విశ్వమహిళానవల 26: కృపాబాయి

గురజాడ 1910లో దిద్దుబాటు కథలో రాములు చేత ‘చదువుకున్నామెను చేసుకుంటే ఇలాగే అవుతుంది బాబూ’ అని (సొంత నిర్ణయాలు చేసుకుంటుంది; ఇల్లు వదలి వెళ్ళిపోతుందని) అనిపిస్తాడు. అంతకు పదహారేళ్ళ ముందే 1894లో ఒక భారతీయాంగ్ల రచయిత్రి తన నవలలో ఒక పాత్ర చేత ఇలా అనిపిస్తుంది ‘చదువుకున్న సాయిని చూశావు కదా. ఎలా ఆడా, మగా తేడా లేకుండా అందరితో పట్టపగలు గప్పాలు కొడుతుందో. పెళ్ళానికి చదువు చెప్తే, అదీ ఇలాగే తయారవుతుంది’ అని. అలా రాసిన ఆమె పేరు కృపాబాయి సత్యనాథన్. ఆ నవల కమల. 19వ శతాబ్దిలో సంప్రదాయానికీ ఆధునికతకూ జరిగిన ఘర్షణలో మానసికంగా ఆధునికురాలైనా, ప్రవర్తనలో సంప్రదాయాన్ని ధిక్కరించలేకపోయిన ఒక యువతి పడిన సంఘర్షణే ఈ నవల. నవల గురించి తెలుసుకునేముందు రచయిత్రి గురించి కొంత.

కృపాబాయి సత్యనాథన్

హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, క్రైస్తవమతం స్వీకరించి, ముస్లిమ్ బాలికల కోసం పాఠశాలను నెలకొల్పి, 1870 దశకంలో ‘పెద్దకుటుంబాల’ ఆడపిల్లలు స్కూలుకి కూడా వెళ్ళని తరుణంలో మద్రాసులో మెడిసిన్ చదివి, ఆంగ్లంలో ఒక ఆత్మకథాత్మక రచన, మరొక చక్కని నవల రాసి భారతీయ రచయిత్రుల్లో అసాధారణ స్థానం సంపాదించిన మహిళ కృపాబాయి సత్యనాథన్. తొరూ దత్ తర్వాత ఆంగ్లంలో నవల రాసిన మహిళ ఈమె. తొరూ దత్ లాగే చిన్నవయస్సులోనే (32 ఏళ్ళకే) మరణించింది కృపాబాయి కూడా.

హిందూ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన స్త్రీలు ఎదుర్కొనే అష్టకష్టాలనూ తప్పించుకోడం కోసమో, వలస పాలకులు కల్పించిన భ్రమల వల్లనో, మరే కారణం వల్లనోగానీ ఆ రోజుల్లో కొందరు బ్రాహ్మణ కుటుంబాలవారు చేసినట్లు ఆమె తల్లిదండ్రులు కూడా క్రైస్తవమతం స్వీకరించారు. 1862లో అహ్మద్ నగర్ (అప్పట్లో బొంబాయి ప్రెసిడెన్సీలో, ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నది) హరిపంత్, రాధాబాయి కిష్తీలకు జన్మించిన కృపాబాయి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తల్లి, అన్నగారు భాస్కర్ ఆమెను అపురూపంగా పెంచారు. అయితే త్వరలోనే అన్న కూడ చనిపోయాడు. దీనితో ఆమె చాలా నిస్పృహకు గురైంది. అయితే అప్పటికే అన్నగారి వల్ల బొంబాయిలో ఒక ప్రసిద్ధ ఉన్నత పాఠశాలలో చదువుకోవడం, ఇంట్లో కూడ అన్నగారు పుస్తకపఠనం అలవాటు చేయడం వల్ల, తన విద్యాస్థాయిని పెంచుకుంది. ఎప్పటికైనా వైద్యవిద్య చదవాలనుకుంది. అనుకున్నట్టే తన ప్రతిభతో, ఇతరుల సాయంతో మెడిసిన్‌లో సీట్ కూడా సంపాదించింది. నిజానికి ఆమెకు లండన్ మెడికల్ స్కూలులో సీటు వచ్చినా, అంత దూరం ప్రయాణించడానికి ఆరోగ్యం సహకరించక, మద్రాసు మెడికల్ కళాశాలలో చేరింది. 1878లో ఆడపిల్లలు మెడిసిన్ చదవడమే అపురూపం. అలాంటిది రెండు కళాశాలల్లో ప్రవేశం సాధించిన మేధావి కృపాబాయి. కానీ, ఇక్కడ ఉన్నా తరచు అనారోగ్యానికి గురవుతూ, సరిగ్గా చదువుకోలేకపోయింది. ఆమెకు మెడిసిన్‌లో సీటు లభించడానికి కారకుడైన సెబాస్టియన్ అనే తన తండ్రి మిత్రుడి కుమారుడు శామ్యూల్ సత్యనాథన్‌నే ఆమె వివాహం చేసుకుంది. అతను కూడా ఆమెలా ఆదర్శభావాలున్నవాడే. వాళ్ళిద్దరూ కలిసి ఊటీకి వెళ్ళి స్థిరపడ్డారు. అక్కడ ముస్లిమ్ బాలికలకు పాఠశాల ప్రారంభించారు. పెళ్ళయిన తర్వాత ఆమె తన మొదటి నవల సగుణ రాసింది. ఇది దాదాపుగా ఆమె ఆత్మకథాత్మక రచనే. మద్రాస్ క్రిస్టియన్ కాలేజి మేగజైన్‌లో ఇది 1889లో ధారావాహికగా ప్రచురితమైంది. ఆమె క్షయవ్యాధి క్రమంగా ముదురుతూండడంతో కేవలం ఇంటికి, రచనకే పరిమితమైనపుడు, 1894లో కమల: ఎ స్టోరీ ఆఫ్ హిందూ లైఫ్ రాసింది. ఇది కల్పిత కథే కనక నవలగా నిర్ధారించవచ్చు. కల్పితమే అయినా, ఆనాటి యువతుల భావసంఘర్షణకు అద్దంపట్టింది కనక, సంస్కరణ ఉద్యమాల నేపథ్యంలో సంస్కర్తల గురించి మాత్రమే రాస్తున్న తరుణంలో, లబ్ధిదారులుగా చెప్పే ఆనాటి యువతుల మానసిక స్థితి ఎలా ఉండేదో చిత్రించిన తొలి నవలగా దీని స్థానం పదిలం.

కమల

ఈ నవలలో కథ స్థూలంగా: తల్లిలేని అమ్మాయి. తండ్రి సన్యాసం స్వీకరించి బంధువుల దగ్గర వదిలివెళ్ళిన అమ్మాయి. ఇంటిపనులు, పెళ్ళి, అత్తవారిల్లు, జీవితంలో కష్టసుఖాల గురించి ఏ మాత్రం అవగాహన లేని అమ్మాయి. తండ్రి నుంచి చదువును, ప్రకృతిని ఆస్వాదించడాన్ని నేర్చిన అమ్మాయి. ఆ అమ్మాయి పేరు కమల. ఆమె కథ ఇది. తండ్రికి కూతురిపై ఎంత ప్రేమ ఉన్నా, ఆమెతో కలిసి జీవించడు. భార్య మరణానంతరం, జీవితంపై ఆశ నశించి, సన్యాసం స్వీకరిస్తాడు. అపుడపుడూ ఇంటికి వచ్చే తండ్రి కోసం, అతని లాలన కోసం తపించిపోతుంది కమల. తల్లి గురించి ఎవరు ప్రస్తావించినా వివరంగా ఏమీ చెప్పరు. తండ్రి కాక, ఆమె జీవితంలో అపుడపుడూ తారసపడే వ్యక్తి, మేనబావ అయిన రామచంద్రం. అతను ఆయుర్వేద వైద్యుడు. సరిగ్గా కమల పెళ్ళి వేళకు అతని గురించి తెలుస్తుంది కమలకు. చిన్నప్పుడు తల్లి అతనికిచ్చి కమల వివాహం జరిపించాలనుకునివుంటుంది. కానీ అతను అడవుల వెంట, గురువుల వెంట తిరుగుతూ ఎక్కడున్నదీ తెలీనందువల్ల, తండ్రి మరో సంబంధం కుదిర్చి తన బాధ్యత వదిలించుకుంటాడు. కానీ తొలిసారి తన పెళ్ళి సందర్భంలో అతన్ని చూడగానే కమల మనసులో సంచలనం కలుగుతుంది. పెళ్ళయి, అత్తవారింటికి వెళ్ళాక కూడ అతను తరచు ఆమెకు గుర్తుకు వస్తూంటాడు. కమల హృదయంలో శృంగారపరమైన కోరికలు ఉదయించడానికి కారకుడు రామచంద్రమే. కానీ ఆ విషయాన్ని ఆమె మనసులోనే కప్పిపెడుతుంది.

కథ ఆరంభంలోనే తండ్రి ప్రేమ, తన ఈడు అమ్మాయిలతో ఆటలతో ఎంతో కొంత ఆనందంగా ఉన్న కమలకు గణేశ్‌తో వివాహం జరిపించి, చేతులు దులుపుకుంటాడు తండ్రి. పెళ్ళి వేడుకల్లో, భర్త పేరు చెప్పకూడదన్న నియమాన్ని ఉల్లంఘించి, అమాయకంగా అతని పేరు చెప్పడంతోనే, కమల కష్టాలు మొదలు.

“Don’t you know, you little stupid,” said an old woman shaking her, “that a husband’s name is to be heard, but never pronounced by a wife. He can take-your name, but you can’t take his. Make your Prayaschita now.” (పేజీ 46).

ఆ క్షణం నుంచే సొంత ఆలోచనలు ఉన్న పిల్ల అని, చదువుకున్నదని, పేదకుటుంబం నుంచి వచ్చిందనీ ఆడపడుచులు రమ, గూంగీ కమలను ద్వేషిస్తారు. హిందూ వివాహవ్యవస్థలో పెళ్ళి, అత్తగారిల్లు అనే మాటలే ఎంత భయోత్పాతాన్ని కలిగిస్తాయో, వివాహానికి ముందే ఆడపిల్లలకు ఈ పేరు చెప్పి ఎలా భయపెడతారో అత్యంత సహజంగా రచయిత్రి చిత్రిస్తుంది.

“A time will come when not a day will pass without your getting a good beating from them or from your husband, and they will try to poison your very food for you. Don’t look so blank with wonder. Did not your mother tell you all this? But you had no mother. Poor child! You don’t look as if you would stand much beating.”

ఈ మాటలు చెప్పేది ఆమె కంటే ముందు వివాహం చేసుకున్న ఆమె నెచ్చెలులు, ఆమె ఇరుగుపొరుగువాళ్ళు. అత్తగారింట్లో ఎన్ని కష్టాలు పడాలో సాధారణంగా తల్లులు బిడ్డలకు చెప్తారు. తల్లిలేని కమలకు ఆ విషయం చెప్పే బాధ్యత తమపై వేసుకున్నారు అమ్మలక్కలు. వివాహం అంటేనే ఆడపిల్లలు భయపడిపోయే వాతావరణాన్ని చాలా నేర్పుగా ఈ నవలలో చిత్రించడం కనిపిస్తుంది. అవన్నీ దాదాపుగా నిజమే అవుతాయి.

కమల కాపురానికి వెళ్ళేసరికి భర్త గణేశ్ నగరంలో ఉంటూ, ‘ఇంగ్లీషు’ చదువు చదువుతూంటాడు. ఇక్కడ వలసపాలనలో చదువుల గురించి కూడ ప్రస్తావన వస్తుంది.

In these days Sanskrit learning is not appreciated, and those old days have gone when young men of high descent congregated in groves and temples and sat at the feet of learned shastris and pandits, wearing the mendicant’s garb, begging their meals and spending their days in chanting hymns to the gods. The groves are no more the resort of the wise and the good. Sanskrit learning is despised and English learning is all in all, for it pays best.

గణేశ్ ఎందుకు మరో ఊళ్ళో ఉండి ఇంగ్లీషు చదువులు చదువుకుంటున్నాడో చర్చించే సందర్భంలో ఈ మాటలు వస్తాయి. వలసపాలన తీసుకువచ్చిన ఇంగ్లీష్ చదువుల పట్ల ఎవరికీ అభ్యంతరం లేదు. అందులో సంపాదన ఉంది కనక. కానీ అదే పాలనలో ఆడపిల్లలు పాఠశాలలకు వెళ్ళాలన్న సూచన మాత్రం కంటగింపుగా ఉంది. అంటే వలసపాలనలో భారతీయులు ఎలా తమకు అనుకూలంగా ఉన్నవాటిని స్వీకరిస్తూ, తమ ‘సంప్రదాయానికి’ భిన్నంగా ఉన్నవాటిని ‘ఇంగ్లీషు దొరల పెత్తనంగా’ తోసిపుచ్చారో అర్థమవుతూనే ఉంటుంది.

కమలను అత్తమామలు తొలుత అభిమానంతోనే చూస్తారు. కానీ క్రమంగా వారిలో కూడ ఆమె పట్ల విముఖత కలిగించడంలో ఆడపడుచులిద్దరూ సఫలమౌతారు. కమల సౌందర్యం, చదువు, సంస్కారంతో కూడిన మాటతీరు చూసే కొద్దీ ఆడపడుచులకు ఈర్ష్య కలిగి, ఆమెను శత్రువుగా చూస్తూంటారు. కమల బండెడు చాకిరీ చేస్తూ, ఇంట్లో స్నేహితులనేవాళ్ళు లేక కుమిలిపోతూంటుంది. గణేశ్ చదువు ముగించుకుని, ప్రభుత్వ ఉద్యోగం కూడ సంపాదించి, ఇంటికి వస్తాడు. భార్య అందం చూసి ప్రేమిస్తాడు; ఆమె తెలివితేటలకు మెచ్చి, చదువు చెప్పడం కూడ మొదలుపెడతాడు. ఇంటిల్లిపాదీ విముఖంగా ఉన్నా, తన భార్యకు చదువు చెప్పాలని కంకణం కట్టుకుంటాడు. భర్త వైఖరికి కమల పొంగిపోయి తనకింక కష్టాలు తీరాయనుకుంటుంది. కానీ అది ఎంతో కాలం నిలవదు. కమల ఆడపడుచు రమాబాయి భర్త చాలా తెలివిగా గణేశ్‌ని లోబరుచుకుంటాడు. అతన్ని ఎదిరిస్తే ముదురుతాడని గ్రహించి, మరో మార్గంలో అతన్ని వశపరచుకుంటాడు. సరదాలు, వినోదాలు ఇష్టపడే అతన్ని అలాంటి చోట్లు తిప్పడం మొదలుపెడతాడు. ఆ క్రమంలో అతన్ని సాయి అనే ఒక మహిళ దగ్గరకు తీసుకువచ్చి ఆమె తెలివితేటలను ప్రత్యక్షంగా చూపి ‘చూడు. ఈవిడ చదువుకున్న స్త్రీ. రేప్పొద్దున్న నీ భార్యని కూడ విద్యావంతురాల్ని చేస్తే ఇలాగే తయారవుతుంది. నీకు విధేయంగా ఉండదు. ఇంకా చదువు చెప్పాలనుకుంటున్నావా?’ అని బావగారు వెక్కిరిస్తాడు. ఆ పథకం మరో మలుపు తిరిగి, గణేశ్ సాయి వ్యామోహంలో పడిపోతాడు.

భర్త ప్రేమకోసం తపించిన కమల, తమకు కుమార్తె పుట్టిన తర్వాతయినా భర్త తన పట్ల ప్రేమగా ఉంటాడని ఆశిస్తుంది. అత్తగారింట్లో ఉండనని చెప్పి, భర్త వెంట అతను ఉద్యోగం చేస్తున్న ఊరుకు (రామ్‌పూర్) వెళ్తుంది. తామిద్దరే ఉన్నప్పుడు గణేశ్ మారతాడని ఆశిస్తుంది. కానీ గణేశ్ అప్పటికే సాయి మోజులో పడిపోయాడు. కనక భార్యను పట్టించుకోడు. సాయితోనే రోజులు గడుపుతూంటాడు. ఆమె తండ్రి అనారోగ్యంగా ఉన్నప్పుడు అతని దగ్గరకు వెళ్ళినపుడు కూడా, తిరిగి తీసుకువెళ్ళడానికి గణేశ్ ఒక పట్టాన రాడు. చివరికి, సాయిని ఇంట్లోకి తీసుకురావడం కూడా మొదలుపెడతాడు గణేశ్. సాయి అతన్ని భార్య నుంచి దూరం చెయ్యడానికి ఎన్ని కుట్రలు పన్నాలో అన్నీ పన్నుతుంది. ఈలోగా ఒకరోజు కమల తండ్రికి ఆరోగ్యం క్షీణించిందని చెప్పడానికి రామచంద్రం కమల ఇంటికి వస్తాడు. ఆ సమయంలో గణేశ్ ఇంట్లో ఉండడు. వీళ్ళిద్దరూ తలుపు వద్ద నించుని మాట్లాడుకోవటం సాయి చూస్తుంది. గణేశ్‌కు కమల ప్రవర్తనపై అనుమానం కలిగించడానికి ఈ సన్నివేశాన్ని వాడుకుంటుంది. సాయి మాటల ప్రలోభంలో పడిన గణేశ్, చివరికి తమ కుమార్తె తండ్రి ఎవరు అని ప్రశ్నించి, రామచంద్రం అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు. సాయి అలా కమల మీద కక్ష గట్టడానికి కారణం, గణేశ్‌పై ఆమెకున్న ప్రేమ కాదు. రామచంద్రంపై ఆమెకున్న ద్వేషం, పగ. బాల్యంలో సాయికి రామచంద్రం ప్రమేయం లేకుండా, అతనితో నిశ్చితార్థం జరుగుతుంది. అది కేవలం పెద్దలు చేసిన పని. అది తెలుసుకున్న తర్వాత రామచంద్రం తను ఇంతకుముందే మరదలు కమలని ఇష్టపడ్డాడు కనక, ఈ నిశ్చితార్థం తనని అడిగి చేసింది కాదు కనక, తనకు సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే నిశ్చితార్థం జరిగి, పెళ్ళి కాని స్థితిలో సాయి జీవితం ఆ ఊళ్ళో దుర్భరమవుతుంది. అందుకే ఆమె అక్కడినుంచి వెళ్ళిపోయి, జీవితంమీద, మగవాళ్ళ మీద కసితో విచ్చలవిడి ప్రవర్తనను అలవరచుకుంటుంది. ఇవన్నీ గణేశ్‌కు, కమలకూ తెలీవు.

ఇన్నాళ్ళ నరకాన్ని ఎలాగో భరించిన కమల తమ కూతురికి తండ్రి ఎవరో అన్న భర్త నిందను భరించలేకపోతుంది. ఒక్క క్షణం ఆత్మహత్య చేసుకుందామని అనుకుని, తర్వాత మనసు మార్చుకుంటుంది. తను బతికే ఉండి, అత్తగారింట్లోనే ఉంటూ వాళ్ళను తన దారిలోకి తెచ్చుకోవాలన్న సంకల్పంతో అత్తవారింటికి వస్తుంది. అప్పుడు గానీ ఆమెకు తండ్రి మరణించాడని, తను ఆస్తిపరురాలిననీ తెలియదు. ఆమె తండ్రి మరణానంతరం, రామచంద్రం ద్వారా గణేశ్ కుటుంబీకులకి కమల ధనవంతురాలనీ, ఆమెకు తండ్రి నుంచి చాలా సంపద లభించిందనీ తెలుస్తుంది. ఇకపై ఆమెతో సఖ్యంగా ఉండాలని వాళ్ళు అనుకుంటున్నట్టు తెలిసి కమల అసహ్యించుకుంటుంది.

గణేశ్, రామ్‌పూర్‌లో తనొక్కడే ఉంటూ, సాయితో సంబంధం కొనసాగిస్తూంటాడు. తన శీలాన్ని శంకించిన భర్త దగ్గరకు వెళ్ళడానికి కమలకు మనస్కరించదు. అత్తవారింట్లోనే ఉండిపోతుంది. ఎలాగోలా ఆమె జీవితం సాఫీగా గడుస్తుందని అనుకునేలోగా, పాపకు జబ్బుచేసి చనిపోతుంది. కమల ఈ దుఃఖం నుంచి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. తన దురదృష్టం వల్ల, తనలో ఏదో లోపం ఉన్నందువల్లే తనకు ఇలాంటి శిక్షలు భగవంతుడు విధిస్తున్నాడని కమల వాపోతుంది. రెండేళ్ళ తర్వాత గణేశ్ కలరాతో మరణిస్తాడు. ఇక అప్పుడు కమలకు అత్తింటితో కూడ బంధం తెగిపోతుంది. ఆ దశలో రామచంద్రం ఆమె దగ్గరకువచ్చి, తన ప్రేమను ప్రకటించి, తనతో వచ్చేయమంటాడు. కమల ఒప్పుకోదు. నవలలో ఇప్పటివరకూ అపుడపుడూ కమల ఆలోచనల్లో రామచంద్రం ఉన్నట్టు, అతన్ని తలచుకోగానే తనకెందుకు ఇంత హాయి కలుగుతోందని ఆమె మథనపడినట్టూ రచయిత్రి వర్ణిస్తూనే ఉంటుంది. అంటే కమలకు తనలో కోరికలు కలగవచ్చునని, తనుకూడ ఒక పురుషుడిని ప్రేమించగలననీ తెలుసు. ఆ ఊహలలో ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. కానీ ఈ ఆలోచనలను ఆచరణలో పెట్టేంత సాహసం ఆమెలో లేదు. గణేశ్, కూతురు ఇద్దరూ చనిపోయిన రెండేళ్ళకు రామచంద్రం కమల వద్దకు వస్తాడు. ఎన్నాళ్ళగానో దాచుకున్న తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. తనతో వచ్చేయమని, ఇకనైనా సంప్రదాయాన్ని వదులుకుని, ప్రేమసామ్రాజ్యంలో విహరించమనీ ఆహ్వానిస్తాడు.

Have you not felt the trammels of custom and tradition? Have you not felt the weight of ignorance wearing you down, superstition folding its arms round you and holding you in its bewildering and terrifying grasp? Everything is so dark and dreary for you here. I see it in your eyes. You will be free with me. I have means at my command of which you know nothing; and love will welcome you in the new world, love such as you have never dreamt of,—my love, my undying love and worship. Accept me and your freedom, and come away with me, and no one will know anything of it.” (పేజీ 154).

కమలను ఇప్పుడు నిరోధించే శక్తులేవీ లేవు – ఆమె మనసు, ఆమె అలవాటుపడిపోయిన సంప్రదాయం తప్ప. ఆధునిక భావధారను అందుకున్న యువతి కూడా, సంప్రదాయాన్ని వదులుకోలేకపోవడంలోని విషాదాన్ని ఇక్కడ చూస్తాం.

“No! What you ask is too much. Leave me as I am, marry a girl more fortunate, and let fortune bless you. You will have happiness and love, love such as you deserve. I am but a broken vessel, fit only to be thrown aside and to be spat on. Ah me! O God! preserve me from this.” (పేజీ 154).

భర్త మరణించిన స్త్రీ అదృష్టవంతురాలెలా అవుతుంది? ఇంకొకరికి సుఖసంతోషాలను ఎలా ఇవ్వగలుగుతుంది? అదీ ఆమె వాదన. హిందూ స్త్రీ, భర్త మరణానంతరం మరొకర్ని ప్రేమించడం, మరో పురుషుడితో జీవించడం చెయ్యదని, తను హిందూ యువతినని, ఆ నియమాలు ఉల్లంఘించననీ స్పష్టంగా చెబుతుంది. రామచంద్రం వెళ్ళిపోతాడు. కమల తన ఆస్తిని బాలవితంతువులకు, అనాథలైన పసిపిల్లలకు దానం చేస్తుంది. చివరిదాకా ఆదర్శజీవితం గడిపి, ఆ ప్రాంతంలో ఆమె పేరు చిరస్థాయిగా నిలబడేలా చేసుకుంటుంది.

ఈ నవల ప్రధానంగా హిందూ మతం, పితృస్వామ్యం గురించి మాట్లాడుతుంది. సంప్రదాయ సమాజం, ఆధునిక భావాల మధ్య నలిగిపోయిన ఒక యువతి కథను చెబుతుంది. నవలంతా కమల దృక్కోణం నుంచే నడుస్తుంది.

కృపాబాయి జీవించిన కాలం భారతదేశంలో సంఘసంస్కరణ ఉద్యమాలు వ్యాప్తిచెందుతున్న రోజులు. బాల్యవివాహాల నిషేధం, వితంతు పునర్వివాహాల ప్రోత్సాహం, బాలికల విద్య, సంస్కరణ ఉద్యమంలోని ముఖ్యాంశాలు. కృపాబాయి ఈ పరిణామాలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. కానీ ఆమె నవల సంస్కరణ ఉద్యమం సాధించిన ఫలితాలకంటే, హిందూ సమాజంలో, అందులో బ్రాహ్మణ కుటుంబాల్లో స్త్రీల పట్ల జరిగే అత్యాచారాల గురించే ఎక్కువ ప్రస్తావిస్తుంది. బహుశా తను బ్రాహ్మణ కుటుంబంలో ఉండి, క్రైస్తవానికి మారిన నేపథ్యం నుంచి రచించడం వల్ల కావచ్చు, ఈ నవలలో ‘హిందూ స్త్రీల జీవితాలు’ అన్న ప్రసక్తి చాలా తరచుగా వస్తుంది. వాటిని ఆమె ‘తన జాతి జీవనం’గా ఎక్కడా చెప్పదు. తనని తాను ఆమె హిందూ సమాజానికి outsiderగానే భావించుకుందేమో అనిపిస్తుంది.

హిందూ వివాహవ్యవస్థలోని బోలుతనం, ఆధిపత్య భావజాలం, కోడంట్రికం, ఇంటి కోడలి సహనం, పతివ్రతాలక్షణం – నవలలో ప్రధానాంశాలు. అయితే కమలను అంతమాత్రంగానే చిత్రించివుంటే ఈ నవలలో చెప్పుకోదగ్గ విషయం ఉండేది కాదు. కమలలో ఈ ‘పవిత్ర భారతనారి’ లక్షణాలెన్ని ఉన్నా, ఆమెలో ప్రత్యేకతలున్నాయి. తన మనసు ఊహల్లో, కోరికల్లో వేగుతున్నపుడు ఆమె ఆ స్థితిని ఆనందంగా స్వీకరిస్తుంది. ఆ ఆలోచనలను స్వేచ్ఛగా అనుభవిస్తుంది. అది ఆచరణలో పెట్టలేకపోవడమన్నది వేరే విషయం. అదే విధంగా, ఎప్పటికప్పుడు నిస్పృహలో పడిపోతున్నపుడు, భగవంతుడి సృష్టిని చూసి (ప్రకృతి) ఆమె ఉత్తేజం పొందడం మరో ప్రత్యేకత. కమల ఆనందించడానికి భర్త ఆదరణ, అత్త దయాధర్మాలు, ఆడపడుచుల స్నేహం అవసరమే. కానీ అవి దొరకనపుడు ఆమె కుంగిపోదు. ఆరుబయట నించున్నా, కిటికీ నుంచి చూసినా, చిన్న చిన్న ప్రయాణాలు చేసినా, తనకు తటస్థపడే ప్రకృతి సౌందర్యానికి పులకరించిపోయి, తన కష్టాలన్నీ మరచిపోయే భావుకురాలు కమల. రచయిత్రి మాటల్లోనే చెప్పాలంటే…

She lost even her simple interest in life; for life was a poor spiritless affair and whatever was written in the book of fate would come to pass do what she could to avert it. She wished to be exemplary like Savitri, Seeta, and other noble women; but even they had to submit to fate and did not get their due in this world. So Kamala reasoned while she bore meekly all the taunts and hard words of her sisters-in-law and wondered why she ever felt happy at all, as she did when she looked on the blue sky, the radiant sunset, or the swollen river,—why she felt such longing to be lost in a great wild wilderness, where she might dream in silence and enjoy to her heart’s content the glory and the magnificence of earth and sky. (పేజీ 63).

హిందువులకు ప్రకృతితో తాదాత్మ్యం చెందడం, మౌనంగా తనలో తనే ఉండిపోవడం, ధ్యానంలో ప్రశాంతిని పొందడం గొప్ప వరమని రచయిత్రి ఒకచోట అంటుంది. అది విదేశీయులకు అర్థం కాదని కూడ ఆమె చెబుతుంది. కమలలో ఈ తత్వం ఉన్నందువల్లే ఆమె అన్ని రకాల కష్టాలనూ భరించగలిగిందని రచయిత్రి తీర్మానం.

హిందూ ఉమ్మడి కుటుంబాల్లో బార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరగకపోవడానికి ఉండే ఆటంకాలను రచయిత్రి చక్కగా వివరిస్తుంది. భార్యాభర్తలకు ఒకర్నొకరు చూసుకోడానికి, మాట్లాడుకోడానికే సమయం, ఏకాంతం లభించవు. ఇక వారి మధ్య అకారణ అపార్థాలు తలెత్తకుండా ఎలా ఉంటాయి? ఒకరితో ఒకరు కంటే, ఆడపడుచులు, బావగార్లు, అత్తమామల సమక్షంలో జరిగే సంభాషణే ఎక్కువ. ఇది ఏ విధంగా సున్నితమనస్కులైన భార్యాభర్తల మధ్య కూడ దూరాన్ని పెంచుతుందో చాలా గొప్పగా చిత్రిస్తుంది రచయిత్రి. హిందూ సమాజంలో పితృస్వామ్యం ఎంత కరడుగట్టివుందో, చివరకు మంచివాళ్ళని చెప్పదగ్గ తండ్రులు, మామగార్లు, భర్తలు కూడ పితృస్వామ్య భావజాలానికి ఎలా లొంగిపోతారో శక్తిమంతంగా చెప్పిన నవల ఇది. కూతురిని చదివించి, ఎంతో అల్లారుముద్దుగా చూసుకున్న తండ్రే, ఆమెను ‘వదిలించుకోవాల్సిన’ బరువుగా భావించడం, తన భార్య మరణానంతరం కూతురికి మరింత ఆసరాగా ఉండేందుకు బదులు, సన్యాసం స్వీకరించి ఊళ్ళు పట్టిపోవడం దీనికి నిదర్శనం. కమలకు తన తండ్రిలోని ఈ గుణం దుర్మార్గంగా అనిపించదు. తండ్రిని చివరివరకూ ఆరాధిస్తూనే ఉంటుంది. ఈ రకంగా అందరినీ వారి బలహీనతలతో ‘ఆమోదించే’ తత్వమే కమలను అతి సాత్వికురాల్ని చేస్తుంది. కోడల్ని ఎంతో ఆప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానించిన మామగారు కూడ తను కోడలితో ప్రేమగా ఉంటే భార్య, కూతుళ్ళు తనను చులకనగా చూస్తారని, తన పెద్దరికం దెబ్బతింటుందనీ ఆమె పట్ల అకారణంగా నిర్దయ చూపడం వంటివి పితృస్వామ్య దృక్పథంలోని అవకరాలే. ఇవన్నీ సంప్రదాయాన్ని, వ్యవస్థనూ మార్చడానికి ఇష్టంలేని జడత్వం నుంచీ వచ్చినవే. ఈ నవలలో తెలివైనవారు, విద్యావంతులు కూడ మార్పుకు ఎంత భయపడతారో అన్ని పాత్రల ద్వారా చెబుతుంది రచయిత్రి.

నవలాంతానికి కమల రామచంద్రంని తిరస్కరించినందుకు బాధపడుతుందా? ఆనందంగా శేషజీవితాన్ని గడిపిందా? అన్న ప్రశ్నలకు రచయిత్రి నేరుగా సమాధానం చెప్పలేదు. కానీ – it was happiness to know that some one loved her, loved her for her own sake, despised as she was, and degraded in the sight of the little world in which she lived. (పేజీ 155) – తను అర్హురాలు కాకున్నా, తనని ఒక మనిషి బేషరతుగా ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు అన్న భావన ఆమెకు ఆనందం కలిగిస్తుంది. ఆమె చేసిన దానాలను కొన్ని తరాలపాటు అందరూ గుర్తుంచుకున్నారు; స్మరించుకున్నారు కనక కమల జీవితం సార్థకమైనట్టే రచయిత్రి చిత్రించింది.

ఈ నవలలో అత్యంత ఆకర్షణీయమైంది కృపాబాయి శైలి; ఆంగ్లభాషపై ఆమెకున్న పట్టు. సరళమైన, అందమైన వాక్యాలతో, హృదయంగమంగా ఉండే వర్ణనలతో, పదునైన, వాస్తవికమైన సంభాషణలతో నవల ఆద్యంతం పఠనీయంగా ఉంటుంది. ఈరోజుల్లో ఆంగ్లంలో అద్భుతంగా రాసే రచయితలు పుంఖానుపుంఖాలుగా ఉన్నా, 19వ శతాబ్దిలో అపుడపుడే ఇంగ్లీషు అభ్యసిస్తున్న రోజుల్లో ఒక భారతీయ మహిళ ఇంత సహజసుందరమైన ఆంగ్లం రాయడం అబ్బురమే.

సంస్కరణోద్యమం బాల్య వివాహాల గురించి, వితంతువుల దుస్థితి గురించి చేయాల్సిన కృషిని తెలిపింది. సంస్కర్తలు తమ జీవితాలను ఈ ప్రయోజనాల కోసం వెచ్చించారు. కానీ వివాహ వ్యవస్థలోని అసమానతలను, వివాహం పేరిట ఆడపిల్లలు ఎదుర్కొనే నరకాన్ని, స్త్రీలకు స్త్రీలనే శత్రువులను చేసే సామాజిక వ్యవస్థలోని దుష్టస్వభావాన్నీ సంస్కర్తలు రచించలేదు. అనంతరకాలంలో శరత్ చంద్ర, గురజాడ, చలం వంటివారు వచ్చేవరకూ వివాహ జీవితాన్ని ప్రశ్నించిన రచయితలు లేరు. ఆ పనిని ఎంతో ప్రతిభావంతంగా చేసింది కృపాబాయి. అందులోనూ ఒక భావుకురాలైన యువతి కర్కోటకుల నీడలో ఎలా బతికిందో, ఆమె భావుకత, ఆమె నిరంతరం తన మనసులోకి చేసే ప్రయాణమే ఆమెకు ఎలాంటి సహనశక్తిని ఇచ్చాయో గొప్పగా చిత్రించిన నవల ఇది. అందుకే ఈ నవలలో ఒకవైపు కమల తనతో తను చేసే సంభాషణ, మరోవైపు ఇతరులతో చేసే సంభాషణ సమాంతరంగా నడుస్తూ ఒక స్త్రీ మానసిక ప్రపంచం, బాహ్యప్రవర్తన ఏకకాలంలో పాఠకుడి ఎదట ఆవిష్కృతమౌతాయి. సమాజం నుంచి, వ్యవస్థ నుంచి సహాయం, సానుభూతి లేనపుడు ఈ రెండు రకాల సంభాషణలు స్త్రీలకు అనివార్యమేమో అనిపింపజేస్తాయి.


సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...