కొన్ని క్షణాలు

నిద్ర పోతూనే వుంటానా
బుడిబుడి అడుగుల చిన్ని పాప
ముందే మేల్కొన్న ఉదయమై
నా చెంపలను తడుముతూ
ఏదో భాషలో పలకరిస్తూ
నిదుర లేపాలని ప్రయత్నిస్తూంటుంది

దోబూచులాడే నిద్ర మాత్రం
కనులతలుపులను
తెరవకుండా చేస్తూంటుంది

ఉన్నట్టుండి పెదవి చివర
నవ్వుమొగ్గ పువ్వులా మారుతుంది
కానీ సవ్వడి చెయ్యదు

ఆకాశంలో మెరుపులా
మనసులో పులకింతొకటి
ఎపుడు తళుకుమంటుందో
ఎపుడు జలపాతమై
దొరలిపోతుందో-

ఏ తేనెటీగ పూలతేనెలను
ఎప్పుడు దొంగిలించి పోతుందో
వానను తరిమేసి
ఇంద్ర ధనువొకటి
ఎలా వికసిస్తుందో-

అవును
కొన్ని క్షణాలు
ఎపుడూ రహస్యాలే!


విజయ్ కోగంటి

రచయిత విజయ్ కోగంటి గురించి: విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ...