విశ్వమహిళానవల 27: విలా కేథర్

అమెరికాలో రాబోతున్న అధ్యక్షుడి ఎన్నికలను ప్రస్తావిస్తూ ఒక పాత్రికేయుడు 2019లో ఓ మాట అన్నాడు ‘ఈ దేశంలోని వలసదార్లను తరచు కించపరచే డానల్డ్ ట్రంప్ ఈమె నవలలు చదవాలి.’

‘ఈమె నవల ముందు నా గ్రేట్ గాట్స్‌బీ ఒక ఫెయిల్యూర్’ అన్నాడు సుప్రసిద్ధ రచయిత స్కాట్ ఫిట్జ్‌గెరాల్డ్. వీరిద్దరూ చెప్పిన నవల పేరు మై ఆంటోనియా. రచయిత్రి విలా కేథర్ (Willa Cather). ఇరవైవ శతాబ్ది ప్రారంభంలోని గ్రామీణ అమెరికాని అతి వాస్తవికంగా చిత్రించిన రచయిత్రిగా పేరు పొందిన మహిళ విలా కేథర్ (1873-1947). ది గ్రేట్ గాట్స్‌బీ నవలకూ ఈ నవలకూ కథలో పోలికలు లేవు. (ఏ ఉద్దేశంతో ఫిట్జ్‌గెరాల్డ్ ఈ మాటలన్నాడని ఆలోచిస్తే బహుశా ‘అమెరికా స్వప్నం’ లోని డొల్లతనాన్ని రెండు నవలలూ ప్రస్తావించడమని సమాధానం చెప్పుకోవాల్సివుంటుంది.)

2019లో ఒక అభిప్రాయవేదికని నిర్వహించిన ఆ అమెరికన్ పాత్రికేయుడు బ్రెట్ స్టీవెన్, విలా కేథర్‌ని డానల్డ్ ట్రంప్‌కు ఆంటీడోట్‌గా పేర్కొన్నాడు. అమెరికాను గొప్ప దేశంగా చేసే లక్షణాలేమిటో విలా నవలలు చెబుతాయని ఈ పాత్రికేయుడే కాదు. ఇతర విమర్శకులు కూడా ఆమె సాహిత్యాన్ని ప్రశంసించారు. ముఖ్యంగా ట్రంప్ విధానాలు మరోసారి విలా కేథర్‌ని చదవాలను గుర్తుచేశాయని అన్నా తప్పులేదు. 1912 నుంచి 1940 వరకూ రాసిన నవలలన్నిటిలోనూ అమెరికాకు వలస వచ్చిన వారి జీవితాలను చిత్రించిన విలాకు అమెరికన్ సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. నవలలో ‘స్థలం’ ఒక పాత్రగా రూపుదిద్దుకున్న అపురూప రచనలు ఈమెవి. ఎన్నో దేశాలనుంచి వలస వచ్చిన వారికి సమానమైన ప్రతిపత్తిని కలిగించడమే అమెరికా ప్రత్యేక లక్షణమని అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని 20వ శతాబ్ది తొలిరోజుల్లో నవలలు రాసిన విలా కేథర్ చిత్రించినంత నిపుణంగా మరెవరూ చిత్రించలేదని విమర్శకులంటారు.

విలా కేథర్ జీవితం

విలా వంశీకులు ఇంగ్లండ్ లోని వేల్స్‌కి చెందినవారు. అక్కడినుంచి వీరి తాత కాలంలోనే అమెరికాలో వర్జీనియాకు వలసవచ్చారు. తీరప్రాంతాలు, మైదానాల చిత్రణ ఆమె నవలల్లో ఎక్కువ ఉండడానికి వేల్స్ వారసత్వం కూడ కారణమై ఉండవచ్చునంటారు విమర్శకులు. విలా తల్లిదండ్రులకు పెద్ద కూతురు. ఆమె తర్వాత నలుగురు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు. తొలినుంచీ తమ్ళుళ్ళతో ఉన్న అనుబంధం విలాకు చెల్లెళ్ళతో ఉండేది కాదు. కానీ పెద్దయ్యాక మాత్రం ఆమె స్నేహితులందరూ ఆడవాళ్ళే. అది ఎంతగా జనాలను ఆకర్షించిందంటే ఆమె లెస్బియన్ అనుకునేంతగా.

విలా చదువు, నెబ్రాస్కా, ఫిలడెల్ఫియాలలో కొనసాగి చివరకు న్యూయార్క్‌లో పాఠశాల ఉపాధ్యాయురాలిగా పని చేసింది. లెక్కలు, ఇంగ్లీషు, లాటిన్ బోధించింది. కానీ అంతకుముందు కొంతకాలం ఒక డాక్టర్‌కి సహాయకురాలిగా, రోగుల ఇళ్ళకు వెళ్ళి చికిత్సలో తోడ్పడింది. మరికొంతకాలం జర్నలిస్టుగా పని చేసింది. రెండు పత్రికలకు సంపాదకురాలిగా పనిచేసింది. ఆ రెండు వృత్తుల పట్లా ఆసక్తి ఉండేది ఆమెకు. ఈ క్రమంలో పుస్తకాలను విపరీతంగ చదవడం అలవాటు చేసుకుంది. నెబ్రాస్కాలో ఉన్న రోజుల్లోనే ఆమె రచనాజీవితానికి అంకురార్పణ జరిగింది. అక్కడి వాతావరణం, మైదానాలు, అక్కడ వలసదారుల జీవితాలు, అదే సమయంలో అమెరికన్ ఇండియన్ల జీవితాలు ఆమెను ఆకర్షించాయి. ఆమె తొలి కథానాయిక నెబ్రాస్కా బాలికే.

విలా వివాహం చేసుకోలేదు. పైగా ఎక్కువకాలం (39 ఏళ్ళు) తన స్నేహితురాలు ఈడిత్‌తో కలిసి జీవించింది. తన నవలలన్నిటికీ ప్రేరణ మరో స్నేహితురాలు ఇసబెల్లా అని ప్రకటించుకుంది. దీనితో ఆమెకు స్వలింగసంపర్కం ఉండేదని కొందరు విమర్శకులు తీర్మానించారు. మరి కొందరు ఈ వాదనను తిరస్కరించారు. ఆమె మాత్రం ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదు. తనకు, స్నేహితులకు మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలను చింపేసేది. తన అనంతరం తన చివరి రచనను కూడ తగలబెట్టెయ్యమని స్నేహితురాలు ఈడిత్‌కి చెప్పింది. ఆమె వ్యక్తిగత విషయాలు అందుకే పెద్దగా బయటకు రాలేదు. అమెరికన్ సమాజంలో ప్రముఖపాత్ర వహిస్తూ, పులిట్జర్ బహుమానం కూడ అందుకున్న ఆమె, తన వ్యక్తిగత జీవితం గురించి మాత్రం చాలా గుంభనగా ఉండేది.

సాహిత్యం

విలా కేథర్ కవిత్వంతో సాహిత్యజీవితం ఆరంభించినా, నవలా రచనలోనే స్థిరపడింది. 12 నవలలు, ఆరు నవలికలు, రెండు కవితాసంపుటాలు, మూడు వచన రచనాసంపుటాలు ప్రకటించింది. ఆమె నవలల్లో వన్ ఆఫ్ అవర్స్ (One of ours, 1922) అన్న పేరుతో, మొదట ప్రపంచయుద్ధనేపథ్యంలో రాసిన నవలకు ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ బహుమతి లభించింది. అయితే అది ఆమె అత్యుత్తమ నవలగా విమర్శకులు అంగీకరించలేదు.

ఆమె నవలల్లో మాస్టర్ పీస్ అని చెప్పదగ్గ రచనగా ఎక్కువమంది భావించింది 1918లో ఆమె ప్రచురించిన మై ఆంటోనియా (My Antonia).

విలా కేథర్ అమెరికా జీవితాన్ని ఎంత వాస్తవికంగా చిత్రించినా, ఆమె నవలలన్నిటికీ ఒకే రకమైన ప్రశంసలు దక్కలేదు. తొలిప్రపంచయుద్ధాన్ని చిత్రించిన వన్ ఆఫ్ అవర్స్ నవలను సింక్లెయర్ లూయిస్, ఎర్న్‌స్ట్ హెమింగ్‌వే తీవ్రంగ విమర్శించారు. ‘అక్కడా ఇక్కడా చదివి పోగుచేసుకున్న మాటలతో ఈ యుద్ధాన్ని వర్ణించిందని’ అన్నారు. అంతకంటే తీవ్రమైన విమర్శ ‘ఈ ప్రపంచయుద్ధం యువకులకు స్ఫూర్తిని ప్రేరణను కలిగించిన ఘట్టమని అర్థం వచ్చేలా వుంది ఈ నవల’ అన్నది. విఫలమైన వివాహం, యాంత్రికమైన రైతుజీవితం నుంచి తప్పించుకోడానికి యుద్ధానికి వెళ్ళిన కథానాయకుడు, ఒక సైనికుడిగా తన జీవితానికి ఒక లక్ష్యం నిర్ణయించుకోగలిగాడని చెప్పే ఈ నవల యుద్ధాన్ని మానవాళికి హానిచేసేదిగా చిత్రించడానికి బదులు, వ్యక్తిత్వ వికాసానికి అనుకూలపరిణామంగా చూపిందన్న విమర్శ వచ్చింది.

అయినప్పటికీ కథాకథనం, పాత్రచిత్రణల వల్ల ఈ నవలకు కూడా ప్రజాదరణ పుష్కలంగానే లభించింది. ఈ నవలలో ఒక గమ్యం లేకుండా జీవిస్తున్న యువకుడు సైనికుడిగా తనకొక లక్ష్యం ఏర్పడిందని భావించడాన్ని చిత్రించడమే ఆమె ఉద్దేశం కానీ, యుద్ధాన్ని సమర్థించడం కాదని వాదించడానికి అవకాశం ఉంది. మొత్తం మీద, అవార్డు పొందిన ఈ నవల కంటే, ఆదర్శాలూ, సెంటిమెంట్లూ లేకుండా ఎంతో సహజంగా వలసదారుల జీవితాన్ని, యువతీయువకుల మధ్య స్నేహాన్ని వర్ణించిన మై ఆంటోనియాకి అన్ని వర్గాల నుంచి ప్రశంసలే దక్కాయి.

ప్రపంచంలోని నలుమూలలనుంచీ అమెరికాకు వలసవచ్చిన వాళ్ళు తొలిరోజుల్లో ఎదుర్కొన్న భాషా, సాంస్కృతిక సమస్యలు, వాతావరణ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు కళ్ళకు కట్టినట్లు చిత్రించిన అరుదైన రచయిత్రి విలా. అలాగే పంటపొలాలు, వ్యవసాయం, రైతుల జీవన విధానం అత్యంత వాస్తవికంగా రచించింది కనక ఆమెను ‘భూమి, వాతావరణాల రచయిత్రి’గా కూడ వర్ణించారు విమర్శకులు.

మై ఆంటోనియా

చెకస్లొవేకియా నుంచి అమెరికా వచ్చి స్థిరపడిన ఒక కుటుంబానికీ రచయిత్రి స్నేహితుడికీ మధ్య నడిచిన కథ ఇది. చెక్ పౌరులు 1848 నుంచి 1914 లోపల ఎక్కువగా అమెరికాలో టెక్సస్, నెబ్రాస్కాలకు వచ్చి స్థిరపడ్డారు. మై ఆంటోనియా నవల బహుశా రెండోతరం వలసదారులను చిత్రించివుండవచ్చు.

ఈ నవలకు ఒక విలక్షణమైన ముందుమాట ఉంది. అందులో రచయిత్రి విలా, తన మిత్రుడు జిమ్ బర్డెన్‌తో సంభాషిస్తూ, ‘నీకు చాలా కథలు తెలుసు కదా. నీ అనుభవాలనుంచి ఒక కథను చెప్పొచ్చుగా’ అంటుంది. ఆ సంభాషణలో ఇద్దరికీ ‘ఆంటోనియా’ గుర్తుకు వస్తుంది. ఆమె కథే చెప్తాను అంటాడు జిమ్. అలా జిమ్ ఉత్తమపురుషలో, రచయిత్రికి చెప్పిన కథగా ఈ నవల రూపుదిద్దుకుంటుంది.

వర్జీనియాకు చెందిన పదేళ్ళ జిమ్ బర్డెన్ తన తల్లిదండ్రులు మరణించిన తర్వాత, తాత, నాన్నమ్మలతో నివసించడానికి నెబ్రాస్కాలోని బ్లాక్ హాక్ సెటిల్‌మెంటుకు రావడంతో కథ ప్రారంభమౌతుంది. వాళ్ళు ప్రయాణిస్తున్న రైల్లోనే బొహీమియాకు (చెక్ దేశం) చెందిన ఒక కుటుంబం కూడ ప్రయాణిస్తుంది. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు, తల్లి, తండ్రి ఉన్న ఆ కుటుంబం నెబ్రాస్కాలో వీరికి పొరుగునే నివాసం ఏర్పరచుకుంటారు. ఆ ఇల్లు నివాసయోగ్యంగా లేకపోయినా గత్యంతరం లేక సర్దుకుంటారు. ఇక అక్కణ్ణుంచీ వారి సమస్యలు మొదలు. చెక్ భాష వచ్చిన ఒక కుర్రాడిని పనిలోకి పెట్టుకుంటారు కానీ అతని పనితనం వారికి నచ్చదు. అప్పుడు ఆంటోనియా తండ్రి ఆ పదమూడేళ్ళ పిల్ల ఆంటోనియాను, పదేళ్ళ జిమ్ నుంచి ఇంగ్లీషు నేర్చుకోమని పురమాయిస్తాడు, ఆ ఇంటి మొత్తంలో ఒకరికి ఇంగ్లీష్ వస్తే చాలని. అక్కడినుంచీ ఆంటోనియా, జిమ్‌ల స్నేహం మొదలవుతుంది. ఆమె జీవనోత్సాహం, గుడ్లగూబ దగ్గర్నుంచి బ్రెడ్ తయారీ వరకూ అన్నిటిపై అభిప్రాయాలు ప్రకటించే మనస్తత్వం ఆ బాలుణ్ణి ఆకట్టుకుంటాయి. ఈ నవలంతా వీరిద్దరి స్నేహమే. ఇద్దరి మధ్యా ఏ రొమాన్సూ లేదు. అసలు నవలలోనే ప్రేమ ప్రస్తావన చాలా తక్కువ.

భాషా సమస్య ఆంటోనియా వల్ల తీరినా, తిండి పడకపోవడం, తమదేశంలో దొరికే పదార్థాలు దొరక్కపోవడం, క్రమంగా ఆంటోనియా తండ్రి షిమెర్దా వ్యాపారం కూడ చెయ్యలేకపోవడం… ఇవన్నీ చెక్ కుటుంబాన్ని నిరాశలో కుంగేలా చేస్తాయి. పెద్ద కొడుకు ఆంబ్రోస్ వ్యవసాయం చెయ్యడానికి ప్రయత్నిస్తూంటాడు. రెండో కొడుకు మానసిక వికలాంగుడు. ఇక ఇద్దరు ఆడపిల్లలు ఆంటోనియా, యుల్కా మాత్రం అన్ని రకాల సమస్యల్లోనూ హుషారుగా, ప్రకృతితో మమేకమౌతూ, జిమ్‌తో కాలం గడుపుతూ హాయిగానే ఉంటారు. ముఖ్యంగా ఆంటోనియా అన్ని రకాల విపరీత పరిస్థితుల్లోనూ సంయమనంతో ఉండడం జిమ్‌ని ఆకర్షిస్తుంది. కానీ తనకంటే చిన్నవాడు కనక జిమ్‌ని ఆంటోనియా ఎప్పుడూ కొంత అలుసుగానే చూస్తుంది. అయితే ఒక్క సంఘటన జిమ్ పట్ల ఆంటోనియా మనసును మార్చేస్తుంది. ఒకరోజు ఎప్పటిలా అడవుల్లో తిరుగుతూండగా, అక్కడ పొలాల్లో కూలీగా తమతో పనిచేస్తున్న రష్యన్ల దగ్గర వీళ్ళు గొడ్డలిని తెచ్చుకుని తిరిగి వస్తూండగా ఒక పెద్ద పాము జిమ్‌ని కాటేయబోతుంది. జిమ్, గొడ్డలితో ఆ పామును పదే పదే కొట్టి చంపేస్తాడు. ఆ క్షణంనుంచి అతను ఆమెకు హీరో అయిపోతాడు. అప్పట్నుంచి తనతో సమానుడిగా చూడ్డం, ఊళ్ళో వాళ్ళందరికీ అతనెంతటి ధీరోదాత్తుడో చెప్పడం మొదలుపెడుతుంది.

వీళ్ళిద్దరి మధ్యా స్నేహం అలా దినదినాభివృద్ధి చెందుతూండగా, అకస్మాత్తుగా ఆమె తండ్రి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడంతో వాళ్ళ జీవితం పెద్ద మలుపు తిరుగుతుంది. అన్న ఆంబ్రోస్ ఇక నిత్యం పనిలోకి వెళ్ళడం మొదలుపెడతాడు. ఆంటోనియా కూడ వంటపనికి కుదురుకుంటుంది. అయినా ఉన్నంతలో ఆనందంగానే ఉంటుంది. సంపన్నుడైన జిమ్ చదువు కొనసాగించడంతో కొంతకాలం ఆమెకు దూరమవుతాడు. ఆంటోనియా జీవితం కొన్ని అనూహ్యమైన మలుపులు తిరిగి ఆమెకు విషాదాన్నే మిగిలిస్తుంది. జిమ్ నాన్నమ్మ సిఫారసుతో తనను ఇంట్లో పనికి పెట్టుకుని ఎంతో ఆదరంతో చూసే హార్లింగ్ దంపతుల ఇంట్లో సుఖంగా ఉండక, తన తోటి అమ్మాయిలతో డాన్స్ మోజులో పడి ఇల్లు పట్టకుండా తిరగడం మొదలుపెడుతుంది ఆంటోనియా. అలా విచ్చలవిడిగా ఉండడం మంచిది కాదని వారించినందుకు వాళ్ళ ఇంటిని వదలాల్సి వస్తే ఏ మాత్రం బాధపడకుండా కటర్ దంపతులతో వెళ్ళిపోతుంది. భర్త కటర్ దుర్మార్గుడు. స్త్రీలోలుడు. అతను ఒకసారి ఆంటోనియాపై అత్యాచారం చెయ్యాలని విఫలయత్నం చేస్తాడు. దానితో అక్కడినుంచి వెళ్ళిపోవాల్సివస్తుంది. తర్వాత లారీ బ్రౌన్ అనే ఒక యువకుడి ప్రేమలో పడి, అతనితో వెళ్ళిపోతుంది. అతను ఆమెను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి, కాపురం చేసి, ఆమె వద్దనున్న డబ్బంతా అయిపోగానే, పారిపోతాడు. అప్పటికే గర్భవతి అయిన ఆంటోనియాను నెబ్రాస్కాలోని ఒక ముసలావిడ ఆదరించి, పురుడు పోస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి తనకంటే వయసులో పెద్దవాడు, సామాన్య రైతు అయిన తన దేశీయుడు కర్డిజ్‌ను ఆంటోనియా వివాహం చేసుకుంటుంది. వారికి లారీ, ఆంటోనియాల సంతానమైన మార్తాతో కలిపి మొత్తం పదిమంది సంతానం.

ఆమె జీవితంలోని ఈ మలుపులన్నీ జిమ్‌కు అవి జరుగుతున్నపుడు తెలీవు. కొన్నేళ్ళ తర్వాత తెలుస్తాయి. దాదాపు ఆరేళ్ళపాటు ఆంటోనియాకు దూరంగా వేరే చోట చదువుకుని, న్యాయవాదిగా వృత్తి ఆరంభించిన జిమ్ తిరిగి తమ ఊరికి వచ్చినపుడు, ఆంటోనియా గురించి తెలుసుకుని ఆమె ఇంటికి వస్తాడు. పిల్లలకోడిలా తయారైన ఆమె 24 ఏళ్ళ వయసులోనే మధ్యవయస్కురాలిగా కనిపిస్తుంది. కానీ ఆమె చాలా ఆనందంగ, సంతృప్తిగా జీవిస్తోందని, తన జీవితంతో రాజీ పడిందని, పిల్లల పెంపకం, భర్తతో కాపురం ఆమెకు మనశ్శాంతినిచ్చాయనీ జిమ్ గ్రహిస్తాడు. తొలిసారిగా ఆమెతో ‘నేను నిన్ను ప్రేమించాను’ అని చెప్తాడు. ఆ మాటల్ని చాలా మామూలుగ నవ్వుతూ స్వీకరిస్తుంది ఆంటోనియా. ఎట్టకేలకు తన మనసులో మాట ఆమెకు చెప్పేశాక, జిమ్ తిరిగి మామూలు స్నేహితుడిలా మారిపోతాడు. ఆమె మగపిల్లలని తరచు బయట ప్రాంతాలకు తీసికెళ్తానని, వారికి కొత్త అనుభవాలు అందించడానికి ప్రయత్నిస్తాననీ జిమ్ అంటాడు. అతనికి తన వద్ద ఆ స్వేచ్ఛ ఉందంటుంది ఆంటోనియా. ఆమె పిల్లలందరికీ జిమ్ చాలా నచ్చుతాడు. ఆంటోనియా జీవితం సుఖంగానే ఉందన్న అవగాహనతో, అపుడపుడు కలుస్తూంటానని చెప్పి, జిమ్ తిరిగి తన ఊరికి వెళ్ళిపోతాడు.

స్థూలంగా ఇదీ కథ. ఇందులో ప్రధాన కథ కంటే ఆమె స్పృశించిన సామాజిక, చారిత్రకాంశాలు, సంఘటనలు ఉపాఖ్యానాల రూపంలో, చర్చల రూపంలో ఆసక్తిని కలిగించేలా ఉంటాయి. వాటిలో రష్యన్ రైతు కూలీలది ఒకటి.

ఇతర దేశాల నుంచి వచ్చినట్టే పీటర్, పావెల్ అనే ఇద్దరు రష్యన్లు నెబ్రాస్కాకు వలసవస్తారు. వాళ్ళు ఆంటోనియా తండ్రి పొలంలో పనిచేయడానికి కుదురుతారు. ఆయన వాళ్ళమీద ఎక్కువగా ఆధారపడతాడు కూడ. వారిలో పావెల్ అనారోగ్యం పాలై, మరణశయ్య మీద ఉన్నపుడు, జిమ్, ఆంటోనియాలకు తాము ఈ దేశానికి పారిపోయివచ్చిన వైనం కథలా చెప్తాడు. యుక్తవయస్సులో అడుగుపెట్టిన కొత్తలో వీళ్ళిద్దరినీ తల్లిదండ్రులు ఒక పెళ్ళిబృందంతో ఆటవిడుపుగా గడపడానికి పంపుతారు. అందరిలా వీరు కూడా గుర్రబ్బండిలో వెళ్తూండగా ఒక పెద్ద తోడేళ్ళ గుంపు ఈ బృందంపై దాడి చేస్తుంది. బృందం కకావికలమై చెల్లాచెదురై చాలామంది తోడేళ్ళ వల్ల, తొక్కిసలాట వల్ల ప్రాణాలు కోల్పోతారు. చివరగా వధూవరులున్న గుర్రబ్బండి, పీటర్ పావెల్ బండి మిగుల్తాయి. తోడేలు తమపై దాడి చేస్తోందని గమనించిన పెళ్ళికొడుకు, వధువును రక్షించమనీ తను తోడేలుతో పోరాడతాననీ చెబుతూ, ఆమెను వీరి బండిలోకి తీసుకోమని ప్రాధేయపడతాడు. వీళ్ళు ఆమెను రక్షించకపోగా, తమ బండి దగ్గరికి వస్తున్న తోడేళ్ళకు ఎదురుగా ఆ అమ్మాయిని తోసేసి, తమ ప్రాణాలు కాపాడుకుని గ్రామం చేరుకుంటారు. ఈ వార్త వారి గ్రామమంతటా దావానలంలా పాకుతుంది. ‘వధువును తోడేళ్ళకు అప్పగించిన యువకులుగా’ వీరిద్దరి పైనా ముద్రపడుతుంది. స్వగ్రామం నుంచి వీళ్ళను వెళ్ళగొడతారు. చివరికి తల్లి కూడ వీళ్ళ ముఖం చూడదు. తమ దేశంలో ఎక్కడికెళ్ళినా వీళ్ళ గతం వెంటాడడంతో, అమెరికాకు పారిపోయి వస్తారు. ‘తాము చేసిన అతిదారుణమైన చర్య మీతో చెప్పాలి ‘ అంటూ వివరంగ ఈ కథ చెప్పి, పావెల్ చనిపోగా, సోదరుడు పీటర్ ఇక అక్కడ ఉండలేక ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇలాగే మరికొందరు ఆడపిల్లల కథలు కూడ ఈ నవలలో ఆసక్తిని రేకెత్తిస్తాయి.

యూరప్ దేశాల వారు అమెరికాకు రావడం దేనికి? అన్న చర్చ నవలలో అపుడపుడూ వస్తూంటుంది. క్రిస్మస్ పండక్కి ఆంటోనియా కుటుంబాన్ని భోజనాలకు పిలిచినపుడు ఆంటోనియా మొదటిసారిగా జిమ్‌తో తన తండ్రికి అమెరికాకు రావడం ఇష్టం లేదంటుంది. ‘బొహీమియాలో ఉన్నపుడు రోజూ పాటలు పాడేవాడు. వాద్యగోష్టులు నిర్వహించేవాడు. ఇక్కడికి వచ్చినప్పటినుంచీ చచ్చుపడిపోయాడు, అతనిలో జీవమే లేదు’ అంటుంది. జిమ్‌కు ఉక్రోషం వచ్చి, ‘అయితే ఎవడు రమ్మన్నాడు మాదేశానికి? అక్కడే ఉండాల్సింది’ అంటాడు. అప్పుడు అమెరికా గురించి తన తల్లి ఎలా వత్తిడి చేసిందో చెబుతుంది, అప్పుడే నేర్చుకుంటున్న ఇంగ్లీషులో.

“My mamenka make him come. All the time she say: ‘America big country; much money, much land for my boys, much husband for my girls.’ My papa, he cry for leave his old friends what make music with him.” (పేజీ 103).

అప్పటికే ‘అమెరికా మహా స్వప్నం’ అన్న భావన అన్ని దేశాలనూ సూదంటురాయిలా ఆకర్షిస్తోంది, అందుకే అన్ని వలసలు ప్రారంభమయ్యాయి. అయితే అందరూ అమెరికాకు వచ్చాక ఆనందంగ లేరనడానికి ఆంటోనియా తండ్రే నిదర్శనం. కొన్ని రోజులకు ఆంటోనియా తండ్రి షిమెర్దా కుందేళ్ళ వేటకు వెళ్తున్నానని చెప్పి, బయటకు వెళ్ళి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఇది వారి కుటుంబానికే కాక, జిమ్ కుటుంబానికి కూడ తీవ్ర విఘాతం కలిగిస్తుంది.

ఆ తర్వాత వచ్చిన మార్పుల్లో జిమ్ తాత, నాన్నమ్మ వేరే పట్టణానికి నివాసం మార్చేస్తారు. జిమ్ కొత్త స్కూల్లో చేరి, కొత్త ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఆంటోనియా అన్న ఆంబ్రోస్ ఒక్కడే తరచు వస్తూంటాడు. అతనంటే ఎవరికీ పెద్దగా ఇష్టం ఉండదు. కానీ పనిమంతుడు కనక వ్యాపార సంబంధాలు పెట్టుకుంటారు.

ఈ నవలలో కథంతా, ఇందాకే చెప్పినట్టు, జిమ్ కోణం నుంచి మనకు అందుతుంది. పదేళ్ళ వయసులో మొదలైన అతని కథనం ప్రౌఢవయస్సు వరకు కొనసాగుతుంది. అతని జీవితంలోని ఘట్టాలతో పాటు, అతనిలో క్రమేపీ సమాజం పట్ల, వలసవచ్చిన వారి జీవితాల పట్ల పెరిగిన అవగాహన నవలలో ముఖ్యమైన అంశాలు. ఆంటోనియానే కథానాయికైనా, ఇంకా ఎందరో యువతుల ప్రస్తావన ఈ కథలో వస్తుంది. వారందరూ ఒక తరం యువతకు ప్రతినిధులు. తమ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండి, కుటుంబబాధ్యతలను ఆనందంగ తలకెత్తుకున్న కొత్తతరం అమ్మాయిలు.

There was a curious social situation in Black Hawk. All the young men felt the attraction of the fine, well-set-up country girls who had come to town to earn a living, and, in nearly every case, to help the father struggle out of debt, or to make it possible for the younger children of the family to go to school. Those girls had grown up in the first bitter-hard times, and had got little schooling themselves. But the younger brothers and sisters, for whom they made such sacrifices and who have had “advantages,” never seem to me, when I meet them now, half as interesting or as well educated. The older girls, who helped to break up the wild sod, learned so much from life, from poverty, from their mothers and grandmothers; they had all, like Antonia, been early awakened and made observant by coming at a tender age from an old country to a new. (పేజీ 226).

పైకి చాలా మామూలుగా కనిపించే ఈ యూరోపియన్ అమ్మాయిలు ఎన్నో త్యాగాలు చేసినవాళ్ళు. ఇల్లు గడవడంలో తండ్రికి సాయపడ్డం, తమ చెల్లెళ్ళు, తమ్ముళ్ళను చదివించడం, తన తల్లి, అమ్మమ్మ, నాన్నమ్మల సంప్రదాయాన్ని నిలబెట్టడం, తాము చదువుకోకపోయినా, జీవితం నేర్పిన పాఠాలతో విజ్ఞత సాధించడం – ఈ ఆడపిల్లలందరిలో సామాన్య లక్షణం. జిమ్‌కు అందుకే ఆంటోనియాతో మొదలుపెట్టి, లీనా, టైనీ, మేరీ వంటి ఇతర అమ్మాయిల పట్ల కూడ ఒక గౌరవభావం ఏర్పడుతుంది. ఒక యువకుడి కోణం నుంచి కథను చెబుతూ, ఆనాటి సామాజిక స్థితి ఎటువంటి ఆడపిల్లలను తయారు చేసిందో ఎంతో నేర్పుగా చెబుతుంది విలా కేథర్. స్కాండినేవియన్ దేశాల నుంచి (ఈ నవలలో చెక్ రిపబ్లిక్ కాక, డెన్మార్క్, నార్వేల నుంచి వలసవచ్చిన వారి ప్రస్తావన ఉంది) వచ్చిన ఆడపిల్లలంటే నెబ్రాస్కాలోని అమెరికన్ యువతులకు చులకన. దానికి ముఖ్యకారణం ఈ అమ్మాయిలకు ఇంగ్లీషు రాకపోవడం. కానీ పోను పోను ఈ యువతులే, ఇంగ్లీషు డాబుగా మాట్లాడే ఆడపిల్లలకంటే మెరుగ్గా పనిచేస్తూ, తమ తండ్రుల అప్పులు తీర్చాక, తమ ఆదాయం పెంచుకుని, జీవితంలో స్థిరపడి, భర్త, పిల్లలతో సుఖంగా ఉన్నారు.

ఆంటోనియా ప్రత్యేకత

ఇక ఈ కథానాయిక ఆంటోనియా ఎటువంటి అమ్మాయి? మొదట్నుంచీ జీవనోత్సాహం ఉన్న పిల్ల. జిమ్‌కి తనకంటే షుమారు నాలుగేళ్ళు పెద్దదైన ఆంటోనియా పట్ల ఆకర్షణ, ఇష్టం పెరగడానికి ఆమెలోని అనేక గుణాలు కారణమౌతాయి. యౌవనంలో సహజంగ ఉండే అల్లరి, సరదాలు ఒక పక్క; తండ్రితో కుటుంబభారాన్ని పంచుకోవాలనే తత్వం మరో పక్క; పిల్లలతో ఆటల్లో పడి పని మరిచిపోయే అమాయకత్వం ఒక పక్క, తనకు ఇరవై ఏళ్ళు నిండకముందే, తండ్రి మరణానంతరం, కుటుంబ బాధ్యతను నెత్తినేసుకుని, వంటపని, ఇంటిపని, పొలంపనీ సరిసమానంగా చేసే శ్రామికగుణం మరో పక్క; అందమైన అబ్బాయి ఆకర్షణలో పడే యౌవనసహజమైన చాపల్యం ఒక పక్క; ప్రేమజీవితం విఫలమయ్యాక, వైవాహికబంధంలో, పదిమంది పిల్లల తల్లిగా కుటుంబబాధ్యతలను ప్రశాంతంగా నిర్వహించిన స్థితప్రజ్ఞత మరో పక్క… ఇలా చెప్పుకుంటూ పోతే ఆంటోనియాలో సజీవకళ తొణికిసలాడుతుంది; ఇంద్రధనుస్సులోలా అనేక రంగులు ఆమెలో వెల్లివిరుస్తూంటాయి. సుఖదుఃఖాలను, మంచిచెడులను ఒకే రకమైన స్పందనతో స్వీకరించగల స్థితప్రజ్ఞత ఆమెకు సహజంగా వచ్చింది. హాయిగా సంగీతం, నృత్యం నేర్చుకుంటున్న తరుణంలో, తండ్రి ఆత్మహత్య అశనిపాతం కాగా, అన్నతో బాధ్యతలు పంచుకోడానికి పొలంపనులకు వెళ్ళాల్సివచ్చినపుడు అతి సహజంగా అందులో ఒదిగిపోతుంది. లారీ మోసం చేసి గర్భవతి అయినపుడు, అంత మామూలుగానే తన ఊరికి వచ్చి అందరికీ చెబుతుంది. అందుకే జిమ్‌కి ఎప్పటికీ ఆమె ‘అంతులేని రహస్యం’లా, ప్రేమాస్పదురాలిలానే కనిపిస్తుంది. అంతకంటే ముఖ్యంగా అతనికి ఎప్పటికీ ‘తన ఆంటోనియా’లాగే ఉంటుంది. స్థూలంగా చూస్తే, అసలామె ఎప్పుడూ ‘అతని’ ఆంటోనియా కాదు. తండ్రికి అల్లారు ముద్దు బిడ్డ. లారీ ప్రేమికురాలు, కుజక్‌కు భార్య.

ఆంటోనియా ధైర్యస్తురాలు. మనసులో మాట నిక్కచ్చిగా చెప్పడంలో దిట్ట. ఒక సన్నివేశంలో, తనను ఎంతో ప్రేమగా చూసుకునే హార్లింగ్ దంపతులకు కాబోయే అల్లుడు హారీ, ఆంటోనియాతో డాన్స్ చేసే నెపంతో దగ్గరగా మెలగుతాడు. ఒకరోజు ఆమెను ఇంటివద్ద వదిలే నెపంతో ఆమె వద్దంటున్నా వెంట వెళ్ళి ముద్దు పెట్టుకుంటాడు. అతను తన యజమానురాలి ఇంటి అల్లుడని ఎరిగిన ఆంటోనియా అతన్ని వారిస్తుంది. అయినా వినకపోయేసరికి చెంప ఛెళ్ళుమనిపిస్తుంది. ఈ సంఘటన తర్వాత హార్లింగ్ దంపతులు ఆమెను అపార్థం చేసుకోరు గాని, ఇక డాన్సులు చేసే టెంట్‌కి వెళ్ళవద్దని ఆదేశిస్తారు. దానికి ఆమె సమాధానం ‘నా పనివేళలు పూర్తయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాననేది నా ఇష్టం. మీకెవరికీ నా వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకునే హక్కులేదు.’

ఇలా మాట్లాడాక, వాళ్ళ ఇంట్లో ఉండడం భావ్యమనిపించక హార్లింగ్ ఇంటినుంచి బయటకు వచ్చిన ఆమె కటర్ అనే ఒక దుర్మార్గుడి ఇంట్లో చేరుతుంది. తెలివైంది కనక మొదటి రోజు నుంచే కట్టర్ మంచివాడు కాదని గ్రహించి, జిమ్‌కు, అతని నాన్నమ్మకూ ఆ ఇంట్లో తనకు భద్రత లేదని చెబుతుంది. భార్యతో నిత్యం పోట్లాడుతూ ఉండే కటర్, ఒకసారి తన భార్యతో ఊరికి వెళ్తున్నట్టు నటించి, మధ్యదారిలో ఏదో పనివుందని తిరిగి వచ్చి, ఒంటరిగా ఉన్న ఆంటోనియాపై అత్యాచారం చెయ్యబోతాడు. కానీ అంతకుముందే ఆంటోనియా అతని ప్రవర్తన గురించి జిమ్‌కూ, అతని నాన్నమ్మకూ చెప్పింది కనక జిమ్ ఆమెకు తోడుగా ఉండేందుకు ఇంటికి వెళ్ళి ఆమె పడకపైన తను పడుకుంటాడు. ఊరికి వెళ్ళినట్టుగా వెళ్ళిన కటర్ తిరిగి వచ్చి, ఆ పడకమీద ఉన్నది ఆంటోనియా అనుకుని మీదపడతాడు. జిమ్ లేచి అతన్ని చావబాది బయటకు వస్తాడు. ఆంటోనియాకు జిమ్ ఎప్పటికీ తన ఎడతెగని కబుర్లు వినే మిత్రుడు, అవసరంలో ఆదుకునే ఆప్తుడే. అంతకుమించిన స్థానం అతనికిచ్చినట్టు కనిపించదు.

ఆంటోనియా లారీ చేతిలో మోసపోయి, గర్భవతి అయి తిరిగి తన ఊరికి రావడం, ఆమెకు గతంలో కుట్టుపని నేర్పిన పెద్దావిడే ఆ పిల్లను దగ్గరికి తీసుకుని, పురుడుపోయడం… ఇవన్నీ ఆ పెద్దావిడే అనంతరం జిమ్ కలిసినపుడు చెబుతుంది. ఆవిడ మాటలవల్లే ఆంటోనియా చివరికి తన దేశస్థుడు కుజక్‌ని వివాహం చేసుకుని అక్కడికి దూరంగా ఉన్న మరో ఊళ్ళో స్థిరపడిందనీ, ఇప్పుడు పదిమంది పిల్లల తల్లనీ జిమ్ తెలుసుకుని ఆమెను కలిసేందుకు వెళ్తాడు. అంతే కానీ, ఆంటోనియా అతనికి తన జీవితంలోని మార్పుల గురించి ఒక్క ఉత్తరమూ రాయదు. ఎవరి చేతా కబురు కూడ చెయ్యదు. ఎట్టకేలకు ఆమెతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం కల్పించుకుని చివరి ఘట్టంలో తన మనసు విప్పుతాడు జిమ్.

“Do you know, Ántonia, since I’ve been away, I think of you more often than of any one else in this part of the world. I’d have liked to have you for a sweetheart, or a wife, or my mother or my sister—anything that a woman can be to a man. The idea of you is a part of my mind; you influence my likes and dislikes, all my tastes, hundreds of times when I don’t realize it. You really are a part of me.”

ఈ మాటలకు. అంతవరకూ దేనికీ చలించని ఆంటోనియాకు కళ్ళలో నీళ్ళు నిండుతాయి.

“How can it be like that, when you know so many people, and when I’ve disappointed you so? Ain’t it wonderful, Jim, how much people can mean to each other? I’m so glad we had each other when we were little. You’ll always remember me when you think about old times, won’t you?” (పేజీ 364).

ఇప్పుడు ఇద్దరూ మధ్యవయస్సులో ఉన్నారు. జీవితంలో మలుపులతో చాలా యేళ్ళు ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతూ దూరంగా ఉన్నారు. ఇకపై తమకు వీలైనపుడల్లా కలుసుకుందామని, తమను ఎప్పటికీ కలిపివుంచే గతాన్ని గుర్తు చేసుకుందామనీ ఇద్దరూ పరస్పరం చెప్పుకుంటారు.

భావోద్వేగాలకు అవకాశం ఉన్న సందర్భాల్లోనూ వాటిజోలికి వెళ్ళదు విలా కేథర్. పత్రికా సంపాదకురాలిగా తనకు పూర్వపు రచయిత్రులను సమీక్షిస్తున్నపుడు జేన్ ఆస్టిన్, జార్జి ఎలియట్, బ్రాంటె సోదరీమణులను తక్కువ స్థాయి రచయిత్రులుగా తీసిపారేసింది ఆమె. ఆ నవలల్లో ప్రేమ, భావోద్వేగాలు, మానసిక సంవేదనలు ఎక్కువ ఉండడం వల్ల కాబోలు. అందుకే ఈమె నవలల్లో సెంటిమెంటు కనిపించదు.

విలా కేథర్ నవలలన్నీ దాదాపుగా ప్రజాదరణ పొందినవే. ఓ పయొనీర్స్ (O Pioneers), సాంగ్ ఆఫ్ ది లార్క్ (Song of the Lark), డెత్‌ కమ్స్ ఫర్ ది ఆర్చ్‌బిషప్ (Death comes for the Archbishop) వంటి నవలలు హిట్ నవలలుగా నిలిచిపోయాయి. ఆమె జర్నలిస్టు నుంచి నవలా రచయిత్రిగా మారడం వల్ల, పత్రికా రచన లక్షణాలు నవలల్లో స్పష్టంగా కనిపిస్తాయి. భావోద్వేగం కంటే తర్కం, కవితావాక్యాలకంటే సరళమై, సూటిగా ఉండే శైలి దీనికి నిదర్శనాలు.

అమెరికన్ నవలా సాహిత్యంలో వలసదారులకు గౌరవప్రదమైన స్థాయిని కల్పించిన తొలి రచయిత్రిగా విలా కేథర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...