విశ్వ మహిళా నవల: 1. లేడీ మూరాసాకి

[అది క్రీ.శ. 11వ శతాబ్ది. తెలుగు సాహిత్యంలో నన్నయ మహాభారత రచన ప్రారంభిస్తున్నాడు. మలయాళ, హిందీ, మరాఠీ, గుజరాతీ వంటి భాషల్లో సాహిత్యం ఇంకా ఊపిరే పోసుకోలేదు. తమిళ, కన్నడ, బెంగాలీ సాహిత్యాల్లో భక్తి రచనలు మాత్రమే వెలువడుతున్నాయి. పర్షియన్‍లో షాహ్‍నామా (Shahnama) వెలువడింది. ఆంగ్ల సాహిత్యంలో ఎప్పుడు రాసిందీ తెలీని బృహత్తర పురాణకావ్యం బేయోఉల్ఫ్ (Beowulf) అప్పుడే లభించింది. అలా చాలా భాషల్లో పౌరాణిక, భక్తి రచనలు, ప్రధానంగా పద్యరచనలు వెలువడుతున్న తరుణంలో జపాన్‍లో ఒక మహిళ వెయ్యిపేజీలకు మించిన వచన రచన చేసింది. ఆమె రాస్తున్నప్పుడే అది ఒక కొత్త ప్రక్రియ అని, వచనంలో ఇలాంటి ప్రక్రియ అంతకుముందు రాలేదనీ సామాన్య పాఠకులకు, పండితులకూ అర్థమైంది. ఆ నవల పేరు ది టేల్ ఆఫ్ గెన్జి (The tale of Genji; జపనీస్‍లో గెన్జి మొనొగతరి); రచయిత్రి లేడీ మూరాసాకి.

అలా క్రీ.శ. 11వ శతాబ్ది నుంచి నవలను తమ ప్రధాన సాహిత్యమాధ్యమంగా చేసుకుని, ప్రపంచ భాషలన్నిటిలోనూ నవలా సామ్రాజ్యంలో మహిళలు తమ బావుటా ఎగరేశారు. నవలలకూ, స్త్రీలకూ అవినాభావ సంబంధం ఉందని సంస్కృత భాష సాక్షిగా మనవాళ్ళు చెబుతూంటారు. (సంస్కృతంలో నవలా అంటే స్త్రీ) బహుశా స్త్రీలు కూడా తమ అనుభూతులు, అనుభవాలు పంచుకోడానికి అదే సరైన వాహిక అని భావించారేమో. అలాంటి నవలారచయిత్రులను సాహిత్య చరిత్రలు ఎలా గుర్తించాయి? వారు ఎలా జీవించారు? వారు ఏం రాశారు? సమకాలీన సాహిత్య సమాజం వారిని ఎలా చూసింది? వారి రచనల్లో ఇప్పుడు కూడా చదివి, తెలుసుకుని ఆనందించగల విషయాలేవైనా ఉన్నాయా? ప్రపంచ సాహిత్యంలో సుప్రసిద్ధులైన వారిలో 19వ శతాబ్దికి చెందిన జేన్ ఆస్టిన్, ఎమిలీ బ్రాంటె, జార్జ్ ఎలియట్, మొదలుకుని, 20వ శతాబ్దంలో వర్జీనియా ఉల్ఫ్, ఈడిత్ వార్టన్, టోనీ మారిసన్ వంటి కొందరైనా నవలాకారులను మనం చదివాం. కానీ వీరికంటే ముందు కూడ విశిష్టమైన రచనలు చేసి, విలక్షణమైన జీవితాలు గడిపిన నవలా రచయిత్రులు ఎందరో ఉన్నారు. ఆ రచయిత్రులను, వారి రచనలను పరిచయం చేసుకోవడమే ఈ వ్యాసపరంపర ఉద్దేశం.

నేను సాంఘిక నవల-కథన శిల్పం అన్న అంశంపై పిహెచ్.డి. చేస్తున్నప్పుడే తొలి నవల మీద ఆలోచన వచ్చింది. చాలా పుస్తకాలు తిరగేశాను. నా సిద్ధాంతవ్యాసంలో రెండో అధ్యాయంలో తొలి నవల ‘ది టేల్ ఆఫ్ గెన్జి’ అనే విషయాన్ని ప్రస్తావించాను. (ఈ సిద్ధాంతగ్రంథం 1985లో సమర్పించాను. 1987లో ప్రచురించాను). అప్పటినుంచే స్త్రీల నవలల మీద కృషి చేయాలని అనుకున్నాను గానీ… కర్ణుడి చావులా అనేక కారణాల వల్ల రాయలేదు. ఆ ఆలోచన కూడ మరుగున పడిపోయింది. 2016 లో డెట్రాయిట్‍లో నా కొడుకు, కోడలితో లైబ్రరీలు సందర్శిస్తున్నపుడు 19వ శతాబ్ది ఫ్రెంచి నవలా రచయిత్రి జార్జి సాండ్ జీవిత చరిత్ర కంటబడింది. దాన్ని ఆసాంతం రెండురోజుల్లో చదివేశాను. అప్పుడు మళ్ళీ గుర్తుకువచ్చింది. ప్రపంచ సాహిత్యంలో మహిళల నవలల గురించి అపుడెపుడో ఆలోచించానని. ఇక దానిపై కృషి చేయాలని నిర్ణయించుకున్నాను. మళ్ళీ నాలుగేళ్ళు గడిచిపోయాయి. ఈలోగా పుస్తకాల సేకరణ, పఠనం కొనసాగాయి. వాటి ఫలితమే ఈ వ్యాసపరంపర. -మృణాళిని.]


ప్రపంచ సాహిత్యంలోనే తొలి నవల రాసిన లేడీ మూరాసాకి

మంచులా గడ్డకట్టిన నా కలం సాగడం లేదు
నా మనోభావాలకు చిత్రిక పట్టడం లేదు

అంటూ తను రాయలేకపోతున్నానని దిగులు పడింది ఒకానొక రోజున మూరాసాకి షీకీబు (Murasaki Shikibu). కానీ ఇంతలోనే తేరుకుంది. ఆ కలం పరుగులు తీసింది. వెయ్యికిపైగా పుటలతో, మూడు సంపుటాల నవలను జపనీసు భాషకే కాదు, ప్రపంచసాహిత్యానికే అందించింది.

అది క్రీ.శ. 11వ శతాబ్దం. హేయ్‍ఆన్ వంశం (Heian dynasty, 794-1185 A.D.) జపాన్‍ను పరిపాలిస్తున్న రోజులు. అప్పటికి ఒక ప్రత్యేక భాషగా జపనీస్ పూర్తిగా ఆకృతి దాల్చలేదు. జపనీస్‍లో కవిత్వం ఉన్నా, వచనం ఇంకా స్థిరపడలేదు; ఆదరణ అసలే లేదు. చైనీస్ ప్రభావం ఇంకా అంటిపెట్టుకునే ఉంది. జపనీస్ ఇంకా ఎక్కువగా మౌఖిక భాషగా ఉంది. లిఖిత రూపంలోకి వచ్చిన జపనీస్‍లో చైనా అక్షరాలు, చైనా లిపి ఎక్కువగా ఉండేవి. ఆ రోజుల్లో ‘బాగా చదువుకున్నవాడు’ అంటే ప్రాచీన చైనా భాషాసాహిత్యాల్లో పండితుడు అనే అర్థం. చైనా, జపాన్‍ల మధ్య నాలుగో శతాబ్ది నుంచి ఏర్పడిన దౌత్యసంబంధాలు మొదట వ్యాపార వాణిజ్యాల కోసమే. కానీ అలా ప్రారంభమైన సంబంధం జపానుపై చైనా సాంస్కృతిక ప్రభావంగా మరలడానికి రెండు శతాబ్దుల కంటే ఎక్కువ పట్టలేదు. క్రీ.శ. 4వ శతాబ్ది అంతంలో వానీ (Wani of Baekje) అనే పండితుడు చైనా సాహిత్యాన్ని దాదాపుగా 11 సంపుటాలుగా జపాన్‍కి తీసుకువచ్చాడు. దాని ద్వారా అక్కడ ఉన్న నిరక్షరాస్యులను విద్యావంతులుగా చేసే ప్రయత్నం ప్రారంభమైంది. చైనాతో సంబంధాలు మెరుగుపరచుకోవాలంటే, వారి సాహిత్య సాంస్కృతిక విషయాలు కూడా తెలుసుకోవాలన్న కుతూహలమే చైనా సాహిత్యాన్ని మరింత చదివేలా జపనీయులను ప్రోత్సహించింది. 7వ శతాబ్ది నాటికి జపనీయులు చైనీస్ భాషపై పట్టు సాధించారు. తమ వ్యాపారాలు నిలదొక్కుకోడానికి కావలసిన చైనీస్‍నే కాదు; వారి సాహిత్యాన్ని చదవగల సామర్థ్యాన్నీ సాధించారు. అలాగే ఒక్క భాషాసాహిత్యాలే కాదు. భారతదేశం నుంచి చైనా అందిపుచ్చుకున్న మహాయానబౌద్ధం, ఆ తర్వాత వజ్రయానం కూడా చైనా నుంచే జపాన్ అందుకుంది. జపాన్ భాషలో వాడే చైనా అక్షరాలను కాన్జీ (Kanji) అని వ్యవహరించేవారు. క్రీ.శ. 11వ శతాబ్ది నాటికి జపాన్ తన సాహిత్యంలో స్వంతభాషను చాలా వరకు ఉపయోగించినా కాన్జీ నుంచి పూర్తిగా విముక్తం కాలేదు. నేటికీ జపనీస్ రాయడానికున్న మూడు పద్ధతుల్లో కాన్జీ ఒకటి. దాదాపు 12వ శతాబ్ది చివరి వరకూ జపాన్‍లో ఆధునిక భాషకు దారితీయగల ఒక సమగ్ర రూపం ఏర్పడలేదు.

ప్రపంచభాషలన్నిటిలాగే జపాన్‍లో కూడా కవిత్వానికే పెద్దపీట. లిఖిత భాషగా ఎదుగుతున్న కొద్దీ కవిత్వానికే ఆదరణ ఎక్కువ. అందువల్ల కవిత్వం ఎక్కువగా క్లాసికల్ చైనీస్‍లో రాసేవాళ్ళు. అది కూడా ఎక్కువగా పురుషులే కవులు. స్త్రీలకు చైనీస్ నేర్చుకోవడం దాదాపు నిషిద్ధం కనక, వాళ్ళు ఏ ప్రక్రియలో రాసినా జపనీస్‍ లోనే రాసేవారు. ఏ అమ్మాయయినా చైనీస్ నేర్చుకోవాలంటే దొంగచాటుగా నేర్చుకోవాల్సిందే. తనకు చైనీస్ వచ్చునని పదిమందిలో, అందులోనూ మగవాళ్ళ ఎదట చెప్పుకునే సాహసం కూడా చేయకూడదు. భారతీయ సమాజంలో సంస్కృతం పురుషులకు, ప్రాకృతం, పైశాచికం స్త్రీలకు నియమితం అయినట్లు, ఆ దేశంలో మగవాళ్ళకు చైనీస్, ఆడవాళ్ళకు జపనీస్ అన్న విభజన ఉండేది. అలాంటి జపనీస్ భాషలో 1100 పుటల ఉద్గ్రంథాన్ని, అత్యంత ఆసక్తికరమైన, మనోరంజకమైన కథను సృష్టించి, తన భాషాసాహిత్యాలకు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టింది మూరాసాకి షీకీబు.

అదంత సులభంగా జరిగివుండదు. మూరాసాకి షీకీబు భాష విషయంలో చాలా కృషి చేయాల్సి వచ్చుండాలి. ఇంత సుదీర్ఘమైన రచన, అందులోనూ అంతకుముందు లేని తరహా రచన చేయాలంటే ఆమె ఎంత శ్రమపడి వుంటుందో తెలీదు. తను అంతకు పూర్వం ఇలాంటి రచన ఏదీ చదివినట్టు కూడ ఎక్కడా ఆమె డైరీలలో లేదు. ఈ నవలలో ఆమె వ్యావహారిక జపనీస్ భాష సౌందర్యాన్ని కాపాడుతూనే ఉన్నా, అక్కడక్కడా చైనీస్ లిపి, చైనీస్ పదాల ప్రభావం తప్పలేదు. కానీ తొలిసారిగా ఒక విస్తృతమైన రచనలో జపనీస్ భాషను విజయవంతంగా ప్రయోగించిన రచయిత్రి ఈమె.

ఆమె అసలు పేరు మూరాసాకి షీకీబు కాదు. అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు. ఆమె అసలు పేరు ఫూజీవారా టకాక అయుండవచ్చని ఒక ఊహ. ది టేల్ ఆఫ్ గెన్జి నవలలో కథానాయిక పేరు మూరాసాకి. షీకీబు అన్నది తండ్రి నిర్వహించిన ఒక పదవి పేరు. అవి రెండూ కలిసి ఆమె పేరుగా స్థిరపడ్డాయి.

మూరాసాకి తండ్రి, ఫూజీవారా నో టమేటోకి (Fujiwara No Tametoki) ప్రభుత్వ కొలువులో రెండు మండలాలకు గవర్నర్‍గా ఉండేవాడు. అతను కూడా చైనాభాషాపండితుడు. 1029లో మరణించాడు. ఈ కుటుంబం సమాజంలో పరపతి ఉన్న ఉన్నత కుటుంబం. తండ్రి మూరాసాకి వివాహం ఆమె కజిన్, ఆమెకంటే చాలా యేళ్ళు పెద్దవాడు అయిన నో నోబూటాకాతో జరిపించాడు. మూరాసాకికి పెళ్ళయిన రెండేళ్ళకే, ఒక కూతురు పుట్టాక, భర్త మరణించాడు. అతను చనిపోయిన తర్వాత, బహుశా ఒంటరితనాన్ని మరచిపోవడానికి ఆమె సాహిత్యసృజనను ఆధారం చేసుకుందని విమర్శకులంటారు. కానీ నవలకు ముందే ఆమె కవిత్వరచన ప్రారంభించింది. నవలను సైతం భర్త జీవించివుండగానే మొదలు పెట్టిందని కూడా తెలుస్తోంది.

భర్త మరణించిన (1001) కొన్నేళ్ళకి, అంటే దాదాపు 1006 ప్రాంతంలో, మూరాసాకి అప్పటి యువరాణి షోషి అంతఃపురంలోకి సహాయకురాలిగా ప్రవేశించింది. రచయిత్రిగా అప్పటికే కొంత పేరుంది తనకు. అందుకే ఆమెకు అంతఃపురంలో ప్రవేశం దక్కిందని అంటారు. అయితే అక్కడే జీవితాంతం ఉండిపోయిందా అన్న విషయంలో స్పష్టత లేదు. మరణించిన తేదీకూడ స్పష్టంగా తెలీడం లేదు. కానీ క్రీ.శ. 973 నుంచి దాదాపు 1013 వరకూ ఆమె గురించిన సమాచారం లభిస్తున్నందువల్ల ఆ సంవత్సరానికి దరిదాపుల్లో మూరాసాకి మరణించివుండొచ్చు. మరికొందరి అభిప్రాయంలో ఆమె 1031 దాకా జీవించింది.

మూరాసాకి రచనారంగంలోకి దిగిన కాలం ఒకరకంగా జపాన్ సాంస్కృతిక పునరుజ్జీవనం పొందుతున్న కాలం. అప్పటివరకూ చైనా ప్రభావంలో పడి కొట్టుకుపోయిన జపాన్ స్వీయసంస్కృతిని అందిపుచ్చుకుంటున్న కాలం. అప్పటికింకా చైనీసే జపాన్ అధికార భాషగా ఉన్నప్పటికీ, కానా అన్న జపనీస్ లిపి అప్పుడప్పుడే ఏర్పడుతోంది. అప్పటిదాకా జపనీస్ భాష మౌఖికమే. లిఖిత సాహిత్యానికి చైనీస్ లిపినే వాడేవారు. అలాంటి అపుడపుడే రూపం ఏర్పరచుకుంటున్న కానా లిపిలో మూరాసాకి తన మూడు రచనలు చేసింది. అంటే అప్పటికింకా పురుషులు చైనీస్‍లోనే రాస్తున్నారు.

మూరాసాకి ప్రతిభ పుట్టగానే పరిమళించిన పువ్వులాంటిది. తన అన్నయ్య ప్రాచీన చైనీస్ భాష నేర్చుకుంటుంటే, దొంగచాటుగా విని, అతనికి అర్థం కానివన్నీ అర్థం చేసుకుంది. చైనీస్ భాషలో కూతురి ప్రావీణ్యం చూసి, ఆమె మగపిల్లాడిగా పుడితే ఎంత బాగుండేదని తండ్రి నిట్టూర్చేవాడు. కూతురికి చైనీస్‍లో పాండిత్యం ఉన్నా పైకి చెప్పుకోలేని అశక్తత ఆయనది. అన్నగారితో పాటు చైనీస్ క్లాసిక్స్ చదువుకున్న మూరాసాకిని చుట్టుపక్కలవారంతా అనుమానంగా చూసేవారు. అందరు ఆడపిల్లల్లా అణకువగా ఉండదనీ, పొగరుబోతనీ, ఎదిరించి మాట్లాడుతుందనీ మూరాసాకిని తిట్టుకున్నవాళ్ళు కూడా లేకపోలేదు. అప్పటికే కవిత్వం మొదలుపెట్టిన మూరాసాకి తన కవిత్వాన్ని స్త్రీలతో మాత్రమే పంచుకోగలిగేది. అప్పట్లో పురుషులతో స్నేహం స్త్రీలకు నిషిద్ధం కనక ఆమె కవిత్వాన్ని తొలుత బంధువుల్లోని ఆడపిల్లలు మాత్రమే చదివేవారు. అనంతర కాలంలో యూరప్ లోని అన్ని భాషల్లోకీ ఎక్కువగా పురుషులే ఆమె నవలను, ఆమె కవిత్వాన్ని అనువదిస్తారని ఎవ్వరూ ఊహించి వుండరు.

మూరాసాకి ఒక్క చేతి మీదుగా 54 అధ్యాయాల ఈ నవలను రాసిందా? అన్న సందేహం కూడా వస్తుంది. ఆమెతో ఎవరైనా కలిసి రాశారనడానికి ఏ దాఖలాలూ లేవు. అప్పటికి కాగితం ఉంది, సిరా ఉంది. కానీ ముద్రణ లేదు. ముద్రణా యంత్రం కనిపెట్టబడింది పదిహేనవ శతాబ్దిలో. కనుక మూరాసాకి పేజీలకు పేజీలు రాస్తే, వాటికి ప్రతులను తయారుచేసి చదివేవారు. లేదా ఒకరు చదువుతూంటే తక్కినవాళ్ళు వినేవారు. 1021లో మొదటి సారి ఈ నవల వెలుగు చూసింది. అప్పటికి మూరాసాకి జీవించివుందో లేదో తెలీదు కానీ, దూరప్రాంతంలో ఉంటున్న ఆమె మేనకోడలికి తొలిసారిగా ఒక సంపూర్ణ ప్రతి అందింది. ‘యాభై అధ్యాయాలు మహదానందంతో చదివా’నని ఆమె ప్రకటించుకుంది. కానీ ఆ తర్వాత దాన్ని భద్రపరిచిందీ లేనిదీ తెలీదు. క్రీ.శ. 13వ శతాబ్దిలో ఒక జపాను పండితుడు అన్నిచోట్లా వెదికి, ఎన్ని ప్రతులు ఈ నవలవి ఎక్కడెక్కడ ఉన్నాయో దొరకపుచ్చుకుని, అన్నిటినీ చదివి, ఒక ప్రామాణిక గ్రంథాన్ని తయారుచేశాడు. అందులోని భాష అర్థం కాదేమోనని, తర్వాత కాలంలో జపనీయులు దీన్ని ఆధునిక జపనీస్‍ లోకి రాసుకున్నారు. 1882 నుంచి 2006 వరకూ ఈ నవలకు ఆంగ్లానువాదాలు విరివిగా వచ్చాయి. అందులో పాక్షిక అనువాదాలు, సమగ్ర అనువాదాలూ ఉన్నాయి. ఆరు సంపుటాలుగా ఆర్థర్ వేలీ (Arthur Waley) 1921 ప్రాంతంలో అనువదించిన ది టేల్ ఆఫ్ గెంజిని వర్జీనియా ఉల్ఫ్ కూడా తన వ్యాసాల్లో ప్రస్తావించింది. వీటన్నిటి మధ్యా ఈ నవల గురించిన ప్రధానమైన చర్చ ఒకటుంది; ఇది ప్రపంచ సాహిత్యంలో తొలినవలా కాదా అన్నది.

తొలి నవలే

ది టేల్ ఆఫ్ గెన్జి విశ్వసాహిత్యంలో తొలి నవల అవుతుందా కాదా అన్నది చాలాకాలంగా విశ్వసాహిత్యంలో, మరీ ముఖ్యంగా ఆంగ్ల సాహిత్య విమర్శలో నడుస్తున్న చర్చ. సాహిత్య చరిత్రలో తొలి నవల రాసిన ఘనత ఒక ఆసియా దేశానికి, అందులోనూ ఒక మహిళకు దక్కడం మహాపచారమని ఆంగ్ల సాహిత్య చరిత్రకారులు అనుకోవడం సహజం. కనుకనే చాలా నవలా చరిత్రల్లో 1605లో సెర్వాంటెస్ (Miguel de Cervantes) స్పానిష్ భాషలో రాసిన డాన్ కిహోటే (Don Quixote) తొలి నవల అన్న నిర్ణయం కనిపిస్తుంది. యాత్రాచరిత్రలు, రేఖాచిత్రాలు, డైరీలు వంటి రచనలన్నీ కలిసి నవలగా రూపుదిద్దుకున్నాయని ఎక్కువమంది అభిప్రాయం. కానీ వాటి ప్రభావమేమీ లేకుండా మూరాసాకి నేరుగా ఒక నవలనే రాసేయడం చాలామంది సాహిత్య చరిత్రకారులకు కొరుకుడు పడని విషయం.

కొన్ని వాదనల ప్రకారం తొలి నవల క్రీ.శ. 2వ శతాబ్దిలో రోమన్ భాషలో అప్యూలియస్ (Apuleius) రచించిన ది గోల్డెన్ ఆస్ (The Golden Ass). మనిషి గాడిదగా మారడం, పక్షిగా మారడం, మంత్రగత్తెలు, పాతాళలోకాలు, మన్మథుడు మొదలైన దేవతలు మనుషులుగా రావడం, మనుషులు జంతువులుగానే కాదు; ఊళ్ళుగా కూడ మారిపోవడం–ఇత్యాది కథనాలున్న ఈ రచనను ఆధునిక నవలగా పరిగణించడం కష్టం. దీన్ని నవలగా పరిగణిస్తే, కాశీ మజిలీ కథలు, సింహాసన ద్వాత్రింశిక కథలు, ఇంకా చెప్తే అష్టాదశపురాణాలూ నవలలే అవుతాయి. కనుక, నవలంటే కేవలం కథను చెప్పేది–Any fictitious prose work over 50,000 words— అన్న ఫోర్‍స్టర్ (E. M. Forster) నిర్వచనం కాస్సేపు మరచిపోయి, నవల అంటే మనుషుల కథలను చెప్పేది, సమాజంలోని వేర్వేరు వ్యవస్థల్లో మానవజీవిత సంఘర్షణను వ్యాఖ్యానించేది, వాస్తవికత పునాదిగా కలిగిన కాల్పనిక రచన అనే అవగాహనతో నిర్వచిస్తే గోల్డెన్ ఆస్ ఎంత అందంగా ఉన్నా ఆ దరిదాపులకు రాదు.

గ్రీక్ లోనూ, చైనీస్‍ లోనూ క్రీస్తుపూర్వమే నవలలు వచ్చాయని చెప్పుకోవడమే కానీ అందులో ఏదీ దొరకలేదు. ఎవరూ చదవలేదు. చైనాలో తొలి నవలగా పేరుపొందిన రొమాన్స్ ఆఫ్ ది త్రీ కింగ్‍డమ్స్ కూడా 14వ శతాబ్దిలో వచ్చింది. ఇక ఆంగ్లంలో నవలా స్వరూపానికి సన్నిహితంగా ఉన్న ఏ రచనైనా 11వ శతాబ్ది తర్వాత వచ్చినవే. అయినా నవలపై విస్తృతంగా సిద్ధాంత రచన చేసిన ఆంగ్ల విమర్శకులు 1719లో డేనియల్ డిఫో (Daniel Defoe) రాసిన రాబిన్‍సన్ క్రుసోను (Robinson Crusoe) తొలి నవలగా చెప్పడం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద చాలా కాలం డాన్ కిహోటే నవలనే ప్రపంచంలో మొదటిదిగా ఎక్కువమంది ఆమోదించారు.

సంస్కృతంలో క్రీ.శ. 7-8 శతాబ్దుల్లో వచ్చిన బాణుడి కాదంబరిని తొలి నవలగా పరిగణించవచ్చునా అనే చర్చ కూడా ఉంది. అయితే దీనికి కొన్ని చిక్కులున్నాయి. గోల్డెన్ ఆస్ లాగానే ఇందులో కూడా మానవాతీత విషయాలు, వ్యక్తులు, వర్ణనలు ఉండడంతో పాటు, ఇది మౌలిక రచన కాదని, బృహత్కథలోని కథను ఆధారం చేసుకున్న వచన రచన అనీ పండితులే అంటారు. కనుక ఆధునిక నవలా ప్రక్రియ అనే అవగాహనతో చర్చిస్తున్నపుడు కాదంబరి వచన కావ్యం కాగలదే కానీ, నవలగా చెప్పడం అత్యాశే అవుతుంది. దాన్ని నవలగా నిరూపించగలిగితే, భారతదేశానికే ఆ ఖ్యాతి దక్కుతుంది కానీ, ఎంత దేశభక్తి ఉన్నా, అది కుదిరే పని కాదు.

ప్రపంచ సాహిత్య చరిత్రలోని జాబితాలను బట్టి చూస్తే గ్రీక్, రోమన్, చైనీస్ భాషల్లోని వచన రచనలు కొన్ని కనిపిస్తాయి. (ఉదా. లూసియన్, ఎఖిలిస్ టాటియస్ మొదలైనవారు) వీటిలోని అతిమానుష శక్తులు, అసంభావ్య సంఘటనలు, వస్త్వైక్యతాలోపం మొదలైన వాటిని బట్టి, శైలి, కథనం ఎంత గొప్పగా ఉన్నా వీటిని నవలలను పోలిన వచన రచనలుగా చెప్పవచ్చేమో కానీ, ఆధునికార్థంలో ‘నవలలు’గా అంగీకరించడం కష్టం.

ఎన్నో చర్చలు, వివాదాల అనంతరం ఈనాడు అందరూ ఆమోదిస్తున్నది మాత్రం ది టేల్ ఆఫ్ గెన్జి నవలనే. అది రాస్తున్నపుడు తను ఏ ప్రక్రియ రాస్తున్నానన్న అవగాహన మూరాసాకికి ఏ మాత్రం లేకపోయినా, కథను ఎలా చెప్పాలో ఆమెకు తెలుసు. సంక్లిష్టమైన ఇతివృత్తం, వాస్తవిక సంభాషణలు, మనసు లోపల్లోపలి అనుభూతులను సైతం ఆవిష్కరించిన పాత్ర చిత్రణ, సమకాలీన జీవితాన్ని సమాజాన్ని ప్రతిబింబించే శైలి, భాష ఉన్న ఈ నవల కచ్చితంగా విశ్వసాహిత్యంలో తొలి నవలే అవుతుంది. దీన్ని తొలి నవలగా అంగీకరించలేకపోయిన కొందరు విమర్శకులు సైతం ‘పోనీ, తొలి సైకలాజికల్ నవల’ అనవచ్చు అన్నారు. అక్కడికి మరో రకమైన నవలేదో ప్రచారంలో ఉన్నట్టు.

మూరాసాకి ఈ నవలను ఎలా ఎక్కడ కూర్చుని రాసి వుంటుంది? అన్న ఊహాగానాలతో ఆమె రచనని తమ జీవితాల్లోకి ఆహ్వానించి, తమ భాషలోనే తొలి నవల వచ్చిందని సగర్వంగా చెప్పుకుంటారు జపనీయులు. లేడీ మూరాసాకి, శ్రావణమాసంలో విశ్రాంతి కోసం బీవా సరస్సు ఒడ్డున ఉన్న భవనంలో ఉన్నప్పుడు, పూర్ణచంద్రుడిని చూస్తూ తన నవలకు శ్రీకారం చుట్టిందని జపనీయులలో ఒక అద్భుత కాల్పనిక చిత్రం స్థిరపడింది. ఆ దృశ్యాన్ని జపనీస్ చిత్రకారులు కుంచెకు ఎక్కించారు కూడా. ప్రజాబాహుళ్యంలో, ప్రజాసంస్కృతిలో మూరాసాకికి చాలా గౌరవం ఉంది. ఆమె ఊహాచిత్రాలు, గెన్జి గాథలోని ఊహాదృశ్యాలు, ఆమె ఎటువంటి కాగితం మీద, ఎటువంటి సిరాతో, ఎక్కడ కూర్చుని రాసివుంటుందన్న ఊహాచిత్రాలు అనేకం. అలాంటి ఊహలకు ఆస్కారం కల్పించిన గెన్జి గాథలో ఉన్న కథేమిటో వచ్చే సంచికలో.

ఎప్పుడో నువ్వు మరచిన ఆకులు రాలే కాలపు విషాదంలాంటి నన్ను తలచుకో
ఇప్పుడు పున్నమి వెన్నెల యేరులో నీ మనసు ఎంతగా సేదదీరుతున్నా…

అని ఒక ప్రణయకవితలో మూరాసాకి అంటుంది. ఎంతమంది గొప్ప కవులూ, నవలారచయితలూ తర్వాత వచ్చినా, ఆమెనూ ఆమె నవలనూ ఆమె రాసిన వాకాలను (Waka) సాహిత్యలోకం ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటుంది.


సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...