ఆమె దుఃఖించింది

ఆమె దుఃఖించింది
అకారణంగా అనుమానించింది
అభిముఖం పెడమొహం అయిందని
తలపైన వలపు మబ్బు ఎక్కడికో తరలిపోయిందని
తాను కోరుకొన్నది తనను కోరుకోవటం లేదని
తనకు తనే
హృదయంలో శూలాన్ని దిగేసుకుంది
దిగులు నదిని ఈదలేక
మరో సూర్యోదయం చూడరాదనుకొని
వయసు మునిమాపున కోరుకోవాల్సిన ముగింపేదో
నట్టనడిజామునే కోరుకొంది
ఏ బరువులూ బాధ్యతలూ తీరకుండానే
తనకు తనే సున్నా చుట్టేసుకొంది

ఇక చాలు అతని గురించి ఎడతెగని తలపులు ప్రగాఢ చుంబనాలు భుజంపై తల వాల్చటాలు ఎంతకీ వదలని కౌగిళ్ళు అన్నీ మరిచిపోయి తుదముట్టిన ఆశలా ఒక విస్మృతిలోకి జారిపోయింది గాలికి తూలిన సన్నజాజి తీగలా ఒక లోయ లోకి జారిపోయింది చివరి కన్నీటిచుక్కలా చిట్టచివరి ఊపిరిలా అలా –

అతడు తనువంతా అశ్రుకణమయ్యాడు
విలపించాడు విలవిల్లాడాడు
చిగురుటాకులా కంపించిపోయాడు
వేయి దేవుళ్ళను వేడుకొన్నాడు
అదే ప్రేమతో అదే ఇష్టంతో
ఆమె చేతిని తాకాడు

దయ గల దేవతెవరో
ఆమె తల నిమిరి వెనక్కి పంపించింది
చూడరాదనుకొన్న మరో కొత్త సూర్యోదయాన్ని
చూసిందామె ప్రశాంతంగా
పైకి లేచిన హంస వెనక్కి మళ్ళి
మనస్సరోవరాన వాలింది
తలపై మేఘాన్ని చూసింది ఆనందంగా
కాలు మోపిన ఆ కారుచీకటి గుయ్యారంతో
ఇక పనేమిటి?
హిమశీతల హస్తస్పర్శతో పనేమిటి?
కోరుకొన్న మనసు
మనసుతో పెనవేసుకొన్నప్పుడు
మృత్యువుతో పనేమిటి?