విశ్వమహిళానవల 15: జార్జ్ ఎలియట్

అది 2015. బ్రిటిషేతర రచయితలను ‘బ్రిటిష్ సాహిత్యంలో అతి గొప్ప నవల ఏది’ అని ఒక ప్రచురణ సంస్థ ప్రశ్నించింది. దాదాపు వంద నవలలు పరిశీలనకు వచ్చాయి. అత్యధిక సంఖ్యలో ఒక నవలకు ఓట్లు పడ్డాయి. ఆ నవల మిడిల్‌మార్చ్. రచయిత్రి జార్జ్ ఎలియట్ (George Eliot).

అంతకుముందు 2007లో బ్రిటిష్ పౌరులను ఇదే ప్రశ్న అడిగినపుడు ఇదే నవలకు ప్రపంచ నవలల్లో పదో స్థానం దక్కింది. బ్రిటిష్ వారిని, వారి కంటే ఎక్కువగా బ్రిటిషేతర పాఠకులను ఇంతగా ఆకర్షించిన ఈ నవల రాసిన జార్జ్ ఎలియట్ (1819-1880) అసలు పేరు మేరీ ఆన్ ఎవన్స్. మగపేరుతో రాయాల్సిన అవసరం అప్పటికి ఏ రచయిత్రికీ లేదు. అప్పటికే చాలామంది స్త్రీలు తమ పేరుతోనే రాస్తున్నారు. కానీ ఆమె మగపేరు పెట్టుకోడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి - సమకాలీన రచయిత్రులందరూ ఫక్తు నీరసమైన ప్రణయగాథలు రాస్తున్నారు కనక వారికంటే తను అన్ని విధాలా భిన్నంగా ఉండాలన్న ఆలోచన; రెండు – తను అత్యధికంగా ప్రేమించి, సహజీవనం నెరపిన వ్యక్తి పేరు జార్జ్ కావడం. అతని పేరు తన పేరుగా చేసుకోవాలన్న ఆమె తపన.

ఒక మధ్యతరగతి కుటుంబంలో మూడో సంతానంగా పుట్టిన మేరీ ఆన్‌కి చిన్నప్పటినుంచీ అమితమైన తెలివితేటలుగల అమ్మాయిగా పేరుండేది. తెలివితేటలుండడం ఒక సమస్య అయితే, పెద్ద అందగత్తె కూడా కాకపోవడం వల్ల ఆమెకు వివాహం కావడం అసంభవమనే అందరూ నిర్ణయించేశారు. ఆ విషయం గురించి ఆమె ఎప్పుడూ బాధపడలేదు సరికదా, తన జ్ఞానతృష్ణను మరింత పెంచుకుంది. పుస్తకాలపురుగుగా మారింది. మతం, రాజకీయాలు, సామాజిక ఉద్యమాలు అన్నిటినీ ఇష్టంగా చదివేది. ఆమెకు సాహిత్యంతో పరిచయం తొలిదశలో అనువాదకురాలిగా, పత్రికా సంపాదకురాలిగా మొదలైంది. వెస్ట్ మిన్‌స్టర్ రివ్యూ వంటి ప్రముఖ పత్రికకు సంపాదకత్వం వహించింది. సమకాలీన రచనలపై చాలా నిశితమైన సమీక్షలు రాసింది. తోటి రచయిత్రులు రాసిన కేవల ప్రణయ నవలలను (Silly Novels by Lady Novelists) తీవ్రంగా విమర్శించింది. అలా మొదటి దశలో జర్నలిస్టుగా, విమర్శకురాలిగా, అనువాదకురాలిగా పేరు తెచ్చుకున్న తర్వాతే తను కూడ సృజనాత్మక సాహిత్యరంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది. ఆమె రాసిన నవలలు మొత్తం ఏడు. 1859లో ఆమె తొలి నవల ఆడమ్ బీడ్ (Adam Bede) విశేషప్రజాదరణ పొందింది (ఇప్పటికీ ముద్రితమవుతూనే ఉంది). ఆ తర్వాత 15 ఏళ్ళపాటు నవలలు రాసి, సమకాలీన బ్రిటిష్ సాహిత్యంలో తన స్థానం సుస్థిరపరచుకుంది. మిల్ ఆన్ ది ఫ్లాస్ (Mill on the Floss, 1860), సైలస్ మానర్ (Silas Marner, 1861), రొమోల (Romola, 1863), ఫీలిక్స్ హోల్ట్ ది రాడికల్ (Felix Holt the Radical, 1866), మిడిల్‌మార్చ్ (Middlemarch, 1871–1872). ఆమె చిట్ట చివరి నవల డేనియల్ డెరోండా (Daniel Deronda, 1876). 1878లో ఆమె సహచరుడు జార్జ్ లూయిస్ (George H Lewes) అనారోగ్యంతో మరణించాక, అతని రచనల ప్రచురణకు కంకణం కట్టుకుంది. ఈ పనిలో తనకు సహకరించిన, తనకంటే 20 ఏళ్ళు చిన్నవాడైన జాన్ క్రాస్‌ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె కూడ ఎక్కువకాలం బతకలేదు. 1880 మేలో క్రాస్‌ని వివాహం చేసుకున్న జార్జ్ ఎలియట్, అదే సంవత్సరం డిసెంబర్‌లో మూత్రపిండాల వ్యాధితో మరణించింది.

19వ శతాబ్దిలో నవలలు రాసిన ఇతర రచయిత్రులతో పోలిస్తే జార్జ్ ఎలియట్‌కు ఉన్న ప్రత్యేకత, ఆమె గొప్ప చదువరి కావడం. జర్మన్ తత్వవేత్తల గ్రంథాలను ఇంగ్లీషులోకి అనువదించడం వల్ల ఆమెలో తాత్విక చింతన నవలారచనకంటే ముందే ఆరంభమైంది. స్ట్రౌస్ (Friedrich Strauss రచన Life of Jesus), ఫ్యూర్‌బాక్ (Feuerbach రచన The Essence of Christianity), స్పినోౙా (Spinoza రచన Ethics) ఆమెను ప్రభావితం చేసిన రచయితలు. ఈ ప్రభావం చర్చల రూపంలో కంటే పాత్ర చిత్రణలో, పాత్రల ఆంతరంగిక ఆలోచనల్లో ఎక్కువగా వ్యక్తం కావడం, నవలారచయిత్రిగా ఆమెను పైమెట్టు మీద కూర్చోబెట్టే అంశాలు.

జార్జ్ ఎలియట్ నవలల్లో ఎక్కువమందికి ఇష్టమైనవి (ఈనాటికీ) మిల్ ఆన్ ది ఫ్లాస్, సైలస్ మానర్, మిడిల్‌మార్చ్. ఈ మూడింటిలో అటు సామాన్య పాఠకులను, ఇటు విమర్శకులనూ మెప్పించిన రచన మిడిల్‌మార్చ్. ఆడమ్ బీడ్ ప్రచురింపబడినప్పుడు తక్షణమే ప్రజాదరణ పొందింది. ఈ నవల రాసిందెవరనే కుతూహలం కూడా పాఠకుల్లో పెరిగింది. కొంతకాలం వరకూ ఎలియట్ తనేనని చెప్పుకోలేదు. తీరా చెప్పుకున్నాక, ఆమె వ్యక్తిగత జీవితం (వివాహితుడితో అనుబంధంలో ఉండడం) కొంత అశాంతిని కలిగించినా, ఆమె అభిమానులు క్రమంగా దాన్ని పట్టించుకోవడం మానేశారు. ఆమె రచనలన్నిటినీ అదే ఉత్సాహంతో స్వాగతించారు. సమాజంలో వీరి అనుబంధం ఆమోదం పొందడానికి మరికొంత కాలం పట్టింది. చివరికి 1877లో విక్టోరియా రాణి కుమార్తె రాకుమారి లూయిసీకి ఒక సభ నిర్వాహకులు బహిరంగంగా ఇద్దరినీ కలిపి పరిచయం చేయడం విశేషఘట్టం. స్వయంగా విక్టోరియా రాణి జార్జ్ ఎలియట్ అభిమాని. ఆమె నవలలన్నీ చదవడమే కాకుండా, ఆడమ్ బీడ్ నవలలోని సన్నివేశాలను చిత్రలేఖనంలో తీర్చిదిద్దమని ఆ నాటి చిత్రకారుడు ఎడ్వర్డ్ హెన్రీ కార్బోల్డ్‌ని (Edward Corbould) ఆదేశించింది మహారాణి.

జార్జ్ ఎలియట్ తొలిరోజుల్లో పత్రికారచయితగా పని చేయడం వల్ల కాబోలు ప్రపంచ రాజకీయాల్లో ఆమెకు అమితమైన ఆసక్తి ఉండేది. అన్ని సంఘటనలకూ ఆమె స్పందించేది. నిర్మొహమాటంగా తను ఏ పక్షాన ఉన్నదీ తెలిపేది. ఆ క్రమంలోనే 1861లో అమెరికా అంతర్యుద్ధంలో నల్లజాతీయుల బానిసత్వాన్ని రద్దు చేయడానికై పోరాటానికి పూనుకున్న యూనియన్‌కు మద్దతు ప్రకటించింది. అలాగే 1868లో స్వపరిపాలన కోసం పోరాటానికి దిగిన ఐరిష్ వారిని సమర్థించింది. ఇవన్నీ ఒక మహిళారచయితకు అంత సులభమైన పనులు కాకున్నా, ఆమె తన అభిప్రాయప్రకటనలో ఎప్పుడూ వెనుకడుగు వేసేది కాదు. ఆమె అభిమాన తత్వవేత్త జాన్ స్టువర్ట్ మిల్ (John Stuart Mill). మహిళల అణచివేత గురించి మిల్ రాసిన వ్యాసాలను చాలా ప్రశంసించింది. మహిళల వోటు హక్కు గురించి ఆయన రాసినందుకు మెచ్చుకుంది. సుప్రసిద్ధ తత్వవేత్త బర్‌ట్రాండ్ రసెల్ తల్లి లేడీ ఆంబర్లీ, మహిళల ఓటు హక్కు గురించి, గర్భనిరోధక హక్కు గురించి, వివాహబంధంలో సమానత్వం గురించి చేసిన ప్రసంగాలు ఎలియట్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంటే తన కాలం నాటి స్త్రీలహక్కుల పోరాటాలను ఆమె సంపూర్ణంగా సమర్థించింది. ప్రకృతి నియమాలే స్త్రీలను అబలను చేశాయన్న వాదనను తిప్పికొట్టేది. బహిరంగంగా వివాహేతర సంబంధం పెట్టుకోవడం, తన కంటే వయసులో బాగా చిన్నవాడిని వివాహం చేసుకోవడం, స్త్రీల సమానత్వం గురించి రాయడం, మాట్లాడడం, క్రైస్తవ మతం పట్ల విశ్వాసం చూపకపోవడం... ఇలా అన్నీ సంప్రదాయవిరుద్ధమైన ప్రవర్తనారీతులనే ప్రదర్శించింది జార్జ్ ఎలియట్. అయినా నవలారచయిత్రిగా ఆమె ప్రభావం, స్థానం చెక్కుచెదరలేదు. అది ఆమె వ్యక్తిత్వం లోని ఆకర్షణ కావచ్చు; బ్రిటిష్ పాఠకులలో వస్తున్న పరిణామానికి సంకేతమూ కావచ్చు.

మిడిల్‌మార్చ్

ఈ నవలను వర్జీనియా ఊల్ఫ్ (Virginia Woolf) ‘పరిణత మనస్కుల కోసం రాసిన తొలి ఇంగ్లీష్ నవల’ అని వర్ణించింది. అంతకు ముందు వచ్చినవన్నీ ‘పిల్లల’ నవలలని భావించిందేమో. 1829-32 కాలం నాటి బ్రిటిష్ సమాజాన్ని చిత్రించిన ఈ నవల చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం – ఎలియట్ పాత్ర చిత్రణలో చూపిన పరిణతి, గ్రామీణ జీవనం పట్ల చూపిన లోతైన అవగాహన, మానవసంబంధాల పట్ల నిశితమైన ఆమె చూపు, అన్నిటినీ మించి అత్యంత వాస్తవిక రచనా దృక్పథం అని చెప్పాలి. ఈ నవల ప్రచురింపబడినప్పుడు మరీ ఎక్కువ ప్రశంసలేమీ అందుకోలేదు. ‘బాగానే ఉందన్న’ అభిప్రాయం వచ్చింది. క్రమంగా నవలకు ఆదరణ పెరిగి 20వ శతాబ్దిలో నిరంతర చర్చలు జరిగి, చివరికి క్లాసిక్‌గా నిలిచిపోయింది.

ఈ నవల పూర్తి చేయడానికి దాదాపు మూడేళ్ళు పట్టింది ఎలియట్‌కు. ఆ కాలం నాటి సామాజిక పరిస్థితుల గురించి ఈ నవలలో చర్చకు రాని అంశం లేదు. సమాజంలో స్త్రీల ప్రతిపత్తి, వివాహవ్యవస్థ, ఆదర్శవాదం, మతం, రాజకీయ సంస్కరణలు, విద్యావిధానం, రాజకీయ పరిణామాలు, వైద్యం వంటి ఎన్నో సామాజిక పరిణామాలతో పాటు, మానవ స్వభావంలోని ద్వంద్వప్రవృత్తులు, స్వప్రయోజనాలు, స్త్రీపురుష సంబంధాల్లోని వైరుధ్యాలు ఇలా ఎన్నో విషయాలను లోతుగా, పరిణతితో చర్చించిన నవల ఇది.

మిడిల్‌మార్చ్ అన్నది జార్జ్ ఎలియట్ కల్పించిన ఒక ఊరు. లండన్ వెలుపల ఒక చిన్న పట్టణం. నవలకు ఉపశీర్షికగా ‘ఒక ప్రాంతీయకథా పరిశీలన’ (A study of provincial novel) అని రాసింది ఎలియట్. ప్రాంతీయ (Provincial) అనే మాటలోనే ఆమె నాగరికతకు దూరంగా ఉండి, సంకుచితమైన జీవనశైలి ఉన్నవారన్న సూచన చేసింది. డబ్బు, కుటుంబ మర్యాద, స్త్రీపురుషులకు నిర్దిష్టమైన విధులు, కొత్త ఆలోచనలను స్వీకరించలేని మనస్తత్వాలు, సామాజికహోదాల పరిరక్షణ ఈ సమాజం గుణాలు. అలాంటి సమాజంలో, వారి కంటే భిన్నంగా ఆలోచించే వ్యక్తులకు చోటుండదు. రాజీపడక తప్పదు. ఆ వాస్తవికతను ఈ నవల అనేక పాత్రల ద్వారా, సన్నివేశాల ద్వారా చిత్రిస్తుంది.

ఈ నవలలో ప్రధాన పాత్రలు డొరొతి బ్రూక్ (Dorothea Brook), టర్షస్ లిడ్‌గేట్ (Tertius Lydgate). వీళ్ళిద్దరూ సామాన్యార్థంలో నాయికా నాయకులు కారు. నిజానికి వీరిద్దరి కథలను వేర్వేరు నవలలుగా మొదట ప్రారంభించింది ఎలియట్. క్రమంగా రెండిటినీ కలిపి ఒకే నవలగా రాయాలన్న ఆలోచన వచ్చింది. 1829-32 మధ్య కాలానికి చెందిన ఈ కథను నాలుగు భాగాలుగా సీరియల్‌గా ప్రచురించింది. లిడ్‌గేట్, డొరొతిల స్వభావంలో ఉన్న ‘ఆదర్శవాదం’ ఆ నాటి సమాజానికి కొరుకుడు పడనిది. వారి కుటుంబ సభ్యుల అవగాహనకు అతీతమైంది. ఇద్దరివీ సమాంతర జీవితాలు. ఇద్దరికీ వైవాహిక సంబంధంలో అసంతృప్తే తప్ప, ఆనందం లభించదు. నవలాంతానికి డొరొతి తనను ఇష్టపడే విల్ లడిస్‌లాని (Will Ladislaw) రెండో వివాహం చేసుకోవడంతో ఆమె కొంతవరకూ సుఖపడుతుందన్న సూచన ఉంది. అయితే అప్పటికి ఆమె తన ఆదర్శాలను వదిలేసి, గృహిణిగా, బిడ్డల తల్లిగా మిగిలిపోతుంది. మరోవైపు లిడ్‌గేట్, భర్త అంటే సంపాదించి పెట్టడానికేనని, జీవితమంటే పార్టీలు, ఫాషన్‌లేననీ నమ్మే భార్య రోసామండ్ విన్సీని (Rosamond Vincy) సంతృప్తిపరుస్తూ, ఆదర్శాలను వదిలి అసంతృప్తితో 50 ఏళ్ళకు మరణిస్తాడు.

ఈ ఆదర్శాలు విఫలం కావడానికి ఆ నాటి సామాజిక పరిస్థితులు, అప్పటి వ్యక్తుల స్వభావాలు ఎలా కారణమయ్యాయో సవిమర్శకంగా చిత్రిస్తుంది ఎలియట్. తల్లిదండ్రుల మరణంతో, చెల్లెలు సిలియాతో (Celia), మేనమామ బ్రూక్ వద్ద జీవిస్తున్న డొరొతిది విలక్షణమైన వ్యక్తిత్వం. ఆమెది చాలా జాలి గుండె. పేదలు, సామాజికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారు, అణగారిన వర్గాల మీద ఆమె సానుభూతిని చూసినపుడు ‘సెయింట్ థెరెసా’ గుర్తుకొస్తుందని ఆనాటి విమర్శకులు వ్యాఖ్యానించారు. తన కిరాయిదార్లకు గుడిసెల బదులు మంచి ఇళ్ళు కట్టాలన్న తాపత్రయం, వర్గవివక్ష లేకుండా, అందరినీ సమానంగా చూడాలన్న తహతహ, పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లోనూ కృషి చేయాలన్న ఆకాంక్ష, భర్త మేధోజగత్తులో తను కూడ పాలుపంచుకోవాలన్న కోరిక ఆమెలోని గుణాలు. వీటిని అర్థం చేసుకోగల స్థాయి ఆమె కుటుంబ సభ్యులకు లేదు; భర్తకు అసలే లేదు. తనను ప్రేమించే సర్ జేమ్స్‌ని కాదని, తనకంటే పాతికేళ్ళకు పైగా పెద్దవాడైన ఆనాటి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త రెవరెండ్ ఎడ్వర్డ్ కాౙబాన్‌ని (Edward Casaubon) వివాహం చేసుకుంటుంది. కారణం – ప్రేమకంటె ఎక్కువగా ఆయనతో పాటు మతగ్రంథాలు చదివి, ఆయన కొత్తగా రాస్తున్న గ్రంథరచనలో తను కూడ సహాయపడాలని. వీళ్ళిద్దరి మధ్య విషయచర్చలకు ఆమె ఉత్సాహం చూపినపుడల్లా, భర్త దాన్ని నీరుగారుస్తాడు. ఆడవాళ్ళకు మతంతో, తాత్వికతతో, పుస్తకరచనతో పనేమిటంటాడు. అతను తన తెలివితేటలకు, విషయపరిజ్ఞానానికి ముగ్ధుడై వివాహం చేసుకున్నాడన్న భ్రమలో ఉన్న డొరొతి, కేవలం అవసరాలు తీర్చే యంత్రంగా మాత్రమే తనని చూస్తున్నాడని అర్థమై నిస్పృహకు గురవుతుంది. అలా ఆమె వివాహం విఫలబంధమవుతుంది.

మరోవైపు, ఆ ఊరికి కొత్తగా వచ్చిన యువ వైద్యుడు డాక్టర్ టర్షస్ లిడ్‌గేట్ కూడ వైద్యంలో కొత్త మార్పులు రావాలన్న ఆకాంక్ష ఉన్నవాడే. వైద్యరంగంలో విశేషపరిశోధన చెయ్యాలన్నది అతని కోరిక. కానీ, రోసామండ్ అందానికి దాసోహమని ఆమె సౌందర్యం కేవలం బాహ్యమైనది మాత్రమేనని అర్థం చేసుకోలేక వివాహం చేసుకుంటాడు. భర్త అంటే ఎక్కువ సంపాదనతో తనకు సుఖాలను కొనిచ్చే మంత్రదండంగా పరిగణించే రోసామండ్ అతని పరిశోధనకు అడ్డుకట్ట వేస్తుంది. కేవలం ప్రాక్టీసు, సంపాదనకే పరిమితమౌతాడు. ఇది చివరిదాకా విఫల వివాహమే.

డొరొతి చెల్లెలు సిలియాకు అక్క మేధ, పవిత్రతల పట్ల అభిమానం ఉన్నా, ఆమె నిర్ణయాల పట్ల అంత గౌరవం లేదు. అందరి జీవితాలను ఉద్ధరించాలన్న అక్క తాపత్రయం, మేధోపరమైన జీవితం కోసం తనకంటే ఎంతో పెద్దవాడైన మతాధికారితో వివాహానికి సిద్ధపడడం సిలియాకు నచ్చదు. అక్కను ప్రేమించిన సర్ జేమ్స్ చేటమ్‌ని (James Chettam) అప్పటికే ప్రేమిస్తున్న ఆమె, అక్క అడ్డు తొలగిపోవడంతో, ఆనందంగా జేమ్స్‌తో వైవాహిక జీవితాన్ని పంచుకుంటుంది. మరోవైపు, డొరొతి హనీమూన్ లోనే భర్త బండారం, అతనికి తన తెలివితేటల మీద, మేధోసహకారం మీదా ఏ గౌరవమూ లేదని బయటపడ్డంతో, హతాశురాలవుతుంది. అప్పుడే పరిచయమైన అతని మేనల్లుడు లడిస్‌లా, తన మేనమామ భార్య పట్ల ఆకర్షితుడవుతాడు. డొరొతి దానికి స్పందించినా, చేసేది ఏమీ లేక ఊరుకుంటుంది. కొంతకాలానికి, అనారోగ్యంతో కాౙబాన్ మరణించడంతో, డొరొతి స్థిమితపడుతుంది. కానీ చనిపోయేముందు రాసిన వీలునామాలో అతను, తన భార్య పునర్వివాహం చేసుకుంటే, తన ఆస్తిలో చిల్లిగవ్వ దక్కదని రాస్తాడు. దానితో, కుటుంబ గౌరవమే తప్ప, ఆదాయం లేని డొరొతి ఇబ్బంది పడుతుందని, లడిస్‌లా, ఇప్పుడు ఆమెను వివాహం చేసుకునే అవకాశం ఉన్నా, ఆమెకు దూరంగా వెళ్ళిపోతాడు. అప్పటికే లడిస్‌లా పట్ల ప్రేమ కలిగిన డొరొతి కూడ మౌనంగా ఉండిపోతుంది. చివరికి, డొరొతి, తన జీవితానికి కావలసింది ఏమిటో నిర్ణయించుకుంటుంది. భర్త వదిలివెళ్ళిన ఆస్తికి ఓ దండం పెట్టి, లడిస్‌లాని వివాహం చేసుకుంటుంది. సామాజిక సేవ బాధ్యతను కూడ లడిస్‌లాకు అప్పజెప్పి, తను సాధారణ గృహిణిగా ఉండడానికే ఇష్టపడుతుంది. డొరొతి రెండో వివాహం చేసుకోవడం, అందులోనూ ఆమె తెలివితేటలకు, వ్యక్తిత్వానికి ఏ మాత్రం ‘తగని’ లడిస్‌లాని చేసుకోవడం చెల్లెలికీ, మరది జేమ్స్‌కూ నచ్చదు. ఆ మాటకొస్తే డొరొతి చాలా గొప్పదని భావించే ఆమె చుట్టాలెవ్వరికీ ఆమె నిర్ణయం నచ్చదు. ఆమె రెండు వివాహాలూ పొరబాటువనే అందరి అభిప్రాయం. కానీ లడిస్‌లాతో ఆమె ఆనందంగా ఉండడం చూసి, చెల్లి సిలియా ఆనందిస్తుంది.

ఈ నవలలో కొన్ని ఇతర పాత్రలు కూడ ‘ఆదర్శ’భావాలను వ్యక్తం చేస్తాయి. కానీ ఎప్పటికప్పుడు విధి వైచిత్రి వల్ల, ఎవరూ అనుకున్న ఫలితాలను పొందరు. ఎక్కడో ఒక్కడ రాజీపడాల్సివస్తుంది. ఇలా ఈ నవలంతా విధి ఆడుకునే ఆటతో, అనివార్యమైన రాజీలతో అత్యంత వాస్తవికంగ ఉంటుంది. ఏ ఘటనా అకస్మాత్తుగానో, కృతకంగానో కల్పించినట్టు ఉండదు. అన్నీ సహజపరిణామాలుగా చిత్రిస్తుంది ఎలియట్. ఈ రాజీలన్నిటి మధ్యా తమ ఆశలను ఎంతో కొంత సజీవంగా ఉంచుకునేవారు నవలాంతానికి డొరొతి, లడిస్‌లా మాత్రమే. తన మేధ ద్వారా, నిర్మలమైన మనసు వల్ల, పవిత్రకార్యాచరణ వల్లా ప్రత్యేక వ్యక్తిలా ఉండాలని ఉవ్విళ్ళూరిన డొరొతి, విమర్శకులందరి దృష్టిలో, సెయింట్ థెరెసాలా (అదే యుగంలో 24 ఏళ్ళ ప్రాయంలోనే పోప్ చేత అత్యంత పవిత్రమైన మనసు కలిగిన స్త్రీమూర్తిగా పేరుపొందిన నన్) విశుద్ధమానవిగా నిలిచిన డొరొతి కూడా చివరికి ఒక మామూలు గృహిణిగా మిగిలిపోతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఎవరూ తమ ఆశయాలసాధనలో పరిపూర్ణంగా సఫలం కారు. అందరూ అసంతృప్త జీవులే. కానీ అందులోనే ఆనందాన్ని వెతుక్కోగల స్థితప్రజ్ఞత వారిలో కనిపించే ప్రత్యేక లక్షణం. ఇందువల్లే సాధారణంగా ఆ కాలం స్త్రీల రచయితలతో పోల్చి చూసి ‘అత్యంత వాస్తవికంగా, పరిణతితో రాసిన నవలగా’ విమర్శకులు ఈ నవలను శ్లాఘించారు. చదివే కొద్దీ కొత్తలోతుల్ని అందించే అపురూపమైన రచన ఇది.

విఫలవైవాహికజీవితాన్ని హత్యాకాండగా వర్ణించిన తొలి రచయిత్రి బహుశా ఎలియటే.

Marriage is so unlike everything else. There is something even awful in the nearness it brings. Even if we loved some one else better than—than those we were married to, it would be no use—I mean, marriage drinks up all our power of giving or getting any blessedness in that sort of love. I know it may be very dear—but it murders our marriage—and then the marriage stays with us like a murder—and everything else is gone.

జార్జ్ ఎలియట్ రాసిన ఏ నవలా మరో నవలలా ఉండదు. అంత వైవిధ్యభరితమైన రచన ఆమెది.

ఉదాహరణకు, ది మిల్ ఆన్ ది ఫ్లాస్ (1860) నవల అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని మనోవైజ్ఞానిక కోణం నుంచి చిత్రీకరించిన మంచి నవల. మ్యాగీ, టామ్ అన్నాచెల్లెళ్ళు మాత్రమే కాదు. వారిద్దరి మధ్య విశేషమైన అనుబంధం. టామ్‌తో ఎవరు సన్నిహితంగా ఉన్నా మ్యాగీ ఈర్ష్యపడుతుంది. మరో వైపు, టామ్ మ్యాగీకి ఇతర పురుషులతో ఉన్న అనుబంధాన్ని నియంత్రించడం తన హక్కని అనుకుంటాడు. ఆమె ఎవరిని వివాహం చేసుకోవాలో నిర్ణయించే హక్కు తనకుందని అతని భావన. అన్న మీద ఎంత ప్రేమ ఉన్నా, తన వ్యక్తిగత విషయాల్లో తన అంతరాత్మనే నమ్ముకుని తన హక్కుని స్పష్టం చేస్తుంది మ్యాగీ. మొదట్లో, ఫిలిప్ వేకెమ్‌ని (Phillip Wakem) మ్యాగీ ప్రేమించడం నచ్చని అతను, వారిద్దరు కలుసుకోవడాన్ని నిషేధిస్తాడు. తన తండ్రి తన మిల్లును కోల్పోవడానికి లాయరైన ఫిలిప్ నాన్నే కారణం కనక, చెల్లెలు అతనితో స్నేహం చెయ్యడాన్ని అతను హర్షించడు. అన్న మాటలను కాదనలేక, ఆమె ఫిలిప్ ప్రేమను తిరస్కరిస్తుంది. తర్వాత స్టీవెన్ గెస్ట్ (Stephen Guest) ప్రేమలో పడిన మ్యాగీ అతనితో పడవలో విహారానికి వెళ్ళినపుడు, ఆమెను బలవంతం చేసి తనతో లేచిపోయేందుకు ఒప్పిస్తాడు స్టీవెన్. కానీ ఆ ఉద్దేశమే లేని మ్యాగీ కొన్ని రోజులకు తిరిగి తన ఇల్లు చేరుకుంటుంది. అప్పటికే ఆమె పేరు ఆ గ్రామంలో మోగిపోతుంటుంది. అందువల్ల, తన వంశమర్యాద మంటగలిపిందని టామ్ ఆమెను తన జీవితం నుంచి వెలివేస్తాడు. అలా టామ్‌కి ఆమె ఎన్నుకున్న ఇద్దరు అబ్బాయిలూ ఇష్టం లేదు. మ్యాగీ కూడ ఫిలిప్‌తో, స్టీవెన్‌తో ఏ సంబంధమూ పెట్టుకోవడానికి మనసొప్పక, ఇద్దరికీ తన తుదినిర్ణయంగా వాళ్ళతో తెగతెంపులు చేసుకున్నట్టు చెప్పేస్తుంది. ఈ పరిస్థితిలో ఒకరోజు పెనుతుఫాను ఆ ఊరిని ముంచెత్తుతుంది. ఒక్కడే నీళ్ళ మధ్య ఉండిపోయిన అన్నను రక్షించడం కోసం మ్యాగీ ఒక్కత్తే పడవ నడుపుకుంటూ వెళ్తుంది. ఇంతకాలంగా ఆమె కోరికలన్నిటికీ అడ్డు తగులుతూ, తను కంట్రోల్‌లో ఉంచుకోవాలని చూసినా, తన చెల్లెలు మ్యాగీ, తనను కాపాడ్డం కోసం ప్రాణాలకు తెగించిరావడం టామ్ మనసును కలిచివేస్తుంది. ఇద్దరూ ఆ తుఫానులో నదిలో చిక్కుకుని, ఒకర్నొకరు గట్టిగా కౌగలించుకుని మునిగిపోతారు.

అన్నాచెల్లెళ్ళను గురించి ఇలాంటి వస్తువు అంతకుముందు ఇంగ్లీషు నవలల్లో ఎవ్వరూ చిత్రించలేదు. ఒకరకంగా ఇది జార్జి ఎలియట్ ఆత్మకథాత్మక నవల అనీ, ఆమెకు అన్న పట్ల అమితమైన ప్రేమ ఉండేదనీ విమర్శకులంటారు. ఇప్పటి విమర్శకులు ఫ్రాయిడియన్ సిద్ధాంతాలతో వ్యాఖ్యానించడానికి పుష్కలంగా అవకాశం ఉన్న నవల ఇది.

ఆనాటి పాఠకులను విశేషంగా ఆకర్షించిన సైలస్ మానర్, ఆడమ్ బీడ్‌, డేనియల్ డెరాండోలు కూడ విశిష్టమైన నవలలే. వస్తువులో గానీ, స్త్రీ పాత్రల్లోగానీ ఎక్కడా మూసధోరణి లేకుండా, దేనికవే విలక్షణమైన పాత్రల్ని సృష్టించడం ఆమె ప్రత్యేకత.

ఆమె నవలల్లో సన్నివేశగతంగా చెప్పిన ఎన్నో వాక్యాలు జీవితాన్ని గొప్పగా వ్యాఖ్యానిస్తాయి.

- What do we live for, if it is not to make life less difficult for each other? – ఇతరులకు వీలైనంత తక్కువ కష్టం కలిగించాలన్న సూత్రాన్ని ఎంత చక్కగా చెప్పిందో. అలాగే, కేవలం అదృష్టం మీద, ఇతరుల మీద ఆధారపడొద్దని ఇలా అందంగా చెబుతుంది.

- It will never rain roses: when we want to have more roses, we must plant more roses.

- And, of course men know best about everything, except what women know better.” అని పురుషులను వేళాకోళం చేసినా. Adventure is not outside man; it is within అని స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చినా, జీవితంలో ఆచరించగల ఎన్నో విలువైన అభిప్రాయాలను, సిద్ధాంతాలను అలవోకగా సంభాషణల్లో గుప్పిస్తుంది జార్జి ఎలియట్. విలియమ్ మేక్‌పీస్ థాకరే, ఛార్లెస్ డికెన్స్, థామస్ హార్డీ వంటి నవలాకారులు జీవించిన కాలంలోనే నవలలు రచించిన జార్జ్ ఎలియట్ వారితో సమానమైన హోదాను అందుకుంది. 1870లో డికన్స్ మరణానంతరం ‘the greatest living English novelist’ అని కూడ వర్ణింపబడింది.

సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...