“ఎక్కడికి?” కండక్టర్ అడిగాడు.
అటువైపే చూస్తూ ఉంది.
“ఎక్కడికమ్మా?” మరోసారి అడిగాడు.
అతనున్న వైపే చూస్తూ ఉంది.
“హలో! నిన్నే! ఎక్కడికెళ్ళాలమ్మా?” గొంతు పెంచి అడిగాడు.
ఉలిక్కిపడి కండక్టర్ దిక్కు చూసి ‘పాస్’ అంది.
‘అదేదో ముందే చెప్పొచ్చు కదా!’ అన్నట్టు విసుగ్గా మొహం పెట్టి కండక్టర్ ముందుకు కదిలాడు.
రెండు వరుసల అవతల కిటికీ పక్కన కూర్చున్న అతని వంకే చూస్తూ ఉంది. అలా చూడటం బాగుంది.
బస్సులో ముందు వైపున సీట్లన్నీ నిండిపోయాయి. అక్కడే నిలుచోకుండా వెనక్కి రావడం మంచిదైంది. సరిగ్గా అతను కనిపించే చోట సీటు దొరకడం మరింత మంచిదైంది. లేకపోతే అతను కనిపించేవాడు కాదు. తెలుపు రంగు ఫుల్ హ్యాండ్స్ చొక్కా. నీలం రంగు జీన్స్. ఒళ్ళో కాలేజీ బ్యాగ్. చేతిలో సెల్‌ఫోన్. ఇయర్‌ఫోన్స్ పెట్టుకున్నాడు. ఫోన్ వంక చూస్తూ మధ్య మధ్యలో కిటీకీ బయటి పరిసరాల్ని గమనిస్తూ బస్సు ఎంత దూరం వచ్చిందీ అంచనా వేస్తున్నాడు.
చొక్కా లోపల ఎర్రరంగు కట్ బనియన్. మెరుపు కళ్ళకి అడ్డుగా కళ్ళజోడు. ఎత్తు ఐదున్నర అడుగులుండొచ్చు. ఆపైన కొన్ని అంగుళాలు కూడా. మనిషి ఎత్తుకు తగ్గ బరువుతో ఉన్నాడు. తెల్లరంగు. చురుకైన మీసాలు. చిరుగడ్డం. గాలికి చెదిరిపోతున్న జుట్టును అప్పుడప్పుడూ ఎడంచేత్తో సర్దుకుంటున్నాడు. బస్సులో చుట్టూ ఉన్న మనుషుల సంగతులేవీ పట్టనట్టు కూర్చున్నాడు.
అబ్బాయిలు పద్ధతిగా ఉండటం బాగుంటుంది. అప్పుడప్పుడూ కాసింత నిర్లక్ష్యంగా కనిపిస్తే ఇంకా బాగుంటుంది.
సెల్‌ఫోన్ చూస్తూ ఏదో టైప్ చేస్తున్నాడు. పక్కకు చూపు తిప్పడం లేదు. ఎవరితోనైనా చాట్ చేస్తున్నాడా? ఎవరితో?
ఫేస్‌బుక్ ఉంది కానీ ఎప్పుడో కానీ వాడదు. ఎవరిదైనా పుట్టినరోజు వస్తే HBD అని ఓ మెసేజ్ పెడుతుంది. అప్పుడప్పుడూ ప్రొఫైల్ పిక్చర్ మారుస్తుంది. ముప్పై దాకా లైకులు. ఒకటి, రెండు కామెంట్లు వస్తాయి.
కాలేజీలో క్లోజ్ ఫ్రెండ్ ఒకమ్మాయికి అసలు ఐడీతోపాటు రెండు ఫేక్ ఐడీలు కూడా ఉన్నాయి. క్లాసులో, క్యాంటీన్లో, వాష్‌రూమ్ దగ్గర కూడా ఎప్పుడూ ఎవరితోనో చాట్ చేస్తూనే ఉంటుంది.
“అంతంతసేపు చాటింగ్ ఏంటే? బోర్ కొట్టదా అసలు?” అడిగిందోసారి.
“బోరా? ఛాన్సే లేదు!” అంది నవ్వుతూ.
అంతలా చాట్ చేసుకునే విశేషాలు ఏముంటాయో!
“ఏమీ ఉండవు. జస్ట్ ఫర్ ఫన్. అంతే!” మనసు లోపలి ప్రశ్న ఊహించి ఫ్రెండ్ నవ్వుతూ సమాధానం చెప్పింది.
ఒకసారి చాట్ చేస్తుంటే చూసింది. ఒకరినొకరు రెచ్చగొట్టుకునే బెడ్‌రూమ్ ఫ్యాంటసీలు, సెక్స్‌టింగ్. అవన్నీ ఫేక్ ఐడీ నుంచి చేస్తోంది.
“తప్పు కదా?” అంది.
“తప్పేంటి? జస్ట్ ఫర్ ఫన్. నేనేమీ నిజంగా వాడితో చేయట్లేదు కదా” అంది ఫ్రెండ్.
చేయకపోతే తప్పు లేనట్టా? ఏమో?
చాట్ మధ్యలో ఫొటో వచ్చింది. చాలా అందంగా ఉన్నాడతను, సినిమా హీరో అనిపించేలా స్టైల్‌గా. ఇటునుండి ఫ్రెండ్ ఒక ఫోటో పంపించింది. అదెవరిదో తెలియదు. అమ్మాయి చూడ్డానికి బాగుంది. అవతల్నుంచి నైస్ అని మెసేజ్ వచ్చింది.
“ఆ ఫేక్ ఫోటో నాదే అనుకుని నమ్మేశాడే వీడు, నైస్ అంటున్నాడు” అంది ఫ్రెండ్.
జరిగిందేమిటో అర్థమై మౌనంగా ఉండిపోయింది.
“అతను పంపిన ఫోటో అతనిదేనా?” కాసేపటి తర్వాత అడిగింది.
“ఎవరికి తెలుసు? ఈ చాటింగ్‌లో నిజాలు, నమ్మకాలేం ఉండవు. అంతా ఫన్. వాడి ఫోటో అయితే మాత్రం చేసేదేముంది? ఏదో జస్ట్ టైమ్‌పాస్ అంతే” ఫ్రెండ్ కొంటెగా నవ్వింది.
“నిన్ను వీడియో కాల్ చేయమంటే?”
“అంతదాకా రానిస్తానా? ఏదో ఒక రీజన్ చెప్పి అవాయిడ్ చేస్తాను. మరీ బలవంతం చేస్తే బ్లాక్ ఆప్షన్ ఉంది కదా” అంది.
ఎందుకో ఇప్పుడా మాటలన్నీ గుర్తొస్తున్నాయి.
బస్సు స్టాప్ దగ్గర ఆగింది. మరో నాలుగు స్టాప్‌ల తర్వాత దిగాలి. అతనెక్కడి దాకా వెళ్తాడో తెలియదు. బస్సు నిదానంగా వెళ్తే బాగుణ్ణు.
చాటింగ్ ఆపేసి ఫోన్ వంక చూస్తూ ఉన్నాడు.
అతణ్నే చూస్తూ ఉంది. కాలేజీలో ఒకరిద్దరు నచ్చారు. కానీ వాళ్ళు తనతో మాట్లాడే మనుషుల్లా అనిపించలేదు. లైట్ తీసుకుంది. ఇంటర్ దాకా లావుగా ఉండేది. ఇంట్లో అమ్మా నాన్నా కూడా లావు కాబట్టి తనది బొద్దుతనంగా కనిపించేది. ఇంజినీరింగ్‌లో చేరాక చుట్టూ ఉన్నవాళ్ళ మధ్య లావు సంగతి తెలియడం మొదలైంది. ఎవరూ వెక్కిరించేవారు కాదు. కానీ తనకే ఏదోలా ఉండేది.
జిమ్‌లో చేరి వారంపాటు పట్టుదలగా వెళ్ళింది. ఆ తర్వాత నీరసం, బద్దకం మొదలై ఆపేసింది. రెండ్రోజులు వాకింగ్ చేశాక పొద్దున్నే లేవబుద్ధి కాలేదు. రోజూ కాఫీకి బదులు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంది. రాత్రుళ్ళు భోజనం మానేసి పళ్ళు మాత్రమే తినడం మొదలు పెట్టింది.
“ఇప్పుడు బాగానే ఉంటుంది. కానీ ముందు ముందు అవస్థ పడతావ్ చెప్తున్నా!” అమ్మ మందలించింది.
“కొందరికి జీన్స్ అలా ఉంటుంది. తిన్నా, తినకపోయినా లావుగానే ఉంటారు. కడుపు మాడ్చుకున్నా ఏమీ లాభం ఉండదు.” ఎమ్.బి.బి.ఎస్. చదువుతున్న అక్క సలహా ఇచ్చింది.
‘సన్నగా కనపడాలంటే ఎలాంటి డ్రసెస్ వేసుకోవాలి?’ అని గూగుల్‌లో వెతికి అలాంటి బట్టలు, అవే రంగులూ వేసుకోవడం మొదలెట్టింది.
బస్సు వేగంగా కదులుతోంది. మరో రెండు స్టాప్‌ల తర్వాత తను దిగిపోవాలి. అతను ఎక్కడి దాకా వెళ్తాడో తెలియదు. ఈ మధ్యలోనే దిగిపోకూడదు. తనకన్నా ముందు అతను బస్సు దిగి వెళ్ళిపోవద్దని తెలిసిన దేవుళ్ళకు మనసులో గట్టిగా మొక్కుకుంది.
కాలేజీలో ఫ్రెండ్స్ కొందరు పిక్నిక్ ప్లాన్ చేశారు. తనూ వస్తానంది ఉత్సాహంగా. “బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి వెళ్తున్నాం. బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ బైక్‌ల మీద వస్తారు. నీ సంగతేంటి మరి?” క్లాస్‌మేట్ అందరి ముందూ అడిగేసరికి అవమానంగా అనిపించింది.
మొదటి ఏడాది పూర్తయి రెండో ఏడాదిలోకి వచ్చాక కూడా తను ఎవరికీ నచ్చలేదు. గ్రీన్ టీలు, పళ్ళు ఫలితాలివ్వలేదు. ఆరోజు ఇంటికెళ్ళి చాలా సేపు ఏడ్చింది. కాసేపటికి తనను తనే ఓదార్చుకుంది.
చివరి స్టాప్ వచ్చేసింది. ఇది దాటితే తర్వాత స్టాప్‌తో దిగాలి. అతని వెంట వెళ్ళాలా? ఎక్కడిదాకా? లేటైతే ఇంట్లో ఏం చెప్పాలి? రకరకాల ఆలోచనలు పరిగెడుతున్నాయి.
బస్సు స్టాప్‌లో ఆగగానే అతను హడావిడిగా లేచి ఫుట్‌బోర్డ్ వైపు అడుగులేశాడు.
ఏ దేవుడూ తన మొక్కు తీర్చలేదు. అతను దిగిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాడు.
ఏదో నిశ్చయానికి వచ్చినట్టు లేచి అతని వెనకాలే హడావిడిగా వెళ్ళింది.
“ఏమ్మా! నీ బ్యాగ్!” వెనుక నుంచి ఎవరో అరిచారు.
వెనక్కి తిరిగి సీట్ దగ్గిరకి వచ్చి బ్యాగ్ చేతుల్లోకి తీసుకుంది. ఇంతలో బస్సు కదిలింది.
కిటికీలోంచి బయటకు చూసింది. అతను కనిపించలేదు. నీరసంగా సీట్లో కూర్చుండిపోయింది.
ఇందాక అతను కూర్చున్న సీట్లో మరెవరో కూర్చున్నారు. బానపొట్ట. తెల్లజుట్టు. లూజు పైజామాలో ఉన్నాడు. చూడబుద్ధి కాలేదు.
అతనే ఇంకా గుర్తొస్తున్నాడు. వెళ్ళి మాట్లాడితే బాగుండేది అనిపిస్తోంది. ‘ఐ లైక్ యూ’ అని చెప్పుంటే బాగుండేదని తోస్తోంది.
అప్పుడు ఏమీ చేయలేదు. ఇక ఇప్పుడూ ఏమీ చేయలేదు.
“జస్ట్ ఫర్ ఫన్” అన్న ఫ్రెండ్ మాటలు, “నీ సంగతేంటి మరి?” అన్న క్లాస్‌మేట్ మాటలు గుర్తొచ్చాయి.
ఏడుపొచ్చేలా ఉంది. వెక్కి వెక్కి ఏడవాలని అనిపిస్తోంది.
బస్సు ఆగింది. తను దిగాల్సిన స్టాప్ వచ్చేసింది.