Sita’s Eros -A Musical

Overture

(Or Entr’acte that comes after Maithili -A Musical.)

పాడితిమేమొలే ఒకనాడు పరమాత్మ!
భూరి కృపతో మమ్ము వాగ్దేవి దీవింప
పాడితిమేమో నాకలోకాల కీర్తనలు.

నాల్కలు చీలగా దర్భలు నాకేటి నాగులు
సుధల బిందువులను వీడి
మా సడికేసి వడిగాను సాగి వచ్చితిరేమొ
నాదము మెచ్చితిరేమొ!

అమృతము తెచ్చిచ్చి తల్లి దాస్యము తీర్చి
ఆకాశ మార్గాన వేగాన ఏగేటి ఖగపతి
రిక్కించెనేమొ చెవులు!
రెక్కలార్పుట మాని, రివ్వున దిగివచ్చి
పాట ప్రాంగణాల వాలెనో!
వైరము మరచి నాగులతో
కూడి తన్మయాన ఆడెనో! పాడెనో!

నాగులను ఏమార్చి, అమృత భాండము
సురలోకము చేర్చు శచీపతి
మా స్వరము విని, తబ్బిబ్బులో తాను
జారవిడిచేనో! భాండము;
ఆకసమున దొర్లెడి ఆ పాత్ర
అమృతము వానగా ఆ రాత్రి కురిసెనో;
జగతిలో జీవులు, జగడములు మాని
సుధ సేవనములో సొక్కిపోయేరో!

ఏమో, పాడితిమేమో మేమొకనాడు!
నాకలోకాల కీర్తనలు, పరమాత్మ!

స్మరించవలె
మేమిపుడు రాముని స్మరించవలె
స్మరించి
అయోధ్యా సరసుల చరించవలె
చరించి
ఆ సరసుని వరించిన సీతకు
ప్రపంచమున లేని విపంచి స్వనములు
వినిపించవలె
చరించవలె, స్మరించవలె, తరించవలె.

[అంటూ సరసులో ఈదుతూ, స రి గ మ ప ద ని సప్తహంసలు పలుకుతుండగా, తెర లేస్తుంది.]


అది అయోధ్యానగరం. మిథిలలో పెళ్ళి తర్వాత, సీత రాముడితో అయోధ్యకు వచ్చింది. కౌమారదశలోని వారిద్దరూ విడివిడి మేడలలో, రాముని కుటుంబంలోని పెద్దలు, దాదుల ఆలన పాలనలో, గురువుల శిక్షణలో పెరుగుతున్నారు. ఒకరికొకరు సందేశాలు పంపించుకుంటూ, తరచు కలుస్తూ; పచ్చీసు, అచ్చంగాయలు, చదరంగం, వైకుంఠపాళి, తొక్కుడుబిళ్ళలు ఆడుకుంటూ స్నేహం పెంచుకుంటున్నారు. అప్పటి సీత ఒక గేయ వర్తమానం.

సేమమడుగ రార! సాకేత రాముడా!
సీత సేమమరయగ రార!
చంద్రకాంతవనాన మన ఏకాంత సంగాతమున్నదని
మరువకుము ప్రియతమా!
సాంద్రముగ వెన్నెలలు
మంద్రముగ గాలులు, ఉద్యానమెల్ల పూలు
సిత సౌఖ్య సమయమిది
సీతా! యని ప్రీతిగ నువు పిలిచే
సాదు సమయమిది;
కనకవసన రార!
కుసుమాల నీవేళ కలిసి కోసేము
సిత పారిజాతాలు చలువగ కనుల కద్దేము
కనకాంబరాలు, కాశ్మీరాలు కలిపి కట్టేము;
చంద్రకాంతుల లోన చంద్రకాంతలు విరిసె
మధుసిక్తమైనవి మందారములు ప్రియుడ!
ముకుళించక ముందె రావోయి రాముడా!


రుతువులు మారుతున్నవి. సీతకు రాముడికి -కలిసి విత్తనాలు నాటటం, మొక్కలకు నీరు పోయటం, ఆలయ ప్రాంగణాలలో కల్లాపి చల్లటం, రంగుల ముగ్గులు వెయ్యటం, ఒప్పులకుప్పలు తిరగటం, ఒకరు పాడుతుంటే మరొకరు నాట్యం చెయ్యటం, ఇప్పుడు ఇష్ట కార్యక్రమాలు. యౌవనం లోకి అడుగు పెడుతున్నప్పటి సీత ఒక వేసవి పాట.

మాకుల కులికెను
నీల కోకిలా
రాచుకు పోయిన
కంఠం వగరులు
ఊయలనూగుతు వింటున్నా.
ఊయల ఊగిస
మంజుల ఝంఝం
ఇట నిటనిట ఆకుల
రెపరెప ఝంఝం
అలికి రెక్కల
చంచల సంచర ఝంఝం,
అగ్గుల పూవుల

రాల్పుల ఝంఝం
ఊయలనూగుతు వింటున్నా.
రారా రాముడ!
రార రాఘవుడ!
కోకిల, తుమ్మెద,
తురాయి కోరెను, నువు
వినగావలెనని వేసవి ఝంఝం.


సౌందర్యాభివృద్ధిలో, విద్యల వికాసంలో సీత, రాముడు, ఒకరినొకరు మించుతూ, వారి చేష్టలతో ఒకరి కొకరు ఆశ్చర్యం కలిగిస్తుంటారు. చిన్నితగవులు, పెద్ద ప్రేమలు వారివి.

ఏమన్నానో ఆ వేళలో
పుసపుస ఏమన్నానో ఆ తోపులో
రా, రమ్మన్నానా
పో, పొమ్మన్నానా
పొసగదు సీతా మన కసలే అన్నానా
నేనేమన్నానో ఆ వేళలో!

ముగిసెను మోహం
లేదిక సందేహం
రామ! రామ! -అననిక అన్నానా
తెలియదు ఏమన్నానో ఆ ఊపులో
నేనేమన్నానో ఆ వేళలో.


నూత్నయౌవనులు, వారి బాహ్యాంతరరూపాలు త్వరిత మార్పులు చెందుతూ, వారి పరస్పరాకర్షణలు మరింత తీవ్రాలు, తీపులై వృద్ధి చెందుతుంటాయి. అప్పటి పాటలివి.

ఏల ప్రేమింతువోయీ?
కాంతుడా! నన్ను, నే వేల కోర్కెలు
కోరేను నిన్ను.
కాదనవేమీ? లేదనవేమీ?
కోయిల కుహుకుహు సోనలలోనా
మొయిలు మెరుపుల కోనలలోనా
ఏల నిలిపేవోయి, నాపై ఇంత వలపేమీ!
ముంజేతులకు ముత్యాలిత్తువు
రొమ్ములపైనా రత్నాలుంతువు
సంపగి సొబగుల ఉడుపులిత్తువు
ఇంతగ నాతో రమింతువేలా?
రాముడా! నాపైన నీకింత భ్రమతేమీ?

మోహాలు మోహాలు
గన్నేరుపూలపై గొప్ప మోహాలు.
విరహాలు విరహాలు
నూరువరహాలపై వేయి విరహాలు.
తాపాలు తాపాలు
తామరలపై ఎంతొ తీపి తాపాలు.
కోపాలు కోపాలు
చేమంతులపై మెత్తని కోపాలు.
కలహాలు కలహాలు
కలువలతో ఘాటు కలహాలు.
వాంఛలు, వాంఛలు
జంటమల్లెల మీద కామవాంఛలు.


అయోధ్యలో ఒక ఉదయం. నగరి ఘాంటికుల హెచ్చరికలు, ప్రజలకు మేలుకొలుపులు.

ఠాంగ్ ఠాంగ్, ఠఠాంగ్ ఠాంగ్
మ్రోగె నదే ఘంటారావం
సుస్ఫుటమై, బహుముఖమై
అనశ్వరమై;
అదిగో! ఆరోహించెనుగా అర్కుడు
రధంబు, నియతితో,
నతి ప్రశాంతతతో, జన జాగృతీ తత్పరతతో;
ఆకర్ణించుడీ ఉత్పతిత తేజ:
ప్రభాత ధ్వనులన్,
ప్రజలార!
ప్రతిధ్వనించుడీ
గీతికా వర్ణతతుల మృదురుతితో.

సీత ఎంత ప్రేమిస్తుంటుందో, రాముడిని అంతకంతగా అయోధ్యవాసులు ప్రేమిస్తుంటారు. అతడు కనిపిస్తే వారికి పండగ. అతనిపై పాటలు కట్టి సొంత సంతోషం కోసం పాడుకుంటారు.

రంగపుర విహార! రఘువీర!
శ్రీరంగ పురవిహార!
జయ! కోదండ రామావతార!
(ముత్తుస్వామి దీక్షితార్ కృతినుండి)

కొలువగా తలచేమో
కొలుతుము మా కోదండపాణినే
కలవకన్నులవాడు
కమనీయమూర్తి, కొలువై ఆతడుండగా
తలవగానేటికి తక్కిన వారల
కొలుతు మేనాటికి కోదండపాణినే!


విద్యలెన్నో చదివి నేర్చి, శారీరకంగా, మానసికంగా పరిణతి చెందిన సీతారాముల భావి సహజీవన వసతికై, శుభముహూర్తాన, అయోధ్యమందిరాలలో, ఒక చక్కని నూతన భవంతి వారికి ఈయబడింది. శయనమందిరంలో నెచ్చెలీ! మైథిలీ! అంటూ మీదుమిక్కిలి ప్రేమతో ఆమెను కౌగిలించి, రాముడు ఒక బహుచక్కని వీణను ఆమెకు బహూకరిస్తాడు. అది ఒక మంత్రవీణ. ఎన్నోప్రాంతాల, కాలాల, వాద్యాల సంగీతం, ఆ వీణలో నిక్షిప్తమై ఉన్నది. ఆ ‘సంహిత’ తనంత తానే కూడా పలుకగలదు. భూతభవిష్యత్తుల లోని ఎందరో మహానుభావుల సంగీతం, కోరినప్పుడు వినవచ్చునని రాముడు తెలుపుతాడు. సీత సంబరంతో వీణను పలికించి చూస్తే, ఆమెతో కలిసి తనూ వీణ పలికిస్తాడు. వారిద్దరి పాట ఇది.

సంబరాలు, సంబరాలు!
మింటి వేల్పులు యక్షులు కిన్నరులు
దీవించిరంట
సొగసైన మా ఇంట ఇక సంగీతఝరులు
ప్రవహించునంట
‘రహి పుట్ట జంత్ర గాత్రమ్ముల రాల్గరగించు
విమల గాంధర్వంబు
విద్య’గా కలిగిన మేటి విద్వాంసులీ ఇంట
కొలువుందురంట!
సంబరాలు సంబరాలు.

రాముని ప్రవర్తనకు, మాటల మాధుర్యానికి, అతని యవ్వన మోహనరూపానికి, సరికొత్తగా పరవశించిన సీత కోరిక. రాముని అనుమోదము.

సంగమించ మనసోయి
అంగన అందాల ప్రోవోయి ఈ రేయి.
రోమరోమంబున రతికాంక్ష రగిలి
అంగాంగముల అగ్గి కదిలేను
సారంగాంకుని చలువన
చెంగల్వ విరిసేను.
వినువీధి గమించు ఈ రాసి పూర్ణచంద్రుడు
విశుద్ధ జ్యోత్స్నల రాజస్వి,
యుగయుగాల
బహువిధ తత్త్వజిజ్ఞాసుల తలపుల వెలుగిడిన
మాయామయ మోహన తేజస్వి.
దాటిపోనీయకీ పర్వఘడియలు
ప్రణయ తాత్త్వికా! తనువున తనువై
తరింతుమోయీ.


చాల కలరాగముల కథ కావ్యకథ రామకథ
పాడగా
గ్రీష్మ పరితాపములు శుష్క పరిశోకములు
మాయగా;
తేలి మురిపాల మరుకేళి సోలె కడు తారకలు
హాయిగా.

(పలుచని తెర మాటున నీడలుగా ఎగిరే స్వరసప్తకపు హంసల ఆశీర్వచనము.)

[Curtain]


Composition: Lyla Yerneni
Sound and Melody Lessons: Pytor I. Tchaikovsky
Poetic Line Lessons: James Longenbach