విశ్వమహిళా నవల: 8. మేరీ ఉల్‍స్టన్‍క్రాఫ్ట్

భార్యను ‘ఉన్మాది’గా మానసిక చికిత్సాలయంలో వదిలేసిన భర్త అనగానే, గాబ్రియేల్ గార్సియా మార్కేజ్ రాసిన ‘ఐ ఓన్లీ వాంటెడ్ టు యూజ్ ది ఫోన్’ కథ గుర్తుకు వస్తుంది. ఇది 1980 నాటి కథ. కానీ అంతకు 200 ఏళ్ళకు పూర్వమే తనకు ‘విధేయంగా’ ఉండని భార్యని వదిలించుకుని, ఆమె ఆస్తిని చేజిక్కించుకోడానికి, తనే స్వయంగా మానసిక చికిత్సాలయంలో వదిలిపెట్టిన పురుషపుంగవుణ్ణి సృష్టించిన రచయిత్రి మేరీ ఉల్‌స్టన్‌క్రాఫ్ట్ (Mary Wollstonecraft).

ది విండికేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ఉమెన్ గ్రంథరచనకు తొలి ఫెమినిస్టు సిద్దాంతకర్తగా గుర్తింపు పొందిన మేరీ, నవలలు కూడ రచించిన విషయం ఎక్కువగా ప్రచారం పొందలేదు. మొదటి నవల మేరీ – ది ఫిక్షన్ (1788) కంటే, రెండో నవల మరియా (లేక) ది రాంగ్స్ ఆఫ్ ఉమెన్ (1798) అన్న అసంపూర్ణ రచన అనంతరకాలంలో విమర్శకుల దృష్టిని ఆకర్షించింది. ఈ నవల ది విండికేషన్‌కు సృజనాత్మక కొనసాగింపులా ఉంటుంది.

స్త్రీలు ఎప్పుడూ పరిపూర్ణులై ఉండాలని, పాపం మగవాళ్ళే మానవమాత్రులు కనక తప్పులు చేస్తే చెయ్యవచ్చుననీ ఎప్పుడో చెప్పిన మేరీ ఈ నవలను దానికి దృష్టాంతంగా మలిచింది: The hero is allowed to be mortal, and to become wise and virtuous as well as happy, by a train of events and circumstances. The heroines, on the contrary, are to be born immaculate, and to act like goddesses of wisdom, just come forth highly finished Minervas from the head of Jove.

కానీ అలా ఉండలేని స్త్రీల మాటేమిటి? వాళ్ళకు జీవించే హక్కుండదు. ఒకవేళ జీవించినా, ఆనందంతో, గౌరవంతో జీవించే హక్కుండదు. గంగిరెద్దులా ఉండలేని మరియా జీవితవిషాదాన్ని చిత్రించిన ఈ నవల వెలువడిన రోజుల్లో చెప్పుకోదగ్గ ఆదరణ పొందలేదు. ఆ నవల విలువ ప్రపంచానికి తెలియడానికి మరో శతాబ్దం గడవాల్సి వచ్చింది.

మేరీ ఉల్‌స్టన్‌క్రాఫ్ట్ నవలల కంటే ముందు రాసిన నాలుగు గ్రంథాలూ చాలా విలువైనవి (Thoughts on the Education of Daughters, Vindication of the rights of Men, Vindication of the Rights of Women, An Historical and Moral View of the French Revolution). ఈ నాలుగు రచనలూ స్త్రీల విద్యకు పెద్ద పీట వెయ్యడంతో పాటు, సామాజిక, రాజకీయ వ్యవస్థల్లో ఆధిపత్యాన్ని ప్రశ్నించేవే. వ్యక్తి స్వాతంత్ర్యాన్నీ, సమానత్వాన్నీ సమర్థించేవే. ఒక్క ఫ్రెంచి విప్లవం నేపథ్యంగా ఆమె రాసిన మూడు రచనలూ పెద్ద ప్రకంపనలకు దారితీశాయి.

బ్రిటన్, ఫ్రాన్స్‌ల మధ్య అంతగా సుహృద్భావం లేని ఆ రోజుల్లో ఆమె లండన్ వదిలి పారిస్ వచ్చి, ఫ్రెంచి విప్లవపరిణామాలకు ప్రత్యక్ష సాక్షిగా ఉంటూ, దానిపై తన స్పందనను అక్షరీకరించింది. ఈ క్రమంలో ఆమె రాజ్యవ్యవస్థను, పితృస్వామ్య వ్యవస్థను, అన్ని రంగాల్లోనూ ఆధిపత్యక్రమాన్నీ వ్యతిరేకించింది. అందుకే ఆమెను అప్పటి జోసెఫ్ ప్రీస్ట్‌లీ (Joseph Priestly), విలియమ్ గాడ్విన్‌ (William Godwin) వంటి రాజనీతిజ్ఞుల సరసన ప్రస్తావించారు విద్యావంతులు. అందులోనూ మహామేధావిగా పేరున్న ఎడ్మండ్ బర్క్‌‌ని (Edmund Burke) ఫ్రెంచి విప్లవం విషయంలో ఢీకొన్న మహిళగా ఆమె ఖ్యాతి గడించింది. 1790లో ఎడ్మండ్ బర్క్ రిఫ్లెక్షన్స్ ఆన్ ది రివల్యూషన్ ఇన్ ఫ్రాన్స్ అన్న రచనలో ఫ్రెంచి తిరుగుబాటుదార్ల ‘తప్పిదాన్ని’ విమర్శించాడు. విప్లవానికి కారణం రాచరిక వ్యవస్థలోని లోపాలు కాదని, వ్యక్తుల స్వార్థం, సుఖలాలస అనీ తిరుగుబాటుదార్లని నిందించాడు. దీనికి ప్రతిస్పందనగా అదే సంవత్సరం మేరీ విండికేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ మెన్ రాసింది. తొలి ముద్రణలో తన పేరు ప్రకటించలేదు. కానీ దానికి వచ్చిన ప్రశంసల వల్ల ధైర్యం వచ్చి కాబోలు రెండో ముద్రణలో ఆమె తన పేరుతోనే ప్రకటించింది. తన విమర్శలో బర్క్ ఉద్వేగంతో, సెంటిమెంట్‌తో మాట్లాడుతున్నాడు గాని, ఆయన వాదనలో తార్కికత, సంయమనం లేదంటూ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల గురించి, రాచరిక వ్యవస్థ గురించి అతని అభిప్రాయాలను ఘాటైన భాషలో తిప్పికొట్టింది. ఆమె వాదనలో మనకు ఆసక్తికరంగా ఉండే గమనించవలసిన అంశం: ‘అనాదిగా వస్తున్నందున రాచరిక వ్యవస్థ గొప్పదని బర్క్ సమర్ధించడం ఎలా ఉందంటే, భారతదేశంలో అనాదిగా వస్తున్న బ్రాహ్మణీయ వ్యవస్థను ఎప్పటికీ తిరస్కరించకూడదనడంలా ఉంది!’ (మేరీ ఉల్‌స్టన్‌క్రాఫ్ట్ మూడు రాజకీయ రచనలు; ఆక్స్‌‌ఫర్డ్ ప్రచురణ, పేజీ 52) ఆమెకు భారతదేశ సంస్కృతితో కూడ కొద్దో గొప్పో పరిచయం ఉందని దీన్నిబట్టి అర్థమవుతుంది.

ఇది రాసే క్రమంలోనే ఆమె అతని వాదనలో పితృస్వామ్య భావజాలం ఉన్నట్టు గ్రహించింది. దాని ఫలితమే 1792లో రాసిన ఆమె అతి ప్రసిద్ధ రచన విండికేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ఉమెన్. ఈ రచనకు ముందుమాటలో ఆమె ప్రస్తావించిన విషయాలు ఆమె తన కాలం కంటే ఎంత ముందుందో తేటతెల్లం చేస్తాయి.

I attribute [these problems] to a false system of education, gathered from the books written on this subject by men, who, considering females rather as women than human creatures, have been more anxious to make them alluring mistresses than affectionate wives and rational mothers… the civilized women of this present century, with a few exceptions, are only anxious to inspire love, when they ought to cherish a nobler ambition, and by their abilities and virtues, exact respect.

స్త్రీల విద్య పురుషుల విద్యతో సరిసమానంగా ఉండడం కోసం జాతీయ స్థాయిలో కో-ఎడ్యుకేషన్ పాఠశాలలు తెరవాలని, ఆడవాళ్ళకు అన్ని రంగాల్లోనూ ఉద్యోగాలు చేసే స్వేచ్ఛ ఇవ్వాలనీ ఆమె ఈ గ్రంథంలో వాదించింది. స్త్రీలు తమని తాము సంతానోత్పత్తి సాధనాలుగానో, సౌందర్యదేవతలుగానో, అబలలుగానో భావించకూడదని, తాము కూడా మనుషులమేనని గుర్తించాలనీ వాళ్ళకు కూడ హితవు పలికింది. మొదటిసారిగా స్త్రీలకు అన్ని రంగాల్లో పురుషులతో సమానమైన ప్రతిపత్తి కోసం సుదీర్ఘమైన వాదనలు వినిపించిన గ్రంథం కాబట్టే ఇది ఫెమినిస్టులకు అనంతరకాలంలో పాఠ్యగ్రంథమైంది. స్త్రీల విద్యాహక్కును సార్వజనీన మానవహక్కుల్లో చేర్చాలన్న ఆమె ప్రతిపాదన, స్త్రీలు కుటుంబవ్యవస్థలో బానిసలుగా ఉన్నారన్న వ్యాఖ్య అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. కానీ ఆమె రాసిన రోజుల్లో కొందరు మినహా ఎక్కువమంది ఈ గ్రంథాన్ని దుయ్యబట్టారు. ప్రముఖ బ్రిటిష్ రచయిత హొరేస్ వాల్‌పోల్ (Horace Walpole) మేరీని ‘హైయీనా ఇన్ ఎ పెటీకోట్’ అని వర్ణించేంతగా దిగజారాడు.

తన సిద్ధాంత గ్రంథాల ద్వారా తన భావజాలాన్ని, ఆలోచనా విధానాన్ని ప్రస్ఫుటం చేసిన మేరీ, ఆ దృక్పథాలను విస్తరింపజేయడానికి అనంతరం ఒక నవల రాయడానికి నిర్ణయించుకుంది. కానీ అంతకుముందే 1788లో, ఒక ఇంట్లో గవర్నెస్‌గా పనిచేస్తున్న రోజుల్లోనే తొలినవల మేరీ – ది ఫిక్షన్ రాసింది ఉల్‌స్టన్‌క్రాఫ్ట్. ఇది చాలావరకూ ఆత్మకథాత్మకం. తల్లిదండ్రులు కొడుకును కూతురికంటే ప్రేమగా చూడడం, ఆడపిల్లకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్ళి చెయ్యాలని ఉబలాటపడ్డం, కథానాయిక కాల్పనిక ప్రేమలో మునిగిపోవడం, కుటుంబం కంటే స్నేహితురాలే ఎక్కువగా భావించడం, ఆ స్నేహితురాలు అర్ధంతరంగా మరణించడం – ఇవన్నీ ఆమె జీవితంలోని ఘట్టాలే. అయితే ఈ నవలలో కథానాయిక మేరీని ఒక జీనియస్‌గా చిత్రించే ప్రయత్నం చేసింది ఉల్‌స్టన్‌క్రాఫ్ట్. కానీ ఆమెకే ఈ నవల పెద్దగా నచ్చలేదు. ‘ఏదో ఉబుసుపోకకు రాశాను’ అని తనే కొట్టిపారేసింది. అయితే అనంతరం స్త్రీవాదులు ఈ నవలను కూడ స్త్రీల స్వతంత్ర ఆలోచనకు ఒక మంచి నిదర్శనంగా వ్యాఖ్యానించారు.

ఆమె రెండో నవల మరియా (ఆర్) ది రాంగ్స్ ఆఫ్ ఉమన్ అసంపూర్ణ నవల. కానీ ఉల్‌స్టన్‌క్రాఫ్ట్ విండికేషన్‌లో చెప్పిన వాటన్నిటికీ ఉదాహరణంగా అనిపించే నవల. విండికేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ఉమెన్ అయిదారు వారాల్లో పూర్తిచేసిన మేరీ ది రాంగ్స్ ఆఫ్ ఉమన్‌ని పూర్తిచేయడానికి ఏడాదికి పైగా కష్టపడింది. చివరికి అసంపూర్ణంగానే వదిలేసి, ప్రసవానంతరం ఆరోగ్యం క్షీణించి మరణించింది.

మేరీ ఉల్‌స్టన్‌క్రాఫ్ట్ జీవితం

1759 ఏప్రిల్ 27న లండన్‌లో ఒక రైతుకుటుంబంలో జన్మించింది మేరీ. ఉన్నతమధ్యతరగతికి చెందిన కుటుంబమే అయినా, తండ్రిగారి తప్పుడు నిర్ణయాలు, వ్యాపారవైఫల్యాల వల్ల డబ్బంతా తుడిచిపెట్టుకుపోయింది. బతకడమే కష్టమైంది. దానికితోడు తాగుబోతు తండ్రి తల్లిని నిత్యం హింసించేవాడు. మేరీ రోజూ రాత్రి తన తల్లిని రక్షించడానికి వారి గది బయటే నేలమీద పడుకునేది. తల్లినే కాదు; చెల్లెళ్ళను కూడ రక్షించడం తన కర్తవ్యమనుకునేది. చెల్లెలి వివాహం విఫలమైనపుడు, భర్తనుంచి పారిపోడానికి నైతికంగా, ఆర్థికంగా మద్దతు ఇచ్చింది కూడా. తన కాలానికి ఎంతో విప్లవాత్మకంగా ఆలోచించిన మేరీ వ్యక్తిగత జీవితం కూడ దుర్భరమే. కానీ పుస్తకపఠనంతో, చదువుకున్నవారి సాహచర్యంతో తన జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకుంది. జేన్ ఆర్డెన్ (Jane Arden Gardiner), ఫ్రాన్సిస్ బ్లడ్ (Francis Blood) అనే ఇద్దరు స్త్రీల సాహచర్యంతో సమాజం గురించి, తాత్వికవిషయాల గురించి, స్త్రీల ప్రతిపత్తి గురించి ఆలోచించడం నేర్చుకుంది మేరీ. 1782 లోనే ఇంటి వాతావరణం భరించలేక ఇల్లు వదిలి రకరకాల ఉద్యోగాలు చేస్తూ వెళ్ళిపోయిన మేరీ 1785లో స్నేహితురాలు ఫ్రాన్సిస్ మరణంతో తీవ్ర ఆవేదనకు గురైంది. స్త్రీలు చేయగలిగిన ఉద్యోగాలు అతి తక్కువగా ఉండడం ఆమెను ఎక్కువ బాధించేది. గవర్నెస్, టీచర్ – రెండే ఉద్యోగాలు ఆడవాళ్ళకు. ఆ రెండూ తను చేసింది కూడ. ఆడపిల్లలకు ఒక పాఠశాలను కూడ కొంతకాలం నడిపింది. గురువుగా మంచి పేరు కూడా తెచ్చుకుంది. కానీ ఆడవాళ్ళు ఇంక దేనికీ పనికిరారా అని ప్రశ్నించుకుని సమాధానంగా తను ‘రచననే వృత్తిగా ఎందుకు స్వీకరించకూడదు, మగవాళ్ళలా’ అనుకుంది.

ఫ్రెంచి, జర్మన్ భాషలు నేర్చుకుని వాటిలోని తత్వగ్రంథాలను అనువదించడంతో తన రచనావృత్తిని ఆరంభించింది మేరీ. జోసెఫ్ జాన్సన్ అనే ఉదారబుద్ధిగల ప్రచురణకర్త ఈమె సమీక్షలను, అనువాదాలను ముద్రించేవాడు. అతని పుణ్యమాని ఆమె అమెరికా, యూరప్‌లలో రాజకీయ విప్లవాలను సమర్థించిన రాజనీతిజ్ఞుడు థామస్ పేన్ (Thomas Paine), బ్రిటిష్ జర్నలిస్టు, రాజనీతిజ్ఞుడు, నవలా రచయిత విలియమ్ గాడ్విన్ వంటి ప్రముఖుల స్నేహం సంపాదించింది. ఇంతకుముందే చెప్పినట్టు ఫ్రెంచి విప్లవాన్ని, థర్డ్ ఎస్టేట్ పాలనని తూర్పారబుడతూ ఐరిష్ రాజనీతిజ్ఞుడు, సుప్రసిద్ధ రచయిత ఎడ్మండ్ బర్క్ రాసిన గ్రంథానికి సమాధానంగా 1790లో మేరీ రాసిన ది విండికేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ మెన్ రాత్రికి రాత్రి ప్రజలు ఆమెను మేధావిగా గుర్తించేలా చేసింది.

ఆ తర్వాత 1792లో ఆమె రాసిన ది విండికేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ఉమన్ ఆమెను తొలి బ్రిటిష్ ఫెమినిస్టు సిద్ధాంతకర్తను చేసి, చరిత్రపుటల్లోకి ఎక్కించింది.

వ్యక్తిగతజీవితంలోని ఆటుపోట్లు తట్టుకోలేక, ఇంగ్లండ్ వదిలి ఫ్రాన్స్‌కు వెళ్ళిన మేరీ ఫ్రెంచి విప్లవానికి అనుకూలంగా మాట్లాడినప్పటికీ, అక్కడ ప్రశాంతంగా ఉండలేకపోయింది. అదీకాక, స్వేచ్ఛ గురించి, హక్కుల గురించి మాట్లాడే ఆ జేకొబిన్ విప్లవకారులు కూడ స్త్రీల స్వేచ్ఛ దగ్గరికి వచ్చేసరికి అసలు సిసలు పితృస్వామ్యవాదులైపోవడం ఆమెను కలవరపెట్టింది. ఆగ్రహపరిచింది. అప్పటికే అమెరికన్ వ్యాపారవేత్త గిల్బర్ట్ ఇమ్‌లే (Gilbert Imlay) ప్రేమలో పడ్డ ఆమె, అతన్ని వివాహం చేసుకోనప్పటికీ తన ‘భర్త’గా ప్రకటించుకుంది. ఆమెను రక్షించడానికి నిజానికి ఇమ్‌లేనే ఆ సలహా ఇచ్చాడు. అలా అమెరికన్ పౌరురాలైనట్టు నటించింది. వీరికి ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత, ఇమ్‌లే ‘మళ్ళీ వస్తానని’ చెప్పి అమెరికాకు వెళ్ళిపోయాడు. పారిస్‌లో ఉన్న కొద్దిమంది మిత్రులూ జైల్లో మగ్గడమో, గియొటీన్‌కు గురికావడమో జరిగాయి. పసిబిడ్డతో ఒక్కతే ఉండిపోయింది. వస్తానన్న ఇమ్‌లే పత్తాలేడు. ఇంత వత్తిడిలోనూ తన రచనలు ఆపలేదు. తను ప్రత్యక్షంగా చూసిన ఫ్రెంచి విప్లవాన్ని అక్షరబద్ధం చెయ్యాలన్న తాపత్రయంతో ఆన్ ఇస్టారికల్ అండ్ మోరల్ వ్యూ ఆఫ్ ది ప్రెంచ్ రివల్యూషన్‌ను 1794లో ప్రచురించింది.

చరిత్రాత్మకమైన ఫ్రెంచి విప్లవాన్ని చూడడం తన అదృష్టంగా భావించింది మేరీ. ఫ్రెంచి విప్లవాన్ని సమర్ధించిన స్త్రీలను మెచ్చుకోవడం సులభమే. కానీ విప్లవానికి లక్ష్యమైన రాణి మరీ ఆంట్వానెట్‌ను కూడ దయతో చూడగలగడం మేరీలోని ప్రత్యేకత. ‘స్త్రీలు స్త్రీలుగా చేయబడతార’ని 20వ శతాబ్దిలో సిమోన్ డిబోవా స్పష్టంగా చెప్పివుండొచ్చు కానీ మేరీ అంతకుముందే ఆ అవగాహనను వ్యక్తం చేసింది. మరీ ఆంట్వానెట్‌కు విప్లవకారులు మరణశిక్ష అమలుజరిపే సమయంలో అక్కడే ఉన్న ఉల్‌స్టన్‌క్రాఫ్ట్ రాచరిక వ్యవస్థలో, స్త్రీ అంటే పిల్లల్ని కనే యంత్రమనే అర్థం మాత్రమే మిగిలిన సందర్భంలో రాణి క్రూరంగా మారడంలో వింతేముందని ప్రశ్నించింది. (Aristocratic values, by emphasizing a woman’s body and her ability to be charming over her mind and character, had encouraged women like Marie Antoinette to be manipulative and ruthless, making the queen into a corrupted and corrupting product of the ancient régime.) భర్త, కొడుకుల ద్వారా మాత్రమే ఉనికి వున్న స్త్రీ ఆ రెండు ‘హోదాలనూ’ నిలబెట్టుకోడానికి ఎంతకైనా తెగించాల్సిరావడం విషాదమే కానీ దుర్మార్గం కాదని మేరీ వాదన.

చివరికి 1795లో తిరిగి ఫ్రాన్స్ నుంచి లండన్‌కు వచ్చింది మేరీ. ఇమ్‌లేని వివాహానికి ఒప్పించాలని విఫలయత్నం చేసి, ఆత్మహత్యాయత్నం కూడ చేసింది. కానీ ఆ నిస్పృహనుంచి త్వరగానే కోలుకుని, తిరిగి రచనలు ప్రారంభించింది. అంతకుముందు స్నేహితుడిగా మాత్రమే ఉన్న విలియమ్ గాడ్విన్ ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె రాసిన లెటర్స్ రిటెన్ ఇన్ స్వీడన్, నార్వే అండ్ డెన్మార్క్ అన్న పుస్తకం చదివి, ఆమెను ప్రేమించకుండా ఉండలేకపోయాడని ప్రకటించాడు విలియమ్ గాడ్విన్. ఒక స్త్రీ సౌందర్యం కోసమో, స్వభావం కోసమో కాక, ఆమె రచన వల్ల ఆకర్షితుడై, ప్రేమలో పడ్డానని అనడం, ఆ రోజుల్లో అనూహ్యం.

గాడ్విన్‌ని వివాహం చేసుకున్న సందర్భంలో అంతకుముందు ఇమ్‌లేతో ఆమెకసలు పెళ్ళే జరగలేదన్న విషయం బయటపడింది. అంటే ఆమె అవివాహితగా తల్లి అయిందన్న విషయం తెలిసి, కొందరు స్నేహితులు దూరమయ్యారు. దానికి అటు మేరీ కానీ ఇటు గాడ్విన్ కానీ బాధపడలేదు. తక్కువకాలమే అయినా వీళ్ళిద్దరి మధ్య వివాహబంధం చాలా ఆనందంగా గడిచింది. 1797లో రెండో కూతురు మేరీని (అనంతరం మేరీ ఉల్‌స్టన్‌క్రాఫ్ట్-షెల్లీగా, ఫ్రాంకెన్‌స్టయిన్ నవలారచయితగా, షెల్లీ భార్యగా సుప్రసిద్ధురాలు) కన్న 11 రోజులకు మరణించింది ఉల్‌స్టన్‌క్రాఫ్ట్.

మేరీ మరణానంతరమే మరియా (ఆర్) ది రాంగ్స్ ఆఫ్ ఉమన్ నవలను గాడ్విన్ ప్రచురించాడు. అందులో ఆమె జీవితాన్ని కూడ అతను తన ఉపోద్ఘాతంలో బయటపెట్టాడు. ఆమెకు ఇతర పురుషులతో ఉన్న సంబంధాలను అతను, ఏ రకమైన తీర్పులు లేకుండా, చాలా మామూలుగా చెప్పినా, పాఠకులకు మాత్రం అది మింగుడుపడలేదు. ఆమె రాజకీయ రచనలను ఆదరించినంత సులభంగా ఈ నవలను వారు ఆదరించలేదు. వందేళ్ళ తర్వాత ఈ నవల విలువను విమర్శకులు గుర్తించి, ఆమె సిద్ధాంతాలకు ఎంతో చక్కని కాల్పనిక రూపంగా దీన్ని ప్రశంసించారు.

మరియా (ఆర్) ది రాంగ్స్ ఆఫ్ ఉమన్

ఈ నవల మరియా అనే ఒక విద్యావంతురాలు, వ్యక్తిత్వం గల మహిళ కథ. తల్లి బాల్యంలోనే మరణించడం, సవతితల్లి, తండ్రి ప్రేమ లభించకపోవడం, అన్నగారి పెత్తనం ఆమెను చిన్నప్పటి నుంచే విషాదజీవిని చేస్తాయి. వీటి నుంచి తప్పించుకుంటున్నానని అనుకుని, ఒక అందమైన యువకుడు జార్జ్ వెనబుల్స్ ప్రేమను అంగీకరించి పెళ్ళి చేసుకుంటుంది. కానీ వివాహమైన తర్వాత తన భర్త అసలు స్వరూపం బయటపడి, నిర్ఘాంతపోతుంది. చివరికి ఆమెకు ‘పిచ్చిపట్టిందని’ ప్రకటించి, బిడ్డను లాక్కుని, మానసికచికిత్సాలయంలో చేర్పిస్తాడు. నవల అక్కడినుంచే ఆరంభమవుతుంది.

నవలలో మొదటి భాగమంతా తన నాలుగు నెలల బిడ్డను దూరం చేసిన విధిపై, భర్తపై ఆక్రోశంతో మొదలవుతుంది. అక్కడ తనకు కాపలాదారుగా పనిచేసే జమీమాతో స్నేహం మరియాకు తనకంటే దురదృష్టవంతులైన ఎందరో స్త్రీలను పరిచయం చేస్తుంది. అదే చికిత్సాలయంలో డాన్‌ఫోర్డ్ అన్న యువకుడితో పరిచయం ప్రేమగా మారడం మరియా జీవితంలో కొత్త ఊపిరి ఊదుతుంది. జమీమా సహకారంతో, వీళ్ళిద్దరూ రహస్యంగా కలుసుకుంటూవుంటారు. అతని దగ్గరున్న పుస్తకాలు చదివి ఆమె చర్చిస్తూంటుంది. అతను కూడ స్నేహితుడి చేత వంచితుడై, మానసిక చికిత్సాలయంలో కావాలనే చేర్చబడిన అమాయకుడు.

జమీమాను తన బిడ్డ గురించి వాకబు చెయ్యమని కోరుతుంది. జమీమా వెళ్ళి పసిబిడ్డ చనిపోయిన వార్తను మరియాకు చెబుతుంది. దుఃఖవివశురాలైన మరియా, చనిపోయిన తన కూతుర్ని ఉద్దేశించి రాసిన సుదీర్ఘమైన లేఖే ఈ కథ. జార్జి వెనబుల్స్‌ను వివాహం చేసుకున్ననాటి నుంచి తన జీవితంలో వచ్చిన మలుపులను ఈ లేఖలో తన చనిపోయిన కూతురికి చెబుతుంది. తల్లి చనిపోయి, తండ్రి పనిమనిషిని ఉంపుడుగత్తెను చేసుకోవడంతో వెనబుల్స్‌కు అయిదు వేల పౌండ్లు ‘కట్నం’ ఇచ్చి మరీ మరియాతో పెళ్ళి చేస్తాడు ధనికుడైన పెదనాన్న. ఈ పెదనాన్న పాత్రలో ఒక ఆదర్శపురుషుడిని చూపిస్తుంది ఉల్‌స్టన్‌క్రాఫ్ట్. అతను కావాలనే తన ఆస్తిని తమ్ముడి కొడుక్కి కాక, పెద్దకూతురైన మరియాకు రాస్తాడు. ఆడపిల్లలకు ఆస్తి, సంపాదన లేకపోవడం వల్లే వారి జీవితాలు దుర్భరమవుతున్నాయని అర్థమైన ఒక మంచి వ్యక్తిగా ఆయనను చిత్రించింది.

వివాహానంతరం భర్త అక్రమ ఆర్ధిక లావాదేవీలు, నేరాలు, స్త్రీలతో సంబంధాలు ఆమె జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. తన జీవితాన్ని మరచిపోవడానికి పుస్తకాలు, కళల్లో నిమగ్నమవుతుంది మరియా. అతన్ని వదిలివెళ్ళాలని కూడ ఆలోచిస్తుంది. ఈలోగా తన అయిష్టంతో నిమిత్తం లేకుండా భర్త కోరికకు బలై, గర్భవతి అవుతుంది. ఆడపిల్లకు జన్మనిస్తుంది. అక్కడినుంచి తన పిల్లతో భర్తను వదిలి పారిపోవాలని ప్రయత్నిస్తుంది. భర్త మరియాను లోబరుచుకోడానికి తన మిత్రుడికే డబ్బులిస్తాడు. కానీ మరియా అతన్ని తప్పించుకుంటుంది. లండన్ వదిలి ఎన్నో చోట్ల ఉండడానికి ప్రయత్నిస్తుంది. తనలాంటి దీనగాథలున్న స్త్రీలతో కలిసి నివసిస్తుంది. ఆమె పెదనాన్న చనిపోతూ తన ఆస్తిని ఆమెకు వదిలేస్తాడు. చివరకు పిల్లతో సహా ఆ డబ్బుతీసుకుని వెళ్దామని ప్రయత్నిస్తుంది. భర్త ఆమెను పట్టుకుని, బిడ్డను లాక్కుని ఆమెను ‘పిచ్చిదని’ ముద్రవేసి మానసిక చికిత్సాలయంలో చేరుస్తాడు. పెళ్ళి అన్నది స్త్రీకి అత్యవసరమని భావించిన సమాజంలో ఆమె కూడా తనకు తండ్రి, అతని రెండో భార్య నుంచి పెళ్ళి ద్వారా విముక్తి లభిస్తుందని అనుకుందే తప్ప, తను పొయ్యి నుంచి పెనంలోకి పడుతోందని వివాహసమయంలో మరియా గుర్తించదు. వివాహానంతరం అతని గురించి ఒక్కొక్క విషయమూ బయటకు వస్తాయి. ఒక సగటు అమ్మాయిలాగా ‘పుడితే అబ్బాయిగా పుట్టాలి; లేదంటే అసలు జన్మించడమే అనవసరం’ అనుకునే దీనురాలి మనస్తత్వం నుంచి భర్తను ధిక్కరించి, అతనితో విడాకులకు సిద్ధమయ్యే దశకు చేరుకునే ఆ ప్రస్థానమే ఈ నవల.

మరియా భర్త వెనబుల్స్ పనిపిల్లను గర్భవతిని చేసి తన పెళ్ళి కుదరగానే బయటకు తరిమేసిన ఘనుడు. తనకు డబ్బు అవసరమై భార్యనే మిత్రుడికి ‘తార్చడానికి’ ప్రయత్నించిన రక్షకుడు. భర్త లీలలు ఒక్కొక్కటి ఆమె దృష్టికి వస్తాయి. అతని వల్ల గర్భవతి అయిన అమ్మాయి ఒక ఆడపిల్లను కని చనిపోతే, ఒక దాది ఆ పిల్ల పోషణ కోసం అతన్ని రహస్యంగా కలిసి డబ్బు అడుగుతూంటే మరియా విని, ఆ ముసలిదానికి డబ్బు ఏర్పాటు చేయడం ద్వారా తన మంచితనాన్ని నిరూపించుకుంటుంది. ఇలాంటి సంఘటనలెన్నో ఆమె జీవితంలో. ఒక దశలో అంటుంది: ‘His brutality was tolerable, compared to his distasteful fondness.’ ఇలాంటి భర్త అమానుషత్వాన్నయినా భరించవచ్చు గానీ ప్రేమను మాత్రం భరించలేననడంలో ఎంత విషాదం ఉందో. మరియా ఆలోచనల చిత్రణ హృదయానికి హత్తుకునేలా చేస్తుంది మేరీ.

After these remarks, I am ashamed to own, that I was pregnant. The greatest sacrifice of my principles in my whole life, was the allowing my husband again to be familiar with my person, though to this cruel act of self-denial, when I wished the earth to open and swallow me, you owe your birth; and I the unutterable pleasure of being a mother.

భర్తను ఎంత ద్వేషించినా, అతని ద్వారా కలిగిన సంతానాన్ని ద్వేషించలేని సగటు స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించిన ఇలాంటి వాక్యాలనేకం. వివాహంలో స్త్రీలు అనుభవించే దాస్యాన్ని, శృంఖలాలను వర్ణిస్తూ చాలా క్లుప్తంగా–when I recollected that I was bound to live with such a being for ever— my heart died within me ; Marriage has bastilled me for life–అంటుంది మరియా. ఫ్రాన్స్‌లో పాలకులపై తిరుగుబాటు చేసినవారంతా బస్టీయ్ (Bastille) ఖైదులో మగ్గేవారు. ఆ బస్టీయ్‌ను బద్దలుకొట్టడంతోనే ఫ్రెంచి విప్లవం ఆరంభమైంది. వివాహం స్త్రీని అలా ఖైదు చేస్తుందని చెప్పడంలో ఎంత గాఢమైన భావన! బస్టీయ్ పదాన్ని ఆమె వాడిన తీరు అమోఘం!

చివరి అధ్యాయంలో మరియా జమీమా సాయంతో ఆస్పత్రి నుంచి తప్పించుకుంటుంది. ప్రియుడు (అప్పటికి ఆమె అతన్ని ‘భర్త’గా సంబోధించడం కూడ మొదలుపెట్టింది) డాన్‌ఫోర్డ్‌కు, అతను బయటకు రాగానే తనను ఎక్కడ కలుసుకోవాలో లేఖ రాసి జమీమాతో కలిసి బయటకు వస్తుంది. అక్కడినుంచి తన బిడ్డ ఎలా ఎప్పుడు చనిపోయిందో వాకబు చేస్తుంది. తన పెదనాన్న తరఫు న్యాయవాదిని కలుసుకుని తనకు రావాల్సిన డబ్బుల్లో కొంత తీసుకోవడంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రయత్నిస్తుంది. అప్పటికే తన భర్త తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎన్నో బిల్లులకు ఈ డబ్బు వాడేసుకున్నాడని తెలుస్తుంది. ఇక అతన్నుంచి శాశ్వతంగా తప్పించుకోవాలని విడాకులకు దరఖాస్తు పెట్టుకుంటుంది. ఈలోగా భర్త వెనబుల్స్ తన భార్యతో డాన్‌ఫోర్డ్ అక్రమసంబంధం పెట్టుకున్నాడని, వివాహితను లొంగదీసుకున్నాడనీ కేసు పెడతాడు.

బయటకు వచ్చిన ప్రియుడు డాన్‌ఫోర్డ్ తనను పిచ్చాసుపత్రి పాలుజేసిన వ్యక్తిని పట్టుకుని, తన ఆస్తిని చేజిక్కించుకోవడం కోసం ఊరు వదిలి వెళ్తాడు. కోర్టులో స్త్రీకి విడాకులు ఎంత అవసరమో ఆమె చేసే వాదన, తన ప్రియుడు ఏ నేరమూ చేయలేదని అతని తరఫున చేసే వాదన చాలా గొప్పగా ఉంటాయి. అయితే ఆమె భర్త క్రూరత్వాన్ని ‘నిరూపించలేకపోయింద’ని న్యాయమూర్తి ఆమె దరఖాస్తును కొట్టేస్తాడు. విడాకుల కేసులో తన వాదనను ఒక లేఖ రూఫంలో పెడుతుంది మరియా.

I exclaim against the laws which throw the whole weight of the yoke on the weaker shoulders, and force women, when they claim protectorship as mothers, to sign a contract, which renders them dependent on the caprice of the tyrant,’ …I wish my country to approve of my conduct; but, if laws exist, made by the strong to oppress the weak, I appeal to my own sense of justice, and declare that I will not live with the individual, who has violated every moral obligation which binds man to man.

ఈలేఖలో తన భర్త తనను ఎన్ని రకాలుగా వేధించిందీ ప్రతి సంఘటనా వివరిస్తూ, తను కోరినట్టు న్యాయస్థానం విడాకులు ఇచ్చినా ఇవ్వకున్నా, తను ఆ మనిషితో కలిసి జీవించే ప్రశ్నే లేదని ఆమె స్పష్టం చేస్తుంది. అంతే కాదు. తన ప్రియుడి తరఫున వకాల్తాపుచ్చుకుని అతను తనను లొంగదీసుకోలేదని, తమది ఇష్టపూర్వకమైన అనుబంధమనీ ఖచ్చితంగా, బాహాటంగా చెబుతుంది కోర్టుకు. అయినా న్యాయస్థానం ‘ఆడవాళ్ళ మాటలను సీరియస్‌గా తీసుకోనక్కర్లేదని’ ప్రకటిస్తుంది.

ఇక్కడితో 17 అధ్యాయాల ఈ నవల ముగుస్తుంది.

తను రెండోభాగం రాస్తున్నట్టు మేరీ ప్రకటించింది కానీ అది రాసేలోగా ఆమె చనిపోయింది. అక్కడినుంచి ఈ నవలకు ముగింపును ఊహించడం, రాయడం కూడ ప్రారంభమయ్యాయి. మేరీనే స్వయంగా తన నోట్‌బుక్‌లో రాసుకున్న నోట్సు వల్ల కొన్ని ముగింపులు ఆమె దృష్టిలో ఉన్నాయని అర్ధమవుతుంది. న్యాయస్థానం ఆమెకు విడాకులు ఇచ్చిందా, భర్త ఆమెను ప్రశాంతంగా బతకనిచ్చాడా, తన స్వంత ఆస్తి గొడవల్లో ఇరుక్కున్న ప్రియుడు వాటి నుంచి బయటపడి ఆమెతో కలిసి జీవించాడా? అనే ప్రశ్నలు అలాగే ఉండిపోయినప్పటికీ ఆమె డైరీలో రాసుకున్న చిన్న వివరాలను బట్టి, ప్రియుడు ఫ్రాన్స్ వెళ్ళి తిరిగిరాలేదని, అతని వల్ల ఆమె గర్భం దాల్చిందని, అయినా ఆమె ప్రశాంతంగా జీవించగలిగిందనీ ఒక ముగింపు; ప్రియుడు తిరిగి రాక, తనకు సంతానమూ లేక, నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిందని మరో ముగింఫు. ఇలా రకరకాలుగా నోట్సు రాసుకుంది మేరీ. చివరకు ఆమె మరియా జీవితాన్ని ఏం చేయదలుచుకున్నదీ స్పష్టంగా తెలీదు.

ఉపాఖ్యానాలు

ఈ నవలలో మరో కథ, మరియాకు కాపలాదారుగా ఉండి, ఆమె స్నేహితురాలిగా మారి, ఎంతో ఊరటనిచ్చిన జమీమా విషాదగాథ. జెమీమా కథలో పేదరికం అన్నిటికంటే పెద్ద శత్రువన్న విషయం అర్ధమవుతుంది; అలాగే తల్లిలేని పిల్ల జీవితం నరకప్రాయమని, అనాథలు అందరికీ అలుసేనని, మానసిక, శారీరక క్రౌర్యం మనుషులకు సహజంగా ఉండే గుణమనీ అనిపిస్తుంది. అన్నిరకాల శారీరక, మానసిక బాధలు అనుభవించిన తర్వాత దాసిగా, స్వంతతండ్రి ఇంట్లోనే బానిసగా, తర్వాత వేశ్యగా, అబార్షన్ చేసుకోవలసివచ్చిన అభాగ్యురాలిగా జెమీమా కథ ఆనాటి స్త్రీల స్థితిగతులను తెలిపేదిగా ఉంటుంది. స్త్రీలకు ఏ ఉద్యోగంలోనూ భద్రత లేదన్న విషయం పదే పదే చర్చకు వస్తుంది.

ఈ నవలలో ఇంకా కొందరి కథలు వస్తాయి. మరియా భర్త నుంచి పారిపోయి ఆశ్రయం కోరిన ప్రతి స్త్రీ కథా ఇంచుమించుగా ఆమె కథే. ఆ స్త్రీల సామాజిక స్థాయి తక్కువ కావచ్చు. కానీ వీరి శ్రమను దోచుకునే భర్తలు, పరాయి పురుషులు, ఉంచుకున్న స్త్రీకోసం వీరిని నిర్లక్ష్యం చేసే భర్తలు, ఏనాడూ ఇంటి భారం మోయకుండా, స్త్రీల కష్టం మీద జల్సా చేసే భర్తలు… అన్నీ ఇవే కథలు.

ఈ నవలలో స్త్రీలకు సంబంధించిన ఆమె వ్యాఖ్యలను క్రోడీకరిస్తే ఇప్పుడు మనం చెప్పే ఎన్నో స్త్రీవాద సిద్ధాంతాలకు మూలం ఎక్కడి నుంచి స్వీకరించామో అర్థమవుతుంది.

  1. చిన్నప్పటినుంచి తల్లిదండ్రులు ఆడా, మగా భేదంతో పెంచడం. కొడుకులను ఎక్కువగా కూతుళ్ళను తక్కువగా చూడడం. పర్యవసానంగా మగపిల్లలు చిన్నప్పటినుంచే ఆడపిల్లల్ని చులకనగా చూడడం.
  2. మగవాళ్ళు మేకవన్నె పులుల్లా ప్రవర్తిస్తూ అడపిల్లలను లోబరుచుకోవడం, పెళ్ళయ్యాక నిజస్వరూపం చూపించడం.
  3. భర్తలు భార్యలను ఆస్తిగా చూడడం; దానికి సామాజిక ఆమోదం లభించడం.
  4. భర్తల ఆధిపత్యంలో మానసిక, శారీరక హింస, అత్యాచారం, బిడ్డలను తల్లికి వేరుచేయడం ద్వారా తమ కంట్రోలును చూపించే క్రౌర్యం.
  5. స్త్రీలు పరస్పరం స్నేహభావంతో ఉండడం. ఒకరి కష్టాలు మరొకరు తెలుసుకుని సహానుభూతి ప్రదర్శించడం.
  6. ఏ వర్గానికి, ఏ సామాజిక హోదాకు చెందిన స్త్రీలైనా ఒకేరకమైన పురుషాధిపత్యానికి బలవుతారన్న వాస్తవం.
  7. తిరుగుబాటు చేసే స్త్రీలకు సమాజంలో గౌరవం లేకపోవడం. స్త్రీలు ఎమోషనల్ బ్లాక్ మెయిల్‌కి సులభంగా లొంగుతారన్న ధీమా.
  8. పురుషులు రాసిన చట్టాలు, న్యాయమూర్తులు ఎప్పుడూ పురుషుల పక్షానే ఉంటారన్న నిజం.

ఇది ఏదో ఒక వ్యక్తి జీవితానికి సంబంధించింది కాదని, వ్యవస్థాగతమైందనీ స్పష్టంగా చెప్పిన తొలి రచయిత్రి మేరీ. అందుకే ఆమెను తొలి ఫెమినిస్టు సిద్ధాంతకర్తగా భావిస్తారు. ఇంత విప్లవాత్మకంగా 18వ శతాబ్దిలోనే స్త్రీల గురించి మాట్లాడినప్పటికీ, మేరీ అవగాహనలో పడికట్టు సూత్రాలు, సిద్ధాంతాలు కనిపించవు. ఆమె స్త్రీలను అన్ని కోణాలనుంచీ వ్యాఖ్యానించింది. అందుకే సెంటిమెంటు కూడ స్త్రీల గుణంగా ఆమె భావించడం ఆసక్తికరమైన విషయం. ఆ యుగం సెంటిమెంట్ రచనల యుగం. అది ఆమె ఆలోచనల్లోనూ ప్రతిధ్వనిస్తుంది. ఆ యుగానికి ఆమె పూర్తిగా అతీతురాలూ కాదు.

ఆమె ఉద్దేశంలో – స్త్రీలకు ఎప్పుడూ ఒక రొమాంటిక్ జగత్తు అవసరమౌతుంది. వాస్తవ జగత్తులో కనిపించేవన్నీ తమ ఆశలపై, ఆకాంక్షలపై నీళ్ళు చల్లేవే అయినపుడు కాల్పనిక జగత్తు ఒక అవసరంగా అనిపిస్తుంది. అందుకే ఈ నవలలో మరియా తనలాగే దురదృష్టవశాత్తు ఈ పిచ్చాసుపత్రిలో చేరి, పరిచయమైన యువకుడిని గొప్పగా ఊహించుకుని ప్రేమిస్తుంది. అతను కనిపించినంత మంచివాడు అవునా కాదా అని ఈ రచన చదివినవారికి అనుమానం వస్తుంది. కానీ మరియాకు మాత్రం తన కలల రాజకుమారుడు లభించినట్లే అనిపిస్తుంది. చదువుకున్నవాడు, తనలా సున్నితంగా సాహిత్యాన్ని చర్చించగలిగినవాడు ఆమెకు ఆ దుర్భర పరిస్థితిలో, వాతావరణంలో గొప్ప ఆనందాన్ని, ఆశను, హాయిని కలిగిస్తాడు. ఆమె రాసిన ఈ అసంపూర్ణ నవలలోనూ, అంతకు పూర్వం రాసిన నవల (మేరీ – ది ఫీక్షన్) లోనూ ఈ ఊహాప్రపంచాన్ని కథానాయికలు చూస్తూనే ఉంటారు. ఆ మాటకొస్తే ఒక మేధావిగా పేరుపొంది, ఎన్నో గొప్ప ఆలోచనలను అక్షరబద్ధం చేసిన ఉల్‌స్టన్‌క్రాఫ్ట్ కూడా తనవంతు తాను రొమాంటిక్ అనుబంధాల్లో ఇరుక్కుని వేదనను అనుభవించిన సెంటిమెంటల్ స్త్రీయే. ఆత్మహత్యాయత్నం కూడ చేసిన భావోద్వేగ జీవే.

విమర్శకులు ఈ నవలను జాకొబిన్ నావల్ అన్నారు. జాకొబిన్ నవల అంటే ఫ్రెంచి విప్లవ భావజాలాన్ని ఇముడ్చుకున్న రచనలు. ఈ నవలలో స్త్రీల స్వేచ్ఛే ప్రధానంగా చర్చించినా, వర్గ వివక్షను, యజమాని, బానిస మనస్తత్వాన్ని, ఆధిపత్య వ్యవస్థలపై నిరసననూ, స్త్రీల లైంగికత్వాన్నీ అనేకచోట్ల మేరీ చర్చించింది. ఆ మాటకొస్తే ‘వ్యక్తిగతమంతా రాజకీయమే’ అన్న స్త్రీవాద సిద్ధాంతానికి ఎన్నో ఉదాహరణలు ఈ నవలలో కనిపిస్తాయి.


సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...