పరిచయము
అందమైన తాళవృత్తములలో మానిని కవిరాజవిరాజిత వృత్తములకు ఒక ప్రత్యేక స్థానము గలదు. నన్నయనుండి నేటివఱకు కవులెందఱో ఈ వృత్తములలో వ్రాసియున్నారు. దానికి ముఖ్యమైన కారణము చతురస్రగతిలో సాగే ఈవృత్తముల నడకలో ఒక ప్రత్యేకమైన తూగు ఉన్నది. ఒక విధముగా ఈరెండు వృత్తములు జమిలివృత్తములు. మానినిలోని మొదటి గురువు కవిరాజవిరాజితములో (క. రా.) రెండు లఘువులు. అదొక్కటే ఈ రెండు వృత్తములకు ఉన్న తేడా. మానినిలో ఏడు భ-గణములు (UII), ఒక గురువు. క. రా. లో ఒక న-లము (IIII), ఆఱు భ-గణములు, ఒక గురువు. మానినికి ఎన్నియో పేరులు ఉన్నాయి. అవి: మదిరా (హేమచంద్రుడు, కేదారభట్టు), లతాకుసుమ (జయకీర్తి), సంగతా (విరహాంకుడు), వనమంజరి (నాగవర్మ). కవిరాజవిరాజితము హంసగతి (హేమచంద్రుడు), మహాతరుణీదయిత (జయకీర్తి) అని కూడ వ్యవహరించబడును. తెలుగులో ఈపేరులు, అనగా మానిని మఱియు క. రా. ఎలా జనించినవో అన్నది తెలియదు. ఈ ఛందముల వివరములు క్రింద ఇస్తున్నాను:
మానిని: ఏడు భ-గణములు, ఒక గురువు; 22 ఆకృతి 1797559.
కవిరాజవిరాజితము: న, ఆఱు జ-గణములు, లగ; 23 వికృతి 3595118.
లక్షణ–లక్ష్యములు, యతి నిర్ణయము
రేచన కవిజనాశ్రయములో మానినీ వృత్తపు లక్షణ-లక్ష్య పద్యము:
కారకముల్ క్రియఁ – గన్గొన నేడు భ-కారము లొక్క – గకారముతో
గారవమై చనఁ-గా యతి పండ్రెటఁ – గల్గిన మానిని – కామనిభా
ఇందులో అక్షరసామ్య యతిని పదమూడవ అక్షరముగా పేర్కొనినాడు రేచన. కాని లక్ష్య పద్యములో మాత్రము అదనముగా ఏడవ, పందొమ్మిదవ అక్షరాలకు కూడ ఈవడి చెల్లుతుంది. నన్నయభట్టు ఆంధ్రమహాభారతములో ఒక్క యతినే వాడినాడు. కాని తిక్కన ఒక్క యతిని, మూడు యతులను వాడియున్నాడన్నది గమనార్హము. ఆపద్యములు:
ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల – నిమ్మగు ఠావుల జొంపములం
బూచిన మంచి యశోకములన్ సుర-పొన్నలఁ బొన్నలఁ గేదఁగులం
గాచి బెడంగుగఁ బండిన యా సహ-కారములం గదళీతతులం
జూచుచు వీనుల కింపెసఁగన్ విను-చున్ శుకకోకిల సుస్వరముల్
– ఆంధ్రమహాభారతము, ఆదిపర్వము 4.20
ఈపద్యపు వృత్తౌచిత్యమును గుఱించి ఇలాగంటారు: దుష్యంతుడు త్వరలోనే తాను శకుంతల అనే మానినీమణిని చూడబోవుచున్నాడు కనుక మానినీ వృత్తము వాడబడినది. ఆవిధముగా చూస్తే ఈపద్యములో వనమంజరుల ప్రస్తావన, లతాకుసుమముల అందము కూడ ప్రస్ఫుటమైనది కదా? అదే విధముగా అతిత్వరలోనే వారిరువురి మధ్య జరుగబోయే సంగతమును కూడ సూచించ వచ్చును కదా? అసలు నన్నయ కాలములో ఈవృత్తపు పేరేమియో మనకు తెలియదు.
కావున నీదెస నాతనికిన్ విము-ఖత్వము గల్గదు భక్ల్తిమెయిన్
దా వినయం బెనయం గొనియాడుట – తప్పదు కాంచెద నాతనిపై
నీవును నెయ్యము గారుణికత్వము – నెక్కొనఁ దమ్ములు నవ్విభుఁడున్
వేవుర పెట్టుగ సంతతి కల్మియ – వీమది నిల్పుము పెంపొలయన్
– ఆంధ్రమహాభారతము, స్త్రీపర్వము 1.90
కూలియుఁ గాంతి యి-గుర్పఁగఁ దేజము – గుందక వహ్నులు – క్రూరశిఖా
జాల మడంగియుఁ – జాయ వెలింగెడు – చందము నొందిరి – శల్యుఁడు బాం –
చాలుఁడు గర్ణుఁడుఁ – జాపగురుండును – శాంతనవుండు ని-జంబున కీ
బాలుఁడు వీరిప్ర-భం గడచెన్ గుణభద్రుని కంటె సు-భద్రసుతున్
– ఆంధ్రమహాభారతము, స్త్రీపర్వము 2.12
నన్నయ ఒక్క వడిని, తిక్కన ఒకటి మఱియు మూడు యతులను పాటించెను. కావున మానినికి ఒకటియా లేక మూడు యతులా అన్నది బహుశా బహుళమని అనుకొంటాను. ఎందుకంటె చిత్రకవి పెద్దన
ఏడ్భగురుల్ రవి-నేని రసత్రయి-నే న్వడి మానిని – కిట్లిడనౌ — అని చెప్పెను. కాని లక్ష్యములో మూడు యతులను వాడినాడు.
నన్నెచోడుడు కుమారసంభవములో ముద్రాలంకారముతో ఒక్క వడినే వాడెను. ఆ పద్యము:
ఆననలీల సుధాకరబింబ న-వాంబురుహంబుల చెల్వగుటన్
వేనలి కృష్ణభుజంగకలాపి స-విస్తరభాసురమై చనుటం
దా నతి బాలకి యయ్యుఁ దపం బుచి-తస్థితిఁ జేయుచునుండుట నీ
మానిని రూపచరిత్ర లుదారస-మం బగుచున్నవి చిత్రగతిన్
– నన్నెచోడుని కుమారసంభవము, 7.09
నన్నెచోడుడు మాత్రము ముద్రాలంకారముగా వృత్తపు పేరు మానిని అని చెప్పినాడు. కావున చోడుని కాలములో నిది మానినిగా వ్యవహరించబడియుంటుంది.
రేచన కవిజనాశ్రయములోని కవిరాజవిరాజితపు లక్షణలక్ష్య పద్యమును క్రింద చదవండి. ఇందులో యతినిగుఱించిన ప్రస్తావన అసలు లేదు! కాని లక్ష్యములో మూడు యతులను గమనించవచ్చును.
క్రమమున నొక్క న-కారము నాఱు జ-కారములుం బర-గంగ వకా-
రమును నొడంబడి – రాఁ గవిరాజవి-రాజిత మన్నది – రామనిభా
కాని విన్నకోట పెద్దన మూడు యతులని నిక్కచ్చిగా చెప్పినాడు:
వ్రతి రస షడ్యతి – రా నము షడ్జ్వలు – రాఁ గవిరాజవి-రాజితమౌ
(వ్రతి = ఋషి, ఏడు; రస = షడ్రస, ఆఱు; షట్ = ఆఱు)
నన్నయ కవిరాజవిరాజితములో కూడ ఒక్క యతినే వాడెను. ఒక ఉదాహరణము:
చని చని ముండట నాజ్య హవిర్ధృత – సౌరభధూమ లతాతతులన్
బెనఁగిన మ్రాఁకుల కొమ్మలమీఁదన-పేతలతాంతములై నను బా-
యని మధుపప్రకరంబులఁ జూచి జ-నాధిపుఁ డంత నెఱింగెఁ దపో-
వనమది యల్లదె దివ్యమునీంద్రు ని-వాసము దా నగునంచు నెదన్
– ఆంధ్రమహాభారతము, ఆదిపర్వము 4.21
కాని తిక్కన కవిరాజవిరాజితమును కూడ రెండు విధములుగా (ఒకటి, మూడు యతులతో) వ్రాసెను. ఆ పద్యములు:
అనయము లోలకమై విషయప్రచ-యంబను దుస్తరవంశమునన్
మునుఁగుచుఁ దేలుచునుండఁగఁ గాలము – ముట్టి రుజన్ జర నెవ్వగ పై-
కొన దొరకొల్పి క్రమంబున నంగము – క్రొవ్వుచు జెల్వును బాపి ప్రయో-
జనరహితంబుగఁ జేసి యపాత్రపుఁ – జావొనరించుఁ గురుప్రవరా
– ఆంధ్రమహాభారతము, స్త్రీపర్వము 1.55
అనవుడు నిట్లను – నన్నరపాలున – కాతఁడు మోక్షము – నర్థి జగ-
జ్జనులకు బుట్టుట – సన్మతి గోరి వి-శారదు లాదర – సంభృతులై
యనఘ సుదుస్తర-మైన భవంబున – కచ్చగు నియ్యితి-హాసము బో-
ధన మహనీయ వి-ధంబునఁ జెప్పి రు-దాత్త గుణాశ్ర-యతన్ మహితా
– ఆంధ్రమహాభారతము, స్త్రీపర్వము 1.51
పై పద్యములలో మొదటి దానికి ఒక వడి, రెండవ దానికి మూడు యతులు వాడబడినవి. కాని నన్నెచోడుడు మాత్రము ఒక్క యతినే వాడెను. ఆ పద్యము:
మనునిభ చారుచరిత్రుఁ బవిత్రు న-మానుష పౌరుషవర్తి జగ
జ్జననుత నిర్మలకీర్తి రమావిభు – శాశ్వత యోగ పదస్థిరు, స
న్మునిజన ముఖ్యు శివాగమవేది న-మోఘవచోనిధి ధీనిధిఁ బా
వనతరమూర్తి సమస్త జగద్గురు – వంద్యు ననింద్యు, సదాత్మవిదున్
– నన్నెచోడుని కుమారసంభవము, 11.214
ఇది ఇలాగుంటే, నాగవర్మ కన్నడ ఛందోంబుధిలో ఈ వృత్తములకు వేఱు విధములుగా యతులను తెలిపినాడు. కన్నడములో అక్షరసామ్య యతి లేదు. విరామయతిని కూడ పాటించరు. కాని లాక్షణికులు యతులనుగుఱించి ప్రస్తావించినారు. పాదము మొత్తములో 30 మాత్రలు ఉన్నాయి. కావున పాదమును పది పది మాత్రలకు విఱుగదీసినాడితడు. ఒక విధముగా యిది కూడ సబబే! ఆ లక్షణ-లక్ష్య పద్యము:
శీతకర ప్రకరం-గళ వేೞಿడెయోళియొ-ళెయ్ద లనుక్రమదిం
భూతగణాధిపనుం – పదె దాకడెయొళ్ నిలె – విక్రమమొప్పె హయ
వ్రాత గజవ్రజదొళ్ – బరె సందుదు నాకిగ – నిందిదుమీ సకళో
ర్వీతలదొళ్ వనమం – జరియెంబుదు నామదొ-ళోదిద నబ్జముఖీ
– నాగవర్మ ఛందోంబుధి, సమవృత్త, 135.
(చంద్రుని గణములు ఏడు, అనగా ఏడు భ-గణములు, చివర ఒక గురువు కలిగి ఏడు (హయవ్రాతము), ఎనిమిది (గజవ్రజము) అక్షరములకు ఇది విఱుగుతుంది. ఓ అబ్జముఖీ దీని పేరు వనమంజరి.)
కవిరాజవిరాజితమునకు కూడ ఇట్టి యతి లక్షణములనే ప్రస్తావించినాడు. ఆ పద్యము:
దివిజ షడంబుజమి-త్ర గణప్రకరం లగ-ముం క్రమదిం పదదొళ్
వివరిసె బందు విరా-జిసె విశ్రమణం వసు – సంఖ్యెగళొళ్ నయదిం
దవిచళితం రసవృ-త్తియ నాళ్దెసెయుత్తిరె – కేళ్ కళహంసగతీ
భువనదొళీతెఱదిం – దమె సందుదు నాకిగ – నింతిదు హంసగతి
– నాగవర్మ ఛందోంబుధి, సమవృత్త, 137.
(స్వర్గము (న-గణము), ఆఱు అంబుజమిత్రులు (జ-గణములు), లగము క్రమముగా ప్రతి పాదములో నుండును. పాదము ఎనిమిది అక్షరములకు (వసు సంఖ్య) విఱుగుతుంది. కలహంసవంటి నడక గలదానా, భువనములో హంసగతి అనే వృత్తము ఈవిధముగా నుంటుంది.)
సంస్కృతములో సామాన్యముగా తాళవృత్తములకు యతిని చెప్పరు. అది కవి ఊహకు వదలుతారు.
మానిని, కవిరాజవిరాజితముల పుట్టుక: క. రా. వృత్తమును జయకీర్తి హేమచంద్రులు మాత్రమే వివరించినారు. వీరు 11వ శతాబ్దము, దాని పిదప కాలము వారు. మానిని సంగతా యని వృత్తజాతిసముచ్చయములో వివరించబడినది. దీని రచయిత విరహాంకుడు ఆఱవ ఎనిమిదవ శతాబ్దపు మధ్యకాలములో నుండెనని ఊహ. సంస్కృత కావ్యములో ఈ వృత్తముల ప్రయోగము కానరాదు. శంకరాచార్యుల యమునాష్టకము క. రా. అనే హంసగతిలో వ్రాయబడినది. మహిషాసురమర్దిని స్తోత్రమును రామకృష్ణకవి వ్రాసెను. ఈకవి కాలము తెలియదు, కాని తప్పక శంకరుల పిదపనే. మానిని వృత్తములో స్తోత్రమేదియు కనబడలేదు. కాని తమిళములోని తేవారములో సుందరర్ ఈ రెంటిని ప్రయోగించినారు. ఆ ఉదాహరణములు క్రింద ఇస్తున్నాను:
కూఱు నడైక్కుళి కట్పగు వాయన పేయుగన్ దాడనిన్ఱోరియిడ
వేఱు పడక్కుడ కత్తిలై యంబల వాణనిన్ఱాడల్ విరుంబుమిడం
ఏఱు విడైక్కొడి ఎంబెరు మానిమై యోర్బెరు మానుమై యాళ్ కణవన్
ఆఱు సడైక్కుడై అప్పనిడంగలి క్కచ్చియనేగదంగావదమే.
-సుందరర్ తేవారము, 7.10.2
(గుంటలు పడిన కన్నులు, పెద్ద నోరులతో విడువకుండ ఊళలు పెట్టుచు, చిన్న దయ్యాలవలె నక్కలు త్వరగా నడుచుచున్నవి ఇక్కడ. పడమటి చిదంబరములో (కోయముత్తూరు దగ్గరి పేరూరు) వృషభమువలె దృఢమైన దేహముతో ఱెప్పలార్చక ఉమతో, గంగతో ఉండే దేవదేవుడైన మన తండ్రి శివుడు కొలువుండే కచ్చియందలి అనేకదంగానదము అనే స్థలము యిది.)
కొడిగళిడైక్కుయిల్ కూవు మిడమ్మయి లాలుమిడమ్మళు వాళుడైయ
క్కడిగొళ్ పునఱ్చడై కొండ నుదఱ్కఱైక్కండనిడంబిఱైత్తుండముడి
చ్చెడిగొళ్ వినైప్పగై తీరుమిడం తిరు వాగు మిడం తిరు మార్బగల
త్తడిగళిడమ్మళల్ వణ్ణనిడమ్కలిక్కచ్చి యనేగదంగావదమే.
-సుందరర్ తేవారము, 7.10.3
(లతలలో పాడే కోకిలలు, నాట్యమాడే నెమలులు, పెఱిగిన పెద్ద పొదలను కత్తిరించు విధముగా దుష్ట చర్యలను నాశనము చేయుచు గంగ తలపైన పొంగుచుండగా, నెత్తిపైన నెలవంకను దాల్చిన అనలస్వరూపుడైన శివుడు ఉండే స్థలమే యీ కచ్చిలోని అనేకదంగానదము.)
ఇందులో మొదటి పద్యము మానినిలో, రెండవది క. రా. లో వ్రాయబడినవి. అనగా ఈ తాళవృత్తములు తమిళములో ఎనిమిదవ శతాబ్దము నాటికే ఎఱుక అని స్పష్టము.
తమిళ ఛందస్సు ప్రకారము మానిని లక్షణములు: ఆఱు కూవిళం శీరులు, ఒక కూవిళంగాయ్ శీరు. అదే విధముగా క. రా. లక్షణములు: ఒక కరువిళం శీరు, ఐదు కూవిళం శీరులు, ఒక కూవిళంగాయ్ శీరు.
ఇలా ఈరెండు వృత్తములు మత్తకోకిలవలె తమిళము ద్వారా మిగిలిన భాషలకు చేరినదని నా ఊహ. అందుకే ఈ వృత్తములలో సంస్కృత కావ్యములలో ఉదాహరణములు లేవు. శంకరాచార్యులకు తమిళ ఛందస్సు పరిచితమైయుండుటకు అవకాశము ఉన్నది, ఎందుకనగా ఆకాలములో మలయాళ భాష లేదు. కావున సంస్కృతముతోబాటు అతని మాతృభాషయైన తమిళములోని ఛందస్సు కూడ పరిచితమై ఉండాలి. అతడు ద్రావిడశిశువైన సంబందర్ పిదప జీవించెను. శంకరులు సుందరర్ సమకాలికులా, ఒకరి పిదప ఒకరా అన్నది నిర్ణయించలేము. ఎందుకంటే వారి కచ్చితమైన జననమరణ సంవత్సరములు మనకు తెలియవు.
తాళవృత్తముగా మానిని
చాలమంది కవులు మానిని, క. రా. వృత్తములను తమ కావ్యములలో ఉపయోగించుకొన్నారు. అందులో ఏకొన్నియో తప్ప మిగిలిన వానికి మానినియొక్క నిజమైన సౌందర్యము ప్రదర్శించబడలేదని నా వ్యక్తిగతమైన అభిప్రాయము. మానిని, క. రా. వృత్తములను ఒక అందమైన పాటవలె వ్రాయుటకు ప్రయత్నించలేదు కవులు. క. రా. వృత్తములోని మహిషాసురమర్దిని స్తోత్రమును రసికులు భక్తులు నేడు కూడ పాడుకొంటున్నారు కదా? ఆ విధముగా ఈ పద్యములను పాడుకొనుటకు వీలగునా అన్నది గమనార్హము. మానినిని క్రింది విధములుగా వ్రాయ వీలగును. అవి:
(1) మామూలుగా మూడు అక్షరసామ్య యతులతో:
చతుర్మాత్రల గతి-
కానగ నెల్లెడ – కమ్మని వాసన – కానన మింపిడెఁ – గన్నులకున్
మానస మందున – మంగళ గీతము – మంచిగ మ్రోఁగెను – మంద్రముగా
నానన మయ్యది – యప్పుడె విచ్చెను – యామిని రాణికి – నందముగా
మానిని యాడెను – మానిని పాడెను – మానిని వేడెను – మాధవ రా
3, 5 మాత్రల గతి-
నీవె మొలాముర – నేను గులాముర – నీకు సలాముర – నిక్కముగా
నీవె వరమ్ముర – నీదు యురమ్మున – నేనె సరమ్ముర – నిశ్చయమై
నీవె మనస్సున – నిండు తమస్సుల – నెట్టు యుషస్సుల – నిగ్గులుగా
నీవె హిమాంతము – నీవె వసంతము – నింపు లతాంతపు – నిక్కులుగా
(2) నాగవర్మ చెప్పిన రీతిలో పదిమాత్రలకు అక్షరసామ్య యతితో:
UII UIIU – IIUII UII – UII UIIU విఱుపుతో:
వందల పువ్వులతో – వనమంజరులం బలు – వర్ణములం గనుమా
సుందర సుస్వరముల్ – సుగమౌ నవరాగము – సొంపిడఁగా వినుమా
మందముగా వనిలో – మసృణమ్ముగ గాలులు – మత్తిడె గంధముతో
నిందునిభానన రా – హృదయమ్మును నింపుమ – యింపిడు నందముతో
(3) మూడు చతుర్మాత్రల విఱుపుతో:
అక్షరసామ్య యతితో:
చెట్టుల నాకులు రాలఁగఁ – జిత్రపు వర్ణము లెల్లెడఁ – జెల్వముతో
మెట్టఁగ సవ్వడు లయ్యెను – మేదిని కంబళ మయ్యెను – మేలిమితోఁ
గట్టలు ద్రెంచుచు మోదము – కమ్మని రాగపు నాదము – కంఠములో
నెట్టులఁ జెప్పఁగ నౌనిఁక – హృద్యము కన్నుల విందుల – దృశ్యములో
ప్రాసయతితో:
రాధను నే నిను గోరితి – వేదనతో నిట వేగితి – బాధలతో
వాదనలన్ విడనాడుము – కాదనకోయ్ నను జేరఁగ – మోదముతో
నాదరమున్ నను గూడఁగ – నా దరికిన్ దయతోడను – ముందుగ రా
తాధిమితా యని యాడుచు – నాదములన్ బలు పాడుచు – విందుగ రా
(4) అక్షరసామ్య యతికి బదులు ప్రాసయతితో:
వేళయు రాతిరి – జాలము సేయకు – తూలుచు నుంటివి – బాలకుఁడా
చాలిఁక తుంటరి – వాలము చుట్టుము – కేళిని నాపుము – కేలకుఁడా
డోలిక పిల్చెను – కేలఁ బ్రియమ్ముగ – లీలగ నూఁపెద – లాలి హరీ
కాలము రేపగు – ఖేలియు వచ్చును – మేలుగ లేపును – శ్రీలహరీ
(5) ప్రాసయతితో షట్పదిగా:
చిన్నగ పాడును – చెన్నుగ నాడును – చిన్నియ లెన్నియొ – చిందిడుచున్
వెన్నను మ్రింగెడు – వెన్నుని నవ్వులు – వెన్నెల కుప్పల – వెల్గులుగా
కన్నుల నిండుగఁ – గన్నని రూపమె – కన్నుల పండుగ – కన్నయయే
మున్నటి నోముల – పున్నెము లన్నియు – పున్నము లాయెను – మోహనుఁడై!
(చివరి యతిని తప్పించగా, ఈపద్యములో మిగిలిన వాటికి అక్షరసామ్య యతి, ప్రాసయతి రెండు ఉన్నాయి.)
పైపద్యము షట్పదిగా:
చిన్నగ పాడును
చెన్నుగ నాడును
చిన్నియ లెన్నియొ – చిందిడుచున్
వెన్నను మ్రింగెడు
వెన్నుని నవ్వులు
వెన్నెల కుప్పల – వెల్గులుగా
కన్నుల నిండుగఁ
గన్నని రూపమె
కన్నుల పండుగ – కన్నయయే
మున్నటి నోముల
పున్నెము లన్నియు
పున్నము లాయెను – మోహనుఁడై!
మఱొక షట్పది ప్రాసయతితో మాత్రమే:
పొంగుచు నున్నది
గంగయు తుంగ త-
రంగములన్ గడు – రమ్యముగా
నింగిని మబ్బులు
రంగులతోడఁ గ-
నంగను పర్విడె – నవ్యముగా
వంగిన చెట్ల కు-
రంగము లాడెను
చెంగున గంతిడి – శీఘ్రముగా
నంగన లెల్ల య-
నంగుని మాయల
సంగడులన్ గను – సంధ్య గదా!
ఇక్కడ ఇంకొక గమ్మత్తు! చంద్రరాజకవి (సుమారు క్రీ.శ. 1030, నాగవర్మ జయకీర్తుల పిదప) మదనతిలకము అనే కామశాస్త్ర గ్రంథమును రచించినాడు. దీనిని రేచన అనే ఒక మహారాజుకు అంకితము చేసినాడు. ఇది ఒక అపూర్వమైన గ్రంథము. ఇందులో ఎన్నియో చిత్రకవిత్వములు గలవు. కృతికర్తయైన రేచనృపుని ప్రశంసించుచు ఒక మానిని వృత్తమును వ్రాసినాడు. కాని అది వనమంజరిగా పేర్కొనబడలేదు. దానిని షట్పది అని పిలిచినాడు. కన్నడ కావ్యములలో ఇదియే మొదటి షట్పది. ఇందులో విరహాంకుడు పేర్కొన్న ‘సంగత’ పదము కూడ ఉన్నది. అది ముద్రాలంకారమా లేక యాదృచ్ఛికమా? ఆ పద్యము –
అంగనృపాయతి – తుంగభుజం కలి-యింగిత శిక్షితనిందుయుతం
పింగజ సంగత – భృంగకచం కలి – మంగళలక్షణయుక్తనివం
సంగరకేసరి – సంగగుణం బలి – భృంగరదక్షనుపాయతనుం
సంగద సన్మతి – రంగవహం సరె – భంగియ నీక్షిసి రేచనృపం
– చంద్రరాజకవి మదనతిలకం, 1.15
(ఎత్తైన భుజములు గలవాడు, బాగుగా చదువుకొన్నవాడు, ఎఱ్ఱని రంగుతో మిశ్రితమైన తుమ్మెదలవంటి నల్లని వెండ్రుకలు గలవాడు, మంగళకరమైన లక్షణములు గలవాడు, రణరంగములో భీముడు, బంగరువన్నెతోటి శరీరము గలవాడు, సంగడములో మంచి బుద్ది గలవాడు, రేచ మహారాజు.)
ఈపద్యము ఒక అపూర్వమైన అనితరసాధ్యమైన పద్యము. ఇందులో గోమూత్రికా మురజ బంధములు ఉన్నవట. అంతే కాక 84 వృత్తములు ఇందులో గర్భితమై యున్నవట. పదకొండవ శతాబ్దము నాటికే ఇట్టి చిత్రకవిత్వము నిజముగా విశేషమే!
(6) అక్షరసామ్య యతి, ప్రాసయతి రెండింటితో: మానిని వృత్తములో మొదటి పది అక్ష్రములకు చివరి పది అక్షరములకు ఒకే గురు లఘువుల అమరిక. ఈరెండు అమరికలు రెండు లఘువుల వంతెనచే కలుపబడినవి. వంతెనలోని మొదటి లఘువుకు అక్షరసామ్య యతి, రెందు భాగములకు ప్రాసయతి వాడబడినవి క్రింద.
UII UII – UII U – II- UII UII – UIIU విఱుపుతో:
భృంగము లెల్లెడ పాడెనుగా – విరి
రంగులు శోభల గూడెనుగా
శృంగముపై హిమ రాశులుగా – చిఱు
కొంగ లెసంగెను బారులుగా
తుంగములైన తరంగిణులే – తొల
చెంగులు దూర్పున రాగములే
రంగని జూచిన మోదములే – రస
గంగ యొనర్చెడు నాదములే
(7) అర్ధసమ వృత్తముగా మానిని:
బేసి పాదములు: UII UII – UII UII
సరి పాదములు: UII UII – UIIU
రమ్మిట మానిని – రమ్యము రాతిరి
యిమ్ముగ నుండఁగ – నిష్టసఖీ
కమ్మని మాటలు – కన్నుల సైగలు
గుమ్మను తావులు – కోమలమే
సొమ్ములు వద్దిఁక – సుందరి యుండఁగఁ
జిమ్ముచు నందము – చిత్రముగా
నిమ్మహి నామని – యెప్పుడు నీదరి
కొమ్మల పాడెడు – కోకిలలే
(8) త్రిభంగివలె మానిని:
మన్ననతోఁ గనుమా – కథలన్ వినుమా – ప్రియ యంచనుమా – మనుమా
చిన్నియలే కురిసెన్ – గలువల్ విరిసెన్ – మదియో మురిసెన్ – దరిసెన్
వెన్నెలలో నలపే – యెపుడున్ దలఁపే – హృదిలో వలపే – పిలుపే
పున్నమిలో సరమున్ – హృదయాంబరమున్ – గొను సంబరమున్ – గరమున్
(9) మానినిలో నినిమా – (భ)7+గురు = గురు+(స)7
ఓ
కలలోఁ గలికీ – చెలువంపు సకీ – జలజాతముఖీ సుముఖీ
నా
కలలో సుదతీ – యిలలో సుగతీ – మలపైన ద్యుతీ ప్రకృతీ
రా-
కలలోని నిశీ – వెలుఁగొందు శశీ – వలపందు ఖుసీ యరసీ
నా
కలరింతగ రా – పలికించఁగ రా – లలి పెంచఁగ హృత్ప్రతిమా
ఏడు స-గణములతోడి వృత్తమును ప్రతిమా అని వాగ్వల్లభకారుడు పిలిచెను.
ప్రతిమా – (స)7 IIU IIU – IIU IIU – IIU IIU IIU 21 ప్రకృతి 898780
కలలోఁ గలికీ – చెలువంపు సకీ – జలజాతముఖీ సుముఖీ
కలలో సుదతీ – యిలలో సుగతీ – మలపైన ద్యుతీ ప్రకృతీ
కలలోని నిశీ – వెలుఁగొందు శశీ – వలపందు ఖుసీ యరసీ
యలరింతగ రా – పలికించఁగ రా – లలి పెంచఁగ హృత్ప్రతిమా
(10) మానిని వృత్తములో వివిధములైన సంగీత తాళములు:
ఏకతాళము, ఆదితాళము:
ఆదితాళము: లఘువు-ద్రుతము-ద్రుతము; చతురస్రగతిలో లఘువుకు నాలుగు మాత్రలు; మొత్తము ఎనిమిది మాత్రలు.
ఏకతాళము: చతురస్రజాతిలో లఘువుకు నాలుగు మాత్రలు.
ఉదాహరణము:
ఏలెడు భూపతి – యేఁగెను వేటకు – నింతిని జూచె త నా
మాలిని తీరము – మానినిపైఁ బడె – మారుని యమ్ము విరుల్
కాలెను డెందము – కాలెను దేహము – కాలెను వారలకున్
లీలల జేతుల – లెస్సగఁ బట్టిరి – లేయెద లొక్కటియే
ధ్రువతాళము: లఘువు-ద్రుతము-లఘువు-లఘువు; మొత్తము 14 మాత్రలు.
పున్నమిలో పులకించిరిగా
నెఱి
కన్నెలు నృత్యపు చిందులతో
వెన్నెలలో వికసించిరిగా
విరి
కన్నెలు కన్నుల పండువుగా
వన్నెలతో వినిపించిరిగా
చిఱు
కన్నెలు వీనుల విందులుగా
కన్నులతో కదిలించిరిగా
కల
కన్నెలు క్రొత్తగు కాంతులతో
మఠ్యతాళము: లఘువు-ద్రుతము-లఘువు; మొత్తము పది మాత్రలు. ఇందులో ర-గణ మఠ్యము కూడ ఉన్నది. అనగా గురువు-లఘువు-గురువు, మొత్తము 20 మాత్రలు, ఉదా. ఆ గమనమ్ముల।లో నను।రాగము నిండఁగ. నాగవర్మ వనమంజరి పేరితో చెప్పిన మానినీ వృత్తపు యతి ఈ తాళమునకు సరిపోతుంది.
ఆ గమనమ్ములలో
ననురాగము నిండఁగ
నాశలు పొంగెనుగా
యోగము నాదె సఖీ
యువగీతము నే విన
నుల్లము గంగయెగా
రాగము నెత్తు సఖీ
రసమాధురి పెంచుచు
రమ్యముగా రవముల్
వేగమె పాడు సఖీ
వినిపించి రమించుచు
ప్రీతిగ సుస్వరముల్
రూపకతాళము: లఘువు-ద్రుతము; మొత్తము ఆఱు మాత్రలు.
కోమలతా
సుధ జిందెడు కామలతా
ముద మిచ్చెడు ప్రేమలతా
సోమలతా
హృదిలో గల శ్యామలతా
నిధి నీవెగ హేమలతా
ఆమనిలో
మధుయామిని యామములో
నిదురించని ధామములో
నా మదియో
మదిరా యనె ప్రేమములో
మధువున్ గనె నామములో
కవిరాజవిరాజితము – మదనశర
మానినీ వృత్తములోని మొదటి గురువును రెండు లఘువులుగా చేసినప్పుడు మనకు కవిరాజవిరాజితము (సంస్కృతములో హంసపద) లభించును. కాని ఈ ప్రక్రియను మొత్తము పద్యములో చేయలేదు. అనగా మూడవ, ఐదవ, ఏడవ మాత్రాగణములు (భ-గణములు) గురువుతోనే ప్రారంభమయ్యెను. వీటిని కూడ న-లములుగా చేసినప్పుడు జనించిన వృత్తమును నేను మదనశర అని పిలువదలచాను.
మదనశర – న/జ/న/స/న/న/భ/న/లగ IIII UII IIII UII IIII UII IIII U
26 ఉత్కృతి 33290224
సుమముల మాలవొ – సుఖముల లాలివొ – శుభముల శాలవొ – సురతరువో
కమలదళాక్షివొ – కలువల కాంతివొ – కవనపు భ్రాంతివొ – కళ కిరవో
మమతల వీణవొ – మణుల కిరీటమొ – మధుమయ పాత్రమొ – మదనశరా
విమల సరస్సువొ – విలసిత గీతమొ – వికసిత హాసమొ – ప్రియతమ రా
షట్పదిగా మదనశర –
కలువల రాజువు
నెలతల మోజువు
చెలువఁపు గాజువు – చిలిపి శశీ
వలపుల చిచ్చుగ
తలఁపులు రెచ్చఁగ
నలుగకు నాపయి – నమల దృశీ
చెలువఁపు టాటల
తెలుఁగున పాటల
వెలుఁగుల బాటలఁ – బ్రియతమ రా
కిలకిల నవ్వుల
పొలుపుల పువ్వుల
సలలిత రాగపు – స్వరముగ రా
మదనశర – యతి (1, 13), ప్రాసయతి (1, 15) ఇందులో మొదటి 12 అక్షరములకు, చివరి 12 అక్షరములకు గురు లఘువుల అమరిక ఒక్కటే.
అనిశము గొల్చుట నినెగదరా – హరి –
వనరుహలోచన వరమియరా
కనుగవ ముచ్చట కనుటయెగా – కల –
క్షణమునఁ దీరుట సుకృతమెగా
మనసున మోహన వదనమెగా – మఱి –
దినములు రాత్రులు మధురముగా
తనువది నీకయి యుడుగుటకే – తరి –
మనికికి నీవని యడుగుటకే
బుధరాజవిరాజితము
శ్రీమతి సుప్రభగారు, కవిరాజవిరాజితమునకు ఒక చిన్న మార్పును చేసి ‘బుధరాజవిరాజితము’ అనే వృత్తమును కల్పించినారు. మానినినిలోని మొదటి, ఐదవ భ-గణములను న-లములుగా చేయడమే ఈ మార్పు. క్రింద ఒక ఉదాహరణము:
బుధరాజవిరాజితము – న/జ/జ/జ/న/స/స/స IIII UII UII UII – IIII UII UIIU
24 సంకృతి 7207792
కమలము లెల్లెడఁ – గన్నుల కింపుగ – కనఁబడె రంగుల – కాంతులతో
విమల ముషోదయ – వేళయు సూర్యుని – వెలుఁగుల రేకలు – వేడిమియే
కమలదళాక్షులు – కమ్మని పాటలఁ – గడవలఁ జిల్కిరి – గల్లనుచున్
రమణులు లేపిరి – రాముని కృష్ణుని – వ్రజమున వేకువ – రమ్యముగా
ఈ వృత్తపు గురు లఘువులను క్రింది విధముగా వ్రాసినప్పుడు మొదటి భాగము చివరి భాగములకు ఒకే గురు-లఘువుల అమరిక. ఈ రెండు అమరికలు రెండు లఘువుల వంతెనచే కలుపబడినవి. రెండు భాగములకు ప్రాసయతిని ఉంచి వ్రాసినప్పుడు ఈ వృత్తము అందముగా ఉంటుంది. ఇది ఒక కొత్త దృక్కోణము. క్రింద నా ఉదాహరణములు –
IIII UII UII U – II – IIII UII UII Uయతి, ప్రాసయతి
కలికికిఁ గోపము వచ్చినచో – కథ –
మలుపుకుఁ జేరును హెచ్చరికోయ్
పలుకుకుఁ దేనియ పూసినచో – పలు –
తళుకుల మాటలు తీయనగున్
నిలునిలు మంటిని వేగముగా – నిను –
వలపుల ముంచెద రాగముతో
కలతలు వంతలు తీరెనుగా – కడు –
వెలుఁగుల జీవిత ముండునుగా
మానిని – అల్పాక్కర
మానిని: UII UII UIIU – II – UII UII UIIU
అల్పాక్కర: UII UII – UIIU (ఇంద్ర, ఇంద్ర, చంద్ర గణములు)
క్రింద ఒక ఉదాహరణము:
అందము చిందుచు నాడుదమా – హరి –
ముందర భక్తిగ మ్రొక్కుదమా
కుందపు మాలలఁ గ్రుచ్చుదమా – గురు –
వందితు గాథలఁ బాడుదమా
చందన గంధము చల్లుదమా – స్వర –
సింధువులన్ బలు చేర్చుదమా
నందజుతో నిట నవ్వుదమా – నవ –
సుందరమూర్తికిఁ జొక్కుదమా
దుర్మిలా – మానిని
దుర్మిలా: (స)8 24 సంకృతి 7190236 IIU IIU IIU IIU – IIU IIU IIU IIU
చలచల్లని చూపులఁ జల్లుచు రా – సరసంపు పదమ్ములఁ జార్చుచు రా
మెలమెల్లగ వీణను మీటుచు రా – మెఱమెచ్చగఁ బాడుచు మేటిగ రా
తెలతెల్లని కాంతులఁ దేలుచు రా – దివి దీప్తుల భూమినిఁ దేల్చఁగ రా
గలుగల్లున నాడుచు గంతుల రా – కలకాలము నన్నిలఁ గాంచఁగ రా
ఇందులో గర్భితమైయున్న మానినీవృత్తము:
చల్లని చూపులఁ – జల్లుచు రా సర-సంపు పదమ్ములఁ – జార్చుచు రా
మెల్లగ వీణను – మీటుచు రా మెఱ-మెచ్చగఁ బాడుచు – మేటిగ రా
తెల్లని కాంతులఁ – దేలుచు రా దివి – దీప్తుల భూమినిఁ – దేల్చఁగ రా
గల్లున నాడుచు – గంతుల రా కల-కాలము నన్నిలఁ – గాంచఁగ రా
కిరీటము – మానిని – మోదకము
కిరీటము: (భ)8 24 సంకృతి 14380471 UII UII – UII UII – UII UII – UII UII
మోదకము: (భ)4 12 జగతి 3895 UII UII – UII UII
కి. మోదకహస్తుని – ముందుగఁ దల్తును – మోదము లిచ్చెడు – పూర్ణనిధిన్ గురు
సాధన లిచ్చెడు – సామజ శీర్షుని – సాదరు నెంతును – శాశ్వతునిన్ మృదు
నాదవినోది వి-నాయకు విఘ్న ని- నాద వినాశకు – నమ్రముగా హృది
కాదనకుండ త్రి-కాలము గొల్తును – గాదిలితోడను – గౌరిజునిన్ ధర
నాలుగు పాదములలోని చివరి రెందు అక్షరములను (గురు, మృదు, హృది, ధర) తొలగించినప్పుడు మనకు మానినీవృత్తము లభిస్తుంది. కిరీటపు ఒక పాదములో రెండు మోదకపు పాదములు ఉన్నాయి.
సీసము – మానిని, తేటగీతి – ద్విపద
సీ. మానిని చూడవె – మాధవుఁ డంపిన
మన్మథ లేఖను – మన్ననగను
దానిఁ బఠించినఁ – దాపము తగ్గును
ధన్యగ నౌదువు – తథ్యముగను
కానఁడె యంచును – గష్టము చెందకు
కామిని వచ్చును – గన్నఁడిటను
నీనగు మోమును – నిత్యము చూచును
నింపును మోదము – నీకెపుడును
తే. హాయిహాయిగ నుందు వ-హరహ మిచట
మాయగాఁడిఁక వచ్చు మ-మతను బంచ
సోయగాలకు రాశి సు-సుఖము నొందు
చేయిచేయియు గల్ప శి-శిరము వచ్చె
సీసమునందలి చివరి సూర్యగణములోని ను-కారము మానినిలో ద్రుతము అవుతుంది. తేటగీతికి ద్విపదకు యతులు పక్కపక్కన ఉంటాయి.
సీసము – కవిరాజవిరాజితము, తేటగీతి – ద్విపద
సీ. మనసున పూచిన – మల్లెల నల్లిన
మాలల గొల్తును – మాధవ నిను
ప్రణతుల వేడెద-రా కవిరాజవి-
రాజితమౌ పలు – ప్రస్తుతులను
కనులకు ముందుగ – గంతుల వేయుచు
గానము పాడుచుఁ – గాంచుమ నను
తను విట వేచెను – దాపము తీఱఁగ
తప్పక రమ్మిటఁ – దాఁకగ నను
తే. వేగ వచ్చెద నంటివి – ప్రియముగాను
నే గవాక్షము వద్దనె – నిలచినాను
మూగవోయెను డెందము – ముదము లేక
రాగవీణను మీటర – రమణ యిపుడు
సీసమునందలి చివరి సూర్యగణములోని ను-కారము మానినిలో ద్రుతము అవుతుంది. తేటగీతికి ద్విపదకు యతులు పక్కపక్కన ఉంటాయి.
ఒక మానినికి ఎన్నియో ఆకృతులు
మానిని – (భ)7/గ 22 ఆకృతి 1797559
[UII UII] = భా
మానిని – (భ)7/గ = భా1 – భా2 – భా3 – భ/గురు
క్రింది పద్యములో ప్రతి పాదములో ఉండే భా1, భా2, భా3 గణములను ఏ విధముగానైనను అమర్చ వచ్చును. యతి ప్రాసలు కాని, నడక కాని, దార కాని చెడదు. ఒక్కొక్క పాదమును 6 విధములుగా వ్రాయ వీలగును. అవి:
భా1 – భా2 – భా3 – భ/గురు
భా1 – భా3 – భా2 – భ/గురు
భా2 – భా3 – భా1 – భ/గురు
భా2 – భా1 – భా3 – భ/గురు
భా3 – భా1 – భా2 – భ/గురు
భా3 – భా2 – భా1 – భ/గురు
అనగా మొత్తము పద్యమును 6 x 6 x 6 x 6 = 1296 విధములుగా వ్రాయవచ్చును. ఒక పద్యమును చేతితో వ్రాయుటకు 5 నిమిషములు పట్టితే, వీటిని అన్నింటిని వ్రాయుటకు సుమారు 108 గంటలు అవుతుంది. అనగా నిద్రాహారాలు మాని వ్రాస్తే సుమారు నాలుగున్నర రోజులు; విశ్రాంతితో వ్రాస్తే సుమారు ఒక వారము పట్టుతుంది! పాదములను కూడ మార్చినప్పుడు 1296 ను 24 తో గుణించాలి. ఆ సంఖ్య 31104. ఇది కూడ చిత్రకవిత్వమే! క్రింద ఒక ఉదాహరణము:
దీనజనావన – ధేనుచయాధిప – తేనియ మాటల – దేవహితా
మానిని నింపెను – మానసమందున – మానని యాశల – మాధురితో
ప్రాణము నిచ్చెద – వాణి వినంగను – భానుసమోజ్జ్వల – పద్మముఖా
గానవిశారద – జ్ఞానపయోనిధి – కానఁగ రమ్ముర – కామినికై
ముగింపు
సంతోష సన్నివేశములకు, త్వరితగతిని సూచించుటకు, ప్రాసానుప్రాసలను ఉపయోగించి గానయోగ్యముగా నుండు వృత్తములలో మానిని, కవిరాజవిరాజితములు అత్యుత్తమ శ్రేణికి చెందినవి. నేను కొన్ని సంవత్సరములుగా పరిశోధించి కనుగొన్న విశేషములను ఇక్కడ ఉంచుటకు ప్రయత్నించినాను. తాళవృత్తములను మాత్రాగణములకు తగినట్లు పదములను ఎన్నుకొని వ్రాసినప్పుడు అవి గానయోగ్యముగా నుండి ఛందస్సు సంగీత సాహిత్యముల రెండు ముఖములని తెలుపుతుంది.