విశ్వమహిళానవల 17: షార్లట్ బ్రాంటీ

అందచందాలు లేని అమ్మాయి. నా అన్నవాళ్ళు, తన కోసం తపించేవాళ్ళు, కడుపు నిండా తిండి పెట్టేవాళ్ళు కూడ లేని అమ్మాయి. తల్లిదండ్రులను చిన్నప్పుడే కోల్పోవడంతో అత్త దగ్గర పెరుగుతూ, ఆమె ముగ్గురు పిల్లల స్నేహం దక్కక, ఆమె ఆదరణ పొందక, నిత్యం ఒంటరిగా ఉండిపోయిన అమ్మాయి. బలవంతంగా చేర్చిన స్కూల్లో కఠినమైన పద్ధతులకు, వాళ్ళు పెట్టే అరకొర తిండికీ నీరసించిపోయిన అమ్మాయి. పద్దెనిమిది ఏళ్ళ వయస్సులోనే ఒక ధనికుడైన ఉన్నతస్థాయి వ్యక్తి ఇంట్లో గవర్నెస్‌గా, పాపకు చదువు చెప్పడానికి కుదిరి, భవిష్యత్తుపై ఏ ఆశా లేకుండా రోజులు గడిపివేసే అమ్మాయి.

అలాంటి అమ్మాయి, కేవలం తన వ్యక్తిత్వంతో, తెలివితేటలతో, ప్రతిభతో ఎలా జీవితంలో నెగ్గుకు వచ్చిందో, తను ప్రేమించిన వ్యక్తికి తనే ‘గతి’ అయ్యేంత స్థానాన్ని ఎలా సంపాదించిందో చెప్పే విలక్షణమైన నవల జేన్ ఐర్ (Jane Eyre). ఈ నవలా రచయిత్రి షార్లట్ బ్రాంటీ (Charlotte Brontë). చెల్లెలు ఎమిలీ బ్రాంటీ (Emily Brontë) రాసిన విధ్వంసక నవల వదరింగ్ హైట్స్‌తో సరిసమానంగా హిట్టయిన నవల జేన్ ఐర్. కథలో, కథనంలో ఏ పోలికా లేకున్నా రెండూ క్లాసిక్సే ఇంగ్లీషు నవలల్లో. షార్లట్ కూడ చెల్లెళ్ళలాగే మొదట్లో కవితలు రాసింది.

కాల్పనికవాదం, వాస్తవవాదం, గాథిక్ మెలొడ్రామా కలగలిసిన ఈ నవల జేన్ ఐర్ అనే అమ్మాయి ఉత్తమపురుషలో చెప్పుకున్న కథ. నవలను కరెర్ బెల్ అనే పేరుతో షార్లట్ ప్రచురించడంతో, ఈ కొత్తరచయిత ఎవరన్న అనుమానం పాఠకులకు వచ్చింది. కానీ అతి త్వరలోనే ఆ రహస్యం బయటపడిపోయింది.

షార్లట్ జీవితంలో చెప్పుకోదగ్గ పెద్ద ఒడిదుడుకులేమీ లేవు. చెల్లెళ్ళతో పాటు (ఆన్, ఎమిలీ) 13వ యేట నుంచే కవిత్వం రాయడం, దాని ప్రచురణకు పెద్దగా ప్రయత్నించకపోవడం జరిగాయి. తను రాసిన తొలి నవల ది ప్రొఫెసర్ పత్రికాధిపతికి రుచించక వెనక్కి వచ్చింది. ఆ తర్వాత 1847లో జేన్ ఐర్ రాసింది. ప్రచురింపబడ్డ రోజు నుంచి అపురూపమైన ప్రశంసలు అందుకున్న నవల ఇది. స్వయంగా చిత్రకారిణి అయిన షార్లట్, జేన్ ఐర్ రెండో ఎడిషన్‌కి బొమ్మలు మొత్తం తానే వేసింది. (ఈ నవలా నాయిక కూడ మంచి చిత్రకారిణి అవడంలో షార్లట్ ఆత్మగతం బయటపడుతుంది).

‘సాహిత్యం ఆడవాళ్ళు చెయ్యాల్సిన పని కాదు’ అని బ్రిటిష్ అధికారి రిచర్డ్ సౌడీ తనకు రాసిన లేఖకు సమాధానం చెప్పడానికా అన్నట్టు షార్లట్ ఒక గొప్ప స్త్రీ పాత్రతో ఒక క్లాసిక్‌ని సృష్టించింది. అంతకు ముందు రాసిన ది ప్రొఫెసర్ కూడా ఉత్తమపురుషలో సాగిన రచనే. కానీ అది పురుష పాత్ర ప్రధానంగా సాగే ఉత్తమపురుష కథనం. ఒక రచయిత్రి మగవాడి ఉత్తమపురుషలో నవల రాయడం విలక్షణమైన విషయం. అయితే, మగవాడి అంతరంగాన్ని అంత సమగ్రంగా ఆవిష్కరించలేకపోయిందన్న విమర్శ ఎదుర్కొంది షార్లట్. ఈ రెండూ కాక, ఆమె రాసిన మరో రెండు నవలలు షర్లీ, విలెట్ (Shirley, Villette).

షార్లట్ బ్రాంటీ తన జీవితాన్ని కొంత రంగరించి జేన్ ఐర్ రాసింది. ఆమె కూడ చిన్నప్పుడు బోర్డింగ్ స్కూల్లో చదువుకుంది. గవర్నెస్‌గా పని చేసింది. మంచి చిత్రకారిణి. అయితే జేన్‍లా అనాథ కాదు; బాల్యంలో బాధాకరమైన పరిస్థితులు పెద్దగా లేవు. ఇంటికి పెద్ద పిల్ల కనక, చెల్లెళ్ళను పోషించడానికి చిన్నప్పుడే ఉద్యోగాలు చెయ్యాల్సివచ్చింది. ఆర్థర్ బెల్ నికోల్స్‌ని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అయితే సంవత్సరంలోనే గర్భం దాల్చి, అనారోగ్యం పాలై, ప్రసవానికి ముందే మరణించింది. అప్పటికే ఆమె చెల్లెళ్ళు ఆన్, ఎమిలీ కూడ మరణించారు. ఆమె జీవిత చరిత్రను మరో ప్రముఖ నవలాకారిణి ఎలిజబెత్ గాస్కెల్ రచించింది.

జేన్ ఐర్, ఎన్ ఆటోబయోగ్రఫీ

స్వీయ చరిత్రలా నడిచే జేన్ ఐర్‍లో ఒక యువతి పదేళ్ళ వయసునుంచి ఇరవైరెండు ఏళ్ళ వరకూ తన జీవితానుభవాలను మనతో పంచుకుంటుంది. ఆయా అనుభవాలతో, వాటికి తన ప్రతిస్పందనలతో ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, ఎటువంటి గమ్యం చేరుకుంది, ఆమెకు తారసపడిన వ్యక్తుల దోహదం ఈ పరిణామంలో ఎంతవరకూ ఉందీ… మొత్తం జేన్ కళ్ళ నుంచే ఆవిష్కృతమౌతాయి. అందుకే ఈ నవలపై సందేహాలు కూడ బోలెడు. జేన్ విశ్వసనీయ కథకురాలేనా? నిజంగా ఆమె తన జీవితంలో కలుసుకున్న వ్యక్తుల గురించి చేసిన అంచనాలు సరైనవేనా? తక్కిన అన్ని పాత్రలను ఆమె కోణం నుంచి మాత్రమే పాఠకుడు చూడగలడు కనక, పాఠకుడికి వాళ్ళను తనంతట తాను అర్థం చేసుకునే అవకాశం లేకపోవడం అన్యాయం కాదా? ఈ ప్రశ్నలన్నీ, ఉత్తమపురుష నవలలన్నిటిపైనా వచ్చినట్టే ఈ నవలమీద కూడ వచ్చాయి.

ఆ యుగంలో స్త్రీలు ప్రణయ కథలు రాయడం కొత్త కాకపోయినా, సంఘర్షణాభరితమైన కథను, దాన్ని అసాధారణ రీతిలో ఎదుర్కొన్న యువతి కథను ఉత్తమ పురుషలో చెప్పడం మాత్రం అపూర్వమే. ఒక రకంగా ఇది ఒక అమ్మాయి, స్త్రీగా పరిణతి చెందే క్రమాన్ని చెప్పే కథ. సాహిత్యవిమర్శలో ఇలాంటి నవలలను బిల్డింగ్స్‌రొమాన్ (Bildungsroman) అంటారు. (బాల్యం నుంచి యౌవనంలోకి అడుగుపెట్టే క్రమంలో ఒక వ్యక్తిలో కలిగే నైతికమైన, తాత్వికమైన పరిణామ క్రమాన్ని చిత్రించేవి.) ప్రేమకు, నైతికతకు, ఉపాధికి, నిరాశ్రయానికి, ఒంటరితనానికీ సుఖదాంపత్యానికీ మధ్య జరిగిన పోరులో నైతికతను, విలువలను నెగ్గించిన జేన్ పాత్ర గొప్పది. ఆ గొప్పదనాన్ని, ఉత్తమపురుష కథనం ద్వారా ఈ నవలకు జరిగిన లాభనష్టాలను తెలుసుకునేముందు స్థూలంగా కథ.

సుదీర్ఘమైన ఈ నవల కథను క్లుప్తంగా చెప్పుకోవాలంటే- జేన్ జీవితాన్ని అయిదు దశలుగా విభజించవచ్చు. మూడవ జార్జి పాలనాకాలంలో (1760-1820) జరిగిన ఈ కథ గేట్స్ హెడ్ అనే చోట కథానాయిక మేనత్త ఇంట్లో మొదలవుతుంది. తల్లిదండ్రులను బాల్యంలోనే కోల్పోయిన జేన్, అత్త, ఆమె పిల్లల (ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు) దయాదాక్షిణ్యాల మీద ఆధారపడివుంటుంది. వాళ్ళు ఆ పిల్లను నిర్దయగా చూస్తారు. నిర్లక్ష్యం చేస్తారు. మానసికంగా, శారీరకంగా వేదనకు గురైన జేన్‌ని పదో యేట అత్త లావుడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు పంపుతుంది. అది రెండో దశ. అక్కడ కూడ తిండి కరవై, మిత్రులు కరవై (మిస్ టెంపుల్ అన్న టీచర్, హెలెన్ అన్న సహవిద్యార్థి మినహా) జేన్ ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. అయితే ఆ ఇద్దరి ప్రభావంతో జేన్ క్రమంగా ఆత్మనిబ్బరం పెంచుకుని, అక్కడి పరిస్థితులకు బాధపడడం మానేసి, తన చిత్రకళలో, పుస్తకపఠనంలో లీనమవుతుంది. చివరికి మిస్ టెంపుల్ సహాయంతో, థార్న్‌ఫీల్డ్‌లో ఎడ్వర్డ్ ఫెయిర్‍ఫాక్స్ రాచెస్టర్ వద్ద పెరుగుతున్న పాపకు గవర్నెస్‌గా జీవితం ప్రారంభిస్తుంది.

ఇదే జీవితంలోని అతి ముఖ్యమైన దశ. ఇంతకుముందు జీవితంలో ఎరగని భద్రత, తిండి, నిద్ర, కనీస గౌరవం ఇక్కడ లభిస్తాయి జేన్‌కు. అయితే ఈ ప్రశాంతతకు భంగం కలిగిస్తూ తనకంటే ఇరవై యేళ్ళు పెద్దవాడైన రాచెస్టర్‌తో ప్రేమలో పడుతుంది జేన్. ఆ ఇంట్లో హౌస్ కీపర్ ఆలిస్ ఫెయిర్‍ఫాక్స్ తోనూ, పాప అడెల్ తోనూ మంచి బాంధవ్యం ఏర్పడుతుంది జేన్‌కు. కానీ ఈ ప్రశాంత జీవనంలో కొన్ని సంఘటనలు జేన్‌ని కలవరపెడుతూంటాయి. ఇంటి పై అంతస్తుల నుంచి రాత్రిపూట మూలుగులు, వికటాట్టహాసాలు వినిపించి అర్థంకాని అయోమయంలో పడుతుంది. రాచెస్టర్‌ని దాని గురించి అడిగితే, ఇంట్లో పనిచేసే గ్రేస్ అనే అమ్మాయికి కొద్దిగా మతిచాంచల్యం ఉందని, అవి ఆమె చేసే శబ్దాలేననీ చెప్తాడు. నమ్ముతుంది జేన్. ఒకరోజు రాచెస్టర్ నిద్రిస్తూండగా, అతని మంచానికి నిప్పంటుకుంటుంది. జేన్ సకాలంలో అక్కడికి వచ్చి, నీళ్ళు పోసి రాచెస్టర్‌ని కాపాడుతుంది. ‘నిప్పు ఎలా రాజుకుంది’ అన్న ఆమె ప్రశ్నకు రాచెస్టర్ సరిగ్గా సమాధానం ఇవ్వడు. ఇలాంటి ఘటనలు జేన్‌కి కలవరం కలిగిస్తూంటాయి. ఈ ఇంట్లో ఏదో రహస్యం ఉందనే అనుమానం వస్తుంది.

కానీ అతని పట్ల ప్రేమ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది. తనకు అతనిమీద ఎంత ప్రేమ ఉన్నా, అతను తనని ప్రేమించే అవకాశం లేదని జేన్ భావిస్తుంది. తనకు అందం లేదు; హోదాలేదు; డబ్బు లేదు. చిత్రలేఖనంలో తన ప్రతిభ, తన మాటకారితనం, పుస్తక పరిజ్ఞానం, తెలివితేటలు అతనికి నచ్చవచ్చుగాని, అవేవీ తన పట్ల ప్రేమగా మార్చగలిగినవి కావని జేన్ లోని వివేకం ఆమెకు చెబుతూంటుంది. అందుకే, అతనికి తన మనసులో మాట చెప్పదు. పైగా అతను, తన ఇంట్లో పార్టీలకు వచ్చే బ్లాన్ష్ (Blanche) అనే మరో అందమైన అమ్మాయిని ప్రేమిస్తున్నాడని కూడా అనుకుంటుంది. కానీ చివరకు రాచెస్టర్, జేన్ పట్ల తన ప్రేమను ప్రకటించి ఆమెతో వివాహానికి సిద్ధపడతాడు. జేన్‌ని ఒక అపురూపమైన యువతిగా, తన జీవితాన్ని స్వర్గధామం చెయ్యగల నెచ్చెలిగా అతను అభివర్ణిస్తాడు. జేన్ మొదట దిగ్భ్రమకు గురైనా, పరమానందం చెందుతుంది. ఇద్దరూ వివాహానికి సిద్ధమవుతారు.

ఒక అనాథగా మొదలైన తన జీవితం ఇంత ఉన్నతంగా, ఆనందప్రదంగా మారగలదని ఊహించని జేన్ ఎంతో ఉద్విగ్నతకు గురవుతుంది. అయితే, సరిగ్గా వివాహం జరగాల్సిన సమయంలో, ఒక వ్యక్తి వచ్చి, రాచెస్టర్‌కు అంతకుముందే వివాహం అయిందని, అతని భార్య బెర్తా ఇంకా జీవించి వుండగానే అతను రెండో పెళ్ళి చేసుకోవడం చట్టవిరుద్ధమనీ అంటాడు. దానితో జేన్ హతాశురాలవుతుంది. రాచెస్టర్‌ని నిలదీయగా అది నిజమేనని, ఆమె మతి చాంచల్యం గురించి చెప్పకుండా బలవంతంగా తనకు వివాహం చేశారని, తన ఇంట్లో పై అంతస్తులో ఆమె బందీగా ఉందని, ఆమె ఉన్మాదం చాలా ప్రమాదకరస్థాయిలో ఉందనీ చెప్తాడు. అప్పుడు జేన్‌కు తను విన్న వికటాట్టహాసాలు, మూలుగులు, తన గది తలుపుల వెనక ఎవరో తచ్చాడుతున్న శబ్దాలు – వీటి వెనక ఉన్న రహస్యం అర్ధమవుతుంది. రాచెస్టర్ తనకు భార్య ఉన్నప్పటికీ తను ప్రేమించింది మాత్రం జేన్‌నేనని వేడుకుంటాడు. జేన్ మాత్రం ‘భార్య పిచ్చిదైతే కావచ్చు. కానీ ఆమె బతికివుండగా అతన్ని పెళ్ళి చేసుకోవడం చట్టం సంగతేమోగానీ, నైతికంగా తప్పని’ వాదించి, రాత్రికి రాత్రి అతని ఇంటినుంచి కట్టుబట్టలతో వెళ్ళిపోతుంది.

అలా వెళ్ళిన జేన్ కొన్ని రోజుల నడక తర్వాత మూర్‍హౌస్ అనే ప్రాంతాన్ని చేరుకుంటుంది. ఇది నాలుగోదశ. అందులో నివసించే మతాధికారి జాన్ రివర్స్, అతని ఇద్దరు చెల్లెళ్ళు ఆమెను గొప్పగా ఆదరిస్తారు. అక్కడ ఉన్నంతకాలం, ఆమెకు అత్యంత ప్రశాంతంగా గడుస్తాయి. అక్కడ ఉండగానే తన అత్త, సేరా రీడ్ చివరి చూఫులకోసం కబురు చేస్తుంది. ఆమె తనని ఎంత నిరాదరించినా, జేన్ మనసు ఊరుకోక చూడ్డానికి వెళ్తుంది. తనని చిన్నప్పుడు ఏ మాత్రం పట్టించుకోని అత్త కూతుళ్ళు కూడ ఈసారి జేన్‌ని ఆప్యాయంగా పలకరిస్తారు. కొడుకు ఎందుకూ పనికిరాక, ఆస్తి తగలబెట్టడంతో, వాళ్ళ పరిస్థితి బాగా దిగజారుతుంది. అత్త మరణానంతరం జేన్ తిరిగి మూర్‍హౌస్‌కి వస్తుంది. ఈలోగా, జేన్ బాబాయి కూడ మరణించి తన యావదాస్తినీ (20 వేల పౌండ్లు) జేన్‌కి రాసినట్టు తెలుస్తుంది. ఈ సంఘటనల దరిమిలా, తను ఆశ్రయం పొందిన జాన్ రివర్స్ కుటుంబం తన కజిన్స్ అని, వారిని వదిలి కేవలం తనకే బాబాయి ఆస్తి మొత్తం రాశాడనీ గ్రహిస్తుంది జేన్. వెంటనే తన ఆస్తిలో ఆ ముగ్గురికీ తలా అయిదువేల పౌండ్లు ఇచ్చి, తన వంతుగా అయిదువేల పౌండ్లు మాత్రమే ఉంచుకుంటుంది. ఇంతకాలంగా తమకున్నంతలోనే జేన్‌ను, ఇతర పేదలను అమితంగా ఆదిరించిన ఆ ముగ్గురు ఈ అయాచిత ధనప్రాప్తితో ముగ్ధులై, జేన్ ఔదార్యాన్ని విపరీతంగా ప్రశంసిస్తారు. ఇంతకాలం తమకున్న దానిలోనే తనకు తిండి పెట్టి పోషించిన ఆ కుటుంబానికి తను ఇచ్చింది ఎక్కువేమీ కాదంటుంది జేన్. ఆ తర్వాత, జాన్ రివర్స్ మతాధికారిగా భారతదేశానికి ప్రయాణమవుతూ, జేన్‌ని తనతో రమ్మంటాడు. తనకు క్రైస్తవ మతప్రచారంతో ఏ సంబంధమూ లేదంటుంది జేన్. మతం కోసం కాదు; తన భార్యగా రమ్మంటాడు రివర్స్. తామిద్దరి మధ్యా ప్రేమ లేనపుడు, వివాహం చేసుకోవడంలో అర్థం లేదని తిరస్కరిస్తుంది జేన్. అక్కడ ఉన్న చివరిరోజున రాత్రి రాచెస్టర్ కంఠస్వరం తనని పిలుస్తున్నట్టుగా అనిపించి, అలజడి చెందుతుంది జేన్. ఇక అక్కడ ఉండలేకపోతుంది.

ఆమె జీవితంలోని అయిదో అధ్యాయం ఇక్కడ మొదలవుతుంది. జేన్ తిరిగి థార్న్‌ఫీల్ద్‌కి వస్తుంది. అక్కడికి వచ్చేసరికి, ఆ యింటి పనివాళ్ళు జేన్‌ని చూసి పరమానందభరితులవుతారు. ఆ భవనంలో ఎక్కడా ఇంతకు మునుపు వైభవం లేదు. ఇల్లంతా కాలిపోయింది. అందరూ ఒక చిన్న పోర్షన్‌లో ఉంటున్నారు. ఆ ఇంట్లో హౌస్ కీపర్‌గా ఉన్న మిస్ ఫెయిర్‍ఫాక్స్, జేన్ ఇల్లు వదిలివెళ్ళిన తర్వాత జరిగిన ఘోరం చెపుతుంది. జేన్ తనని వదిలి వెళ్ళడంతో, రాచెస్టర్ స్థిమితం కోల్పోయి, పార్టీలు, స్నేహితులను వదిలి, పూర్తిగా ఒంటరివాడైపోయాడు. ఆ సమయంలో భార్య బెర్తా తీవ్ర ఉన్మాద స్థితికి చేరుకుని ఇల్లు తగలబెట్టింది. రాచెస్టర్ ఆమెను రక్షించడానికి వెళ్ళి, కళ్ళు కాలి, తన చూపు కోల్పోయాడు. బెర్తా అతన్ని తప్పించుకుని, మేడమీద నుంచి దూకి చనిపోయింది.

రాచెస్టర్ ఆస్తిని కోల్పోయాడు. లంకంత కొంప కాలిపోయింది. ఏ పని స్వయంగా చేసుకోలేడు. ఇలా పనివాళ్ళ పుణ్యమాని దినదినగండంగా జీవిస్తున్నాడు. ఇదంతా విని మ్రాన్పడిపోతుంది జేన్. వెంటనే రాచెస్టర్ వద్దకు వెళ్ళి, అతనికి తను శాశ్వతంగా వచ్చేశానని చెబుతుంది. రాచెస్టర్ ఆనందానికి అవధుల్లేవు. వాళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు. ఇంతకాలం రాచెస్టర్ ధనవంతుడు. ఇప్పుడు అతను నిరుపేద. తన ఆస్తితో జేన్ ధనవంతురాలు. ఆమె ధనంతో ఇద్దరూ ఆనందంగా జీవిస్తారు. కొంతకాలం తర్వాత ఒక ఆపరేషన్‌తో రాచెస్టర్‌కు కొంతవరకు చూపు వస్తుంది. వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఇద్దరూ తమ జీవితాన్ని పర్యాలోకనం చేసుకుంటూ, ఆనందంగా ఉంటారు.


షార్లట్ బ్రాంటీని గురించి విమర్శకులు ‘first historian of the private consciousness’ అని వర్ణించారు. మార్సెల్ ప్రూస్ట్ (Marcel Proust), జేమ్స్ జాయ్స్ (James Joyce) వంటి చైతన్యస్రవంతి శిల్పప్రవర్తకులకు ఆమె ఆద్యురాలని కూడ అన్నారు. దానికి కారణం జేన్ అంతరంగంలోకి పాఠకుడు నిరంతరప్రయాణం చేయడం. ఉత్తమ పురుష కథనం కొత్త కాకపోయినా, దాన్ని కేవలం కథ చెప్పడం కోసం కాక, నాయిక అంతరాంతరాల్లోని ప్రతి అంశాన్నీ ఆవిష్కరించడం రచనలో షార్లట్ సాధించిన ఘనవిజయమని చెప్పవచ్చు.

జేన్ ఐర్ అనే ఏ అండా లేని అమ్మాయి, తన వ్యక్తిత్వం ద్వారా ఎలా జీవితాన్ని చక్కదిద్దుకున్నదీ చెప్పే కథ ఇది. జేన్‌లో ఉన్న ప్రధానమైన గుణం ఎటువంటి పరిస్థితుల్లోనైనా, తన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్నీ కోల్పోకపోవడం. ఎంత గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళతోనైనా తన మనసులో మాట నిక్కచ్చిగా చెప్పడం. మనసుతో కంటే బుద్ధితో జీవించే గుణం. అందుకే ఈమె ఆ కాలం నాటి కథానాయికల కంటే భిన్నంగా ఉంటుంది.

పదేళ్ళ వయసులో అత్త దగ్గర్నుంచి, తనని ఆదుకున్న ప్రీస్ట్ జాన్ రివర్స్ వరకూ జేన్‌ను కలిసినవారందరూ ఆమె కంటే వయసులో, సామాజిక హోదాలో, సంపదలో ఉన్నతులే. అందరూ ఏదో రకంగా ఆమెను నియంత్రించాలని, కనీసం ప్రభావితం చెయ్యాలనీ చూసేవారే. అందరూ దురుద్దేశంతోనే కాదు. చాలామంది ఆమె పట్ల సానుభూతితో, ప్రేమతోనే. కానీ మొదట్నుంచీ కూడ జేన్ ఎవరికీ తలవంచే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తుంది. మంచయినా, చెడు అయినా తన జీవితానికి తనే కర్తనని భావించిన అరుదైన యువతి జేన్.

రాచెస్టర్ పరిచయమైన కొత్తల్లో జేన్ అతనితో చెప్పిన ఈ మాటలు ఆమె వ్యక్తిత్వాన్ని నిరూపించేవి: I do not think, sir, you have a right to command me, merely because you are older than I, or because you have seen more of the world than I have; your claim to superiority depends on the use you have made of your time and experience.

నిజానికి జేన్ తనని గౌరవించుకున్నంతగా మరొకరిని గౌరవించలేదు. తన ఆనందానికి ఇతరులు అవసరం లేదనుకునే అసాధారణమైన వ్యక్తిత్వం ఆమెది. ఆత్మగౌరవాన్ని అమ్ముకునే ఆనందం తనకు అక్కర్లేదని ఎంతగానో ప్రేమించిన రాచెస్టర్‌కు చెప్పడం దీనికి ఉదాహరణ: I can live alone, if self-respect, and circumstances require me so to do. I need not sell my soul to buy bliss. I have an inward treasure born with me, which can keep me alive if all extraneous delights should be withheld, or offered only at a price I cannot afford to give.

‘నా సంతోషం కోసం నా ఆత్మను అమ్ముకోలేను. నాలో అంతర్గతంగా ఒక నిధి ఉంది. బయటి ప్రపంచం ఇచ్చే ఆనందాలన్నీ ఆగిపోయినా, అది నన్ను బతికిస్తుంది’ అనడానికి ఎంతో ఆత్మవిశ్వాసం కావాలి. అందులోనూ, 19వ శతాబ్ది సమాజంలో ప్రేమ, పెళ్ళి వంటి అనుభవాలను కోరుకునే యువతుల యుగంలో ఇలాంటి అమ్మాయి పాత్ర నిజంగా అరుదైనదే.

తనను దేవతగా అభివర్ణిస్తున్న రాచెస్టర్‌తో జేన్ అంటుంది: I am not an angel,’ I asserted; ‘and I will not be one till I die: I will be myself.’ నేను చనిపోయిన తర్వాత దేవతని అవుతానేమోగానీ, బతికుండగా కానని అతని పొగడ్తలను తిప్పికొడుతుంది. అలాంటి విలక్షణమైన మనస్తత్వం జేన్‌ది.

జేన్ పాత్రను విశ్లేషించడం అంత సుళువుకాదు. ఆమెలో చిన్నప్పటినుంచి అణచివేసిన ఆగ్రహం, వద్దన్నా తోసుకువచ్చే తిరుగుబాటు, ఇష్టంలేని పరిస్థితులనుంచి తప్పించుకోవాలన్న ఆరాటం కనిపిస్తాయి. అత్త, ఆమె కూతుళ్ళు తనని చీదరించుకున్నప్పుడు, తన కర్మ అని సరిపెట్టుకోదు. తిండి పెడుతున్నారు కదా అని మిన్నకుండదు. తన హక్కుల గురించి మాట్లాడుతుంది. తనను మనిషిగా చూడకపోతే అనుభవిస్తారని శపిస్తుంది. తన జీవితంలోని ప్రతిదశ నుంచి తర్వాతి దశ ఒక ప్రయాణం. అత్త ఇంటి నుంచి లావుడ్ స్కూలు, లావుడ్ నుంచి థార్న్‌టన్. అక్కడిదాకా ఆమె ఎంచుకున్న గమ్యాలు కావు కానీ ఆమె ఆశతో చేసిన ప్రయాణాలు. థార్న్‌టన్ నుంచి వెళ్ళిపోవడం, తర్వాత మూర్‍హౌస్ నుంచి తిరిగి థార్న్‌టన్‌కి వెళ్ళడం తను ఎంచుకున్న ప్రయాణాలే. ఈ ‘ప్రయాణాల వల్లే ఈ నవలను, ఛాసర్ (Chauser) రాసిన పిల్‍గ్రిమ్స్‌ ప్రోగ్రెస్ నవలతో పోల్చారు కొందరు.

రాచెస్టర్‌తో అనుబంధం

ఈ నవల ప్రేమ కథా, లేక ఒక అమ్మాయి పరిణతివైపు సాగించే ప్రయాణం కథా? అన్న విషయంపై విమర్శకులకు భేదాభిప్రాయాలున్నా, రెండూ నిజమే. జేన్ ఐర్ సుళువుగా ప్రేమలో పడే రకం కాదు. మగవాడి ప్రేమలో ఆకర్షణ, అనురాగం కంటే గౌరవాన్ని కోరుకుంటుంది. రాచెస్టర్ అందుకే ఆమెకు నచ్చాడు. తన కంటె ఇరవై ఏళ్ళు చిన్నదైన జేన్‌ని అతను ఏనాడూ చిన్నపిల్లగా చూసి, కొట్టిపారేయడు. ‘నేను అందంగా ఉండనా’ అంటె ‘మీరు వికారంగా ఉంటారు’ అని నిక్కచ్చిగా చెప్పగలిగిన జేన్‌తో అతని అనుబంధం అపురూపమైందే. తన మనసులోని మాటలు, ఇతరుల పట్ల తన వైఖరులు అన్నీ జేన్‌తో పంచుకుంటాడు. కానీ వయసులో, అనుభవంలో, హోదాలో అతను ఉన్నతుడు. ఆ స్పృహ జేన్‌కి ఉంటుంది. నవల చివరకి వచ్చేసరికి, పరిస్థితి తారుమారైంది. అతని హోదా, సంపద పోయాయి. ఆమెకు సంపద వచ్చింది. అతని ఆరోగ్యం దెబ్బతింది. ఆమె చేయూతనిచ్చింది. అతని పురుషాహంకారం చచ్చిపోయింది. ఆమె గౌరవాభిమానాలే అతనికి ప్రాణం పోశాయి. జేన్ కోరుకున్న సామాజిక సమానత్వం కూడ ఆమెకు దక్కింది. అంతకుముందే రాచెస్టర్‌ని పెళ్ళి చేసుకునివుంటే జేన్ ఆనందంగా ఉండేదో లేదో? కానీ ఇప్పుడు తన మీద ఆధారపడిన రాచెస్టర్‌తో మాత్రం ఖచ్చితంగా ఆనందంగా జీవించగలదు.

రాచెస్టర్ సగటు మగవాడే

19వ శతాబ్ది నవలానాయకులందరిలా పరపతి, సంపద, పురుషాహంకారం, అసంఖ్యాకంగా ప్రియురాళ్ళు ఉన్న రాచెస్టర్ గొప్ప వ్యక్తి కాడు. జేన్ పైన ప్రేమ కలిగే వరకూ అతను సగటు మగవాడే. అతని భార్య బెర్తాను తొలుత ఆకర్షణతోనే వివాహం చేసుకుంటాడు. కానీ పెళ్ళయిన తర్వాతే ఆమె మతి చాంచల్యం విషయం తెలుస్తుంది. ఆమె కుటుంబం దాన్ని దాచిపెడుతుంది. తెలిసిన వెంటనే ఆమెకు సంకెళ్ళు వేసి మరీ గదిలో బంధిస్తాడు. ఒక్క గ్రేస్ అనే ఆయా తప్ప ఎవరూ ఆ గది దరిదాపులకు వెళ్ళరు. 19వ శతాబ్దిలో (అప్పటికింకా మానసిక రుగ్మతల అధ్యయనం జరగలేదు) మతిచలించిన వ్యక్తులను బహిష్కరించే పద్ధతినే అతనూ పాటించాడు. అయితే ఆ విషయం కప్పిపెట్టి, ముందు బ్లాన్ష్ అనే అందమైన ధనవంతురాలితో ప్రేమనాటకం సాగిస్తాడు. ఆమెను వివాహం చేసుకుంటాడని అందరూ అనుకోవడం సహజంగానే జరుగుతుంది. దాన్ని బలపరచడు; తిరస్కరించడు. ఈ రెండు అనుబంధాలూ కాక, ఎప్పుడో తను సంబంధం పెట్టుకున్న ఒక నాట్యగత్తె కూతురు అడెల్‍కి తన ఇంట్లో ఆశ్రయమైతే ఇస్తాడు కానీ తన కూతురిగా పరిగణించడు. ఎవరి దగ్గరా ఒప్పుకోడు. ఇవన్నీ రాచెస్టర్‌ని మామూలు మగవాడిని చేసే సంఘటనలే. ఒక్క జేన్ దగ్గర ఆ మనిషి మరో మనిషైపోతాడు. ఆమెను తనకు సమానురాలిగా చూస్తాడు. ఆమె తెలివితేటలు, ఇతరులను అర్థం చేసుకోగల ఔన్నత్యం, ఎవరికీ భయపడని తెంపరితనం, తన మనసు తనకు తెలిసిన స్పష్టత అతనికి కొత్త. ఇలాంటి అమ్మాయిని అతనెప్పుడూ ఎరగడు. కానీ, తను అంత గౌరవించిన జేన్‌కి కూడ భార్య విషయం చెప్పకుండా, ఆమె జీవించి వుండగానే రెండో పెళ్ళి చేసుకోడానికి సిద్ధపడతాడు.

ఈ సన్నివేశంలో జేన్ ప్రతిస్పందన ఆమె వ్యక్తిత్వాన్ని నిరూపిస్తుంది. తనకూ కొన్ని నమ్మకాలు, విలువలు ఉన్నాయి. పెళ్ళయి, భార్య సజీవంగా ఉన్న పురుషుడిని వివాహం చేసుకోవడం ఆ విలువలకు విరుద్ధం. తమ ప్రేమ ఎంత బలమైనదైనా తన అంతరాత్మ అందుకు అంగీకరించదు. ఈ నిర్ణయం తీసుకోడానికి ఆమెకు ఎలాంటి ప్రోద్బలం లేదు. రాచెస్టర్ అన్నట్టు ఆమెను విమర్శించే సమాజం లేదు. బాధపడ్డానికి, నిలవరించడానికీ ఆమెకు కుటుంబం లేదు. మరి ఎవరికి భయపడి వద్దంటోంది? తన ప్రేమను వదులుకుంటోంది? అన్నది అతని ప్రశ్న. జేన్‌కి ప్రమాణం ఆమె మనసే. ఆమె నమ్మిన సిద్ధాంతాలే. అందుకే అతన్ని నిర్దాక్షిణ్యంగా తోసేసి వెళ్ళిపోతుంది.

జేన్ లోని, సమానత్వం కోరుకునే ఆధునిక మనస్తత్వాన్ని ఫెమినిస్టులు మెచ్చుకున్నా, భార్యను, ఇతర స్త్రీలను అగౌరవంగా చూసిన రాచెస్టర్‌ని ఆమె ఎలా ప్రేమించగలిగిందనే సందేహం ఇప్పటి విమర్శకులకు రాక మానదు. అలాగే, అన్నీ సక్రమంగా ఉన్నపుడు అతన్ని తిరస్కరించిన జేన్, అతనికి తను అవసరంగా మారి, తన మీద ఆధారపడే దశ చేరుకోవడం వల్లే అతన్ని పెళ్ళి చేసుకుందంటే ఇక్కడ పని చేసింది ఆమెలోని జాలా లేక ప్రేమా? అతను ఈ స్థితికి వచ్చాక, ఇప్పుడు తను అతనితో సమానమైనట్టు భావించుకుందా? ఇలాంటి చర్చలకు కూడ ఈ పాత్రలు అవకాశమిస్తాయి.

మత వ్యతిరేక నవలా?

జేన్ ఐర్ నవల వచ్చిన కొత్తల్లో ఎదుర్కొన్న మరో విమర్శ ఈ రచనంతా ‘ఆంటీ క్రిస్టియన్ సెంటిమెంట్‌’తో కూడుకుందని. క్రైస్తవ మత వ్యతిరేక భావనలు అని స్పష్టంగా చెప్పడానికి ఏవీ లేకున్నా, జేన్ ఏనాడూ ఒక అతీత శక్తిని ప్రార్ధించకపోవడం, తనకు మంచి జరిగినపుడు ‘దేవదేవుడికి’ కృతజ్ఞత చెప్పుకోకపోవడం, తన జీవితమంతా తన చేతుల్లోనే ఉందని వాదించడం – ఈ రచనను క్రైస్తవమత వ్యతిరేకం చేశాయి. మానవజీవితం భగవద్దత్తమని, మన మంచి చెడ్డలు ఆయనే చూస్తాడనీ నమ్మే సమాజంలో, ‘నా జీవితానికి నేనే కర్తను; దాన్ని బాగుచేసుకున్నా, చెడగొట్టుకున్నా అది నా పనే’ అని ధీమాగా ప్రకటించిన కథానాయికను ‘భరించడం’ కొందరికి కష్టమైంది.

దానికి తోడు, క్రైస్తవ మతాధికారి అయిన జాన్ రివర్స్‌ని బలహీనుడిగా, ప్రేమకు అర్హం కానివాడిగా చూపడం కూడ బహుశా విమర్శకులకు కోపం తెప్పించివుంటుంది. అతని గురించి భారతీయ పాఠకులకు ఆసక్తికరమైన విషయం – భారత దేశానికి వెళ్ళడం కోసమని అతను హిందుస్తానీ భాషను కష్టపడి నేర్చుకోవడం. జేన్‌కి కూడ నేర్పడం. జేన్‌ని పెళ్ళి చేసుకుంటానని అడిగినపుడు, తనని ప్రేమిస్తున్నాడా అని అడుగుతుంది జేన్. లేదంటాడు. తను కూడ అతన్ని ప్రేమించడం లేదు కనక పెళ్ళి ఎందుకని అడుగుతుంది. అతనితో భారతదేశానికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది కానీ, భార్యగా మాత్రం రాలేనని అంటుంది. తోడుగా వస్తానంటుంది. అలాంటి జేన్‌ని అతను విపరీతమనే భావిస్తాడు.

ఒకరకంగా చూస్తే, సంప్రదాయ వ్యతిరేకతను అణువణువునా ప్రకటించే జేన్‌లో కూడ, ఆమె పరిచయస్తుల దృష్టిలో బహుశా ‘ఉన్మాదమే’ ఉంది. రాచెస్టర్ భార్యలో ఉన్న ఉన్మాదం శారీరక స్థితికి సంబంధించినదైతే, జేన్‌లో ఉన్నది తాత్వికమైన ఉన్మాదం కావచ్చు.

ఈ నవల ప్రేరణతోనే సుప్రసిద్ధ ఫెమినిస్టు విమర్శకులు శాండ్రా గిల్బర్ట్, సూజన్ గూబర్ ‘ఇంగ్లీషు నవలల్లో స్త్రీ పాత్రల’ గురించి రాసిన తమ పుస్తకానికి ది మాడ్ విమెన్ ఇన్ ది ఆటిక్ (The Mad woman in the Attic) అన్న పేరు పెట్టారు.

ఉత్తమపురుష కథనం

కథంతా జేన్ దృష్టినుంచే చెప్పడం వల్ల. ఆమెకు నచ్చిన వాళ్ళు మనకు నచ్చడం, ఆమెకు నచ్చని వాళ్ళు మనకూ దుర్మార్గులుగా కనబడ్డం సహజం. తక్కినవాళ్ళ విషయంలో అది నిజమేకాని రాచెస్టర్ విషయంలో మాత్రం పాఠకుడు జేన్ దృష్టిని అధిగమించి స్వంతంగా అంచనా వేయగలుగుతాడు. రాచెస్టర్ తన భార్యని అమానుషంగా కట్టివేసినందుకు జేన్ తప్పుపట్టదు. చివర్లో ఆమెను రక్షించబోయి తన కళ్ళు కాలి, అంధుడైనందుకు గౌరవిస్తుంది తప్ప, అంతకుముందువరకు భార్య పట్ల అతని ప్రవర్తనను విమర్శించదు. అడెల్ తన కూతురని ఒప్పుకోనందుకూ, బ్లాన్ష్‌కి పెళ్ళి చేసుకుంటానని ఆశ పెట్టినందుకు కూడ అతన్ని ఏమీ అనదు. కానీ పాఠకులకు మాత్రం రాచెస్టర్ లోని ఈ లోపాలు స్పష్టంగానే తెలుస్తూంటాయి. ఇది జేన్ లోని లోపాలేనా? రాచెస్టర్ పట్ల ప్రేమ వల్ల ఈ విమర్శలు చెయ్యలేదా అని ఆలోచిస్తే, నిజానికి నవలంతటా జేన్ ఎవరి మీదా తీర్పులు చెప్పదు. తనని తాను చూసుకున్నంత జడ్జ్‌మెంటల్‍గా ఇతరులను చూడదు. తనను బాధపెట్టిన మేనత్తతో సహా ఎవరిమీదా కక్ష పెట్టుకోదు. ఎన్ని పొరలు విప్పినా ఇంకా పొరలు ఉండిపోయే పాత్ర జేన్ ఐర్‌ది.

I am no bird; and no net ensnares me: I am a free human being with an independent will అని ప్రకటించుకున్న జేన్ ఐర్, విశ్వసాహిత్యంలోని నవలల్లోనే మరపురాని సజీవపాత్ర. ఈ నవలను అత్యంత పఠనీయంగా రాసిన షార్లట్, ముగ్గురు అక్కచెల్లెళ్ళలోకీ తనదైన గొప్ప శైలితో ఆకట్టుకుంటుంది.


సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...