కొన్నిసార్లు
భూమి పగుళ్ళ మధ్య
చిక్కుకున్న వాక్యాలు
వెలుగెరుగని తలపుల్లో
మింగుడు పడని వాక్యాలు
దుఃఖపు వలసల్లో
అదృశ్యంగా పారుతున్న వాక్యాలు
రహస్యమై
మరుగవుతున్నప్పుడు
మొదలు విరిగిన చెట్టులా
విరిగిన వాక్యం ఒకటి
ఒంటరిగా నిలిచి
వాసనను కోల్పోతూ ఉంటుంది.
అనేకసార్లు
విషాదం కూడా
కొత్త రూపాలతో
పాడే ఒక పాట
నిట్టూరుస్తూ
నిరసిస్తూ
చప్పుడు లేని
ఒక నిరసన
గాయాలన్నీ
గీతాలై వినిపిస్తుంటాయి
మళ్ళీ మళ్ళీ
అదే చీకటి పాట
అప్పుడు –
ఎన్నో రహస్యాలు
మొలకెత్తుతూ
మొదలవుతుంది
వెతుకులాట
ఇహ –
మిగులుతుంది
ప్రశ్నలైన సందర్భాలు
ప్రతి బంధకాలై
సమాధానం దొరకని చింత
మళ్ళీ –
ఆకుల కదలికలకు కూడా
ఉలిక్కిపడుతూ
కొమ్మపైన వాలిన పిట్ట అరుపులో
సమాధానాన్ని వెతుక్కుంటుంటావు
వసంతంలో పూచే
పూల పలకరింపుకై ఎదురుచూస్తూ.