దేశభక్తి గీతమొకటి పాడాలని ఉంది

తల్లీ భారతి
నిను కొనియాడాలని ఉంది.
దేశభక్తి గీతమొకటి పాడాలని ఉంది.

జగమంతా చూచేలా
ఆకాశమ్మంతెత్తున
మువ్వన్నెల జెండా నే
నాటాలని ఉంది.
గగనానికి ఎగసి ఎగసి
మేఘమునై మెరసి మొరసి
విశ్వమంత వినేలా
అమ్మా భారతి
నీ ఘనతను
చాటాలని ఉంది.

దేశభక్తి గీతమొకటి పాడాలని ఉంది
తల్లీ భారతి
నిను కొనియాడాలని ఉంది.

క్షీరాంబుధి నీ సంస్కృతి
శీతాగము నీ ధృతి
సత్యాహింసలు వ్రతములు
సహనములే నీ ప్రకృతి
రాజర్షుల గన్నతల్లి
తేజోమయివే అమ్మా!

దేశభక్తి గీతమొకటి పాడాలని ఉంది
తల్లీ భారతి
నిను కొనియాడాలని ఉంది.

సకలలోకసుఖాకాంక్ష
తపమైనది నీకు
నీ శాంతి పాఠమదే
ఆశీర్వచనమ్ము మాకు
విధియే తలవంచునమ్మ
నీ విజ్ఞత తెలిసి
విప్రావళి వినుతించును
నీ వినయము నారసి

దేశభక్తి గీతమొకటి పాడాలని ఉంది
తల్లీ భారతి
నిను కొనియాడాలని ఉంది.

వేనవేల గొంతులతో
జోహారులు జోతలతో
సంబరాల తిరునాళ్ళలొ
గజ తురగ స్వారీలతో
కాహళ భేరీలతో
నీ ప్రజ నీ పాదాలను
కొలుచుకునే ఈ వేళ

దేశభక్తి గీతమొకటి పాడాలని ఉంది
తల్లీ భారతి
నిను కొనియాడాలని ఉంది.