ఈమాటలో మొదటినుండీ శబ్దతరంగాలనే శీర్షిక కింద ఎన్నో అపురూపమైన ఆడియోలు ప్రచురించాం. ఇవి పాఠకులను ఎంతగానో అలరించాయి కూడా. అయితే, కాలం గడిచేకొద్దీ పాతసంచికల రచనలు మరుగున పడడం సహజం. అలా మరుగున పడినవాటిని వెలికితీసి అందరికీ అందుబాటులో ఉంచాలనేది మా కోరిక. మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఈమధ్య కాలంలో తెలుగులో ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. ఇది ఇప్పుడు అందరూ వాడుతున్నదీ, అందరూ తేలిగ్గా కావలసినవి వెదుక్కుని ఆనందించగలిగినదీ కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. ఎందరో ఔత్సాహికులు ఈమాట లోని కథలను కవితలను ఆడియోరూపం లోకి తెస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు. వాటిని ఈ ఛానల్ ద్వారా ప్రచురించబోతున్నాం. కథలతో పాటు అలనాటి పాటలు, రూపకాలు, అరుదైన సాహితీవేత్తల గొంతులు, సంభాషణలు, ప్రాచుర్యంలో ఉన్న ప్రైవేట్ గీతాలు ఇలా అన్నింటినీ ఇక్కడ పొందుపరచబోతున్నాం. ఇలా ఈమాటలోని ఆడియోలు అన్నీ సమయానుకూలంగా అక్కడ అందరికీ సులభంగా అందుబాటులో ఉంచబోతున్నాం. అంతే కాక, సరికొత్త ఆడియో వీడియో రచనలకు కూడా చోటు కల్పించబోతున్నాం. ఈ మహాప్రయత్నంలో మాకు సహకరించి, ముందుండి నడిపిస్తున్న ప్రశాంతి చోప్రాగారికి, సహాయ సహకారాలందిస్తున్న పరుచూరి శ్రీనివాస్, తదితరులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా, పాఠకుల నుంచి కూడా కంటెంట్ ఆహ్వానిస్తున్నాం. ఈమాట నియమావళికి అనుగుణమైన శబ్ద-దృశ్య-రచనలను ఈ ఛానల్ ద్వారా ప్రచురించగలం. ఈ ఛానల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసి మా ప్రయత్నాన్ని విజయవంతం చేయమని ఈమాట పాఠకులకు మనవి.
గతనెలలో కొత్తగా:
- సిరికాకొలను చిన్నది – సంగీత నాటిక
రచన: వేటూరి సుందరరామమూర్తి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావుఎన్నాళ్ళనుంచో ఈ ‘సిరికాకొలను చిన్నది’ అంతరంగస్థలం మీద అప్పటికే గజ్జె కట్టి ఆడుతూ వుండేది. కూనిరాగాలు తీస్తూ ఉండేది. శ్రావణిగా, సుధాలాపసుందరిగా వినిపించేది. నర్తనబాలగా, ముకుందమాలగా కదిలేదీ కదిలించేది. మురిపిస్తూనే ముముక్షువును చేసేది. రజనీకాంతరావుగారి మాటతో, మా తండ్రిగారి (డాక్టర్ వేటూరి చంద్రశేఖరశాస్త్రి గారు) ఆజ్ఞతో వెంటనే మద్రాసు వెళ్ళి రాత్రింబవళ్ళు రాసి ఈ అందాలరాశిని నేను తొలిసారిగా అక్షరాలా చూసుకున్నాను. పద్యాలు, పదాలు, పాటలు, గద్యాలు, పలు విన్యాసాలు! – వేటూరి సుందరరామమూర్తి, హైదరాబాద్, 6-7-2004.
మూల ప్రచురణ: జులై 2010.
- భారత 76వ స్వాతంత్ర్య దినోత్సవం, ఆజాదీ కా అమృత్ మహోత్సవం శుభాకాంక్షలతో, ఈ వారం కొన్ని అమూల్యమైన దేశభక్తి గీతాలు మీకోసం.
మూల ప్రచురణ: సెప్టెంబర్ 2014.
- శ్రీశ్రీ ప్రత్యేక జనరంజని – ఈమాట సమర్పణ
1982 ఉగాది పండగ రోజున ఆకాశవాణి విజయవాడ కేంద్రం వివిధభారతిలో ప్రసారమైన శ్రీశ్రీ ప్రత్యేక జనరంజని కార్యక్రమం.
మూల ప్రచురణ: జనవరి 2010.