కాలమే!

అలా తరచి తరచి చూడకు
ఉప్పెనై ఎదురొచ్చిన గాలితెరలో
సన్నటి ఇసుకలా కంటిలో దూరి
గరగరలాడుతూనే వుంటుంది

అలా పదే పదే తడుముకోకు
గాయం చుట్టూ చలిగాలై ముసురుకుంటూ
సలపరిస్తూనే వుంటుంది
ఉన్నట్టుండి శరీరపు కణ కణాన్నీ శృతిచేసి
నిన్నొక అగ్నిశిఖను చేసి పలవరిస్తూనే వుంటుంది

అలా మాయకు లోనుగాకు
నిన్న నిన్ను నవ్వించి కరిగించిందనుకున్నావా
రేపు మళ్ళీ నిన్నొక మంచు ముద్దను చేసి
ఏడిపిస్తుంది.

అలా విసిగి వేసారి పోకు
ఎక్కడో నీవూహించని మలుపు ఆవల
మినుకు మినుకుమంటున్న
సంధ్యాదీపమై
దరిచేరి వెలుగునూ ఇస్తుంది

అదంతే
మాట దొరకని నిశ్శబ్దమై
మనసు నిలపని ఒంటరితనమై
నీకు నీవు మాత్రమే మిగిలేలా
అగమ్యగోచరంగా
కఠిన శూన్యంగా
మౌనమై అంతరాత్మను
మళ్ళీ మళ్ళీ శోధిస్తూ…

విజయ్ కోగంటి

రచయిత విజయ్ కోగంటి గురించి: విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ...