కోపానికి చీల్చుకొచ్చిన
లోపలి మనిషి నోరు
బయట పుట్టపలిగి
వంద నాలుకల
వేయి మాటల ఉప్పెన
నాలుగు కళ్ళగుండా
వేలమైళ్ళ మేటవేసి
తలలో పాతపగను తాకి
మొగ్గలేసిన సమస్య
పచ్చని గాయమై ఎర్రగా నవ్వింది.
ఆ నల్లని రోజు నిండా
నిమిషానికో గాయానికి
స్రవించే అరుపులు
చెవుల్లో పొంగి పొర్లి
పక్కనున్న రోజుపై చింది
పగలు చీకటి దుప్పటితో
రాత్రి పగటి వేషంలో
మనసే శత్రువుగా
మనిషి యుద్ధమయ్యాడు.