నావికుడు

పరిచయం

గ్రీకు దేవుడు ప్రోటియస్ (Proteas) సముద్రజలాలకీ నదులకీ అధిపతి, బహురూపి. పోర్చుగీసు కవి ఫెర్నాండో పెసోఆకి (Fernando Pessoa) ప్రోటియస్ ప్రేరణ కావచ్చు. అతనికి ముందు నాలుగు శతాబ్దాల్లో అతనివంటి సాహిత్యకారుడు లేడని పేరుపడ్డ ఫెర్నాండో, అతని జీవితకాలంలో ఆల్బెర్తో కయేరో (Alberto Caeiro), రికార్దో రెయిస్ (Ricardo Reis), అల్వారో దె కంపోస్ (Alvaro de Campos) అన్న పేర్లతో రచనలు చేసినట్టు మాత్రమే ప్రపంచానికి తెలుసు. అతని మరణానంతరం అరవైరెండుకి పైగా మారుపేర్లతో వ్రాసినట్టు తెలుసుకున్నారు. అతనే చెప్పుకున్నట్టుగా, వీటిలో ప్రతి పేరుకీ ఒక వ్యక్తిత్వం, ఒక చరిత్ర, దృక్పథం, సాహిత్య ధోరణి ఉండేలా ఇంగ్లీషు, పోర్చుగీసు, ఫ్రెంచి భాషలలో అనితర సాధ్యమైన సాహిత్యాన్ని సృష్టించాడు.

ఈ నిశ్చల ఏకాంకిక నాటిక, నావికుడు (The Mariner) రిచర్డ్ జీనత్ (Richard Zenith) పోర్చుగీసు నుండి అనువదించి సంకలించిన The Selected Prose of Fernando Pessoa నుండి గ్రహించబడింది. నిశ్చల నాటకం (Static Drama) అన్నది స్వయంవిరుద్ధమైన పదబంధం. నాటకం అన్న మాటలోనే నటన/ అభినయం, పాత్రల ఆలోచనలు, చేతలద్వారా వచ్చే సంఘర్షణ, ఒక తీవ్రస్థాయికి చేరిన తర్వాత దాని పర్యవసానం సుఖాంతంగానో, దుఃఖాంతంగానో పరిణమించడం మనం చూస్తాం. ఇందులో పాత్రలు తామున్న చోటునుండి కదలవు. కదలాలన్న కనీస ప్రయత్నం కూడా చెయ్యవు.

దీనిని పెసోఆ నాటకంగా సమర్థిస్తూ ఇలా అంటాడు: ‘నిశ్చల ఏకాంకిక’ అని అనడంలో ఈ కథా వస్తువులో నటన/నాటకీయత లేదని చెప్పడం నా ఉద్దేశ్యం. ఇందులోని పాత్రలు నటించవు. ఎందుకంటే, అవి ఉన్నచోటు నుండి కదలడం గాని, కదలాలని అనుకోవడం గాని ఇందులో కనిపించదు. కనీసం, అవయవాల కదలిక గాని కనిపించదు. మరోమాటలో చెప్పాలంటే, ఈ రూపకంలో నిజమైన కథావస్తువు గాని, సంఘర్షణ గాని లేవు. కొందరు దీన్ని ఎంతమాత్రం నాటకంగా పరిగణించకూడదని వాదించవచ్చు కూడా. కానీ, నా దృష్టిలో ఇది నాటకమే. ఎందుకంటే, నాటకం అంటే రంగస్థలం మీద కేవలం పాత్రల అభినయం ఒక్కటే కాదు; దానిని మించినది. రంగస్థలం మీద నటనో, పాత్రల ఆలోచనలో, వాటి చేతల పర్యవసానమో రంగస్థలి పరమార్థం కాదు. విస్తృతమైన అర్థంలో, రంగస్థలం మీద పాత్రల మధ్య జరిగే సంభాషణల ద్వారా, సృష్టించిన సందర్భాల ద్వారా ఆత్మావిష్కరణ జరిగి, ఒక సందేశం అందాలి. ఈ ఆత్మావిష్కరణ, ఏ అభినయమూ లేకుండా కూడా జరుగవచ్చు. వాస్తవానికి తలుపులూ కిటికీలూ తెరవని, కేవలం ఆత్మానుగతమైన జడత్వపు సందర్భాన్ని మాత్రమే రంగస్థలం మీద సృష్టించవచ్చు.

ఈ పదబంధాన్ని బెల్జియన్ నాటకకర్త మరీస్ మేటర్‍లింక్ (Maurice Maeterlinck) నుండి తీసుకున్నాడని జీనత్ అభిప్రాయం. ఈ నాటికలో ఉన్నవి మూడే మూడు పాత్రలు. ముగ్గురు యువతులు ఒక గుండ్రని విశాలమైన గదిలో కూర్చుని, ఎదురుగా ఉన్న నాల్గవ యువతి శవానికి రాత్రంతా శవజాగరణ చేస్తారు. ఆ గదిలో ఒకే ఒక్క కిటికీ, అందులోంచి కనిపించే ఆరుబయట మసక వెన్నెల, దూరంగా రెండు కొండలు, మధ్యనుండి కనవచ్చే చిన్ని సముద్రపు తునక మాత్రమే మనకి కనిపించే రంగస్థల అలంకరణ. ఏ పాత్రా ఉన్నచోటు నుండి కదలకుండానే కేవలం సంభాషణ ద్వారా జీవితం గురించి చర్చ జరుగుతుంది. జీవితం -కల అన్న ఈ రెండు మాటల మీద విపులమైన మానసిక విశ్లేషణ ఇందులో ఉంటుంది.

ఈ ఏకాంకికని అనేక విధాలుగా చూడవచ్చు:

  • ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో, మనమందరం అంతరించిన లేదా అంతరించడానికి సిద్ధంగా ఉన్న మానవుడికి శవజాగరణ చేస్తున్న వాళ్ళం. మనం మన జీవితాల గురించి కలగంటున్నాం.
  • ఇందులో రెండవ యువతి కలగన్న నావికుడి పాత్రలాగ, మనమందరం జీవితనౌక భగ్నమై, దారితప్పి ఏదో తీరానికి కొట్టుకువచ్చినవాళ్ళం. మనం మన పూర్వ జీవితానికి గాని, ఆశించిన జీవితానికి గాని చేరుకోలేము. కనుక మనచుట్టూ ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకుని, ఆ కలల లోకంలో అదే నిజమన్న భ్రమలో జీవిస్తున్నాం.
  • ఉన్నదున్నట్టుగా కాక ప్రతీకగా చూస్తే, మనకందరికీ మన స్వయంకృషి వల్ల గాక, అకస్మాత్తుగా జరిగే సంఘటనల వల్ల మన సమస్యలకి సమాధానం కావాలి. అందరికీ జీవితం ఎప్పుడూ సుఖమయంగానే సాగాలి. సమస్యలన్నా, సవాళ్ళన్నా ఎదుర్కోటానికి భయం.

ఇందులో రచయిత చెప్పినట్టు, ప్రతి కథకీ ప్రతి కలకీ ముగింపు ఉండనక్కరలేదు. అవి నిరంతరంగా సాగేవి. ఈ ఏకాంకికలో మనిషి జీవితంలో ఎంత సంక్లిష్టత, సందిగ్ధత, అస్పష్టత ఉన్నాయో, పాత్రల మాటల పేర్పులో రచయిత అంత నైపుణ్యమూ కనపరుస్తాడు.

నావికుడు – ఒక నిశ్చల ఏకాంకిక

ఒక పాత కోటలో అది ఒక గది. ఆ గదిని చూడగానే, అది గుండ్రని కోట అని మనం గ్రహించవచ్చు. ఆ గదికి మధ్యలో, ఒక శవవాహిక మీద తెల్లని దుస్తుల్లో పడుకున్న ఒక యువతి శవం ఉంటుంది. నాలుగు ప్రక్కలా, గోడలపై కాగడాలు వెలుగుతూ ఉంటాయి. ఎదురుగా గదిని చూస్తున్నవారికి, కుడిప్రక్కన వెడల్పుగా ఉన్న ఒక కిటికీ, అందులోంచి దూరంగా రెండు కొండలు, వాటి మధ్యలోనుండి ఒక సముద్రపు తునకా కనిపిస్తూ ఉంటాయి. కిటికీకి ప్రక్కగా ముగ్గురు యువతులు శవజాగరణ చేస్తూ ఉంటారు. మొదటి యువతి కిటికీకి ఎదురుగా కూచుని ఉంటుంది. కుడిప్రక్కన ఎత్తుగా వెలుగుతున్న కాగడా ఆమెకు వెనుకగా ఉంటుంది. తక్కిన ఇద్దరూ కిటికీకి చెరొక పక్కా కూచుని ఉంటారు.

అది రాత్రి సమయం. ఆరుబయట మసక వెన్నెల వెలుగు లీలగా ప్రసరిస్తూంటుంది.

మొదటి యువతి
(మొ.యు.):
ఇంకా గడియారం గంట వినిపించలేదే.
 
రెండవ యువతి
(రెం.యు.):
వినిపించదు. దగ్గరలో ఏ గడియారమూ లేదు. కొద్ది సేపట్లో తెల్లవారబోతోంది.
 
మూడవ యువతి (మూ.యు.):
లేదు. తూర్పున ఇంకా చీకటిగానే ఉంది.
 
మొ.యు:
మరి, ఒకప్పుడు మనం ఎలాంటివాళ్ళమో చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దామా? అక్కా, అందమైన అబద్ధం లాంటిదది. ఎప్పుడు చెప్పుకున్నా కొత్తగానే ఉంటుంది.
రెం.యు:
వద్దు. మనం దాని గురించి మాటాడుకోవద్దు. అదీగాక, గత జీవితం అంటూ అసలు మనకి ఏమైనా ఉందా? మనం ఎప్పుడైనా ఏదయినా అయ్యామా?
మొ.యు:
ఏమో. నాకు తెలీదు. కానీ అది ఎలాంటిదైనా, గతాన్ని గురించి మాటాడుకోవడం ఎప్పుడూ బాగానే ఉంటుంది. సమయం గడిచిపోతోంది. ఇంతసేపూ మనం మౌనంగా కూచున్నాం. నేను అదిగో, ఆ వెలుగుతున్న కొవ్వొత్తిని చూస్తూ సమయం గడిపాను. ఒక్కోసారి మిణుకుమంటూంది, పసుపురంగులోకి మారుతుంది. లేదా తెల్లగా కాంతివంతంగా మండుతోంది. అలా ఎందుకు జరుగుతోందో నేను చెప్పలేను. కానీ, అక్కా, అసలు ఏదైనా ఎందుకు జరుగుతుంది? ఏదీ జరగకుండా ఎందుకు ఉండదు?

(కాసేపు మౌనం)

మొ.యు:
గతాన్ని గురించి మాటాడుకోవడం ఎందుకు బాగుంటుందంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు కాబట్టి. పశ్చాత్తాపం తప్ప జ్ఞాపకాలు ఏమిస్తాయి మనకు?
రెం.యు:
మీకు ఇష్టమైతే మాటాడుకుందాం. కానీ, మనం ఎన్నడూ అనుభవించని గతాన్ని గురించి మాత్రమే మాటాడుకుందాం.
మూ.యు:
లేదు. గతం అంటే బహుశా మనం అనుభవించినదే అయివుంటుంది.
మొ.యు:
నువ్వు ఉత్తుత్తి మాటలు మాటాడుతున్నావు. మాటలతో మర్చిపోడానికి ప్రయత్నించడం ఎంత విచారం. దానికి బదులు మనం అలా సరదాగా షికారుకి వెళితే ఎలా ఉంటుంది?
మూ. యు:
ఎక్కడికి?
మొ.యు:
ఎక్కడికీ లేదు. ఇక్కడే. అట్నించి ఇటూ, ఇట్నించి అటూ. కొన్నిసార్లు పచారు మంచి కలలను తెస్తుంది.
మూ.యు:
వేటి గురించి?
మొ. యు:
ఏమో నాకు తెలీదు. అయినా, నాకు తెలియాలని ఏముంది?

(కాసేపు మౌనం)

రెం. యు:
ఈ నేలే అలాంటిది. ఇక్కడ అంతా విషాదమే. నేను పూర్వం ఉండే చోట ఇంత విషాదం లేదు. ప్రతిరోజూ చీకటి పడగానే కిటికీ ప్రక్క కూచుని ఆలోచనల్లో మునిగిపోయేదాన్ని. కిటికీలోంచి చూస్తుంటే సముద్రం కనిపించేది. దూరంగా సముద్రంలో అప్పుడప్పుడు నాకో ద్వీపం కూడా కనిపించేది. ఒక్కోసారి ఏమీ ఆలోచించేదాన్ని కాదు. సముద్రం వంక అలా చూస్తూ జీవితం గురించి మరిచిపోయేదాన్ని. నేను సుఖంగా ఉన్నానా అంటే, చెప్పలేను. బహుశా, ఏనాడూ నాది కాని జీవితానికి నేను ఎన్నటికీ పోలేనేమో!
మొ.యు:
ఇప్పుడు చూడటం తప్పితే, మునుపెన్నడూ సముద్రాన్ని చూసి ఎరుగను. ఈ కిటికీలోంచి మరీ చిన్నముక్క మాత్రమే కనిపిస్తోంది. ఇందులోంచి తప్ప మరెందులోంచీ అసలు సముద్రం కనిపించనే కనిపించదు. మిగతా చోట్ల కూడా సముద్రం ఇంత అందంగా ఉంటుందా?
రెం.యు:
మిగతా చోట్ల ఉండే సముద్రమే ఎప్పుడూ అందంగా కనిపిస్తుంది. మనం చూసే సముద్రం ఎన్నడూ మనం చూడలేని దేశాల్లోని సముద్రాన్ని చూడాలన్న కోరిక కలిగిస్తూంటుంది.

(కాసేపు మౌనం)

మొ.యు:
మనం మన గతాన్ని గురించి చెప్పుకుందామని అనుకున్నాం కదూ?
రెం.యు:
లేదు. అనుకోలేదు.
మూ.యు:
ఈ గదిలో అసలు గడియారం ఎందుకు లేదు?
రెం.యు:
ఏమో, నాకు తెలీదు. అయితే, ఇలా ఏ గడియారమూ లేకపోవడం వల్ల ప్రతీదీ పరాయిగాను, వింతగానూ కనిపిస్తున్నాయి. ఈ రాత్రి దానికదే ఎవరికీ పట్టనట్టు ఉంది. బహుశా, ఇప్పుడు సమయం ఎంత అయిందో తెలిస్తే, ఇలా మాటాడుకోగలిగే వాళ్ళం కాదేమో!
మొ.యు:
అక్కా, నా విషయానికి వస్తే, అంతా విషాదమే! నా మనసులో ఎప్పుడూ శిశిరమే. నేను కిటికీవంక చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. చూస్తే, దూరంగా ఉన్న కొండలు కనిపిస్తాయని నాకు తెలుసు. ఒకప్పుడు ఏవో కొండలకి దూరంగా హాయిగా ఉండేదాన్ని. అప్పుడు నేనింకా చిన్నపిల్లని. ప్రతిరోజూ పువ్వులు కోసేదాన్ని. రాత్రి పడుకోబోయే ముందు, అవి నా నుండి ఎవరూ లాక్కోకూడదని కోరుకుంటూ ఉండేదాన్ని. ఆ రోజులు మళ్ళీ రావు. అవి తలుచుకుంటే ఏడుపొస్తుంది. ఇక్కడికి దూరంగా ఉండే చోట్లలోనే అలాంటివి సాధ్యం. ఎప్పుడు పొద్దు పొడుస్తుందో!
మూ..యు:
ఎప్పుడు పొద్దు పొడిచినా ఏం తేడా పడుతుంది? అన్ని పొద్దులూ ఒక్కలానే పొడుస్తాయి. అన్నీ ఒక్కలా అంటే ఒక్కలానే ఉంటాయి.

(అందరూ కాసేపు మౌనం)

రెం.యు:
మనం ఒకరి తర్వాత ఒకరు కథలు చెప్పుకుందాం. నాకయితే ఏ కథలూ రావు. దాని వల్ల పెద్ద నష్టం లేదు. జరిగే నష్టం అంతా జీవితం వల్లనే. దాన్ని మన గోరు అంచులతో కూడా తాకకూడదు. వద్దు. లేవొద్దు. లేవడం అంటే కదలడమే. ప్రతి కదలికా మన కలని చెదరగొడుతుంది. నేనిప్పుడు ఏ కలా కనడంలేదు గానీ కలగంటున్నట్టు ఊహించుకోవడం బాగుంటుంది. గతం – అవునూ, మనం గతం గురించి మాటాడుకుంటే ఎలా ఉంటుంది?
మొ.యు:
మనం మాటాడుకోవద్దని నిర్ణయించుకున్నాం. కొద్ది సేపట్లో పొద్దు పొడవబోతోంది. మనం దానికి వగచక తప్పదు. ఎందుకంటే, ప్రతి వేకువా కలలని నిద్రపుచ్చుతుంది. గతం అంతా ఒక కల. ఆ మాటకొస్తే, కల కానిదాని దేని గురించీ నేను ఆలోచించలేను. నేను ఈ క్షణాన్ని గనుక నిశితంగా పరిశీలిస్తే, అది అప్పుడే గతంలోకి జారుకున్నట్టు కనిపిస్తుంది. ఏమిటి ఇవన్నీ? ఒక నిముషం లోంచి మరొక నిముషం లోకి ఏదైనా ఎలా జారుకుంటుంది? అది లోలోపల ఎలా మారుతుంది? ఓహ్! అక్కా, మనం ఇవన్నీ మాటాడుకుందాం. అందరం గట్టిగా గొంతు చించుకుని మరీ మాటాడుకుందాం. నిశ్శబ్దం మనల్ని కమ్ముకోబోతోంది. దుప్పటిలా ఆకారం తీసుకుంటూంది. పొగమంచులా నన్ను కమ్ముకుంటోంది… ఆఁ! మాటాడండి! పెద్దగా మాటాడండి!
రెం. యు:
ఎందుకని? మీ ఇద్దరివంకా తేరిపార చూస్తున్నాను కానీ మీ ఇద్దరూ నాకు వెంటనే కనిపించడం లేదు. మన మధ్య ఏవో అగాధాలు తెరుచుకున్నట్టు కనిపిస్తోంది. మిమ్మల్ని చూడాలంటే, మిమ్మల్ని చూడగలనన్న భావనని నేను వదులుకోవాలి. ఈ వెచ్చని గాలి లోపల చల్లగా తగుల్తోంది, నా మనసుని తాకుతున్నచోట. ఈ నిముషంలో ఎవరివో అజ్ఞాత హస్తాలు నా జుత్తు సవరిస్తున్న భావన నాకు కలుగుతుండాలి. జలకన్యల గురించి చెప్పేటప్పుడు ఇలానే చెప్తుంటారు. (ఒక క్షణం ఆగి, తన మోకాళ్ళపై చేతులు అడ్డంగా పెట్టుకుంటుంది) ఈ క్షణంలో, నేను దేని గురించీ ఆలోచించనప్పుడు, నా గతం గురించి ఆలోచనలు వస్తున్నాయి.
మొ.యు:
బహుశా, నేను నా గతాన్ని గురించి ఆలోచిస్తున్నాను.
మూ.యు.:
నేను దేని గురించి ఆలోచిస్తున్నానో నాకు తెలీదు. బహుశా ఇతరుల గతాన్ని గురించి అయి ఉండవచ్చు… ఎన్నడూ పుట్టి ఉండని గొప్ప గొప్ప వ్యక్తుల గతాన్ని గురించి కావచ్చు. మా అమ్మ ఇంటికి దగ్గరలో ఒక ఏరు పారుతుండేది. అదెందుకు పారుతోంది? మరింత దగ్గరగానో, లేక మరికొంచెం దూరంగా ఎందుకు ప్రవహించడం లేదు? అసలు ఒక వస్తువు అలా ఉండటానికి తగిన కారణం ఏదైనా ఉందా? నా ఈ చేతులంత వాస్తవమూ, సత్యమూ అయిన కారణం ఏదైనా ఉందా?
రెం.యు:
మన చేతులు సత్యమూ కాదు, వాస్తవమూ కాదు. అవి మన జీవితాన్ని ఆశ్రయించి ఉండే అద్భుతాలు. నాకు చేతులవంక చూసినప్పుడల్లా, దేవుడంటే భయం వేస్తుంది. గాలి లేకుండా ఏ కొవ్వొత్తి దీపమూ అల్లల్లాడదు. కానీ, చూడు, అవి గాలికి ఎలా అల్లల్లాడుతున్నాయో. ఎందుకు? ఎవరైనా సమాధానం చెప్పగలిగితే ఎంత బాగుండును! దూరంగా, వేరే ఖండాల్లో, పెద్ద పెద్ద రాజప్రాసాదాల్లో ఈ క్షణం వాయించబడుతున్న విలక్షణమైన సంగీతం వినాలన్న కోరిక కలుగుతోంది. నా మనసులో ఎందుకో, ప్రతీదీ దూరంగా, అందరానిదిగా కనిపిస్తుంది. చిన్నప్పుడు నేను అలలవెంట పరిగెత్తేదాన్ని. బహుశా ఆ అలవాటు ప్రభావమేమో! దేవదూత ప్రతిమలా హాయిగా గుండె మీద చెయ్యి వేసుకుని సముద్రం నిద్రపోతున్నట్టున్నప్పుడు, ఎవరికీ దానిని చూడాలనిపించనప్పుడు, సముద్రం ఆటులో ఉన్నప్పుడు చేతులమీద పాకుతూ రాళ్ళమధ్య గడిపేదాన్ని.
మూ.యు.:
నీ మాటలు సరిగ్గా నా మనసులో ఆలోచనలను గుర్తు చేస్తున్నాయి.
రెం.యు.:
బహుశా, అవి నిజం కాకపోవడమే దానికి కారణం అయి ఉండొచ్చు. ఈ మాటలు అంటున్నది నేనేనని కూడా గుర్తించలేను… నాకు వినిపించని ఏదో అజ్ఞాతపు గొంతు పలుకుతున్న మాటలు నా నోటివెంట వస్తున్నట్టు అనిపిస్తుంది. నిజంగా నేనెప్పుడో సముద్రతీరంలో నివసించి ఉండి ఉండాలి. నాకు గాలికి అటూ ఇటూ ఊగాడే వస్తువులంటే ఇష్టం. నా గుండెలో కెరటాలు ఎగసిపడుతున్నాయి. నేను నడుస్తుంటే తూగుతున్నట్టు అనిపిస్తుంది… నాకిపుడు నడవాలని బలమైన కోరిక కలుగుతోంది. కానీ నడవను. ఎందుకంటే, చేసే ఏ పనికీ అర్థం కనిపించటం లేదు. ముఖ్యంగా మనకి ఏది బలంగా చేద్దామనిపిస్తుందో అది మరీనూ. నాకు కొండలంటే భయం. అంత పెద్దగా ఉండే ఆ కొండలు బహుశా నిశ్చలంగా ఉండవు. ఎవరితోనూ పంచుకోడానికి ఇష్టపడని నిగూఢ రహస్యం ఏదో వాటిలో ఉండాలి. ఆ కొండల్ని గమనించకుండా నేను బయటకి తొంగిచూడగలిగితే, ఎవరిలోనుంచయినా క్షణకాలంపాటు నా ఆత్మనుంచి బయటపడి ఆ ఆనందాన్ని అనుభవించగలిగితే…
మొ.యు:
నాకయితే కొండలంటే భలే ఇష్టం. కొండలకి ఇటువైపు జీవితం మాత్రం అస్సలు బాగుండదు. అమ్మ ఉండే అటువైపు, చింతచెట్ల నీడల్లో కూర్చుని, సుదూరప్రాంతాలకు ప్రయాణించడం గురించి మాటాడుకునే వాళ్ళం. రోడ్డుకి అటూ ఇటూ, రెండు పిట్టలు జంటగా పాడుకునే పాటలా జీవితం హాయిగా, సుదీర్ఘంగా సాగిపోయేది. అంత దట్టమైన అడవిలో మేము మాటాడుకునే మాటలే పచ్చికబయళ్ళు, నీడలతోపాటు చెట్లు నేలమీద వెదజల్లే ప్రశాంతతే మేము కనే కలలు… మేము నిజంగా అలాగే బ్రతికే వాళ్ళం. ముఖ్యంగా నేను. తక్కిన వాళ్ళకి అలా అనిపించేదో లేదో, మీరు చెప్పండి ఇది నిజమేనని. అలాంటప్పుడు నేను వగచవలసిన పని ఉండదు.
రెం.యు:
ఎదురుగా సముద్రం పూర్తిగా కనిపిస్తుండే రాళ్ళ మధ్య నేను జీవించాను. తడిసిన నా గౌను అంచులు చల్లగా, ఉప్పగా నా బోసి పాదాలని తాకేవి. నేనప్పుడు చాలా చిన్నపిల్లని… విచ్చలవిడిగా తిరిగేదాన్ని. ఇప్పుడు తలుచుకుంటే అలా ఉన్నందుకు భయం వేస్తుంది. నేనిప్పుడు నిద్రలో ఉన్నానేమో ననిపిస్తుంది. నాకు దేవతల కథలు చెప్పండి. ఇప్పటి వరకూ ఎవరూ నాకు వాళ్ళ గురించి చెప్పలేదు. ఈ సముద్రం ఎంత పెద్దదంటే నాకు వాటి గురించి ఆలోచన కూడా రానీయదు. అతిసామాన్యంగా జీవించడంలోనే సౌఖ్యం ఉంది. అక్కా, నువ్వు ఆనందంగా ఉండే దానివా?
మొ.యు:
ఈ క్షణంలో, అలా ఉండడం మొదలెడుతున్నాను. అప్పుడు కూడా, జీవితం నీడపట్టునే గడిచిపోయింది. నా కంటే, ఆ చెట్లే ఎక్కువ జీవించేయి. నేను వస్తాడని పెద్దగా ఊహించని వ్యక్తి అనుకున్నట్టుగానే ఎప్పటికీ రాలేదు. అక్కా, నువ్వు మాటాడవేం?
మూ.యు:
నేను చెప్పాలనుకున్నది ఇంత త్వరగా చెప్పవలసి వస్తున్నందుకు భయంగా ఉంది. వర్తమానంలో చెబుతున్నప్పటికీ, నే చెప్పబోయే మాటలు నిన్న మొన్నటి గతానికి చెందినవి. అవి నా మనసులో మాటలు కాదు. వాటికి తిరుగులేదు. విధిలిఖితాలు. నేను మాటాడుతున్నప్పుడు నా గొంతులో ఏం జరుగుతోందా అని ఆలోచిస్తుంటాను. నా మాటలు అతి సామాన్యంగా కనిపిస్తాయి. నా భయం ఎప్పుడూ నన్ను మించి ఉంటుంది. ఎందుకో చెప్పలేను గాని, ఈ చెయ్యి ఏదో తెలియని తలుపులను తెరవగల తాళంచెవిలా పని చేస్తుందనిపిస్తుంది. అంతే, ఒక్కసారిగా నేను ఒక తాయెత్తులానో, ప్రార్థనాస్థలంగానో మారిన స్పృహ కలుగుతుంది. అందుకే, కారడవి భయపెట్టినట్టు, నా నిగూఢమైన మాటలు నన్ను భయపెడతాయి. కానీ నేను నిజంగా ఇలాగే ఉన్నానో, నా నిజమైన అనుభూతి ఏమిటో ఎవరు తెలుసుకోగలరు?
మొ.యు:
మన గురించి మనం ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు, మన అనుభూతి ఎటువంటిదో తెలుసుకోవటం కష్టం. దాని గురించి ఆలోచించటం మానేసినప్పుడు, జీవించడం కూడా కష్టమైపోతుంది. కాబట్టి, నువ్వు కాసేపు నీ అస్తిత్వాన్ని విస్మరించి, మాటాడు. నీ గతం ఏమిటో మాకు చెప్పవూ?
మూ.యు:
నా గతానికి ఇపుడు నేనెవరన్నది గుర్తుండదు. ఒకప్పుడు నేనొక పేద అమాయకపు పిల్లని. నేను చెట్టుకొమ్మల నీడల్లో పెరిగినదాన్ని. నా మనసులో ఉన్నదంతా ఆకుల కదలికలే. నేను ఎండలో నడిచినపుడు నా నీడ చల్లగా ఉండేది. గలగలపారే నీటి ఊటల మాటున నా రోజులు దొర్లిపోయాయి. జీవితం గురించి ఆలోచన కలిగినపుడల్లా ఆ నీళ్ళలో వేలి కొసలు ముంచేదాన్ని. ఒక్కోసారి, మడుగు నీటిలోకి వొంగి నా నీడని తదేకంగా చూసుకుంటుండేదాన్ని. నేను నవ్వినప్పుడల్లా, నీటిలో నా పళ్ళు చిత్రంగా అగుపించేవి. నా నవ్వుతో నిమిత్తం లేకుండా, వాటి నవ్వు అదోలా ఉండేది. ‘నేను’ అకారణంగా నవ్వుతూ ఉండేదాన్ని. మృత్యువు గురించి, అంతం గురించీ చెప్పండి. అప్పుడు, నాకు వెనుతిరిగి చూచుకోవడంలో అర్థం కనిపిస్తుంది.
మొ.యు:
మనం శూన్యం గురించి మాటాడుకుందాం. అంటే ఏమీ లేకపోవడం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కాస్త చల్లగా ఉంది. కానీ ఎందుకలా ఉంది? దానికి కారణం కనిపించదు. నిజానికి ఇంతకు ముందుకంటే మరింత చల్లగా ఇప్పుడేమీ లేదు. అయినా, మనం ఎందుకు మాటాడుకోవాలి? ఎందుకో తెలీదు గాని, మనం మాటాడుకోవడం కంటే పాడుకోవడం బాగుంటుంది అనిపిస్తోంది. పాట, అందులోనూ రాత్రిపూట పాడుతుంటే, ఉత్సాహం, ధైర్యం నిండిన మనిషి గదిలోకి చొచ్చుకొచ్చి గదినిండా ఉత్సాహం నింపినట్టు, మనకి సాంత్వన చేకూరుస్తుంది. మనం చిన్నప్పుడు ఇంటిలో పాడుకునే పాట పాడమంటే పాడగలను. పాడమంటారా, వద్దా?
మూ.యు:
అక్కా! అంత శ్రమ తీసుకోకు. ఎవరైనా పాడుతుంటే, నా మనసు మనసులో ఉండదు. నన్ను నేను మరిచిపోతాను. నా గతం అంతా ఇంకోలా అనిపిస్తుంది. నేనేప్పుడూ కోరుకుంటూ కూడా బతకలేక నాలోనే చచ్చిపోయిన జీవితం కోసం ఏడుస్తాను. పాడుకునే సమయం ప్రతీసారీ ఎప్పుడో దాటిపోయే ఉంటుంది, పాడుకునే సమయం ఎప్పుడూ దాటిపోకుండా ఉన్నట్టే.

(కాసేపు అందరూ మౌనం)

మొ.యు:
కాసేపట్లో తెల్లవారనుంది. మనం మౌనంగా ఉందాం. జీవితం కోరుకునేది అదే. నేను పుట్టిన ఇంటికి దగ్గర్లో ఒక కోనేరు ఉండేది. నేను అక్కడికి పోయి, నీటిమీదకి వాలిన ఒక కొమ్మ ఎక్కి కూర్చుండేదాన్ని. దాని అంచున కూచుని, ఎంతవరకు వీలయితే అంత వరకు కాలివేళ్ళు మునిగేలా నీట్లోకి పాదాలు జాపేదాన్ని. ఆ తర్వాత, చూడాలన్న కోరిక లేకపోయినా, నానిన వేళ్ళు చూస్తూ కూర్చునేదాన్ని. అసలు అటువంటు కోనేరు ఉందో లేదో అని అనుమానం వస్తుంటుంది. ఎందుకంటే, చెప్పలేను. దాన్ని గుర్తుంచుకోవడమంటే, మరిదేన్నీ గుర్తుంచుకోలేకపోవటమే. ఇది నే నెందుకు చెబుతున్నానో ఎవరు చెప్పగలరు? ఈ జ్ఞాపకాలు నా జీవితానికే చెందినవని ఎవరు హామీ ఇవ్వగలరు?
రెం.యు:
సముద్రతీరంలో కనే కలలు మనల్ని విషాదంలో ముంచుతాయి. మనం జీవితంలో ఏది కాదలుచుకున్నామో అది కాలేము. ఎందుకంటే, అది ఏమయినప్పటికీ, అది అప్పటికే సాధించి ఉండాలని కోరుకుంటాము. కెరటం దభీమని ఒడ్డున కొట్టుకుని, ఉస్సురని నురగ వెదజిమ్మినప్పుడు, ఒక వెయ్యి గొంతులు ఒక్కసారి సన్నగా మాటాడుతున్నట్టు తోస్తుంది. ‘నురగ అంతా ఒక్కటే’ అని భావించేవారికి అది అందంగా కనిపించవచ్చు కాని, ఏ ఒక్కొక్కటీ ఏకవచనం కాదు. వాటి గురించి మనకి ఏమీ తెలీదు. నేను సముద్రపుటొడ్డున ఎటువంటి కలలు కనేదాన్నో చెప్పనా?
మొ.యు:
అక్కా! నువ్వు చెప్పొచ్చు. కాని, నువ్వు చెప్పాలన్న నియమం మాకు లేదు. అది సంతోషకరమైన విషయమైతే, వినబోతున్నందుకు ముందుగానే విచారిస్తున్నాను. అలా కానపుడు, దాన్ని ఉన్నదున్నట్టుగా కాక కొంచెం మార్చి చెప్పు.
రెం.యు:
నేను చెప్పడానికే నిశ్చయించుకున్నాను. చెప్పబోయేది పూర్తిగా అబద్ధం కాదు. ఎందుకంటే, ఎప్పుడు ఏది చెప్పినా అది పూర్తిగా అసత్యం కాదు. అది ఇలా జరిగి ఉండవచ్చు: ఒకరోజు, ఒక చల్లని, ఎత్తయిన కొండ అంచున, వెనక్కి చేరబడి ఒకరోజు ఆలోచనలో మునిగి ఉన్నప్పుడు, అప్పటి స్థితి తప్ప, నాకో తల్లీదండ్రీ ఉన్నట్టు, నాకో బాల్యమూ వేరే జీవితమూ ఉన్నట్టు, మరిచిపోయాను. అది కేవలం నా ఊహేనేమో అనిపించేంత లీలగా, దూరంగా ఒక తెరచాపని నేను చూశాను. మరుక్షణంలో అది మాయమయింది. తిరిగి స్పృహలోకి వచ్చిన తర్వాత, నేను అలా కలగన్నానని గ్రహించాను. అది ఎక్కడ మొదలైందో చెప్పలేను. నాకు మరొక తెరచాప కనిపించలేదు. ఆ కలలో చూసిన తెరచాపని పోలిన తెరచాప అక్కడి రేవుల్లోంచి బయలుదేరుతున్న ఏ ఓడ మీదా కనిపించలేదు. చంద్రుడు స్పష్టంగా మేఘాల్లోంచి బయటపడి, దూరాన, ఓడలన్నీ మెల్లగా సాగిపోతున్న తర్వాత కూడా…
మొ.యు:
నాకు కిటికీలోంచి, సముద్రం మీద, దూరంగా ఏదో ఓడ కనిపిస్తోంది. బహుశా నువ్వు చూసింది అదేనేమో!
రెం.యు:
లేదు అక్కా, అది కాదు. నువ్వు చూస్తున్న ఓడకి లక్ష్యం ఖచ్చితంగా ఏదో ఒక రేవు. నేను చూసిన ఓడ ఏ తీరానికీ చేరే అవకాశాలు లేవు.
మొ.యు:
నా మాటలకి నువ్వెందుకు స్పందించేవు? బహుశా నువ్వు చెప్పిందే నిజమై ఉంటుంది! నాకు కిటికీలోంచి ఏ ఓడా కనిపించలేదు. ఏదైనా ఓడ కనిపిస్తే బాగుణ్ణని అనుకున్నాను. దేన్నీ చూడలేకపోయానన్న విచారాన్ని పోగొట్టుకుందుకు ఒక ఓడని చూసినట్టు చెప్పాను. ఇప్పుడు చెప్పు సముద్రతీరాన్న నువ్వు కన్న కలల గురించి.

రెం.యు:
నేను ఎక్కడో మారుమూల దీవిలో తప్పిపోయిన నావికుడి గురించి కలగన్నాను. ఆ దీవిలో నిలువుగా, నిటారుగా ఉండే కొన్ని తాళవృక్షాలున్నాయి. వాటి మధ్య పేరు తెలియని ఏవో పక్షులు ఎగురుతున్నాయి. ఆ చెట్లమీద అవి వాలినట్టు నేను ఎన్నడూ గమనించలేదు. ఓడ ప్రమాదం నుండి బయటపడిన నాటినుండీ ఆ నావికుడు ఆ ద్వీపంలోనే నివసిస్తున్నాడు. తిరిగి తన దేశానికి పోయే మార్గం లేకపోవడం వల్ల, దాని జ్ఞాపకాలు కేవలం దుఃఖాన్ని కలిగించడం వల్ల, ఆ ద్వీపాన్నే తన జన్మభూమిగా చేసుకుని, తనెన్నడూ ఎరగని ఒక మాతృదేశాన్ని ఊహించుకోసాగేడు: భిన్న భౌగోళిక పరిసరాలు, భిన్నమైన మనుషులు, వాళ్ళ చిత్రమైన నడకలు, కిటికీల్లోంచి తొంగి చూడడాలు లాంటి ఎన్నింటితోనో మరొక దేశాన్ని, అనుక్షణం తన కలల్లో ఒక కృత్రిమ స్వదేశాన్ని నిర్మించుకోసాగేడు. పగటి పూట వేడి ఇసక నేల మీద, సూదిలా సన్నగా, పొడవుగా సాగే నామమాత్రపు చెట్ల నీడల్లోను, రాత్రిపూట సముద్ర తీరంలోనూ వెనకకు వాలి ఆకాశంలోని నక్షత్రాలను సైతం గమనించకుండా, ఎడతెరిపి లేకుండా కలలు కంటూనే ఉండేవాడు.
మొ.యు:
వావ్! బారజాచిన నా చేతులమీద ఏ చెట్టయినా అటువంటి కలల నీడని పరిస్తే ఎంత బాగుంటుందో!
మూ.యు:
ఆమెని మాటాడనీ. మధ్యలో అడ్డు రాకు. ఆమె దగ్గర జలకన్యలు నేర్పిన మాటలేవో ఉన్నాయి. ఆమెను వినడానికి, నేను మెల్లగా నిద్రలోకి జారుకుంటున్నాను. అక్కా! కొనసాగించు. సముద్ర తీరాన నువ్వు అలా కలగంటుంటే, అది నేను కాలేకపోయినందుకు బాధేస్తోంది.
రెం.యు:
అలా ఏళ్ళ తరబడి, రోజు తర్వాత రోజు, అంతులేని తన కలల్లో ఆ నావికుడు తన స్వదేశాన్ని నిర్మించుకున్నాడు. అసంబద్ధమైన ఆ భవనానికి రోజుకొక కలలరాయిని పేర్చుకుంటూ నిర్మించుకొచ్చాడు. త్వరలోనే, తను లెక్కలేనన్ని సార్లు అటునుండి ఇటూ, ఇటునుండి అటూ నడిచిన దేశం నిర్మించబడింది. ఆ సముద్రతీరం వెంట వేలకొద్దీ గంటలు గడిపినట్టు జ్ఞాపకాల్లో నమోదైపోయింది. ఉత్తరాన ఉన్న ఫలానా అఖాతంలో తెల్లవారుతున్నప్పుడు ఎలా ఉంటుందో అతనికి తెలుసు; అలాగే, తన ఊహాత్మక యౌవనంలో ఆనందంగా గడిపిన విశాలమైన దక్షిణ రేవులో, బాగా రాత్రి గడచిన తర్వాత, ఓడ ముందు భాగం నీటిని చీల్చుకుంటూ వెళ్ళినట్టు, నీటిలోకి చొరబడినపుడు, ఎంత సేద తీరుతుందో అతనికి తెలుసు.

(కాసేపు అంతా నిశ్శబ్దం)

మొ.యు:
అక్కా! ఆగిపోయావేం?
రెం.యు:
ఎక్కువగా మాటాడడం అంత మంచిది కాదేమో! జీవితం మనల్ని అనుక్షణం గమనిస్తూనే ఉంటుంది. ప్రతి క్షణమూ మన కలలకు కన్నతల్లి. కానీ అది తెలుసుకోలేము. ఎక్కువ మాటాడుతున్న కొద్దీ, నానుండి నేను దూరమై, నా మాటలు నేనే వినడం ప్రారంభిస్తాను. నామీద నాకే ఎంత జాలి కలుగుతుందంటే, పాపాయిలా గుండెను చేతుల్లోకి తీసుకుని, ఊపుతూ ఊరడించాలన్న కోరికతో కన్నీళ్ళపర్యంతం అవుతాను. అటు చూడు: ఆకాశం తెల్లబడుతోంది. రోజు ఇక ఆట్టే దూరంలో లేదు. అయినా, నా కల గురించి ఇంకా కొనసాగించాలా?
మొ.యు:
ఆపకు! అక్కా! నీ మాటలు కొనసాగనీ. తెల్లవారుతోందన్న ధ్యాస లేకుండా చెప్తూనే ఉండు. కలల ఒడిలో తల వాల్చి, కాలం గడిపే వాళ్ళకి ఎన్నటికీ పొద్దు పొడవదు. నీ చేతులు అలా నలుపుకోవద్దు. రహస్యంగా పాకుకుంటూ వచ్చే పాముల్లా చప్పుడు చేస్తున్నాయి అవి. నీ కల గురించి ఇంకా చాలా చాలా విషయాలు చెప్పు. అది ఎంత అసంబద్ధంగా ఉందంటే, నిజమేనేమో అనిపిస్తోంది. నీ మాటలు వినడమే మనసుకి సంగీతం వింటున్నట్టుంది.
రెం.యు:
సరే. అయితే, మరికొన్ని విషయాలు చెబుతాను. నాకు చెప్పాలని ఎంతో కోరికగా ఉంది. మీకు చెప్పడంతో బాటు నాకు నేను చెప్పుకుంటున్నాను. మనం ముగ్గురమూ వింటున్నాము. (ఒక్కసారిగా శవపేటిక వైపు చూసి, ఆమెకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది.) ముగ్గురమేనా? ఏమో, నాకు తెలీదు… ఎంతమంది వింటున్నారో సరిగ్గా చెప్పలేను…
మూ.యు :
అలా మాటాడకు. కేవలం నీ కల గురించి చెప్పు. ఆగినచోటునుండి కొనసాగించు. ఎంతమంది వినగలరన్న ఊసు ఎత్తకు. నిజానికి ఎన్ని జీవిస్తున్నాయో, చూస్తున్నాయో, వింటున్నాయో ఎవరికీ తెలీదు. నీ కల దగ్గరికి వెళ్ళు… నావికుడి దగ్గరికి. ఆ నావికుడు ఏమిటి కలగన్నాడు?
రెం.యు:
(నెమ్మదిగా, సన్నని గొంతుతో) అతను తన పరిసరాలని కూడా సృష్టించుకోసాగేడు; తర్వాత మహానగరాలని సృష్టించుకున్నాడు; తర్వాత నిలువుగా, అడ్డంగా వీధుల్ని, ఒకదాని తర్వాత ఒకటిగా తన ఊహాశక్తితో తీర్చిదిద్దుకున్నాడు; వీధి తర్వాత వీధి, వాడ తర్వాత వాడ, సముద్రం అంచున చెలియలికట్ట వరకూ, ఆ తర్వాత అక్కడ ఓడరేవుల్ని కూడా నిర్మించుకున్నాడు; వీధి తర్వాత వీధిగా అక్కడ నివసించే, నడిచే, కిటికీలోంచి తొంగి చూసే మనుషుల్ని సృష్టించుకున్నాడు; మొదట్లో వాళ్ళని బొత్తిగా గుర్తు పట్టలేకపోయినా, క్రమక్రమంగా కొందరితో బాగా పరిచయం పెరిగి, వాళ్ళతో మాటాడగలగడం, వాళ్ళ గత జీవితాల్ని తెలుసుకోవడం కూడా చేశాడు. ముందు ఇదంతా తన కళ్ళకి ఆహ్లాదం గొలిపే మనోహరమైన దృశ్యమైనట్టు కలగన్నాడు. తర్వాత, ఆ జ్ఞాపకాలతో తను సృష్టించిన దేశంలో నాలుగు మూలలా ప్రయాణించడం ప్రారంభించాడు. ఆ విధంగా తనకొక గతాన్ని సృష్టించుకున్నాడు. త్వరలోనే అతనికి ఒక పూర్వజన్మ తయారైంది. ఈ కొత్త దేశంలో అతనికి ఒక పుట్టిన ఊరు, పెరిగిన ప్రదేశాలు, తను సముద్రయానానికి బయలుదేరిన ఓడరేవులూ వచ్చాయి. అతనికి చిన్నప్పుడు ఆటలాడుకున్న స్నేహితులు, పెద్దయిన తర్వాత సంపాదించుకున్న మిత్రులు, శత్రువులూ కూడా వచ్చారు. ఇవన్నీ, తను నిజంగా జీవించిన జీవితానికి భిన్నమైనవి. ఆ దేశానికి, ఆ వ్యక్తులకి, సృష్టించుకున్న గతానికీ అతను నిజంగా జీవించిన జీవితానికీ ఏ పోలికలూ లేవు… ఇంకా కొనసాగించక తప్పదా? చెప్పాలంటే బాధగా ఉంది. ఎలాగూ చెప్పడం ప్రారంభించేను గనుక, మీకు నేను తక్కిన కలల గురించి కూడా చెప్పాలి.
మూ.యు:
కొనసాగించు. ఎందుకు చెబుతున్నావో నీకు అర్థం కాకపోయినా. నిన్ను వింటున్నకొద్దీ నా మనసు మనసులో లేదు.
మొ.యు:
కాని, నువ్వు కొనసాగించడం మంచిదేనంటావా? ప్రతి కథకీ ముగింపు అవసరమా? పోనీలే, ఏదో ఒకటి మాటాడుతూ ఉండు. మనం ఏది చెప్పినా ఏది చెప్పకపోయినా పెద్ద తేడా పడదు. దొర్లిపోతున్న కాలానికి మనం కేవలం ప్రేక్షకులం. మన చేతలు జీవితమంత నిష్ప్రయోజనం.
రెం.యు:
ఒకరోజు, దిక్కులు కనిపించనంతగా కురిసిన వర్షం వెలిసిన తర్వాత, ఆ నావికుడికి ఇక కలలు కనే ఓపిక నశించింది. అతనికి తన అసలైన జన్మభూమిని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలనిపించింది. కానీ అతనికి ఏదీ గుర్తు లేదు. తన దృష్టిలో దాని ఉనికి మాయమైందని గ్రహించాడు. తనకి మిగిలిన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ తను సృష్టించుకున్న కలలలోని జన్మభూమికి చెందినవే. తన యౌవన జీవితం తను సృష్టించుకున్నదే. అతని జీవితం అంతా అతను కలగన్నదే. అతనికి మరొక జీవితం ఉండడానికి ఆస్కారం లేదన్నది గ్రహించాడు. ఎందుకంటే, అక్కడి వీధులు గాని, మనుషులు గాని, చివరికి కన్నతల్లి లాలనలు గాని, ఏవీ గుర్తు లేవు. అదే తను కలగన్నాననుకున్న జీవితంలో, ప్రతి దానికీ ఉనికి ఉంది. ప్రతీదీ వాస్తవం. తక్కిన వాళ్ళలా తనకీ వేరొక రకమైన గతం ఉందని, ఒక్క క్షణమైనా ఊహించడం గాని, కలగనడం గాని చెయ్యలేడు. కనీసం అలా ఆలోచించలేడు. ఓఁ! అక్కా! అక్కా! మీకు నేను చెప్పనిది ఇంకా ఏదో ఉంది. అదేమిటో నాకు తెలియటం లేదు. అది తెలిస్తే, ఇవన్నీ వివరంగా అర్థమౌతాయి. నా మనసు ఎందుకో వికలమౌతోంది. వశం తప్పుతోంది. మీకు ఇదంతా నేనే చెప్పానా అని అనిపిస్తోంది. మీరు కూడా మాటాడండి. నా మీద అరవండి. అప్పుడు నాకు మెలకువ వచ్చి, నేను మీ చెంతనే ఉన్నానని, కొన్ని నిజంగా కలలేననీ తెలుస్తుంది.
మొ.యు:
(చాలా నెమ్మదైన గొంతుతో) నీకు ఏమి చెప్పాలో నాకు తెలియడం లేదు. నాకు ఈ ప్రపంచాన్ని చూడాలంటే భయం వేస్తోంది. నీ కలలో తర్వాత ఏమైంది?
రెం.యు:
తర్వాత ఏమయిందో నాకు అస్సలు గుర్తు లేదు. అంతా గజిబిజి అయిపోయింది. తర్వాత ఏమయినా, ఎందుకు ఉండాలి?
మొ.యు:
అంతా అయిన తర్వాత, చివరకి ఏం జరిగింది?
రెం.యు:
ఏదంతా అయిన తర్వాత? తర్వాత ఏముంటుంది? తర్వాత ఏమయినా ఉంటుందా? ఒక రోజు ఒక పడవ వచ్చింది… ఒక పడవ… నిజం. అదే నిజం. ఏదయినా జరగడమంటూ ఉంటే, జరిగేది ఇదే. ఒక రోజు ఒక పడవ వచ్చి, ఆ దీవి గుండా సాగిపోయింది. ఆ నావికుడు అందులో లేడు.
మూ.యు:
బహుశా తన స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంతకీ, ఏ దేశానికి?
మొ.యు:
అవును. ఏ దేశానికి? ఆ తర్వాత నావికుడికి ఏమయింది? ఎవరికైనా తెలుసా?

రెం.యు:
నన్నెందుకు అడుగుతున్నారు? ప్రతిదానికీ సమాధానం ఉండి తీరాలా?

(కాసేపు నిశ్శబ్దం)

మూ.యు:
అది నీ కలే అయితే మాత్రం, ఈ నావికుడూ అతని దీవీ ఉండవలసిన అగత్యం ఏమయినా ఉందా?
రెం.యు:
లేదు, అక్కా! దేనికీ ఉండవలసిన అగత్యం లేదు.
మొ.యు:
పోనీ, నీ కల ఎలా ముగిసిందో చెప్పు.
రెం.యు:
అది ముగియలేదు… నాకు నిజంగా తెలీదు. ఏ కలకీ ముగింపు ఉండదు. నేనింకా దాని గురించి కలగనటం లేదని హామీ ఏమిటి? లేదా, దాని గురించి కలగనటం లేదన్న విషయం తెలియక, కలగనటం లేదేమో? లేదా, ఆ కలగనటం, నా జీవితమంత గందరగోళంగా లేదేమో? ఇక ఏమీ చెప్పొద్దు, ఏదో చెప్పలేని స్పష్టత వస్తోంది నాకు. రాత్రి కాని ఈ రాత్రి పూట, చెప్పలేని భయంకరమైన అడుగుల చప్పుడు నావైపు వస్తోంది. నేను చెప్పిన ఈ కలతో ఎవరికి నిద్రాభంగం చేశానో? నా కల ఎవరికీ చెప్పొద్దని దేవుడు ఆదేశించినట్టు ఎంతో భయం వేస్తోంది. అది దేవుడు అనుమతించిన దాని కంటే వాస్తవం. అక్కా! అక్కా! ఏదో ఒకటి మాటాడుతూ ఉండండి. కనీసం ఈ రాత్రి ముగియబోతోందనైనా నాకు చెప్పండి. అది నామట్టుకు నాకు అవగాహన అయితే అవుగాక! అదిగో! అటు చూడండి. ఇక కొద్ది సేపటిలో రోజు మొదలవబోతోంది. సరిగ్గా చూడండి. రోజు మొదలవడానికి అట్టే సమయం లేదు. ఇక మనం మాటలు చాలిద్దాం. ఇక ఆలోచనలకు స్వస్తి పలుకుదాం. మనం ఈ అంతర్లోకాలలోకి సాహసయాత్రని ముగిద్దాం. అది మనని ఎక్కడికి తీసుకుపోతుందో ఎవరికి ఎరుక? అక్కా! ఇదంతా ఈ రాత్రి జరిగింది. ఇక దాని గురించి మనం మాటాడవద్దు. మనసులో కూడ దాని గురించి ఆలోచించవద్దు. ఎవరి పద్ధతిలో వారు దుఃఖించడం మానవ సహజం.

మూ.యు:
నీ మాటలు వింటుంటే ఎంతో హాయిగా ఉంది. అలా లేవని అనొద్దు. ఇంత శ్రమ తీసుకోవలసిన అవసరం లేదని నాకూ తెలుసు. అందుకే, నాకు అంత బాగా నచ్చింది. అదొక్కటే కాదు. నచ్చడానికి మరొక కారణం కూడా ఉంది. అది నీ గొంతులోని మాధుర్యం. నీ మాటలకంటే, శ్రావ్యమైన నీ గొంతునే ఎంతో శ్రద్ధగా విన్నాను నేను. ఆ మాధుర్యం వల్లనే కాబోలు, మాటలు ఎంతో అసంతృప్తిని మిగిల్చాయి.
రెం.యు:
అక్కా! ప్రతిదీ మనకి ఎంతో కొంత అసంతృప్తిని మిగుల్చుతూనే ఉంటుంది. ఆలోచనాపరులైన మనుషులకు ప్రతి విషయమూ నిరాశ కలిగిస్తుంది. ఎందుకంటే, ప్రతీదీ మార్పుకి లోనవుతుంది. పుట్టి, గిట్టే జనమే దానికి ఋజువు. కారణం, అన్నిటితోపాటు వాళ్ళూ మార్పుకి లోనవుతారు. ఒక్క కలలు మాత్రమే కలకాలం అలరిస్తాయి. మనం ఎందుకు ఇంకా మాటలు కొనసాగిస్తున్నట్టు?
మొ.యు:
నాకు తెలీదు. (శవపేటికని చూస్తూ, చిన్న గొంతుతో) అయినా, మనుషులెందుకు మరణిస్తారు?

రెం.యు:
తగినంతగా కలలు కనలేకపోవడం వల్ల కావొచ్చు.

మొ.యు.:
కావొచ్చు. అలాంటప్పుడు, జీవితం సంగతి మరిచి కలల్లోనే మనల్ని బంధించుకుంటే మెరుగు కాదూ? మృత్యువు కూడా మన సంగతి మరిచిపోతుందేమో?
రెం.యు:
లేదు, అక్కా! ఏదో ఒకటి చెయ్యడం మెరుగు కాదు.
మూ.యు:
అప్పుడే పొద్దు పొడిచింది. విస్తుపోయి చూస్తున్న కొండలవరుసని చూడండి. మనం ఎందుకు ఏడవకూడదు? అదుగో, అక్కడ నిద్ర నటిస్తున్న యువతి కూడా మనలాగే వయసులో ఉంది. అందమైనది. ఎన్నో కలలు కనుంటుంది. ఆమె కలలు అందరి కలలకంటే అందమైనవని నా నమ్మకం. ఆమె దేని గురించి కలలు కని ఉంటుందని మీరు అనుకుంటున్నారు?
మొ.యు:
గొంతు కొద్దిగా తగ్గించు. ఆమె బహుశా వింటూ ఉండొచ్చు. ఈ పాటికి కలల అవసరం ఏమిటో ఆమెకు తెలిసి ఉండొచ్చు.

(అందరూ కాసేపు మౌనం)

రెం.యు:
బహుశా ఇందులో ఏదీ నిజం కాకపోవచ్చు. ఈ నిశ్శబ్దం, ఈ మరణించిన యువతి, తూర్పున పొడుస్తున్న పొద్దూ ఇవన్నీ కేవలం కల కావొచ్చు. వీటినన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించండి. ఇవన్నీ జీవితానికి చెందినవని మీకు అనిపిస్తోందా?
మొ.యు:
నాకు తెలీదు. అసలు ఏదైనా జీవితానికి ఎలా చెందుతుందన్నది నేను చెప్పలేను. అయ్యో! నువ్వు ఎంత నిశ్చలంగా ఉన్నావు! నీ కళ్ళు నిష్ఫలంగా విషాదంలో మునిగి ఉన్నాయి.

రెం.యు:
మరొకలా విషాదంలో ఉండి ప్రయోజనం లేదు. మనం మాటాడటం ముగించడం మంచిది కాదూ? జీవించి ఉండడం చిత్రంగా కనిపిస్తుంది. జరిగేవేవీ నమ్మశక్యంగా ఉండవు. అది నావికుడి ఊహా ప్రపంచంలోనైనా, ఇక్కడ నిజప్రపంచంలోనైనా. చూడండి. ఆకాశం అప్పుడే వెల్లబారింది. ఆకాశం బంగారు రంగులో నవ్వుతోంది. ఏడవాలన్న ఆలోచన రాగానే, కళ్ళు మండుతున్నట్టు అనిపిస్తున్నాయి.
మొ.యు:
నువ్వు నిజంగానే ఏడ్చావు, అక్కా.
రెం.యు:
ఏడ్చానేమో! ఫర్వాలేదు. ఇంత చల్లగా ఎందుకుంది? ఓహ్. తెలిసింది. సమయం ఆసన్నమైంది. ఈ విషయం చెప్పండి. ఈ ఒక్కటీ చెప్పండి… ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో, ఒక్క నావికుడే నిజమై, మనమూ, తక్కినవన్నీ అతని కలలో భాగం ఎందుకు కాకూడదు?

మొ.యు:
ఏం మాటాడొద్దు. చాలు! ఇక మాటలు చాలిద్దాం. ఇది నిజమనిపించేంత వింతగా ఉంది. మరేం మాటాడొద్దు. నువ్వు ఏమి చెప్పబోతున్నావో నాకు తెలియదు కానీ ఈ గుండె దానిని భరించలేదని నాకు అనిపిస్తోంది. నువ్వు చెప్పిన దానికంటే, చెప్పకుండా వదిలిపెట్టినది మరింత భయంకరంగా తోస్తోంది. చూడు. చూడు. చూడు. అప్పుడే సూర్యోదయం అయింది. రోజు మొదలైంది. అదిగో. అటు చూడండి. ఆ తొలి వెలుగు కిరణాలని. మీ శాయశక్తులా ప్రయత్నించండి… బయట… నిజమైన రోజును చూడటానికి… దాన్ని జాగ్రత్తగా గమనించండి. అది మీకు ఊరట కల్పిస్తుంది. ఆలోచించకండి. ఆలోచనవైపు దృష్టి పెట్టకండి… అదిగో… పొడుస్తున్న పొద్దు వైపు చూడండి. వెండిలా మెరుస్తున్న నేలమీద బంగారు మలాం పూస్తోంది. దూదిపింజలాంటి మేఘాలు నాలుగుప్రక్కలా విస్తరిస్తూ, రంగులు సంతరించుకుంటున్నాయి. అక్కలారా, ఒక్కసారి ఊహించండి: అసలు దేనికీ ఉనికి లేకపోయి ఉంటే ఏమయ్యేది? ఒక విధంగా, ఇక్కడున్నదంతా శూన్యమే అయి ఉంటే ఎలా ఉండేదో? …నావంక ఎందుకు అలా చూస్తున్నారు?

(ఎవరూ ఆమెకి సమాధానం చెప్పరు. ఎవరూ దేనివంకా చూడరు.)

మొ.యు:
నువ్వేమన్నావూ, నాకు అంత భయం వేసింది? ఎంతగా భయపడ్డానంటే అదేమిటో కూడా గమనించలేదు. ఏదీ మరోసారి చెప్పు. రెండవసారి విన్నప్పుడు, మొదటిసారంత భయం వెయ్యదులే. వద్దు. వద్దు. ఏం చెప్పొద్దు. ఏదో అడగాలనీ ఆలోచిస్తూ ఉండాలనీ ఆ ప్రశ్న అడిగాను కానీ సమాధానం ఆశించి కాదు. అది భగవంతుడి అస్తిత్వంలా బృహత్తరమూ… భయానకమూను. మనం ఇప్పటికే మాటాడటం కట్టిపెట్టి ఉండవలసింది. మన మాటలు అర్థం పర్థం లేకుండా ఎప్పుడో గాడి తప్పాయి. మాటాడటానికి ప్రేరణ ఏదైనా, మన సంభాషణ సుదీర్ఘంగా కొనసాగింది. మన ఆత్మలతో పాటు ఇక్కడ వేరే వ్యక్తులు కూడా ఉన్నారు. రోజు మొదలై, ఈపాటికి వాళ్ళు మేల్కొని ఉంటారు. ఏదో ఆలస్యం అయింది. ఆ మాటకి వస్తే అన్నీ ఆలస్యమే. మనలో ఈ భయం కలగడానికి ఏం జరుగుతోందిక్కడ? అయ్యో, నన్ను ఒక్కర్తినీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోకండి. నాతో మాటాడండి. మాటాడండి. నాతోపాటు మీరు కూడా మాటాడుతుంటే, నా గొంతుక ఒక్కటే వినిపించకుండా మీవీ వినిపిస్తాయి. మాటాడుతున్నానన్న స్పృహ కలగగానే, నా గొంతు కంటే, మాటాడుతున్నానన్న భావన నన్ను ఎక్కువ భయపెడుతుంది.
మూ.యు:
నువ్వు ఏ గొంతుకతో మాటాడుతున్నావు? అది నీది కాదు, మరొకరిది. అది ఎక్కడో దూరం నుండి వినవస్తోంది.
మొ.యు:
ఏమో, నాకు తెలీదు. దాన్ని నాకు గుర్తు చెయ్యొద్దు. బహుశా నేను భయంతో వణుకుతూ, కీచుగొంతుతో మాటాడుతున్నానేమో! నాకు ఎలా మాటాడాలో ఇప్పటికీ తెలీదు. నాకూ నా గొంతుకీ మధ్య ఒక అగాధం ఏర్పడింది. నీ మాటలు రేపెట్టిన భయంతో, మన సంభాషణలు, ఈ రాత్రి, ఈ భయాలూ ఎప్పుడో, హఠాత్తుగా, ముగిసిపోవలసినవి. చివరకి నువ్వు చెప్పిన కథనంతటినీ నెమ్మదిగా మరచిపోతున్నానేమో ననిపిస్తోంది. దానితో, ఆ భయాన్ని ప్రకటించడానికి నేను కొత్త రకంగా అరవాలేమో నన్న ఆలోచన కలుగుతోంది…

మూ.యు. (రెం. యు.తో):
అక్కా, అసలు నువ్వు మాకు ఈ కథ చెప్పి ఉండవలసింది కాదు. ఇంత ఎక్కువ భయాన్ని మూటకట్టుకుని కూడా, నేను ఇంకా బ్రతికున్నానంటే ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు చెప్పిన కథలో ఎంతగా లీనమయిపోయానంటే, మాటల శబ్దాన్నీ వాటి అర్థాన్నీ విడివిడిగా వినగలిగేను. ఇప్పుడు నువ్వూ నీ మాటా వాటి అర్థమూ ఒకటిగా కాక, మూడు భిన్నమైన అస్తిత్వాలుగా నాకు కనిపిస్తున్నాయి. మూడు విడిగా నడుస్తూ, మాటాడే జీవుల్లా.
రెం.యు:
నిజంగా అవి మూడు వ్యక్తిత్వాలు. ఒక్కొక్క దానికీ ప్రత్యేకమైన జీవితం ఉంది. అలా ఎందుకో బహుశా ఒక్క భగవంతుడికే ఎరుక. అయినా, మనం ఇంకా ఎందుకు మాటాడుతున్నాం? మనల్ని ఎవరు ఇలా మాటాడిస్తున్నారు? నాకు ఇష్టం లేకపోయినా ఎందుకు మాటాడుతున్నాను? తెల్లగా తెల్లవారిపోయిందని మనం ఎందుకు గుర్తించడం లేదు?
మొ.యు:
ఎవరైనా గట్టిగా అరిచి మనల్ని నిద్రలోంచి లేపగలిగితే ఎంత బాగుణ్ణు! నేను మనసులో అరవడం వినిపిస్తోంది. కానీ మనసులోని భావాల్ని మాటల్లోకి తీసుకురాగలిగిన రహస్యం నాకు పట్టుబడలేదు. ఎవరో తలుపు తడతారని గొప్ప భయం వేస్తుంది. ఎవరూ ఎందుకు తలుపు తట్టరో! అది జరిగే పని కాదు. దానికి నేను భయపడాలి. అసలు నేను దేనికి భయపడుతున్నానో తెలుసుకోవాలి. ఎంత చిత్రమైన భావన! నేను నా అసలు గొంతుతో మాటాడటం మానేసేనేమో అనిపిస్తోంది. నాలోని సగం నిద్రలోకి జారుకుని అలా నన్నే పరీక్షగా చూస్తున్నట్టుంది. నా భయం ముదురుతోంది. కానీ అది ఇంకా నాకు అనుభవం లోకి రావటం లేదు. నా మనసులో ఏమూల అనుభూతులు కలుగుతున్నాయో గ్రహించలేకపోతున్నాను. శరీరస్పృహ తెలియలేకుండా నా మీద బరువైన ముసుగు కప్పబడింది. నీ కథని మాకు ఎందుకు చెప్పావు?
రెం.యు:
నాకు గుర్తు లేదు. అసలు మీకు చెప్పినట్టు పిసరంతైనా జ్ఞాపకం లేదు. అప్పుడే, ఎన్నాళ్ళో అయినట్టుంది. ఈ ప్రపంచాన్ని గమనించటంలో నా చూపుకి అప్పుడే ఎంత గాఢమైన నిద్ర కమ్మేసింది. ఇంతకీ, మనం ఏం చేద్దామనుకున్నాం? ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం? మనం మాట్లాడదామనుకున్నామా? వద్దనుకున్నామా?
మొ.యు:
మాటాడటం కట్టిపెడదాం. నువ్వు మాటాడటానికి చేస్తున్న ప్రయత్నం నాకు విసుగు తెప్పిస్తోంది. నీ ఆలోచనకీ మాటకీ మధ్యనున్న వ్యత్యాసం నన్ను బాధిస్తోంది. భయంతో జడత్వాన్ని పొందిన నా సంవేదనల ఉపరితలం మీద స్మృతులు తేలియాడడం నా చర్మం ద్వారా తెలుస్తూనే ఉంది. దాని అర్థం ఏమిటో చెప్పలేను గాని, అలా అనుభూతి మాత్రం చెందుతున్నాను. నేను గందరగోళపరిచే సుదీర్ఘమైన మాటల్లో చెప్పవలసి వస్తోంది. అలా చెప్పటం కూడా కష్టమే. ఇదంతా చూస్తుంటే, మన మధ్య ఒక పెద్ద సాలీడు ఒక గుండె నుండి మరొక గుండెకి… మనం తప్పించుకోలేని నల్లని గూడు… అల్లుతున్నట్టు అనిపించడం లేదూ?
రెం.యు:
నా కేమీ అనిపించటం లేదు. నా సంవేదనలు నేను అనుభూతి చెందగలిగినవిగా కనిపించటం లేదు. ఈ క్షణంలో నేనెవర్ని? ఎవరది నా గొంతుతో మాటాడుతున్నది? సావధానంగా వినండి…
మొ.యు, మూ.యు. జంటగా:
ఎవరది?
రెం.యు:
ఏమీ లేదు. నాకేదీ వినిపించలేదు. నేనేదో విన్నట్టు నటించాను, దాన్ని చూసి మీరు కూడా ఏదో విన్నట్టు అనుకోవాలని. నేను కూడా వినడానికి ఏదో ఉందని విశ్వసించాలనీ. అబ్బా! ఎంత భయంకరమైన విషయం! మనలోని ప్రతి అణువూ నిశ్శబ్దాన్ని, స్మృతులు లేని నవోదయాన్నీ కోరుకుంటుంటే, ఏ భయంకర రహస్యం ఆత్మనుండి గొంతుని, ఆలోచనలనుండి స్పందనల్నీ వేరు చేసి, మనల్ని ఆలోచించడానికి, అనుభూతించడానికి, మాటాడటానికీ ప్రేరేపిస్తున్నదో కదా! మనం అనుభూతించడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారీ వద్దని వారించటానికి చెయ్యెత్తుతున్న ఐదవ వ్యక్తి ఎవరు ఈ గదిలో?
మొ.యు:
నన్నెందుకు అలా భయపెడుతున్నావు? ఇప్పటికే నేను తట్టుకోగలిగినదాని కంటే ఎక్కువ భయంతో ఉన్నాను. స్వయంస్పృహతో ఇప్పటికే తలమునకలై ఉన్నాను. వెచ్చని మృత్తికలో మునిగినట్టు అనుభూతి చెందుతున్నాను. నా ఇంద్రియాలన్నిటి మీదా వాటన్నిటినీ గమనించి, పరికించేదేదో దండయాత్ర చేసింది. నా సంవేదనలమీద కనురెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. నా అనుభూతులన్ని చెప్పలేక నా నాలుక చచ్చుపడిపోయింది. నేను చేద్దామనుకుంటున్న సైగలన్నిటిమీదా నిద్ర జిగురులా అంటుకుపోయింది. నా వంక ఎందుకు అలా చూస్తున్నావు?

మూ.యు:
(చాలా సన్నని గొంతుతో) ఆహ్! సమయం ఆసన్నమైంది. వెళ్ళవలసిన సమయం వచ్చేసింది. అవును. ఎవరో మేలుకున్నారు… చాలామంది మేలుకుంటున్నారు. ఎవరో ఒకరు లోనికి రావడమే ఆలస్యం. ఇదంతా ముగిసిపోతుంది. అప్పటిదాకా, ఈ భయాలన్నీ దీర్ఘమైన నిద్రగా ఊహిద్దాం. అప్పుడే బాగా తెల్లవారిపోయింది. అంతా ముగిసిపోడానికి సిద్ధంగా ఉంది. అక్కా, చివరగా ఏదైనా చెప్పాల్సివస్తే, నువ్వొకతెవే ఆనందంగా ఉన్నావు, ఎందుకంటే, నువ్వు కలల్ని విశ్వసిస్తావు గనుక…

రెం.యు:
నన్నెందుకు అడుగుతారు ఆ విషయాన్ని? నేను చెప్పాననా? లేదు. నాకు దానిమీద నమ్మకం లేదు.

(ఇంతలో కోడి కూస్తుంది. వెలుతురు బాగా వ్యాపిస్తుంది, ఒక్కసారిగా. శవజాగరణ చేస్తున్న ముగ్గురు యువతులూ ఒకరివంక ఒకరు చూడకుండానే, మౌనం వహిస్తారు. దగ్గరలోనే, రోడ్డు మీద ఏదో తెలియని వాహనం బరువుగా, కీచుమని చప్పుడు చేస్తూ, ముందుకి సాగడం వినిపిస్తుంది.)

(11-12 అక్టోబరు 1913)


ఫెర్నాండో పెసోఆకి
(నీ నిశ్చల ఏకాంకిక చదివిన తర్వాత)

నీ నాటిక ‘నావికుడు’
పన్నెండు నిముషాలు గడవగానే
అందులోని అర్థంలేని తనానికి
గొప్ప మేధావులు కూడా

విసుగెత్తి, మందులైపోతారు
జాగరణ చేస్తున్న యువతులలొ ఒకామె
మంద్రస్వరంలొ ఇలా అంటుంది:

కలలు మాత్రమే నిత్యం. అందంగా ఉంటాయి.
మనం ఎందుకు మాటాడుతున్నట్టు?
నేను కూడా సరిగ్గా అదే
అడగాలనుకున్నాను ఆ యువతుల్ని…

– అల్వారో దె కంపోస్.