులు అక్కడ గడిపిన తర్వాతే నవల రాసింది. ఒక మహిళ అంత పరిశోధన చేసి నవల రాయడమన్నది ఆ యుగానికి చాలా అరుదు (ఇప్పటికీ అరుదే). ఒంటరిగా పొగాకు ఫాక్టరీలో గడిపినందుకు కూడ అవహేళనను, అవమానాన్ని ఎదుర్కొంది. కానీ నేచురలిజానికి నిబద్ధురాలు కనక ప్రయాసపడి గానీ ఏ రచనా చేసేది కాదు. ఇలా ఒంటరిగా ఊళ్ళు తిరగడం, అన్ని వర్గాలవారితో ఇంటర్‌వ్యూలు చేసి నవలలు రాయడం వల్ల ఆ నవలలకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. కానీ, అసూయాపరులైన తోటి మగరచయితలు, సామాన్య జనం దృష్టిలో ఒక తిరుగుబోతు రచయిత్రిగా ఉండిపోయింది!

స్ధూలంగా కథ

శాంటియాగో అనే ఒక పల్లెకు చెందిన యువకుడైన మతాధికారి హులియాన్‌ని, ఆ ఊరి పెద్దలు స్పెయిన్ వాయవ్యప్రాంతపు గలీసీయా సీమకు చెందిన డాన్ పెద్రో మొస్కోసో (Don Pedro Moscoso) ఇంటిని చక్కబెట్టమని పంఫుతారు. నిర్మల హృదయుడు, భక్తి ప్రపత్తులు కలిగిన వాడు హూలియాన్. జులాయిగా తిరుగుతూ, ఏ రకమైన నీతికీ కట్టుబడని అహంభావి, కోపదారి, తన పరివారాన్ని నిరంకుశంగా ఏలే ఉయోఆ గ్రామపు భూస్వామి మార్కిస్ దె ఉయోఆ-గా (marquis of Ulloa) పిలువబడే డాన్ మొస్కోసో. ఆయన గృహపు కథే ది హౌస్ ఆఫ్ ఉయోఆ. అక్కడ కలుపుమొక్కల్ని ఏరేసి, డాన్‌ని సన్మార్గంలో పెట్టడం డాన్ బంధువులు హూలియాన్‌కు అప్పగించిన బాధ్యత.

ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే, డాన్, అతని పనివాళ్ళు, దాసి సబేల్ (Sabel) ద్వారా అతనికి పుట్టిన ‘అక్రమ సంతానం’ నాలుగేళ్ళ కొడుకు పెరూచో (Perucho), ఆ దాసీపిల్ల తండ్రి, డాన్‌కి కుడిభుజమైన అనుచరుడు ప్రిమితీవో (Primitivo – పట్టణాల ఆర్ధిక వ్యవహారాలు నిర్వర్తించే అధికారి) హూలియాన్‌కు ఎదురౌతారు. ఆ ఇంటి పరిస్థితి, వాతావరణం హూలియాన్‌ని బెంబేలెత్తిస్తాయి. ప్రిమితీవో పేరుకు సేవకుడు కానీ డాన్‌కు కూడ అతనంటే భయం. ఆస్తులన్నీ పర్యవేక్షించే అతనంటేనే గ్రామప్రజలు భయపడతారు. పన్నులు కడతారు. డాన్‌ని చూసి భయపడేవారు ఎవరూ లేరు. ప్రిమితివో అంటే హడలిపోతారు. అందుకే అతని కుమార్తెను వివాహం చేసుకోకపోయినా, ఆమె ద్వారా కలిగిన సంతానాన్ని ఇంట్లోనే పెట్టుకుంటాడు డాన్.

డాన్, ప్రిమితీవోల నిత్యకృత్యం నాలుగేళ్ళ పిల్లవాడికి కడుపునిండా వైన్ తాగించడం. పిల్లవాడికి పూటుగా తాగిస్తూంటే పగలబడి నవ్వే తాత, తండ్రులను చూసి హూలియాన్ హడలిపోతాడు. కానీ వాళ్ళను వారించలేకపోతాడు. అటు తండ్రిని గానీ, తనతో సంతానాన్ని కని, ఇంకా తనతో సంబంధం కొనసాగిస్తున్న డాన్‌ని గానీ ఏమీ అనలేక, ఇద్దరి పెత్తనాన్ని సహించే సబేల్, జూలియన్ దృష్టికి వచ్చే మూడో వ్యక్తి. వంటింట్లో పనిచేసే సబేల్‌ను తన కోరికకు తరచు బలిచేయడమే కాక, ఒక్క చిన్న తప్పు చేసినా, మరెవరి మీద కోపం వచ్చినా ఆమెను కొట్టడం ద్వారా చూపించుకునే డాన్ అంటే హూలియాన్‌కు అసహ్యం వేస్తుంది. కానీ అతన్ని మందలించే ధైర్యం చెయ్యడు. అదీ కాక, హూలియాన్ పవిత్రుడు. కనక, సబేల్‌పై జరుగుతున్న అఘాయిత్యాన్ని అర్థం చేసుకోడానికి బదులు, మగవాళ్ళను లోబరుచుకునే ‘కులట’గా ఆమెను పరిగణిస్తాడు. తనతో కూడ చనువుగా ఉండడం ఆమె పట్ల అతనికి ఏవగింపు కలగడానికి కారణం.

సబేల్ దుర్మార్గురాలు కాదు. అలాగని అమాయకురాలు కూడ కాదు. తన పరిధిలోకి వచ్చే ప్రముఖులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. తనున్న స్థితిలో, తనకూ తన కొడుకుకూ రోజులు గడవాలంటే ఎవరితో ఎలా మెలగాలో తెలిసిన బతకనేర్చిన స్త్రీ ఆమె. అందుకే తను మరో యువకుడిని ప్రేమిస్తున్నా, తండ్రి, డాన్‌ల జులుం ధిక్కరించలేక, ఆ ఇంట్లో దౌర్జన్యాలను సహిస్తూ ఉండిపోతుంది. హూలియన్ ఆ ఇంట్లో డాన్ సేవకులపై చేసే దౌర్జన్యాలు, అతనికి అండగా ప్రిమితీవో చేసే అక్రమాలు చూసి హతాశుడవుతాడు. ఇంత అనాగరికంగా ప్రవర్తించే మనుషులను ఎలా మార్చాలో అతనికి అర్థం కాదు. ప్రతిసంఘటననూ చూసి విభ్రాంతి చెందడం, బాధపడ్డం తప్ప, చాలా రోజుల వరకూ నోరు విప్పి నిందించడానికి కూడ భయపడతాడు. తను అసలు ఎందుకు ఆ ఇంటికి వచ్చాడో తెలిసినా, ఇంత అమానుషత్వాన్ని ఎలా తగ్గించాలో అర్థం కాక, ఆత్మవిమర్శ చేసుకుంటూ, తన నిస్సహాయతకు కుమిలిపోతూ రోజులు గడిపేస్తాడు.

చివరకు, డాన్‌కు ఒక మంచికుటుంబం లోని అమ్మాయితో పెళ్ళి చేస్తే తప్ప ఆ ఇల్లు బాగుపడదని నిర్ణయించుకుంటాడు. దాని ప్రకారం అతన్ని, అతని మామ ఇంటికి తీసుకువెళ్తాడు. మామ నలుగురు కూతుళ్ళను చూసి, ఎవరు నచ్చితే వారిని చేసుకోమని చెప్తాడు. పెద్దమ్మాయి రీటా ఆకర్షణలో పడతాడు డాన్. కానీ చివరమ్మాయి నూచా ‘శీలవతి’ అని, అతని బిడ్డలకు తల్లి అయ్యే పవిత్రత ఆమెలో మాత్రమే ఉందనీ హూలియాన్ చెప్పి ఒప్పిస్తాడు. హూలియాన్‌ని తరచు ఎద్దేవా చేస్తూ, అతని ప్రవచనాల్ని అపహాస్యం చేసినా, ఆమె విషయంలో మాత్రం డాన్ అతన్ని నమ్ముతాడు. ఆమెనే పెళ్ళి చేసుకుంటాడు. మరోవైపు తనకు తెలియకుండానే నూచా పట్ల ఆరాధనాభావం పెంచుకుంటాడు హూలియాన్. నూచాని డాన్‌కి భార్యగా చేసినందుకు అతిత్వరలోనే హూలియాన్ పశ్చాత్తాపపడవలసివస్తుంది. అప్పుడు తన ఆరాధనాభావానికి అపరాధభావం తోడవుతుంది. వెరసి, నూచా తప్ప మరొకరి గురించి ఆలోచించలేని మనఃస్థితిలోకి జారుకుంటాడు ఆ మతబోధకుడు.

హౌస్ ఆఫ్ ఉయోఆ-కు వచ్చి కాపురం పెట్టాక, క్రమంగా డాన్ స్వస్వరూపంలోకి మళ్ళిపోతాడు. నూచా త్వరలోనే గర్భవతి అవుతుంది. ప్రసవం తొలి నుంచీ అనారోగ్యంతో ఉన్న భార్య తనకు ‘శారీరకంగా అందుబాటులో’ లేదని అనిపించగానే డాన్ తిరిగి సబేల్‌తో గడపడం ప్రారంభిస్తాడు. హూలియాన్ నిర్ఘాంతపోతాడు. అంత ఉదాత్తురాలిని వివాహం చేసుకున్నాక మరో అమ్మాయిని, అందులోనూ ‘నీచమైన’ జాతినీ, ప్రవృత్తినీ కలిగిన అమ్మాయిని తాకడానికి అతనికి మనసెలా ఒప్పిందని అనుకుంటాడు. నూచాకు పుత్రసంతానం కలుగుతుందన్న నమ్మకంతో మొదట్లొ ఆమెను కొద్దో గొప్పో ప్రేమగానే చూస్తాడు డాన్. తమ వంశంలో మగపిల్లాడే పుట్టి తీరుతాడన్న నమ్మకం తనకుందని వాదిస్తూంటాడు. ఎందుకంటే హూలియాన్ ‘ఆడపిల్ల పుడితేనో’ అని అనుమానం వ్యక్తం చేస్తూంటాడు. దానికి డాన్ స్పందన అతి తీవ్రంగా ఉంటుంది. హూలియాన్ పై విరుచుకుపడతాడు.

‘Don’t say such things, not even as a joke, Don Julián… not even as a joke. It has to be a little boy. If it isn’t I’ll wring its neck. I’ve already told Nucha to make sure she doesn’t bring me anything except a boy. And I’m quite capable of beating her black and blue if she does. God wouldn’t play a dirty trick like that on me.’

చివరికి ఆడపిల్ల పుడుతుంది. దాంతో డాన్ నూచాను పట్టించుకోవడం పూర్తిగా మానేస్తాడు. హూలియాన్‌కు పై మాటలు గుర్తుకొచ్చి బిడ్డని చంపేస్తాడేమోనని భయపడతాడు. గంటలకొద్దీ పసిబిడ్డను తనే చూసుకోవడం మొదలుపెడతాడు. ఆనాటి సంప్రదాయం ప్రకారం, పాలివ్వడానికి వెట్ నర్స్ ఉంటుంది. ఆమె బిడ్డను ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, హూలియాన్ ఆ పిల్ల పట్ల తనకేదో బాధ్యత ఉందని అనుకుంటాడు. తనే కదా డాన్‌తో ఆడపిల్ల పుట్టవచ్చు అన్నది! ఆ ఇంట్లో జరిగే దారుణాలకు తను బాధ్యుడు కాకపోయినా, వాటిని ఆపలేని తన అశక్తత హూలియాన్‌లో ఆత్మన్యూనతను, పిరికితనాన్ని పెంచుతూంటాయి.

ఈ సందర్భంలో ఒక గొప్ప సన్నివేశాన్ని సృష్టిస్తుంది రచయిత్రి. డాన్‌కు సబేల్‍కూ పుట్టిన కొడుకు పెరూచో, ఆ పసిబిడ్డ పట్ల అమితమైన ప్రేమ పెంచుకుంటాడు. బొమ్మలా ఉన్న ఆ పిల్ల తన చెల్లెలేనన్న స్పృహ వాడికి లేకపోయినా, ఏదో అనుబంధం వారి మధ్య ఏర్పడుతుంది. ఏడుస్తున్న పసిపాపను ఆ పిల్లవాడి చేతిలో పెట్టగానే నవ్వడం, ఎప్పుడూ మురిగ్గా ఉండే ఆ పిల్లవాడు, పసిదాని కోసం శుభ్రంగా తయారై రావడం… ఇలా ఆ అపురూప క్షణాలను హూలియాన్, నూచా కూడ గమనిస్తూంటారు. అయితే ఒకసారి మాటలమధ్యలో హూలియాన్ వల్లే నూచాకు, ఆ పిల్లవాడు తన భర్తకు, దాసీదానికి పుట్టినవాడని తెలుస్తుంది. వాడిని తన గదినుంచి తరిమేస్తుంది. తన బిడ్డను చూడ్డానికి వీల్లేదని శాసిస్తుంది. ఆడపిల్ల పుట్టినప్పటినుంచి తన ముఖం గానీ, బిడ్డముఖం గానీ చూడ్డానికి ఇష్టపడని భర్త ప్రవర్తన, అతని ‘అక్రమ’ సంతానానికి సంబంధించిన వాస్తవం తెలియడం, భర్త ఆ బిడ్డ తల్లితో ఇంకా సంబంధం కొనసాగిస్తున్నాడని తెలియడం, వాళ్ళ బిడ్డ అదే ఇంట్లో స్వేచ్ఛగా విహరిస్తున్నాడని తెలియడం, అసలే రోజుల తరబడి నొప్పులుపడ్డ తర్వాతే జరిగిన ప్రసవం తాలూక శారీరక బాధ… ఇవన్నీ నూచాని కుంగుబాటుకు గురిచేస్తాయి. బిడ్డ పట్ల అతి ప్రేమనో, అతి నిర్లక్ష్యాన్నో ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈనాటి పరిభాషలో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌లో పడిపోతుంది.

హూలియాన్ ఒక్కడే ఆమెను పలకరిస్తూంటాడు. ఆమెకు ఓదార్పు కలిగిస్తూంటాడు. ఒకరోజు భర్తతో తీవ్ర వాగ్వివాదం తర్వాత అతను తనని చంపేస్తాడని ఆమెకు భయం పట్టుకుంటుంది. హూలియాన్‌తో తన భయం చెప్పుకుని తనను అక్కడి నుంచి తప్పించమని అడుగుతుంది. వీళ్ళిద్దరూ తరచు గదిలో గొంతులు తగ్గించి మాట్లాడ్డం గమనించిన పిల్లవాడు, తన తాతతో చాలా మామూలుగా ఆ విషయం చెబుతాడు. అది వినగానే వాళ్ళిద్దరి మధ్యా అక్రమసంబంధం ఉందని అనుమానించిన ప్రిమితీవో వెంటనే డాన్ వద్దకు వెళ్ళి చెప్తాడు. డాన్, ప్రిమితీవో, హూలియాన్, నూచాలను నిలదీయాలనుకుంటారు. ప్రిమితీవో తన ఇంటి నుంచి బయల్దేరతాడు. తాతను పెరూచో రహస్యంగా అనుసరిస్తాడు. ప్రిమితీవో ఒక్కడే ఉండడం చూసి, అతనిమీద ఎప్పటినుంచో ద్వేషం ఉన్న అనేక మందిలో ఒక శత్రువు, అతన్ని కాల్చి చంపేస్తాడు. తాత హత్యను కళ్ళారా చూసిన తర్వాత కూడ అతని గురించి కాక, తండ్రి తనకెంతో ఇష్టమైన పాపను ఏం చేస్తాడో అని భయపడతాడు పెరూచో.

ఈలోగా ఒక దాసి నుంచి, డాన్, ప్రిమితీవో తమ పలాయనం గురించి తెలుసుకున్నారని అర్థమై, హూలియాన్ తను, ఆమె వాళ్ళ చేతుల్లో చావడం ఖాయమని నిర్ణయించుకుంటాడు. తాత మరణం చూసిన పెరూచో ఆ విషయం చెప్పడానికి గదిలోకి వెళ్ళి చూస్తే, అక్కడ డాన్, హూలియాన్, నూచాలను విపరీతంగా తిడుతూంటాడు. ఎన్నోసార్లు తన ఎదట తన తల్లి సబేల్‌ను ఇలాగే తిట్టడం, ఒక్కోసారి తనమీద కూడ చెయ్యి చేసుకోవడం జరుగుతూంటుంది. ఇప్పుడు కూడ అలాగే జరిగితే. పాపను కొడితే? చంపేస్తే?

వెంటనే లోపలి గదిలోకి పరిగెత్తి, పాపను తీసుకువెళ్ళిపోతాడు. గట్టిగా తన గుండెకు కరుచుకుని, ఇంటికింద నేలమాళిగలో ఉన్న గడ్డిమోపు మీద పడుకుంటాడు. కొద్దిసేపు ఏడ్చిన పాప, తన ప్రియమైన వ్యక్తి చేతుల్లో ఉన్నానని గ్రహించి నిశ్చింతగా నిద్రపోతుంది. నవలలోకెల్ల అద్భుతమైన సన్నివేశం ఇదే. చివరికి నర్సు వచ్చి పసిపిల్లను పెరూచో చేతుల్లోంచి లాక్కుని వెళ్ళిపోతుంది.

ఆ సంఘటన తర్వాత హూలియాన్‌ను డాన్ వెళ్ళిపొమ్మంటాడు. కథంతా హూలియాన్ దృష్టినుంచే చెప్పబడుతుంది కనక, మరో పదేళ్ళ తర్వాత హూలియాన్‌ను తిరిగి అదే వూరికి మతాధికారిగా నియమించిన తర్వాతే కథ ముగింపు తెలుస్తుంది. అయితే హూలియాన్ అక్కడినుంచి వెళ్ళిన ఆరునెలలకే అతనికి ఎవరో ఒక పత్రికాప్రకటన పంపుతారు. అందులో డాన్ మొస్కోసో భార్య నూచా అనారోగ్యంతో మరణించిందన్న వార్త తెలుస్తుంది. ఆమెకు ఇప్పటికైనా విముక్తి లభించిందని సంతోషిస్తాడు. ఆమె పట్ల తన మనోభావాల గురించి మరో మతాధికారి వద్ద కన్ఫెస్ చేసి, మానసిక శాంతి పొందుతాడు. పదేళ్ళ తర్వాత అక్కడికి మళ్ళీ వచ్చినపుడు, డాన్‌లో వృద్ధాప్యం కనిపిస్తూంటుంది. ఇదివరకటిలా లేడు.

కానీ అక్కడి ఒక దృశ్యం అతన్ని ఆశ్చర్యపరుస్తుంది. పదిహేనేళ్ళ పెరూచో, పదకొండేళ్ళ నెనె, కబుర్లు చెప్పుకుంటూ ఉండడం. అసలు విచిత్రం వారిద్దరి వేషధారణలో ఉందని హూలియాన్ గ్రహిస్తాడు. దాసి కొడుకు పెరూచో ఖరీదైన, సంపన్నుల దుస్తుల్లో, ధర్మపత్ని నూచా కుమార్తె అయిన నెనె దాసీ దుస్తుల్లో ఉంటారు. ఈ పురుషాధిక్య సమాజంలో వివాహసంబంధంలో పుట్టిన కూతురు కూడ, వివాహంతో నిమిత్తం లేని దాసి కొడుకు కంటే సమాజంలో తక్కువ హోదానే కలిగివుంటుందనీ; డాన్ తన వారసుడిగా, దాసి కొడుకునే ప్రకటించుకున్నాడనీ అర్థమవుతుంది. ఆఖరుసారి ప్రేక్షకుడిగా ఈ దృశ్యం చూసి వెనుతిరిగి వెళ్ళిపోతాడు హూలియాన్.

ఎమీలియా శైలి

నవలలో వస్తువు హాస్యాన్ని స్ఫురింపజేయకపోయినా, ఎమీలియా శైలిలో చమత్కారం, హాస్యం చిప్పిల్లుతూంటాయి. హూలియాన్ ఆలోచనల్లోని ద్వైధీభావాలను గొప్ప ఐరనీతో రాస్తుంది ఎమీలియా. ఒక సన్నివేశంలో – తను ఆరాధించే నూచా ఆడపిల్లని కన్నందుకు భర్త డాన్ ఆమెను ఏ రోజైనా చంపేస్తాడని, పసిపిల్లని కూడ చంపేస్తాడనీ తనే వాళ్ళను రక్షించాలనీ భ్రమల్లో ఉంటాడు హూలియాన్. ఒకరోజు నూచా గది నుంచి కేకలు వినిపించి వెళ్తే, నూచా గోడకి చేరగిలబడి, వణుకుతూ ఉంటుంది; డాన్ చేతిలో పెద్ద కత్తి ఉంటుంది. తన ఊహ నిజమే అనుకుంటాడు. అడ్డుపడబోతాడు. ఈయన అడ్డుపడ్డం వల్ల, మూలగా పారిపోతున్న సాలెపురుగు కత్తివేటు నుంచి తప్పించుకుంటుంది. డాన్ చంపబోయింది సాలెపురుగునని, భార్యకు సాలెపురుగంటే భయం కనక, ఆమె కేకలు పెడితే దాన్ని చంపడానికి వచ్చాడనీ అర్థమై, సిగ్గుపడిపోతాడు.

ఈ నవలలో ఇతర మతబోధకులతో హూలియాన్ చర్చలు, ఆలోచనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఉదాహరణకు ఒకటి-

మనిషి అంతరాత్మ మంచిగా ఉంటే చాలా? లేక మంచివాడిగా కనిపించడం కూడ అవసరమా? యూజీనియో అన్న మతబోధకుడితో హూలియాన్ సంభాషణలో ఈ ప్రశ్న వస్తుంది. ‘మన అంతరాత్మ శుభ్రంగా ఉంటే చాలు’ అంటాడు యూజీనియో. హూలియాన్ ఒప్పుకోడు. ‘మనం మంచివాళ్ళమైతే చాలదు. మంచిగా కనిపించాలి. తప్పుగా ప్రవర్తించడం, వదంతులకు తావివ్వడం ముఖ్యంగా మతబోధకులకు తగదు’ అంటాడు. మన అంతఃకరణే మనకు ప్రమాణం; మనం ఇతరులకు చెప్పగలం గానీ ఎవరినీ మార్చలేమంటాడు యూజీనియో. కానీ, మార్చాలని అంటాడు హూలియాన్. అతనివన్నీ పైపై ప్రగల్భాలే. చివరికి తనకూ నూచాకు ఏదో సంబంధం ఉందన్న వదంతులను అతనే తప్పించుకోలేకపోతాడు! మంచిగా కనిపిస్తున్నాననుకుంటూ బలహీనుడిగా మాత్రమే అందరి దృష్టిలో నిలబడిపోతాడు.

చివరికి ఒక్కసారి మాత్రం హూలియాన్ మానవుడిలా ప్రవర్తిస్తాడు. అతను ఎంతో ఆరాధించే నూచా విషయంలో కొంత ధైర్యం చేస్తాడు. భర్త తనని, తన బిడ్డని చంపేస్తాడనే అనుమానం నిలువెల్లా ముంచెత్తిన దశలో నూచా, హూలియాన్‌ను తనని ఎక్కడికైనా తీసుకువెళ్ళమన్నపుడు ఆలోచనలో పడిపోతాడు. తను దేవుడి దూత. దేవుడిపై విశ్వాసం ఉంచాల్సినవాడు. దాని ప్రకారం, నూచా పడుతున్న బాధలన్నీ ఆమెను పరీక్షించడానికి దేవుడే కల్పించాడని తను నమ్మాలి. అలా నమ్మితే తను ఏమీ చేయనక్కర్లేదు. ఒక సాక్షిగా ఆమె పతనాన్ని, దుఃఖాన్ని చూస్తూ, నాలుగు ఓదార్పు మాటలు, ‘దేవుడిమీద భారం వెయ్యి’ వంటి అనునయవాక్యాలు చెప్తే చాలు. మతబోధకుడిగా తన కర్తవ్యం అంతే. కానీ నూచాని చూస్తూ తను దేవుడి మీద భారం ఎందుకు వెయ్యలేకపోతున్నాడు? తనే ఏదో చెయ్యాలనే సంకల్పం ఎందుకు కలుగుతోంది? హూలియాన్‌కు తనకు దైవభక్తి లేదన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే తను కార్యోన్ముఖుడవుతున్నాడు. పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నాడు. దేవుడిమీద నూచా ముక్తిని వదిలేయలేకపోతున్నాడు. ఇది కొత్త అనుభవం హూలియాన్‌కు. ఈ చివరి సన్నివేశంలో హూలియాన్ మనిషిలా కనిపిస్తాడు. తనకు ఏం జరిగినా సరే, పట్టుబడి డాన్ చేతిలో చచ్చినా సరే, నూచా విన్నపాన్ని మన్నించాలి; ఆమెను ఈ ఇంటి నుంచి తీసుకువెళ్ళాలి అని నిశ్చయించుకుంటాడు. ఈలోగానే డాన్‌కు ఆ విషయం తెలియడం, అతను వచ్చి వీళ్ళ ప్రయత్నాల్ని వమ్ము చేయడంతో పాటు, హూలియాన్‌ను కట్టుబట్టలతో తరిమేయడం జరుగుతాయి. కానీ తను కూడ జీవితంలో ఒక్కసారి, ఒక్కరి కోసం క్రియాత్మకంగా వ్యవహరించానన్న సంతృప్తి హూలియాన్‌కు కలుగుతుంది.

ఎన్నికల హంగామా

ఈ నవలలో ఒక అధ్యాయం, ప్రధాన కథను కాస్సేపు నిలిపేస్తుంది. స్థానిక ఎన్నికలను వర్ణించిన ఆ ఆధ్యాయం చదివితే, 21వ శతాబ్ది భారత రాజకీయాలకు, 19వ శతాబ్ది స్పెయిన్ రాజకీయాలకూ ఏ మాత్రం తేడా లేదనిపిస్తుంది. పార్టీలు ఫిరాయించేవారు, ఒక నాయకుడికి వెన్నుదన్నుగా ఉన్నట్టు నటిస్తూ, వెన్నుపోటుతో అతన్ని చివరి క్షణంలో ఓడించేవారు, వోటర్లకు అరచేతిలో వైకుంఠం చూపించేవారు, ఎప్పటెప్పటి గతాన్నో తవ్వి తీసి అభ్యర్థులను మట్టికరిపించేవారు, డబ్బుకు వోటు అమ్మేవారూ కొనేవారూ, తాయిలాలకు పడిపోయే విద్యావంతులూ – ఒకటేమిటి? విశ్వవ్యాప్త రాజకీయ ఎన్నికల ఎత్తుగడలన్నీ కాస్సేపు హాస్యంగా, కాస్సేపు గంభీరంగా వర్ణిస్తుంది రచయిత్రి. ఒక విమర్శకురాలు అన్నట్టు People may travel by donkey in this book, but it could have been written yesterday.

ఆనాటి స్పానిష్ ఎన్నికలపై ఒళ్ళుమండి, కావాలనే ఈ అధ్యాయాన్ని ఆమె చేర్చివుండవచ్చు. కానీ కథకు ఈ ఎన్నిక ముఖ్యమే. ఎన్నికల్లో తప్పక గెలుస్తానని నమ్మి, తన ఆంతరంగికుడు ప్రిమితీవో వెన్నుపోటు వల్ల ఓడిపోయానని తెలిసీ అతన్ని తరమగొట్టలేని బలహీనుడు డాన్ స్వభావాన్ని ఎత్తి చూపే అధ్యాయమిది. అతని పెత్తనం, దౌర్జన్యాలన్నీ శారీరకంగా బలహీనులైన తన జీవితంలోని ఆడవాళ్ళ మీదే. నిజంగా తనకు అన్యాయం చేసిన మగవాళ్ళెవరినీ ఏమీ చెయ్యలేడు. తనకున్న ఎన్నో బలహీనతల వల్ల వాళ్ళ మీద ఆధారపడక తప్పదు అతనికి. ఎన్నికల వర్ణనతో పాటు, ఎమీలియా అద్భుతంగా చేసిన మరో వర్ణన, వేట సమయంలో పురుషుల వ్యవహారశైలి, సంభాషణారీతులను గురించింది. సహజత్వానికీ, వాస్తవిక రచనకూ ఆమె ఎంత కట్టుబడివుందో ఈ సన్నివేశాల వర్ణనలో విశదమవుతుంది. అందుకే ఫ్రెంచిలో ఎమీల్ జోలాను నేచురలిస్ట్ అన్నట్టు స్పానిష్‌లో ఈ ఎమీలియాని ప్రశంసించారు విమర్శకులు.

ఇక ఈ నవలలోని స్త్రీ పాత్రలు. యజమాని చేతిలో కీలుబొమ్మగా మారిపోయినా, తనకు నచ్చిన పురుషులతో సమయం గడపడానికి ఏ మాత్రం భయపడని తెగువ చూపించే సబేల్; స్త్రీ జీవితంలో ఒక మొగుడికోసం వేచి చూస్తూ ఉండనక్కర్లేదని, పెళ్ళయ్యేలోగా తనకు నచ్చిన వాళ్ళతో గడపవచ్చుననీ నమ్మి, ఆచరించిన డాన్ మామగారి పెద్ద కుమార్తె రీటా; తకు వివాహమంటేనే ఇష్టం లేకపోయినా, తండ్రి మాట కాదనలేక బావ డాన్‌ను వివాహం చేసుకున్న నూచా; ఇందులో ప్రధాన స్త్రీ పాత్రలు. ఇందులోని స్త్రీలలో ఎక్కువమంది సమాజానికి భయపడి ప్రవర్తన మార్చుకోనివారే. దానివల్ల వచ్చే అప్రతిష్టను పట్టించుకోనివారే. వీళ్ళెవరూ తమ హక్కుల గురించి, స్వేచ్ఛ గురించి మాట్లాడరు. కానీ ఆచరించి చూపుతారు. ఫలితాలను అనుభవిస్తారు.

ఒకరిద్దరి బాహ్యవర్తన సమాజనియమాలకు లోబడివున్నా, ఆంతరంగికంగా వీరూ తిరుగుబాటుదారులే. నూచా తనకు ఈ పెళ్ళి ఇష్టం లేదని తొలినుంచీ భర్తకు అర్థమయ్యేలాగే ప్రవర్తిస్తుంది. కానీ స్వతహాగా సంప్రదాయం పట్ల గౌరవం, నెమ్మదితనం, దయ కలిగిన స్త్రీ కనక, భర్తను వ్యతిరేకించదు. అలాగని అతనికి దాసోహమనదు. ‘What really hurt was when my husband blamed me for leaving the House of Ulloa without an heir! Without an heir, indeed! What about my little girl – my beautiful little angel?’ అని అంటుంది హలియాన్‌తో. ఆడపిల్ల ఒక వంశానికి వారసురాలు ఎందుకు కాలేదన్న ఆమె ప్రశ్నకు సమాధానం లభించదు. ఎంతకీ భర్త తనని ఆడపిల్లను కన్నందకు క్షమించలేకపోవడంతో, అతన్నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ ప్రయత్నం కూడ ఫలించదు. అనారోగ్యమే చివరకు ఆమెకు భర్త నుంచి విముక్తినిస్తుంది.

మనిషి న్యాయమైన పని చేస్తున్నపుడు, అది సంప్రదాయానికీ సంస్కృతికీ చివరకు చట్టానికీ కూడా విరుద్ధమే అయినా, దేవతలు ఆ పనిని ఆశీర్వదిస్తారనీ ఎంతో అందంగా చెబుతుంది ఎమీలియా బసాన్. హూలియాన్, నూచాను ఆ ఇంటినుంచి తీసుకువెళ్ళిపోవడానికి అంగీకరిస్తాడు. అప్పుడు రచయిత్రి వర్ణన:

The sun burst through the clouds and lit up the faces of the saints in their niches, so that they appeared to be smiling down on the young couple seated on the bench. Neither the Virgin Mother, in her blue and white robe and with her loose ringlets, nor St Anthony, patting a chubby Christ-child, nor St Michael, with his shining sword always ready for the assault on Satan, showed the slightest sign of annoyance at a chaplain who was busy working out a way of taking a wife from her legal master and snatching a child from her proper father.

హూలియాన్ మతబోధకుడు. నూచా దైవభక్తి, పాపభీతి మెండుగా కలిగిన స్త్రీ. అందుకే ఆ దేవతలకు వీరి నిర్ణయం పట్ల ఏ మాత్రం ఆగ్రహం కలగలేదని ప్రత్యేకంగా చెబుతుంది రచయిత్రి.

మరో అద్భతమైన దృశ్యం – వర్ణన – తన తాత ప్రిమితీవోను ఒక ఆగంతకుడు కాల్చిచంపిన దృశ్యం చూసిన పెరూచో తట్టుకోలేక ఇంటికి పరిగెత్తిరావడం. అక్కడ డాన్, నూచాను హూలియాన్‌నూ చంపేంత కోపంలో ఉన్నట్టు గమనించి, తాత సంగతి చెప్పాలన్న విషయం కూడ మరిచిపోయి, తండ్రి ఎక్కడ పసిపిల్లను చంపుతాడో అన్న భయంతో పరిగెత్తుకు వెళ్ళి, పసిదాన్ని ఎత్తుకుని, గడ్డిమోటలో ఇద్దరూ దాక్కోవడం; తన ప్రియమైన వ్యక్తి సమక్షంలో పసిది ఆనందంగా నవ్వడం:

The greatest of conquering heroes could not have felt more proud of himself than did Perucho, for he was certain he had saved the baby from death and had brought her to safety where no one could find her. He did not think for a moment of his hard, sunburnt grandfather lying by the wall … Just as a child weeping at the body of his dead mother can comfort himself with a toy or a bag of sweets, pushing sadness and memory momentarily aside and forgetting his first impression of grief, so it was with Perucho. The happiness of having his adored Nené to himself, the glory of having saved her life, distracted him from the recent tragic events. He gave no thought at all to his grandfather or to the shot that had knocked him down like a partridge.

19వ శతాబ్దిలో నవలలు రాసిన స్త్రీలలో ప్రత్యేకమైన రచయిత్రి ఎమీలియా పార్దో-బసాన్. కథ ఎంపిక దగ్గర్నుంచీ (ఒక చెడిపోతున్న రాజవంశీకుడిని బాగుచెయ్యాలన్న మతబోధకుడి విఫలయత్నం), పాత్రల చిత్రణలోను, కథనంలోను, ఆనాటి సామాజిక, రాజకీయ చరిత్రను చిత్రించడం లోనూ అత్యంత వాస్తవిక దృక్పథాన్ని ప్రదర్శించిన రచయిత్రి ఈమె. నాయికానాయకులు, ప్రతినాయకులు, విధి వైపరీత్యాలు – ఏవీ లేని నవల ఇది. ఒక విద్యావంతుడు, బలహీనమనస్కుడు అయిన కథకుడి ద్వారా 19వ శతాబ్ది స్పెయిన్ సమాజంలో మతం, వర్గం, జెండర్ ఎలాంటి స్థాయిలో ఉన్నాయో, ఈ మూడింటి పరస్పరఘర్షణలో స్త్రీలే ఎలా అత్యధికంగా నష్టపోయారో ముక్కుమీద గుద్దినట్టుగా కాక, మనసులో తొలిచేట్టుగా చెప్పిన ప్రతిభావంతురాలు ఎమీలియా పార్దో-బసాన్.


సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...