విశ్వమహిళానవల 20: కేట్ షొపేన్

అమెరికాలో మహిళా నవలంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది అంకుల్ టామ్స్ కేబిన్. పుస్తక దుకాణాలలో పెట్టిన తొలిరోజునే మూడు వేల కాపీలు అమ్ముడు పోయిన నవల! 19వ శతాబ్ది అమెరికాలో, బైబిల్ తర్వాత అమ్మకాల్లో రెండో స్థానం సాధించిన నవల! అదే సమయంలో బ్రిటన్‌లో రెండు లక్షల కాపీలు అమ్ముడుపోయి సంచలనం సృష్టించిన నవల! తొలి ముద్రణ వచ్చిన ఏడేళ్ళకే 20 భాషల్లోకి అనువదింపబడిన నవల! చైనీస్ భాషలోకి అనువదింపబడిన తొలి అమెరికన్ నవల! అదే హారియట్ స్టో (Harriet Stow) రాసిన గొప్ప నవల. అది భారతదేశంలోను, అందులో తెలుగువాళ్ళలో ప్రత్యేకంగానూ ప్రశస్తి గడించినదీ; అనువాద రూపాలలో లభించేది.

అంత ఉదాత్తమైన ఇతివృత్తం కాకున్నా, స్త్రీల సున్నితమనస్తత్వాన్ని, తీరని కోరికలను, తను ‘ఎవరికోసమో కాక, తన కోసమే జీవించాలన్న ఆశ’తో ఎదురుచూసిన స్త్రీ మానసిక స్థితిని అంతే సున్నితంగా చిత్రించిన మరో నవల 19వ శతాబ్దిలోనే వచ్చింది. అనంతరకాలంలో, స్త్రీల శరీరాలపై వారికి మాత్రమే హక్కుందని, స్త్రీ తనకు సమాజం విధించిన స్టీరియోటైప్ పాత్రలకే పరిమితంకాక, వ్యక్తిగా గుర్తింపు కోరుకుంటుందనీ సిద్ధాంతీకరించిన ఫెమినిస్టు భావజాలానికి పునాది వేసిన నవల ఇది.

అయితే నల్లజాతీయుల బానిసత్వం గురించి నిక్కచ్చిగా రాసిన హేరియట్ స్టోని గౌరవించడంలో అవసరమైన పరిణతిని చూపించిన అమెరికన్ మేధావులు, ఆ తర్వాత 40 ఏళ్ళకు స్త్రీ ఆకాంక్షలను, లైంగిక స్వేచ్ఛాపేక్షను చిత్రించిన కేట్ షొపేన్‌ని (Kate Chopin) మాత్రం క్షమించలేకపోయారు. ఆమె రాసిన ఏకైక నవల ది అవేకనింగ్ అమెరికన్ నవలా చరిత్రలో అత్యంత వివాదాస్పద నవలగా మిగిలిపోయింది.

కేట్ షొపేన్ జీవితం

అమెరికాలోని లూయిసియానా రాష్ట్రంలో 1850లో జన్మించింది కేట్ షొపేన్. తండ్రి ఫ్రెంచి జాతీయుడు కాగా తల్లి ఐరిష్ మహిళ. ఆమె అక్కలు శైశవంలోనే మరణించారు. అన్నదమ్ములు తమ 20వ యేట మరణించారు. చిన్నప్పుడే తండ్రి మరణించడంతో ఆమె సేక్రెడ్ హార్ట్స్ మిషనరీలో చేరి చదువుకుంది. మతగ్రంథాలు, ఫెయిరీ టేల్స్ విపరీతంగా చదివేది. తర్వాత కొంతకాలం తన అమ్మమ్మ, ముత్తవ్వల వద్ద పెరిగింది. వాళ్ళిద్దరూ బాలవితంతువులు. భర్తల మరణానంతరం అవివాహితలుగానే ఉండిపోయినవారు. ఒంటరి స్త్రీలు ఆమె చుట్టూ ఉండడం, వారి ఆకాంక్షలను అణచివేసుకోవాల్సిన నిర్బంధ వాతావరణంలోనే జీవితమంతా గడపడం ఆమెను ప్రభావితం చేసివుండడం అతిశయోక్తి కాజాలదు.

వివాహానంతరం ఆమె న్యూఆర్‌లీన్స్‌ నగరంలో స్థిరపడింది. ఆరుగురు పిల్లలు పుట్టిన తర్వాత 1882లో భర్త ఆస్కర్ షొపేన్ మరణిస్తూ ఆమెకు 42 వేల డాలర్ల అప్పు మిగిల్చి వెళ్ళాడు. అమ్మ, అమ్మమ్మ, ముత్తవ్వలలా తను కూడ వైధవ్యంతో పాటు ఆర్థిక కష్టాలను అనుభవించాల్సివచ్చింది. కొంతకాలం భర్త వ్యాపారాన్ని నడిపి చివరకు దాన్ని అమ్మేసి, తల్లి వద్ద నివసించడం మొదలుపెట్టింది. త్వరలోనే తల్లి కూడ మరణించింది. భర్త, తల్లి మరణాలు, వ్యాపారం దివాలా తీయడం ఇవన్నీ తనని నిస్పృహలోకి నెట్టేశాయి. అప్పుడు ఆ దిగులు మరవడానికి ఒక వైద్యుడు ఆమెను రచనా వ్యాసంగం ప్రారంభించమని సలహా ఇచ్చాడు. ఫ్రాయిడ్ చెప్పిన సబ్లిమేషన్ ఆమెకు సాహిత్యంలో లభించింది. అదే ఆమెను రక్షించిందని చెప్పవచ్చు. 1892 నుంచి 1895 వరకూ ఆమె కథలు, నవలలు రాసింది. ఆమె రాసినవన్నీ వివాదాస్పదమే అయ్యాయి. విమర్శకులు వాటిని ‘అనైతిక రచనలుగా’ ‘అశ్లీలాలు’గా కొట్టి పారేశారు. ఆమె నవలల్లో ది అవేకనింగ్ (The Awakening, 1899) అన్నిటికంటే ఎక్కువ విమర్శలను ఎదుర్కొంది. ఈ నవల ద్వారా వివాహేతర సంబంధాలను, స్త్రీల లైంగికత్వాన్ని ఆమె సమర్థించిందన్న ‘ఆరోపణ’లతో విమర్శకులు దుయ్యబట్టారు. చాలా కాలం ఈ నవల పునర్ముద్రణకు కూడ నోచుకోలేదు. 1970 తర్వాతే ముద్రింపబడి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. అమెరికన్ సాహిత్య చరిత్రలో ఆమె స్థానం గురించిన చర్చ ప్రారంభమైంది. తన రచనల ద్వారా పెద్దగా ఆర్జించని కేట్ 1904లో బ్రెయిన్ హెమరేజ్‌తో, తన 54వ యేట మరణించింది.

ఆమె కథల్లో, నవలల్లో స్త్రీ పాత్రలు చాలా పటిష్టంగా, ధైర్యంతో, జీవనోత్సాహంతో ఉంటాయి. ఉదాహరణకు ది స్టోరీ ఆఫ్ ఆన్ అవర్‍లో, తను ఎంతగానో ప్రేమించిన భర్త చనిపోయినపుడు అతన్ని తలచుకుంటూ కథానాయిక ఇలా అనుకుంటుంది: She knew that she would weep again when she saw the kind, tender hands folded in death; the face that had never looked save with love upon her, fixed and gray and dead. But she saw beyond that bitter moment a long procession of years to come that would belong to her absolutely. And she opened and spread her arms out to them in welcome.

భర్త మరణం ఎంత బాధ కలిగించిందో మొదటి వాక్యాల్లో అర్థమవుతుంది. కానీ ఆ కష్టసమయం తర్వాత, కేవలం తనకే చెందే ఎన్నో ఏళ్ళ జీవితం ఉందని, దాన్ని తను రెండు చేతులా ఆహ్వానిస్తున్నాననీ అనుకుంటుంది. ఈ జీవితం నాది – అని సగర్వంగా చెప్పుకుంటుంది. స్త్రీకి కుటుంబం, భర్త, పిల్లలతో ఎంత ఆనందం ఉన్నా, వాటికి అతీతంగా తనదంటూ ఒక జీవితం ఉండాలన్న ఆకాంక్షను తన రచనలన్నింటా వ్యక్తం చేసిన రచయిత్రి కేట్. ఆందుకే ఆమె రాసినంత కాలం విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది.

ఆమె రాసిన రోజుల్లో (19వ శతాబ్ది ఉత్తరార్ధం) స్త్రీల కోరికల గురించి (అవి లైంగికం కావచ్చు; లైంగికేతరమైన వ్యక్తిగత సాఫల్యం కావచ్చు) ఇంత నిక్కచ్చిగా రాసిన వాళ్ళెవరూ లేరు. తనని ఫెమినిస్టు రచయిత్రిగా త్వరలోనే గుర్తిస్తారన్న ఆలోచన ఆమెకు ఏ కోశానా ఉండే అవకాశం లేదు. కానీ తను నమ్మిన దాన్ని నిర్మొహమాటంగా చెప్పే సాహసం మాత్రం ఆమెలో ఉండేది. అయితే దానితోపాటే, ఆమెలో తన కథనాన్ని మార్చుకునే తెలివితేటలు కూడ ఉండేవి. ఆందుకే తొలినాళ్ళ కథల్లో ‘బాహాటంగా తిరగబడే’ స్త్రీ పాత్రలను సృష్టించిన ఆమె, తర్వాతి కథల్లో ‘పరోక్షంగా, చాకచక్యంగా’ పితృస్వామ్యాన్ని ధిక్కరించే పాత్రలని సృష్టించింది. తన కథననైపుణ్యంతో వేర్వేరు వర్గాలను ఆకర్షించగలిగింది. అలా కొన్ని కథలు ప్రజాదరణ పొందినా, ఆమె నవల ది అవేకనింగ్ మాత్రం ఆనాటి పాఠకులకు, విమర్శకులకు నచ్చలేదు.

ది అవేకనింగ్

ఎడ్నా (Edna) పాంటిలియెర్ న్యూఆర్‌లీన్స్ వ్యాపారవేత్త లియాన్స్ పాంటిలియెర్ (Léonce Pontellier) భార్య. వాళ్ళకు ఇద్దరు కొడుకులు. ఎడ్నాకు వైవాహిక జీవితం తృప్తినివ్వదు. భర్త దుర్మార్గుడు కాడు. కాకపోతే భార్యను ప్రేమించాలన్న ఆలోచన, ఆమె తన ఇంట్లో వస్తువు కాదు; ఒక ప్రాణి అన్న ఆలోచనా ఉండదు. ఎడ్నా ఆలోచనలు చదువుతూంటే చలం నవలల్లో స్త్రీ పాత్రలు గుర్తుకొస్తాయి.

తన దాంపత్య జీవితం గురించి ప్రస్తావన వచ్చినపుడల్లా ఆలోచిస్తూ, అసంతృప్తిని వ్యక్తం చేస్తూండే ఎడ్నాను ఆమె స్నేహితురాలు అడేల్ రాటిన్యోల్ (Adèle Ratignolle) వారిస్తూ ఉంటుంది. భార్యగా, తల్లిగా తన ధర్మాలు సక్రమంగా నిర్వర్తించడంలోనే స్త్రీకి ఆనందం ఉందని, అంతకు మించి ఆలోచించవద్దనీ చెబుతూంటుంది. ఎడ్నా పట్టించుకోదు. ఆమెలో చెలరేగుతున్న సంఘర్షణను భర్త ఎప్పుడూ గుర్తించడు. ఆమెకు రాబర్ట్ లెబర్న్ (Robert Leburn) అనే యువకుడితో పరిచయం కొత్త అందాలలోకాన్ని తెరిచినట్టవుతుంది. అతను ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. పైకి మాత్రం ఇద్దరూ తమ ప్రేమను వ్యక్తం చేసుకోకుండా, మంచి స్నేహితులలా మెలుగుతూంటారు. తన మనసు ఎక్కడ అదుపు తప్పుతుందో, తన వల్ల ఆమె దాంపత్య జీవితంలో ఎలాంటి ఘర్షణలు వస్తాయో అన్న భయంతో, ఒకానొక రోజున ఆమెకు చెప్పకుండా మెక్సికోకు వెళ్ళిపోతాడు రాబర్ట్. ఎడ్నాకు ఇది తీవ్ర సంతాపం కలిగిస్తుంది.

ఆమెకు జీవితంమీద నిస్పృహ ఏర్పడి, అంతవరకూ తన చుట్టూ ఉన్న స్నేహితులను వదిలిపెడుతుంది. ఆ సమాజానికి దూరం కావాలని, భర్తను పిల్లల్ని విడిచి, మరో చోటికి నివాసం మారుస్తుంది. తన ఆనందానికి మార్గాన్ని అన్వేషించాలని నిర్ణయించుకుంటుంది. ఆమె వాలకం చూసి భర్తకు అనుమానం వచ్చి, మానసిక వైద్యుడిని సంప్రదిస్తాడు. అతను, తొందరపడవద్దని, కొంత గడువిస్తే ఆమె సర్దుకుంటుందనీ నచ్చజెప్తాడు. ఈలోగా లియాన్స్‌కి న్యూయార్క్‌లో వ్యాపారసంబంధాలు పెరగడం వల్ల, పిల్లలిద్దరినీ తల్లి దగ్గరికి పంపేసి, తను న్యూయార్క్ వెళ్ళిపోతాడు. భర్త వెళ్ళిపోగానే ఆ భవనాన్ని వదిలి, తన స్వేచ్ఛను ప్రకటించడానికి మరో చిన్న ఇంటికి మారుతుంది. అక్కడ ఆల్సీ ఆరోబిన్ (Alcée Arobin) అనే యువకుడి ఆరాధనకు లొంగిపోయి, అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంటుంది. అతనితో సంబంధంలో ఆమెకు ఎలాంటి ఆనందమూ సంతృప్తీ లభించదు. శారీరకబంధం పెట్టుకున్న అతనిపై కంటే, కేవలం భావాత్మక ప్రణయబంధం ఏర్పరచుకున్న రాబర్ట్‌నే ఆమె స్మరిస్తూంటుంది. భర్తతో లభించని శారీరక సుఖం ఆల్సీ ద్వారా పొందుతుంది. భర్తతో లభించని మానసిక అనుబంధాన్ని రాబర్ట్ నుంచి పొందుతుంది. కానీ రెండూ రాబర్ట్‌తో పొందాలన్న ఆమె కోరిక అలాగే ఉండిపోతుంది.

తనలోని సంక్షోభాన్ని, విషాదాన్ని, తనకే అర్థంకాని నిరాశని జయించేందుకు, ఆనాటి సుప్రసిద్ధ పియానిస్టు మదమాసెల్ రైస్‌ని (Mademoiselle Reisz) ఆశ్రయిస్తుంది. ఆమె పియానోలో నిపుణురాలే కాదు; ప్రజలందరికీ దూరంగా, ఒక సన్యాసినిలా జీవిస్తున్న మధ్యవయస్కురాలు. తనను నిత్యం గృహిణిగా కర్తవ్యం నిర్వర్తించాలని వేధించే స్నేహితురాలు అడేల్‌కి పూర్తి భిన్నంగా, సామాజిక, కౌటుంబిక నియమాలన్నిటినీ తిరస్కరించి, తనలోతాను జీవించాలని చెప్పే రైస్ పట్ల ఆకర్షితురాలవుతుంది ఎడ్నా. ఇంతలో ఆమెకు రైస్‌కి కూడా రాబర్ట్‌తో పరిచయం ఉన్నట్టు తెలుస్తుంది. అతను తరచు ఆమెకు ఉత్తరాలు రాస్తూంటాడు. ఆ ఉత్తరాల్లో ఏముందో చెప్పమని ఎడ్నా వేధించడంతో రైస్ చూపిస్తుంది. చాలా ఉత్తరాల్లో ఎడ్నా ప్రసక్తి ఉంటుంది. ఆమె పట్ల తన ప్రగాఢమైన ప్రేమను రాబర్ట్ వ్యక్తం చేస్తాడు తన స్నేహితురాలికి రాసిన ఉత్తరాల్లో. ఎడ్నా మనసు ఉద్విగ్నభరితమవుతుంది. అంటే తనకు అతనిపట్ల ఉన్న ప్రేమ అతనికీ ఉందన్న మాట! హఠాత్తుగా ఒకరోజు రాబర్ట్ ఆ ఊరికి వస్తాడు. ఇద్దరూ కలుసుకుంటారు. రాబర్ట్ తన ప్రేమను ఎట్టకేలకు ఆమెకు నేరుగా వ్యక్తం చేస్తాడు. ఎప్పటికీ ఫలించే ఆశలేని తమ ప్రేమవల్ల ఆమె జీవితం నాశనం కాకూడదనే, వ్యాపారమనే సాకుతో మెక్సికో పారిపోయానని చెప్తాడు. ఎడ్నాకు ఆనందం కలుగుతంది. ఇద్దరూ కొంత సేపు ఏకాంతంగా గడిపిన తర్వాత, తమ అనుబంధానికి భవిష్యత్తు ఉందన్న ఆశతో తబ్బిబ్బవుతుంది ఎడ్నా. ఈ క్రమంలో ఆమెకు తను భార్య అని గాని, తల్లి అని గానీ గుర్తు కూడా రాదు.

ఈలోగా తన స్నేహితురాలు అడేల్ ప్రసవవేదన పడుతోందని, ఆమెకు తోడుగా ఎవ్వరూ లేరని కబురు అందుతుంది. వెంటనే అక్కడికి వెళ్తుంది ఎడ్నా. అప్పుడు కూడ అడేల్, ఎడ్నాని తన భర్తను పిల్లలని దూరం చేసుకోవద్దనే హితబోధ చేస్తుంది. ఎడ్నా తిరిగి తన వూరు చేరేసరికి, రాబర్ట్ ఉండడు. అతను ఓ లేఖ రాసి మళ్ళీ వెళ్ళిపోతాడు. అందులో ‘ఐ లవ్ యు. గుడ్ బై, బికాజ్ ఐ లవ్ యూ’ అని వుంటుంది. దాని భావం ఊహించడం ఆమెకు పెద్ద కష్టం కాదు. ఆమెతో అనుబంధం ఎంత ఇష్టమైనా, ఆమె తనతో సంబంధం పెట్టుకుంటే ఎన్ని అపవాదులు ఎదుర్కోవాల్సివస్తుందో తనకు తెలుసునని, కనక శాశ్వతంగా వెళ్ళిపోతున్నాననీ దాని సారాంశం. ఆ లేఖ చూశాక, అప్పటికే బలహీనంగా ఉన్న ఎడ్నా మనసు బ్రద్దలవుతుంది. తనూ, అతను తొలిసారి కలుసుకున్న గ్రాండ్ ఐల్‌కి తిరిగి వచ్చి, అక్కడ సముద్రంలో ఈతకోసం వెళ్ళి, ఆత్మహత్య చేసుకుంటుంది.

ఈ నవలలో కథ స్వల్పం. కానీ కథనంలో, పాత్ర చిత్రణలో కేట్ చూపిన వాస్తవికత, కళాత్మకత, అవగాహన దీన్ని ఒక మంచి నవలను చేశాయి. ఎడ్నా, రాబర్ట్‌ల సున్నితమైన ప్రేమను అంతే సున్నితంగా చిత్రించింది రచయిత్రి.

నవల ప్రారంభంలోనే ఎడ్నా భర్త ఆమెను భార్యగా తప్ప మరోలా చూస్తాడని మనకు అర్ధమవుతుంది: …looking at his wife as one looks at a valuable piece of personal property which has suffered some damage.

తన స్నేహితురాలు, పియానో విద్వాంసురాలు రైస్, ఎడ్నా భర్త సాయంత్రాలు ఇంట్లో గడిపితే, ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగేది అన్నప్పుడు ఆమె సమాధానం: “Oh! dear no!” said Edna, with a blank look in her eyes. “What should I do if he stayed home? We wouldn’t have anything to say to each other.”

ఎడ్నాకు సరిగ్గా వ్యతిరేకంగా ఉండేది ఆమె ప్రాణస్నేహితురాలు అడేల్. ఆమె మూర్తీభవించిన స్త్రీత్వం అనడం అతిశయోక్తి కాదు. పిల్లల్ని కనడమే ధ్యేయంగా భావించడం, భర్తను సంతృప్తి పరచడమే తన లక్ష్యం అనుకోవడం ఆమె సహజగుణాలు. రాబోయే చలికాలం కోసం పిల్లలకు ఉన్నిస్వెటర్లు వేసవిలో అల్లడం మొదలుపెడుతుంది. ఎడ్నాకు ఈ అతి ప్రేమ, జాగ్రత్త అర్థం కాదు. ఆమెకూ ఇద్దరు కొడుకులున్నారు. కానీ ఎప్పుడూ వాళ్ళ గురించే ఆలోచించడం ఆమె వల్ల కాదు. రచయిత్రి ఆమె గురించి ఇలా చెప్తుంది:

She was fond of her children in an uneven, impulsive way. She would sometimes gather them passionately to her heart; she would sometimes forget them. The year before they had spent part of the summer with their grandmother Pontellier in Iberville. Feeling secure regarding their happiness and welfare, she did not miss them except with an occasional intense longing. Their absence was a sort of relief, though she did not admit this, even to herself. It seemed to free her of a responsibility which she had blindly assumed and for which Fate had not fitted her.

ఆమె దృష్టిలో తను పెళ్ళికి, పిల్లల్ని పెంచడానికీ పుట్టిన స్త్రీ కాదు. తనకు ఇంకా ఏదో కావాలి. అదేమిటో ఆమెకీ తెలీదు. భర్తను వివాహం చేసుకున్నపుడు అతనితో ప్రేమగానే ఉంది. కానీ అది తన కర్తవ్యంలో భాగం. అందులో ఎలాంటి ఉద్వేగం లేదు. రాబర్ట్‌తో ఒకరోజంగా విహరిస్తూ, కబుర్లు చెబుతూ గడిపిన రోజున తొలిసారి ప్రేమ అనే భావన ఆమెకు అర్థమవుతుంది. తన సంచలనం ఏమిటో ఆమెకు అర్థం కాకపోయినా తనలో ఏదో మార్పు వచ్చిందని గ్రహిస్తుంది.

ఆమె కంటే భిన్నంగా తనలో కలిగిన సంచలనాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్న రాబర్ట్, ప్రమాదం పసిగట్టి ఆ మరుసటి రోజే మెక్సికోకు బయల్దేరతాడు. అప్పుడు అనుకుంటుంది- తన గుండె పగిలినంత బాధ ఎందుకు కలుగుతోందా అని: Robert’s going had in some way taken the brightness, the color, the meaning out of everything. The conditions of her life were in no way changed, but her whole existence was dulled, like a faded garment which seems to be no longer worth wearing.

తన అస్తిత్వానికి అర్థం లేదని ఆ క్షణం నుంచి ఆమెకు అనిపిస్తుంది. భర్త యాంత్రికత, అధికారం దీనికి తోడై, ఒకరోజు పెళ్ళిలో పెట్టిన ఉంగరాన్ని విసిరేస్తుంది. అలా క్రమక్రమంగా ఆమెలోని అలజడి పెరుగుతూంటుంది. ఆమె మూడ్స్ తరచు మారుతూండడం, ఇదివరకటిలా తన ప్రతిమాటా శిరోధార్యం అనుకోక, బదులు చెప్పడం, తిరస్కరించడం చూసి ఆ భర్తకు కలిగే ఆలోచన ఒకటే – తన భార్యకు మతి చలించిందని, ఆమెకు డాక్టర్ అవసరమనీ!

ఎడ్నా తన యాంత్రిక జీవితానికి అతికష్టం మీద అలవాటు పడుతూండగా, పియానిస్టు దగ్గరికి వెళ్ళినపుడు రాబర్ట్ నుంచి వచ్చిన ఉత్తరాల్లో తన ప్రసక్తి ఉండడం భావోద్వేగాన్ని కలిగిస్తుంది. పాత గాయం తిరిగి రేపినట్టవుతుంది. లేదనుకున్న ఆనందం తన జీవితంలో ఇంకా సజీవంగానే ఉందనిపిస్తుంది. ఒక లేఖలో అతను తను ఫ్రెడెరిక్ షొపేన్ పియానో కోసం రాసిన ఇంప్రాంప్టు అన్న సంగీతరచన వింటున్నానని, ఎడ్నాకు కూడ అది వినిపించమనీ రైస్‌ను కోరతాడు. ‘అది విన్నపుడు నాలో కలిగిన ఉద్వేగం ఆమెలో కూడా కలుగుతుందేమో తెలుసుకోవాలని ఉందని’ ఆ లేఖలో రాస్తాడు. ఇలాంటి మాటల వల్లే తనకు సహచరుడు కాదగ్గ వ్యక్తి రాబర్ట్ ఒక్కడేనన్న స్పృహ మళ్ళీ ఆమెలో కలుగుతుంది. ఆమె చిత్రకారిణి. అతను కళాభిమాని. అతను సూచించిన పాట రైస్ పియానోపై వాయిస్తూంటే, సరిగ్గా అతను ఊహించినట్టే ఎడ్నా భావోద్వేగంతో కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది.

ఈలోగా ఆమె భర్త, ఎడ్నాకు మతి చలించిందని తనే నిర్ణయించుకుని డాక్టర్ దగ్గరకు వెళ్ళి ‘ఎడ్నా ఈ మధ్య విచిత్రంగా ప్రవర్తిస్తోంది, ఇంటి పని పట్టించుకోవడం లేద’ని చెప్పినపుడు, డాక్టర్ ‘అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న’లాగా, ‘ఆమెకు అమెరికాలో ఇటీవల మొదలైన విప్లవస్త్రీల ఉద్యమాలతో ఏమైనా సంబంధం ఏర్పడిందా?’ అని ప్రశ్నిస్తాడు. “Has she been associating of late with a circle of pseudo-intellectual women—super-spiritual superior beings? My wife has been telling me about them” – అప్పటికే అమెరికాలో తమ హక్కుల గురించి పోరాడుతున్న స్త్రీలపై ఆయన వ్యాఖ్య అది.

ఎడ్నా తిరుగుబాటు ఇంటిపనులు నిర్లక్ష్యం చేయడంతో ఆగిపోదు. తల్లి అకాలమరణానికి కారకుడైన తండ్రిని ఇన్నేళ్ళ తర్వాత ఎదిరించేందుకు సాహిస్తుంది. తన చెల్లెలి పెళ్ళికి తండ్రి ఆహ్వానిస్తే రానని చెబుతుంది. కూతుర్ని తిట్టడమే కాక, ఆమెను అదుపులో ఉంచలేని అల్లుడిని కూడ కసిరి మరీ వెళ్తాడు తండ్రి. ఆ తర్వాత భర్త పనిమీద ఊరు వెళ్ళడం, కొడుకులిద్దరినీ అత్తగారు తీసుకువెళ్ళడంతో ఎట్టకేలకు తాను కోరుకుంటున్న ఏకాంతం లభిస్తుంది ఎడ్నాకు. ఒక్కత్తీ ఉండడంలో ఇంత ఆనందం, శాంతి ఉన్నాయా అని ఆశ్చర్యపోతుంది. ఇలా ఒక్కొక్క ఘటనలోనూ స్త్రీగా తను నిర్వర్తించవలసిన కర్తవ్యాలు (ఇల్లు సర్దుకోవడం, పిల్లల్ని నిత్యం కనిపెడుతూ ఉండడం, పుట్టింట్లో తన అవసరం ఉన్నప్పుడు వెళ్ళడం, భర్త దూరంగా ఉంటే విరహబాధ అనుభవించడం) ఇవేవీ ఎడ్నా చెయ్యకపోవడాన్ని క్రమక్రమంగా ఒక అల్లికను విప్పినట్టు విప్పుతుంది రచయిత్రి. తన సౌందర్యానికి ముగ్ధుడైన ఒక యువకుడిని ప్రోత్సహించడం కూడ ఈ పరిణామంలో మార్పే. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన సన్నివేశం కల్పిస్తుంది కేట్ షొపేన్.

అందమైన ఆడపిల్లల వెంట అలవాటుగా తిరిగే ఆల్సీ ఆరోబిన్, ఎడ్నాను గుర్రప్పందాల్లో కలిసినపుడు, తామిద్దరి మధ్య ఆకర్షణ కలిగినట్లు ఆమె గమనిస్తుంది. ‘వెంటనే ఇది తెలిస్తే అతనేమనుకుంటాడు?’ అనుకుంటుంది. పాఠకులు ఒక్క క్షణం ఆమె భర్త గురించి ఆలోచిస్తోందని అనుకుంటారు. కానీ వెంటనే ఆమె స్వగతం ‘నా భర్త కాదు. రాబర్ట్. అతనికి నా బలహీనత తెలిస్తే ఏమనుకుంటాడు?’ అనుకుంటుంది. ఆమెకు ఏ బలహీన క్షణంలోనూ భర్త గుర్తుకు రాకపోవడమే కాక, రాబర్ట్‌ను బాధపెడుతున్నానేమో అన్న ఆలోచన రావడం, ఆమెకు అతనిపై కలిగిన ప్రేమలోని గాఢతను తెలుపుతుంది.

భర్త నిర్మించిన భవంతిలో, ఆయన నియమించిన బోలెడుమంది సేవకులతో కలిసి జీవించలేని స్థితికి రావడం ఎడ్నాలోని స్వేచ్ఛాకాంక్షకు తుదిమెట్టు. తనకు తల్లి ఇచ్చిన కొద్దిపాటి ఆస్తి, తన చిత్రలేఖనం వల్ల వచ్చిన ఆదాయం తను జీవించడానికి చాలని, ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ సందర్భంలో రైస్ హటాత్తుగా ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నావని అడుగుతూ, ప్రేమలో పడితేనే ఇలాంటి ఆలోచనలు వస్తాయని అంటుంది. తను రాబర్ట్‌ని ప్రేమిస్తున్నదా అని ఆమె అడిగినపుడు తొలిసారి తనకు కూడ చెప్పుకుంటున్నట్టు ‘అవును’ అని సమాధానమిస్తుంది. ఏం చూసి ప్రేమిస్తున్నావంటే ఆమెతో అంటుంది: “Do you suppose a woman knows why she loves? Does she select? Does she say to herself: ‘Go to! Here is a distinguished statesman with presidential possibilities; I shall proceed to fall in love with him.’ Or, ‘I shall set my heart upon this musician, whose fame is on every tongue?’ Or, ‘This financier, who controls the world’s money markets?”

అన్నీ ఉన్న భర్తను భరించలేకపోవడం, ప్రత్యేకించి ఏ సామాజిక హోదా, సంపదా, కీర్తి లేని రాబర్ట్‌ని ప్రేమించడం రైస్‍కి విచిత్రంగా అనిపిస్తుంది కానీ ఎడ్నాకు అది అతి సహజం.

కానీ ఆమెలో ఉన్న ఉద్వేగం, ఆమెలో ఉన్న సాహసం, ప్రేమను సఫలం చేసుకోవాలన్న ఆవేశం రాబర్ట్‌లో ఉండవు. రాబర్ట్ మంచివాడే. దానితో పాటే వివేకం కలవాడు. బహుశా పిరికివాడు కూడా. ఎడ్నా ప్రేమకోసం తపించిపోతుందే తప్ప, ఈ ప్రేమకు పర్యవసానం ఏమిటీ అని ఆలోచించదు. రాబర్ట్ తనకు ఆమెపట్ల ఆరాధనాభావం పెరుగుతోందని తెలియగానే, జాగ్రత్తపడతాడు. ఇలాంటి ప్రేమకు భవిష్యత్తు ఉండదని అనుకుంటాడు. ఎందుకంటే ఎడ్నా మాటవరసకైనా, రెండోసారి కలిసినపుడు కూడా, భర్తకు విడాకులిస్తానని గానీ, అతనితో వచ్చేస్తానని గానీ అనదు. ‘మనిద్దరం ఇక్కడే కావలసినపుడు కలుసుకుంటూ ఆనందంగా బతుకుదాం’ అని ఉత్సాహపడిపోతుంది. దాని భావం, తమ ప్రేమ ఎప్పటికీ రహస్యంగా ఉండాలనే. ఆ జ్ఞానం ఉన్నవాడు కనకే రాబర్ట్ రెండోసారి ఆమెను వదిలి వెళ్ళిపోతాడు. Robert was not waiting for her in the little parlor. He was nowhere at hand. The house was empty. But he had scrawled on a piece of paper that lay in the lamplight: “I love you. Good-by—because I love you.”

రాబర్ట్ లేఖ ఆంతర్యం అవగతమయ్యేసరికి, ఎడ్నాకు జీవితేచ్ఛ నశిస్తుంది. ఆమెకు కావలసింది తనకోసం తను కొన్ని క్షణాలైనా జీవించడం. దానికి ఆటంకం కలిగించేవాటిని వదిలించుకోవడం. ఆ క్షణాలే తన అస్తిత్వసారం. She understood now clearly what she had meant long ago when she said to Adele Ratignolle that she would give up the unessential, but she would never sacrifice herself for her children.

ఈ క్షణంలో ఆమెకు కావలసింది రాబర్ట్ సాన్నిధ్యం. దాన్ని అతను నిరాకరించాడు. కొంతకాలానికి తనకు బహుశా రాబర్ట్ ఆలోచనలు కూడ రాకపోవచ్చు. తను పూర్తిగ ఒంటరిదైపోవచ్చు. అప్పుడు తన ఉనికి ఏమిటి? తను దేనికోసం, ఎవరికోసం జీవించివుండాలి? ఈ ఊహ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నపుడు, నదిలో ఈతకు దిగుతుంది.

ఈసరికి ఆమె మనసు క్రమంగా తన కోరికల నుంచి కూడ విముక్తం కావడం మొదలవుతుంది. తనకు ఇప్పుడు కావలసింది రాబర్ట్ సాన్నిధ్యం మాత్రమే. కానీ కొంతకాలానికి అది కూడ అనవసరమైపోయే స్థితి వస్తుందేమో. There was no human being whom she wanted near her except Robert; and she even realized that the day would come when he, too, and the thought of him would melt out of her existence, leaving her alone.

ఆ చివరి సన్నివేశంలో ఆమె రాబర్ట్ ఇంటికే వెళ్తుంది. అతను ఉండడు. ఊరువదిలి వెళ్ళిపోతాడు. అతని తమ్ముడు ఉంటాడు. ‘నాకు ఆకలిగా ఉంది. ఫిష్ తినాలని వుంది. స్నానం చేసి వచ్చి, భోంచేస్తాను’ అంటుంది. ఆమె పట్ల అమితమైన ఆరాధనాభావం ఉన్న రాబర్ట్ తమ్ముడు భోజనం ఏర్పాట్లలో నిమగ్నమవుతాడు.

ఆమె నగ్నంగా ఈత కొట్టడానికి దిగుతుంది నీళ్ళల్లోకి. ఆమె ముందుకు వెళ్ళే కొద్దీ ఆలోచనాస్రవంతి వేగం పుంజుకుంటుంది. తన జీవితం మీద తనకు తప్ప భర్తకో, పిల్లలకో అధికారం ఉండడానికి వీల్లేదు. తన ఆలోచనలు ఎవరికి అర్ధమౌతాయి? ‘గుడ్ బై బికాజ్ ఐ లవ్ యూ’ అని రాసి వెళ్ళిన రాబర్ట్‌కి అర్థం కాలేదు. బహుశా ఆ పిచ్చి డాక్టర్‌కు అర్థమవుతుందేమో. ఇంకా ఆలోచించే ఓపిక లేదు. అలసటగా ఉంది. తీరం కనబడ్డం లేదు. వెనక్కి తిరిగి చూస్తే చాలా దూరంలో ఉంది తీరం. తనలో శక్తి ఉడిగిపోతోంది. ఇక ఈదడం కష్టం…’ అని ఆగిపోతుంది నవల. A feeling of exultation overtook her, as if some power of significant import had been given her to control the working of her body and her soul. She grew daring and reckless, overestimating her strength. She wanted to swim far out, where no woman had swum before.

కావాలనే ఆత్మహత్య చేసుకుందా. లేక ఆమెకు జీవితం పట్ల కలిగిన నిరాశ తీరం చేరలేనంత అలసట కలిగించిందా?

ది అవేకనింగ్ అంటే జాగృతి. ఎడ్నాలో కలిగిన జాగృతి స్వరూపం ఎటువంటిది? స్వేచ్ఛ అంటే తన శరీరంపై, ప్రవర్తనపై, అనుబంధాలపై తనకు తప్ప మరెవరికీ హక్కు ఉండదని, ఉండనివ్వకూడదని, తన జీవితమార్గాన్ని నిర్ణయించుకునే హక్కు తనకు మాత్రమే ఉందనీ నమ్మడం. ఆమె రైస్ సంగీతం విన్నపుడూ, చిత్రకళను ప్రదర్శిస్తున్నపుడూ తనలోని ఈ స్వేచ్ఛకు బీజాలు పడినట్టు గుర్తిస్తుంది. రచయిత కేట్‌కి రచన తన గురించిన జాగృతిని కలిగించినట్లే, తన మనోవేదన నుంచి విముక్తి మార్గంగా అనిపించినట్లే, ఆమె సృష్టించిన ఎడ్నా కూడా సంగీత, చిత్రకళల్లో తనని తాను ఆవిష్కరించుకుంటుంది. కానీ ఆమె ప్రేమించిన రాబర్ట్‌కి ఈ గాఢతను అర్థం చేసుకునే పరిణతి ఉండదు. అందుకే ఆమెను వదిలి వెళ్ళగలుగుతాడు. ఎడ్నా ‘ఆత్మహత్య’ కూడ ఆమె ఎంచుకున్న, ఆమె ఆనందంగా స్వీకరించిన విముక్తి మార్గమే.


సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...