విశ్వమహిళానవల: 7అ. దె స్టాఎల్ ‘కొరీన్’

‘In this country we are more modest; we are neither self-satisfied like the French nor proud of ourselves like the English. All we ask of foreigners is a little indulgence…’

తన తెలివికి, అందానికి, సంపదకు, సృజనాత్మకతకూ యావద్దేశం అంజలి ఘటిస్తున్నా, వాటి కంటే తను ఇటాలియన్ అయినందుకు ఎక్కువ గర్వపడే అరుదైన కథానాయిక కొరీన్. ‘నాకు ఇంగ్లీష్ వచ్చినా, ఇటాలియన్‌లో మాట్లాడ్డానికే ఇష్టపడతాను’ అని బ్రిటిష్ ప్రియుడితో నిర్మొహమాటంగా చెప్పేసిన మాతృభాషా ప్రేమికురాలు కొరీన్. ఇటలీ స్త్రీల జీవితాలతో మతం (కెథాలిసిజమ్) అనివార్యంగా ముడిపడి వుంటుందని, ఆ మతంలోని త్యాగం, ప్రేమ అనే గుణాలే తననీ నడిపిస్తాయనీ నమ్మిన నాయిక కొరీన్. ఆ కొరీన్ కథను అద్భుతంగా ఆవిష్కరించింది మదామ్ దె స్టాఎల్.

మదామ్ దె స్టాఎల్ రాసిన రెండు సుప్రసిద్ధ నవలలు కొరీన్ లేదా ఇటలీ (Corinne ou l’italie), డెల్ఫీన్ (Delphine). రెండూ స్త్రీ ప్రధాన నవలలు. ప్రణయం ప్రధాన వస్తువైన నవలలు, విషాదాంత ప్రేమగాథలు. మొదటినుంచీ యూరప్ సాహిత్యంలో స్త్రీలు రాసిన నవలలన్నీ ప్రణయగాథలే. కానీ మదామ్ దె స్టాఎల్ నవలలు విషాదప్రేమగాథలు కావడంతో పాటు, అలా విషాదాంతాలు కావడానికి కారణాలు ఇతర నవలలకంటే భిన్నంగా ఉంటాయి. అపార్థాలు, విరహాలు, వియోగాల కథలు కావివి. వీటిలో ఆమె ఆత్మచరిత్రాత్మకత ఉంటుంది. కనక, అనివార్యంగా రాజకీయం ఉంటుంది. తన ప్రణయజీవితఘట్టాల్లోని అంశాలను, తను ప్రేమించిన పురుషులను కొంత మార్చి, లేదా ఇద్దరు ముగ్గుర్ని ఒకరిలో కలిపి పాత్రల్ని తయారు చేసింది మదామ్ దె స్టాఎల్.

1807లో ప్రచురింపబడిన కొరీన్ ఆమెకు విశేషఖ్యాతి తెచ్చిన నవల. ఇందులోని ఇటాలియన్ యువతి కొరీన్, ఇంగ్లిష్ రాజవంశీకుడు లార్డ్ ఆస్వాల్డ్ నెల్విల్‌ల ప్రణయం మొదలైనప్పటినుంచీ విషాదాంతం కాగలదనే సూచనలున్నాయి. ప్రాచీన కావ్యాల్లోని నాయికా నాయక లక్షణాలు వీళ్ళిద్దరిలో పుష్కలంగా ఉన్నాయి. సౌందర్యం, ఆభిజాత్యం, సాహసం, ఔదార్యం, విషయ పరిజ్ఞానం, తెలివితేటలు, ప్రేమించే మనసు… ఇలా సర్వలక్షణసంశోభితులే ఇద్దరూ. తొలి దృశ్యంలోనే తండ్రి మరణం వల్లకలిగిన ఆవేదనతో దేశం (ఇంగ్లండ్) వదిలి దేశదిమ్మరిలా తిరుగుతూ వచ్చిన లార్డ్ ఆస్వాల్డ్ నెవెల్, వీరోచితంగా ఖైదీలను అగ్ని ప్రమాదం నుంచి రక్షించడంతో కథ ప్రారంభమవుతుంది.

తండ్రి మరణంతో కుంగుబాటుకు గురైన అతనికి ఈ వీరోచిత చర్యతో స్తబ్దత వదులుతుంది. ఆ తర్వాత మిత్రుడి ప్రోద్బలంతో ఇటలీకి వెళ్ళడంతో కథ పాకానపడుతుంది. అక్కడ మొదటిసారి, అందరికీ ఆరాధ్యదేవత అయిన పాతికేళ్ళ కొరీన్‌ని చూస్తాడు. బహిరంగ సభలో ఆమెను వేదికపై, ఆస్థాన రచయిత్రిగా నియమింపబడిన సందర్భంలో తొలిసారి చూశాక, క్రమంగా ఇద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. రోమ్ నగరాన్ని ఇద్దరూ కలిసి చూసిన క్రమంలో స్నేహం ఏర్పడుతుంది. నవలలో అధికభాగం వీళ్ళిద్దరి మధ్య సంభాషణలే. అయితే అవి ప్రేమ సల్లాపాలు కావు. చరిత్ర, సంస్కృతి, కళలు, దేశాల మధ్య అంతరాలు, రాజకీయ పరిణామాలు – ఇవీ వారి సంభాషణలు. అతను బ్రిటిష్ సంస్కృతికి ప్రతినిధి; ఆమె ఇటలీ సంస్కృతికి ప్రతినిధి. కానీ ఇద్దరిలోనూ సమ్మిశ్రిత సంస్కృతి ఉంది. ఆస్వాల్డ్ సగం స్కాటిష్, సగం బ్రిటిష్. కొరీన్ సగం బ్రిటిష్, సగం ఇటాలియన్.

ప్రచురణ కాలం ఇటలీ ఫ్రాన్స్ అధీనంలోకి వచ్చిన తర్వాతే అయినా కథాకాలం 18వ శతాబ్ది చివర్లోది. తన మీద తను పట్టు కోల్పోయి, తన జాతీయతను కోల్పోయి, త్వరలోనే (1805) నెపోలియన్ పెత్తనం కిందికి రాబోతున్న దేశం అప్పటి ఇటలీ. ఈ చారిత్రక పరిణామాన్ని దగ్గర్నుంచి చూసిన మదామ్ దె స్టాఎల్ కొరీన్ వాదనల ద్వారా ఇటలీ వైభవాన్ని గుర్తు చేస్తుంది. అలాంటి ప్రాభవాన్ని కోల్పోయి ఫ్రాన్స్ ఆధిపత్యంలోకి చేరుకునే దుస్థితికి ఇటలీ చేరుకోవడంలోని విషాదాన్ని ఈ నవల చెబుతుంది. కానీ రాజకీయాల ప్రసక్తితో కాదు; కేవలం పాత్రల వ్యక్తిగత జీవిత చిత్రణ ద్వారానే. ఈ పరిస్థితిలో ఇటలీకి ఉన్న సుదీర్ఘ చరిత్రను, సంస్కృతిని గుర్తు తెచ్చుకుంటూ, ఆ పునర్వైభవం వస్తే బాగుండునన్న ఆకాంక్షను వ్యక్తం చేసే కొరీన్ సంభాషణలు నవలకు హైలైట్ అని చెప్పొచ్చు. ఒక రకంగా ఒక దేశం తన జాతీయతను కోల్పోతున్న నేపథ్యంలో, జాతి, జాతీయత అన్న పదాలను చర్చించిన తొలి నవలారచయిత్రిగా మదామ్ దె స్టాఎల్ నిలబడింది.

రెండు వేర్వేరు సంస్కృతులకు చెందినవారు పరస్పరం ఆకర్షితులవుతున్నప్పుడు వారిద్దరిలో కలిగే సందిగ్ధతను రచయిత్రి అపూర్వంగా పట్టుకోగలిగింది. బ్రిటిష్ సమాజంలో సంప్రదాయానికి లోబడి ఉండడం స్త్రీల లక్షణం. ఇటలీ, ఫ్రాన్స్ లలో స్త్రీలు మరికొంత స్వేచ్ఛగా ఉంటారు. అందువల్ల బ్రిటిష్ పురుషులకు వారుకొంత ‘అనుమానితులే’. కొరీన్ ఆస్వాల్డ్‌తో, ‘26 ఏళ్ళు నిండిన నాకు ప్రేమ అనే భ్రాంతి అసలు కలగనేలేదని బుకాయించలేను. కానీ నాకు నచ్చిన, నన్ను అర్థంచేసుకునే మగవాడు మాత్రం తటస్థించలేడని చెప్పగలను’ అన్నపుడు లార్డ్ నెల్విల్ మనసులో అనుకుంటాడు: ‘She is the most entrancing of women, but she is an Italian and she has not the innocent heart, unknown to itself, which, I am sure, belongs to the young English woman whom my father intended for me.’ బ్రిటిష్ స్త్రీలలో ఉండే ‘అమాయకత్వం’ ఇటాలియన్ స్త్రీలో ఉండడం అసంభవమని అతని అభిప్రాయం! అందుకే, కొరీన్‌ని ప్రేమించినా, తండ్రి తనకు నిర్ణయించిన లుసీల్‌నే చివరకు వివాహం చేసుకుంటాడు.

అయితే ఇదంత వేగంగా జరగదు. వీళ్ళిద్దరూ కలిసి ఇటలీలో రోమ్, ఫ్లారెన్స్, వెనీస్ పట్టణాలను సందర్శించడం, అక్కడ ప్రదర్శనశాలలు, నాటకాలు, సంగీత కచ్చేరీలకు హాజరవడం, ఇటాలియన్ సంస్కృతి, కళల గురించి ఎప్పటికప్పుడు కొరీన్ చెప్పే వివరణలతో ఆస్వాల్డ్ ముగ్ధుడవడం కొన్ని అధ్యాయాల్లో రచయిత్రి చిత్రిస్తుంది. ఈ సన్నివేశాల్లోని సౌందర్యం ఎక్కడుందంటే, ఇద్దరూ తమ వేర్వేరు నేపథ్యాల వల్ల, పెరిగిన పరిసరాల ప్రభావం వల్ల ఒకేలా స్పందించలేకపోయినా, క్రమంగా ఒకరి ఆలోచనలు, ప్రతిస్పందనలను తమలో లీనం చేసుకుని, ఒకరు మరొకరిలా తయారవడం. మనసా, వాచా ప్రేమించుకున్నపుడు, ప్రేమలో స్నేహం, గౌరవం ఉన్నపుడు ఆ ఇద్దరూ కొంతకాలానికి ఒకేలా తయారవుతారన్నదానికి గొప్ప ఉదాహరణలు కొరీన్, ఆస్వాల్డ్. నవలంతటా వీరి సంభాషణల్లో కనిపించే ఇద్దరి మనస్తత్వాల్లోని వైరుధ్యం – అన్నిటిలోనూ ‘నీతి’ని వెతికే ఆస్వాల్డ్ అన్వేషణ, నిజమైన వైభవంలో, అనుభవంలో ‘నీతి’ ప్రమేయం అనవసరమన్న కొరీన్ దృక్పథం. రోమ్ నగరాన్ని వర్ణిస్తున్నపుడు అతనితో ‘దాని పతనంలోనూ గొప్ప సౌందర్యముందని’ అంటుంది.

ప్రణయ సంబంధాల్లో కలిగే అపార్థాలకు ఈ నవల అతీతం కాకపోయినా, వీళ్ళిద్దరి ప్రేమ చివరివరకూ విడదీయరాని బంధంగా ఉండిపోడానికి కారణం ఆకర్షణ ఎంత మాత్రం కాదని రచయిత్రి నిరూపిస్తుంది. ఇద్దరి మధ్య ఎమోషనల్ కంపాటిబిలిటీతో పాటు, ఇంటలెక్చువల్ కంపాటబిలిటీని చూపించడంలో సఫలమైంది మదామ్ దె స్టాఎల్. ‘What is happiness? Is it not the development of our talents?… Ought not every woman, every man, to make a way for herself according to her nature and talents?’ అని స్పష్టంగా, నిర్భయంగా చెప్పిన కొరీన్‌ని ఇటలీ సమాజం గౌరవించింది. ఆరాధించింది. బ్రిటన్ వంటి కన్జర్వేటివ్ సంస్కృతికి చెందిన లార్డ్ నెవెల్ (ఆస్వాల్డ్) మనస్ఫూర్తిగా ప్రేమించాడు. ఇలాంటి స్వేచ్ఛ, సమానత్వం ఫ్రెంచ్ విప్లవం తనకు నేర్పిందని మదామ్ దె స్టాఎల్ అంతకుముందే ప్రకటించింది. Who can live, who can write at the present moment, without feeling and reflecting upon the revolution of France? అని ఎన్నోసార్లు ప్రకటించిన మదామ్ దె స్టాఎల్, ఆ విప్లవ సందేశాలను తరచు తన సృజనాత్మక రచనల్లోనూ చిత్రించింది. ఆమె రాసిన రెండు నవలల్లోనూ ఈ స్ఫూర్తి కనిపిస్తుంది.

కొరీన్‌తో ఆస్వాల్డ్ వివాహ నిర్ణయాన్ని ప్రకటించాలనుకున్న దశలో, తన దేశావసరాల కోసం ఒక సంవత్సరంపాటు ఆస్వాల్డ్ తిరిగి బ్రిటిన్‌కు రావాల్సివస్తుంది. ఇద్దరికీ అది భరించలేని వియోగమే. కానీ ఆ సంవత్సరం వారి జీవితాన్ని మార్చేస్తుంది. అతను తిరిగి వచ్చేనాటికి బాల్యంలో తను బాగా ఎరిగిన, లేడీ ఎడ్గర్‌మాండ్, ఆమె కూతురు లుసీల్ అతని జీవితంలో ప్రవేశిస్తారు. తన తండ్రి స్నేహితురాలైన లేడీ ఎడ్గర్‌మాండ్‌కు లూసిల్ స్వంత కూతురు కాగా, ఆమె భర్త తొలి ప్రియురాలి కుమార్తె కొరీన్. ఈ విషయం ఆస్వాల్డ్‌కు అర్థమై హతాశుడవుతాడు. కొరీన్ తండ్రి బ్రిటిష్ వ్యక్తి అని తెలుసు కాని, అతనే లుసీల్ తండ్రి కూడా అని అతనికి అప్పటిదాకా తెలీదు. తన భర్త మరణించగానే, ఇటాలియన్ స్త్రీకి జన్మించిన కొరీన్ ప్రభావం తన సంసారంపై, కూతురిపై పడకూడదని లేడీ ఎడ్గర్‌మాండ్ ఎవరికీ తెలీకుండా ఆ అమ్మాయిని ఇటలీకి పంపేస్తుంది. అయితే ఆస్తి విషయంలో ఆమె పట్ల ఏ మాత్రం అన్యాయం చెయ్యదు. భర్త ఆస్తిలో కొరీన్‌కు రావలసిన వాటాని ఇచ్చేస్తుంది. అయితే మార్గమధ్యంలో నౌకాప్రమాదం జరిగి కొరీన్ సముద్రంలో మునిగి మరణించిందని బ్రిటన్ లోని మిత్రులందరికీ అబద్ధం చెబుతుంది. లుసీల్ కూడ తన అక్క మరణించిందనే నమ్ముతుంది. ఆస్వాల్డ్ అమితంగా ఆరాధించే అతని తండ్రి చనిపోయేముందు లేడీ ఎడ్గర్‌మాండ్‌కు రాసిన లేఖలో ‘మొదట్లో నేను కొరీన్ నా కొడుకుకు సరైన జోడీ అనుకున్నాను. కానీ తను పూర్తిగా తల్లి సంస్కృతిని అలవరచుకుంది. అంటే ఇటాలియన్ స్త్రీలోని స్వేచ్ఛాపిపాస, సంప్రదాయ వ్యతిరేకత ఆ అమ్మాయిలో ఉన్నాయని క్రమంగా అర్ధమవుతోంది. కనక నీ కూతురు లుసీల్‌ను ఆస్వాల్డ్ పెళ్ళి చేసుకోవాలని నా కోరిక’ అని రాస్తాడు. ఆ ఉత్తరాన్ని ఆమె ఆస్వాల్డ్‌కి చూపుతుంది. అప్పటినుంచీ ఆస్వాల్డ్ కొరీన్‌ని లుసీల్‌నీ పోల్చడం మొదలుపెడతాడు.

లుసీల్ చాలా అందగత్తె. అమాయకురాలు, ప్రాపంచిక జ్ఞానం శూన్యం. కానీ కొరీన్‌ గొప్ప విజ్ఞాన ఖని. ఆమెతో ప్రణయసల్లాపాలకంటే విజ్ఞాన చర్చలే అతనికి ఎక్కువ ఇష్టం. ఏ రకంగానూ కొరీన్ స్థానాన్ని లుసీల్ భర్తీ చెయ్యలేదు. కానీ లేడీ ఎడ్గర్‌మాండ్‌ అనారోగ్యం, లుసీల్ ఒంటరిదైపోతుందన్న జాలి అతన్ని కట్టిపడేయడం, తండ్రి లేఖ లుసీల్ వైపే మొగ్గు చూపడం, కొరీన్ తనకు ఉత్తరాలు రాయకపోవడం (అనారోగ్యం వల్ల రాయదు) ఇవన్నీ కలిసి ఆస్వాల్డ్ లుసీల్‌ని వివాహం చేసుకునేలా చేస్తాయి. వారికి ఒక పాప కూడ పుట్టాక అంత్యదశలో ఉన్న కొరీన్‌ని చూడ్డానికి ఇటలీ వెళ్తారు. వీరిద్దరి ప్రణయం అర్థం చేసుకున్న లుసీల్ భర్తను ఏమీ అనదు. కానీ అక్కని చూడాలని కోరుకుంటుంది. చివరి సన్నివేశాల్లో కొరీన్, లుసీల్‌ని, పాపనీ చూస్తుంది. చివరి క్షణం వరకూ వారితో ముచ్చటిస్తుంది. కానీ తనను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేసి నిలుపుకోలేకపోయిన ఆస్వాల్డ్‌ని చూసేందుకు ఇష్టపడదు. ఆస్వాల్డ్ కొరీన్‌ని దూరం నుంచి చూసి సంతోషిస్తాడు. మరణించాకే ఆమె దర్శనం అతనికి లభిస్తుంది.

చివరి రోజుల్లో ‘ఆమె ఎలా ఉంటే ఆస్వాల్డ్ ఇష్టపడతాడో’ లుసీల్‌కు బోధిస్తుంది కొరీన్. అతన్ని తనకంటే బాగా అర్థం చేసుకున్న వాళ్ళెవరూ లేరు కనక, అతనికి నచ్చినట్లుగా ఉండే మార్గాలు చెల్లెలికి నేర్పుతుంది. ఈ సందర్భంలో ఒక మాట అంటుంది ‘మనమెంత తెలివైనవాళ్ళమైనా మన భర్తలు, ప్రియుల ఎదట ఆ తెలివితేటల్ని ప్రదర్శించకూడదు. వాళ్ళే మనకంటే తెలివైనవారన్నట్లుగా ప్రవర్తించాలి.’ ఇది ఆమె స్వానుభవంతో చేసిన విషాదవ్యాఖ్య. నిత్యజీవితంలో కూడ మదామ్ దె స్టాఎల్ తోటి స్త్రీలకు ఇదే సలహా ఇచ్చేది కనక ఈ నవల ఆమె ఆత్మచరిత్రాత్మక కథేనని, కాన్‌స్తాఁ పాత్రనే ఆస్వాల్డ్‌లో చిత్రించిందనీ విమర్శకులు భావించారు. తనను ఎంతో ప్రేమించిన ఆస్వాల్డ్, వివాహం దగ్గరికి వచ్చేసరికి ‘అనుకూలవతి, ఒదిగివుండే స్త్రీ’ అయిన లుసీల్‌నే ఎంచుకున్నాడన్న ఆగ్రహం కొరీన్‌ని వదలదు. (ఆమె అనుకున్నంత దుర్మార్గంగా అతను ప్రవర్తించడు. నిజానికి ఆమె అతన్ని కలుసుకోడానికి స్కాట్లండ్ వచ్చి కూడ వెంటనే కలుసుకోకపోవడం వల్ల అతను ఆమెకు తన పట్ల ఆసక్తి పోయిందని అనుకుంటాడు.) అంతమాత్రాన అతన్ని ప్రేమించడం మానదు కూడ.

మదామ్ దె స్టాఎల్ చేసిన ఈ వ్యాఖ్య ఈనాటికీ స్త్రీపురుషసంబంధాల్లో కొట్టొచ్చినట్టు కనిపించే విషయమే. ఇటువంటి ఎన్నో జీవితసత్యాలు ఈ నవల్లో దొరుకుతాయి. ఇద్దరి మధ్యా విభేదాలు కేవలం బుద్ధికి సంబంధించినవి. హృదయానికి సంబంధించినవి కావు. ఇటాలియన్ సాహిత్యం ఎంత గొప్పదో కొరీన్ ఒకసారి వర్ణిస్తూంటె ‘అంత గొప్పదైతే షేక్స్‌పియర్‌తో తులతూగే ఒక్క రచన కూడ అందులో రాలేదేం?’ అని ఆటపట్టిస్తాడు ఆస్వాల్డ్. రచయిత్రి ఒకచోట అంటుంది: Oswald and Corinne had different opinions in this matter, but their disagreement, like all those existing between them, had to do with the differences between nations, climates and religions.

హృదయానికి సంబంధించిన ఉద్వేగాలు, భావనలలో ఇద్దరూ సమానమే. ఇద్దరివీ ఒకేరకమైన స్పందనలే. కానీ ప్రాపంచిక విషయాల్లో దృక్పథాలు వేరు. కొరీన్ కేథలిక్. ఆస్వాల్డ్ ప్రొటెస్టెంట్. ఒక దశలో ‘మనమిద్దరం నా చర్చికి వెళ్ళి పెళ్ళి చేసేసుకుందామా’ అని అడుగుతాడు ఆస్వాల్డ్. కొరీన్ తటపటాయిస్తుంది. వేరే కారణంతో వాయిదా వేస్తుంది వివాహాన్ని. రచయిత్రి అక్కడ మత ప్రస్తావన చెయ్యకపోయినా, కొరీన్‌కి ప్రొటెస్టెంట్ చర్చిలో వివాహం చేసుకోవడం ఇష్టం లేదన్న ధ్వని వినిపిస్తుంది. బహుశా అప్పుడే కొరీన్ ఒప్పుకొనివుంటే వాళ్ళ ప్రణయం విషాదాంతమయ్యేది కాదేమో.

ఇలా ఒక నవలలో జాతి, సంస్కృతి, మతం వంటి విషయాలు ప్రణయజీవుల మధ్య ఇనపతెరలై నిలిచిపోవడం ఒక విలక్షణమైన రచనగా దీన్ని నిలబెడుతుంది. వివాహానికి ఇవి అడ్డమయ్యాయి కానీ ప్రేమకు మాత్రం కాదు. అందుకే అతన్ని చేసుకోలేకపోయిన కొరీన్ వివాహాన్నే మానేస్తుంది. అతనిపై దిగులుతో కృశించి, మరణిస్తుంది. ఆస్వాల్డ్ వివాహం చేసుకున్నా, జీవితాంతం కొరీన్‌నే ప్రేమిస్తాడు. భార్యను అభిమానిస్తాడంతే.

ఈ నవల శీర్షిక రచయిత్రి ఉద్దేశాన్ని చెప్పకనే చెబుతుంది: కొరీన్ లేదా ఇటలీ. ఇక్కడ కొరీన్ కేవలం ఒక స్త్రీ కాదు. ఒక దేశానికి, ఒక జాతికి, ఒక సంస్కృతికి ప్రతీక. ఇటలీలోని సాంస్కృతిక చైతన్యమంతా కొరీన్‌లో మూర్తీభవించింది. గానం, కవిత్వం, నటన, నృత్యం, చిత్రకళల్లో నిష్ణాతురాలు కొరీన్. ఆమె కళకే ఇటాలియన్ సమాజం నీరాజనాలు అర్పిస్తుంది. అలాంటి కొరీన్ ప్రేమలో పడడంతో, క్రమంగా తన కళకు కూడ దూరమవుతుంది. నవలాంతానికి కథాకాలం ప్రకారం ఇటలీ నెపోలియన్ చేతిలో చిక్కి తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. కొరీన్ ఆస్వాల్డ్ మీద ప్రేమలో, ఆరాధనలో, తన అస్తిత్వాన్ని వదులుకుని, మరణిస్తుంది.

ప్రణయనవలలు యూరప్‌కి, అందులో ఫ్రాన్స్‌కి కొత్తకాదు. మదామ్ దె స్టాఎల్‌కి ముందే ఎన్నో ప్రణయనవలలు వచ్చాయి. ఆమె స్వయంగా తను మదామ్ దె లాఫయెట్‌కు (ప్రిన్సెస్ దె క్లేవ్ నవలారచయిత్రి) అభిమానినని మదామ్ దె స్టాఎల్ చెప్పుకుంది కూడా. కానీ ఈ నవలకు ప్రత్యేక స్థానం లభించడానికి, అసాధారణమైన స్పందన రావడానికీ కారణం ఇందులో సమకాలీన రాజకీయాల వాస్తవిక చిత్రణ, నాయిక పాత్ర ద్వారా ఒక జాతి వైభవాన్ని కళ్ళకు కట్టించిన తీరు. ఇటలీ వైభవాన్ని వర్ణించే క్రమంలో, దానిపై కక్షగట్టిన నెపోలియన్‌ను పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ ఈ నవలలో దె స్టాఎల్ విమర్శించింది. ఇటలీ, ఇంగ్లండ్‌ల గురించిన నవలే అయినప్పటికీ, ఫ్రెంచిలో రాసినందువల్ల ఈ నవల వెనక రచయిత్రి ఉద్దేశం ఫ్రెంచివారికి బాగానే అర్థమైంది. అందుకే నెపోలియన్ దీన్ని నిషేధించాలని విఫలయత్నం చేశాడు. కానీ ప్రచురింపబడిన రెండేళ్ళలోనే నాలుగు ముద్రణలు జరగడం, ఇంగ్లీషులో కూడ అనేక అనువాదాలు వెలువడడం, 1880 లోపల 43 మలిముద్రణలు రావడం కొరీన్ నవలకు లభించిన ప్రజాదరణకు నిదర్శనాలు.

ఈ నవలకు ముందు 1802లో మదామ్ దె స్టాఎల్ రాసిన డెల్ఫీన్ నవల కూడ రాజకీయమైందే. స్త్రీల అస్తిత్వం, హక్కుల గురించి చర్చించినదే. 18వ శతాబ్దిలో స్త్రీల స్థితిగతులను గురించి సాధికారికంగా ప్రశ్నలు వేసిన ఈ నవల కూడ పైకి ప్రణయగాథలా ఉన్నా లోలోపల రాజకీయ వ్యాఖ్యలా ఉంటుంది. వాక్‌స్వేచ్ఛను నిరాకరించే ఫ్రెంచి ప్రభుత్వాన్ని ఆక్షేపించడం, ఫ్రెంచి విప్లవాన్ని బహిరంగంగా ప్రశంసించడం, స్త్రీలను స్టీరియోటైప్స్‌గా కాక మేధావులుగా చిత్రించడం, స్త్రీలు పరస్పరం సహకరించుకోవాలన్న స్ఫూర్తిని ప్రకటించడం ఈ నవలను గొప్ప నవలగా తీర్చిదిద్దాయి. ఈ నవలలో వివాహేతర ప్రణయం ప్రధాన వస్తువు. వితంతువైన డెల్ఫీన్ తన స్నేహితురాలికి తను చూపించిన వరుణ్ణి తనే ప్రేమించడం, అతను కూడ డెల్ఫీన్‌ని ప్రేమించడంతో ప్రారంభం నుంచే విషాదాన్ని సూచిస్తుంది ఈ కథ. కానీ ప్రణయంతో పాటు అనేక ప్రశ్నలను లేవదీసిన ఈ నవల కూడా ఫ్రెంచి పాలకుల ఆగ్రహానికి గురైంది. నవలాంతంలో డెల్ఫీన్ ఆత్మహత్య చేసుకోవడం, నాయకుడికి ప్రభుత్వం, రాజకీయ నేరస్థుడిగా ముద్రవేసి మరణశిక్ష విధించడంతో ఆనాటి ఫ్రెంచి సామాజిక, రాజకీయ పరిస్థితులకు దర్పణంగా కనిపిస్తుంది ఈ నవల.

మదామ్ దె స్టాఎల్ ఏ రచన చేసినా, అందులో కనిపించే ప్రధాన లక్షణం స్త్రీలను బుద్ధి జీవులుగా చూపించడం. ఏ పురుషుడి అభిప్రాయాన్ని ఆమె స్త్రీ పాత్రలు యథాతథంగా ఆమోదించవు; చిలకపలుకుల్లా వల్లెవేయవు. తమకంటూ ప్రతి విషయంలోనూ అభిప్రాయాన్ని స్త్రీలు ఏర్పరచుకోవాలని, వాటిని నిర్భయంగా బయటపెట్టాలనీ రచయిత్రి స్పష్టం చేస్తుంది. అందుకే ఆమె నవలలు అధికారవర్గాలకు, ఆధిపత్యసంస్కృతిని త్రికరణశుద్ధిగా ఆచరించే పాఠకులకు కంటగింపుగా మారాయి. కానీ సామాన్య పాఠకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. 19వ శతాబ్ది యూరోపియన్ రచయితలు (స్త్రీలు, పురుషులు కూడ) మదామ్ దె స్టాఎల్‌ను తమకు స్ఫూర్తినిచ్చిన రచయిత్రిగా చెప్పుకున్నారు.

‘The more I see of Man, the more I like dogs’ వంటి చమత్కారాలు పురుషులపై కురిపించినా, మగస్నేహితులే ఎక్కువగా ఉన్న రచయిత్రి ఆమె. ఉత్తేజకరమైన సంభాషణలంటే ప్రాణంపెట్టిన మదామ్ దె స్టాఎల్, స్వయంగా చక్కని మాటకారి. ఆమె నవలల్లోని స్త్రీ పాత్రలు ఆ రకంగా చూస్తే ఆమెకు ప్రతిధ్వనులే.

‘ఆడదానివి. నీకు రాజకీయాలెందుకు?’ అని నెపోలియన్ తనను గద్దించినపుడు ‘Sire, when women have their heads cut off, it is but just that they should know the reason’ అని సమాధానం చెప్పిన ఆమె మాటల్లో చమత్కారమే కాదు; కటువైన నిజాలు మనల్ని కలవరపెడతాయి.

సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...